Jump to content

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?/పిల్లల బడిలో అడుగెట్టగానే మనమేం చెయ్యాలి?

వికీసోర్స్ నుండి

పిల్లలు బడిలో అడుగు పెట్టగానే మనమేం చెయ్యాలి?

మంచి బడికి లక్షణాలేమిటి? అని చర్చించుకొంటే మూడంశాలు మనం తప్పకుండా గుర్తుకు తెచ్చుకోవాలి. ఒకటి ఊళ్ళోని పిల్లలందర్నీ తనలో ఇముడ్చుకో గల్గడం. రెండు చేరిన పిల్లల్ని బయటి కెళ్ళనీకుండా నిలుపుకోగల్గడం. మూడు ఒక కనీస విద్యను నమ్మకంగా అందించగల్గడం. ఇంతమాత్రం అనుకోడానికి పెద్ద సిద్ధాంత చర్చలేమీ అక్కర్లేదు. ఒక ఇంగ్లీషు మీడియం ప్రైవేటు స్కూలుకైతే మొదటి రెండింటితో అవసరం లేదు. కానీ మన ప్రభుత్వ గ్రామీణ పాఠశాలలకు చాలా సందర్భాల్లో మూడవ లక్షణం కన్నా మొదటి రెండు లక్షణాలే ముఖ్యమవుతుంటాయి.

పిల్లల్ని బడికి దూరం చేస్తున్న సామాజికార్థికాంశాల్ని అలా పక్కనపెడితే మనం పట్టించుకోని అంశం పిల్లల ప్రపంచాన్ని బళ్ళో మనం ఆవిష్కరించలేక పోవడమనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా ఉంది. మన పాఠ్యపుస్తకాలూ, మన బోధనారీతులూ, మనం పిల్లల్ని అర్థం చేసుకొనే వైఖరి, అసలు చదువు పట్ల మనకున్న తాత్వికతా ఇందులోకి వస్తాయి. ఇవన్నీ కేవలం సాంకేతికాంశాలు కాదు. మనం నివసిస్తున్న సమాజం తరతరాలుగా ఒక సంస్కృతిగా అలవర్చిన లక్షణాలు. మనం నమ్మి ఒంటబట్టించుకొన్న లక్షణాలు.

పిల్లలు బడిలో చేరగానే మనం అ, ఆలు దిద్దిస్తాం. అసలు బడికీ పిల్లలకీ టీచర్లకీ ఈ అ,ఆలు దిద్దించడంతోనే సంబంధం మొదలవుతుంది. చాలా సందర్భాల్లో ఈ సంబంధం ఇక్కడితోనే ముగుస్తుంది కూడా!

వర్ణమాల మీద ఆధిపత్యం సంపాదించడమే ప్రారంభవిద్యకు గీటురాయిగా ఉండాలా? తడుముకోకుండా ఏ అక్షరం చెపితే ఆ అక్షరం రాయగల్గడం అనేది ఎలా సాధ్యం? ఎప్పటికి సాధ్యం? దీనిపైన మనమే మైనా మనసు పెట్టి ఇది ఇంతేనా ఇంతకన్నా మరో పద్ధతి ఏమైనా ఉందా అని ఆలోచించలేమా?

'అక్షరాలు యాంత్రికంగా దిద్దించడం వల్ల వాళ్ళ స్వంత ప్రపంచం నుంచి, సహజ అభ్యసన పద్ధతి నుంచి చదువు పిల్లల్ని దూరం చేస్తుంది' అనేది ఇప్పుడు భాషా శాస్త్రవేత్తలూ, మానసిక శాస్త్రవేత్తలు నిర్ధారించిన అంశం. ఇలా దిద్దడంలో పిల్లలు తెలుసుకొంటున్నది ఏదీ లేదు. స్పందించవల్సింది ఏదీ లేదు. ఇప్పటిదాకా తనకు తెలిసిన ప్రపంచంతో, తాను తెలుసుకోవల్సిన ప్రపంచంతో దీనికేమీ సంబంధం లేదు. అసలిక్కడ నేర్చుకోవడం ఏమీ లేదు కేవలం గుర్తుంచుకోవడమే తప్ప.

ఇప్పటిదాకా చదువును గురించి పిల్లలు చాలా విని వచ్చి ఉంటారు. చదువుకోడం చాలా గొప్ప విషయమని వాళ్ళు నమ్మి కూడా ఉంటారు. కానీ ఈ దిద్దించడంతో ఈ నమ్మకానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. తెలిసి తెలిసీ ఒక ఊబిలో ఇరుక్కుపోయినట్టు వీళ్ళ కన్పిస్తుంది. ఇప్పటిదాకా తాను చెయ్యని, నేర్వని, ఊహించని, తనకేమాత్రం సహజం కాని ఒకానొక ప్రక్రియలోకి వీళ్ళు నెట్టబడుతున్నారు.

నేర్చుకోవడంలో ఒక ఉత్పత్తి ప్రక్రియ కూడా వుంటుంది. అది బిడ్డ నేర్చుకోడం ప్రారంభించడంతోనే మొదలవు తుంది. అసలీ ఉత్పత్తి, నేర్చుకోడమూ వేర్వేరుగా ఉండవు. బిడ్డ తాను పాల్గొంటూ, తాను కొత్తవి జోడిస్తూ కొత్తవి తెలుసుకోవడం బడిలోకి వచ్చే ముందు దాకా జరిగిన ప్రక్రియ. దీనికి దిద్దించడం భిన్నమైన, వ్యతిరేకమైన ప్రక్రియ.

ఒకటిగాదు పాతిక అక్షరాలు గుర్తుంచుకొన్నా వాటితో బిడ్డ చేసే ఉత్పత్తి ఏమీ ఉండదు. ఎప్పుడో వాటి వినియోగం వస్తుందని అప్పటిదాకా అన్నిటినీ మెదళ్ళో ఒక మూల దాచి పెట్టుకోవాలని బిడ్డ ఊహించనైనా ఊహించలేదు. ఇది ఆమెకు అనుభవం లేని అసాధ్యమైన అంశం. ఈ పద్ధతి నుంచి వాళ్ళకి కొత్త నైపుణ్యాలు దక్కే సంగతి దేవుడెరుగు వున్నవి ఊడిపోయే ప్రమాదం ఎక్కువ. ఒక యాంత్రికతను సంతరించుకోవల్సి రావడంతో బిడ్డ బడికి మొదట మానసికంగా దూరమవుతుంది. తర్వాత పారిపోతుంది.

నేర్చుకోడం ఆహ్లాదం లేని యాంత్రికం కావడమే పిల్లలు బడిమానేసే మానసిక స్థితిని కల్పిస్తున్నదని నేడు అనేక పరిశీలనలు నిరూపిస్తున్నాయి. ఈ యాంత్రికత మనం కావాలని రుద్దుతున్నది కాదు. ఇదే సరైందని మనం నమ్మి రుద్దుతున్నది. ఇదీ సమస్యకు అసలు మూలం.

'అసలు చదవడం అంటే ఏమిటి?' అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. (వినరడంలాగే) చదవడం ముక్కలు ముక్కలుగా ఉండదు. కొన్ని సంజ్ఞల్ని విడగొట్టుకోడంగా (డీ కోడింగ్) ఉండదు. అక్షరాలు అలాంటి ముక్కలు వాటి గుణింతాల్ని, వొత్తుల్ని ఇవన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకొని వాటిని కలుపుకొని చదువుకోడం కింది నుంచి పైకి భాషను నేర్చుకొనే పద్ధతి. ఇందులో సమగ్రత, అర్థం, భాగస్వామ్యం ఏమీ ఉ౦డవు. ఉపయోగంలోకి వచ్చే అంశం ఇందులో ఏమీ ఉండదు. ఇది భాషను అర్థరహితమైన పనిగా మారుస్తుంది.

ఇప్పటిదాకా పిల్లలు నేర్చుకొన్న పద్ధతికిది భిన్నమైంది. పిల్లలు మొత్తంగానే భాషను నేర్చుకొన్నారు. వినియోగం లోకి వచ్చేలానే నేర్చుకొన్నారు.

మరి ఈ సహజపద్ధతి బడిలో అమలులోకి వస్తే ఎలా ఉంటుంది? దీనిపై కావల్సినంత పరిశోధన జరిగింది. ఈ పద్ధతిలో అర్థం ముఖ్యం. పదాల క్రమం ముఖ్యం. అక్షరాలు వాటి ఉచ్ఛారణ ముఖ్యం కాదు.

అంటే తెలిసిన పదాల్ని, అంశాల్ని చదవడం, రాయడం రూపంలో ఈ పద్దతి ఉంటుంది. టీచరుకు ఇష్టం వచ్చిన ధ్వనినో (అక్షరం), పదాన్నో రుద్దే రూపంలో ఇది ఉండదు. పిల్లల కిష్టమైన పదాల్ని చెప్పమంటారు. వాటిని బోర్డు మీద రాస్తారు. వాక్యాలు, పాటలు కూడా. వాటి నుంచి ఒక క్రమంలో అక్షరాల్ని పిల్లలు గుర్తించి మరొకచోట వాడుకొనే స్థితికి వస్తారు.

ఇదేమీ మనం పెద్ద కష్టపడి చెయ్యాల్సిన పద్ధతి కాదు. యం.వియఫ్. లాంటి సంస్థల వాలెంటీర్లు బడి మొహం తెలీని బాల కార్మికులకు వేలాదిమందికి చెపుతున్న పద్ధతి ఇదే. నిజానికి దీనికి వాచకాలతో పనే లేదు.

రెండవ ధోరణి ప్రతిదాన్నీ తప్పుపట్టడం. సరిదిద్దే ప్రయత్నం చెయ్యడం. ఇలా కూడా పిల్లలు నేర్చుకోరు. భాషా ప్రపంచంలోకి ఎంత ఎక్కువగా ప్రవేశిస్తే అంత త్వరగా వాళ్ళు తప్పులు చెయ్యడం మానేస్తారు. ఎంత స్వేచ్ఛగా పాల్గొనేలా చేస్తే అంత సమర్థవంతంగా భాషను నేర్చుకోగలుగుతారు. తప్పుల్ని క్షణక్షణం సరిచెయ్యడంలో జరిగేదే మంటే పాల్గొనే ప్రక్రియను అడ్డుకోడం. బిడ్డని పరిమితం చెయ్యడం. సాంకేతికాంశాల్ని వివరించడం ద్వారా (వ్యాకరణం) భాష నేర్పించవచ్చుననే మన ధోరణి దీనిక్కారణం. ఇలా మనం నమ్ముతుండబట్టే ఈ పని చేస్తున్నాం.

పరిశీలనలు నిరూపించిందేమంటే పిల్లలు పిచ్చి పిచ్చిగా చదవడం, పుస్తకాలు తిరగెయ్యడం, ఎక్కువ పుస్తకాల్ని తిరగేస్తుండటం వల్ల చదవడం చాలా బాగా చాలా త్వరగా వస్తుందని! అక్షర ప్రపంచానికి దగ్గర కావడం వల్లనే చదవడం వస్తుంది తప్ప అక్షరాల రూపు రేఖల్ని విడమర్చి తెలుసుకోవడం వల్ల కాదని దీని సారాంశం. ఇలా నేర్చుకొనేపుడు తప్పులు వెతికే ప్రశ్న వుండదు. పాల్గొంటూ పోతూ ఉంటే తప్పులు తమంత తాము తెలిసివస్తాయి.

దీన్ని మన క్లాసురూంలోకి తేవడమంటే ఏమిటి? మన బడి గోడలకు పిల్లలకు అర్థమయ్యే ఆసక్తి కలిగించే వాక్యాలు, పాటలు, బొమ్మల పేర్లు ఇంకా, ఇంకా ఎన్నైనా తగిలించవచ్చు, రాయించవచ్చు. (అర్థంకాని సంస్కృత సూక్తులుకాదు సుమా.) పిల్లలకి పుస్తకాలు ఇవ్వవచ్చు. వాటిని వాళ్ళిష్టం వచ్చినట్టు చూచుకొనే ఏర్పాటు చెయ్యవచ్చు. ఫ్లాష్‌కార్డులు అందుబాటులో వుంచవచ్చు. పెద్దగా చదివి విన్పించే వాటినే పుస్తకాల్లో చూడమని చెప్పవచ్చు. ఇది ఎంత ఎక్కువగా జరిగితే, ఇలాంటి సామగ్రి ఎంత ఎక్కువగా ఉంటే చదవడం అంత సులభంగా త్వరగా వస్తుంది.

ఈ కాలంలో ఇదేమంత పెద్ద సమస్య కాదు.

ఈ కోణం నుంచి చూచినప్పుడు మన వాచకాల పాత్ర ఏమిటో తెలుస్తుంది. వాటిలో ఉన్నదంతా అత్యంత కృత్రిమ భాష. కొన్ని గుణింతాల్ని, అక్షరాల్ని పరిచయం చెయ్యడం కోసం అల్లిన వాక్యాలివి. వాటికి అర్థంపర్థం ఏమీ ఉండదు. అవి పిల్లలవి కాదు. మనం వండిపెట్టిన కృత్రిమ వంటకమది. ఇటీవల హిందీ వాచకాలపై జరిగిన ఒక పరిశీలన ఈ వాచకాల్లోని వాక్యాలు ఎంత వికారంగా ఉన్నాయో తేటతెల్లం చేసింది (డా॥ శోభా సిన్హా ).

రెండోది వాచకాలు తప్ప మన పిల్లలు చదవడానికి ఇంకేమీ లేకపోవడం. పిల్లల్ని దృష్టిలో ఉంచుకొనిమరీ ఒకటి రెండు మూడు తరగతుల పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని రాసిన పిల్లల పుస్తకాలు మనకు లేవు. పిల్లల పుస్తకాలంటే భాష అంతా వచ్చాక దాన్ని నిలబెట్టుకోడానికి అవసరమయ్యేవి అని తప్ప ప్రాథమిక దశలో భాషను నేర్చుకోడానికి ఉపకరించేవి అనే అర్థంలో మనం బాలసాహిత్యాన్ని చూడలేదు. అలాంటి గ్రంథాలయాల్ని మనం రూపొందించుకోలేదు. అయితే ఉన్నంతలో సగటు టీచరు రూ. 500-600 ఖర్చు పెడితే వీటిని సంపాదించుకోవచ్చు. తెలుగులో తొలి ప్రయత్నం ఇప్పుడే మొదలైంది. ఉన్న పుస్తకాల్ని కూడా వాడకుండా (చించేస్తారని) పెట్టెలో పెట్టి తాళం వెయ్యడమంటారా! అది మన భావదారిద్ర్యానికి పరాకాష్ట.

మనం పలకా బలపం పట్టించి, దిద్దించి, తప్పుల్ని సరిచేసి మళ్ళీ మళ్ళీ దిద్దించేందుకు పడే శ్రమ పిల్లలకి పుస్తకాలిచ్చి, పెద్దగా మనం చదివి, పరిచయం చేసి పిల్లల మాటల్ని, పాటల్ని బోర్డు మీద రాసి, చెప్పించి, పలు రూపాల్లో పిల్లల్ని భాషా ప్రపంచంలోకి నెట్టడం కోసం ఉపయోగిస్తే పిల్లలు ఆనందం అనుభవిస్తారు. భాషనూ నేర్చుకొంటారు.

ఇంకో అంశం బొమ్మలెయ్యడం. బొమ్మలు వెయ్యడమంటే ఏదో కళాతృష్ణను తీర్చుకోవడమని మన అభిప్రాయం. పిల్లలు లిఖిత ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఇలానే మొదలవుతుంది. 'తమ ఆలోచనల్ని, ఊహల్ని పిల్లలు బొమ్మల్లో రాస్తారు. ప్రారంభ లేఖనం బొమ్మలతోనే మొదలవుతుంది,' అని మనం గుర్తిస్తే పిల్లల్ని ఇష్టమొచ్చినట్లు బొమ్మలు వేసుకోవడానికి అనుమతిస్తాం. ఏర్పాటు చేస్తాం. ఆ బొమ్మలు ఏం చేస్తున్నాయో పిల్లలు రాస్తారు. మొదట బొమ్మ రూపంలో వ్యక్తమైన ఊహ, తర్వాత అక్షర రూపంలో వ్యాఖ్యానింప బడుతుంది.

దీనిపైన సైతం కావల్సినంత పరిశోధన జరిగింది.

పై మూడు అంశాల్లో అంతర్లీనంగా మరొక అంశం దాగి ఉంది. అది పిల్లలు తమ అనుభవాల్ని, ఊహల్ని మనతో పంచుకోవడం, ఒక పరస్పరాదాన ప్రదాన కార్యక్రమం. ఇక్కడ పిల్లలు తమను తాము వ్యక్తం చేసుకొంటారు. వ్యక్తం చేసుకొనే క్రమంలో నేర్చుకొంటారు. భాషలోని పఠన, లేఖన నైపుణ్యాల్ని కూడా నేర్చుకొంటారు.

ఈ అభ్యసనానికి సజీవత్వం ఉంటుంది. హృదయం ఉంటుంది. ఇందులో ఆవేశం, లయా ఉంటాయి. మనిషి భాష ద్వారా వ్యక్తమయ్యేది ఈ రూపంలోనే. మనిషి సార్థకతా, భాష సార్థకతా ఇమిడి ఉండేది ఇందులోనే.

ఈ క్రమంలో టీచర్లంగా మనమూ చాలా నేర్చుకొంటాం. ఈ నేర్చుకోడంలో ముఖ్యమైంది మనం పిల్లల కంటే చాలా గొప్పవాళ్ళం ఏమీ కాదనేది. వాళ్ళ సామర్థ్యం అఖండమైనదనేది రెండవది. అసలైన బోధన ఎంత తియ్యగా ఉంటుందో అర్థం కావడం మూడవది.

ఇంత చెప్పుకొచ్చాక బుడిబుడి బుడతలు బడిలోకి అడుగుపెట్టగానే మనం ఏం చెయ్యాలి అనేది మళ్ళీ చెప్పాలంటారా!

- వి. బాలసుబ్రహ్మణ్యం