పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?/పిల్లలకూ హృదయం ఉంది, దానికో భాష ఉంది
పిల్లలకూ హృదయం ఉంది, దానికో భాష ఉంది
'మావాడు వసపోసిన పిట్టలా ఒకటే వాగుతుంటాడు.
'నీకు ఒక్కక్షణం నోరు మూతపడదు గదరా. '
'ఈ పిల్లల గోలతో వేగలేక ఛస్తున్నాను. ఒక్కమాట చెవిలో దూరనిస్తేనా?
ఇలా మనం అంటుంటాం. వింటుంటాం.
బొమ్మతో ఆడుకొనే సీతను చూడండి. తానొక్కతే ఉన్నా ఆ బొమ్మతోనే, 'లాల పోస్తాను. గౌను వేస్తాను. మనం రేపు ఊరి కెళుతున్నాం. నువ్వూ రావొద్దూ,' ఇలా తలాతోకాలేని సంభాషణ చేస్తూ ఉంటుంది.
గోడ కానుకొని కాళ్ళు చాచుకొని కాగితాలు చించి ఏదో చేస్తున్న రాముని చూడండి. వాడిలో వాడే గొణుగుతున్నాడు. రాగాలు తీస్తున్నాడు. ఒకదానికొకటి పొంతన లేని వాక్యాలు గుప్పిస్తున్నాడు. వాడి లోకంలో వాడున్నాడు.
సత్యంగాడంటే వాళ్ళక్కయ్యకీ బావకీ, అందరికీ హడల్. దేనికంటారా? వాడు అందరు పిల్లల్లా కథ చెప్పమని అడగడు. నేను కథ చెపుతా అంటూ లంకించుకొంటాడు. ఎంత విన్నా ఆ కథ పూర్తికాదే. వాడేమో తన్మయంతో చెపుతుంటాడు. ఒక్క ముక్కా అర్థంగాక, ఇంటిల్లిపాదీ సతమతం.
ఇక రైళ్ళలో, బస్సుల్లో ప్రయాణాల్లో చెప్పేదేముంది? ఎక్కడెక్కడి ప్రశ్నలో అడుగుతారు. జవాబు చెపితే మళ్ళీ ప్రశ్న. మళ్ళీ మళ్ళీ ప్రశ్న. మనం వెతుక్కొనే దొకే పరిష్కారం. ‘ఛ నోర్ముయ్' అనడం. అంతేనా మన ? పిల్ల అంత 'అనాగరీకంగా' వాగుతుంటే, ప్రయాణీకులందర్నీ ‘డిస్టర్బు' చేస్తుంటే, వాళ్ళంతా 'వీళ్ళ పెంపకం ఇలా ఉంది,' అన్నట్టు చూస్తుంటే మన తల తీసేసినట్టుండదూ! ఎప్పుడెప్పుడు దిగిపోదామా అన్పిస్తుండదూ!
స్వగతాలకీ అర్థం ఉంది
ఇలా పిల్లలెందుకు మాట్లాడుతారు? వాళ్ళ స్వగతాలకి అర్థం, పరమార్థం ఏమైనా ఉంటాయా? 'వైగోట్స్కీ' మాటల్లో చెప్పాలంటే 'పిల్లల ఇలాంటి స్వగతాలకెంతో అర్థం వుంది. తాము చేస్తున్న పనుల్ని ఈ స్వగతాలు క్రమబద్దీకరిస్తాయి. ఆర్గనైజ్ చేస్తాయి. మానవ అభ్యసనంలో, ఎదుగుదలలో ఇదో ప్రధాన ఘట్టం. ఇంకా చెప్పాలంటే పిల్లల ఈ మాటల్నించే వాళ్ళ ఆలోచనలు వికసిస్తాయి. ఆలోచనలకి మాటలు వ్యక్తీకరణలేగానీ, మాటలు ఆలోచనలకి ఎలా ప్రాతిపదికలు'?
బిడ్డ ఎదుగుదలని పుట్టిన నాటినుంచీ అడుగడుగునా పరిశీలించిన మానసిక శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. బిడ్డకి ఆకలవుతుంది. ఆకలంటే ఏదో తనకి తెలీదుగానీ శరీరంలో ఏదో అసౌకర్యం ఏర్పడింది. ఏడుస్తుంది. అమ్మవచ్చి ఎత్తుకొంటుంది. పాలిస్తుంది. పాలిస్తూ పాలిస్తూ బిడ్డని ఆప్యాయంగా స్పృశిస్తుంది. ముద్దాడుతుంది. 'ఆకలైందామ్మా నా బుజ్జిగదే,' అంటూ ఏదేదో మురి పాలు కురిపిస్తుంది. మరి ఈ తల్లి మాటలకేం అర్థం వుంది? ఆ బిడ్డకివి అర్థమయ్యేనా? ఇవీ స్వగతాలే గదూ. ఆ స్వగతమే బిడ్డ వినే మొదటి మాట గావచ్చు. ఆ స్పర్శా, ఆ పాటా, ఆ మాటా ఇవే బిడ్డను స్వీయ ప్రపంచం నుంచి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టించేవి, అనుసంధానం చేసి పెట్టేవి! తర్వాత తర్వాత బిడ్డతో ముఖ్యంగా తల్లీ, తర్వాత ఇంటిల్లిపాదీ చేసే ఈ ముచ్చట్లే ఆమెను ఊహకందనంత వేగంగా వేయిరేకుల పద్మంలా వికసింపజేసేవి. నాలుగేళ్ళ లోపు బిడ్డలోని 'బహుముఖ అభి వృద్ధి' ఎంత వేగంగా వుంటుందో అంత బహు ముఖంగానూ ఉంటుంది. అంతకంటే విచిత్రం ఈ అభివృద్ధి పిల్లలందరిలోనూ దాదాపు సమానంగా వుంటుంది. మాటకున్న విలువ అంత మహత్తరమైందన్న మాట!
పండితురాలు అమ్మ!
ఇలా పసిబిడ్డలతో చేసే సంభాషణల్లో మనం 'అర్థాలు' వెతకం. తప్పుల్ని పట్టం. చెప్పిందే చెపుతున్నా వింటాం. అన్నిటికంటే మించి ప్రతి మాటనూ ముత్యంగా లెక్కించి సంబరపడతాం. ప్రోత్స హిస్తాం. బిడ్డతో మాట్లాడేప్పుడు ఆ బిడ్డలా మారిపోతాం. వాళ్ళ సందర్భాల్లోకి మనం వెళ్ళిపోతాం. అస్సలు ఎప్పుడూ వాళ్ళ భాషని సంస్కరించాలనీ, క్రమబద్ధీ కరించాలని పూనుకోం. గుర్రాన్ని గుల్లం అంటే విరగ బడి నవ్వుతాం. మళ్ళీ మళ్ళీ అనమని ఒక్కోసారి ఒక్కో ముద్దిస్తాం. ఎంత అద్భుతం! మనం పిల్లలకి భాష 'నేర్పు తున్నా'మన్న ఆలోచనే మనకు లేదు. మనమెక్కడా ఈ బోధనాభ్యసన సూత్రాలు నేర్చుకోలేదు. కోటానుకోట్ల తల్లిదండ్రులు సహస్రాబ్దాల నుంచి తమ పిల్లల్ని ఇలా పెంచుతున్నారు. వారికిలా నేర్పుతున్నారు. పిల్లలూ ఇలా అద్భుతంగా నేర్చుకొంటున్నారు. ఒక్క డ్రాపౌట్ లేదు. ఒక్కరు వెనకబడ్డవారు లేరు. ఈ అసమాన 'బోధనా కళ' అక్షరం ముక్కరాని 'అనాగరిక' బడుగుజీవులకి సైతం ఎలా అబ్బినట్టు?
ఈ నేర్పడానికో సిలబసు లేదు. ప్రణాళిక లేదు. కనీసాభ్యసన ప్రమాణాల ఊసు లేదు. పరీక్షలసలే లేవు. వున్నదల్లా ఒక్కటే, ‘ఒకానొక పద్ధతి.' ఈ పద్ధతిలో అందరికంటే పండితురాలు ‘అమ్మ.'
మాటలేనా అమ్మ నేర్పింది?
బిడ్డ ఈ అభివృద్ధి క్రమంలో అమ్మ నేర్పుతున్నది ఒక్క మాట లేనా, కానేకాదు. ఈ మాటలతో పాటు పూసల్లో దారంలా బయటి ప్రపంచం లోని ప్రతిదీ బిడ్డ తెలుసు కొంటోంది. ప్రతి చర్యలోనూ బిడ్డ పాల్గొంటోంది. ఒక సమర్థ ప్రాణిగా నిలదొక్కు కుంటోంది. నిరంతర చలనంతో, పలు సందర్భాల్లో స్వేచ్ఛగా స్వతం త్రంగా తనదైన శైలితో పాల్గొన డంతో బిడ్డ ఎదుగుతోంది. ఈ క్రమంలో 'భాష' అత్యంత కీలక పాత్ర వహిస్తోంది. అన్నిటినీ మించి భావనల్ని (కాన్సెప్ట్), ఆలోచనల్ని (థాట్స్) ననలు తొడిగించి, మెదడుకితగ్గ వ్యాయామం అందించి వికసింప జేస్తున్నది ఈ భాషే!
మరి బడిలోనో?
ఇప్పుడిక బడిలోకి వద్దాం. ఇక్కడ మాటలకున్న స్థానం ఏమిటి? మన అసెంబ్లీ, మన ప్రార్థన, మన క్లాసు, చివరికి మన ఆటలూ అన్నీ మౌన మహారాజ్ఞికి ఆవాసకేంద్రాలూ, విహారకేంద్రాలూ! బడిలో చేరడమంటే నిశ్శబ్ద రాజ్యపు పౌరసత్వ స్వీకరణే. బళ్ళోనూ మొదట పిల్లాడు నేర్చుకొనేది భాషే. దాంతోపాటు పైన చెప్పుకొన్న అంశాలే. మరి ఉన్నట్టుండి సినిమారీలు మారినట్టు, సరిహద్దు దాటినట్టు వ్యవహారమంతా ఎందుకు తల్లక్రిందులవుతున్నట్టు?
'క్లాసులో భాష నేర్చుకొనేది ఎవరు? మరి ఎప్పుడూ మాట్లాడేది ఎవరు?' అని ముక్కున వేలేసుకొంటాడు జాన్‌హాల్ట్.
బడిలో మొదటి సమస్య పిల్లల్ని మాట్లాడనివ్వడం. పిల్లల్తో పిల్లల్ని మాట్లాడుకోనివ్వడం. పిల్లలతో మనం మాట్లాడ్డం. ఇంట్లో ఒకరో ఇద్దరో పిల్లలు. మరి క్లాసులో పుట్టి పిగిలినట్టుంటారే ఎలా అనేదొక ప్రశ్న. ఇంట్లో ‘నేర్పాల్సింది' అంటూ ఓ సిలబసూ గట్రా లేదుగా. మరి క్లాసులో 'ఇంత నేర్పాలి' అనే ఓ లక్ష్యం ఉందిగా. ఎలా సాధ్యం అనేది మన అనుమానం.
నిజమే బడీ ఇల్లూ ఒకటి కావు. గోల ఇద్దరిదా, మూకదా అనేది కాదు సమస్య. నేర్పడం అనే దగ్గరి కొచ్చేప్పటికి సిలబసూ పరీక్షలూ రాసి పెట్టుకొన్నవి లేవు గానీ బోలెడన్ని నేర్పాల్సినవి అమ్మకీ వున్నై. పిల్లలు నేర్చుకొన్నవి మన క్లాసు కంటే వందరెట్లు ఇంట్లోనే ఎక్కువ. ఎటొచ్చీ మనం నమ్మాల్సింది నేర్చుకొనడానికి సంబంధించి మనం ముందుగా చెప్పుకొన్న 'ఒకానొక పద్ధతి'ని. 'పిల్లలు అలా నేర్చుకొంటారు,' అని మనం ఒప్పుకొంటే, 'మనం నేర్పాల్సినవీ అలానే నేర్చుకోగలరు,' అని మనం అంగీకరిస్తే ఆ తర్వాత బడికి తగ్గ దారి బడిలో చిక్కక పోదు. ఇప్పటిదాకా ఇంత అద్భుతంగా నేర్చుకొన్న ఆ 'ఒకానొక పద్ధతి'కి భిన్నంగా మనం వ్యవహరిస్తున్నామని మనం నిత్యం మననం చేసుకొంటుంటే, ఇది పరమ దుర్మార్గమని మనల్ని మనం హెచ్చరించుకొంటుంటే, ఏదో ఒకదారి దొరక్కపోదు. అలా వెతికి పట్టుకొని చేసి చూపిస్తున్న వాళ్ళకీ ప్రపంచంలో కొరత లేదు.
ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?
పిల్లలతో మనమైనా, మనతో పిల్లలైనా, పిల్లల్లో పిల్లలైనా ఏం మాట్లాడుకోవాలి? ఎలా మాట్లాడుకోవాలి? అనేది మరో ప్రశ్న. దీనికొక్కటే సమాధానం. 'ఏమైనా మాట్లాడొచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు' అని! కావాల్సింది మాట్లాడ్డం అంతే. ఇలా అంటే (చలం మాటల్లో చెప్పాలంటే) మన గుండెల మీద పెంకులే లేచిపోతున్నట్టనిపించవచ్చు.
కావల్సిందల్లా అమ్మలా పిల్లలస్థాయికి దిగి, పిల్లల ప్రపంచంలోకి దూరి, మాట్లాడ్డం నేర్చుకోవాలి. ఇదేమీ మనకు బ్రహ్మవిద్య కాదు. మనింట్లో మన పిల్లలతో మనం ఇలానే మాట్లాడుతుంటాం. పిల్లలకో భాష వుంది. దానికో హృదయం ఉంది. దాన్ని మనం పట్టుకోవాలి. ఇదేదో కసరత్తు కానక్కరలేదు. అలా మాట్లాడ్డంలో అలాంటి మాటలు వినడంలో అద్భుతమైన అనుభూతి వుంది. అది మనల్ని సవాలక్ష ఈతిబాధల్నించి మరిపిస్తుంది. మంచి పుస్తకం కన్నా మనసును గిలిగింతలు పెడుతుంది. నిర్మలం చేస్తుంది.
పిల్లలకి భాష నేర్పడం అటుంచండి. ముందు మనం పిల్లల భాష నేర్చుకోవాలి. పిల్లల్లానే మాట్లాడాలి. పిల్లల ప్రపంచంగానే మన బడీ ఉండాలి. ఒక్కరోజు మనం మాట్లాడే పదాలన్నీ (బడిలో) రాసి పెట్టుకొన్నామనుకోండి. వాటి అర్థాలు పిల్లలకి తెలుసా అని లెక్కేసి చూచుకొన్నామనుకోండి. లేకుంటే ఒక్కరోజు మన క్లాసు
మరో సంగతి - భాషకు అర్థం గావడమొక్కటే పరమార్థం గాదు. అది ఆత్మీయంగానూ ఉండాలి. అప్పుడే మనం ఎదుటవాళ్ళతో మమైకమవుతాం. మన హృదయాన్ని విప్పుతాం. పదాలు చాలా సామాన్యమైనవే తీసుకోండి. ‘పాఠశాల, పరిసరాలు' లాంటివి సైతం ఎంత పరాయి పదాలో అట్టే మనకు తెలిసిపోతుంది. విచిత్రం ఏమంటే మనం కూడా ఈ పదాల్లేకుండానే ఎక్కువ విషయాలు మాట్లాడుకొంటాం. పిల్లలూ వీటికి తమవైన స్వంత పదాలు ఎంచుకొనే ఉంటారు. 'మా బడికీ రోజు సెలవం'టారుగానీ, 'మా పాఠశాలకు సెలవ'ని ఆంధ్రదేశంలోని ఏ ఒక్క పిల్లాడైనా అంటారా? మనమైనా అంటామా?
భాషా సంస్కరణోద్యమ తాపత్రయం
పిల్లల భాషను సంస్కరించాలని మనకు మహా తాపత్రయం. ‘వాళ్ళు తప్పులు మాట్లాడతారు. మంచిగా మాట్లాడరు. చదువుకొన్నవాళ్ళ మాటలు వాళ్ళకి రావాలి. మరీ పేదపిల్లల యాస ఘోరంగా ఉంటుంది. అంతా అనాగరికం. ఇవన్నీ సరిచేసి 'శుద్ధభాష'ను నేర్పడానికే గదా బడి ఉండేది,' అని మన దృఢమైన విశ్వాసం.
పసిబిడ్డలు 'బడికి పోతా' అనకుండా 'బలికి పోతా' అనే అంటారు. దాన్ని సంస్కారహైన్యం అని మనమనడం లేదు. 'బలికి' అన్నపుడే చెంపలు వాయించి వుంటే, ప్రతి వాక్యాన్నీ వ్యారణాంశాలు వెతికి వెతికి సరిచేసి ఉంటే అందరూ మూగమొద్దులయ్యేవారు. మనం ముందు ధారాళంగా, స్వేచ్ఛగా మాట్లాడనిస్తున్నాం. ప్రోత్సహిస్తున్నాం. సమాజంలో పెరిగే కొద్దీ, పాల్గొనేకొద్దీ ఏది తప్పో, ఏది ఒప్పో పిల్లలే తెలుసుకొంటున్నారు. మన బడీ అంతే. మనతో మాట్లాడితే గదా పిల్లలకి భాష రావడం! ఇక 'సంస్కారం' 'నాగరికత' 'సంస్కృతి' అంటారా? ఎవరి సంస్కారాలు వారివి. ఎవరి భాష వారిది. వాటితో తమ అవసరాలు వాళ్ళు అద్భుతంగా తీర్చుకొంటున్నారు. బతుకుతున్నారు. అదీ ఒక బతుకేనా అని మనం అనొచ్చు. మరి మనలా వాళ్ళు పెట్టి పుట్టలేదే! దీన్ని గుర్తించడం మంచిది. భాష సామాజికమైంది. సాంస్కృతికమైంది. కంఠస్తం చేసి ఒంటబట్టించుకొనేది కాదు. మన పిల్లలు నిరుపేదల పిల్లలు. తరతరాల మానవ సంస్కృతికి వాళ్ళు వారసులు.
ఈ పిల్లల్ని ప్రేమించడమంటే వాళ్ళ సామాజిక పునాదినీ ప్రేమించడమే.
మన పుస్తకాల్లో వాళ్ళ ప్రపంచపు భాష ఉండదు. కనీసం మనం రాసే బడి గోడల మీది నినాదాల్లో కూడా వాళ్ళ విషయాలు, మాటలు ఉండవు. అంతా పరాయీ కరణ! ఇక దొరికింది ఒకే మార్గం. పిల్లల్లో పిల్లలు మాట్లాడుకోవడం. దానికీ మనం నిషేధాలు విధిస్తే ఎలా?
దీనికో చక్కని చిట్కా, గ్రూపులుగా చేసి చదువు నేర్పడం. ఇలా చేస్తే మన పాఠాన్ని గురించి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొంటారు. వాళ్ళ భాషలో చర్చించుకొంటారు. వాళ్ళ సాంస్కృతిక సామాజిక నేపథ్యంలో విశ్లేషించుకొంటారు. విషయం పరాయిదైనా స్వాయత్తం చేసుకొంటారు.
స్వంతభాషలో ఆత్మీయత ఉందనుకొన్నాం. ఆత్మీయత కేవలం భాష ద్వారానే వ్యక్తం చెయ్యలేము. పిల్లల్తో కలిసి మనం ఆడితే, పాడితే, అభినయిస్తే, కృత్యాలు చేస్తే, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే అప్పుడు అత్యంత సహజంగానే వాళ్ళ భాషలో మనం మాట్లాడతాం. వాళ్ళు మనతో మాట్లాడతారు. పిల్లల పదాల లిస్టులు కంఠస్తం చేసినంత మాత్రాన మనం పిల్లల భాషలో మాట్లాడలేం.
ఇక్కడ మనకు మరో చిక్కు ఉంది. పిల్లల్ని మాట్లాడనిస్తే అడ్డ ప్రశ్నలు వేస్తారు. అడ్డదిడ్డపు జవాబులు చెపుతారు. మనల్ని నిలేస్తారు. 'విసిగిస్తారు' కూడా. ఇలా మన 'పెద్దరికం' మనల్ని వెంటాడుతుంటుంది. దీన్నించి బయటపడాలి. ‘మాట్లాడ్డం' అనే మాటలో 'మాట్లాడ నివ్వడం' అనే అర్థమూ ఇమిడి ఉంది. వినడమూ అంతర్భాగమై ఉంది. భిన్నాభిప్రాయాలు, విరుద్ధాంశాలూ వ్యక్తంగావచ్చు. ఈ ఘర్షణ నుంచే జ్ఞానం వికసిస్తుంది. ఈ క్రమాన్ని మనం ఒప్పుకొంటే అసలు సమస్యే వుండదు. కానీ ఈ 'ఒప్పుకోడం' మనకి- అంటే పెద్దలకీ, గురువులకీ, అధికార్లకీ, నాయకులకీ అంత సులభం గాదే! అదే సులభమైననాడు మన పిల్లలకేగాదు మనందరికీ ఎన్ని సమస్యలు మటుమాయమవుతాయో!
- వి. బాలసుబ్రహ్మణ్యం