పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?/పద్య, కవితా శిక్షణ
పద్య, కవితా శిక్షణ
గిజూభాయి
పిల్లలకు భాష నేర్పించడమంటే వారికి భాషలోని గద్యాన్ని, పద్యాన్ని పరిచయం చేయడమే. ఈ పరిచయం చేయడమనేది ఎంత దృఢంగా, స్పష్టంగా జరుగుతుందో భాషా శిక్షణ కూడా అంతే దృఢంగా, స్పష్టంగా ఉంటుంది. ఇలా పరిచయం చేయడానికి రెండు సాధనాలు ఉన్నాయి. ఒకటి మౌఖిక సాహిత్యం, రెండు లిఖిత సాహిత్యం. పిల్లవాడు చిన్నప్పటి నుంచి మౌఖిక సాహిత్య పరిచయం పొందుతూనే ఉంటాడు. వాడికి చదవడం, వ్రాయడం వచ్చిన తర్వాత లిఖిత సాహిత్యం పరిచయం అవుతుంది. మౌఖిక సాహిత్యమైనా లేక లిఖిత సాహిత్యమైనా, ఈ రెండింటిలో కూడా ప్రస్తుతం విద్యార్థులకు గద్య సాహిత్యమే లభిస్తోంది. పద్య సాహిత్యం ఆలస్యంగా, అల్పంగానే లభిస్తోంది. ఇళ్ళల్లో మనం మాట్లాడేది మౌఖిక సాహిత్యం. ఇంట్లోనైనా లేదా బయట అయినా మాటలు పరిచయం కన్నా సంగీత పరిచయం అందరికీ స్వల్పంగానే లభిస్తుంది. మన పాఠ్యపుస్తకాల్లో కూడా గద్య పాఠాలకన్నా పద్య పాఠాలు అత్యంత తక్కువగానే ఉంటాయి.
ఈ వాస్తవ పరిస్థితుల కారణంగా పిల్లవాడు బాల్యం నుంచే గద్యాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాడు. దీనితోనే చాలామంది పిల్లవాళ్ళకు పద్యం, కవిత, పాట అర్ధం కావని వాటి నుంచి వారు ఎలాంటి సంతోషం పొందరని తప్పుగా అనుకుంటారు. అందువల్లే పిల్లలకు పద్యం ఆలస్యంగా, తక్కువగానే పరిచయం చేయాలని విద్యావేత్తలు కూడా భావిస్తారు. పెద్దలు కూడా పద్యానికన్నా గద్యానికే అధిక ప్రాధాన్యతనిచ్చి గద్యంపై మక్కువ ప్రదర్శిస్తారు. గద్యం సులభమనిపిస్తుంది. దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగానే గద్యాన్ని రచయితలు సృష్టిస్తారు కూడా.
మనం పోల్చి చూసినప్పుడు గద్యంకన్నా పద్యం కఠినంగా ఉంటుంది. అయితే వయస్సు మళ్ళిన పెద్దలకు పద్యం ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తుంది. దీనిని బట్టి పద్యానికి ఉన్న స్థానం ఉన్నతమైందనీ, దానిని వయస్సు పెరిగిన వారే అనుభవించగలరని అనుకుంటాం.
ఇన్ని విధాలుగా ఆలోచించినా వాస్తవం మనం గమనించాల్సి ఉంటుంది. మనం విద్యార్థులకు గద్యం అధికంగా నేర్పిస్తాము, పద్యం తక్కువగా నేర్పిస్తాము. అందువల్లే నేడు పద్యంలోకన్నా గద్యంలోనే అందరూ రసానుభూతి పొందుతున్నారు.
ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి మన ప్రస్తుత పద్య శిక్షణ విధానంలో మార్పు తేవలసిన అవసరం కనబడుతోంది.
మొదటి మార్పు పిల్లలకు చిన్నతనంలోనే పద్యం నేర్పించరాదనే తప్పుడు అభిప్రాయం నుంచి మనం బయటపడాలి. బాగా ఆలొచించి చూస్తే ఇది భ్రమ మాత్రమేనని అర్ధమవుతుంది. సాహిత్య చరిత్రను పరిశీలిస్తే గద్యం కన్నా పద్యమే మొదట వచ్చిందని తెలుస్తోంది. ప్రప్రథమంగా మాటలు కావ్యరూపం సంతరించుకున్నాయి. మన జానపద గేయాలు, రామాయణ, మహా భారతాలు, పాశ్చాత్య లోకంలో 'ఇలియడ్' వంటి మహాకావ్యాలు గద్యం కన్నా పద్యంలోనే రచింపబడ్డాయి. వాస్తవానికి సాహిత్యం రచయితల ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తూ ఉండలేదు. సాహిత్యమంటే సృజనాత్మకంగా వ్యక్తమయ్యే మానవ మనస్సు స్వరూపం. మానవులు మాట్లాడటం నేర్చుకోక మునుపే ఇది ప్రారంభమైపోయింది. మాటలతోపాటు ఇది వాఙ్మయం రూపంలో వ్యక్తమైంది. అత్యంత ప్రాచీన ప్రజల వాఙ్మయం మొదట కావ్యాలుగానే వెలువడింది. కావ్యం ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందిపోతుంది. మౌఖిక పద్ధతిలో ఇది సులభంగా జరుగుతుంది. కావ్యం తన పాడుకునే అర్హత వలన మానవుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రాసలు, ఛందస్సులు, పునరుక్తుల వలన కావ్యం (పద్యం) ఒకే సమంగా, ఒక దానితో ఒకటి బంధింపబడి వరుసక్రమంలో ఉంటుంది. ఇందువల్ల కావ్యం తరతరాలుగా, వారసత్వంగా, ఒకరి నుంచి ఒకరికి అందుతూ ఉంటుంది.
ప్రాచీనుల సాహిత్య భాండాగారం కావ్య రూపంలో ఉంది. పద్యరూపంలోనే మన ప్రాచీనులు తమ ప్రతిభను, జ్ఞానాన్ని వ్యక్తపరిచారు. కావ్యం ద్వారా వారు తమ కళలను, చరిత్రను చెబుతూ వచ్చారు. అందులోనే వారు తమ అభిలాషలను, నీచత్వాన్ని కూడా బహిర్గత పరిచారు. పద్యంలో వారు శోకం, మోహం, ప్రేమ మొదలగు స్పందనలను సంగ్రహించారు. నిజానికి కావ్యం వారికి సంకలన స్థలంగా, చరిత్ర రచనగా మిగిలి పోయింది. ఆ కాలంలో కావ్యం ప్రజల జీవితానికి దర్పణంగా మారింది. కావ్యాన్ని పిల్లలు, పెద్దలు అందరూ ఎరిగి ఉన్నారు. నేర్చుకుంటూ ఉన్నారు. ఇందులో నుంచి కొత్త కావ్యాలు రచించడానికి కూడా ప్రేరణ పొందుతూ ఉన్నారు. ప్రాచీన కావ్యాలంటే మన జానపద గేయాలే. నేటికీ చిన్నపిల్లలు జానపద గాథలు, గేయాలు బాషా ఇష్టపడతారు. నిజానికి వారికి అవే మనం ఇవ్వాలి.
తల్లి జోలపాటలు పాడినప్పుడు పిల్లవాడు నిద్రపోతాడు. తల్లి రోటిలో దంచుతూ, రుబ్బుతూ, బట్టలు కుడుతూ, పూసలు గుచ్చుతూ, పాటలు పాడుతూ తన పనులు చేసుకుంటున్నప్పుడు పిల్లవాడు ఆమె చుట్టు ప్రక్కలే ఉంటాడు. తండ్రి దేవుడి విగ్రహం ముందు శ్లోకాలు చదువుతున్నప్పుడు ఆయన ప్రక్కన అణకువగా కూర్చొని పిల్లవాడు వింటూ ఉంటాడు. ఈ సందర్భాలలో వాడు పద్యం, కావ్యం, కవిత వింటాడు. మనస్సులో గ్రహిస్తూ ఉంటాడు. వాస్తవానికి ఇంట్లోనే పిల్లవాడికి పద్య శిక్షణ లభిస్తుంది. మనం పురాతన కాలం గురించి ఆలోచించినప్పుడు ఆ కాలం పిల్లలకు కావ్యం ద్వారానే, పద్యం ద్వారానే ఎన్నో ప్రాపంచిక విషయాలు తెలిసేవి. వాటి నుంచి వారు రసాస్వాదన కూడా పొందే వారు. ఈనాడు కూడా కేవలం మౌఖిక సాహిత్యంలో వున్న పాటలు, పద్యాలు పిల్లలకు ఎంతో ఆనందం చేకూరుస్తున్నాయి. అయినా ప్రపంచం ఎంతగానో మారి పోతూ ఉంది. దాని పర్యవసానంగా జానపద గేయాలు, గీతాలు విస్మృతిలో కూరుకుపోతున్నాయి. పిల్లలే కాకుండా పెద్దవారు కూడా వాటిని మరచిపోతున్నారు. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు త్వరత్వరగా మారిపోతున్నాయి. తిరుగలితో జానపద గేయాలకు గట్టి సంబంధం ఉండేది. నేడు గాలి మరలతో ఎలాంటి పాటలు, పద్యాలు తయారుకావడం లేదు. నిప్పుల కుంపటితో పాతకాలపు పాటలు ఉండేవి. అయితే నేడు గ్యాస్ స్టౌవ్‌లతో ఎలాంటి పాటలు పుట్టడం లేదు. అయినా మనం ఎన్నటికీ జానపద గేయాలను, జానపద కావ్యాలను వదులుకోరాదు. వీటిని మన పద్య శిక్షణ నుంచి తొలగించి వేస్తే విద్యార్థుల విద్య పునాదిలేని భవనమే అయిపోతుంది. కనుక పద్య శిక్షణలో మొదటి అంశం విద్యార్థులకు జానపద గేయాలు పరిచయం చేయడం. పిల్లలకు సంబంధించిన ఎన్నో జానపద గేయాలున్నాయి. వాటిని వారికి నేర్పినప్పుడే బాలకావ్య శిక్షణ జరిగినట్లవుతుంది. ఈ విషయం అనుభవంలో బాగా స్పష్టమవువతుంది. మీరు పిల్లలకు జానపద గేయాలు పాడి వినిపించండి. వారి అనుమానాలు తీర్చండి. బాల్య దశలో పిల్లలకు కావ్య పరిచయం చేయడమంటే వారు పాడగలిగే విధం, కదలిక, తాళం గల మంచి పాటను ఎంపిక చేసుకోవడం. జానపద గేయాలన్నింటినీ మనం బాగా పాడుకోవచ్చు. పాడుకోవడమనేది వాటి లక్షణంగా ఉంటుంది. అయితే అన్ని జానపద గేయాలు పిల్లలకు నచ్చుతాయని చెప్పలేము. అవి కదలిక, తాళం, మంచి విషయం అంశాలలో కూడా భిన్న భిన్నంగా ఉంటాయి. జానపద గేయాలను ప్రాచీన శిష్ట సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు వాటి మధ్య ఉన్న తేడా కూడా అర్ధమవుతుంది. జానపద గేయాలను పాడినప్పుడే వాటి ప్రాముఖ్య అర్ధమవుతుంది. వాటిని మనం శ్రమకోర్చి సేకరించుకోవలసి ఉంటుంది. ఈ జానపద గేయాలు కూడా కొన్ని అత్యంత పురాతనమైనవిగా ఉంటాయి. కొన్ని ఇటీవల సృష్టింపబడినవిగా ఉంటాయి. అయినా జానపద సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. వాటి చారిత్రక పరిణామాలను విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా చెప్పాలి. ఇలా కృషి చేశామంటే బాలలకు అమిత ఇష్టంగా ఉండే చక్కటి జానపద గేయాలను మనం సేకరించుకోవచ్చు.
ఈ జానపద గేయాలలో గ్రామీణ పదాలేవి? బాలల గేయాలేవి? విషయాలు అనుభవం ద్వారా నిర్దారించు కోవచ్చు. ఈ కృషి చేసేవారు తప్పకుండా జానపద గేయాలలో స్వీకరించవలసినవి ఏవి? తిరస్కరించవలసినవి ఏవి? అనే అంశం కూడా తెలుసుకుని ఉండాలి. మంచివాటిని స్వీకరించడం, అసభ్యంగా అశ్లీలంగా ఉన్న జానపద గేయాలను వదిలేయడం చేయాలి.
ఏ జానపద గేయమైన పాడడానికి సులభంగానే ఉంటుంది. అయితే వాటిని పిల్లలకు నేర్పించేటప్పుడు ఎన్నో విషయాలను గమనించాలి. పిల్లలు కొన్ని జానపద గేయాలనుమాటిమాటికి వినాలని కోరుతారు. అలాంటి గేయాలను మనం సంకలనం చేసి ఉంచుకోవాలి. పిల్లలకు తమ జీవితాలను, తమ మనస్సులోని భావాలను వ్యక్తీకరించే జానపద గేయాలంటే చాలా ఇష్టం. ఆ గేయాలలో వారి పరిసరాలు ప్రతిబింబించి ఉంటే అవి వారికి మరింత ఇష్టంగా ఉంటాయి. పిల్లల సుఖదుఃఖాలు తెలిపే పాటలన్నా కూడా వారికి ఇష్టమే. పిల్లల ఊహలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అలాంటి ఊహలు, కల్పనలు ఉన్న పాటలు కూడా బాలలు ఎంతో శ్రద్ధగా వింటారు. పాడుతారు. కథలు తెలియజేసే గేయాలంటే కూడా వారికి మహా ఇష్టం. రెప్పవేయకుండా అలాంటి పాఠాలను వింటారు. ఇవన్నీ కూడా ఆ గేయాల పట్ల ప్రియత్వాన్ని పెంచుతాయి. గేయాలు సరళంగా ఉంటే అవి పిల్లల స్మృతిలో గట్టిగా ఉండిపోతాయి. మనం బాలలకు జానపద గేయాలు నేర్పదలచుకున్నప్పుడు ఈ అన్ని విషయాల గురించి ఆలోచించాలి.
పాత జానపద గేయాలను తిరస్కరించాలనే వారికి ఒకమాట. కొందరు అన్ని రకాల ప్రాచీన జానపద గేయాలను సేకరిస్తుంటారు. సంగ్రహకర్తలు వాటి మధ్య తేడా చూపరు. అన్నింటిని ఒకే రకంగా చూచి సంగ్రహించుకుంటారు. అది వారి దృష్టి. పురాతత్వవేత్తలు వారి దృష్టి కోణాలతో జానపద గేయాలు సేకరిస్తారు. అది వారి దృష్టి. విభిన్న వ్యక్తులు విభిన్న దృష్టి కోణాలతో జానపద గేయాలు సేకరించుకుంటారు. అదే విధంగా ఉపాధ్యాయుడు కూడా తన పిల్లలకు నేర్పించదగిన గేయాలను తన దృష్టితో సంగ్రహించాలి, ఎంపిక చేయాలి.
మనం జానపద గేయాల ద్వారా విద్యార్థులకు ప్రాచీన చరిత్ర నేర్పించదలచుకోలేదు. ప్రాచీన గేయాలు చరిత్ర విద్యార్థులకు పరిశోధనలకు ఉపయోగపడవచ్చు. అయితే మనం పిల్లలకు ఆనందం కలిగించే దోషరహిత గేయాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. చిన్న పిల్లలకు వినదగిన పాటలను మాత్రమే ఎన్నుకోవాలి. రాబోయే ఆదర్శ సమాజంలో ఏ విషయాలు ఉండరాదని మనం అనుకుంటున్నామో అలాంటి విషయాలను వర్ణించే గేయాలను మనం పిల్లలకు నేర్పరాదు. వాటిని వదిలేయాలి. పిల్లలను మూఢ నమ్మకాలతో ముంచెత్తే జానపద గేయాలు కూడా ఉంటాయి. వాటిని మనం తీసుకోరాదు. మన జానపద గేయాలలో సాధారణంగా విషమిచ్చి చంపివేసే సవతి తల్లుల గురించి పాటలు కూడా ఉంటాయి. అలాంటి పాటలు మనం భావిపౌరులైన పిల్లలకు నేర్పించాల్సిన అవసరం లేదు. జన జీవననానికి ప్రతికూలమైన విషయాలు గల గేయాలను మనం త్యజించి వేయాలి. ఎక్కువ మంది కోరతారనే సాకుతో పనికిరాని, అసభ్యమైన, అశ్లీలమైన గేయాలను ఎంపిక చేసుకోరాదు. బాలల జీవితాలను, మానవ జీవితాలను ఒక మెట్టుపైకి తీసుకుపోయే గేయాలనే ఎంపిక చేసి పిల్లలకు నేర్పించాలి. కనుక ఎంపిక విషయంలో ఉపాధ్యాయుడు అత్యంత జాగరూకత వహించాలి. జానపద గేయాలు పాడడానికి మాత్రమే బాగా ఉంటే చాలదు, వాటిలోని విషయం కూడా మనకు అత్యంత ముఖ్యమైనదే. మనం నూతనంగా పాత జానపద గేయాల బాణీలలో నేటి కాలానికి అవసరమైన సందేశాలను నింపి కొత్త గేయాలు తయారుచేసుకుంటే అవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
జానపద గేయాలను ఉపాధ్యాయుడు పిల్లలకు పాడి వినిపించాలి, పాడి నేర్పించాలి. పాడి నేర్పించినప్పుడే అవి వారికి నచ్చుతాయి. తర్వాత వాటిని వారిచేత వ్రాయించాలి. అప్పుడు జానపద గేయాలు వారి దగ్గరకు చేరుతాయి. గేయాలు ఎప్పుడూ పాడినప్పుడే సార్ధకత సంతరించుకుంటాయి. కేవలం చదవడం వల్లనో, చెప్పడం వల్లనో జానపద గేయాలు పిల్లల మనస్సుల్లో నాటుకోవు.వాటిని నేర్పించేటప్పుడు తరగతి గదిలో పాటలకు అనుకూలమైన వాతావరణాన్ని ఉపాధ్యాయులు సృష్టించుకోవాలి. ఆ వాతావరణంలోనే పిల్లలు ఆ గేయాలను ఆత్మీయం చేసుకుంటారు. కనుక పాఠశాలలో గొంతెత్తి పాడడం కూడా అత్యంత ముఖ్యమైన విషయం.
ఈ జానపద గేయాలు కూడా పిల్లలకు సులభం నుంచి కఠినం వైపు తీసుకుపోయే విధంగా ఉపాధ్యాయుడు నేర్పించాలి. మొదటే కష్టమైన గేయాలు నేర్పించ రాదు. చిన్న చిన్న, సులభంగా పాడేగలిగే గేయాలను నేర్పుతూ తర్వాత తర్వాత పెద్ద గేయాలను కఠినమైన గేయాలను నేర్పించవచ్చు.
పిల్లలకు నేర్పించే జానపద గేయాలలో ఎలాంటి విషయాలు ఉండాలో ఇంతకుముందే చెప్పుకున్నాం. కవితల్లో కూడా అలాంటి విషయాలే ఉండేటట్లు మనం చూచుకోవాలి. కొన్ని కవితల్లో పిల్లలకు అవసరం కాని విషయాలు ఉంటాయి. వాటిని మనం త్యజించాలి. మనం ఆదర్శంగా భావించని విషయాలు కూడా కవితలలో వచ్చేస్తుంటాయి. వాటిని కూడా మనం తిరస్కరించాలి. ఉపాధ్యాయుడు తనకు తెలిసిన సంగీత జ్ఞానాన్ని మొత్తం ఆడంబరంగా విద్యార్థుల ఎదుట ప్రదర్శించరాదు. సరళమైన కవితను సరళమైన కంఠస్వరంతో మృదువుగా విద్యార్థుల ఎదుట చదవాలి. అవి విద్యార్థులకు అత్యంత సహజమైనవిగా అనిపించాలి. వాటిలో వారికి ఉపయోగకరమైన మంచి విషయాలు ఉండాలి.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. విద్యార్థులు రెండు రకాల కావ్యాల నుంచి ఆనందం పొందగలరు. ఒకటి వర్ణనాత్మక కావ్యాలు. రెండు కథాత్మక కావ్యాలు. వర్ణనాత్మక కావ్యాల కన్న కథాత్మక కావ్యాలు విద్యార్థులను సులభంగా ఆకట్టుకుంటాయి. కారణం వాటిలో ఒక కథ ఉంటుంది. కథ అంటే
విద్యార్థులకు మనం ఏది నేర్పినా వారు తన్మయంతో స్వీకరించగలిగి ఉండాలి. అప్పుడే అది నిజమైన విద్య అవుతుంది. తన్మయంతో వారు విషయాన్ని పరిచయం చేసుకుంటారు. అర్ధం చేసుకుంటారు. అన్వయ పరుచుకుంటారు.
అయితే ఈ పరిచయం ఎలా చేయాలి. ఇంత వరకు దీనికి సంబంధించి ఎన్నెన్నో సూచనలు చేశాము. కవితను పాడే వినిపించాలి. ఆ పాడడం కూడా సుస్వరంతో, సరళమైనరాగంతో, ఉచిత అనుచితాలతో, అభినయ పూర్వకంగా, స్పష్టంగా, తాళబద్ధంగా ఉండాలి. అపుడే విద్యార్థులు ఆ కవితను స్వాగతిస్తారు.
మనం విద్యార్థులకు ఒక కవితను పరిచయం మాత్రం చేయాలేగాని, దానిని వారిచేత కంఠస్థం చేయించరాదు. అది నిరర్థకం. కవితలోని రసాన్ని అనుభవించాలేగాని వ్యర్ధంగా కంఠస్థం చేయించడం వలన ప్రయోజనమేమీ లేదు.
ఉపాధ్యాయుడు ఏదైనా పద్యం, కవిత, కావ్యం విద్యార్థుల ఎదుటకు తీసుకుని పోయినప్పుడు దానికి సంబంధించిన పూర్వపరాలు, నేపథ్యం కూడా సందర్భోచితంగా విద్యార్థులకు చెప్పాలి. వాటిలోని విషయాలకు సంబంధించి కూడా చెప్పడం మంచిదే. ఆ కావ్యంలోని కథను ముందుగానే తెలియజేసి నందువల్ల విద్యార్థులు కావ్యగానం చేసేటప్పుడు ఆనందంగా వింటారు. మధ్య మధ్య కూడా అర్ధంకాని కొన్ని కఠిన పదాలకు అర్ధం చెప్పవచ్చు. అవసరమైతే కావ్యాన్ని, కవితను, పద్యాన్ని గద్యరూపంలో కూడా తయారు చేసుకుని పిల్లల ఎదుట భావ స్పోరకంగా చదవడం మంచిదే.
విద్యార్థులు పద్యాలు చదివగలిగి నప్పుడు వారికి కవితలు కూడా పరిచయం చేయాలి. కవితలైనా, గేయాలైనా, పద్యాలైనా, కావ్యాలైనా కావ్యపాఠాలు అని చెప్పబడతాయి. క్రమక్రమంగా విద్యార్థులు వాటిలోని పదాలను అన్వయం చేసుకోగలుగుతారు. అర్ధం చేసుకోగలుగుతారు. భావాలు తెలుసుకోగలుగుతారు.
అనువాదం : ఎ.జి. యతిరాజులు
ప్రజాశక్తి వారి 'గిజూభాయి సమగ్రసాహిత్యం' నుండి.