పిరదౌసి
</poem>
పిరదౌసి
గ్రంథకర్త: జి. జాషువ కవి తెనుఁగు పండితుఁడు, వినుకొండ.
నాల్గవకూర్పు 1,000 ప్రతులు
నాంపల్లి వాస్తవ్యులును, జాగీర్దారులు నగు మ. రా. శ్రీ ఆకిరిపల్లి జానకిరామారావుగారి
ద్రవ్యసహాయ్యమున
బెజవాడ: ఆంధ్రగ్రాంథాలయ ముద్రణాలయమున ముద్రితము. ౧౯౪౨ [సర్వస్వామ్యములు గ్రంథకర్తవి]
వెల రు ౦_౮_౦.
ఈ గ్రంథము గ్రంథకర్తకడ దొరకును కృతిపతిప్రశంస
బ్రహ్మకులమునఁ గల యన్వవాయములను
- రాణఁ జెన్నారు శ్రీసింగరాట్కులమునఁ
- బ్రధితయశుఁ డైన మల్లపరాజుగారు
- ప్రభవమందెను గొనములు పరిమళింప.
క. ఆ రమ్యకీర్తి శాతికిఁ
- గోరికలు ఫలింప ముద్దుఁగొమరుఁడు లక్ష్మీ
- నారాయణుండు పుట్టెఁ బ
- యోరాశికిఁ బూర్ణహిమమయూఖుండు బలెన్.
ఉ. తాలిమేల్మిసొమ్మయి సదా నదనంబు సలంకరింపఁగా
- నాలుకమీఁద సత్యవచనంబు నివాసముసేయ, దొడ్డ యి
- ల్లాలగు జ్ఞానమాంబికప్రియంబునఁగొల్వ,సుఖాంబురాశిలోఁ
- దేలుచు నా గుణాఢ్యుఁడు ప్రతీతివహించు సుధీజనంబులన్.
క. నా ముద్దులకృతికన్నా!
- యీ మంగళమూర్తి జీవితేశుఁడుగా, ని
- త్యామోదకుసుమవిసరము
- మోమున వికసింప నంకమున నుండఁగదే!
మ. అనుకూలుం డగు నీమనోహరుని నామాంకంబు దిగ్దేశరా
- డ్జనజిహ్వాంచలసీమల న్నిలుపు మాచంద్రార్కమున్ జాఱిపో
- వని నీజవ్వన మస్మదాంధ్రవిషయ ప్రాగ్దేశదీపంబుగా
- మని,భాషాలలితాంగికూఁతయిడుమమ్మా! కావ్యకన్యామణీ!
పారసీక కవులలో పిరదౌసి ప్రథమగణ్యుఁడు. గజనీ మామూదు భరతఖండమును పదునెనిమిది మాఱులు పరితపింపఁ జేసినకాలమున నితఁడు షానామా యను గ్రఁథము నతని కంకితము చేసెను. "దేశచరత్ర లెన్నియో యుండ విదేశీయుని చరత్ర మనకేల?" యని కొంద ఱూహింప వచ్చును. ఖండాంతరవాసులైన షేక్స్పయరు, కీట్సు, బైరన్ మొదయిన కవుల జీవితచరత్రములు మనకు పఠనీయము లగుచుండఁగా కళావీరుఁడగు పిరదౌసికవి చేసిన పాపమేమి? జాతిమతభేదములను పరిగణింపక విశ్వమానవ సోదరత నెఱపు దివ్యపురుషులిక్కవిజీవితము ననాదరింపరని విశ్వసించి నేనితని చరిత్రను పద్యకావ్యముగా రచించితిని.
పారసీక వాఙ్మయమున నితని గ్రంథమున కగ్రన్థాన మీయఁబడినది. ఇక్కవి షానామా గ్రంథమును నమృతమయము లయిన యఱువదివేల చిత్రించినాఁడు. భారతీయులకు భారత గ్రంథముపైఁ గల భక్తి గౌరవములు పారసీకుల కితని గ్రంథముపైఁ గలవు. ఇతని కలమున నమృత బిందువులు కలవు గాని దురదృష్ట దేవత తాండవించినది. నేనీతని చరిత్రము నయిదేండ్లక్రిందట నొకానొక మాసపత్రిక యందు చదివి స్తింభించి పోయితిని. నాఁటనుండియు నేనిక్కథ నొక చిన్ని ప్రబంధరూపమున వెలువరింపఁ దలఁచి యుంటిని. నాకోర్కి నేఁటి కీడేరినది. కథ కేనలము చిన్నదగుట, కవి గ్రంథరచనమునకుఁ బూనుకొన్న కాలుమున నుత్తరకథాసూచకముగా నొక దివ్య స్త్రీ దర్శనమును, అటవీ మధ్యమున నిషాద సమా వేశమును, మరికొన్ని చిన్ని మార్పులను గల్పించితిని. రెండుమూఁడుచోట్ల నా కీతనిచరిత్ర చూడ తటస్థించినది. కాని మొదట నేను చూచిన కథకును తరువాత చూచిన దానికిని విశేషభేదము గోచరించినది. పారసీక పండితులు రచన కనుకూలముగా నేను చేసిన మార్పులను మన్నింతురుగాక! మఱియు, పిరదౌసి గజనీ విడిచి పాఱిపోవు. నప్పుడు వర్ణింపఁబడిన కీకారణ్యములు, సింహము, పులి మొదలగు జంతుసముదాయము దేశనైసర్గికస్థితి స్వభావములకు విపరీతములుగా నున్నను, అవి యతని న్యథానిరూపణార్థ కల్పితములుగా పరిగణించి సహృదయులు నా సాహసమును క్షమింపఁ బ్రార్థితులు.
నేనీ గ్రంథమును బందరుతాలూకా నందిగామ గ్రామవాస్తవ్యులును, సంపన్నులును నగు శ్రీ సింగరాజు లక్ష్మీనారాయణగారికి అంకిత మిచ్చితిని. గ్రంథము నామూలాగ్రముగా విని సంతసించి, అది తమ తండ్రిగారి కంకితమిమ్మని కోరి నాకు ప్రోత్సాహమిచ్చి ముద్రణ వ్యయమునొసంగిన మాపాఠశాల ప్రథానోపాధ్యాయు లయిన మహారాజశ్రీ సింగరాజు మల్లపరాజారావుగారికి కృతజ్ఞతా పూర్వ వందనసహస్రముల నర్పించుచున్నాడు.