పాఠశాల విద్యారంగంలో ప్రపంచబ్యాంకు ప్రయోగాలు, పర్యవసానాలు
వి. బాలసుబ్రమణ్యం
మొదటి ప్రచురణ :
అక్టోబర్ 2021
వెల: రూ.40/-
డిటిపి :
కె.వి. హనుమంతు
ముద్రణ :
ప్రజాశక్తి ప్రింటర్స్ & పబ్లిషర్స్ ప్రై.లి.
ప్రతులు :
ఐక్యఉపాధ్యాయ ప్రచురణలు
27-31-11, పాలపర్తివారి వీధి,
పాఠశాల విద్యారంగంలో
ప్రపంచబ్యాంకు ప్రయోగాలు
పర్యవసానాలు
వి.బాలసుబ్రమణ్యం
ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్
విజయవాడ
మొదటి భాగం
(ప్రపంచబ్యాంకు ప్రవేశం, ప్రయోగాలు)
మళ్ళీ రాష్ట్ర విద్యారంగంలోకి ప్రపంచబ్యాంకు అడుగుపెట్టింది. పాఠశాల
విద్యకోసం SALT(Supporting Andhra's Learning Transformation) పేరుతో కొత్త
ప్రాజెక్టును 2021-2026 మధ్య అమలయ్యేలా రాష్ట్రానికి మంజూరు చేసింది.
దీంతో పాటు STARS (Strengthening Teaching Learning and Results for States)
పేరుతో ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో
మరో ప్రాజెక్టు కూడా అమల్లోకి రానుంది. పెద్ద ఎత్తున సంస్కరణల్ని తెస్తూ వీటిని
సమర్థవంతంగా చేపట్టేందుకు SALTను వినియోగించుకుంటామని మనరాష్ట్రం
చెపుతుంటే, ప్రపంచబ్యాంకు మాత్రం మన రాష్ట్ర సంస్కరణలు చాలా భేషుగ్గా
వున్నందున తన ప్రాజెక్టును సమర్థవంతంగా ఇక్కడ అమలు చెయ్యవచ్చునని
చెప్పుకొంటోంది. సంస్కరణల వెంట ప్రాజెక్టు వచ్చిందో, ప్రాజెక్టు కోసం సంస్కరణలు
తెచ్చారో, ఇవి రెండూ నూతన విద్యావిధానంలో ఎలా ఇమిడి పోబోతున్నాయో మనకు
అవగతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రపంచబ్యాంకు తన ప్రాజెక్టుతో
ఏమాశిస్తోందో, దీన్ని అమలు చేశాక మన పాఠశాల విద్య ఏ తీరానికి చేరుతుందో
మాత్రం మనమిప్పుడే అంచనా వెయ్యవచ్చు. ఎందుకంటే రాష్ట్రానికీ, ఆ మాటకొస్తే
దేశానికి ప్రపంచబ్యాంకు రుణాలూ, వాటి పర్యవసానాలూ కొత్తేమీకాదు. పాఠశాల
విద్యారంగంలోనూ ఇలాంటి ప్రాజెక్టులు మొదటివేమీ కాదు.
కొత్త ప్రాజెక్టు (SALT) కథా కమామీషులోకి వెళ్ళేముందు మనం కొంచెం చరిత్రలోకి తొంగి చూద్దాం. మన అవసరాలకూ పరిస్థితులకూ ఏమీ ఉపయోగపడని ప్రపంచబ్యాంకు పథకాలు ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని ఎంత అస్తవ్యస్తం చేశాయో, దాని తియ్యని మాటల్ని నమ్మి, దాని డాలర్లకు ఆశబడి ముందుచూపు లేకుండా మనం ఏ సంస్కరణలు తెచ్చామో, అవి చివరికి ఎక్కడికి మనల్ని తీసుకెళ్ళాయో కొంచెం పరిశీలిద్దాం.
ప్రపంచబ్యాంకు ప్రవేశం
- మన దేశంలో పాఠశాల విద్యారంగంలోకి ప్రపంచబ్యాంకు ప్రవేశం 1980వ
దశకం నుంచి ప్రారంభమైంది. ఇది “ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు"తో మొదలు కావడం గమనార్హం. అంటే మనమే దేశంలో ప్రపంచబ్యాంకుకు ప్రప్రథమంగా స్వాగతం చెప్పామన్నమాట. బ్రిటన్దేదేశపు “ఓవర్సీస్ డెవలప్మెంట్ అసోషియేషన్” (ODA) సాయంతో 1980 దశకపు తొలినాళ్ళలో మొదలైన ఈ విదేశీ ప్రాజెక్టుల ప్రస్థానం నేటి SALT దాకా “అప్రతిహతంగా" కొనసాగుతోంది. అంటే నాలుగు దశాబ్దాలైనా ప్రాథమిక విద్య సైతం, అందులోనూ 1,2 తరగతుల చదువులు కూడా ఒక్క అడుగూ ముందుకు వెయ్యలేదన్నమాట!
- "ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు" బ్రిటన్ సాయంతో మన రాష్ట్రంలోకి
ప్రవేశించాక ఈ విదేశీ బ్యాంకుల సాయాల వెల్లువ దేశమంతా విస్తరించింది. యూనిసెఫ్ సాయంతో బీహార్లో, స్వీడిష్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అథారిటీ (SIDA) సహకారంతో రాజస్తాన్లో, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోషియేషన్ (IDA) నిధులతో ఉత్తరప్రదేశ్లో 1990-93 మధ్య రకరకాల పేర్లతో ఈ ప్రాజెక్టులు ప్రవేశించాయి. కొంచెం ముందూ వెనకా మొదలైనా ఇవన్నీ 1986 పాలసీ లక్ష్యాలతో, వ్యూహాలతో వచ్చినవేనని ప్రపంచబ్యాంకు స్వయంగా చెప్పుకొంది. ప్రపంచబ్యాంకు ఒక అంతర్జాతీయ ఆర్ధికసంస్థ. దాని ప్రయోజనాలు, దాని లక్ష్యాలూ దాని కుంటాయి. దాని ప్రాజెక్టులు మనకు సరిపడతాయో లేదో చూచుకోవల్సిన బాధ్యత మనది.
- ఇంతకీ ఈ 1986 పాలసీ ఏమిటి? అదే మనం రాజీవ్ గాంధీ నూతన
విద్యావిధానంగా చెప్పుకొనే పాలసీ. పాఠశాల విద్యారంగంలోని “అసమానతల్ని తొలగించడం, బాలికలపై బలహీన వర్గాల పిల్లలపై కేంద్రీకరించడం" లక్ష్యాలుగా పైకి గొప్పలు చెప్పుకొన్న పాలసీ. ఈ పాలసీలోని డొల్లతనం ఏమిటో మనందరికీ తెలుసు.
- నూతన విద్యావిధానం (1986) కూడా తనకంత తాను ఊడిపడలేదు.
దానివెనక స్వేచ్ఛా మార్కెట్ కోసం తలుపుల్ని బార్లా తెరిచిన నూతన ఆర్థిక విధానం వుందన్నది బహిరంగ రహస్యం. ప్రపంచబ్యాంకు రిపోర్టుల్లో ఇది మనకు స్పష్టంగానే కన్పిస్తుంది. విద్యారంగంలో మనదేశం ఎక్కడుంది? ఎందుకిలా వుంది? ఇప్పుడు మన తక్షణ విద్యావసరాలేమిటి? వాటిని సాధించడానికి కావల్సిన ప్రణాళికలూ, వాటిని అమలు చెయ్యడానికి తగ్గ వ్యూహాలు ఏమిటి? రుణం కోసం ప్రభుత్వాలు ఏం చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకు ప్రపంచబ్యాంకు చేసిన సూత్రీకరణల్ని చూస్తే దాని అంతరంగం సులభంగానే అవగతమవుతుంది.
మొదటిపాపం బ్రిటీష్ ప్రభుత్వానిదే.
- విచిత్రమేమంటే భారతదేశపు విద్యారంగ చరిత్రలోకి ప్రపంచబ్యాంకు ఏ
మాత్రం తలదూర్చక పోవడం. గతచరిత్రనంతా పరిశీలించ లేకపోయినా కనీసం ఆధునిక యుగ చరిత్రనైనా తరచి చూడలేక పోవడం. "తెల్లదొరలు మన పాతవ్యవస్థలన్నిటినీ కుప్పకూల్చారుగానీ కొత్తవ్యవస్థల్ని మాత్రం నిర్మించలేక పొయ్యారన్న” సూత్రీకరణ విద్యారంగానికి కూడా వర్తిస్తుంది. ఆంగ్లేయ గవర్నరు మన్రో స్వయంగా రూపొందించిన రిపోర్టులు (1822) కూడా “క్రమంగా అయినప్పటికీ సార్వత్రికంగా దేశంలో బీదరికం పెరుగుతున్నందువల్ల దేశీయ పాఠశాల వ్యవస్థ క్షీణదశలోవుంది” అనే చెప్పాయి. భారతీయ విద్యారంగానికీ, దరిమిలా అక్షరాస్యతకూ బ్రిటీష్ పాలనే తీవ్రనష్టం కల్గించింది. తెల్లవారికి రాజకీయంగా మన గ్రామీణ పేదల విద్యపట్ల ఆసక్తి లేకపోవడం, తమకు కావల్సిన ఉన్నత మధ్య తరగతి వర్గాలకు తగ్గ విద్యకు వాళ్ళు పరిమితం కావడం దీనికి ఒక కారణమైతే, తమ విచ్చలవిడి దోపిడీతో మన ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చెయ్యడం, ప్రజల ఆదాయానికి తీవ్రంగా గండి కొట్టడం రెండో కారణం.
| బ్రిటీష్ కాలంలో అక్షరాస్యత 1881 - 4.32% |
కేరళ నమూనా
- ఇక మన సుదీర్ఘ జాతీయోద్యమం నుంచి, సామ్రాజ్యవాద వ్యతిరేకతా
వెల్లువల నుంచి ప్రస్తుతం మనం ప్రాణప్రదంగా భావించుకొంటున్న విలువలు రూపుదిద్దుకొన్నాయి. ఈ క్రమంలోనే మనం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొన్నాము. వీటికనుగుణంగా రాజ్యాంగ రూపకల్పన చేసుకొన్నాము. సార్వత్రిక విద్య, మాతృభాషలో విద్య, జాతీయ విద్య అనేవి ఈ క్రమంలో ముందుకొచ్చినవే. 1930 నాటికే వీటి రూపురేఖల్ని మనం స్పష్టంగా చూడగల్గాము. రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్లో సార్వత్రిక విద్యగురించి చెప్పుకొన్నాము. ఆ తర్వాత నిర్దిష్ట గడువుల్ని కూడా దీనికి పెట్టుకొన్నాము. ప్రపంచబ్యాంకు రిపోర్టుల్లో ఈ ప్రస్తావనలెప్పుడూ కన్పించవు.
- భారతదేశంలోనే స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా విద్యారంగంలో అద్భుత
ప్రగతి సాధించిన కేరళ నమూనా మనకుంది. అంగ్రేజీ విధానాలకు భిన్నంగా 'అందరికీ విద్య' – 'మరీ మహిళలకు విద్య' ట్రావెంకూర్ సంస్థాన పాలనలో అగ్రపీఠాన నిలిచాయి. "The State should detray the entire cost of the education of it's people in order that there might be no backwardness in the speed of englishtment among them, that by defusing education they might become better subjects and public servants" అన్న ఈ పాలసీ ప్రకటనను చూస్తే నిన్నో మొన్నో ఏ ఐక్యరాజ్యసమితి చేసిందో అన్పించవచ్చు. కానీ ఇది 1817లో ట్రావెంకూర్ రాణి గౌరి పార్వతీబాయి చేసిన ప్రకటన! ఫలితం 1951 నాటికి జాతీయ అక్షరాస్యత 18శాతం కాగా కేరళ అక్షరాస్యత 47 శాతం.
| కేరళ అక్షరాస్యతా శాతం - 1991 | ||
|---|---|---|
| పురుషులు | స్త్రీలు | |
| భారత్ | 64 | 39 |
| చైనా | 87 | 68 |
| కేరళ | 94 | 86 |
| ఉత్తరప్రదేశ్ | 56 | 25 |
| Source: Census of India | ||
- ట్రావెంకూర్ సంస్థానం విదేశీ ఆర్థిక సంస్థల నిధులతోనో, ప్రపంచబ్యాంకు
కనుసన్నల్లోనో దీన్నేమీ సాధించలేదు. 'అందరికీ విద్య’ను ఆనాటి ప్రభుత్వం ఒక రాజకీయ బాధ్యతగా, సామాజిక అవసరంగా దృఢంగా నమ్మినందువల్లనే ఇది సాధ్యమైంది. ఈ క్రమాన్ని స్వాతంత్య్రానంతరం కూడా కేరళ కొనసాగించింది. అక్కడి సంస్కరణోద్యమాలు దీనికి కొంత కారణమైతే, సుదీర్ఘ ప్రజా ఉద్యమాలు, ప్రజారాజకీయాలు అసలుకారణం. అందరికీ విద్యను సాధించినా ఆధునికావసరాలకు తగ్గట్టు విద్యావ్యవస్థను ఆధునీకరించాలనీ, ప్రైవేటు సంస్థల దూకుడును ఎదుర్కొనేలా బలోపేతం చెయ్యాలనీ ప్రస్తుత కేరళ ప్రభుత్వం "పోతు విద్యాభ్యాస సంస్కార యజ్ఞం" లాంటి పథకాల్ని ఉద్యమ రూపంలో అమలు చేస్తోంది. "కరోనా కాలంలో ఒక్కరోజు కూడా మా పిల్లల చదువుకు భంగం కలగలేదు" అని ధీమాగా ప్రకటిస్తూనే "అయినా చెయ్యవల్సింది ఎంతో వుంది" అని అంతే వినయంగానూ అది చెపుతోంది. దేశంలోనే సంపూర్ణ డిజిటలైజ్డ్ పాఠశాల విద్యా వ్యవస్థగల మొదటి రాష్ట్రంగా కేరళ నేడు గుర్తింపు తెచ్చుకొంది.
| కేరళ అక్షరాస్యతా శాతం - 1961-91 | ||||||
|---|---|---|---|---|---|---|
| షెడ్యూలు కులాల | షెడ్యూల్డు తెగలు | మొత్తం | ||||
| 1961 | కేరళ | భారత్ | కేరళ | భారత్ | కేరళ | భారత్ |
| స్త్రీలు | 17.4 | 3.3 | 11.9 | 3.2 | 38.9 | 12.9 |
| పు.లు | 31.6 | 17.0 | 22.6 | 13.8 | 55.0 | 34.3 |
| షెడ్యూలు కులాల | షెడ్యూల్డు తెగలు | మొత్తం | ||||
| 1991 | కేరళ | భారత్ | కేరళ | భారత్ | కేరళ | భారత్ |
| స్త్రీలు | 74.3 | 23.8 | 51.1 | 18.2 | 86.2 | 39.3 |
| పు.లు | 85.2 | 49.9 | 63.4 | 40.7 | 93.6 | 64.1 |
| Source: Census of India | ||||||
ప్రపంచానుభవాలు
- ఇంత బలమైన జాతీయోద్యమ నేపథ్యం, విలువైన కేరళ అనుభవం మనకున్నా
స్వాతంత్య్రానంతర భారతదేశం కనీసం ప్రాథమిక విద్యనైనా అందరికీ ఎందుకు అందించలేక పోయింది? ప్రపంచంలో ఏ దేశానికీ లేనన్ని అద్భుతమైన విద్యానివేదికలు మనకున్నాయి. ప్రజల్ని కనీసాక్షరాస్యుల్ని చెయ్యలేనంత ఆర్ధిక దుస్థితి, అంతర్గత సంక్షోభాలూ మనకేమీ లేవు. అయినా మనం సాధించిన ఫలితాలు ఎందుకింత అధ్వానంగా వుండిపోయాయి?
| 40ఏళ్ళలో స్వతంత్రభారత అక్షరాస్యత 1951 - 18.3% |
- దీన్నిబట్టి ఏడాదికి ఒకశాతం అక్షరాస్యత కూడా మనం అదనంగా
సాధించలేక పోయామన్నమాట. కానీ ఇదేకాలంలో ప్రపంచంలోని చాలా దేశాల అనుభవం వేరుగావుంది. మనకంటే ఎక్కువ జనాభా, వెనుకబాటుతనంగల చైనా, కనీవినీ ఎరుగని సామ్రాజ్యవాద దాడినెదుర్కొన్న వియత్నాం, అమెరికా దిగ్బంధనంలో ఇరుక్కు పోయిన క్యూబాలాంటి సోషలిస్టు దేశాలు విద్యారంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. 'అందరికీ చదువు' అనేది పెట్టుబడిదారులకూ అవసరం. స్కాండినేవియన్ దేశాలూ, దక్షిణ కొరియాలాంటి నూతన పారిశ్రామిక దేశాలూ దీన్ని నిరూపించాయి. సాదాసీదా శ్రీలంక లాంటి వర్ధమాన దేశాలు కూడా అక్షరాస్యతలోనూ, పాఠశాల విద్యలోనూ సాధించిన విజయాలు అసాధారణమైనవి. వాటి విద్యావ్యవస్థలతో పోలిస్తే మనం అధఃపాతాళంలో వున్నాం. మనరాష్ట్ర గత విద్యాశాఖామంత్రి ఫిన్లాండుతో పాటు, శ్రీలంకలోనూ పర్యటించి ముక్కున వేలేసుకొచ్చారు!
ఎందుకు మనం ఓ మినహాయింపుగా మారాం?
- నూతనార్థిక విధానాలతో పాటు నూతన విద్యావిధానం అవతరించిన 1990
దశకం నాటికి విద్యారంగంలో జాతీయంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ వున్న పరిస్థితి ఇది. ఇప్పుడు అత్యవసరంగా మన పరిస్థితిని మార్చాలనుకొంటే పై అనుభవాల్నించి పాఠాలు నేర్చుకోవల్సివుంది. ప్రపంచంలోనే భారతదేశం 'అందరికీవిద్య' దగ్గరకొచ్చేప్పటికి ఒక 'మినహాయింపు'గా ఎందుకు వుండి పోయిందో ప్రపంచబ్యాంకు శాస్త్రీయంగా బేరీజు వెయ్యాల్సింది. తాను కోరుకొన్న అరకొర అక్షరాస్యతనైనా సాధించాలంటే మౌళికంగా రావల్సిన మార్పులేవో నిగ్గుతేల్చుకోవల్సింది. కానీ పుంఖానుపుంఖ సర్వేలూ, నివేదికలూ, సూత్రీకరణలూ, ప్రణాళికలూ, వ్యూహాలు వండి వార్చడంలో రాటుతేలిన కన్సెల్టెన్సీలు, పండిత ప్రకాండులు, గణాంక నిపుణులు అంతాకలిసి శోధించి తేల్చిందేమిటో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత 'గొప్ప' సంస్థకు ఇంత డొల్లతనమా అన్పిస్తుంది.
- సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త మైరన్ వైనర్ విద్యారంగంలో భారతదేశం
ఒక మినహాయింపుగా మిగిలిపోవడానికి కారణాల్ని దాని సాంస్కృతిక మూలాల్లో వెతకాలంటాడు. భారతీయ విద్యకు సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడం తప్ప, ఐక్యంచెయ్యడం ఎప్పుడూ అలవాటు లేదంటాడు. అసలు భారతీయ సమాజమే 'అందరికీ విద్య’ను అంగీకరించలేదని, దాని రాజకీయ అజండాలోకి ఇప్పటికీ 'విద్య' ప్రధానాంశంగా రానేరాలేదని వ్యాఖ్యానిస్తాడు. భారతసమాజపు అసమాన కులవ్యవస్థ అందరికీ సమాన విద్యకు ప్రధాన అడ్డంకి.ప్రపంచబ్యాంకుకు ఇదేమీ పట్టదు.
- చైనా భారత్లో విద్యాభివృద్ధికి సంబంధించి అమర్త్యసేన్, జీన్జ్లు చేసిన
తులనాత్మకాధ్యయనాలు మనముందున్నాయి. చైనాను కేరళను పోల్చి వీరు చేసిన విశ్లేషణ ఎంతో విలువైంది. అలాగే దక్షిణకొరియా, హాంగ్కాంగ్, సింగపూరు, థాయ్ండులు మార్కెట్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థకు పునాదిగా విద్యారంగంలో చేసిన ప్రయత్నాల్ని, వాటి విజయాల్ని కూడా వాళ్ళు వివరంగానే ప్రస్తావించారు. భారతదేశపు జనాభా, సాంస్కృతిక వైవిధ్యం, వెనకబాటుతనం, వనరుల లభ్యత లాంటి వేమీ చెప్పుకోదగ్గ అడ్డంకులుకావనీ, విద్యారంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన చాలా దేశాలకు కూడా ఇవన్నీ వున్నవేనని, వీటిని సాకుగా చూపి తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోడం పాలకులకు తగదనీ వారు ఘాటుగా విమర్శించారు. ఒకవైపు ప్రపంచీకరణ గురించి, మార్కెట్ ఆర్థికవ్యవస్థ గురించీ మాట్లాడుతూ కనీస దానిక్కావల్సిన మానవవనరుల్ని కూడా అభివృద్ధి చేసుకోలేకపోడం మన చేతగానితనాన్ని బయటపెడుతోందని కూడా వారు చురకలేశారు.
- ప్రాజెక్టు మీద ప్రాజెక్టును తెచ్చి పాఠశాల విద్యలో ఒక్కోచోట ఒక్కో జోక్యానికి
తెరలేపిన ప్రపంచబ్యాంకు వీరి అధ్యయనాలనూ పట్టించుకోలేదు. ప్రపంచమంతా సాధ్యమైన 'అందరికీ విద్య' భారత్లో ఎందుకు సాధ్యంకాదనే మౌళిక ప్రశ్నకు అది సమాధానం వెతకనేలేదు. ఒక్క కేరళ అనుభవమేగాదు తర్వాత తర్వాత తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు కూడా కొంచెం అటూ ఇటూ ఇదే వైపు ప్రయాణించగలిగాయి. చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. ఎక్కడికో వెళ్ళి వెతుక్కొనవసరంలేదు వీటిని చూచికూడా భారత్ నేర్చుకోవల్సినంత నేర్చుకోవచ్చు. దీనికోసం ఎక్కడినుంచో వచ్చి ప్రపంచబ్యాంకు మనకు పాఠాలు చెప్పాల్సిన అవసరమేమీ లేదు.
మన వైఫల్యాల మూలాలు
- అయితే మన పాఠశాల విద్యారంగ వైఫల్యాలకు కారణమేమిటి? దీనిపై కూడా
కావల్సినంత చర్చ జరిగింది. “భారతీయ సామాజిక వ్యవస్థలోని అసమానతలే విద్యారంగంలోనూ వ్యక్తమవుతున్నాయి. ఈ అసమానతలనూ, ఈ సమాజంలోని విరుద్ధశక్తుల ప్రయోజనాలనూ భారతీయ విద్యారంగం పరిరక్షిస్తోంది. భారతదేశపు విద్యారంగ ప్రాధాన్యతల్ని ఈ దేశంలో లోతుగా వెళ్ళానుకున్న ఉన్నతవర్గాల ప్రయోజనాలే శాసిస్తున్నాయి. దీన్ని అధిగమించాలంటే కావల్సింది దృఢమైన రాజకీయ సంకల్పం. ఇది ఒక్క పాలకపార్టీకి వుంటే సరిపోదు ప్రతిపక్ష పార్టీలకూ వుండాలి” అంటాడు అమర్త్యసేన్. భారతదేశపు హిందూ ఇస్లాం ములాలు సైతం అగ్రవర్ణ పూజారుల, ఆధిపత్య ముల్లాల చేతిలోనే వుండిపోయాయి. వారిద్దరూ ఉన్నత వర్గాల పక్షపాతులు. ఈ మతాధిపత్యం సమాన విద్యను ఆటంకపరిచింది.
- మన విద్యారంగాన్ని స్వాతంత్య్రానంతరం కూడా బ్రిటీష్ వారసత్వం
వెంటాడుతూనేవుంది. కొద్ది మందిని అదీ ఉన్నత వర్గాల్ని విద్యావంతుల్ని చేసి తమకు తోడుగా నిలబెట్టుకోవాలన్నది బ్రిటీష్ విధానం. దానికనుగుణంగా అది సార్వత్రిక విద్యను, ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేసింది. దీన్నే మనం కొనసాగించాం. అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థల్ని నెలకొల్పుకోగలిగాం గానీ ప్రతి గ్రామంలో ఒక మంచి ప్రాథమిక పాఠశాలను మాత్రం నిర్మించుకోలేక పోయాం.
- అన్నిటికంటే మించి అభివృద్ధిపట్ల మన దృక్పథమేమిటి? ఉత్పత్తి పెరగడాన్ని,
సంపద వృద్ధి చెందడాన్ని, ఎగుమతుల్ని, మార్కెట్ని, పెద్ద పెద్ద నగరాల్ని, కొన్ని ప్రత్యేక రంగాల్లో (ఉదా: ఐ.టి, అంతరిక్షం, అణుశక్తి) ప్రాభవాన్ని మనం అభివృద్ధిగా లెక్కిస్తున్నాం. ఈ తూకపు రాళ్ళతోనే మనం త్వరలో తృతీయ ఆర్థిక శక్తిగా అవతరిస్తామని కలలుకంటున్నాం. ఈ దృక్పథమే మన విద్యారంగాన్ని కూడా శాసిస్తోంది. ఫలితంగా ఇలాంటి అభివృద్ధికి కావల్సిన నైపుణ్యాల్ని, సామర్థ్యాల్ని మన యువతరానికి సంతరింపజెయ్యడమే విద్యాలక్ష్యాలుగా మనం నిర్వచించుకొంటున్నాం.“మానవ వనరుల అభివృద్ధి" అని దీనికి ముద్దుపేరు పెట్టుకొన్నాం.
- విద్యాభివృద్ధికీ ఆర్థికాభివృద్ధికీ సంబంధం వుండకూడదనో, వుండదనో
వ్యాఖ్యానించే వాళ్ళెవ్వరూ వుండరు. ప్రపంచబ్యాంకు నడిగితే ఎన్నేళ్ళు చదువుకొంటే ఎంతకూలి పెరుగుతుందో నోరూరించేలా చెపుతుంది. తూర్పు ఆసియా టైగర్స్ని (దక్షిణకొరియా, హాంగ్కాంగ్,సింగపూర్,తైవాన్లు) దృష్టాంతాలుగా చూపుతుంది.సార్వత్రిక పాఠశాల విద్య (సెకండరీ విద్యదాకా) సోషలిస్టు దేశాల ఆర్థిక పురోగమనంలో కూడా గొప్ప భూమికను నిర్వహించిందన్నది కాదనలేని వాస్తవం.నిత్యం ప్రపంచీకరణను, స్వేచ్ఛామార్కెట్ను ప్రవచించే భారతదేశం కనీసం ఈ కోణం నుంచి కూడా విద్యావసరాల్ని గుర్తించి అందరికీ చదువునందించలేక పోయిందనేది నిష్ఠుర సత్యం.
విద్య విముక్తికోసం
- అయితే అసలు విషయమేమంటే చదువుకు ఇంతకంటె గొప్ప ప్రయోజనం
వుంది. అజ్ఞానం నుంచి, అశక్తత నుంచి, వెనకబాటు ఆలోచనల్నించి, దోపిడీ నుంచి మంచివిద్య మానవుణ్ణి విముక్తి చెయ్యడానికి సాధనం. అలా చూసినపుడు విద్య తనకుతానే గొప్ప విలువ. చదువుకోవడమే ఒక గొప్ప ప్రమాణం. ఇలా విముక్తుడైన మనిషి ఈ ప్రాపంచిక కార్యక్రమాలన్నిటిలో క్రియాశీలంగా పాల్గొంటాడు. దాని పురోగమనంలో భాగస్వామి అవుతాడు. ఆధునికయుగం అందించిన అన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోగల శక్తివంతుడవుతాడు. ఈ క్రమంలో అతనికొక ప్రాపంచిక దృక్పథం అలవడుతుంది. అతడొక సామాజిక జీవిగా, శక్తిగా మారతాడు. తనకెలాంటి ప్రపంచం గావాలో అతడు స్వప్నించుకోగల్గుతాడు. సమిష్టిగా దానికోసం ఉద్యమిస్తాడు. ఈ క్రమంలో ఘర్షణ పడాల్సివస్తే ఘర్షణపడతాడు. 'సా విద్యా విముక్తయే' అన్న ప్రాచీన వాక్యానికి ఆధునికార్థమిదే.
- ఒక గొప్ప మానవుణ్ణి, ఒక మహోన్నత సమాజాన్ని నిర్మించుకోదల్చినపుడు
విద్యాస్వభావం ఎలావుంటుందో, దాని విస్తరణ ఎంత వేగంగా బహుముఖంగా జరుగుతుందో సోషలిస్టు దేశాలు నిరూపించాయి. మన దేశానికి అలాంటి లక్ష్యాలేమీలేవు. దానికి తగ్గట్టే మన చదువుల్లో సరుకూ, సార్వత్రికతా రెండూ అంతంతమాత్రమయ్యాయి. ప్రపంచబ్యాంకు ఈ కోణం నుంచి అసలే చూడదు. మనకూ ఇది పట్టదు. ప్రపంచ బ్యాంకు దృష్టిలోపం
అన్నిటిని కలిపి చూసినప్పుడు మనకు అర్థమవుతుందేమంటే, స్వాతంత్ర్యానంతరం కూడా భారతదేశం ఒక ఆధునిక రాజ్యంగా అవతరించలేకపోయింది. గ్రామీణ ఫ్యూడల్ వ్యవస్థను బద్దలుకొట్టలేకపోయింది. ఈ లోపం మన రాజకీయ వ్యవస్థతో పాటు సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలలోనూ నిబిడీకృతంగా ఉంది. ఇందులో భాగంగానే మన విద్యారంగం అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలకు పరిమితమై ఉంది. సార్వత్రిక విద్యకు దూరమైంది. కొద్దిపాటి రాజకీయ సంకల్పమూ, ఉద్యమాల నేపథ్యమూ ఉన్న చోట దీనిని అధిగమించడం అసాధ్యం కాదు అని మన వద్దనే కావలసినన్ని దృష్టాంతాలు ఉన్నాయి.
1990వ దశకంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టేందుకు చాలాముందే, 1968లోనే కొఠారీ కమిషన్ మనకు ఎందుకు కామన్ స్కూలు అవసరమో నొక్కిచెప్పింది. జిడిపిలో కనీసం 6 శాతం విద్యకు కేటాయించాలని సిఫార్సు చేసి, దీన్ని 1985-86కి సాధించాలన్నది. కానీ జరిగిందేమిటి? గత 15 సంవత్సరాలలో సగటు వ్యయం జిడిపిలో 3.8 శాతం కంటే మించలేదు. 1997-2003 మధ్య కూడా సగటు వ్యయం 3.6 శాతం ఉండింది. ఒక్క 1999లో మాత్రం గరిష్టంగా 4.42 శాతంగా ఉండింది. 2013లో ప్రపంచంలోని 113 దేశాల సగటు వ్యయం జిడిపిలో 4.46 శాతంగా ఉండటాన్ని చూస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఆర్థిక దిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్న క్యూబా 2010లో తన జిడిపిలో 12.8 శాతం విద్యకు కేటాయించగలిగింది.
ప్రపంచ బ్యాంకు దేశంలోకి అడుగుపెట్టే నాటికున్న ముఖచిత్రం ఇది. 1950లతో పోలిస్తే ఉపాధ్యాయుల సంఖ్యలో పెరుగుదల తగ్గిపోయింది. 1980వ దశకంలో ఇది మరింత పడిపోయింది. రికరింగ్ వ్యయాన్ని వాస్తవ రేటుతో పోల్చితే పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా లేదు.
రికరింగ్ వ్యయం, ఉపాధ్యాయుల పెరుగుదల రేటు
రికరింగ్ వ్యయం (సంవత్సరానికి శాతం) 1970-71 ధరల్లో
కాలం ఉపాధ్యాయులు పెరుగుదల (%) ఉపాధ్యాయులు/జనాభా నిష్పత్తి (%) 1950-51 నుండి 1960-61 వరకు 8.5 5.6 1960-61 నుండి 1970-71 వరకు 3.6 12 1960-61 నుండి 1990 వరకు విద్యా రంగంలో పరిణామాలు కాలం రేటు 1 రేటు 2 రేటు 3 1960-61 నుంచి 1970-71 వరకు 5.8 4.5 2.3 1970-71 నుంచి 1980-81 వరకు 2.8 2.7 0.5 1980-81 నుంచి 1984-85 వరకు 11.1 2.1 0.0 1984-85 నుంచి 1989-90 వరకు 10.8 1.6 -0.5
Source: Dreze & Sen (1995), పేజీ 120
ఇంత దూరం 1990 పూర్వపు చరిత్రను ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే, దీన్ని లోతుగా విశ్లేషించకుండా, సరిచేయకుండా అందరికీ విద్య గురించి మాట్లాడటం మోసకారితనం మాత్రమే అన్న విషయాన్ని చెప్పడానికే. ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంక్ కలసి ఈ వ్యవస్థను స్థాపించి 1990 నుండి దానిపై కృషి చేస్తూనే ఉన్నాయి.
ప్రపంచ బ్యాంకు తన ప్రాజెక్టులను అమలు చేసేముందు ‘విస్తృతమైన’ అధ్యయనం చేసినట్టు ప్రకటించింది. ఈ అధ్యయనంపై 1996 ఆగస్టు 1న భారతీయ ఉన్నతాధికారులతో చర్చించింది. అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఒక నివేదికను ఖరారు చేసింది. అప్పటికి ఈ రంగంలో జరిగిన అనేక పరిశోధనలు, అధ్యయనాలు ప్రపంచ బ్యాంకుకు సహాయపడినట్లు పేర్కొంది. ప్రపంచ బ్యాంకు విద్యారంగ ముఖ్య నిపుణుడు మార్లెన్ లాక్ హాల్ నాయకత్వంలో ఒక టీమ్ దీనిని రూపొందించింది. దీన్ని గమనిస్తే, ప్రపంచ బ్యాంకు దృష్టిదోషం స్పష్టమవుతుంది.
ఇప్పుడు మన ముందుకు వచ్చే ప్రశ్న: మన దేశంలో అందరికీ విద్య అందించడానికి ప్రపంచ బ్యాంకుకు ఇంత తహతహ ఎందుకు? ఇంత శ్రమ, పెట్టుబడి ఎందుకు? నూతన ఆర్థిక విధానం, నూతన విద్యావిధానం, ప్రపంచ బ్యాంకు అధ్యయనం అన్నీ ఒకే కాలంలో రావడం యాదృచ్ఛికం కాదని గుర్తించాలి. ఈ మూడు పరస్పర ఆధారపడి ఉన్నాయి, పరస్పర పూరకాలు. అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశాన్ని అనుసంధానం చేయడం నూతన ఆర్థిక విధాన లక్ష్యం. దానికి తగిన భూమికను, మానవ వనరులను సిద్ధం చేయడం నూతన విద్యావిధాన బాధ్యత. దీనికి తగిన వ్యూహాన్ని, తాత్వికతను, నిధులను అందించడం ప్రపంచ బ్యాంకు పని.
ప్రపంచ బ్యాంకుకు భారతీయ మార్కెట్ చాలా విలువైనది. ఒక దేశంలో తయారైన నిపుణులు మరొక దేశ అవసరాలకు కూడా ఉపయోగపడాలి. దీనికి తగిన మనుషులు కావాలి. మార్కెట్ అంటే ఉత్పత్తి, వినియోగం రెండూ ఉంటాయి. ఉత్పత్తికి కొన్ని నైపుణ్యాలు అవసరం. వినియోగానికి ఒక స్పృహ ఉండాలి. కేవలం సామర్థ్యం ఉండడమే సరిపోదు.
- దీనికనుగుణంగా ప్రపంచబ్యాంకు కొన్ని సూత్రీకరణల్ని చేసింది. కారణాల్ని
అన్వేషించింది. ఇంతకూ దీని ప్రకారం ఇండియా ప్రాథమిక విద్యలో ఇంతగా వెనకబడ్డానికి కారణాలేమిటి? ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం ఒకటి ఆర్టికల్ 45లో 14ఏళ్ళలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యనందిస్తామని చెప్పుకొన్నా ప్రాథమిక విద్యపై కేంద్రీకరించకపోవడం. ఆర్థికాభివృద్ధికి, పేదరికాన్ని తగ్గించి సమానతను సాధించడానికి ప్రాథమిక విద్య కీలకమని గుర్తించకపోవడం. బాలికలు, వెనకబడిన వర్గాలపై ప్రత్యేకదృష్టి సారించకపోవడం. రెండోది భారతదేశం చాలా విశాలమైంది. ప్రాంతాల మధ్య అసమానతలెక్కువ. ఉమ్మడి జాబితాలో విద్య వుండటంతో కొన్ని రాష్ట్రాలు బాధ్యత తీసుకోడం లేదు. మూడవది బడిబయట పిల్లలకు అనియత విద్యను విస్తృతంగా అందించలేక పోవడం. ఇవి గాక ప్రజాభాగస్వామ్యం లేకపోవడం, వికేంద్రీకరణ లేకపోవడం, జనాభా పెరుగుదలకు తగ్గట్టు పాఠశాలల సంఖ్య పెరగకపోవడం, పాఠశాలలు అందుబాటులో వుండకపోవడం, పిల్లలు మధ్యలో బడిమానెయ్యడం (1-8 తరగతుల మధ్య 35శాతం), తగిన ప్రమాణాలు సాధించలేకపోడం (4వ తరగతి పిల్లల్లో 46శాతం మంది గణితంలో, పఠనంలో వెనకబడుతున్నారు), పాఠశాలల్లో వసతులు లేకపోవడం, ఉపాధ్యాయులకు సామర్ధ్యాలు లేకపోవడం, ప్రామాణికమైన పాఠ్యగ్రంథాలు లేకపోవడం. నిర్వహణా వ్యవస్థలు బలంగా లేకపోవడం. చివరగా నిధులకొరత. ఇలా ప్రపంచబ్యాంకు కారణాల్ని ఏకరుపు పెట్టింది.
- అయితే అదే సందర్భంలో ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే మేలుకొంటున్నాయని,
ప్రాథమిక విద్యకూ ఆర్థికాభివృద్ధికీ మధ్యగల లింకును గుర్తిస్తున్నాయని, పిల్లల నమోదు గణనీయంగా పెరుగుతోందని కూడా పేర్కొంది.
- మనం గమనించాల్సిందేమంటే ఇందులో రాజకీయ కారణాలు, ప్రభుత్వ
విధానాలు ఎక్కడా ప్రస్తావనకు నోచుకోవు. సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక వైరుధ్యాలు ఎక్కడా కనబడవు. ప్రభుత్వరంగం, ప్రభుత్వ బడ్జెట్లు, విద్యకు కేటాయింపులు మచ్చుకైనా ముందుకురావు. కేరళ గణాంకాలు తప్ప దాని అనుభవాలు, వాటి వెనకగల సంస్కరణోద్యమాలు, రాజకీయాల గురించి ఒక్కమాటా దొర్లిన పాపాన పోదు. ముఖ్యంగా గ్రామీణ పేదరికం పిల్లల చదువుల్ని ఎలా శాసిస్తోందో, బాలకార్మిక సమస్య మన దేశంలో ఎందుకింత తీవ్రంగా వుందో ప్రపంచబ్యాంకు పట్టించుకోదు. ఒక ఆధునిక సమాజంగా భారత్ ఎందుకు అవతరించలేక పోయిందో, దానికున్న అడ్డంకులేవో, వాటి మూలాలు ఎక్కడున్నాయో 307 పేజీల బృహద్గ్రంథంలో అది చెప్పలేకపోయింది.
- అసలు స్వాతంత్ర్యం వచ్చిన 50ఏళ్ళకు కూడా ప్రాథమిక విద్యను దాటి
ప్రపంచబ్యాంకు ఎందుకు పోదు? కనీసం సెకండరీ విద్యనైనా ఎందుకు లక్ష్యంగా పెట్టుకోదు? వాస్తవానికి ప్రాథమిక విద్య ఆపై విద్యకు పునాది మాత్రమే. తదుపరి విద్యలేకపోతే దాని విలువ అంతంత మాత్రమే. ఇది విద్యను అక్షరాస్యతకు కుదించడమే. ప్రపంచబ్యాంకునే తప్పుపట్టాల్సిన పనిలేదు. మన ప్రభుత్వాలకూ కావల్సింది ఇదే. అందుకే మనం దాని ప్రాజెక్టులకు స్వాగతం చెప్పాం.
ప్రపంచబ్యాంకు దృష్టిలో విద్య ఎందుకోసం?
- ప్రపంచబ్యాంకు దృష్టిలో విద్యవల్ల ప్రయోజనాలేమిటో చూడండి.
"చదువుకోని సమాజం కన్నా చదువుకొన్న సమాజం ఎక్కువ ఉత్పత్తిని చేస్తుంది. ప్రపంచీకరణ యుగంలో సమర్థవంతంగా ప్రపంచంతో అనుసంధానమవుతుంది. భారత్లాంటి దేశంలో జాతీయ సామాజిక ఐక్యతకు దోహదపడుతుంది". ఇంకా వివరంగా చెప్పాలంటే “కార్మిక ఉత్పాదకత ఒక్క సంవత్సరం విద్యతో 13శాతం పెరుగుతుంది. మరి కొంచెం చదువు పెరిగితే 25శాతం పెరుగుతుంది. చదువుకొంటే కొత్త వ్యవసాయ విధానాలు పాటిస్తారు. ప్రాథమిక విద్యవల్ల ప్రతిఫలం (Returns) వ్యక్తికీ సమాజానికీ 8-9 శాతం దాకా వుంటుంది. తూర్పు ఆసియాలోని 8 దేశాల్లో 1960 తర్వాత ప్రాథమిక విద్యవల్ల లాటిన్ అమెరికా దేశాలకంటె మూడురెట్లు అభివృద్ధి జరిగింది. ప్రాథమిక విద్యవల్ల ఈ దేశాల్లో పేదరికం తీవ్రంగా తగ్గిపోయింది. జపాన్, థాయ్లాండ్, బ్రెజిల్లోనూ ఇలాగే జరిగింది. సగటు విద్యాసంవత్సరాలు పెరిగేకొందీ ఉత్పాదకత పెరుగుతూ వచ్చింది. అంటే చదువు ఒకగొప్ప మానవ పెట్టుబడి ఆర్థికాభివృద్ధిలో ఇది ఇంత గొప్ప పాత్రను పోషిస్తుంది”.
- "ఇక వ్యవసాయరంగంలో చదువు పెరిగేకొందీ కూలిరేటు పెరుగుతుంది.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో 1961-72 లలో ఇది రుజువైంది. ప్రాథమిక విద్యవల్ల ఈ రంగంలో సాంకేతికత పెరగడమే దీనికి కారణం."
- "చదువుకొన్న ఆడపిల్లలు తక్కువ పిల్లల్ని కంటారు. ఆరోగ్య జాగ్రత్తలు
తీసుకొంటారు. (చదువులేని మహిళలు 5 మందిని, ప్రాథమిక విద్యవుంటే నలుగురిని, 7వ తరగతి దాటితే ముగ్గురిని, సెకండరీ విద్యతోనైతే ఇద్దరిని కంటారు! అలాగే చదువువల్ల పెళ్ళి వాయిదా పడుతుంది. అందుకే కేరళ, తమిళనాడుల్లో బాల్య వివాహాలు తక్కువ. చదువుకొన్న తల్లుల్లో పిల్లల మరణాలు బాగా తక్కువ. వాళ్ళు పిల్లలకు టీకాలు వేయిస్తారు". ఇలా చెప్పిన ప్రపంచబ్యాంకు మరోగొప్ప వాదం కూడా ముందుకు తెచ్చింది. "బాగా చదవుకొన్న కేరళలో పిల్లలు తగ్గారు. అందువల్ల స్కూళ్ళు కూడా తగ్గాయి ప్రభుత్వ భారమూ తగ్గింది". ఇలా చెప్పిచెప్పి-
- Greater the delay in reaching this there should, greater the loss for
entire population" అన్న హెచ్చరికతో తన అధ్యాయాన్ని ముగించింది.
- చదువంటే అక్షర, సంఖ్యాజ్ఞానం లేదా మరికొన్ని నైపుణ్యాలు అనే
నిర్వచనానికి మనం పరిమితమైతే దానివల్ల ఒరిగేదేమీ పెద్దగా లేదని చెప్పడానికి గొప్ప పరిశోధనేమీ అక్కర్లేదు. అరకొర ప్రాథమిక విద్య మరో 10-15 ఏళ్ళలో మనమూ సాధించేస్తాం. దానికింత కసరత్తు అక్కర్లేదు. అసలు విషయం ఆ ప్రాథమిక విద్య అయినా ఎంత ప్రామాణికమైందనేది. ఆరేడేళ్ళ పాఠశాల విద్య పూర్తిచేసిన వారు కూడా ఆచరణలో నిరక్షరాస్యులుగానే వున్న దేశం మనది. మన రాష్ట్రంలో చదువుకొన్న గిరిజన ఆడపిల్లలు జీవితంలో ఎక్కడున్నారో చూస్తే తత్వం మరింత బోధపడుతుంది. అలాగే ముందే చెప్పుకొన్నట్టు ప్రాథమిక విద్య సెకండరీ విద్యకు దారితీస్తేనే చెప్పుకోదగ్గ ఫలితాలేమైనా వస్తాయి. ఆ తర్వాత కూడా కొత్తవృత్తుల్లోకి ప్రవేశించగల నైపుణ్యాల్ని అందిస్తేనే కొత్త జీవితాన్ని గ్రామీణ పేద పిల్లలు ప్రారంభించగలరు. కేరళ నర్సులు దీనికి గొప్ప ఉదాహరణ. ప్రపంచబ్యాంకు చెప్పుకొచ్చే విద్యాస్థాయి, దాన్నుంచి ఆశించే ప్రయోజనాలు అత్యంత సంకుచితమైనవి.
- ఇక విద్యాసంవత్సరాలతో ఉపాధినీ ఉత్పత్తినీ ముడి పెట్టడం, ఏ స్థాయి విద్యతో
ఏ ఆరోగ్య ప్రమాణాలు, సామాజిక సూచికలు పెరుగుతాయో లెక్కించడం కూడా యాంత్రికమైనవే. ఇతర అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా నేరుగా విద్యతోనే వీటన్నిటినీ ముడిపెట్టడం అకడమిక్ చర్చకు మాత్రమే పనికొస్తుంది. మంచినీళ్ళు, వైద్యవసతులు, ఆరోగ్యస్పృహ, ఆదాయం పెంపుదల ఇవన్నీ లేకుండా కేవలం బడిపాఠాలతోనే కేరళలో ఆరోగ్యప్రమాణాలు పెరిగాయనగలమా? తీవ్రమైన ఆర్థిక సామాజిక అసమానతల్ని, కటిక పేదరికాన్ని, దుర్భర గ్రామీణ స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకోకుండా, వీటినేమీ మార్చకుండా అరకొర చదువుతో ఒరిగేదేమిటి? అమెరికాలో 19వ శాతాబ్దం నుంచే కామన్స్కూలు విధానం వుంది. పాఠశాలవిద్యను అందరికీ సమానంగా అందించినంతమాత్రాన అక్కడ సమాన సామాజికార్థిక ఉపాధి అవకాశాలు లభించాయని ఎవ్వరూ చెప్పలేరు. మూడువేల డాలర్లకంటే తక్కువ ఆదాయంగల తల్లిదండ్రులున్న వారికీ, పదహైదువేల డాలర్ల ఆదాయంవున్న తల్లిదండ్రుల పిల్లలకీ మధ్య కాలేజీస్థాయికి వెళ్లే అవకాశాలు ఎంతతక్కువో, వీరిద్దరి స్కూల్ ఇయర్స్లో తెలియకుండానే ఎంత తేడా వుంటుందో సామ్యూల్ బోల్స్, హెర్బెర్ట్ జింటాస్ ల అధ్యయనం 1976 నాటికే అద్భుతంగా కళ్ళకుకట్టించింది. అట్లని మనం చదువుకున్న ప్రాధాన్యతను తక్కువ చెయ్యడం లేదు గానీ దాని చుట్టూ ఒక మార్మికతావలయాన్ని నిర్మించండం మాత్రం అంగీకరించలేము. ప్రపంచబ్యాంకు ఉ ద్దేశపూర్వకంగానే అందరికీ విద్యను ముందుకు తెస్తూ సామాజిక సత్యాల్ని వెనక్కి నెడుతోంది.
- అలాగే అమర్త్యసేన్ విద్యకున్న Instrumental Value ను అంగీకరిస్తూనే
అది అత్యంత పాక్షికమంటాడు. ఇలా చూడ్డం మన దృక్పథంలోని లోపమంటాడు. విద్యకొక Intrinsic Value వుంది. దాన్ని అర్థంచేసుకోనంత వరకూ అందరికీ విద్య ఎందుకో, ఎలాంటి విద్య నందించాలో, ఏ ప్రాధాన్యత దానికివ్వాలో ఎప్పటికీ బోధపడదంటాడు. మానవుడికి ఒక స్వేచ్ఛనుగాదు వెనకబాటుతనం నుంచి, అశక్తత నుంచి, అజ్ఞానం నుంచి, దోపిడీ నుంచి, ప్రాపంచిక కార్యాచరణలో క్రియాశీల భాగస్వామికాలేక పోడంనుంచి పలు స్వేచ్ఛల్ని విద్య ప్రసాదించాలంటాడు.
- ప్రపంచంలో చాలాదేశాలు అద్భుతమైన విద్యాభివృద్ధిని సాధించాయి. అవేవీ
ప్రపంచబ్యాంకు పాఠాల్ని చదివి కూలిరేట్ల పెంపుదల కోసం, సార్వత్రిక టీకాల కోసం, తక్కువ పిల్లల్ని కనడం కోసం దాన్ని సాధించలేదు. చివరకు ఒకప్పటి ఆంగ్లికన్ చర్చి, ప్రస్తుత పెట్టుబడిదారీ పారిశ్రామిక దేశాలు కూడా విద్యనింత సంకుచితార్థంలో చూడలేదు. ఇక సోషలిష్టు దేశాలు సరేసరి. ప్రపంచీకరణ యుగంలోనే ఈ వికృత విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రపంచబ్యాంకుకు ఇవన్నీ తెలియవనుకోలేము. దాని విద్యావసరాలే వేరు. దానితాత్వికతే వేరు. అసలది ప్రవచించే చదువే వేరు. దీనికనుగుణంగానే ఈ సూత్రీకరణల్ని ముందుకు తెచ్చింది. మన దృక్పథానికి కూడా ఇవి అతికినట్టు సరిపోవడం మన దౌర్భాగ్యం.
అధ్యయనాలూ - సిఫార్సులూ
- ప్రపంచబ్యాంకు తెచ్చిన ప్రతిప్రాజెక్టూ ఒక అధ్యయనాన్ని, ఒక విధానపత్రాల్ని,
నాలుగైదులక్ష్యాల్ని, అయిదారు బుల్లెట్ కార్యక్రమాల్ని మోసుకొచ్చింది. అన్నీ మూసపోసినట్టు మన విద్యారంగ దుస్థితికి కారణం బడుల స్థితిగతులు సరిగా లేకపోవడమేనని, బోధనా విధానాలు సరైనవి కాకపోవడమేననీ, టీచర్లకు తగిన సామర్థ్యాలు కరువవ్వడమేననీ, అభ్యసన సామాగ్రి సరైంది అందించనందువల్లనేననీ చెప్పుకొచ్చాయి. గ్రంథాలయాలు కావాలన్నాయి. టాయిలెట్లు అర్జంటన్నాయి, మహిళా టీచర్లే అంతిమ పరిష్కారమన్నాయి. మైక్రోప్లానింగు కీలకమన్నాయి. స్థానిక వనరుల్ని వాడుకోవాలన్నాయి. టీచర్లను సానబెట్టి సమాయత్తం చేస్తేతప్ప ఒక్కడుగూ ముందుకు పడదన్నాయి, ఆలోచనావిధానమూ, వ్యవస్థాగతాంశాలూ సమూలంగా మారాలని, దూకుడు పెరగాలనీ సిఫార్సులు చేశాయి. పాత బుర్రల్ని ఖాళీచేసుకొని కొత్త బుర్రలతో రావాలని పిలుపునిచ్చాయి.
- నిర్దిష్టంగా ఏంచెయ్యాలో ప్రపంచబ్యాంకు ఇలా చెప్పుకొచ్చింది. "మొదట
బడిని అందుబాటులోకి తేవాలి. ఆంధ్రప్రదేశ్లో సహా ఆరు రాష్ట్రాల్లోనే నాల్గింట మూడువంతుల పిల్లలు బడిబయట వుండటానికిదే కారణం. పేరుకు 1-5 తరగతుల్లో (1986 నాటికి) 75శాతం పిల్లలు నమోదు అవుతున్నా నమోదయిన వారి హాజరు అంతంత మాత్రంగానే వుంటోంది. అనియత విద్యనభ్యసిస్తున్న 63లక్షల మంది ప్రమాణాలు మరీ నాసిరకంగా వున్నాయి (1986-1994 మధ్య నాన్ఫార్మల్ కేంద్రాలు 1,26,000 నుంచి 2,55,000లకు పెరిగాయి). కనీసం బడికి రెండు రూములు, ఇద్దరు టీచర్లయినా వుండాలి. కానీ ఎక్కువ స్కూళ్ళు ఆరుబయటే నడుస్తున్నాయి.
- విద్యాప్రమాణాలు దయనీయంగా వున్నాయి. కారణం 70-80 మంది
పిల్లలకు ఒకరిద్దరు టీచర్లు బోధించాల్సిరావడం. విద్యాప్రమాణాల్లో బాలికలు, గిరిజనులు, షెడ్యూల్డు కులాల పిల్లలు బాగా వెనకబడి వున్నారు. వీరిపై కేంద్రీకరించాలి. ఇంటి చదువుకు సపోర్టునివ్వడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇక పాఠశాల వసతులు, లభ్యమయ్యే బోధనా సామాగ్రి నాణ్యమైనవిగా వుండాలి”. అక్కడితో ఆగకుండా ప్రపంచబ్యాంకు ఇలాచెప్పుకొచ్చింది. "అన్నిటికంటే కీలకమైంది ఉపాధ్యాయుల నాణ్యత. గొప్ప విద్యార్హతలతో, మంచి జీతాలతో వున్నంతమాత్రాన మంచి టీచర్లుకాబోరు. తమిళనాడులో సగంమంది టీచర్లకు 4తరగతి గణితజ్ఞానం కూడా లేదని తేలింది! ఉపాధ్యాయ శిక్షణా కోర్సులవల్ల, వృత్యంతర శిక్షణలవల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు. కావాల్సింది టీచర్లు పిల్లలపై శ్రద్ధపెట్టడం. మంచి బోధనాసామాగ్రిని వాడటం. నూతన బోధనావిధానాల్ని పాటించడం. పాఠశాల వాతావరణాన్ని మార్చడం. నిర్వహణా తీరుతెన్నుల్ని సమూలంగా మార్పుచెయ్యడం. పిల్లలచదువుకోసం తల్లిదండ్రులు వ్యయాన్ని గణనీయంగా పెంచడం".
- "నిధుల బాధ్యత ప్రధానంగా రాష్ట్రాలది. కానీ రాష్ట్రాలన్నీ ఆర్థికంగా
సమానంగా లేవు. వీటికి కేంద్రం తోడ్పడాలి. ఒక్క ప్రభుత్వ విద్యావ్యయమేగాదు గృహ విద్యావ్యయమూ పెరగాలి. విద్యకోసం వెచ్చించే నిధుల్లో ఎక్కువశాతం అనియత విద్యకే వెళుతున్నాయి. కేంద్రంగానీ, రాష్ట్రాలుగానీ ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు విద్యారంగానికి కేటాయింపులు మరీ తగ్గుతున్నాయి. ఎంత వ్యయంచేస్తున్నారనే దానికన్నా ఎలావ్యయం చేస్తున్నారనేది మరీ ముఖ్యం. నాన్ఫ్రాన్ వ్యయం 1992-93లో 90.7 శాతంగా వుంది. ప్రాథమిక విద్యలో ఇది 95.7శాతం. తమిళనాడు మొత్తం విద్యా బడ్జెటులో 95.8శాతం టీచర్ల జీతాలకే సరిపోతోంది. తనమొత్తం వ్యయంలో కేంద్రం ప్రస్తుతం విద్యకు 2.5శాతం కేటాయిస్తోంది. దేశంలో విద్యకోసం చేస్తున్న వ్యయంలో ఇది 11శాతం".
- ఇలా చెప్పుకొచ్చాక ప్రపంచబ్యాంకు విద్యాబడ్జెట్టును జిడిపిలో 6శాతానికి
పెంచాలని కొఠారీ చెప్పిందాన్ని మరోసారి గుర్తుచేసి, కేంద్రం దీనికోసం చొరవ తీసుకోవాలని ఓ సూచన చేసి సరిపెట్టుకుంది. కనీస చిత్తశుద్ధిలేని మన పాలకులకు ఇలాంటి సూచనలు ఏం తలకెక్కుతాయి?
- గిరిజన, షెడ్యూల్డు కులాల, మారుమూల గ్రామీణప్రాంతాల
పిల్లలడ్రాపౌట్స్ను, గైరుహాజరును గణనీయంగా తగ్గించడం విద్యాప్రమాణాల్లో అంతరాలు తగ్గించడం తక్షణ కర్తవ్యాలుగా పేర్కొంది. ఈ సిఫార్సుల్లో విశ్లేషణల్లో కొన్ని కాదనలేనివి, కొన్ని మనల్ని తెలివిగా పక్కదారి పట్టించేవి. కొన్ని మాట వరసకు చెప్పి సరిపెట్టినవి, కొన్ని మార్మికమైవి. మొత్తం మీద లోతుకు పోకుండా జాగ్రత్తపడినవి.
ప్రయోగాలూ-"ఉద్యమాలు" (Campaigns)
- మాటల్లో ప్రపంచబ్యాంకు ఏమిచెప్పినా, ఎంత మభ్యపెట్టినా ఆచరణలో
దాని జోక్యాలు దాని అసలు రూపాన్ని బయటపెట్టాయి. ఇప్పుడు వరసగా 1990వ దశకం నుంచి ప్రపంచబ్యాంకు చేసిన ప్రయోగాల్ని పరిశీలిద్దాం.
- ఈ ప్రయోగాలు పలురూపాల్లో జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రపంచబ్యాంకు కనుసన్నల్లో కొన్నిటిని రూపొందించాయి. కొన్నిటిని ప్రాజెక్టుల రూపంలో ప్రపంచబ్యాంకే పర్యవేక్షించి నడిపించింది. నూతన విద్యావిధానం (1986) ఈ ప్రయోగాలను తన పాలసీలో భాగంగా స్వాగతించి ప్రోత్సహించింది. కేంద్రం కొన్నిటికి నిధులు సమకూర్చింది. చాలా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులను స్వంతంచేసుకున్నాయి. అయితే అన్నీ నిర్దిష్టకాలంలో, నిర్దిష్టలక్ష్యాల్ని సాధించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు. అనియత పద్ధతిలో చేసిన ప్రయోగాలు. కన్సెల్టెన్సీల కనుసన్నల్లో చేసిన ప్రయత్నాలు. ఇవన్నీ ప్రభుత్వయంత్రాంగాన్ని ప్రేక్షకపాత్రలోకి నెట్టాయి. సమాంతర వ్యవస్థల్ని నిర్మించాయి. స్వచ్ఛంద సంస్థల్ని, నిపుణుల్ని రంగంలోకి దించాయి. సాంప్రదాయిక పద్ధతుల్నితోసి రాజన్నాయి. "ఉద్యమ" రూపంలో ప్రజల్ని కూడగట్టే కొత్త ధోరణికి తెరలేపాయి. క్రిందిస్థాయి నుంచి కొత్త శక్తుల్ని రంగంలోకి దించాయి. రెగ్యులర్ టీచర్లను, పాఠశాలలను ప్రక్కనబెట్టాయి. ఆకర్షణీయంగా మొదలయ్యాయి. ఔరా! అనిపించాయి. ఆ రోజుల్లో వీటిని 'ఉద్యమాలు' (Campaigns) అనేవారు.
రాజస్థాన్లో 1987లో సాగిన శిక్షాకర్మి ప్రాజెక్టు వీటిలో మొదటిదనవచ్చు. 'టీచర్ల గైర్వహాజరే' అసలు సమస్య అని ఇది తన 'పరిశోధన'లో తేల్చింది. స్థానిక విద్యావంతుల చేత, ప్రజాపర్యవేక్షణలో సాగే ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టింది. అట్టడుగు ప్లానింగ్, స్థానిక ప్రణాళికలు, బహుళ పాఠ్యగ్రంథాలు, కొత్త పర్యవేక్షణా వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అంతా పెద్ద జాతరను తలపించింది. చదువు పట్ల తల్లిదండ్రులకు స్పృహ కల్పించడం, ఊరిలోనే ప్రజావ్యవస్థలను ఏర్పర్చడం, వయసు మీరిన పిల్లలకు కూడా తరగతులతో నిమిత్తం లేకుండా అనియత పద్ధతిలో బోధించడం, ప్రత్యేక (పరాయి) మూల్యాంకనం, ప్రధానంగా నమోదును పెంచి బడికి, చదువుకు పిల్లల్ని దగ్గర చేయడం దీనిలో కీలకమైనవి. దీనికి కొనసాగింపుగా 1998 మధ్య 'లోక్ జుంబుష్' ప్రాజెక్టు SIDA నిధులతో రాజస్థాన్లోనే సాగింది. నిజాయితీ పరుడని పేరుగల సీనియర్ IAS అధికారి అనిల్ బోడియాగారు స్వయంగా దీన్ని నడిపించారు. వికేంద్రీకరణను ముందుకు తెచ్చి, ఏరియాల వారీగా పలు సంస్థలకు బాధ్యతనప్పచెప్పారు. ఎవరి వాచకాలు వారివి, ఎవరి ప్రణాళికలు, వ్యూహాలు వారివి. ప్రధానంగా బడికిరాని అమ్మాయిలపై, ముస్లింలపై ఎక్కువ కేంద్రీకరించారు. నియత, అనియత రెండు పద్ధతులూ పాటించారు. పగలు, రాత్రి పాఠాలు ఎవరికి తగ్గట్టు వారికి చెప్పారు. ఒక స్థాయి కొచ్చాక బడిలో చేర్చారు. ప్రేరక్టళ్లు (స్వచ్ఛంద సైన్యం) గ్రామాల్లో ఏర్పడ్డాయి. బాలికా శిక్షణా శిబిరాలు వేలాది వెలిశాయి. ప్రవేశోత్సవం పేరిట బడులు తెరవడాన్ని పండగలా మార్చారు. “ఏకలవ్య” లాంటి సంస్థలు దీనికి కొంత ప్రామాణికతను సంతరించిపెట్టాయి.
మధ్యప్రదేశ్లో 1997లో అందరి కళ్లూ బైర్లుకమ్మించిన 'ఎడ్యుకేషన్ గ్యారంటీ' (EGS) ప్రోగ్రాం కూడా ఈ కోవలోదే అయినా కొంచెం భిన్నంగా వచ్చింది. ప్రజలు డిమాండ్ చేసిన చోట వారే బడిపెట్టుకొనేలా, వాటిని వారే నడుపుకొనేలా చేయడం దీని ప్రత్యేకత. ఇలా బస్తర్లాంటి అటవీ ప్రాంతాల్లో వేల 'బడులు' వెలిశాయి. ఇష్టం వచ్చినపుడు ఇష్టం వచ్చినరీతిలో వీటిని నడుపుకోవచ్చు. నాలుగునెలల్లో అక్షరాలు, అంకెలు రావాలి. విసిరేసినట్టుండే గూడెలో, మజరాల్లో ఆ రోజుల్లో ఎంత కోలాహలంగా ఉండేదో చెప్పలేము. ఎంత ప్రచారం దీనికి వచ్చిందో కూడా చెప్పలేము. చివరికివి ఏమయ్యాయి? ఎన్నికలు జరిగి అధికారంలోకి రాగానే “లోక్ుంబుష్ను” నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. అమాయకంగా వీరావేశంతో పనిచేసిన వారంతా చప్పబడిపొయ్యారు. అలాగే ప్రాజెక్టు పూర్తవగానే EGS ఠక్కున ఆగిపోయింది. పిల్లలు తగ్గితే మూసెయ్యాలన్న ఉత్తర్వుతో సగానికి సగం 'బడులు' ముందే మూతబడ్డాయి. నిధుల్లేక మిగతావి వెలవెలబోయాయి. సేవాసంస్థలు వేటిదారి అవిపట్టాయి. స్థానిక స్వచ్ఛంద టీచర్లు మాయమయ్యారు. కనీసం చదువుకు అంతో ఇంత దగ్గరైన పిల్లల్ని బడిలో చేర్చి కొనసాగించే ప్రయత్నం కూడా లేక అంతా బూడిదలోపోసిన పన్నీరైంది. మరోవైపు రెగ్యులర్ స్కూళ్ళు, వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం పాఠశాల విద్య అనియత విద్య స్థాయికి జారిపోయింది. అయితే ప్రభుత్వాలూ ప్రపంచబ్యాంకు మాత్రం వీటివల్ల పిల్లల నమోదు బాగా (24శాతం) పెరిగిందనీ, పేదపిల్లల జ్ఞానతృష్ణ బహిర్గతమైందనీ, అక్షర, సంఖ్యాజ్ఞానం తొలితరపు లక్షలాది మంది పిల్లలకబ్బిందని, ప్రజాభాగస్వామ్యం అద్భుత ఫలితాలనిచ్చిందని చెప్పుకొచ్చాయి. ఒకసారి రుచి తెలిశాక తల్లిదండ్రులే బడివెంట పడతారని, పేదలకు చదువునేర్పడం కన్నా చదువుపట్ల స్పృహను కల్గించడమే కీలకమని ఒక సిద్ధాంతం కూడా ఆ రోజుల్లో బాగా చలామణిలోకి వచ్చింది. దురదృష్టం ఏమంటే స్వాతంత్ర్యం వచ్చి అర్ధశతాబ్దం పూర్తయినా మనదేశం ఈ 'స్పృహ'తోనే సరిపెట్టుకోడం. ప్రపంచ దేశాలన్నీ సెకండరీ, ఉన్నత విద్యలవైపు పరుగులిడుతుంటే మనం అరకొర అక్షర సంఖ్యాజ్ఞానం దగ్గరే తచ్చాడుతూ వుండిపోవడం.
సాక్షరతా ఉద్యమాలు
దేశవ్యాప్తంగా 1990 దశకంలో ప్రారంభించిన సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమాల్ని కూడా మనం ఈ సందర్భంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. నేరుగా ఇవి ప్రపంచబ్యాంకు ప్రాజెక్టులు కాకపోయినా ఆ “స్ఫూర్తి”తో, ప్రోద్బలంతో జరిగినవే. పెద్దఎత్తున అట్టడుగు ప్రజల్ని కదిలించి స్వచ్ఛంద ఉద్యమంగా ఆరునెలల కాలంలో మరీ గ్రామీణ మహిళలకు అక్షర జ్ఞానం అందించడం వీటి లక్ష్యం. మొదట ఇది ఎర్నాకులంలో మొదలై ఆ రాష్ట్రమంతా విస్తరించింది. దేశంలోనే ప్రప్రథమంగా కేరళ 1994 ఏప్రిల్ 18న సంపూర్ణ అక్షరాస్యతా రాష్ట్రంగా ప్రకటింపబడింది. తర్వాత దేశమంతా సాక్షరతా ఉద్యమ ప్రాజెక్టులు మొదలయ్యాయి. కేరళది చాలా గొప్ప అనుభవం. అక్కడి సమాజం, ప్రజాసంస్థలు, ప్రభుత్వం దానిక్కారణాలు. చిత్తూరు, నెల్లూరు, పుదుక్కొటైల్లో ఇది సామాజికోద్యమాలకు కూడా దారితీసింది. కానీ చాలాచోట్ల ప్రచారార్భాటంగా, తప్పుడు లెక్కలమయంగా మారి అభాసుపాలైంది. కొన్నిచోట్ల ఏదో ఓకమేర ప్రభావం చూపించింది. ప్రభుత్వం మారాక కేరళలో యు.డి.ఎఫ్ నిస్సిగ్గుగా పోస్టులిటరసీ ప్రోగ్రాంకు స్వస్తిపలికి గొంతుపిసికేసింది. చిత్తూరు, పుదుక్కొటై కలెక్టర్లు అర్థాంతరంగా బదిలీ అయ్యారు. నెల్లూరు వయోజన వాచకాలపై నిషేధం విధించినంత పనిచేసి మధ్యలో దాన్ని అటకెక్కించారు.
అందరకీ విద్యను గురించి ఇంత ఆర్భాటం చేసే పాలకవర్గాలు మనదేశంలో ఎంత నిస్సిగ్గుగా కిందివర్గాల అరకొర అక్షర జ్ఞానాన్ని కూడా వ్యతిరేకిస్తాయో దీంతో తేటతెల్లమైంది. ప్రజలు చదువుకోడమంటే, ప్రశ్నించడమంటే వాళ్ళకెంత భయమో బహిర్గతమైంది. దీంతో భారతదేశంలో అందరికీ చదువుకు అసలు అడ్డంకి రాజకీయ సంకల్పరాహిత్యమేనని మరోసారి అందరికీ తెలిసొచ్చింది. ఒక్క ప్రపంచబ్యాంకుకు తప్ప.
నూతన విద్యావిధానంలో భాగంగా కొందరికి నవోదయాలు, అందరికీ అనియత కేంద్రాలూ వెలిశాయి. ప్రభుత్వ ప్రాథమిక విద్యావ్యవస్థ అనాథగా మారింది. సమాంతరంగా ప్రైవేటు విద్యకు సకల ప్రోత్సాహాలు లభించాయి. సాంకేతిక విద్య, ఎగుమతి ఆధారిత మార్కెట్ విలువలు ముందుకొచ్చి జాతీయోద్యమ లక్ష్యాలన్నీ గల్లంతయ్యాయి. విద్యారంగ ముఖచిత్రమే మార్కెట్శక్తులకనుకూలంగా మారిపోయింది. ఈ ధోరణి మన రాష్ట్రంలో మరీ విస్తరించింది. కారణం అప్పటికే మన రాష్ట్రం ప్రపంచబ్యాంకు ప్రయోగశాలగా మారడం.
పాఠశాల విద్యలో ప్రయోగాలు
ఇప్పటిదాకా చెప్పుకొన్నవి క్యాంపైన్లు. బాగా వెనకబడ్డ రాజస్తాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో మైనారిటీలపై, గిరిజనులపై, బాలికలపై కేంద్రీకరించి నడిచినవి. అక్షరస్పృహ కల్గించడమో, బడికి సంసిద్దుల్ని చెయ్యడమో లక్ష్యాలుగా మొదలైనవి. ఎప్పుడైనా ఎక్కడైనా చాపచుట్టెయ్యడానికి తగినవి.
రెండోరకం ప్రయోగాలు ప్రాథమిక విద్యపై నేరుగా కేంద్రీకరించి, బడికొచ్చే పిల్లలు లక్ష్యాలుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యక్ష జోక్యం పెట్టుకొన్నవి. 'ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు' వీటిలో మొదటిది. నూతన విద్యావిధానం (1986) ప్రాథమిక విద్యావ్యవస్థను, అనియత విద్యను, వయోజనవిద్యను మూడింటిని సార్వత్రిక విద్యకు ప్రధాన వాహకాలుగా అప్పటికే సూత్రీకరించి వుంది. దీనికనుగుణంగా అనియతవిద్యా కేంద్రాలకు కేంద్రగ్రాంట్లు బాగా పెరిగాయి. వయోజనవిద్య గురించి గతంలో చర్చించుకొన్నాం. ఇక మిగిలింది ప్రాథమికవిద్య. దీనికోసం రాష్ట్ర ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇవి ఎక్కువ భాగం కేంద్రనిధులతో నడిచినవి. కేంద్రమే రూపొందిచినవి. మానవ వనరులశాఖ రాష్ట్రాలకు సాయం అందించడం ద్వారా సాగినవి.
వీటిలో 'ఆపరేషన్ బ్లాక్ బోర్డు (1986) ఏకోపాధ్యాయ పాఠశాలలను, మహిళా టీచర్ల కొరతను, బోధనా సామాగ్రిలేమిని, తరగతిగదుల కొరతను గుర్తించి పరిష్కరించడం లక్ష్యంగా సాగినప్రాజెక్టు. ఉపాధ్యాయ శిక్షణ, మూల్యాంకనం, ప్లానింగు, పరిశోధనల కోసం 1988లో మరొక ప్రాజెక్టు వచ్చింది. TTC లకు ప్రత్యామ్నాయంగా DIET లనిది పునర్నిర్మించింది. కనీస అభ్యసన ప్రమాణాల (MLL) సాధనకు తగ్గ పాఠ్యగ్రంథాలు తదితరాలకోసం 1989లో ఇంకో ప్రాజెక్టు నడిచింది. 1992లో కేంద్ర విద్యాసలహాబోర్డు (CABE) నూతన విద్యా విధానాన్ని సవరించింది. జిల్లాస్థాయి పాఠశాల విద్యాభివృద్ధిని ప్రతిపాదించింది. ఫలితంగా 1993లో DPEP అవతరించింది. దీనికోసం మానవ వనరుల శాఖలో ఒక బ్యూరో ఏర్పడింది. రాష్ట్రాలకయ్యే ఖర్చులో 85శాతం నిధులు కేంద్రమే సమకూర్చింది. విదేశీ నిధులన్నీ దీనిద్వారానే అందేలా కొత్త విధానం వచ్చింది. 1993లో యురోపియన్ యూనియన్, 1994-1996ల్లో ప్రపంచబ్యాంకు, ఆ తర్వాత ODA పెద్ద ఎత్తున నిధుల్ని అందించాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్తాన్లాంటి రాష్ట్రాల ప్రాజెక్టులకోసం ఈ నిధులందాయి.
జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని వికేంద్రీకృత ప్రణాళికల్ని, వ్యూహాన్ని అమలు చెయ్యడం DPEP ప్రధానలక్ష్యం. పంచాయితీలకు బాధ్యతలప్పజెప్పాలని, బాలికావిద్యమీద, చదువుల నాణ్యతమీద శ్రద్ధ పెట్టాలని డిపిఇవి పేర్కొంది. పాఠశాలలపైనా, టీచర్లపైనా నియంత్రణ స్థానిక సంస్థలకున్నచోట్ల ఎంతగొప్ప ఫలితాలొస్తాయో, చివరికి డ్రాపవుట్లు కూడా ఎలా తగ్గిపోతాయో ఎక్కడెక్కడి అధ్యయనాలతో ఇది వివరించింది. ఆంధ్రప్రదేశ్లోంటి రాష్ట్రాల అనుభవాలు అద్భుతంగావున్నాయని కీర్తించింది. 1996 కల్లా 15 పెద్ద రాష్ట్రాలకు విస్తరించి 2001 దాకా నడిచి లెక్కలేనన్ని ప్రయోగాల్ని కుమ్మరించింది.
ప్రధానంగా బడి అందుబాటు, బాలికావిద్య, నాణ్యత, సమర్థత డిపిఇపి లక్ష్యాలు. అందుబాటుకోసం కోరినచోట్ల స్కూళ్ళుపెట్టారు. ఒక గది, ఒక వరండా, 23 వి.బాలసుబ్రమణ్యం ఒక టీచరు వుంటేచాలు. డిపిపి లెక్కల్లో బడి అంటే ఇదే. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు వాడ వాడలా ఇలా వెలిశాయి. రాజీకీయ నాయకులు పోటీపడి వీటిని పెట్టించారు.
ఫలితాలు-పర్యవసానాలు
అ తర్వాత ఏం జరిగింది? ఊరిలోని బడి ముక్కలై పిల్లలు చెల్లాచెదురై అన్ని స్కూళ్ళు అనియత కేంద్రాల స్థాయికి చేరుకొని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. అయిదారేళ్ళకే పిల్లలు లేరని మూతబడేస్థితికొచ్చాయి. రాష్ట్రంలో పట్టుమని పదిశాతం కూడా అయిదు తరగతులకు అయిదుగదులూ, అయిదుగురు టీచర్లుండే స్కూళ్ళు లేకుండా పోయాయి. ఈ వికారాన్ని బాగా తలకెక్కించుకున్న రాష్ట్రాలు రెండు. ఒకటి మనదీ, రెండోది మధ్యప్రదేశ్. కేరళ ఈ 'అందుబాటు' బడుల జోలికి పోలేదు. తమిళనాడు స్థానికులు బడి అవసరమనుకొంటే, కనీసం రెండేళ్ళు తాము నిర్వహించుకొంటే, ఆ తర్వాతే కొత్తబడిని మంజూరు చేసింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మాత్రం కొత్తస్కూళ్ళకనుమతించింది. కేరళ తరగతికొక టీచరులేని స్కూలు ఒక్కటీ లేకుండా జాగ్రత్తపడింది. కొన్ని రాష్ట్రాలు డిపిఇపి నిధులతో మంచి పాఠశాలలుగా తమ పాఠశాలల్ని మార్చుకొనే ప్రయత్నం చేశాయి. అందువల్లనే అవి బాగుపడ్డాయి! ఈ డిపిఇపి అస్తవ్యస్త నిర్వాకమే నేటి మన రాష్ట్ర ప్రాథమిక విద్యాదుస్థితికి ప్రధాన కారణం. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమంటే ఎక్కడినుంచో ప్రాజెక్టులు తెచ్చుకొంటే సరిపోదు. అవి మనకు ఎంత సరిపడతాయో చూచుకోవాలి. వాటిని మన వ్యవస్థల్ని మరింత పటిష్టం చెయ్యడానికి ఉపయోగపడేలా మలచుకోవాలి. ఇది మన ప్రభుత్వాల బాధ్యత.
ఇక బాలికా విద్యకోసం చేసిందేమిటి? బాలికల నమోదు తక్కువగా వున్నచోట ఒక ప్రధానోపాధ్యాయుడిని (LFL HM) నియమించారు. దీనివల్ల ఒక టీచరు పోస్టు అదనంగా వచ్చిన మాటనిజం. కానీ దానికి తొందరలోనే కాలం చెల్లింది. రేషనలైజేషన్కు బలైంది. బాలికల చదువు గొంగళి వేసిన చోటే వుండిపోయింది.
డిపిఐపి ప్రధానలక్ష్యాల్లో ఒకటి అభ్యసన నాణ్యతను పెంచడం. టీచర్లకు శిక్షణనిచ్చి, మంచి బోధనా సామాగ్రి నందిస్తే నాణ్యత దానికంత అదే వస్తుందని అది నమ్మింది. మనల్ని నమ్మించింది. ఇంకేముంది? ఎక్కడెక్కడి స్వచ్ఛంద సంస్థలతో, విద్యారంగ నిపుణులతో, రిసోర్సు పర్సన్స్తో కొత్త కొత్త పాఠ్యగ్రంథాలతో, సాహిత్యంతో మన ప్రాథమిక పాఠశాలలన్నీ నిండిపొయ్యాయి. ప్రాజెక్టు నిధుల్లో పెద్దభాగం శిక్షణలకే కేటాయించారు. డిపిఇపి అంటే ట్రైనింగులు అనే స్థితికొచ్చింది. బడిమానేసి టీచర్లెప్పుడూ ట్రైనింగుల్లో మునిగితేలారు. కొందరైతే డిప్యుటేషన్లపై దీనికే అంకితమయ్యారు. చివరికీ శిక్షణలు నిధులు ఖర్చు చెయ్యడం కోసమే అన్నట్టు తయారయ్యాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో సంస్థ తమ బోధనా సామాగ్రిని కుమ్మరించింది. అయితే కొన్ని సంస్థలు గొప్ప ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. కానీ అవి క్షేత్రస్థాయికి సరిపోక, కొనసాగింపు లేక మారడానికేమాత్రం టీచర్లు ఇష్టపడక అ ఆలు దిద్దించడం దగ్గరే ఆగిపోయాయి. ఒకరిద్దరు టీచర్లతో నడిచే స్కూళ్ళలో టీచర్లు నిరంతర శిక్షణలతో సతమతం కావడంతో పాఠాలు చెప్పేవారే కరువయ్యారు. ఇది తీవ్రనష్టం తెచ్చింది.
ఇక చివరిది యాజమాన్య, నిర్వహణా, పర్యవేక్షణా పద్ధతుల్లో నాణ్యతను పెంచడం. దీనికోసం ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించడం మొదలైంది. రాష్ట్ర కేంద్రానికి దీన్ని పంపడం కోసం సవాలక్ష ఫారాలు, వీటిని నింపడానికి మళ్ళీ శిక్షణలూ వచ్చాయి. ఆరోజుల్లో “పాఠాలు చెప్పడం మరిచిపొయ్యాం, ఫారాలు నింపడం నేర్చుకొన్నాం” అని ఓ ఉపాధ్యాయురాలు మంచి కవిత రాసినట్టు గుర్తు. దీంతో చదువులు వెనక్కి వెళ్ళాయి. టీచర్లు ఈ పనితోనే సతమతమయ్యారు. ప్రభుత్వానికి కూడా కావల్సింది సమాచారమే తప్ప చదువులు గాదని టీచర్లూ అర్థం చేసుకొన్నారు. అప్పటి నుంచి బడిలోని ప్రతిపనికీ, ప్రతికదలికకీ ఒక ఫారం నింపి పంపడం అలవాటైంది. డిపిఇపి నుంచే ఈ రుగ్మత మొదలై నేడు యాప్ల అవతారమెత్తింది.
మంచి విద్యకు బలమైన పాఠశాల వ్యవస్థ, తగినంత మంది టీచర్లు, మంచి వసతులు, శాస్త్రీయ అభ్యసన పద్ధతులు, స్థానిక పర్యవేక్షణ కీలకమైనవి. వీటిని డిపిఇపి ఒప్పుకో నిరాకరించింది. గ్రామీణ పేదరికాన్ని, సామాజికార్థిక పరిస్థితుల్ని మరిచిపోయింది. అయిదు తరగతులకు ఒకరిద్దరు టీచర్లనిచ్చి, సగానికి సగం రోజులు వారిని శిక్షణలతోనే సతమతమయ్యేలా చేస్తే ఆ బడిలో ఏం చదువొస్తుందన్న కనీస స్పృహ దానికి లేకపోయింది. బడికీ ఇంటికీ ఒక కిలోమీటరే భౌతిక దూరంగావచ్చు. వాటిమధ్యగల సామాజిక దూరమెంతో అది గుర్తించలేక పోయింది. యాంత్రికంగా ఆధునిక కాలానికేమాత్రం పనికిరాని ఒంటిగదుల బడులు పెట్టి, శిక్షణలతో, సామాగ్రితో, ఫారాలతో అంతా మారిపోతుందని అందర్నీ భ్రమల్లోకి నెట్టింది. కేరళ తమిళనాడులే గాదు హిమాచల్ ప్రదేశ్లోంటి రాష్ట్రాల పాఠశాల వ్యవస్థల్ని, పాలనా పద్దతుల్ని కూడా ఏ మాత్రం చూడనిరాకరించింది. మనం కూడా అమాయకంగానో, సహించినట్టుగానో ఈ భ్రమల్లో పడ్డాం.
డిపిఇపి చేసిన నిర్వాకాల్లో ప్రమాదకరమైనది సమాంతర వ్యవస్థల్ని నిర్మించడం. ఉన్న వ్యవస్థల్ని నీరుగార్చడం. కన్సల్టెంట్లు, ప్రాజెక్టు అధికారులు, డేటా విశ్లేషకులు, విషయ నిపుణులు, స్వచ్ఛందసంస్థలు మొత్తంవిద్యా వ్యవస్థను ఆక్రమించేశారు. వీరిది ఇష్టారాజ్యమైంది. రాష్ట్ర విద్యా పరిశోధనామండలి (SCERT), జిల్లావిద్యా శిక్షణా సంస్థలు (DIETS) బక్కచిక్కిపొయ్యాయి. అసలు విద్యాశాఖే వెలవెలబోయింది. ప్రాజెక్టుల పెత్తనంలోకి జారిపోయింది. యునిసెఫ్ నుంచి రుషీవ్యాలి దాకా ఒక్కొకరు ఒక్కోప్రాంతంలో తమ అభ్యసన సామాగ్రిని ప్రయోగించారు. నిధులూ, కాలపరిమితీ అయిపోగానే ఇవన్నీ అదృశ్యమయ్యాయి. దీర్ఘకాలిక బోధనా విధానాలు, వాటికి తగ్గ ప్రామాణిక సామాగ్రి, కొనసాగింపు ఒక స్పష్టమైన విధానం లేకపోవడంతో పెద్ద అభ్యసన నష్టం వాటిల్లింది. దీన్ని మనమూ కళ్ళప్పగించి చూస్తూవుండిపొయ్యాం.
విద్యారంగంలోకి ఇతరశాఖల్లోని అధికార్లు, బయటి వారూ కూడా జొరబడి ప్రముఖస్థానాలు ఆక్రమించడంతో విద్యాశాఖ పెద్దపునరావాస కేంద్రంగా మారింది. నిధులు పుష్కలంగా లభ్యం కావడంతో ఎక్కడెక్కడి శక్తులూ, సంస్థలూ జొరబడ్డాయి. అవినీతిలో విద్యాశాఖ కూడా దేనికీ తీసిపోదన్న నిందని వెంటబెట్టుకొచ్చాయి. ఈ కాలంలో కట్టిన భవనాలు, అందించిన ఫర్నిచర్, పుస్తకాలు, ఇతర సామాగ్రిని చూస్తే ఎంతనాసిరకమైనవో, ఎన్నివేలకోట్ల అవినీతి జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది.
కేంద్ర నిధులు ఆగిపొయ్యాక అది వదిలిపెట్టిన వ్యవస్థల్ని, ఉద్యోగుల్ని, విధానాల్ని కొనసాగించడం రాష్ట్రాలకు తలకు మించిన భారమైంది. రాజకీయ నిబద్ధత, దూరదృష్టి లేని రాష్ట్రాల్లో ఈ లోపం మరింత స్పష్టంగా కన్పించింది. ఆంధ్రప్రదేశ్ కూడా వీటిలో ఒకటి.
ఇదేకాలంలో నూతన ఆర్థిక విధానాలతో ప్రైవేటు విద్య, దానిపట్ల మోజు కూడా పెరిగిపొయ్యాయి. ప్రజల ఆకాంక్షల్ని అడ్డం పెట్టుకొని ప్రైవేటు రంగం విద్యచుట్టూ ఒక వినిమయ సంస్కృతిని వ్యాపింపజేసింది. వీటినెదుర్కొని పిల్లలందరినీ ఊరిబడిలోనే చదివించేంత బలమైన పాఠశాల వ్యవస్థ మనదగ్గరలేదు. కొత్త అవసరాలకు తగ్గట్టు పాఠశాలల్ని ఆధునీకరించే సంకల్పంగానీ, పిల్లలందరూ తారతమ్యాలు లేకుండా ఒకేచోట చదువుకోవాలనే దృక్పథంగానీ మన కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు లేకపోయింది. పైపెచ్చు మన రాష్ట్రం ఊరిబడిని మరింత నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యాపారానికి రాచబాట వేసింది. విద్యలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని తగ్గించడం, కరిక్యులం పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు స్థానిక పరిస్థితులకు సంబంధం లేకుండా రూపొందించడం కూడా పెద్ద సమస్య. ఒక్క కేరళ మాత్రమే దీనికి భిన్నంగా వ్యవహరించగల్గింది. బలమైన పాఠశాల వ్యవస్థవున్న హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ప్రైవేటు రంగాన్ని చాలావరకు నిలవరించగలిగాయి. డిపిపి పుణ్యంతో వ్యవస్థలు కుప్పగూలిన మనలాంటి రాష్ట్రాల్లో పేదలకు కూడా ప్రైవేటు విద్యే శరణ్యమైంది.
డిపిఐపి 18 రాష్ట్రాల్లోని 272 జిల్లాల్లో 14 సంవత్సరాలపాటు సాగింది. అయిదు కోట్ల మంది పిల్లలు దీన్నుంచి లబ్ధి పొందారు. దీనివల్ల ఏ ప్రయోజనమూ దక్కలేదని ఎవ్వరూ అనరు. వేలాది పాఠశాలలు కొత్తవి ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యావ్యవస్థ మారుమూలకూ విస్తరించింది. వేల టీచర్ల పోస్టులు మంజూరయ్యాయి. ఒక మేరకైనా సార్వత్రిక విద్య సామాజిక అజండాలోకి వచ్చింది. దీనికి మారుతున్న సామాజికార్థిక పరిస్థితులు కూడా తోడ్పడ్డాయి. దీర్ఘదృష్టి అంతో ఇంతో వున్న రాష్ట్రాల్లో దీని నిధులు బాగానే వుపయోగపడ్డాయి. మంచి అధికార్లు, మంచి సామాజిక సంస్థలు, విద్యాప్రయోక్తలు జోక్యం పెట్టుకొన్నచోట పాఠశాల విద్యాబోధనాభ్యసనాల్లోకి కొత్తగాలులు వీచినమాట నిజం. మంచి సాహిత్యం, గొప్ప ప్రపంచానుభవాలు కూడా మొదటిసారి మనకు లభించాయి.
కానీ ఇవన్నీ పాక్షిక, తాత్కాలిక ఫలితాలు. నిలకడలేనివి. చాలాభాగం క్షేత్రస్థాయికి సరిపోనివి. అసలు విషయం ఏమంటే కేంద్రమూ, ప్రపంచబ్యాంకు వ్యవస్థాగత సమస్యలను సాంకేతిక పరిష్కారాలతో, సామాజిక అవరోధాలను అకడమిక్ సమాధానాలతో రాజకీయ విధానాలను యాజమాన్య నైపుణ్యాలతో అధిగమించవచ్చునని నమ్మబల్కడం. ఎన్ని వైఫల్యాలు ఎదురుగ్గా కనబడుతున్నా పండిత విశ్లేషణలతో మభ్యపెట్టడం.
అలాగే ఉపాధ్యాయుల్ని నమ్మడం, ప్రోత్సహించడం, స్వేచ్ఛనిచ్చి వారిని ముందు నిలబెట్టడం కూడా ఏ మాత్రం జరగని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. నిలకడగా ఓపిగ్గా సృజనాత్మకబోధనను ఒక సంస్కృతిగా పాఠశాలల్లోకి తేవడంలో కర్ణాటక, తమిళనాడు, కేరళలతో పోలిస్తే మనరాష్ట్రం ఘోరంగా విఫలమైంది. అంతా యాంత్రిక అధికారతంతుగా మారిపోయింది. ఉపాధ్యాయులు కూడా స్తబ్ధంగానో విముఖంగానో వుండిపోయారు తప్ప మార్పును స్వీకరించడానికేమాత్రం సిద్ధపడలేదు. ఇది మరీ బాధాకరం.
అంతర్జాతీయ తీర్మానాలు - అందరికీ విద్య (EFA)
ఇరవై ఒకటో శతాబ్దంలోకి భారత్ ప్రవేశించేప్పటికి ప్రపంచీకరణ వేగం బాగా పుంజుకొంది. దీన్ని వెన్నంటి 'అందరికీ విద్య అంతర్జాతీయ అజండా' (Inter- national Agenda of Education for All) ముందుకొచ్చింది. దాకర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ యాక్షన్ (2001) భారతదేశపు విద్యాభివృద్ధికి దిక్సూచిగా మారింది. సార్వత్రిక విద్యాలక్ష్యానికి 2015 కొత్తగడువుగా నిర్ణీతమైంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమీక్షలు, అధ్యయనాలు Education for All(EFA) పై వెలువడసాగాయి.
ఈ క్రమంలోనే విద్యాహక్కుచట్టాన్ని సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం వామపక్షాల వొత్తిడితో రాజ్యాంగానికి 86వ సవరణచేసి పార్లమెంటు ఆమోదించింది. విమర్శలు, అనుమానాలు దీనిపై ఎన్ని వున్నప్పటికీ స్వాతంత్య్రానంతరం 60 ఏళ్ళకైనా, ఈ మాత్రపు చట్టమైనా రావడాన్ని అందరూ ఆహ్వానించారు. కనీసం ఇప్పటికైనా మన పాలకులు ప్రాథమిక విద్యను ఒక హక్కుగా మాటవరసకైనా అంగీకరించారని సంతోషపడ్డారు. కానీ ప్రపంచంలోని చాలాదేశాలు ఇప్పటికే విద్యాభివృద్ధిలో ఎంతోదూరం వెళ్ళిపొయ్యాయి. సుస్థిర సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి ఒక సామాజిక పునాది అవసరమనీ, అది సార్వత్రిక విద్యతోనే సాధ్యమని గుర్తించిన దేశాలన్నీ ముందుకెళ్ళాయి. అంతర్జాతీయ అజండా 6-14 సం||ల పిల్లల చదువుకే పరిమితంగావడం కూడా విద్యాలక్ష్యాల్లో మనమెక్కడున్నామో చెప్పకనే చెప్పినట్లయిందని
మనం విస్మరించకూడదు. రెండవ భాగం
(ప్రస్తుత ధోరణులు-విధానాలు)
క్రమంగా 'అందరికీ విద్య' సామాజిక ఆకాంక్షగా మారడంతో, ప్రపంచీకరణ యుగంలో నిరక్షరాస్యత మనల్ని మరీ వెనక్కి నెడుతుందన్న భయంతో డిపిఇపి లాంటి చెల్లాచెదురు ప్రాజెక్టుల స్థాయిలో దేశమంతా నిర్ణీత లక్ష్యాలతో అమలయ్యే "సర్వశిక్షాభియాన్"ను కేంద్రం 2001లో ప్రారంభించింది.
సర్వశిక్షాభియాన్
గత ప్రాజెక్టులకు భిన్నంగా ఇది కేంద్ర నిధులతో, రాష్ట్రాల భాగస్వామ్యంతో దీర్ఘకాలిక 'అభియాన్'గా అమల్లోకి వచ్చింది. దేశంలోని 6-14 సంవత్సరాల మొత్తం 20.6 కోట్లు పిల్లల్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎనిమిదేళ్ల ఉచిత ప్రాథమిక విద్య, ప్రతి నివాస ప్రాంతానికి పాఠశాల కల్పించడం, వెనకబడిన వర్గాలపై, బాలికలపై కేంద్రీకరణ, డ్రాప్‌అవుట్లను గణనీయంగా తగ్గించడం, టీచర్ల కొరతను నివారించడం, వారి నాణ్యతను పెంచడం, అభ్యసన ఫలితాలను ఎప్పటికప్పుడు మదింపు చేయడం, భవనాల నిర్మాణం, వసతుల కల్పనలాంటివి తక్షణ కర్తవ్యాలుగా నిర్వచించింది. గత ప్రాజెక్టులకు భిన్నంగా ఇది కేంద్రం నుంచి మండలాల దాకా తన స్వంత యంత్రాంగాన్ని నిర్మించింది. మధ్యాహ్న భోజన పథకం కూడా దీనికి తోడుగా నిలిచింది. EFA-2014 సమీక్ష ప్రకారం ప్రాథమిక పాఠశాలలు 2001-2014 మధ్య 6,38,738 నుంచి 8,58,916కి, ప్రాథమికోన్నత పాఠశాలలు 2,06,269 నుంచి 5,89,796కి పెరిగి 98 శాతం గ్రామీణ నివాస ప్రాంతాల్లోకి విస్తరించాయి. ప్రాథమిక పాఠశాలల్లో నమోదు 11.38 కోట్లు నుంచి 13.24 కోట్లకు పెరిగింది. అప్పర్ ప్రాథమరీ నమోదు 4.28 కోట్లు నుంచి 6.65 కోట్లకు చేరుకొంది. కానీ జాతీయనమోదు నిష్పత్తి (NER) ప్రాథమిక
విద్యలో 88.1శాతం కాగా అప్పర్ మరీ నమోదులో దేశం వెనబడే వుందని EFA
సమీక్ష వెల్లడించింది. వెనకబడ్డ SC, ST మైనారిటీ పిల్లల నమోదు కూడా గణనీయంగా
పెరిగినట్టు ఈ రిపోర్టు పేర్కొంది. డ్రాపవుట్లు ప్రాథమిక విద్యలో 15. 8శాతం,
ప్రాథమికోన్నత విద్యలో 11.4శాతం 2001-2009 మధ్య తగ్గినట్టు చెప్పుకొచ్చింది.
ప్రాథమిక పాఠశాలల్లో చేరే మొత్తం పిల్లలో బాలికలు 48.2శాతానికి, అప్పర్ ప్రైమరీలో
48.6శాతానికి చేరినట్టు కూడా లెక్కలు చూపించింది. టీచర్ల సంఖ్య 52 లక్షల
నుంచి (2007) 77 లక్షలకు (2014) పెరిగినా, TPR 25:1కి తగ్గినా పిల్లల
అభ్యసన ప్రమాణాల్లో మాత్రం రాష్ట్రాల మధ్య చాలా వ్యత్యాసాలున్నట్టు ఆందోళన
వ్యక్తం చేసింది.
ఈ సమీక్ష ఆధారంగా అప్పర్ ప్రైమరీ సెకండరీ విద్యలపై శ్రద్దనూ, వెనకబడిన వర్గాల పిల్లల డ్రాపవుట్స్పై మరిన్ని చర్యలను, హాజరుపై విద్యాప్రమాణాలపై కేంద్రీకరించడాన్ని ప్రధానకర్తవ్యాలుగా ఈ సమీక్ష ప్రతిపాదించింది. నాణ్యతకోసం శిశువిద్య అవసరమని తొలిసారి పేర్కొంది.
ఇంతా చెప్పి విద్యారంగాన్ని నిధులకొరత వేధిస్తోందని వినబడీ వినబడనంత మెల్లగా చెప్పి సరిపెట్టుకుంది. ఐసిటిని సమర్థవంతంగా వాడుకొని, వృత్తి విద్యాకోర్సులతో రెగ్యులర్ విద్యను అనుసంధానం చెయ్యడం ద్వారా ఈ సమస్యల్ని అధిగమించ వచ్చునని తేలిగ్గా తేల్చేసింది. విద్యాహక్కు చట్టమనే బ్రహ్మాస్త్రం మనచేతిలో వుందని భరోసాఇచ్చింది.
కొంచెంలోతుగా పరిశీలిస్తే ఒక్క శిశువిద్య (ECCE) తప్ప సర్వశిక్షాభియాన్ నిర్దేశించుకొన్న లక్ష్యాల్లో డిపిఇపి తదితర ప్రాజెక్టులు చెప్పినవి గాక కొత్తవేమీలేవు. కాకుంటే ఇది దేశం మొత్తానికీ వర్తించే దీర్ఘకాలిక ప్రాజెక్టు. దీనికి నిధుల్ని కేంద్రం, రాష్ట్రాలే సమకూర్చాయి.
ఇక సాధించినట్టు చెప్పుకొన్న విజయాలు కూడా గణాంకాల గారడీలే. పాఠశాలల్లో నమోదు పెరగడానికి మారుతున్న కాలానికనుగుణంగా పుట్టుకొచ్చిన ఆకాంక్షలూ, సామాజికంగా పెరుగుతున్న స్పృహ, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులు ప్రధానకారణాలు. ఈ “చైతన్యమే” దిగువ మధ్యతరగతి వర్గాన్ని సైతం ప్రైవేటు విద్యవైపు పరుగులెత్తించింది. నిజానికి ఎంతకాలమూ పిల్లల్ని చాకిరీకే కట్టేసి వుంచడం పాలకులకు సాధ్యంగాని స్థితినీ, పేదల చదువు అంతో ఇంతో తప్పనిసరవుతున్న పరిస్థితినీ కాలమే మోసుకొచ్చింది. మారిన సామాజికస్పృహకు తగ్గట్టుగా ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించి వుంటే ఫలితాలు మరోలావుండేవి. కానీ ఇప్పటికీ జిడిపిలో విద్యకు 6శాతం కేటాయింపు జరగలేదు. ప్రాథమిక విద్యనుదాటి మనలక్ష్యం ముందుకెళ్ళనేలేదు. అందరికీ నాణ్యమైన సమానమైన విద్యకోసం 'కామన్ స్కూలు’ ప్రపంచమంతా అంగీకరించిన సూత్రమని మనపాలకులు ఒప్పుకోనూ లేదు. కాకుంటే కొద్ది మంది కోసం ప్రభుత్వం కూడా గురుకులాలు, మోడలైహైస్కూళ్ళు, కస్తూర్బా విద్యాలయాలు మొదలెట్టింది. డిపిపి అక్షరజ్ఞానంతో సరిపెడితే, సర్వశిక్షాభియాన్ పేదలకు ప్రభుత్వ పేదవిద్య, ఉన్నత వర్గాలకు ప్రైవేటు కార్పొరేటు విద్య అన్న విభజనను స్థిరపరిచింది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ప్రాథమిక విద్యలో కూడా ఆకాశానికీ పాతాళానికీ వున్న అంతరం మనదేశంలో అందరూ అంగీకరించిన వాస్తవంగా మారి పోయింది. యునెస్కో అధ్యయనం ప్రకారం 2012లో ప్రపంచ పాఠశాల విద్యార్థుల్లో 12శాతం ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతుంటే మనదేశ విద్యార్థులు 40శాతం ప్రైవేటు బాటపట్టారు!
సర్వశిక్షాభియాన్ పేరుకు కేంద్ర ప్రాయోజిత పథకమైనా దాని యంత్రాంగం, పనివిధానం, లక్ష్యాలు, వ్యుహాలూ నిర్వచనాలూ మొత్తం ప్రపంచబ్యాంకు ప్రాజెక్టులకు కార్బన్ పేపర్లే. బలమైన పాఠశాల వ్యవస్థనది ఎప్పుడూ ప్రస్తావించిన పాపాన పోలేదు. అకడమిక్ చిట్కాలతో, సాంకేతిక చమత్కారాలతో అన్ని సమస్యల్ని అధిగమించవచ్చునని అది నమ్మింది. మనల్ని నమ్మించింది. టీచర్ల శిక్షణలతో అంతా మారిపోతుందని భ్రమపెట్టంది. విద్యాశాఖను నిర్వీర్యం చేసి సమాంతర తాత్కాలిక వ్యవస్థల్ని పోటీగా నెలకొల్పడం, ఎక్కడెక్కడి వారినీ విద్యాశాఖలోకి దూర్చడం, అవధుల్లేని అవినీతిని మోసుకురావడంతోపాటు కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థను చొప్పించడం సర్వశిక్షాభియాన్ అదనంగా చేసిన నిర్వాకాలు.
ఫలితంగా గ్రామీణ పాఠశాల వ్యవస్థ మరీ బలహీన పడింది. పిల్లలు కరువై బడులు మూతబడసాగాయి. ప్రతిసంవత్సరం రేషనలైజేషన్లూ, క్లస్టరైజేషన్లూ మామూలైపొయ్యాయి. ప్రాణంలేని బడుల్లో సారంలేని చదువులతో నిరుపేదలు మాత్రమే మిగిలారు. పిల్లల చదువులపట్ల తమలో పెరిగిన స్పృహ చివరకు ప్రజలపాలిట శాపంగా మారింది. దీన్ని అవకాశంగా మార్చుకొని కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పిచేశాయి. నూతన ఆర్థికవిధానాలూ, ప్రపంచీకరణా ఏరంగంలోనూ సాధించని "విజయాల్ని” విద్యారంగంలో సాధించాయి! చదువుల్లోకి మార్కెట్ శక్తుల్ని తేవడమేగాదు మార్కెట్భావజాలాన్ని కూడా ప్రపంచబ్యాంకు అత్యంత సమర్థవంతంగా తీసుకురాగల్గింది. మనదేశంలో ఎయిడెడ్ విద్యాసంస్థలకు గొప్పచరిత్రవుంది. జాతీయోద్యమం, సంస్కరణోద్యమాల నేపథ్యంలో మిషనరీలు, విద్యాదాతలు, సేవాసంస్థలు ప్రారంభించిన పాఠశాలలివి. ఏ రాష్ట్రాల్లో ఎయిడెడ్ వ్యవస్థ బలంగావుందో, దానికి ప్రభుత్వ సహకారం చెక్కుచెదరకుండా అందుతోందో ఆ రాష్ట్రాలు విద్యాభివృద్ధిలో ఎంతో ముందున్నాయి. కేరళ దీనికి గొప్ప దృష్టాంతం. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లోనూ ఈ ధోరణిని స్పష్టంగా మనం చూడొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశూ గొప్ప ఎయిడెడ్ విద్యాసంస్థల వారసత్వం వుంది. కానీ ప్రపంచబ్యాంకుతో కుదుర్చుకొన్న ఆర్థిక సంస్కరణల ఒప్పందాల్లో భాగంగా 2004 నుంచి అన్ని రంగాల్లో నియామకాలు నిలిపివేశారు. మన రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు షరతుల్ని ఎయిడెడ్ విద్యాసంస్థల పోస్టులభర్తీని నిలిపివేయడంలో స్పష్టంగా చూడొచ్చు. ఫలితంగా ఇవి చిక్కి శల్యాలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థ జడలు విప్పడానికిది దారితీసింది. ఇప్పుడు ఏకంగా మొత్తం ఎయిడెడ్ విద్యాసంస్థల్ని మూసెయ్యడానికి
ప్రభుత్వం పూనుకొంది.| ఎయిడెడ్ విద్యార్ధులశాతం (2019-20) మహారాష్ట్ర - 45.92 |
విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ కార్పొరేట్ క్రూర దోపిడీకి, కుహనా విద్యకూ, కనీవినీ ఎరుగని మార్కెట్ సంస్కృతికీ గొప్ప రంగస్థలంగా మారింది. ఫలితంగా గ్రామీణవిద్య పతనావస్థకు చేరి ప్రతిసారీ దేశంలో అట్టడుగు ర్యాంకుకు పరిమితం కాసాగింది. నీతి ఆయోగ్ SDG సూచిక-2021 రాష్ట్రాలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో మూడవ కేటగిరిలో 50 పాయింట్లతో చివరి స్థానం మనకు దక్కింది. కేరళ, హిమాచల్, తమిళనాడులేగాదు హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లతోపాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లు కూడా మనకంటే ముందున్నాయి. ఇక Performance Grading Indexలో మనది 811 పాయింట్లతో 18వ స్థానం. పైన చెప్పుకొన్న రాష్ట్రాలతోపాటు ఒరిస్సాకూడా మనకంటె మెరుగ్గావుంది.
మళ్ళీ 'స్టార్స్’లూ, ‘సాల్ట్'లూ!
సర్వశిక్షాభియాన్ని కేంద్రం 2026 దాకా ఇటీవల పొడిగించింది. కానీ నిధుల్లో రాష్ట్రప్రభుత్వాల వాటా రాను రాను పెరగసాగింది. కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ హైస్కూళ్ళులాంటివి మొయ్యలేని భారంగా మారాయి.
ఒక్కో రాష్ట్రంలో పాతిక వేలకు తక్కువ లేకుండా పలునామధేయాలతో పనిచేస్తున్న ఉద్యోగులు కనీసం తమకు టైంస్కేలు అయినా ఇమ్మని వీధికెక్కసాగారు. విద్యాప్రమాణాలు నాసిరకంగా, బడులు మూసివేతదిశగా వున్నదశలో ప్రపంచబ్యాంకు మళ్ళీ రంగ ప్రవేశం చేసింది. స్టార్స్ (Strengthening Teaching Learning and Results for States - STARS) పేర కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలకు పాఠశాల విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యంగా రు.5718 కోట్ల ప్రాజెక్టును మంజూరు చేసేందుకు ఇటీవలే కేంద్రవిద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకొంది. ఇందులో రు.3700కోట్లు (50కోట్ల డాలర్లు) ప్రపంచబ్యాంకు అందిస్తుంది. మిగిలినది రాష్ట్రాలు భరించాలి.
స్టార్స్ చేప్పేదేమిటి? “ప్రభుత్వ పాఠశాల విద్యలో నాణ్యతలేదు. దీనికోసం విద్యావవస్థను సంస్కరించాలి. అనుభవంగల Non States Actors ను వినియోగించుకోవాలి. ప్రభుత్వజోక్యాన్ని తగ్గించాలి. ప్రభుత్వ సేవలను ఔట్సోర్సింగు చెయ్యాలి. ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో స్థానిక భాగస్వామ్యాన్ని పెంచాలి. రాష్ట్రసంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక విజ్ఞానం ద్వారా అభివృద్ధి చెయ్యాలి. తల్లిదండ్రుల ఆకాంక్షలకు తగ్గట్టు జవాబుదారీతనాన్ని పెంచాలి. పేదపిల్లల డేటాను విస్తృతంగా సేకరించి విశ్లేషించడంద్వారా విద్యలో వారి వెనకబాటుతనాన్ని నివారించవచ్చు. నర్సరీ పిల్లల్ని కూడా బడిలో చేర్చాలి”. ఇదంతా కేవలం 3700 కోట్లతో జరిగిపోతుందా? ప్రపంచబ్యాంకు నిజంగా నమ్మిచేస్తున్న పనేనా ఇది! ఏ కోణం నుంచి చూచినా దేశంలోనే విద్యాభివృద్ధిలో ముందున్న కేరళకు ఈ పాఠాలు ఏమవసరమో మనకు తెలియదు. కేరళనూ, రాజస్తాన్ నూ ఒకటిగా ప్రపంచబ్యాంకు ఎందుకు కట్టేసిందో మనకర్థంగాదు. మహారాష్ట్ర బలమైన ఎయిడెడ్ పాఠశాలల పునాది గల రాష్ట్రం. రాజస్తాన్ స్కూళ్ళ మూతలో పేరెన్నికగన్న రాష్ట్రం. మధ్యప్రదేశ్ బలహీనమైన వ్యవస్థలు గలది. డిపిఇపి, సర్వశిక్షాభియాన్ దాదాపు నలభైఏళ్ళ నుంచి చెపుతున్నవి ఇవేగదా. మళ్ళీ పాతపాటే ఎందుకు పాడుతున్నట్లు? అంటే ఇప్పటికీ ఎక్కడి గొంగళి అక్కడే వుండి పోయిందా? ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్రియాశీల జోక్యం పెట్టుకోబట్టే కేరళ, హిమాచల్ ప్రదేశ్ు పాఠశాల విద్యలో ముందున్నాయి. మరి ప్రపంచబ్యాంకు ఈ జోక్యాన్ని తగ్గించి అక్కడి చదువుల్ని మరింత మెరగుచెయ్యదల్చుకొందా? బలమైన ప్రభుత్వ అకడమిక్, పాలనా, పర్యవేక్షణా వ్యవస్థల్ని నిర్వీర్యంచేసి అన్ని సేవల్ని ప్రైవేటు అప్పజెప్పడమేనా ప్రపంచబ్యాంకు పరమార్థం? విద్యారంగ ప్రైవేటీకరణ గురించీ, ప్రభుత్వ బడ్జెట్లు ఏమాత్రం పెరగకపోవడం గురించీ, లక్షల టీచర్ల పోస్టులు ఖాళీగా వుండటంగురించీ. ప్రపంచబ్యాంకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పదు? విద్యపట్ల కనీసబాధ్యత లేని మన రాజకీయ వ్యవస్థను ఎందుకు ప్రశ్నించదు? ఇవన్నీ వదిలేసి మళ్ళీ సాంకేతిక పరిజ్ఞానంతో సకల సమస్యలు పరిష్కారమవుతాయంటోంది. దేశాన్ని విశ్వగురువుగా మారుస్తామని చెపుతున్న కేంద్రం ఈ ప్రాజెక్టుల్ని దేనికోసం అంగీకరించినట్టు? గతానుభవాల నుంచి ఏ పాఠమూ ఎందుకు తీసుకో నిరాకరించినట్టు? ఇలా చూస్తే అసలు ముద్దాయి బి.జె.పి. ప్రభుత్వమే, మన విద్యావ్యవస్థ మరింత డొల్లగామారి, మరింత కార్పొరేటీకరణ జరగాలనే ఈ ప్రాజెక్టుకది స్వాగతం పలికింది. నీతి ఆయోగ్ ఉపదేశాల్ని చూస్తే మనకిది స్పష్టమవుతుంది.
“సాల్ట్" చెపుతున్నదేమిటి?
సరికొత్త 'స్టార్స్' ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ లేదు. మన రాష్ట్రమే వెంటబడి తెచ్చుకొందో, ప్రపంచబ్యాంకే ముచ్చటబడి ఇచ్చిందో తెలియదుగానీ SALT(Supporting Andhras Learning Transformation) ప్రాజెక్టు కోసం ఒప్పందాలు జరిగాయి. ఇటీవల (2021 మే 20న అధికార యంత్రాంగ అవసరాలకోసమంటూ ఒక రిపోర్టును అంతర్జాలంలో పెట్టింది. దీని ఆధారంగా “పదేళ్ళ తర్వాత ప్రత్యేక ప్రాజెక్టు మనకు మంజూరైందనీ, తగు సామర్థ్యంవుంటే ఇతర రాష్ట్రాలకూ ప్రపంచబ్యాంకు దీన్ని విస్తరింప జేస్తుంద”ని జూన్ 26న విద్యాశాఖ మంత్రిగారు ప్రకటించారు. 'అంతర్జాతీయ కన్సెంటెంట్లను ఎంపిక చేస్తున్నామని, సర్వశిక్షాభియాన్ సమన్వయంతో ఒక IAS అధికారి, జాయింట్ డైరెక్టరు స్థాయి అధికారి త్వరలో దీని బాధ్యతల్ని చేపడతారని కూడా ఆయన వెల్లడించారు. ఉపాధ్యాయులకు శిక్షణ, రాష్ట్రస్థాయి మూల్యాంకనం, శక్తివంతమైన నిర్వహణా సమాచార వ్యవస్థను నెలకొల్పడం లక్ష్యాలుగా మన రాష్ట్రంలో అమలు కాబోతున్న మొట్టమొదటి వినూత్న ప్రాజెక్టు కూడా ఇదేనని ఆయన అభివర్ణించారు.
మళ్ళీ SALT కొత్త సూత్రీకరణల్ని చేసి కొత్త లక్ష్యాల్ని నిర్దేశించింది. శిశు విద్యను, 1-2 తరగతులపై ప్రత్యేక దృష్టిని, ఉపాధ్యాయులు పరిమిత సామర్థ్యాలను, కాంప్లెక్సు స్థాయిలో రూపొందిచిన శిక్షణలేమిని, రెమెడియల్ తరగతుల నిర్వహణను, SC,ST విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధను, పాఠశాల నాయకత్వాన్ని, టీచర్ల బోధనేతర బాధ్యతలు తగ్గింపును సుదీర్ఘంగా SALT ప్రస్తావించింది. ప్రత్యేకించి శిశువిద్యను, అంగన్వాడీల శిక్షణలను ప్రధాన కర్తవ్యాలుగా పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లోని 3500 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా శిశువిద్యను (ECCE) ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన నాడు-నేడు, అంగన్వాడీల ఆధునీకరణలను సానుకూలాంశాలుగా ప్రస్తావించింది. SCERT, DIET లలోని పోస్టులన్నీ భర్తీ చేసినందుకు మాటిమాటికీ అభినందించింది. (ఆశ్చర్యపోకండి! రాష్ట్రంలో ఒక్కడైట్ పోస్టూభర్తీకాలేదు. నిజానికి ఇద్దరు ముగ్గురికి మించి లెక్చరర్లు లేరు. ఈ మాత్రం అబద్దాలు లేకుండా ప్రాజెక్టులెలా వస్తాయి?) మొత్తం విద్యా బడ్జెట్టులో 81శాతం టీచర్ల జీతాలకు, 9 శాతం మధ్యాహ్న భోజనం తదితరాలకే ఖర్చవుతోందని వాపోయింది. టాయిలెట్లు సరిగా లేనందువల్ల పిల్లలు అభ్యసనంలో 16శాతం వెనకబడిపోతున్నారని కొత్త సత్యాన్ని తవ్వితీసింది. ఫలితాల ఆధారంగా మాత్రమే నిధులిస్తామని, అవినీతి జరిగితే ప్రాజెక్టును మూసేస్తామని ఓ హెచ్చరిక కూడా చేసింది.
నిర్ధేశించుకొన్న ఫలితాల కోసం కొన్ని కార్యక్షేత్రాలను SALT ఎంపిక చేసింది. వాటిలో మొదటిది శిశువిద్య. అంగన్వాడీలకు స్వల్పకాలిక శిక్షణ, వారికి సర్టిఫికేటు కోర్సులు, సామాగ్రి సరఫరా, ఐ.టి.డి.ఎ ఏరియాల్లో శిశువిద్యనమలు చేయడం, నాడు-నేడుకు సహకారంలాంటివి ఇందులోకి వస్తాయి.
రెండోది అకడమిక్ క్షేత్రం. ఇందులో SCERT, DIET లలోని (కొత్తగా నియమించిన!) టీచర్లకు శిక్షణ, ఉపాధ్యాయులకు కరిక్యులం ఆధారిత శిక్షణకు బదులు సామర్థ్యాల ఆధారిత శిక్షణ, పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి దాకా మదింపులు వాటి విశ్లేషణలు, వాటిక్కావల్సిన డిజిటల్ వ్యవస్థలు, కృత్రిమ మేధను వాడుకోడం, రెమిడియల్ తరగతుల్లాంటివి వున్నాయి. ఇక మూడవది వ్యవస్థల నిర్మాణం. సామాజిక తనిఖీ, ప్రజాభాగస్వామ్యం, కాంప్లెక్సులు, పాఠశాల నాయకత్వం, బాలసభల్ని గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చెయ్యడం, ఆధునిక సాంకేతిక వ్యవస్థల ఏర్పాటులాంటివి ఇందులోకి వస్తాయి.
SALT కొత్తగా ప్రతిపాదించిన వాటిలో ఇంటివద్ద నేర్చుకొనే పద్ధతి (Home Learning) ప్రత్యేకంగా పేర్కొనదగింది. స్వతంత్ర తనిఖీ ఏజెన్సీలు (IVA) మరోకొత్త ప్రతిపాదన. ప్రపంచబ్యాంకు అధ్యయనం " Cost effective approaches to im- prove global Learning" తమ ప్రాజెక్టుకు ఒక ప్రాతిపదిక అయితే “నూతన విద్యావిధానం" మరో ప్రాతిపదికగా వుంటుందని SALT సంకోచం లేకుండా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతారన్న భరోసానివ్వడం మరీ విశేషం. పెరిగిన ప్రమాణాలవల్ల 18శాతం వేతనాల్లో అభివృద్ధి రాబోతుందని కూడా SALT ఊరించింది.
మధ్య మధ్య ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న నాడు-నేడు, విద్యాకానుకలాంటి పథకాల్ని ప్రశంసిస్తూ వీటివల్ల ప్రాజెక్టు అమలుకు ఒక భూమిక ఏర్పడిందని SALT ఘనంగా చెప్పుకొంది. అయితే గిరిజన పిల్లల విద్య అనుకొన్నట్టు లేదని, తల్లిదండ్రుల కమిటీలు బలహీనంగా వున్నాయని, నిర్మాణప్రాంతాల్లో పిల్లలకు భద్రత కరువైందని ముక్తాయింపులు చేసింది.
నిజంగా మనరాష్ట్ర పాఠశాల విద్యారంగంలోని బలహీనతలేమిటి? ఎందుకు ప్రతి సర్వేలో అధ్యయనంలో మనరాష్ట్రం అట్టడుగునే వుండిపోతోంది? ఈ ప్రశ్నల్ని షరామామూలుగా కూడా ప్రపంచబ్యాంకు ఏమాత్రం పట్టించుకోలేదు.
ఒక్క ప్రపంచబ్యాంకే గాదు. నూతన జాతీయ విద్యావిధానం (2020) కూడా వీటినేమాత్రం పట్టించుకోలేదని మనం మరిచిపోగూడదు. విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడుల గురించి గానీ, అసలు అందరికీ నాణ్యమైన విద్య ప్రభుత్వ బాధ్యత అనిగానీ, కామన్స్కూలు గురించిగానీ, మన దేశంలోని కేరళ హిమాచల్లాంటి మంచి నమూనాల గురించిగానీ NEP ఒక్కమాటగూడా ప్రస్తావించలేదు. ఏ విలువల చదువు మనక్కావాలో చాటభారతం చెప్పిందిగానీ మన జాతీయోద్యమ విలువల్ని గురించి ప్రస్తావించిన పాపానకూడా పోలేదు. ఇక గచ్చపొదలా బలిసిపోయిన ప్రైవేటు కార్పొరేట్ మార్కెట్ శక్తుల చేతుల్లో భారతీయ విద్య ఎలా బందీ అయిందో, ఫలితంగా ఎన్ని అసమానతలతో, ఎంతకుహనా సంస్కృతితో మార్కెట్ సరుకుగా మారిపోయిందో నూతన విద్యావిధానం చూడనిరాకరించింది. ప్రభుత్వ విద్యార్థుల శాతం – 2019–20 (హయ్యర్ సెకండరీతో కలిపి) Source: UDISE+ 2019–20
రాష్ట్రం ప్రభుత్వ శాతం రాష్ట్రం ప్రభుత్వ శాతం పశ్చిమ బెంగాల్ 84.58% రాజస్తాన్ 47.50% బీహార్ 77.32% గుజరాత్ 44.80% ఒరిస్సా 68.64% పంజాబ్ 42.46% హిమాచల్ ప్రదేశ్ 57.45% తెలంగాణ 40.49% మధ్యప్రదేశ్ 54.63% కర్ణాటక 40.41% ఆంధ్రప్రదేశ్ 48.57% భారత సగటు 49.50%
వ్యాఖ్య: కేరళ, మహారాష్ట్రల్లో ఎయిడెడ్ పాఠశాలలు అధికంగా ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఇవి గణనీయంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల శాతం కలిపి చూడాల్సిన అవసరం ఉంది.
NEP–2020పై విమర్శ బి.జె.పి ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానం (NEP–2020) ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసేలా ఉంది. ఇది ప్రతి అంశంలోనూ కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని పెంచే లక్షణాలు కలిగివుంది. పసిపిల్లల కథల పుస్తకాలు కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని నిర్దేశించింది. మారుమూల గిరిజన ప్రాంతాల పిల్లలు ఏ పాఠాలు చదవాలో కూడా కేంద్రమే నిర్ణయించాల్సిన స్థాయికి విద్యను తీసుకెళ్లింది. అంతేగాక, విద్యాసంస్థల నిర్వహణను స్వచ్ఛంద (కాషాయ భావాలున్న) సంస్థలకు అప్పగించాలని పరోక్షంగా చెప్పకనే చెప్పింది.
లక్ష జనాభాకు ప్రభుత్వ పాఠశాలలు – 2019–20 Source: UDISE+ 2019–20
రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలు మొత్తం పాఠశాలలు హిమాచల్ ప్రదేశ్ 223 264 మధ్యప్రదేశ్ 137 183 అస్సాం 132 211 ఒరిస్సా 127 160 రాజస్తాన్ 99 155 ఆంధ్రప్రదేశ్ 92 129 తెలంగాణ 85 121 కర్ణాటక 82 127 మహారాష్ట్ర 59 97 గుజరాత్ 58 90 తమిళనాడు 52 82 కేరళ 15 50 భారత సగటు 83 121
వ్యాఖ్య: ఇక్కడ పేర్కొన్న గణాంకాలు ప్రభుత్వ పాఠశాలలు సమర్థవంతంగా ఉన్న రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అలాగే ప్రభుత్వ ప్రాధాన్యత ఎంత వుందో సూచిస్తాయి. కేరళ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఎయిడెడ్ పాఠశాలలు అధికంగా ఉండడం వల్ల గణాంకాలు తక్కువగా కనిపించవచ్చు. ఇక SALT చెప్పే నీతులకు స్థలమెక్కడుంది? ఒక వైపు సర్వం కేంద్రీకృతం కావాలని జాతీయ విద్యావిధానం చెపుతుంటే రాష్ట్రానికే దిక్కులేకపోతే క్లస్టర్ స్థాయి ప్రణాళికలకు వీలెక్కడుంది? నర్సరీ చదువుల్ని కూడా మార్కెట్కు అప్పజెప్పాలని NEP అంటుంటే ఇక సమాన విద్యకు చోటెక్కడుంది? చిన్నబడులన్నీ కాలం చెల్లినవని NEP చెపుతుంటే అట్టడుగు SC, ST బాలికలకు SALT చెప్పుకొచ్చిన చదువులెక్కడి నుంచి వస్తాయి? అసలు అందరికీ నాణ్యమైన సమానమైన విద్యాబాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదా మార్కెట్? ఈ ప్రశ్నకు జవాబు లేకుండా SALT గానీ, NEP గానీ చెప్పేమాటలు మాయమాటలుగాక మరేమవుతాయి? ఆరు రాష్ట్రాల్లో అమలయ్యే STARSను కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోకి అడుగిడుతున్న SALTను గావచ్చు ఈ కోణం నుంచి మనం చూడాల్సివుంటుంది.
రాష్ట్ర ప్రస్తుత విద్యారంగం
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఏం జరగబోతున్నదో అర్థం చేసుకోడానికి
నూతన విద్యావిధానాన్ని, ప్రపంచబ్యాంకు ప్రాజెక్టునూ, రాష్ట్రం తానుగా తీసుకు
రావాల్సిన సంస్కరణల్ని కలిపి చూడాల్సివుంది. మన రాష్ట్రం మాత్రం వీటినంతా
కలిపి నూతన విద్యావిధానంలో భాగమేనని చెపుతోంది. NEP అమల్లో దేశంలోనే
తాము ముందున్నామనడంతో ఆగక తమనుంచే NEP పాఠాలు నేర్చుకొందన్న
స్వోత్కర్షలోకి సైతం మన రాష్ట్రం వెళ్ళిపోయింది. ఓవైపు నూతనార్థిక విధానాలు,
రాష్ట్రప్రభుత్వం తెస్తున్న మార్పులు తమ ప్రాజెక్టును అత్యంత సమర్థవంతంగా అమలు
చేసేందుకు కావల్సిన భూమికను ఆంధ్రప్రదేశ్లో భేషుగ్గా ఏర్పర్చాయని ప్రపంచబ్యాంకు
మాటిమాటికీ చెప్పుకొంటోంది. ఈ “త్రివేణీ సంగమంలో మన విద్యాశాఖ మునిగి
ఎక్కడ తేలుతుందో సులభంగానే వూహించవచ్చు. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రమూ
ఎరగని ఒక కొత్త మలుపులోకి మనం ప్రవేశించబోతున్నాం.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాను చేసిన అధ్యయనమేమిటో, నిర్దేశించుకొన్న లక్ష్యాలేమిటో, రూపొందించుకొన్న ప్రణాళికేదో, నిర్మించదల్చుకొన్న కొత్తవ్యవస్థలెలాంటివో సూటిగా చెప్పడంలేదు. ఇంత కసరత్తు చేస్తున్నప్పుడు ఒక విధానపత్రాన్ని కూడా అది విడుదల చెయ్యలేదు?. కానీ కొన్ని గణాంకాల్ని మన ముందు పెట్టింది. ఇవన్నీ కరోనా కాలం నాటివి. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు (30.4.2021 నాటికి) స్థాయి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు మొత్తం ప్రాథమిక 33,813 (87%) 1,227 (3%) 4,040 (10%) 39,140 ప్రాథమికోన్నత 4,158 (45%) 250 (3%) 4,805 (52%) 9,213 ఉన్నత 6,668 (52%) 435 (3%) 5,681 (45%) 12,784 మొత్తం పాఠశాలలు — — — 61,137
Source: A.P. Education Dept. Note, Aug 3, 2021
ఈ గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. కొంత మేరకు ప్రైవేటు పాఠశాలలు సెకండరీ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడుతున్నాయి. అయితే, ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాలలు మాత్రం ప్రభుత్వ రంగంలో (గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల ప్రభావం వల్ల) గణనీయంగా అధికంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు (30.4.2021 నాటికి) స్థాయి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు ప్రాథమిక 18,00,115 78,957 7,71,838 ప్రాథమికోన్నత 4,92,549 27,374 5,03,487 ఉన్నత 20,63,979 90,960 15,08,949 మొత్తం విద్యార్థులు 43,56,643 (59.37%) 1,97,291 (2.69%) 27,84,274 (37.94%)
Source: A.P. Education Dept. Note, Aug 3, 2021
2018–19తో పోలిస్తే 6,35,655 మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వీరిలో దాదాపు 2 లక్షల మంది బడిబయటవారు, మిగిలిన వారు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వం వైపు మారిన విద్యార్థులేనని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇది తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితమేనని సగర్వంగా ప్రకటించుకుంటోంది. అయితే, ఇది పూర్తిసత్యం కాదని చెప్పాలి — ఇది పాక్షిక సత్యమే. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య మరియు పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య 2014-15లో 41,84,441 ఉండగా, 2015-16లో 39,24,078కి తగ్గింది. ఆ తర్వాత 2016-17 నాటికి further తగ్గి 35,57,474కు చేరింది. ఈ తగ్గుదల ఆధారంగా UDISE గణాంకాలను విశ్లేషించినప్పుడు, ప్రైవేటు పాఠశాలల పిల్లల సంఖ్య కూడా తగ్గినట్లు కనిపిస్తోంది.
కానీ 2019-20 విద్యాసంవత్సరంలో మళ్లీ 96,372 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ పెరుగుదల ప్రస్తుత ప్రభుత్వానికి ముందు, కరోనా కాలం ప్రారంభానికి ముందు చోటు చేసుకుంది.
కరోనా సమయంలో (2020-21) పిల్లల సంఖ్యలో ఒక్కసారి భారీగా 5,39,283 మంది పెరుగుదల గమనించబడింది. అమ్మఒడి వంటి పథకాలు కొందరికి విద్యాభావాన్ని కలిగించిన వాస్తవమే. అయితే, పెరిగిన పిల్లల ఎక్కువ భాగం గుర్తింపు లేని పాఠశాలల్లో చదువుతున్నవారు కాగా, మిగిలినవారు కరోనా కారణంగా ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చేరిన వారు.
వాస్తవ పెరుగుదల ఎంత ఉంటుందో, కరోనానంతరం ఆర్థిక పరిస్థితులు స్థిరపడిన తర్వాతనే స్పష్టమవుతుంది.
కరోనా సమయంలో, దేశవ్యాప్తంగా, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరిగింది. ఈ 2021-22 విద్యాసంవత్సరంలో మరింత పెరుగుదల వస్తుందని అంచనా.
కరోనా కారణంగా వేలాది ప్రైవేటు పాఠశాలలు దేశవ్యాప్తంగా మూతపడిపోతున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా (2021) తెలంగాణ విద్యామంత్రిగారు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అదనంగా 2,15,000 మంది విద్యార్థులు చేరారు (తెలంగాణాలో సెప్టెంబర్ 1న స్కూల్లు తిరిగి తెరిచారు). జూనియర్ కళాశాలల్లో కూడా రిజిస్ట్రేషన్ 80 వేల నుండి 1.30 లక్షల వరకు పెరిగింది.
అలాగే, తమిళనాడు విద్యామంత్రి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య 2 లక్షలు పెరిగిందని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు లక్ష చిన్న ప్రైవేటు స్కూళ్ళు మూతబడ్డాయని కూడా సమాచారం ఉంది.
దయనీయ ముఖచిత్రం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల స్థితి ఎంత దయనీయంగా ఉందో క్రింద గణాంకాలతో చూడండి:
పిల్లల సంఖ్య (సగటు పిల్లలు: 40) స్కూల్‌లు శాతం (%) 30 లోపు పిల్లలు 13,536 40.03% 31-60 పిల్లలు 11,070 32.74% 61-90 పిల్లలు 4,044 11.96% 91-120 పిల్లలు 2,068 6.12% 121 పైగా పిల్లలు 3,095 9.16%
Source: A.P. Education Dept. Note, Aug 3, 2021 దీనర్థం విద్యాహక్కుచట్టం ప్రకారం 40.03శాతం ప్రాథమిక పాఠశాలలు ఒకే ఒక్క టీచరు, 32. 74శాతం స్కూళ్ళు కేవలం రెండేసి టీచర్లు మాత్రమే వుండదగ్గవి. అయిదు తరగతులకూ అయిదుగురు టీచర్లుండేవి అంతాకలిపి 10శాతం కూడా లేవు. ప్రభుత్వం చెప్పడం లేదుగాని గదులు కూడా కొంచెం అటూ ఇటూ ఈ దామాషాలోనే వుంటాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని దుస్థితి ఇది.
ఇక ప్రస్తుతం 17-18వేల టీచర్ల పోస్టులు ఖాళీగావున్నాయి. సెలవుల్లో, డిప్యుటేషన్లలో వున్నవారినీ కలుపుకుంటే ఈ లెక్క సులభంగా 20వేలు దాటుతుంది. వీటిలో సింహభాగం ప్రాథమిక పాఠశాలల్లోనివి. వెనకబడ్డ, గిరిజన ప్రాంతాల్లో ఖాళీలన్నీ కేంద్రీకృతమవడం మన ఆనవాయితీ. మాజీ ముఖ్యమంత్రిగారి కుప్పం నియోజకవర్గం దీనికి గొప్ప నమూనా! గత అయిదేళ్ళుగా అక్కడ సగానికి సగం పోస్టులు ఖాళీగా వున్నాయి! రాష్ట్రమంతా సర్దుబాట్లతో కాలక్షేపం జరుగుతోంది. ఇక శిక్షణలు సరేసరి. వీటితో సగం టీచర్లు రోజుల తరబడి బడిలో వుండరు. పోస్టులెందుకు భర్తీగావు? అంటే విద్యాహక్కు చట్టం ప్రకారం 10శాతం ఖాళీలుండొచ్చుగదా అన్నది మన లాజిక్కు!
ప్రపంచబ్యాంకు మొదట టీచర్లను ఫారాలు నింపడానికి పరిమితం చేసింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అడుగడునా వాడుకోగల యాజమాన్య పర్యవేక్షణా సమాచార మూల్యాంకనా పద్ధతులతో సర్వం మారిపోతుందని సలహాలిచ్చింది. చివరికి చదువులటకెక్కి ఈ సమాచార సంగ్రహణమే సర్వస్వమై కూచుంది. రోజూ ఎన్నిరకాల యాప్లు వాడాలో, ఎన్నివిధాల సమాచారం పంపాలో, దానికెన్ని ఫోటోలు వీడియోలు తీయాలో చూస్తే సిగ్గేస్తుంది. ప్రతిదీ కంప్యూటర్లకెక్కుతుంది. డేటాల్లో నిక్షిప్తమవుతుంది. ఈ పని సజావుగా రోజూ జరిగితే బడి అద్భుతంగా జరిగినట్టు లెక్క! ఇదొక మాటల్లో చెప్పలేని విషాదం.
ఇక NAS,SLAS, ASER సర్వేలూ నివేదికలూ మన అభ్యసన ప్రమాణాల గురించి చెపుతున్నదేమిటి? అసర్ 2018 ప్రకారం 22.4 శాతం మూడోతరగతి పిల్లలు మాత్రమే రెండో తరగతి వాచకం చదవగలరు. మూడోతరగతిలో 38.4 శాతం పిల్లలకు మాత్రమే కూడికలు తెలుసు. అయిదోతరగతి పిల్లలో 39.3 శాతం, 8వ తరగతిలో 47.60శాతం మాత్రమే భాగహారాలు చెయ్యగలరు! మరీ విడ్డూరంగా SLAS 2018 మేరకు 4 నుంచి 9వ తరగతి పిల్లల్లో భాషాసామర్థ్యం 63.50శాతం నుంచి 49.40శాతానికి పడిపోయింది. గణితంలో 69.55 శాతం నుంచి 39.30 శాతానికి దిగజారి పోయింది. NAS 2017 తేల్చిందేమంటే మన రాష్ట్రంలో గణితంలో 43%, సైన్సులో 41%, సామాజిక శాస్త్రాల్లో 43%, భాషల్లో 43శాతం మార్కులు 10వ తరగతి విద్యార్థులు పొందగలిగారు. (అయినా మనం దేశంలో అగ్రస్థానాన గణితంలో, రెండోస్థానాన ఇతర సబ్జక్టుల్లో వున్నామన్నది ఇంకోలెక్క!).
ప్రపంచబ్యాంకు చెపుతున్నది కూడా మనదేశంలో అయిదేళ్ళు చదువుకొన్న పిల్లల్లో 50శాతం మంది పఠన సంఖ్యాజ్ఞానాలు కనీసం కూడా లేని వారనే. మాతృభాషా పఠనం కూడా ఇలానేవుందని USAID సైతం చెప్పిందే. కానీ మన రాష్ట్ర పదోతరగతి పరీక్షల్లో 17-18లో 94.88శాతం వృత్తీర్ణులయ్యారు! వారిలో 33972 మంది 10 GPA సాధించారు!!
అకడమిక్ రంగంలో మనదొక గొప్ప ఆత్మవంచనా శిల్పం. పిల్లలు బడినుంచి డ్రాపవుట్ గారు. తరగతిగదిలో అభ్యసనం నుంచి అత్యంత సహజంగా డ్రాపవుతారు. ఏ తరగతి పిల్లలకీ 60-70 శాతం మందికి ఆ తరగతిస్థాయి వుండదు. అయినా సిలబసు పూర్తవుతుంది. పరీక్షలు జరుగుతాయి. అందరూ పాసవుతారు. అంతా “సవ్యంగా” జరిగి పోతుంటుంది. ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లోనే గాదు మన ఘనతవహించిన గురుకులాల్లో కూడా జరుగుతున్న తంతు ఇదే. ఇది పచ్చి దగా. అయినా ఒక 'సార్వత్రిక అంగీకారం' దీనికుంటుంది!
అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో 2005-10 మధ్య ఓ అధ్యయనం చేసింది. ఈ అయిదేళ్ళలో మన చదువుల్లో ఏ మార్పు కొత్తగా లేదని, వేసిన గొంగళి వేసినచోటే వుందని అది తేల్చింది. మరో అధ్యయనంలో అదే సంస్థ పిల్లల విద్యాప్రమాణాలను నిర్ణయిస్తున్నది వారి సామాజికార్థిక స్థితిగతులు తప్ప ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలుగావని, ఇది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన సత్యమని కుడా తేల్చిచెప్పింది. బలమైన ప్రభుత్వ విద్య మాత్రమే ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని సాధించగలదని తేల్చింది. ఇప్పటికీ 68.5శాతం పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే వుండటం గొప్ప అవకాశమని పేర్కొంది. ఇక బ్రిటీష్ కౌన్సిల్ 2019 జులైలో ప్రకటించిన రిపోర్టులో 2008-14 మధ్య విద్యా ప్రమాణాలు మరీ పడిపోవడానికి కారణాల్ని అన్వేషించాల్సి వుందంటూ, స్తోమతగల వారంతా పట్టణాలకు, ప్రైవేటు స్కూళ్ళకు వెళ్ళడంతో నిరుపేద పిల్లలే గ్రామీణ ప్రభుత్వ స్కూళ్ళలో మిగిలి పోతుండటం దీనికి కారణం కావచ్చునని (Wardhwa Explanation) వ్యాఖ్యానించింది.
మనది భారతదేశంలోనే ఎక్కువ ప్రైవేటీకరింప బడిన విద్యా వ్యవస్థ. కరోనాకు ముందు ప్రభుత్వరంగంలోని విద్యార్థులు 48.57శాతమే. (ఇప్పుడిది 59.37శాతమంటున్నారు). భారతదేశంలో ఉన్నతవిద్య మొత్తం ప్రైవేటు రంగంలోకి వెళ్ళి పోయిందిగానీ పాఠశాలవిద్య ఇంకా ఆ దశలోకి చేరలేదు. చాలా రాష్ట్రాల్లో 60-80 శాతంపైగా పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. అనేక రాష్ట్రాల్లో వీరి సంఖ్య బాగా పెరుగుతోంది కూడా. మహారాష్ట్రలాంటి పారిశ్రామిక రాష్ట్రాల్లో, కర్ణాటక గుజరాత్లో లాంటి వ్యాపార దృక్పథం విస్తరించిన రాష్ట్రాల్లో కూడా మనలా పాఠశాల విద్య ప్రైవేటుమయం కాలేదు. కేరళ, హిమాచల్లో ఒక మేరకు కామన్ స్కూల్ విధానం కూడావుంది. ఒక్క మన రాష్ట్రమే ప్రభుత్వరంగంలో తక్కువ పిల్లలుగల 6 రాష్ట్రాల్లో ఒకటిగా మిగిలింది.
పాఠశాల విద్య కార్పొరేట్పరమై ఎంత భారంగా మారిందో మనకందరికీ తెలుసు. ICR IER (Indian Council for Research on International Economic Relations) సీనియర్ విజిటింగ్ ఫెల్లో రష్మీశర్మ మన పాఠశాల విద్యపై చేసిన అధ్యయనం కార్పొరేట్ విద్య ఎంత కుహనా సంస్కృతిని తెచ్చిందో, ఎంతగా మన తరగతిగదిని విధ్వంసం చేసిందో కళ్ళకు కట్టిస్తుంది. తరగతిలో మార్కులు కులాలు ఆధారంగా పిల్లల్ని విడదీయడం, ఆరోతరగతి నుంచే ఐఐటి కోచింగు, భట్టీయాన్ని మార్కులకోసం స్థిరపరచడం, భాషల్ని, సామాజిక శాస్త్రాల్ని అటకెక్కించడం, మూడునాలుగు శాతం ఐఐటిల్లాంటి సంస్థల్లో చేరే పిల్లల్ని చూపించి 97% పిల్లల్ని నానా హింసపెట్టి దోచుకోడం, తల్లిదండ్రుల వల్లమాలిన వ్యామోహంతో పాటు ఆమె అధ్యయనంలో ప్రభుత్వ చేతగానితనం కూడా స్పష్టంగా కనబడుతుంది. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, బ్రిటీష్ కౌన్సిల్లాంటివి మన ఇంగ్లీషు మాధ్యమం మోజు ఎంతనాసిరకం చదువుల్ని తెచ్చిపెట్టిందో వెల్లడించాయి.
"Parents believing that starting to learn in English sooner will somehow confer an advantage. In fact it is aften has the opposite effect. Particularly if English literacy precedes mother tongue literacy or if the tran- sition to English is too abrupt or poorly implemented" అన్నది బ్రిటిష్ కౌన్సిల్ తీర్పు, మన పిల్లల చదువులిలా కృత్రిమంగా, భట్టీయంగా, కాపీలమయంగా, అర్థరహితంగా మారడానికి, పేదపిల్లలు మరింత అన్యాయం కావడానికి ఈ అరకొర ఇంగ్లీషు మీడియం చదువులొక ప్రధాన కారణం.
ఏది ఏమైనా అన్ని సర్వేల్లో అధ్యయనాల్లో మనస్థానం కిందికిందికి దిగజారుతుండటం, పైపైన ఎన్ని విన్యాసాలు చేసినా ప్రమాణాలు నానాటికి పడిపోవటం, ప్రైవేటు రంగం ఎక్కడా లేనంతగా విస్తరించడం ప్రభుత్వమూ, ముఖ్యంగా విద్యాశాఖ ఒప్పుకోక తప్పని పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ఇటీవలకాలంలో చాలారాష్ట్రాలు పాఠశాల విద్యలో చాలా ముందుకెళుతుండగా మనం వెనక్కివెళ్ళడం అందరికీ ఆందోళన కల్గిస్తున్నమాట నిజం. ఆలనా పాలనా లేని అనియత కేంద్రాల్లాంటి ప్రాథమిక పాఠశాలల్లో ఏ కసరత్తు చేసినా ఫలితం ఏమీ వుండదని అందరూ అంగీకరిస్తున్నమాట మరీ నిజం. పెడుతున్న ఖర్చు, నడిపిన పథకాలు పెట్టుకొన్న లక్ష్యాల్ని తల్లకిందులు చేశాయని అందరం ఆత్మవిమర్శ చేసుకోకతప్పని రోజు వచ్చిన మాట ఇంకా నిజం.
మంచి ప్రయత్నాలు - అనుభవాలు
కానీ చాలారాష్ట్రాల్లో ఇలాలేదు. కేరళ, తమిళనాడుల్ని విద్యారంగంలో ముందున్న రాష్ట్రాలుగా మనం చెప్పుకొనే వాళ్ళం. కానీ ఆశ్చర్యకరంగా హిమాచల్ ప్రదేశ్ కేరళకు దీటుగా మారింది. కామన్ స్కూలులాంటి వ్యవస్థను నిర్మించుకోగల్గింది. ఉ న్నత మధ్య తరగతి పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలకు రప్పించగల్గుతోంది. తల్లుల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచగల్గింది. ఆమాద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో ఢిల్లీలో జరిగిన ప్రయత్నాలు చెప్పుకోదగ్గ మార్పుల్ని తెచ్చాయి. పతనావస్థలోని పాఠశాలల్ని ఆకర్షణీయంగా మార్చడమేగాదు ఒక సమగ్ర దృష్టితో సంస్కరణలు తేవడం ఢిల్లీ ప్రత్యేకత. “మార్లేనా” లాంటి వారు దీనికి అంకితమయ్యారు. తల్లిదండ్రుల్ని మాత్రమేగాదు సమాజం మొత్తాన్ని బడిచుట్టూ సమీకరించడం, విద్యారంగ మేధావుల్ని తోడుతెచ్చుకోడం, సామూహిక పఠనోత్సవాలు నిర్వహించడం, అకడమిక్ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తేవడం, టీచర్ల ప్రమాణాల్ని పెంచడంపై సర్వశక్తులు ఒడ్డడం, వారికి నాయకత్వాన్ని అప్పజెప్పడంలాంటివి ఒక దార్శనికతతో చేస్తేతప్ప జరగనివి. కేరళది మరో పాఠం. పాఠశాలల్ని మారుతున్న అవసరాలకుతగ్గట్టు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు చేపట్టిన 'పోతు విద్యాభ్యాస సంస్కార యజ్ఞమ్' ఒక్క కేరళకు మాత్రమే సాధ్యమన్పిస్తుంది. ఈ రోజు డిజిటల్ విద్యాసౌకర్యాలులేని ఒక్క ప్రాథమిక పాఠశాలా, ఒక్క సెకండరీ పాఠశాల తరగతిగదీ తమ రాష్ట్రంలో లేవని అది ధీమాగా చెపుతోంది. ఎయిడెడ్ పాఠశాలలకు కూడా నిధులిస్తోంది. టీచర్ల జవాబుదారీతనాన్ని పెంచడంలో, వారిని నమ్మి బాధ్యతల్ని అప్పజెప్పడంలో కూడా కేరళది గొప్ప అనుభవం. గుజరాత్లో 2009 నుంచి క్రమబద్ధంగా 'గుణోత్సవ్' పేరుతో (నాణ్యతా ఉత్సవం) దాదాపు 3000 మంది ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికార్లు (ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీతో సహా) మూడు రోజులపాటు విద్యార్థుల, ఉపాధ్యాయుల, పాఠశాలల ప్రమాణాలపై జరిపే మూల్యాంకనం చాలా మంచి ఫలితాలనిచ్చింది. ఇక మరీ వెనకబడ్డ బీహార్లాంటి రాష్ట్రాలు కూడా గత 10-15 ఏళ్ళ నుంచి కొన్ని మంచి ప్రయత్నాలు చేశాయి. బీహార్లో జె.డి.యు అధికారంలోకి వచ్చాక ముచుకుంద్ దుబే నాయకత్వాన కామన్ స్కూల్ కమిషన్ (2007) నియమించడం, లక్షలమంది ఉపాధ్యాయుల్ని ఒకేసారి నియమించడంలాంటివి ఒకమేరకైనా మంచి ఫలితాల్నిచ్చాయి.
తరగతిగదిని సృజనాత్మకంగా వినూత్నంగా మార్చడంలో కూడా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు గొప్ప అనుభవాలున్నాయి. శక్తివంతంగా ఆంగ్లాన్ని నేర్పడం కోసం కేరళ ప్రారంభించిన Second Language Acquisition Programme చాలా విజయవంతమైన ప్రయత్నం. పాఠ్యగ్రంథాల్లో బోధనారంగాల్లో అది తెచ్చిన మార్పులు బహుశా ప్రపంచంలోనే వినూత్నమైనవి (దీనిపై కావల్సినంత రాజకీయ రగడ కూడా జరిగింది!). తమిళనాడు కృత్యాధార అభ్యసనం (Activity Based Learning) 2010-11 ప్రాంతాల్లో తరగతి గదుల్ని సమూలంగా మార్చే ప్రయత్నంచేసింది. పిల్లలమధ్యలో కూచుని ఉపాధ్యాయులు బోధించే సంస్కృతిని తెచ్చే ప్రయత్నంచేసింది. పాఠ్యగ్రంథాల్ని కార్డుల రూపంలోకి మార్చింది. మంచి విజయాలు సాధించింది. (టీచర్లని ఒప్పించడం అన్నిటికంటే కష్టమని కూడా తేలింది!) కర్నాటక 'నలికలి' టీచర్లకు స్వేచ్ఛనిచ్చి, వారే రూపొందించిన వాచకాలతో, బోధనా పద్దతులతో, వారెంచుకొన్న స్కూళ్ళలో అమలు చేసిన ప్రయత్నం. ఇది చాలా విలువైందేగాదు విజయవంతమైంది కూడా. అనితాకౌల్ గారి సుందర స్వప్నమిది. చదువుచెప్పడమంటే పాఠాలు బోధించి పరీక్షలకి కూచోబెట్టడంగాదు. అదొక శాస్త్రం, అదొక కళ. సంప్రదాయ విధానాల్ని త్రోసిరాజనే ప్రజాస్వామిక అకడమిక్ విప్లవమది. ఇంతదూరం పోలేక పోయినా బోధనాభ్యసన రంగంలో పరిమిత శాస్త్రీయ మార్పులనైనా తెచ్చిన రాష్ట్రాలూ వున్నాయి. మధ్యప్రదేశ్ శిక్షక్ సమాఖ్య స్వచ్ఛందంగా సృజనాత్మక విద్యకోసం ముందుకొచ్చిన ఉపాధ్యాయుల వేదిక. బహుశా ఇలాంటిది దేశంలోనే లేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు తెలుగేతర షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల కోసం రూపొందించిన బహు భాషావాచకాలు దేశంలోనే ఎవ్వరూ చెయ్యని గొప్ప ప్రయోగం. టీచర్లు కూడా వీటిని అంగీకరించడం విశేషం.
అలాగే చేదు అనుభవాలూ తక్కువేంగాదు. పిల్లలు లేక ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డం, విలీనంకావడం 2013-14 నుంచి దాదాపు దేశమంతా విస్తరించిన రుగ్మత. చిన్న చిన్న సూళ్ళపట్ల తల్లిదండ్రుల విముఖత, పట్టణీకరణ, ప్రైవేటు పాఠశాలల్లో 'నాణ్యత' వుంటుందన్న 'సామాజిక అంగీకారం', కాలానుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు రాకపోడం, ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడం, లక్షలాది
, టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండటం మరియు ప్రాథమిక పాఠశాలల సమస్యలు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండడం సార్వత్రిక సమస్యగా ఉన్నది. చిన్న చిన్న పాఠశాలలను అన్ని అధ్యయనాలు, నివేదికలు, సిఫార్సులు పెద్ద మొత్తంలో నష్టదాయక వ్యవస్థగా వర్ణించాయి. నీతి ఆయోగ్ మూడేళ్ల (2017-18 నుండి 2019-20) అజెండాలో ఈ పాఠశాలల విషయంలో రాష్ట్రాలు “సాహసోపేతమైన” నిర్ణయాలు తీసుకుని, కొన్ని పాఠశాలలను మూసేయాలని లేదా స్థానిక సంస్థల కప్పజెప్పాలని సూచించింది. వీటి భారాన్ని తట్టలేనని సిఫార్సు చేసింది.
ప్రాథమిక విద్యా ప్రమాణాలు ఇంత దయనీయంగా ఉండటానికి కారణం ప్రధానంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థనే అని సర్వత్రా అభిప్రాయం చలామణిలోకి వచ్చింది. పాఠశాలలు మూసివేత సాధారణమైపోతున్నాయి. ఈ సంఖ్య లక్ష దాటినట్లు కూడా చెప్పుతున్నారు. (విలీనమైన పాఠశాలల ఖచ్చిత సంఖ్యను ఎవ్వరూ చెప్పలేరు). స్థానిక ప్రతిఘటన కారణంగా కొన్ని పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి.
మూత లేదా విలీన పాఠశాలల సంఖ్య (సుమారు) రాష్ట్రం మూత/విలీన పాఠశాలల సంఖ్య రాజస్థాన్ 1 గుజరాత్ 1 మహారాష్ట్ర 17,129 కర్ణాటక 13,450 ఆంధ్రప్రదేశ్ 13,905 ఒరిస్సా 12,000 తెలంగాణ 5,503 మధ్యప్రదేశ్ 5,000 తమిళనాడు 4,000 మొత్తం 81,647
Source: Aug 9, 2015, The Hindu (RTE Forum Report)
ఆంధ్రప్రదేశ్ ఈ విపత్తును మరింతగా ఎదుర్కొంటున్న రాష్ట్రంగా కనిపిస్తుంది, ఇక్కడ విద్యా ప్రమాణాలు మరింత పతనానికి గురవుతున్నాయి. అయితే, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో మనలను పోల్చలేము. అభివృద్ధి పరంగా వాటికి మనకు పోలిక లేదని చెప్పాలి. అయినా అభ్యసన సంక్షోభం తీవ్రతలో మాత్రం మనం వాటిని పక్కన పెట్టలేము.
పాఠశాల విద్యారంగంలో ప్రపంచ బ్యాంకు ప్రయోగాలు - పర్యవసానాలు 46 సానుకూలాలు – సాహసాలు – సంస్కరణలు ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సంస్కరించబోతోంది. మిగిలిన విషయాలెలా ఉన్నా, నిత్యం ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి. కొంత కదలిక మొదలైంది. కొత్త ప్రయత్నాల్లో ‘అమ్మఒడి’ మొదటిది. ఏడాదికి 6 వేల కోట్లకుపైగా నిధులు పిల్లలను బడికి పంపినందుకు తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయడం ఏ రాష్ట్రం చేయనిది. ‘విద్యాకానుక’ కూడా ఒక పెద్ద ముందడుగు. ఇక ‘నాడు–నేడు’ ఎవ్వరూ కాదనలేని అద్భుతం. దాన్ని అమలు చేసిన తీరు కూడా ప్రశంసనీయమైనది.
ఇవన్నీ గతంలో ఏ ప్రభుత్వమూ తలపెట్టని మంచి ప్రయత్నాలు. అన్నిటికంటే మించి, ప్రభుత్వ అజెండాలోకి పాఠశాల విద్య వచ్చిందన్న విశ్వాసాన్ని ఇవి కల్గించేవి. అది ఒక భాగం.
ఏది ముందు, ఏది వెనుక, ఏది దేనికోసమో స్పష్టంగా చెప్పలేకపోయినా — నూతన విద్యా విధానం, SALT, ఆరు విడతల స్కూల్ పాలసీ — ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో ఏకకాలంలో వచ్చాయి. వచ్చి విడదీయలేనంతగా కలిసిపోయాయి. అన్నింటినీ కలిపి ప్రభుత్వం నూతన విద్యా విధానం అని చెప్పుతోంది. అయితే, SALT మాత్రం — "నూతన విద్యా విధానం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు భూమికగా ప్రవేశించాను. వాటి పరిపుష్టత కోసం సాయమందిస్తున్నాను" అని పేర్కొంటోంది.
ఈ సంస్కరణల్లో రెండు అంశాలు అత్యంత ముఖ్యమైనవి:
పూర్వ ప్రాథమిక విద్య
3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం
ఈ రెండింటి ద్వారా ప్రాథమిక విద్యలో ఉన్న అభ్యాస సంక్షోభాన్ని సమర్థవంతంగా నివారించవచ్చని ప్రభుత్వ భావన. చిన్న పాఠశాలల సమస్య కూడా దీని ద్వారా పరిష్కారమవుతుందని విద్యాశాఖ అంచనా వేస్తోంది.
మెదడు అభివృద్ధిలో 85% శాతం శిశు ప్రాయంలోనే జరుగుతుందని, ఆ దశలో కోట్లాది మంది పిల్లలు విద్యా అవకాశాలు లేక, నాణ్యమైన మరియు సమానమైన విద్యకు దూరమవుతున్నారని NEP పేర్కొంటోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పిల్లలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అది స్పష్టం చేసింది.
కాని, బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా ఎక్కడా శిశువిద్య విషయంలో మన రాష్ట్రంలో కనబడుతున్నంత దూకుడు కనిపించడం లేదు. ఇది ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంది.
– వి. బాలసుబ్రహ్మణ్యం ప్రపంచమంతా శిశువిద్య (ECCE) క్రీడాపద్ధతిలో సాగే అనియతవిద్యగా మాత్రమేవుంది. కానీ మన మధ్యతరగతి విపరీతాకాంక్షలు అలాలేవు. దీన్ని అసరా చేసుకొని ప్రైవేటు సంస్థలు మూడేళ్ళకే ఆంగ్లమాధ్యమంలో పాఠాలు చెపుతున్నాయి. ఇప్పుడిదొక ప్రజల డిమాండు, వ్యాపారంకూడా. ప్రాథమిక పాఠశాలల్లో రెగ్యులర్ క్లాసులుగా నర్సరీ తరగతులుండాలని మన టీచర్లు చాలామంది కూడా వాదిస్తున్నారు. ఇవి లేనందువల్లనే ప్రభుత్వ ప్రాథమిక విద్య వెనకబడి పోతోందని భావిస్తున్నారు. ఇంగ్లీషు మీడియం లాగా శిశువిద్యకూడా ఒక పాపులర్ ఆకాంక్షగా, సంస్కృతిగా మారింది. “ఆరోగ్యం, ఆహారం, ఆటలు, ప్రకృతి జీవనం, స్వేచ్ఛ అనేవి మాత్రమే మెదడు అభివృద్ధిని, శిశువికాసాన్ని నిర్ణయిస్తాయి తప్ప నాలుగుగోడల మధ్య అర్థంగాని రైమ్స్ వల్లింపులు గాదని” కృష్ణకుమార్ లాంటి విద్యావేత్తలు ఎంత చెప్పినా వినేవారు కరువయ్యారు.
మంచి శిశు వికాస కేంద్రాలు మాంటిస్సోరీ విధానంలో ప్రభుత్వమే నడపడం అందరం కోరుతున్నదే. దీనికోసం NCERT రూపొందించిన కరిక్యులం, మార్గదర్శకాలు చాలా శాస్త్రీయమైనవి కూడా. మన ఆంగన్వాడీలు ఒకమేరకు శిశువికాస కేంద్రాలుగా కూడా పనిచేస్తున్నాయి. వీటిని పటిష్టంచేసి, అదనపు వసతులను కల్పించి శిక్షణపొందిన ఉపాధ్యాయులను నియమించి మంచి శిశు విద్యా వికాస కేంద్రాలుగా మార్చడం శాస్త్రీయంగావుంటుంది.
కానీ ప్రభుత్వ వైఖరి పాపులర్ ప్రజాకాంక్షకు తగ్గట్టుగా వుంది. అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానిస్తూ ఫౌండేషన్ స్కూళ్ళుగా మారుస్తోంది. కొంత శిక్షణనిచ్చి, కొన్ని కోర్సుల్ని చదివించి ప్రస్తుత అంగన్వాడీవర్కర్లనే ఫౌండేషన్ ఉపాధ్యాయులుగా మారుస్తోంది. దీనివల్ల ప్రభుత్వం ఆశించిన ఫౌండేషన్ చదువు గానీ, NCERT చెప్పిన శిశువిద్యగానీ ఏమాత్రం మనపేద పిల్లలకు దక్కుతాయో ప్రభుత్వానికే తెలియాలి.
ఇక 3,4,5 తరగతులు హైస్కూళ్ళలో విలీనమై 1,2, తరగతులు మాత్రమే (రెండేళ్ళ ఫౌండేషన్ తరగతులతో కలిపి) ప్రాథమిక పాఠశాలల్లో మిగులుతాయి. ప్రభుత్వగణాంకాల ప్రకారం మన ప్రైమరీ స్కూళ్ళలోని పిల్లలు సగటున నలభైమంది. అంటే 1,2 తరగతులకు 15 మంది. వీరికి RTE ప్రకారమైతే ఒకే టీచరుంటాడు, వీరితోపాటు 10-15 మంది మూడు నాలుగేళ్ళ పసిపిల్లలుంటారు. ఇది సగంబడి, సగం అంగన్వాడీ. ఇందులో రెండు యాజామాన్యాలూ, రెండు రకాల ఉద్యోగులూ. ఇవి ఇప్పటికంటె మరీ చిన్న చిన్న ప్రాణంలేని స్కూళ్ళుగాక ఏమవుతాయి? వీటిలో 1-2 తరగతులు మరీ అన్యాయమవుతాయి. పేదపిల్లల పాలిట ఇది పెద్ద శాపంగా మారుతుంది. ఇంత చిన్న స్కూళ్ళలో రెగ్యులర్ టీచర్లనుంచుతారన్నది భ్రమ. క్రమంగా నీతిఆయోగ్ సిఫార్సుచేసినట్లు, NEP కూడా చెప్పినట్టు ఇవి 'స్థానిక, దాతృత్వ, సేవాసంస్థల' చేతుల్లోకెళ్ళి “స్వచ్ఛంద, ఔత్సాహిక, క్షేత్రీయ" విద్యావంతులయిన యువతీ యువకులతో నడుస్తాయి! ప్రాథమిక పాఠశాల వ్యవస్థ కనుమరుగవుతుంది. ఇక హైస్కూళ్ళలో విలీనమవుతున్న 3-5 తరగతుల గురించి చూద్దాం.
ప్రముఖ విద్యావేత్త రోహిత్ ధనకర్ ఇలా అంటాడు “ఆరు నుంచి 10 సంవత్సరాల పిల్లలది ఒకదశ. వారి మానసికస్థితి, ఎదుగుదల ఒకే రకంగా వుంటాయి. పరిసరాలతో ఇతరులతో వ్యవహరించే తీరూ, కుదురుగ్గా కేంద్రీకరించగల వ్యవధీ, అభ్యసన విధానం ఒకే రీతిగా వుంటాయి. అందుకే ప్రపంచమంతా 1-5 తరగతులు ఒక యూనిట్గావున్నాయి” రాష్ట్రంలో ఈ నూతన విద్యావిధాన రూపకర్తలెవరోగానీ వీరికిలాంటివేమీ పట్టినట్టులేదు.
ఇక 3-5 తరగతుల పిల్లలు హైస్కూళ్ళకెళ్ళాలంటే ఇంటివద్ద వున్న స్కూలును వదిలేసి దూరం వెళ్ళాలి. ఒక కి.మీ లోపున ప్రాథమిక పాఠశాల వుండాలన్న విద్యాహక్కు చట్టానికిది విరుద్ధమవుతుంది. అందుకని ఈ చట్టాన్నే సవరిస్తే సరిపోతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది! ఇది మరీ ఘోరం. ఆచరణలో హైస్కూళ్ళలో గదుల నిర్మాణం, టీచర్ల కేటాయింపు పెద్ద సమస్యగా మారుతుంది. దీన్ని అధిగమించడానికి మొదట 500 మీ లోపు 3-5 తరగతుల పిల్లల్ని, ఆ తర్వాత 1కి.మీ లోపు పిల్లల్ని తరలిస్తామని అంచలవారీ అమలుకు సిద్ధపడుతున్నారు. ఇక కి.మీ పైనున్న పిల్లల్ని తల్లిదండ్రుల డిమాండు మేరకు తరలిస్తామని కొత్త ప్రణాళికను తెరపైకి తెస్తున్నారు. హైస్కూళ్ళలోని చదువుల్ని చూచాక మిగిలిన స్కూళ్ళలోని 3-5 తరగతుల పిల్లలందరూ వాటిలో పరుగెత్తి వెళ్ళి చేరతారని ప్రభుత్వం అంచనా!
ఇంత చేసినా 31,000 అంగన్వాడీలు, 21,274 ప్రాథమిక పాఠశాలలు యథాతథంగానే వుండిపోతాయి. మిగిలిన 16,000 అంగన్వాడీలు, 12039 ప్రాథమిక పాఠశాలలు మాత్రమే విలీనానికి గురవుతాయి. ఆచరణ సాధ్యంగాని హడావుడివల్ల గల్గిన ఫలితమిది. కానీ విద్యాశాఖ మాత్రం ఒకనాటికి అన్నింటి విలీనం సాధించితీరుతామన్న దృఢనిశ్చయంతో వుంది.
ఈ విలీనాన్ని తల్లిదండ్రులెవ్వరూ అంగీకరించడంలేదు. హైస్కూళ్ళనే టీచర్లకొరత వెంటాడుతుంటే కొత్తగావచ్చిన తరగతులకు టీచర్లెక్కడినుంచి వస్తారు? గదులెక్కడి నుంచి వస్తాయి? ఈ ఏర్పాట్లన్నీ చెయ్యడం అంత సులభమేమీకాదు.
ఇక ప్రభుత్వం పాపులర్ 3-5 తరగతులకు సబ్జక్టు టీచర్లు బోధిస్తారంటోంది. ఆ సబ్జెక్టు టీచర్లు ఎక్కడినుంచి వస్తారో మాత్రం చెప్పడంలేదు. హైస్కూళ్ళ నుంచి తెలుగు మీడియంకు ఉద్వాసన పలికితే టీచర్లు మిగులుతారు. వీళ్ళతో సరిపెట్ట వచ్చునన్నది ప్రభుత్వాలోచన కావచ్చు. వీరు 19వేల దాకా వుంటారని అంచనా. ఇక ప్రస్తుత 86వేల మంది సెకండరీ గ్రేడ్లకు కేవలం 1-2 తరగతులుండే ప్రాథమిక పాఠశాలల్లో పనేముంటుంది? వీరి అవసరం సగానికి సగం పడిపోతుంది. అలాగే ప్రస్తుతం 44,639 పాఠశాలల్ని నిర్వహిస్తున్న విద్యాశాఖ 10,826 ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలకు పరిమితమవుతుంది. టీచర్ల జీతాలకే బడ్జెటు మొత్తం సరిపోతుందని ప్రపంచబ్యాంకు SALT లోనూ చెప్పడం, ఈ కుదింపు రెండూ పోల్చిచూచుకొంటే ఎయిడెడ్ వ్యవస్థకు ఎసరు పెట్టినట్టే ప్రాథమిక పాఠశాలలకు ఎసరు పెట్టడమే అజండాగా ఈ కథంతా నడుస్తోందా అనుకోడంలో తప్పేముంది? దీన్ని ప్రపంచబ్యాంకే ముందుకు తెచ్చిందా? దానికోసమే రాష్ట్రప్రభుత్వం ఎక్కడాలేని ఈ సాహసానికి సిద్ధపడిందా అని అనుమానించడంతో తప్పేముంది?
మనసుంటే మార్గంవుంది
మన ప్రాథమిక పాఠశాలలు పతనావస్థకు చేరుకొన్నమాట వాస్తవం. తీవ్రమైన మార్పులు లేకుండా వీటినుంచి ఫలితాల్ని ఆశించలేమన్నది మరీ వాస్తవం.
కానీ వీటిని సంస్కరించ బూనుకొనే ముందు మన సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని, గ్రామీణ సాంస్కృతిక ప్రత్యేకతల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక కి.మీ లోపు బడివుండాలన్న సూత్రం వూరకేరాలేదు. ఒక గిరిజన బాలిక ఇంటికీ బడికీ దూరం ఒక కి.మీ మాత్రమే గావచ్చుకానీ సామాజికదూరం ఆమడలుంటుంది. ఇది మన సామాజిక దౌర్భాగ్యం దుర్మార్గంకూడా. ఇలాచూచినపుడు కొన్ని ఆవాసాల్లో ఎంత చిన్న బడైనా కొనసాగక తప్పదు. కృష్ణాజిల్లాలాంటి బాగా అభివృద్ధి చెందిన జిల్లాల్లో కూడా ఇటీవల SSA అధ్యయనంలో 8వ తరగతి తర్వాత మగపిల్లలు పనిలోచేరి బడిమానేస్తున్నారని తేలింది. మధ్యాహ్నభోజన పథకం కొద్దిమందినైనా పిల్లల్ని బడిలో వుంచుతోంది. 21వ శతాబ్దంలోనూ ఎందుకిలా జరుగుతోంది? ఈ వాస్తవాలను కాదని పండితుల అధ్యయనాలపైనో, ప్రపంచబ్యాంకు డిక్టేషన్లపైనో ఆధారపడి తొందరపడలేము.
అలాగే తీసుకొనే నిర్ణయాలు ప్రజాస్వామికంగావుండాలి. వీలున్నంత మందిని ఓపిగ్గా ఒప్పించాలి. కనీసం ఒప్పించే ప్రయత్నమైనాచెయ్యాలి. రాష్ట్రప్రభుత్వం ఇంతపెద్ద సంస్కరణలు తెచ్చేముందు ఒక విధానపత్రం చర్చకోసం ఎందుకు విడుదల చెయ్యలేకపోయింది? విద్యారంగంలో ఎంతో కృషిచేసిన సంస్థలూ, విద్యావేత్తలు వున్న రాష్ట్రం మనది. అంతేకాదు బలమైన ప్రజారాజకీయాలు, బాధ్యతగల ఉపాధ్యాయ సంఘాలూవున్న రాష్ట్రంకూడా.
ఏకపక్షంగా ఆంగ్లమాధ్యమం తెచ్చారు. ఏమైంది? ప్రస్తుతం మన పాఠశాలల్లో సాగుతున్నది ఏ మాధ్యమమో అర్ధంగాని స్థితి ఏర్పడింది. మొత్తం CBSE మయం కాబోతోందన్నారు. ఇది సాధ్యంగాదని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఈ 3-5 తరగతుల విలీనాన్ని కూడా హడావుడిగా ప్రకటించారు. చివరికి 21,274 ప్రాథమిక ప్రాఠశాలల్ని యథాతథంగా వుంచివెయ్యక తప్పదనుకొంటున్నారిప్పుడు. ఇలా ప్రతీది ఆచరణలో అమలుగాక అభాసుపాలవడమే మిగులుతోంది.
పేదపిల్లల చదువులపట్ల గాఢమైన స్పృహకల్గిన వాళ్ళు, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న వాళ్ళుకూడా సీరియస్ గా ఆలోచించాల్సిన తరుణమిది. ఎంతకాలమైనా నిరుపేదపిల్లలు ఈ ప్రాణంలేని బడుల్లో కొనసాగాల్సిందేనా? అసలు ప్రభుత్వ పాఠశాలలు పేదపిల్లల పాఠశాలలని చెప్పుకోడం సిగ్గుచేటు కాదా? వాటిలో ఉన్నత మధ్యతరగతి పిల్లలుకూడా వుండాలిగదా. మనషెడ్యూల్డు తెగల, కులాల పిల్లలు వాళ్ళ బడుల్లోనే ఎందుకు చదువుకోవాలి? ఇంతకన్నా వివక్ష ఏముంటుంది? అందుబాటులో బడివుండాల్సిందే. కానీ అది అందమైన బడిగా కూడా వుండాలిగదా! లేనపుడుదాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసే చైతన్యం, తెగువ మన బడుగువర్గాల కుండాలని గదా మనం కోరుకోవల్సింది. ఇలాచూచినపుడు మారడమో, మనుగడ ప్రశ్నార్థకం కావడమో ఏదో ఒకటి తేల్చుకోవల్సిన స్థితి మనబడికిప్పుడు వచ్చిపడింది. దీన్ని మనమూ అంగీకరించాలి. తగ్గుతున్న జననాల రేటు, పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ఆకాంక్షలు, వీస్తున్న కొత్తగాలులు మనగ్రామీణ పాఠశాలలపై తీవ్రప్రభావం చూపుతున్నాయని కూడా మనం మరిచిపోగూడదు.
మనకిపుడు కావల్సింది బలమైన ప్రాథమిక పాఠశాల వ్యవస్థ. ప్రతి పంచాయితీలో అయిదు గదులూ, అయిదుగురు టీచర్లూ, ఇంగ్లీషు మాస్టారూ, పూర్వ ప్రాథమిక విద్యగల మంచి ప్రాథమిక పాఠశాల వుండితీరాలి. ఇద్దరు ముగ్గురు టీచర్లున్న స్కూళ్ళను అయిదుగురు టీచర్లుండే స్కూళ్ళుగా పిల్లల సంఖ్యతో నిమిత్తం లేకుండా గ్రామస్తులే మార్చుకొన్న దృష్టాంతాల్ని చూచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఢిల్లీ సర్వోదయ పాఠశాలల నమూనాలో 1000-1500 ఉన్నత పాఠశాలల్ని 1-10 లేదా 1-12 తరగతుల పాఠశాలలుగా మార్చాలి. (దేశంలో 1-10 తరగతుల స్కూళ్ళు 72వేలు, 1-12 క్లాసుల పాఠశాలలు 60వేలు వున్నాయి) కేంద్రీయ విద్యాలయాల నమూనాలో వీటిని తీర్చిదిద్దాలి. చిన్న చిన్న స్కూళ్ళ పిల్లలు క్రమంగా ఈ రెండురకాల స్కూళ్ళలోకి వస్తారు. దీనికి ఒపిక పట్టాలి. మన బడి ఒంటరిది కాకూడదు. దానికి సమాజపు తోడు కీలకం. కేరళలో పంచాయితీలు, తమిళనాడులో PTAలు పాఠశాల నిర్వహణలో గొప్పపాత్ర పోషిస్తున్నాయి. హిమాచల్, మహారాష్ట్రలదీ ఇదే అనుభవం. ఏ పాఠశాలకాపాఠశాల వీలున్నంత స్వతంత్ర వ్యవస్థగా ఆ ఊరి ప్రజల, ప్రజా వ్యవస్థల ప్రత్యక్షభాగస్వామ్యంతో కేరళ, తమిళనాడుల్లోలాగా నడవాలి. అధికార పర్యవేక్షణలు అకడమిక్ వ్యవహారాలకు పరిమితంగావడం మంచిది. రాజకీయ జోక్యాలకు, నడమంత్రపు ప్రయోగాలకు తావులేకుండా చట్టబద్ద రాష్ట్ర, జిల్లా, మండల విద్యాకమిషన్లను నియమించడం ఉ త్తమం. కావల్సింది దీర్ఘకాలిక అకడమిక్ విధానం. నిరంతర ప్రయోగాలు కాదు. కావల్సింది చదువు. సమాచార సేకరణగాదు. దీనికోసం SCERT, DIETలతో పాటు జిల్లా మండలస్థాయిల్లో సబ్జెక్టుల వారీగా మంచి టీచర్లతో అకడమిక్ విభాగాల్ని ఏర్పాటు చెయ్యవచ్చు. మనకు ఇన్నిరకాల స్కూళ్ళు, యాజమాన్యాలు అవసరమా? ఒకేగొడుగుక్రిందికి వీటిని తీసుకురావచ్చు.
పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో మనదొకటి. పట్టణ పేదరికం కూడా పెరుగుతోంది. పట్టణ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకుండా ముందుకు పోలేము.
| టీచర్లను నమ్మాలి. వారికి స్వేచ్ఛనివ్వాలి. బోధనేతరపనుల నుండి
విముక్తిచెయ్యాలి. ఎప్పటికపుడు పోస్టులు భర్తీచెయ్యాలి. మంచి టీచర్లను ప్రోత్సహించాలి. ఏ పాఠశాల టీచర్లని ఆగ్రామ సమాజానికి జవాబుదారీ చెయ్యాలి. |
| వీటన్నిటికీ కావల్సింది ఒక రాజకీయ దార్శనికత, ప్రజాస్వామిక దృక్పథం,
దీర్ఘకాలిక వ్యూహం, అన్నిటికంటే మించి నిధులూ! |
| రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నూతన విద్యావిధానానికి ఎంత దూరంగా వుండగల్గితే
అంతమంచిది. రాష్ట్రాల అవసరాలతో ఏ మాత్రం సంబంధంలేని విధానమది. మొత్తం విద్యావ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకొనే పన్నాగమిది. |
| ప్రస్తుత విద్యారంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి దొడ్డిదార్లూ, దగ్గరిదార్లు
అంటూ ఏవీలేవు. ప్రపంచబ్యాంకు దగ్గర మంత్రదండమేదీ లేదు. |
| దృఢమైన రాజకీయ సంకల్పం! |
| బలమైన పాఠశాల వ్యవస్థ! |
| శక్తివంతమైన అకడమిక్ విధానం! |
| ఉత్తేజితమైన ఉపాధ్యాయవర్గం! |
| చురుకైన ప్రజాభాగస్వామ్యం! |
| భాధ్యతాయుతమైన జవాబుదారీతనం! |
| ఇవి మాత్రమే మన చదువుల్ని నిటారుగా నిలబెట్టగలిగేవి. వీటిని వదిలేసి
ముక్కలు ముక్కలుగా సమాధానాలు వెతికితే, ప్రపంచబ్యాంకు పథకాలవెంట పరుగిడితే అప్పుడప్పుడూ కొన్ని మెరుపులు తళుక్కుమంటాయిగానీ చివరకు చిమ్మచీకటే మిగులుతుంది. |
| - | 1984 నుంచీ ప్రాథమిక విద్యపై లెక్కలేనన్ని ప్రయోగాలు చెయ్యడమేమిటి? చివరికి ప్రాథమిక పాఠశాల వ్యవస్థనే రద్దు చెయ్యడమేమిటి? |
| - | 1-2 తరగతులు కీలకమని ఏళ్ళ తరబడి ఉపదేశించడమేమిటి? |
| - | అంతిమంగా వాటిని అంగన్వాడీల సరసన చేర్చడమేమిటి? |
| - | ప్రాథమికోపాధ్యాయులకు (SGTలకు) శిక్షణల మీద శిక్షణలిచ్చ సానపట్టడమేమిటి? ఆఖరుకి వాళ్ళు ప్రాథమిక తరగతుల బోధనకు పనికిరారని తీర్మానించడమేమిటి? |
| - | వేలకోట్లు కుమ్మరించి పథకాల మీద పథకాలు నడపడమేమిటి? దేశంలో
ఎక్కడా లేనట్టు సగానికి సగం పసిపిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళకప్పజెప్పడమేమిటి? |
| ఇదీ ప్రపంచబ్యాంకు మనకు మిగిల్చిన విషాదం.
|
1. The Beautiful Tree - Volume III selected workings (indigenous Indian Education in the 18th Century) by Dharmapal.
2. An uncertain glory - India it's Contradictions by Jean Dreze & Amartya Sen.
3. Indian Development - Selected Regional Perspectives - Editors Jean Dreze & Amartya Sen.
4. Primary Education in India - A World Bank publication 1997.
5. The State and Child in India by Myron Weiner.
6. Schooling in Capitalist America - Samuel Bowles & Herbert Gintis.
7. Education for All - Towards Quality & Equity - India - NUEPA(2014) 8. School Closures and Mergers - A multi state of policy and its impact on public education (2017). 9. The School Edcuation system in India - An overview July 2019- British Council. 10. NITI Ayog SDG Index - 2021. 11. Programme Evaluation Report - Activity Based Learning - Tamilnadu. 12. Good Practices & New initiatives for education in Gujarath. 13. Secondary Education in India - World Bank - 2009. 14. New Education Policy - 2020 15. India - Three Year Action Agenda 2017-18 to 2019-20 NITI Ayog. 16. Supporting Andhra's Learning Transformation (P173978) World Bank, May 20,2021. 17. Note on Implementation of NEP - 2020 Recommendations 3rd August 2021-AP.Govt. 18. UDISE+2019-20.
19. SEQI Index 2019 - NITI Ayog. పుట:Paatashala Vidya Rangam Lo Prapancha Bank Prayogalu Paryavasanalu VBS JVV.pdf/58 పుట:Paatashala Vidya Rangam Lo Prapancha Bank Prayogalu Paryavasanalu VBS JVV.pdf/59