Jump to content

పదబంధ పారిజాతము/ఒ

వికీసోర్స్ నుండి

ఐన______ఐస 293 ఒంట______ఒంట

ఐనది కాదను కానిది ఔనను

  • అడ్డదిడ్డంగా మాట్లాడు.
  • "ఐనది కా దని యనగా, గానిది యౌనని వచింపగా గలమీతో." శ్రవ. 4. 54.

ఐనన్ కానిమ్ము

  • అయితే కానీ.
  • "ఐనన్ గానిమ్ము భవద్దీనతకై వ్రతము విడిచితిన్." మను. 3. 100.
  • ఒకడు బలవంతము చేయగా అంగీకరించిన సందర్భంలో అనేమాట.
  • "అయితే కానీ, ఏం చేస్తాం?" వా.

ఐపు అజ

  • జాడ. జం.
  • "వాడి ఐపు అజా తెలియడం లేదు." వా.

ఐపు లేడు

  • ఎక్కడికి పోయినాడో తెలియదనుట.
  • "వాడు ఐపు లేకుండా పోయినాడు." వా.

ఐసరుబొజ్జ

  • సెబాసు.
  • "కాంతలమాట నమ్ముకొని కంతునికిం గడు లోకు వై తదీ, యాంతరభావముల్ దెలియ కైసరు బొజ్జ యటంచు నుబ్బుచుం, ద్రెంత వివేకు లైన...." శ్రవణా. 3. 75.

ఐసరు బొజ్జ తోపా

  • సెబాసు.
  • చూ. ఐసరుబొజ్జ.

ఒంటని

  • అహితు లైన. పథ్యముకాని, హితము కాని - అన్న సంస్కృతం మాటల వలెనే 'ఒంటదు' కూడా రోగికి కొన్ని వస్తువులు పథ్యము కావు అన్నట్లే ఉపయోగిస్తారు. 'వానికి వంకాయ ఒంటదు' ఇత్యాదులు. అందుపై వచ్చిన మాట.
  • "ఒంటనిరాజుల కప్పము, గొంటి న్మే లేర్చి...." కళా. 5. 116.

ఒంట బట్టు

  • బలప్రవర్ధక మగు, మనసున కెక్కు, హిత వగు. ఏదైనా తిన్న ఆహారం జీర్ణ మై రక్తరూపంలో ఒంటికి పట్టిన దనుటపై వచ్చిన పలుకుబడి. తర్వాత ఇది ఆంగిక మయిన ప్రోదికే కాకా ఇతరములకూ చెల్లినది.
  • "వాడికి తిన్న ఆహారం ఏదీ ఒంట బట్టడం లేదు." వా.
  • "వాళ్ల నాన్న ఎంత ప్రయత్నించినా వాడికి చదువు ఒంటబట్ట లేదు." వా.
  • "ఎన్ని నీతులు చెప్పినా వానికి ఒంటబట్ట లేదు." వా.
  • "ఈ ఊరినీళ్లు నీకు బాగా ఒంటబట్టినట్టున్నాయే. అప్పుడే కాస్త ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాజసమూ, ఆఠీవీ." వా. ఒంట____ఒంటి 294 ఒంటి____ఒంటి
  • ఇలాటి పట్టుల కాస్త పొగరెక్కినాడు అన్న వ్యంగ్యార్థం స్ఫురిస్తూ ఉంటుంది.

ఒంటరీలు

  • అంగరక్షకులుగా నుండు అసహాయశూరులు.
  • "విభుండు క్రే,వల దగ నొంటరీలు గొలువం గరదీపతతుల్ వెలుం గగన్." శుక. 1. 370.

ఒంటికంబపు మేడ

  • ఒకే స్తంభంతో రాజస్త్రీని ఉంచుటకై కట్టినమేడ. మన జానపదకథ లన్నిటిలోనూ వినబడేమాట.
  • "పోతుటీగకు నైనను బోవరాని, యొంటికంబపు మేడలం దునిచె దత్సు, తద్వయంబును..." హంస. 5. 273.
  • రూ. ఒంటి స్తంభం మేడ.

ఒంటికిట్లు

  • ఒక తిట్టు. ఒంటెత్తు మనుష్యులు అని అర్థం కావచ్చును. స్త్రీలను గుఱించి ఇక్కడ ఉపయుక్త మైనది.
  • "నీ వెఱుంగవె మున్ను నిక్క మంగనలు... ఒడప మలుపసంతు లొగి నొంటికిట్లు." పండితా. ప్రథ. పురా. పుట. 343.

ఒంటికాలిమీద తపస్సు చేయు

  • గట్టిపట్టుదలతో కోరు. తపస్సులో ఒకరక మైన దిది. ఒక పాదంమీదనే నిలబడి తపస్సు చేయుట. పట్టుదలతో కోరుటలో ఒంటి కాలిమీద నిలబడుట అన్న అర్థంలోనే దీనినీ ఉపయోగిస్తారు.
  • "వా డా పిల్లకోసం ఒంటికాలిమీద తపస్సు చేస్తున్నాడు. ఆ పిల్ల తండ్రి కిష్ట మైనా తల్లేమో తమ్ముని కివ్వాలని పట్టు పడుతున్నది." వా.

ఒంటికాలిమీద నిలబడు

  • ఏదైనా నిర్బంధముగా వెంటనే కావలె నని పట్టుపట్టు.
  • "ఒంటికాలనె నిల్చి యూర్మిమారుతములన్, జిగురుఱెక్కలరేకు లెగయుచుండ." శృం. నైష. 1. 98.
  • "కాసులదండ కావా లని మా అమ్మాయి ఒంటికాలిమీద నిలుచుంది. ఏం చేయడానికీ తోచడం లేదు." వా.

ఒంటికాలిమీద వచ్చు

  • ఒక్కమాటతో మీదికి వచ్చు. మీదబడు, పై బడు.
  • కొత్త. 121.
  • "వాడు నే నంటే ఒంటికాలిమీద వస్తాడు. వాడి కేం పొయ్యేకాలమో!? వా.

ఒంటిపా టగు

  • ఎవరు లేని అవకాశము దొరకు.
  • "ఇద్ద ఱీరీతి నింటిలో కేగి నప్పు డొంటిపా టయ్యె శివదత్తు డింట లేమి." హంస. 3. 230. ఒంటె____ఒండు 295 ఒండొ_____ఒండో

ఒంటెత్తుతనం

  • ఓర్వ లేనితనం.
  • "అది వట్టి ఒంటెత్తు మనిషి. చెల్లెలి కే దిచ్చినా తనకు కావా లంటుంది." వా.

ఒంటెత్తురకం

  • 1. ఓర్వలేని రకం.
  • "అది వట్టి ఒంటెత్తు రకం. దా నెదురుగా కొత్తచీ రెందుకు తీస్తావే?" వా.
  • 2. వంతులు వేసుకొనే రకం.
  • "అది వట్టి ఒంటెత్తు రకంరా. తోడికోడ లేం చేస్తే తానూ అదే చేస్తా నంటుంది. తాను పెద్దకోడలు కదా. ఆమాత్రం సహనం లేదు." వా.

ఒండాడు

  • ఎదురాడు. వాడుకలో ఇది 'ఒక్కమాట అనకుండా' అనే రూపంలో ఉపయోగిస్తారు.
  • "ఒక బుద్ధి వినుం డొండా డక సకలా గమమతంబు దక్క దెలిసి మీ, కకుటిలమతి నెఱిగింతు." పాండు. 2. 272.
  • "నేను మావాణ్ణి చదువు మానేసి ఉద్యోగంలో చేరరా అని చెప్పగానే ఒక్కమాట అనకుండా ఒప్పుకున్నాడు." వా.
  • "ఏం చెప్పినా ఒక్కటి అనకుండా చేసుకుంటూ పోతుంది. అలాంటి కోడలు దొరకడం ఆ అత్త అదృష్టం" వా.
  • చూ. ఒక్కమాట అనకుండా.
  • రూ. ఒక్కటి అనకుండా.

ఒండు పల్కక

  • మాఱు మాటాడక. బదులు చెప్పకుండా.
  • "నీ వింకన్ నను నొండు పల్కక." భార. భీష్మ. 3. 450.

ఒండొకడ వైన

  • ఇంకెవ రన్నా అయితే. వాడుకలో ఇంకొకడ వైతే అన్న రూపంలో వినవస్తుంది.
  • "ఒండొకడ వైన నిపుడ నీ పిండి యిడమె." మను. 4. 90.
  • "నీవు కాబట్టి సరి పోయింది. ఒంకొకడైతే బయటికి గెంటేవాణ్ణి." వా.

ఒండొక త్రోవ ద్రొక్కు

  • వేరుమార్గము పట్టు.
  • "చేడియ నీ మనంబునకు జింత యొకింత జనించెనేని నేం, జూడగ జాలనీ జనకు చొప్పు దలంప హతుండు గాక తా, గీడు చలంబు మాన డనికిం జొర కొండొకత్రోవ ద్రొక్కగా, గూడద యేమి సేయుదును ఘోరవిచారము పుట్టె నాత్మలన్." ప్రభా. 5. 196.

ఒండొక బుద్ధి సేయు

  • అన్యథా భావించు.
  • "ఏటికి నొండొక బుద్ధి సేసె దే, నవ్వుచు బల్కినన్ ధరణినాథ! యసత్యము గల్గ నేర్చునే?" భార. ద్రోణ. 1. 391.
  • "సౌ, వీరకులప్రసూతలము వీరుల మే మితరక్షితీశ సా,ధారణబుద్ధి సేయకు ముదాత్తచరిత్రుల మైన మాయెడన్." భార. అర. 6. 182.

ఒండొకరీతిగా

  • ఏదో ఒకవిధముగా. ఒండొ____ఒక 296 ఒక____ఒక
  • "రాజవిరహంబున నొండొకరీతి బ్రొద్దు గడపుచున్నంత..." హంస. 2. 2.

ఒండొరుల మోములు చూచుకొను

  • ఏదైనా జరిగినప్పుడు గట్టిగా మాట్లాడు అవకాశము లేక పోగా పరస్పర ముఖావలోకనంతోనే తమభావములను సూచించు.
  • "పువ్వుబోం డ్లొయ్యన దవ్వుగా నరిగి రొండొరు మోములు చూచి యద్దిరా, యయ్యకు మన్మథాభ్యుదయ మంచు." కళా. 3. 37.
  • "వాడు అంతమందిలో అసభ్య మయిన మాట అనగానే అక్కడ ఉన్నవా రందరూ ఒకరిమొగాలు ఒకరు చూచుకొన్నారు." వా.
  • చూ. ఒకరిమొగా లొకరు చూచుకొను.

ఒక ఊపు ఊపి వదలు

  • ఎదుటివాని సత్తా సారమును కదల్చి చూచు.
  • "ఆ ఊళ్లోకి ఏ పండితుడు వచ్చినా అతను ఒక ఊపు ఊపి గానీ వదలడు." వా.

ఒకకంచాన తిని ఒకమంచాన పడుకొను

  • అన్యోన్యముగా నుండు.
  • "వాళ్లిద్దరూ చిన్న తనంనుంచీ ఒక కంచాన తిని ఒక మంచాన పడుకొన్న వాళ్లు." వా.

ఒక కంట కనిపెట్టు

  • కొంత ప్రాపుగా రక్షగా ఉండు.
  • "మీ రేదో ఒక కంట కనిపెట్టి ఉంటా రని కదా యీ ఊరు వచ్చాను." వా.

ఒక కంట పాలు ఒక కంట నెత్తురు కురియుగతి

  • కరుణ, కోపము ఒక దాని వెంట ఒకటి వెల్లివిరియగా.
  • "కరుణయు గోపము గనుగవ, నొరయగ నొకకంట బాలు నొక కంటను నె,త్తురు గురియుగతి." ఉ. హరి. 4. 59.

ఒక కంట బెల్లము ఒక కంట సున్నము

  • పక్షపాతదృష్టి.
  • "ఆ అత్తగారి కొక కంట బెల్లం, ఒక కంట సున్నం. చిన్న కోడల్ని నెత్తిన పెట్టుకొని పెద్దదాన్ని రాచి రంపాన పెడుతుంది." వా.

ఒక కన్ను వేసి వుంచు

  • కాస్త కన్ను పెట్టి ఉండు.
  • "వాడి కేదో కాస్త చెడ్డపే రుంది. ఎందు కైనా మంచిది. కాస్త కన్ను వేసి ఉంచు." వా.

ఒక కుతి కై యుండు

  • ఏకాభిప్రాయముతో నుండు. ఒకటిగా నుండు.
  • "ఒక కుతి కై యుండెడి మీ,రకటా! చెలియెడల నింత యతికూహకమా, పికమా శుకమా యిక మా,నక మాసుకుమారగాత్రి నాయమె యేచన్." అని. 3. 35.

ఒక కుత్తుక యగు

  • 3. ఏకాభిప్రాయమునకు వచ్చు. ఒక____ఒక 297 ఒక____ఒక
  • "...కొమరు సెట్టియు బోటియు నొక్క కుత్తు కై..." బసవ. 4. 156.
  • 2. ఏకకంఠంతో ఉండు. ఒకే మాటమీద ఉండు అనుట.
  • "ఆలు మగడును నొకకుత్తు కైన గాక, యిట్టి ధర్మంబు మిన్నక యేల కలుగు?" హర. 2. 60.

ఒక కొందఱము

  • ఈ 'ఒక' రకరకాల అర్థచ్ఛాయలలో ప్రయుక్త మవుతుంది. ఒకొక్కసారి కేవలం వాక్యోప స్కారమే అవుతుంది.
  • "ఏ మొక కొందఱము మహా, గ్రామ వనాంతరము లెల్ల గడచి..." విక్ర. 5. 201.
  • "విశ్వావసుండు మొదలుగ వీణాధరుల మొక కొందఱము తత్పరతయు భక్తియు దలిర్ప..." కళా. 2. 71.
  • "ఒక నల్గురు వస్తే చాలు." వా.
  • "అదీ ఒక గొప్పే!" వా.
  • "ఒక కొంత యోచించి." వా.
  • చూ. ఒక కొందఱు.

ఒక కొలికికి వచ్చు

  • ఒక దారికి వచ్చు. దండలలో కొలికిపూస ఉంటుంది. తద్వారా ఒక వరుసకు వచ్చు అని మారి ఏర్పడినది.
  • "జలరుహదళములు చిలుకల, కొలికిం గనుగొన్న నొక్కకొలికికి వచ్చున్." విప్రనా. 2. 44.
  • "ఏదో ఈ వ్యవహారం ఒక కొలికికి వచ్చాక గానీ నేనీ ఊరు వదల దలచుకోలేదు." వా.

ఒక కోడి కూయుపల్లె

  • చిన్న పల్లె.
  • "తిర మనుచు దేవళంబుల, బరగగ నొక కోడి గూయుపల్లియ నైనన్." విప్రనా. 1. 60.

ఒక గరిడిలో చేసిన సామే

  • ఒకచోట నేర్చిన విద్యయే.
  • "ఒదుగుసేత లివేల పద యదే మన మొక్క, గరిడి సేసినసామె కదె లతాంగి." చంద్రాం. 6. 135.

ఒకగాడి కట్టు

  • కూడనివానిని ఒకచోట చేర్చుపట్ల ఉపయోగించె పలుకుబడి.
  • "బంధ మోక్షము లొక్క గాడి గట్టుట తెలివి గానకే కదా!" తాళ్ల. సం. 11. 2. భా. 16.
  • "గాడిదనూ గుఱ్ఱాన్నీ ఒక గాడిలో కడతా నంటే ఎట్లా? అత నేమో సున్నిత మైన మనిషి. వీ డేమో వట్టి మోటువాడు." వా.

ఒక గుడ్డు మునికిబోయిన నేమి?

  • అందరిలో ఒకడు పోతే నేమి? అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "కులమునకు గొప్ప గుద్దలి, ఖలుడు కులాంగారకంబు కష్టుడు వీనిం, బొలి యింపుడు ఘనశస్త్రం, బుల వెస నొక గుడ్డు మునికిబో నేమి యగున్." నృసిం. 4. 25. ఒక____ఒక 298 ఒక____ఒక

ఒక గూటిపిల్లలు

  • ఒక జాతికి చెందినవి. (వారు) సంహా. 1. 258.

ఒక చంద మగు

  • అనాహూతమో దేనినో అనవలసి వచ్చినప్పుడు ఒక టైతే అని నేటికి కూడా అంటారు.
  • "అత డొకచంద మౌన నేమిగతి బోదు నక్కట!" భార. భీష్మ. 2. 365
  • "వా డక్కడి కెళ్లాడు. ఏ దయినా ఒకటి అయితే నాగతి యేం కాను?" వా.
  • చూ. ఏదైనా ఒకటి అయితే.

ఒక చెంప గొడితే పాలు ఒక చెంప గొడితే తేనె

  • ఇంకా బాల్యావస్థ వీడ లేదనుట.

ఒక చెయ్యి చూచు

  • కొంత ప్రయత్నించి చూచు.
  • "....కానిమ్ము. ఒక చేయి చూచి వదలుదము...."
  • "ఒక చేయి చూచి గానీ వదలడానికి వీల్లేదు. వా డేదో మహా విరగబడుతున్నాడు." వా.

ఒక చోట నిలువ లేక

  • నెమ్మది లేక.
  • "నిదుర గానక యొకచోట నిలువ లేక వీధి గ్రుమ్మరుచుండి యవ్వేళ నటకు." శుక. 3. 562.

ఒక జాడ బోవు

  • ఒక సమాధానమునకు వచ్చు.
  • "వివేకింప వా డౌ నేనౌ నొక జాడ బోయెదము లేదా జీవ మిం కేటికిన్.? కా. మా. 2. 123.
  • రూ. ఒకదారిని పోవు.

ఒకటి అని ఒకటి అన లేదా?

  • అనవలసిన వన్నీ అనె ననుట.
  • "వాడు ఒకటి అని ఒకటి అనలేదా? అమ్మా! నానామాటలూ అన్నాడు." వా.

ఒకటికి పదాఱు కల్పించు

  • 1. లేనిపోని చాడీలు చెప్పు. ఎవరితో నైనా మరొకరి తప్పులను చెప్పునప్పు డిది ఉపయోగిస్తారు.
  • "తగునె యక్కట! బుధనుతో దార గుణవి, రాజిసన్మార్గవర్తన దేజరిల్లు, పరమసాధువు సారంగధరునిమీద, నొకటికి బదాఱు కల్పించి తోల తాంగి." సారం. 3. 47.
  • 2. ఉన్నది యెక్కువ చేసి చెప్పు
  • "మొగుడు రాగానే ఆ పిల్ల ఒకటికి పదహారు కల్పించి చెప్పి అత్తను తఱమ గొట్టించింది." వా.

ఒకటి తప్పకుండ

  • అన్నీ, సర్వమూ.
  • "వారి పేర్లును వారి వర్తనంబు లొకటియు దప్పక యుండ..." కళా. 5. 86.
  • "బయలుదేరిన దగ్గర్నుంచీ ఇల్లు చేరే దాకా జరిగిన వన్నీ ఒకటి తప్పకుండా వాడు చెప్పాడు." వా.

ఒకటి యైన

  • మరొకవిధంగా ఏదైనా అనా ఒక___ఒక 299 ఒక____ఒక

హూతం సంభవిస్తే అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.

  • "అత డొకటి యైన నే నేగతి బోదుం జెపుమ." భార. ద్రోణ. 3. 287.
  • "మా మామ ఏదో ఒక టయితే నా గ తేమవుతుందా అని భయపడుతున్నాను. బావమర దంటే నన్ను చూస్తేనే సరిపడదు." వా.
  • రూ. ఏదో ఒకటి అయితే.

ఒకటి రెండు పలుకులలో

  • ఒకటి రెండు మాటలలో.
  • "నాకు, దెలుపు మొకటి రెండు పలుకుల ముగియగా, ననుచు." ప్రభా. 3. 31.

ఒకటి రెండు మాటలలో

  • ముక్తసరిగా.
  • "ఒకటి రెండు మాటల్లో నీవు పోయిన పని ఏ మయినదో చెప్పు. చేటభారతం వినే ఓపిక లేదు." వా.

ఒకటి వెనుక నొకటి వచ్చు

  • వరుసగా వచ్చు. ఆపదలు, దు:ఖాలు మొదలగునవి ఒకటి వెంబడిగా ఒకటి వచ్చు ననేసందర్భంలో అను పలుకుబడి.
  • "వెఱ గందితి నొకటి వెనుక నొకటి రా జొచ్చె." కళా. 3. 256.

ఒకటీ అరా

  • ఏ కొంచెమో.
  • "ఒక్కటి గా దరయుం గా,దక్కట పది గాద యిరువ దైనను గాదే." గుంటూ. పూ. పు. 44.
  • "ఏదో ఒకటీ అరా అయితే పరవా లేదు. వందరూపాయలకు లెక్ఖ తేలక పోతే ఎట్లా?" వా.

ఒకటీ రెండు రోజులలో

  • త్వరలోనే.
  • "అక్క డేం పని లేదు. ఒకటీ రెండు రోజులలో వచ్చేస్తాను." వా.

ఒకట్లు

  • ఎక్కాలు.

ఒకడు చనిన తెరువున వేఱొకడు చనక

  • చెల్లా చెదరుగా, దిక్కు కొక్కడుగా.
  • "...బృందారకబృందంబులు డెందంబుల నమందంబు లగు భయంబులం బొంది వికలతం బెగడు గుడుచుచు, నొక్కరుండు చనిన తెరవున గదిసి వేఱొక్కరుండు చనక నలుదిక్కులకుం బఱవం దొడంగిరి." హరి. 1. 183.
  • చూ. ఒకడు పోయిన త్రోవ వేఱొకడు పోక.

ఒకడు పోయిన త్రోవ వేఱొకడు పోక

  • ఎవరికి వారుగా, చెల్లా చెద రై.
  • "తిరిగి చూచుచు దట్లెగ దీసికొనుచు.దగలుదొట్టి యథాతథ లగుచు విఱిగి, యొకడు వోయినత్రోవ వే ఱొకడు పోక, చెట్టొకడు గాగ బఱచిరి చెంప్చు లపుడు." మను. 4. 103.

ఒకడు మోచినమో పిందఱు మోచు

  • అన్యోన్యంగా పరస్పరసహకారంతో మెలగు. ఒక____ఒక 300 ఒక____ఒక
  • "అతడు మనము నొకడు మో,చిన మో పిందఱు మోచిన, యనువుననీతోడుపడుట యతనికి గీడే." ఉ. హరి. 5. 304.

ఒక డొకని మొగంబు గానక

  • ఎవరికి వారుగా.
  • "వికలగతి నున్న రాక్షసు, లొక డొకని మొగంబు గాన కూరక చనిరి..." ఉ. హరి. 4. 270.
  • "ఒకరిమొగం ఒకరు చూచుకోకుండా దేశాని కొకర మయి పొయ్యాము." వా.

ఒక తల

  • ఒక యెత్తు.
  • "సకలైశ్వర్య సమృద్ధులు, నొకతల సంతానలాభ మొకతల." కాశీ. 3. 216.

ఒక తాటిమీద నడచు

  • ఏ కాభిప్రాయముతో మెలగు.
  • "మన మంతా ఒక తాటిమీద నడిస్తే మనల్ని ఏ అధికారీ ఏమీ చేయ లేడు." వా.
  • చూ. ఒకతాట్ల్మీద నిలుచు.

ఏకాభిప్రాయముతో నుండు.

  • "ఒకతాటిమీద నిలుస్తా మంటేనే నే నిందులో దిగుతాను. లేకపోతే నాపాటికి నేను పోతాను." వా.
  • చూ. ఒక తాటిమీద నడచు.

ఒక తెవలె ఆడి ఆడించు కొనుట

  • వాళ్లూ వీళ్ల లాగా ఇతరులను అనడం, ఇతరులతో అనిపించుకోవడం.
  • "ఒకతెవలె వాడి యాడించుకొనుటకే యిరుగు పొరుగు చూచె నొకో యుప్పకు జప్పకు గా నను జూచున్." నిరంకు. 2. 59.
  • "దాని దీనిలాగా నేను నాలు గని అనిపించుకోవడం మీ రెప్పు డైనా చూచారా?" వా.
  • "ఒకరివలె అనడం అనిపించుకోవడం నా కలవాటు లేదు." వా.

ఒకదారికి తెచ్చు

  • సరి అయిన మార్గంలో నడచుస్థితికి తెచ్చు.
  • "ఈ పిల్లను ఒక దారికి తెచ్చేభారం అంతా నీదే అన్నయ్యా! మాకు వేరే దక్షత యే ముంది?" వా.
  • "ఈ వ్యాజ్యం ఒకదారికి తెచ్చేబాధ్యత నీది. అస లిందులో నన్ను దింపింది నీవు." వా.

ఒక దెబ్బ తీయు

  • ఒక ఊపు ఊపు.
  • "ఒక దెబ్బ తీయగా జాలుదురు." విజయ. 1. 75.
  • "తలచుకొంటే మీ అన్నే మీ మామను ఒక దెబ్బ తీయగలడు. నే నేం చేయగలను?" వా.

ఒకని బట్టి పదుగురుగా

  • ఆజ్ఞాపింపగనే గుంపులు గుంపులుగా వచ్చు.
  • "ఉద్దవిడి రమ్మనిన భృత్యు లొకనిబట్టి పదుగు రత్తఱి బడిబడి బాఱుతెంచి." సారం. 1. 115.

ఒక నుడుగు అను

  • పాటలో ఒక చరణము పాడు.
  • "పెండ్లి పందిట్లో ఒకనుడుగు అనరాదషే." హేమా. పు. 81. ఒక____ఒక 301 ఒక____ఒక

ఒక పరిపాటి కాదు

  • మామూలుది కాదు. అసాధారణ మనుట.
  • "మేటి యా క్షేత్ర మొక పరిపాటి గాదు." పాండు. 3. 129.

ఒకపాటి....

  • సుమారైన, కొంచెం ఎదిగిన, తగుమాత్ర మైన - ఇలాటి భావచ్ఛాయలలో ఉపయుక్తమయ్యే పలుకుబడి. ఇంత, అంత లాగే చేతితో ప్రమాణము చూపుటద్వారా ఏర్పడినది.
  • "బూమె లెఱుగని యొకపాటి బుడుత యాకు, మడుపు లందీయ..." హంస. 1. 120.
  • ఇది నేటికీ వాడుకలో ఉన్నది.
  • "ఒకపాటి మనిషి అయితే దీన్ని ఎత్తగలడు." వా.
  • "ఒకపాటి మొద్దు తెచ్చి చెక్కితే దీనికి సరిపోతుంది." వా.

ఒకపూట కొకపూటకు

  • రాను రాను క్రమక్రమంగా.
  • "వారకులాచారవాసనాబాల్యంబు లొకపూట కొకపూట కుడిగిపోవు." కా. మా. 4. 23.
  • "ఒకపూట కొకపూటకు ఆకలి చచ్చిపోతూ ఉంది." వా.
  • రూ. పూటపూటకు.

ఒక పెట్టున

  • ఒక్కుమ్మడిగా.
  • "ఒకపెట్టున ద్రెళ్లి రంద ఱొగి రామునిచే." దేవీ. 3. 690.

ఒక పెద్దయె

  • అది ఒక ఘనమా?
  • "రౌద్రమూర్తినిన్, భీతి దొఱంగ జేయు టొక పెద్దయె వారితదేవతార్తికిన్." కా. మా. 3. 208.
  • "అదొక పెద్దేనా? అంత లావుమనిష ఆమాత్రం కడవ ఎత్త లేడా?" వా.

ఒకపోకకు గైకొనక

  • లెక్క చేయక.
  • "నా దెస మోహ మంతయున్, బొచ్చెము చేసి నన్ను నొక పోకకు గైకొన కివ్విధంబునన్." రుక్మాం. 4. 53.
  • ఒకపోకం తైనా లెక్క చేయక అనుట.

ఒక ప్రసంగ మై

  • ప్రసంగ వశాత్తుగా.
  • "అజుడె యొక ప్రసంగ మై చెప్ప వింటి..." ప్రభా. 2. 99.

ఒక ప్రొద్దున

  • చాలా చీకటి ఉండగానే.
  • "ఒకప్రొద్దున లేచి చేలోకి పోతే వీడి పశువులు సిద్ధం." వా.
  • "ఓ పొద్దున లేచి వెళ్ళాడు." వా.

ఒకమాట చెప్పు

  • సూచించు. సూచనగా ఏదో అను.
  • "ఒకమాట నాకు జెప్పక పోయితివి గాక, సకలదైత్యుల దున్మి జానకిని దేనె?" సుగ్రీ. పు. 30.
  • "నువ్వు ఒకమాట చెప్పి ఉంటే నేను వాడి సంగతి చెప్పి ఉండేవాణ్ణి." వా.

ఒకమాట చేయు

  • ఒక యేర్పాటు చేయు. ఒక____ఒక 302 ఒక____ఒక
  • "మానుమీ మోహ మని తెల్పి మానవేంద్రు, చిత్త మొగ్గించి యొకమాట జేసి..." శుక. 1. 464.
  • "ఏదో ఒకమాట చేసుకుంటే, తర్వాత డబ్బూ దకసం చూసుకో వచ్చు. ముందు ధర తెగనీయండి." వా.

ఒక మాత్ర

  • ఒక మాదిరిగా. దాదాపు అనుట.
  • "భాస్కరు నొకమాత్ర నేల బడగా వెస నేయ." భాస్క. యుద్ధ. 1. 783.

ఒక మూల వేయు

  • ఒక వైపు పడవేయు.
  • "సూలచేకటు లొకమూల వైచి సిరాజి గనుపుల గళ్ల చేకటుల దాల్చి." శుక. 1. 237.
  • "గుడ్డ లన్నీ ఒకమూల వేసిపోవే." వా.
  • రూ. ఒక మూల పడవేయు.

ఒక మోస్తరుగా

  • ఇంచుమించుగా.
  • అంత బాగా లే దనుపట్ల ఖచ్చితంగా చెప్ప లేనప్పుడు ఉపయోగిస్తారు.
  • "అతని కవిత్వం ఒక మోస్తరుగా ఉంటుంది." వా.
  • "ఒక మోస్తరుగా ఆ వ్యవహారం ముడిపడ్డట్టే." వా.

ఒక యంచుక యించుక

  • ఏకొంచె మయినా.
  • "ఆడదు గాని మాట లొకయంచుక యించుక వీను లొగ్గి నా, యాడినమాట లెల్ల విను నర్మిలితో దను నేను జూచినం, జూడదు గాని యొండు దెస జూచిన దానును జూచుచుండు." శకుం. 2. 42. పే.

ఒక యించుక

  • కొంచెము. భార. ఆది. 6. 115.

ఒక యింటివా డగు

  • గృహస్థు డగు, వివాహితుడగు.
  • "నీ వొక యింటివాడి వయితే చూసి కన్ను మూస్తాను. అంతకంటే నాకు కావలసిం దేముం దిక?" వా.

ఒక యింటివానిని చేయు

  • వివాహితుని చేయు.
  • "నిన్నొక యింటివాణ్ణి చేయా లని మీ నాన్న నానా యాతనా పడుతున్నాడు." వా.

ఒక యీడు

  • ఒక వయసు.
  • "వాడూ నేనూ ఒక ఈడువాళ్లం." వా.

ఒకరిమొగా లొకరు చూచుకొను

  • చూ. ఒండొరుల మోములు చూచుకొను.

ఒకరి మోచేతికింద గంజి తాగు

  • ఒకరిక్రింద నీచముగా బ్రతుకు.
  • "ఒకరి మోచేతికింద గంజి తాగడం నా కిష్టం లేదు." వా.

(ఒకరి) సొమ్ము అగు

  • సొంత మగు.
  • "ఏ కార్యముల్ చేసినం, దనరన్ మంచివె కాని కాని వగునే ధర్మంబు నీ సొ మ్మగున్." ఉషా. 1. 42.
  • 'అది వాని సొమ్ము. ఇది నీ ఒక_____ఒక 303 ఒక_____ఒక

సొమ్ము' ఇలా రూపాంతరాలలో ఉపయుక్త మవుతుంది. ఒకరు చదివిన ఆకున ఇంకొకరు చదువు

  • అతని వంటివాడే యితడు అనుట.
  • "వాడు చదివిన ఆకులోనే వీడూ చదివాడు. వాడు నాలుగుకంపెనీలు పెట్టి దివాలా తీసి నాలుగు లక్షలు వెనుక వేస్తే, వీడు రెండు కంపెనీలతోనే పది లక్షలు సంపాయించాడు." వా.

ఒక లకారం చేత పట్టు

  • ఒక లక్ష సంపాదించు. కొత్త. 325.

ఒక లాగైన

  • అనిర్వర్ణనీయ మైన. ఇది అని నిశ్చితంగా చెప్పలేని భావాన్ని వివరించుపట్ల ఈ 'ఒక లాగు, ఒక విధం' అనే మాటలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ 'ఒక'తో చేరిన 'లాగు'కు పర్యాయ పదా లన్నీ ఈ భావాన్నే స్ఫురింప జేస్తవి.
  • "విని యొకింత కనలి మన సొక లాగైన, నతని నారదు డని యాత్మ నెఱిగి..." కళా. 1. 153.
  • వాడుకలో:
  • "నా కేమో ఈ దినం ఒంట్లో ఒక మాదిరిగా ఉంది." వా.,
  • "వాడి మొహం ఈరోజు ఒక రకంగా ఉంది." వా.
  • "వాణ్ణి చూచేటప్పటికి నా మనస్సు ఒక విధంగా అయి పోయింది." వా.

ఒకలాగున కానిపించు

  • ఏదో ఒకవిధముగా ఉండు. మామూలుగా ఉండకుండు అని చెప్పుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "నీ విదేమి చెపుమ నే డొకలాగున గానిపించుచున్న దాన వతివ." కళా. 7. 225.
  • "అత నెప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఏమిటో అత డీ రోజు అదొకలా గున్నాడు." వా.

ఒక వరుస సొమ్ములు

  • ఒకసారి శరీరమం దంతట ధరింపదగు సొమ్ములు. ఇలాంటివి, కలవారికి ఏడురకాలవి ఉండు ననుటపై వచ్చిన మాట. ఏడువరుసల సొమ్ములు. ఒక్కొక్క వరుసను ఒక్కొక్క వారం ధరించడంమీద ఏడువారాల సొమ్ములు అన్న మాట వచ్చింది. నేటికీ ఒక్కొక్కరోజు ఒక రంగు చీర కట్టుకుంటే ఆరంగు అలంకరణలే ఆపాదమస్తకం వేసుకోవడం అలవాటు. మాటకు - ఒక చీర కట్టుకుంటే అదేరంగు జాకెట్టు, అదేరంగు 0క____ఒక్క 304 ఒక్క____ఒక్క

చెప్పులూ, అదే రంగు చేతి సంచి ధరిస్తారు.

  • "ధనముల జాలెలు రతనపు, బని, తగు నొక వరుససొమ్ము బనిచిన గణనాథున కీవచ్చు గదా యని..." శుక. 2. 216.

ఒక విధంగా

  • చూ. ఒక మోస్తరుగా.

ఒక వెలుగు వెలుగు

  • కొన్నాళ్లు గొప్పగా బ్రతుకు.
  • "ఏ మయితే నేం? వా డొక వెలుగు వెలిగాడు కదా!" వా.

ఒక హస్తపు మ్రొక్కు

  • ఒంటిచేతి నమస్కారము.
  • "నెన్నొసల్ కరమునం దిడి తీరనిషణ్ణ యై జలం, బాడగ బిల్చువారి నొక హస్తపుమ్రొక్కున నాడు డంచు." మను. 3. 86.

ఒక్క అంగలో

  • గబాలున.
  • "తుర్రు మని యొక్క యంగలో దూటి నాడు." మృచ్ఛ. 89.

ఒక్క కడుపువారు

  • ఒకే జాతివారు. ఒక రకమే అనుట.
  • "కాకవులు గాకవులు నొక్క కడుపు వారె." శ్రవ. 1. 10.

ఒక్కగా నొక్క...

  • ఏకైకసంతాన మనుట.
  • "ఉన్న ఒక్కగా నొక్క కొడుకూ చెడిపోతే వాడికి కష్టమే కదా!" వా.
  • "లేక లేక వాళ్లకు ఒక్క గా నొక్క కొడుకు పుట్టాడు. అంచేతే ఆకొడుకంటే వారి కంత ప్రాణం." వా.

ఒక్క గోర తిరుగు

  • ఒకేవిధంగా తిరుగు.
  • "కరి రయంబున జిఱ్ఱన సారి వోలె నొక్క గోర దిరిగె." కుమా. 10. 66.

ఒక్క చిన్న మంత మాట యాడిన

  • ఏమాత్రం నిందించినా.
  • "చిన్న నాడును బ్రియు డొక్క చిన్న మంత, మాట యాడిన విని తాపమగ్న వగుదు." కళా. 4. 134.

ఒక్కటికి పదాఱు సెల్లించు

  • గట్టిగా ఎదురుదెబ్బ తీయు.
  • "ఇంతయు నేల మీకు నెదు రెక్కటిలో మునికిం బదాఱు సెల్లింతు గడళ్ల త్రాకున వెలింబడ." ఉ. హరి. 3. 117.
  • "ఒకటికి పదహారు వడ్డించిందే తల్లీ నీ కోడలు. ఇంకా ఈ యింట్లో ఉండమంటావా?" వా.

ఒక్కటి అయితే

  • ఏదో ఒకటి అయితే నేనే మగుదునో అనుపట్ల ఉపయుక్త మయ్యేపలుకుబడి. ఏదైనా ఒక అనాహూతం జరిగితే - అనుట.
  • "తొడింబడ నితని కొక్కటి యయ్యె నేని..." కళా. 3. 264.
  • "ఈ ముసలాయిన కేదో ఒక్కటి అయితే నాగతి యే మవుతుంది?" వా.
  • చూ. ఒకటి యైన. ఒక్క____ఒక్క 305 ఒక్క___ఒక్క

ఒక్కతల్లి ప్రజలు

  • 1. సమానులు.
  • "సల్లలితాశోకపల్లవంబులు బాద, పల్లవంబులు నొక్క తల్లిప్రజలొ." కుమా. 8. 12.
  • 2. ఒక తల్లి పిల్లలు. 'మీరు ఒక తల్లి పిల్లలా?' అని ప్రశ్నించుటా 'మే మిద్దఱం ఒక్క తల్లి పిల్లలం' అని చెప్పుటా నేటికీ వాడుక.

ఒక్కని పంప పదుండ్రు వాఱు

  • ఎవరైనా ఆజ్ఞాపించినప్పుడు వారిమీది గౌరవంకొద్దీ, పనిలోని తీవ్రతనుబట్టి ఒకరిని పంపగా పలువురు పోవుట సహజము. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "ఊర్వశి దోడి తె మ్మనుచు నొక్కని బంప బదుండ్రు వాఱి సౌ,పర్వణసౌధ వీధుల యుపాంతములం దరుగంగ." ఉ. హరి. 1. 54.
  • "రెడ్డిగారు ఒకణ్ణి పోరా అంటే పది మంది పోతారు." వా.

ఒక్క పంటికిందికి వచ్చునా?

  • బొత్తిగా చాల దనుట. తిండివిషయంలోనే ఇది ఉపయోగిస్తారు.
  • "బండె డన్నము నా కొక్క పంటిక్రింది, కైన వచ్చునె." పాండ. ప్రవా. 12.
  • "అరవీసె వంకాయలు వండితే అల్లుడి కొకపంటి కిందికి చాలవు." వా.

ఒక్క పెట్టున

  • ఒక్క ఉదుటున.
  • "అహంకృతి పెక్కువ నొక్క పెట్ట కలహించుటకుం బిలుచుభంగి." ప్రభా. 2. 105.
  • "నలువుర నేవుర నలి నుచ్చి పాఱ, గల లొక్క పెట్టు భూతలముల రాల్చి." ద్విప. కల్యా. 79.

ఒక్క మొగముగా

  • ఏకముఖముగా.
  • "ఒక్క మొగము గాగ నుఱికిరి సైనికుల్." విజయ. 3. 157.

ఒక్కమొగి

  • ఒక్క మోయిన, ఏక ధాటితో.
  • "ఒక్క మొగి నలుదిక్కులు బిక్కటిల్ల, మిక్కిలి యెక్కు డగువైభవంబున నగరు వెలువడి..." కళా. 7. 69.
  • "విని కడగి యసుర లెనుబది, యెనిమిదివే లొక్క మొగిన యెత్తిన హరియున్." ఉ. హరి. 1. 147.
  • "ఒక్క మొగి నసురు లందఱు, బెక్కు తెఱంగుల నిశాతభీకరశరముల్, గ్రిక్కిఱియ నేయ." కా. మా. 2. 55.
  • 'ఒకమోయిన' అని నేటికీ ఈ మాట ఇదే అర్థంలో రాయల సీమలో వినబడుతుంది.
  • "లేచినప్పటినుండీ ఒక్క మోయిన వాడు తిడుతూ ఉన్నాడు." వా.

ఒక్క మొగ మై

  • ఒక్క టై, ఏకమై. హర. 6. 95. ఒక్క____ఒక్కె 306 ఒగ____ఒజ్జ

ఒక్క యుమ్మడి

  • ఒక్కసారిగా. హర. 7. 161.
  • చూ. ఒక్కుమ్మడి.

ఒక్కరూ పగు

  • సమాన మగు.
  • "నీవు బాండుండు విదురుండు నెమ్మి నాకు, నొక్కరూ పయినట్లు." భార. అర. 1. 87.

ఒక్కరేవున నీరు త్రాగించు

  • ఏవో సహజవిరుద్ధము లయిన వానిని కలియునట్లు చేయు.
  • "శైవజైనుల నొక్క రేవునం ద్రావించి పితృవధ పాపనిష్కృతికి దివిరె." రుద్రమ. 3. పు.
  • "అతగాణ్ణీ ఇతగాణ్ణీ ఒక విందులో కలిపా వంటే గొప్పసంగతే. పులినీ మేకనూ ఒక రేవులో నీరు త్రాగించడం మాటలా?" వా.

ఒక్కుమ్మడి

  • ఒక్క ఉదుటున.
  • "వార్ధు లొక్కుమ్మడి వారపట్ట." జైమి. 5. 3.
  • చూ. ఒక్కయుమ్మడి.

ఒక్కెత్తున

  • ఒక్క సారిగా. ఒకే ఒక ఊపులో అనుట. ఒక సారి అడుగెత్తి వేయుటతో - ఒక అంగలో - అనుట కావచ్చును.
  • "అగాధభవసాగరం బతడు దాటు నొక్కెత్తునన్." పాండు. 4. 89.

ఒగరు తీ పగు

  • బాధలే ప్రియ మగు. సామాన్యంగా తీపు సుఖానికీ హాయికీ, ఒగరు చేదులు తద్విరుద్ధస్థితికీ ప్రతీకాలు.
  • "పగటున మామా ప్రాణము మా కిక నొగరే తీ పాయె నుద్ధవుదా." తాళ్ల. సం. 12. 56.

ఒగరులాడు

  • ఆశించు.
  • "బిగిసేవు గాక ప్రియురాండ్రు నిన్ను వొగరులాడెడి వోడెందు గావా." తాళ్ల. సం. 3. 92.

ఒగుడాకువలె ఉండు

  • బాగా సన్నగా, పల్చగాఉండు. జొన్నదంటు కున్న ఆకులను ఒగుడాకులు అంటారు. అవి మరీ పల్చగా ఉంటాయి.
  • "మంచి వయసులో పిల్ల కదా! మరీ ఒగుడాకులాగా ఉందేమిటి?" వా.

ఒచ్చిన నోర పలుకు

  • నోటికి వచ్చినట్లు అను. అనగా నొవ్వ బలుకు.
  • "బంటు నొచ్చిన నోర బలుకండు నెఱ వాది." ఉ. హరి. 5. 278.
  • వాడుకలో నేడు:
  • "నోటికి వచ్చినట్లు జీతగాణ్ణి కూడా అనేవాడు కాదు పాపం!" వా.

ఒజ్జబంతి యగు

  • ఆదర్శప్రాయ మగు. దిద్దుకొనుటకై పిల్ల లకు ఉపా ఒజ్జ____ఒట్టి 307 ఒట్టి____ఒట్టి

ధ్యాయుడు పై పంక్తి వ్రాసి యిస్తాడు. అదే ఒజ్జబంతి, మేలిబంతి. అందుపై ఏర్పడిన పలుకుబడి.

  • "వైష్ణవాచార, పర్యాయముల కొజ్జబంతి గాగ." పాండు. 1. 20.

ఒజ్జల పుచ్చకాయ

  • కృత్రిమధర్మ ప్రవచనము. గురువుగా రొకరు తన శిష్యులకు పుచ్చకాయ నిషిద్ధమనీ, తినవ ద్దనీ చెప్పి తాను మాత్రం తినేవారు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • ఒజ్జలు = ఉపాధ్యాయులు.
  • "సమ్,ధ్యల బురలక్ష్మి ధర్మ విధులన్నియు నొజ్జల పుచ్చ కాయగా వెలయు." కళా. 1. 114.

ఒజ్జసాని

  • గురుపత్ని. గౌర. హరి. ద్వి. 1029.

ఒట్టికొను

  • హత్తుకొను.
  • "ఊపిరి మోచిననాడే ఒట్టికొంటి నాస లెల్ల." తాళ్ల. సం. 8. 83.

ఒట్టిగొడ్డు తాకట్టు '*వ్యర్థము.

  • వట్టిపోయి పాలివ్వని గేదె లాంటివానిని తాకట్టు పెట్టుకొనడంవల్ల వచ్చే దేమీ లే దనుటపై వచ్చినది.
  • "పట్టయినట్లొ కూర కొకపాతిక కాసులో యొట్టిగొడ్డు తా,క ట్టవి తాడనాస్పద కృకాటికి చేటిక కన్ను గీటినన్." బహులా. 5. 90
  • చూ. వట్టిగొడ్డుతాకట్టు.

ఒట్టిడిన యట్లు

  • ఒట్టు పెట్టినట్లుగా. 'ఏదైనా బొత్తిగా జరగ లేదు' 'ఠకీ మని ఆగినది' వంటి అర్థాలలో ఇది ఉపయోగిస్తారు. నీవు పోతే ఒట్టు అని ఎవరో అంటే ఆ ఒట్టును దాట లేక ఆగిపోయినట్లుగా అనుట.
  • "విడచెం ద్వదంగసంగానుభవేచ్ఛ యొట్టిడినయట్లు తదాదిగ..." కళా. 4. 21.
  • "వాడు మం దిచ్చాడు. ఒట్టు పెట్టినట్లుగా జ్వరం ఆగిపోయింది." వా.
  • "ఒట్టు పెట్టినట్లుగా ఆ పెండ్లికి ఎవరూ పోలేదు." వా.
  • చూ. ఒట్టుపెట్టినగతి.

ఒట్టిడుకొను

  • ఒట్టు పెట్టుకొను, ప్రమాణము చేయు, ప్రతిజ్ఞ చేయు.
  • "ఇట్టిక నూడినవాడో, యొట్టిడు కొన్నాడొ." ఉ. హరి. 1. 36.
  • "ఏం మజ్జిగ తిన నని ఒట్టు పెట్టుకున్నావా? వద్దే వద్దంటున్నావు?" వా.
  • వాడుకలో 'ఇడుకొను' 'పెట్టుకొను'గానే వినవస్తుంది.

ఒట్టినమంట

  • భయంకరుడు.
  • "పెట్టనికోట నీకు హరి భీముడు నర్జునుడున్ రణంబునం, దొట్టిన మంటలు..." భార. ఉద్యో. 2. 194. ఒట్టు____ఒడం 308 ఒడ____ఒడ

ఒట్టుపెట్టిన గతి

  • ఎవరో నిషేధించినట్లు.
  • ఒక్కమాటుగా, బొత్తిగా.
  • "నీకు నాకు బని లేదని యనుచున్నంతలో, నొట్టు పెట్టినగతి వాన దొట్టున వెలసిన నదియును లంబోదర మహోదరంబుగా నెంచి..." శుక. 3. 258.
  • "ఒట్టు పెట్టినట్లు ఒక్కడు కూడా ఆ పెండ్లికి వాళ్ళింటినుంచి రాలేదు." వా.
  • చూ. ఒట్టిడినయట్లు.

ఒట్టు వేయు

  • ప్రమాణము చేయు.
  • "వాడు తన కేమీ తెలియ దని ఒట్టు వేసి చెబుతున్నాడు. మనం నమ్మకపోతే ఎట్లా?" వా.

ఒట్టు సుమీ!

  • తప్పక ఇది జరుగుతుంది. ఇది నిజము అని చెప్పునప్పుడు ఒట్టు వేసికొనుట అలవాటు.
  • "ఒట్టుసుమీ యన్న నొట్టు సుమీ యంచు..." కళా. 3. 207.
  • వాడుకలో:
  • 'వాడు వసే ఒట్టు' 'తప్పకుండా వస్తాడు. రాకపోతే ఒట్టు' ఇత్యాదు లూహ్యములు.

ఒడంబడు

  • ఒప్పుకొను; కూడనిదానికి తల యొగ్గు; ఒడంబడిక చేసుకొను.
  • "మహేశు నీచపలకుత్సితవిప్రుడు వచ్చి నోర గ్రొ,వ్వులు పలుకంగ మీరును జెవుల్ సొర వించు సహించి మాఱు మా,టలు నొడికట్టి పల్కెద రొడంబడి నట్టులు బ్రహ్మబంధుతోన్." కుమా. 7. 55.
  • రూ. ఒడబడు.

ఒడగూర్చు

  • సంతరించు.
  • "యజ్ఞ సంభారముల్ వేగ నొడ గూర్పు మని." జైమి. 5. 134.
  • వాడుకలో:
  • 'ఒనగూర్చు' అన్నట్లు నేడు వినవస్తుంది.
  • "పెళ్ళి కన్నీ ఒనగూర్చుకొని కదా మిగత సంగతులు మాట్లాడాలి." వా.

ఒడమలగొడ్డు

  • ఆకారపుష్టి తప్పితే పనికి రానిది.

ఒడ లంటు

  • అంగమర్దనము చేయు.
  • "ఒడ లంట గాళ్లు పిసుకం, గడివెడు వేన్నీళ్ల నీయ గంచము వెట్టన్." శుక. 3. 341.

ఒడలు ఓడగు

  • శరీరము పాడగు. కుండ పగిలితే ఓడు అవుతుంది కదా! అట్లే...
  • "ఒడ లోడు కాజొచ్చు." నిరం. 2. 129.

ఒడలు కాల్చుకొను

  • అనవసరజోక్యము కల్పించుకొని నష్టపడు.
  • "ఇతరుల విషయంలో జోక్యం కల్పించు ఒడ_____ఒడ 309 ఒడ____ఒడ

కొని ఒళ్ళు కాల్చుకోవడం నాకు ఇష్టం లేదు." వా.

  • చూ. చేతులు కాల్చుకొను.

ఒడలు గుల్లల తిత్తిగా నుదికి చంపు

  • చావ దన్ను.
  • "ఒడలు గుల్లలతిత్తిగా నుదికి చంపె." భాస్క. యుద్ధ. 681.

ఒడలు చిదిమిన పాలు వచ్చు

  • శైశవావస్థలో నుండు. పాలు తాగేపసితన మనుట.
  • "పతి జనించిన గోలెను బరహితైక, లోలమతి యొడల్ సిదిమిన బాలు వచ్చు." నిర్వ. రా. 9. 22.

ఒడలు చేయు

  • వేషములు వేయు, నటించు.
  • "మిడికెదు పెదవులు వ్రేళులు, మడిచెదు కనుబోయి మొగిడి మాయెదుర గడున్, వెడ వీక యొడలు చేసెదు." ఉత్త. హ. 4. 44.

ఒడలు జాడించుకొను

  • శరీరము విదిలించుకొను. నేడు కాళ్లు చేతులు ఇత్యాదులు జాడించడం, ఒళ్లు విఱుచుకొనడంగా వాడుకలో నున్నది.
  • "కుందనంపు గొలుసులు ఫల్లుగల్లు మనంగ నొడళ్ళు జాడించుకొనుచున్ గొనసాగి సోగ లై." మను. 4. 27.

ఒడలు దాచు

  • పనికి ప్రాలుమాలు.
  • "ఆహా! నే డిదె కేల విల్లుగొని లక్ష్యం జేసి పాంచాలి గొన్, బాహూత్పన్నున కిట్టిచో నొడలు డాపం జెల్ల దొక్కింతయున్. పాంచా. 2. ఆ.
  • "వా డెప్పుడూ తల యెత్తకుండా పని చేస్తాడు. ఒళ్లు దాచుకోవడం వాని కెన్నడూ అలవాటు లేదు. ఆరకం వేరు." వా.
  • రూ. ఒడలు దాచుకొను.

ఒడలు నెళినెళి యగు

  • ధ్వన్యనుకరణము. శరీరము పటపట విఱుగు.
  • "యదూద్వహుండు దశముష్టిహతిన్, బిట్టడువ మయిదుముష్టుల, నెట్టు వొడిచె నతడు నొడలు నెళినెళి యనగన్." ఉ. హరి. 3. 72.

ఒడా లుప్పొంగు

  • ఆనందము కలుగు. ఆనందం కలిగినప్పుడు ఒడలు ఉబుకు ననుటపై యేర్పడినది.
  • "ఒడ లుప్పొంగు నొయారి జూడ." విజయ. 2. 149.

ఒడలు బలియు

  • సోమరితన మేర్పడు.
  • "వాడి లీ మధ్య ఒళ్లు బలిసింది. వా డిం కేం పని చేస్తాడు?" వా.

ఒడలు మోచు

  • దేహధారణము చేయు. పుట్టు అనుట.
  • "ఒడలు మోచినయది యొక యపరాధము." తాళ్ల. సం. 7. 285.

ఒడలు వంచి

  • కష్టపడి, శ్రమించి.
  • "పనుల కొడ ల్వంగక కా,మిను లిద్దఱు గూడి గోళ్లు మీటుచు దాదుల్." శుక. 2. 333. ఒడ____ఒడ 310 ఒడ____ఒడి
  • "వాడు ఒళ్లు వంచి పని చేస్తాదు." వా.
  • "వానికి ఏ పని చేయడానికీ ఒళ్లు వంగదు." వా.

ఒడ లెల్ల కన్నులుగ చూచు

  • ఎక్కువ ఆసక్తితో చూచు.
  • "....సహస్రదృక్తనూజుని నొడ లెల్ల గన్నులుగ జూచిరి మానసముల్ గరం గగన్." విజయ.

ఒడ లెల్ల కాళ్లు

  • కాళ్లు నడుచుటకు సాధనాలు. ఒడ లంతా కాళ్లై అనగా గబగబా పరుగు లిడు ననుట.
  • "వడి బాఱు జలమున కొడ లెల్ల గాళ్లు." బస. 2. 33.
  • రూ. తను వెల్ల - ఇత్యాదులు.

ఒడలెల్ల తలలు

  • పరిపూర్తిగా, అంతా అదే యై అను అర్థంలో ఒడ లెల్ల.
  • "వడి వీచుగాడ్పున కొడ లెల్ల దలలు." బస. 2. 33.
  • చూ. ఒడ లెల్ల భక్తి.

ఒడ లెల్ల నోళ్లు

  • శరీర మంతా నోరుగా మారిన దనుట. నోరు తినునది.
  • "వడి గాలుచిచ్చున కొడ లెల్ల నోళ్లు." బస. 2. 33.
  • చూ. ఒడ లెల్ల తలలు.

ఒడ లెల్ల భక్తి

  • పరిపూర్ణ మైన, ఏకాగ్రమైన భక్తి. శరీర మంతా - అత్యధిక మైన భక్తి అనుట.
  • "పడి జేయుబసవన కొడ లెల్ల భక్తి." బస. 2. 33.
  • రూ. తను వెల్ల శిరము ఇత్యాదులు.

ఒడ లోము

  • 1. శరీరరక్షణ చేసుకొను; ఒడలు దాచుకొను.
  • "ఒడ లోముటలు మోహ ముడుగునందాక." తాళ్ల. సం. 5. 152.
  • 2. జాగ్రత్తగా మెలగు. కృశించు అన్న అర్థం కొన్ని కోశాలలో ఇచ్చారు. కాని అది సరి కా దనిపిస్తుంది.
  • "ఒడ లోమి పెద్ద కాలం, బడవుల బడి." కుమా. 11. 43.

ఒడ లోముకొను

  • ఒళ్లు దాచుకొను.
  • "ఒడ లోమికొని మీర లున్నచో." వర. రా. కిష్కి. పు. 520. పంక్తి. 22.
  • చూ. ఒడలు దాచు.

ఒడలోర్చు

  • శ్రమకు తట్టుకొను. సుమతి. 49.

ఒడిగట్టు

  • 1. సిద్ధపడు.
  • "జీవులంగొట్టు రట్టున కొడిగట్టు వేలుపు." కా. మా. 4. 108.
  • 2. పాల్పడు. ఏదైనా తీసుకొనునప్పుడు ఒడిని పట్టి అందులో తీసుకొనే అలవాటుపై వచ్చినపలుకుబడి. వాడుకలో 'ఎంత పాపానికి ఒడిగట్టినాడువాడు' అంటారు. ఒడి____ఒడి 311 ఒడి____ఒడ్డు

ఇ దెప్పుడూ కూడనిదానికి ఒడబడు అన్న అథంలోనే ఉపయుక్త మవుతూ ఉంటుంది.

  • "గడిదేఱి జారవిద్యన్, వడిగట్టి దురంత కంతు వనజశరాళిన్!" హంస. 2. 25.
  • "తిట్టున కొడిగట్టి తిరుగుచున్నాడ." హరిశ్చ.
  • "లోకనింద కొడిగట్టితి గా." సారం.
  • రూ. వడిగట్టు.

ఒడిచికొను

  • ఒలిచి వేసుకొను. వాడుకలో ఒడుపుకొను.
  • "గాండీవ మాదిగా గల యాయుధావలులు...అప్పు డొడిచికొనగ మఱచిన వా డయ్యు." భార. అర. 1. 55. భార. అర. 2. 59.
  • "కనుమలో రంగమ్మను దొంగలు పట్టుకొని, ఆ నాలుగుసొమ్ములు ఒడుపుకొని పంపించారు." వా.
  • "చేలో పత్తి ఒడుపుకొని రావాలి." వా.

ఒడిచి పట్టు

  • బలాత్కారముగా, గట్టిగా పట్టు.
  • "ఎవ్వాలును నొడిచి పట్టంగా నే యెడ గానక." కళా. 6. 106.

ఒడి దప్పినపాము

  • వెల్లకిల పడిన పాము. ఒడుపు తప్పిపోయిన అనుట.
  • "కడు వెఱ గంది మురాంతకు, డొడి దప్పినపామువోలె నుండగ." ఉ. హరి. 3. 108.

ఒడి వట్టుకొని

  • రొండి పట్టుకొని; నిలవేసి. ఎవరి నైనా నిలవేసేటప్పుడు రొండిలో చెయివేసి - నడుమున కట్టుకున్న పంచెను కట్టుకున్న తావున పట్టుకొని ఆపడంపై వచ్చినది.
  • "ఒట్టు వెట్టి పోకు మని వొడి వట్టుకొని నిన్ను, దిట్ట యై తెరలోనికి దియ్యగాను." తాళ్ల. సం. 3. 140.

ఒడిసి పట్టు

  • గట్టిగా పట్టుకొను.
  • "పూబోడి యొరసికొని చనగా బయ్యెద యొడిసిపట్టి గనుకొంటి చెలీ." కళా. 1. 142.
  • "ఆ పిల్ల చెయి ఒడిసి పట్టుకునేసరికి బారు మని అఱిచింది." వా.

ఒడిసెల ఆడు

  • ఒడిసెలతో రాళ్లు రువ్వు.
  • "తా నొడిసెల జొన్నల కాడెడి, వడుపున బౌండ్రుండు ఱాల వైచెం బెలుచన్." ఉ. హరి. 3. 103.

ఒడ్డ గెడవుగా

  • ఓ రగిలినట్లుగా, ఒరగడ్డముగా.
  • "కాలు కాలు పెనగి కాలుబలంబులు, నొడ్డ గెడవుగా రథోత్కరంబు, మ్రొగ్గ తిలగ." భార. భీష్మ. 3. 320.

ఒడ్డుకు చేర్చు

  • గట్టెక్కించు. కొత్త. 438.
  • "న న్నీకష్టాలనుంచీ ఒడ్డింకించే భారం నీది." వా.

ఒడ్డు పొడ వగు

  • ఎత్తు లావు గల. ఒడ్డో_____ఒత్తి 312 ఒత్తి_____ఒత్తు
  • "ఒడ్డు బొడ వగుగుబ్బ లరయుచు గానరాగా." తాళ్ల. సం. 4. 30.
  • "అతను చాలా ఒడ్డుపొడ వైనమనిషి." వా.

ఒడ్డోలగం బై యుండు

  • కొలువు తీరి యుండు, సభ చేరి యుండు.
  • "బసవయ్య మొదలుగా భక్తులు దాను, నసమ మొడ్డోలగం బై యున్న యెడను." బస. 6. 169.

ఒడ్డోలగంగా

  • కోలాహలంగా, మహావైభవంగా.
  • "వాడి కూతురుపెళ్లి ఒడ్డోలగంగా జరిగింది." వా.

ఒడుదుడుకులుగా ఉండు

  • హెచ్చుతగ్గులుగా ఉండు. సరిగా లేదు అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "ఈమధ్య వ్యాపారం అంతా ఒడుదుడుకులుగా ఉంది." వా.
  • "రాజకీయరంగం నేడు చాలా ఒడుదుడుకులుగా ఉన్నది." వా.

ఒత్తి గొట్టాన పెట్టు

  • బాధించు, వేధించు.
  • "ఒత్తి గొట్టాన బెట్టగ బని లేదు ఓరి నీచిత్త మింతే కాని." తాళ్ల. సణ్. 12. 77.

ఒత్తి పండు చేయగలమా?

  • బలవంతంతో పని కాదు. ఏదైనా కాయ దానంతట అది పరిపక్వం కావలసిందే కానీ ఒత్తి ఒత్తి మెత్త బరిస్తే అది పండు కాదు. క్రమపరిణతి అవసరము అనుట.
  • "పలుకం బాఱని కాయల గొలుపం గల డెవడు పండ..." గువ్వలచెన్న. 12.
  • "అదేమో బుద్ధి వచ్చినపిల్ల. వాణ్ణి చేసుకుంటే సుఖంగా ఉంటావే అని నెత్తిన నోరు పెట్టుకుని వాళ్లమ్మ చెప్తూంది. అయినా ఒత్తి పండు చేయగలమా? దానికి తెలియాలి గానీ." వా.

ఒత్తిలి చీరు

  • గట్టిగా పిలుచు.
  • "చెలికత్తె నొత్తిలి చీర లేనియెలుంగు, సింహనాదంబుచే జెదర కునికి." ఉ. హరి. 1. 161.

ఒత్తిలి పాడు

  • నోరార పాడు.
  • "వాసుదేవ యనుచు నొత్తిలి పాడు నాక్రోశించు నగు జింతనము సేయు నతి యొనర్చు." భాగ. స్క. 7. 240.

ఒత్తుకొని వచ్చు

  • త్రోసుకొని వచ్చు.
  • "ఒత్తుకొని వచ్చు కటి కుచోద్వృత్తి జూచి." కవిక. 3. 26.
  • "ఎంతదూరం పోతున్నా అట్లా ఒత్తుకొని వస్తా వేం?' వా.

ఒత్తు దేరు

  • ఒరసికొను; అందుతో ఉబ్బెక్కు.
  • "ఉరుకుచాగ్రంబు లొండొంటి నొత్తు దేర." కుమా. 9. 143. ఒట్టు____ఒప్ప 313 ఒప్ప___ఒర

ఒత్తుబోవు

  • ఏదో తనకు వ్యతిరేకంగా జరుగగా భయభ్రాంతి కలుగు.
  • "పోయినసారి పంటకూడా పోయేసరికి బాగా ఒత్తుబోయినాడు మనిషి." వా.

ఒబ్బట్ల సంతర్పణ

  • పెద్ద సంతర్పణ. సామాన్యంగా పాయసంతో ముగిస్తారు. అలా కాకా ఒబ్బట్లతో చేస్తున్నా రంటే పెద్దది కదా మరి!

ఒదకలి యాడు

  • సరసము లాడు. (?) ఒదకలి అనగా సరస మని వావిళ్ళ్కోశం. ఇంకా ఆలోచించి తేల్చవలసి ఉన్నది.
  • "అమరధేనువుల్... అభిమతార్థముల్ గురిసె దేవాలిమీద, నెలమి నొదకలి యాడెడుచెలువవోలె." కుమా. 12. 195.

ఒద్దివడయు

  • తోడుపడు. ఒద్దిక అంటే మైత్రి కదా - అలా వచ్చినది కావచ్చును.
  • "హోమ ధూమము తావి యొద్ది వడయు." కాశీ. 2. 56.

ఒనరని

  • తగని. భీమ. 2. 154.

ఒప్పన గొను

  • గ్రహించు.
  • "కోటానకోటులు కోరికలు చిగిరించేని...వసము గావు...వీటిని వొప్పన గినవయ్యా." తాళ్ల. సం. 10. 154.

ఒప్పనము చేయు

  • అప్పగించు.
  • "బాతితో సర్వము నీ కొప్పనము సేసితిమి." తాళ్ల. సం. 9. 154.

ఒప్పన సేయు

  • అప్పగించు.
  • "నీకు నొప్పన సేసి నే వచ్చినాడ." వర. రా. అర. పు. 210. పంక్తి. 17.

ఒప్పితి ననిపించు

  • ఒప్పించు, భేష్ అనిపించు.
  • "వేయు నేల వాని నొప్పితి ననిపించెదన్." పాణి. 2. 55.

ఒప్పు మెఱయు

  • ప్రకాశించు.
  • "సారథిత్వంబు నాకు నొసంగి భూసుర సహితు డై యొప్పు మెఱసె." ఉ. హరి. 2. 36.

ఒయ్యనొయ్యన

  • మెల్ల మెల్లగా, క్రమ క్రమంగా.
  • "ఒక కొన్ని పయనంబు లొయ్య నొయ్యన బోయి." కా. మా. 3. 193.

ఒరగా లగు

  • కాలు కుంటుపడు.
  • "కప్పకు నొరగా లైనను, నప్పమునకు రోగ మైన సతి తులు వైనన్, ముప్పున దరిద్రు డైనను...." సుమతి.

ఒరగాల నేగు

  • కాలు పూర్తిగా మోపకుండా నడచు. ఒర_____ఒర 314 ఒర____ఒరే

ముల్లులాంటివి క్రుచ్చుకున్నప్పుడు ఆ భాగం ఆనకుండా నడచుటలో ఉపయోగించే పలుకుబడి.

  • పండితా. ప్రథ. పురా. పుట. 390.

ఒరగొను

  • ఒరపుపెట్టు.
  • "అచ్చులు నొరగొనునగసాలి యుండ." బసవ. పు. 102.

ఒరగోయు

  • కత్తి తీయు, ధిక్కరించు.
  • "చలికి నొరగోయ కే లుండు సైరి కుండు." క్రీడా. పు. 86.

ఒర వచ్చు

  • సాటి యగు, సమాన మగు.
  • "అప్పుడు మధ్యందినమున, నొప్పిన యినుతోడ జాల నొరవచ్చి గురుం, డప్పాండవబలములపై..." భార. భీష్మ. 2. 381.
  • "పదార్వ న్నె పసిండితోడ నొరవచ్చు." నైష. 6. 50.
  • బంగారం వన్నె తెలియడానికి ఒరగల్లుపై గీచి చూస్తారు. ఆ ఒర పెట్టినప్పుడు ఏ వన్నె బంగారమో తేలి పోతుంది.

ఒరవెట్టు

  • నాణ్యము చెప్ప గలుగు. ఒరపురాయిపై బంగారు వన్నె తెలిసికొనువాడుకపై వచ్చినది.
  • "పులుగురాయని చుట్టుపలవన్నె నొర వెట్టు, హొంబట్టు జిలుగు రెంటెంబు తోడ." ఆము. 1. 12.

ఒరసి చూచు

  • పరీక్షించు. బంగారాన్ని ఒఱపు రాతిపై గీసి చూచుట పరీక్షించుటకే - లక్షణయా పరీక్షించుట అని అర్థం.
  • "చూపవు నిన్ను నన్నొరసి చూచుదొ నా కిది దప్ప జూచునో." కుమా. 5. 77.

ఒరిగించు

  • లాభము చేయు.
  • "వా డేం ఒరిగించా డని అంత పట్టుక దేవుళ్లాడుతున్నావు?" వా.
  • ఇది సామాన్యంగా ఏం మహా చేశాడు? అన్న నిరసనలోనే ఉపయోగిస్తారు.

ఒరులు తల లెత్తి చూడగ

  • ఇతరులు వేలుపెట్టి చూపించునట్లుగా, ఇతరులు చూచి నవ్వి పోగా అని భావము.
  • "ఒరులు దల లెత్తి చూడగ గరకరి మనలోన వలదు..." భాస్క. అయో. 173.

ఒరే తరే అను

  • ఎదుటివానిని నీచముగా సంబోధించు, చూచు. కుమార. శత. 71.
  • "కనిపించేవా ణ్ణల్లా ఒరే తరే అంటుంటే ఎందు కోర్చుకుంటారు.? వా. ఒఱ____ఒల్ల 315 ఒలి____ఒల్వు

ఒఱగుబిళ్ళ (ఒరగుబిల్ల)

  • ఒరుగుదిండు.

ఒఱగొడ్డెంబు లాడు

  • అడ్డులు చెప్పు.
  • "ఒఱ్ఱగొడ్డెంబు లాడి." హరి. 2. 132.

ఒఱ్ఱదనము

  • కారము.
  • "ఆవపచ్చళ్లు చవి చూచిరి..యొఱ్ఱ దనము పొగలు వెడలింప నాసికాపుటములందు." నైష. 6. 121.
  • 'ఒఱ్ఱగా ఉంది' అన్న రీతిగా నేడూ ఉన్నది.

ఒలకపోయు

  • వెలార్చు అనుటకే నిరసనగా అనుమాట.
  • "ఏం ప్రేమ ఒలకబోస్తున్నా డమ్మా వా డీ మధ్య." వా.

ఒలసీ ఒల్లమి

  • అంతగా ఇష్టము లేమి.
  • "ఒలసీ నొల్లముల నీ నొల్లకుంటె నొల్లవు." తాళ్ళ. సం. 4. 117.
  • "ఒలసీ ఒల్లని పాపురం అంతంత మాత్రంలోనే ఉంటుంది." వా.

ఒల్లబోవు

  • మూర్ఛ చెందు, ఒడలు తెలియక పోవు, నిశ్చేష్ట మగు.
  • "ఒడల వాలంప పొది నింప నొల్లబోక." భార. భీష్మ. 3. 23.
  • "గ్రక్కున నత డొల్ల బోయి." భార. విరా. 5.
  • "గళావతి యొల్లబోయి విహ్వలు డయి..." నిర్వ. 4. 74.
  • "ఒల్లం బోయి." నైష. 2. 139.
  • "కలయంగ మేనశోణితము గ్రమ్మ ...పగటి పేరెండ దాకి, యొల్ల బోయిన లేబొండు మల్లెపొదల." ఆము. 2. 56.
  • "రామభూవిభు డొల్లంబోవంగ..." చంద్రా. 1. 24.
  • "అప్పటి పరమమోద మెల్ల బోనాడి విన్న నై యొల్లబోయి." భాస్క. యుద్ధ. 2355.

ఒలివడు

  • సొత్తు దోపిడి చేయబడు. దోపిడికి గుఱి యగు.
  • "ఒలివడ్డ నెపమున గల లేని సిరి చెప్పి, చుట్టలపై దాడివెట్టు వారు." ఆము. 6.

ఒలివోవు

  • వ్యర్థ మగు, దోపిడి వోవు.
  • "ఒలివోయి యీలేక యొక పూట వెట్టిడి, తామరచెలిపట్టి దడవ నేల." యయా. 1. 29.

ఒలుకుల బూది

  • చితాభస్మం. స్మశానంలోని బూడిద. కుమా. 7. 37.

ఒలుకుల మిట్ట

  • స్మశానము. స్మశానాన్ని రాయలసీమలో నేటికీ ఒలుకులు అనే అంటారు. 'ఒ' 'వ' గా విన వస్తుంది.

ఒల్వువడు

  • ఓడిపోవు; ఓటమి చెందు.
  • "చిరముగ నొల్వువడ్డ నరసింహుని కంటెను బెద్దలే?" కుమా. 4. 76. ఒళ్లం____ఒళ్లు 316 ఒళ్లు____ఒళ్లు

ఒళ్ళంతా తేళ్ళూ జెర్రులూ ప్రాకినట్లు

  • మహా బాధగా, ఎట్లెట్లో ఉన్న దనుట.
  • "ఆ మాట వినేసరికి నాకు ఒళ్ళంతా తేళ్ళూ జెర్రులూ ప్రాకిన ట్లయింది." వా.

ఒళ్లు కంపర మెత్తు

  • ఎక్కువ భయము కలుగు.
  • "ఆ మాట వినేసరికి నాకు ఒళ్లు కంపర మెత్తి పోయింది." వా.

ఒళ్ళు జలపరించు

  • ఒళ్ళు జలదరించు.
  • "నాకు చల్లగా ఏది తగిలినా ఒళ్ళు జలపరిస్తుంది." వా.
  • రూ. ఒళ్ళు జలదరించు.

ఒళ్ళు జల్లు మను

  • జలదరించు.
  • "కప్పను చేతితో పట్టుకొంటే కొందరికి ఒళ్లు జల్లు మంటుంది." వా.

ఒళ్లు తడుపుకొను

  • స్నానము చేయు.
  • "ఎండలో బడి వచ్చానా! కాస్త ఒళ్లు తడుపుకొంటే కానీ యేమీ తోచదు." వా.

ఒళ్లు దగ్గర పెట్టుకొని

  • జాగ్రత్తగా. కాస్త బెదిరింపుగా అనుమాట.
  • "కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు." వా.

ఒళ్లు దాచుకొను

  • పనికి పాలుమాలు.
  • "వాడు పాపం ఒళ్లు దాచుకొనేవాడు కాదు. ఎంతప నైనా చేస్తాడు."
  • చూ. ఒడలు దాచుకొను.

ఒళ్లు పెంచు

  • పనీ పాటా చేయక ఒడలు దాచుకొను. మదన. శత. 67.
  • "అట్లా దమ్మిడీ పని చెయ్యకుండా ఒళ్లు పెంచుకుంటే ఏం లాభం?" వా.

ఒళ్లు నీరు విడిచి పోవు

  • శీతలము క్రమ్ము, అవసానదశ సమీపించు.
  • "ఒళ్లు నీరు విడిచి పోతే! ఇంకా ఆశయే ముంది?" వా

ఒళ్లు పెట్టు

  • కండ పెట్టు.
  • "వాడీమధ్య బాగా ఒళ్ళు పెట్టాడు." వా.

ఒళ్లు పొగ రెక్కు

  • మద మెక్కు
  • "రిరిపం తిండి తిని వాడికి ఒళ్ళు పొగ రెక్కింది." వా.

ఒళ్లు భారగించు

  • సోమరితనముగా నుండు.

ఒళ్లు మండు

  • కోపము కలుగు.
  • "వాడి పే రెత్తా వంటే ఒళ్ళు మండుతుంది." వా.

ఒళ్లుమరపు

  • మఱపు.
  • "అంత ఒళ్ళుమరపు అయితే ఎట్ల రా? సాయంత్రం యిచ్చింది పొద్దునకు ఒళ్లు____ఓగు 317 ఓచె____ఓట

ఎక్కడ పెట్టావో తెలియకపోతే ఇంకేం చేస్తావు?" వా.

ఒళ్లు హూన మగు

  • శ్రమతో అలసిపోవు.
  • "పొద్దున్నుంచీ తిరిగి తిరిగీ ఒళ్లు హూన మై పోయింది." వా.

ఓం అను

  • అంగీకరించు.
  • "ఆమె యి రాయబారమున కత్యధిక క్రుధ బూని భాస్కరుం, డో మని భీమనాదరభసోచ్ఛ్రిత... భేదవాదవా, త్యామయ చక్ర చంక్రమతతంబుగ బోరంగ..." శంకర. విజ. 5. 60.

ఓంకార మాచరించు

  • అంగీకరించు.
  • "అభిలషింపంగ వోంకార మాచరించు." నైష. 2. 69.

ఓంప్రథమంలో

  • మొట్టమొదట.
  • "ఓంప్రథమంలోనే త ప్పుంటే యింక ఆ పుస్తకం సంగతి చెప్ప నక్కఱ లేదు." వా.

ఓ అంటే ఓ అను

  • పిలిస్తే పలుకు.
  • "ఓ యన్న నో యనంగల యాయ మయే యున్న..." వి.
  • "ఓ అంటే ఓ అనడానికి కైనా ఎవరో ఉండొద్దా?" వా.

ఓగులవాడు

  • నాయకుడు, ఆదర్శము.
  • "పిఱికి, వారి కెల్లను నోగులవాని గాగ, నురముపై జీడి నిఱ్ఱి యచ్చొత్తి విడిచె." కుమా. 4. 16.
  • వావిళ్ళలో అధమాధమ చిహ్నుడు. మిక్కిలి తక్కువవా డనుగుర్తు గలవాడు అని అర్థం చెప్పి ఈ పద్యమే ఇచ్చారు. మొత్తం పద్యం అర్థ మంతా చెప్తే కుదరదు. 'పిఱికి వారిలో ఓగులవాడుగా' అంటే చాలా చాలా పిఱికివాడు అని అర్థం వస్తుంది. ఓగు లవా డంటేనే అధమాధము డైతే పిఱికి వారిలో ఓగులవాడుగా అని ఎందు కనవలసి వస్తుంది?

ఓ చెల్ల!

  • అమ్మక చెల్లవలెనే ఆశ్చర్యారకం.
  • "పులిగూడు దిండిగొఱగం, గలిచియు వోచెల్ల! యింత గల్పించెదు శ్రీ, గల వాని దగినపురుషుం, గలిచిన నీ కన్ను బొమయె గను డరు దనుమా." కుమా. 7. 43.

ఓజుకు వచ్చు

  • దారికి వచ్చు.
  • "రథ్యము లోజకు వచ్చి మెచ్చగా." భాస్క. యుద్ధ. 640.

ఓటకండ

  • పిఱికికండ, భయము.
  • "అజశిరోదళను డన్న దరు లేదేనియు గాలారి యనునోటకండ లేక...పంచె నట్టియుగ్రుపై నిన్ను." కుమా. 4. 61.

ఓటకండ సెడి

  • భయము లేక.