నీలగిరి పాటలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
నీలగిరి పాటలు

సుందరతర మీ నీల నగము

రాగము, సురట, - తాళము, ఆది.

             పల్లవి
సుందరతరమీ నీల నగము దీని|
యందము హృదయానందకరము దీని|
చందము హృదయానందకరము ||
            అనుపల్లవి
నందన వన నిదె - నాతిరొ వింటివె|
బృందారక ముని - బృంద సేవితము||

    చరణములు
1. ఎచ్చట జూచిన - బచ్చిక పట్టులు|
   పొద పొద రొదలిడు - పొలుపగు పిట్టలు|
   వింత వాసనలు - వీచెడు చెట్టులు|
   కుదురు రథ్యగల - కొలకుల గట్టులు||

2.నిచ్చలు నగముల - నీటగు తోఁటల|
   విచ్చలవిడి చను - నచ్చపు మొగుళుల|
   నచ్చరఁగేరెడు - మచ్చెకంటు లిటl
   మించు తీవలన - మించి చరింతురు ||

3. పాద ఘట్టనకుఁ - బర్వు చక్రములు|
   మంత్ర మహిమనగు - జంత్రపు రథములు!పందెము వారెడు - పటుజవనాశ్వము|
లందముగా నిట - గ్రందయి తోచును||

4. గట్టుల లోయలఁ - గాజు చప్పరల|
   మట్టి గోలెముల - మడువుల నడవుల|
   నెల్లెడ విరియగ - వెల్లువలై విరు|
   లిక్షధన్వు దొన - లక్షయమయ్యెను!!

5. తప్పక భృత్యుల - నెప్పుడు బ్రోచెడి|
   యప్పలకొండయ - మాంబా దేవిని|
   నొప్పుగఁబ్రోచుత - నప్పుర దమనుఁడు|
   మెప్పగు వరముల - విప్పుగఁగురియుచు||ఊటి చోద్య మేమి చెపుదు

రాగము, పంతువరాళి - తాళము, రూపకము

                          పల్లవి
ఊటి చోద్యమేమి చెపుదు - నువిద వింటివే!
                      అను పల్లవి
సాటియేది యూటి కెందు-
స్వర్గమైన దీని క్రిందు.
                      చరణములు
1. వాటమైన తటములందు -దోటలెంతొ సొంపు మీరఁ|
   గూటములను సౌధరాజి - కుదిరి మెరయఁగా|
   మాటు మణగి శివుని జటా - జూటమునను గంగపగిది|
   కోటి హ్రదములందు జలము - కొమరి యమరి యుండును||

2. పండు వెన్నెలచటి పవలు - పావకుండు రాత్రులందు|
   దండ నుండి యింట నింట - దయను బ్రోవఁగ|
   నెండ దాడి కోడి సీతు - కొండ వట్టెనేమొ యనఁగ|
   నిండు కొలువు హేమంత - ముండి యిచట వెలసెను||

3. వెన్నునిసిగ నమరియున్న - వేల్పు తరువు విరుల మాట్కి|
    సన్న సన్న వెండి మబ్బు - చఱియ లంటగా|
    మిన్ను బూయ సంజకాఁడు - మేళవించు రంగు లనగ|
    వన్నె వన్నె పూలగములు - వనముఁ గ్రమ్మి మెరయును||

4. వెండి కొండ దొరను బూజ - వేట్కమీరఁ జేయు నప్పల|
    కొండయాంబాధిరాజ్ఞి - కొలువు మహిమను|
    దండి నీల నగము కనుల - పండువగను జూడగలిగె|
    రండు చెలియలార నేడు - పండెను మన సుకృతమెల్ల||ఉమాపతి యర్చన.

రాగము, భైరవి - తాళము, చాపు, మిశ్రజాతి.

                    పల్లవి
ఉదకమండలమున - నుమాపతి యర్చన |
కోటి గుణితమై - కోరిక లీడేర్చును |
                 అనుపల్లవి
వెల్లనౌ మబ్బులు - విరిసి వెన్నెల గాయ!
వెండి కొండని సురలు - వేట్కతో రాఁగ||
                చరణములు
1. కర్పూర తరువులు - కంబములై తోప|
   మిన్ను పందిరిఁబోల - మించు దివ్వెలుగాఁI
   బచ్చల హసియించు - పచ్చికపై విరు|
   లచ్చర లిడు మ్రుగ్గు - టచ్చున వెలయఁగ||

2. దేవదారు తరులు - దివ్య గంధము లీన|
   యక్ష గానము మీఱి - పక్షులు పలుక|
   రసితమల్లదె శంఖ - రావమై చెలఁగఁగ
   దీవ లేమలు పూలు - తిరముగ గురియఁగll

3. ఆశ్రిత వరదుఁ - డంబికా రమణుఁడు!
    బాలచంద్రమౌళి - భక్తికి నెదమెచ్చి|
    రాజరాజపుత్రి - రాజ్ఞి నప్పలకొండ|
    యాంబఁ బ్రోచుఁగాత - నధిక సౌఖ్యము లిచ్చి||

నాటి మాట

రాగము, అఠాణా - తాళము, రూపకము

                  పల్లవి
    నాటి మాట మఱచుట యే!
    నాటికైన మఱవ వశమ||
               అనుపల్లవి
    బోటి ప్రాణ మీ వంటి, ము |
    మ్మాటికి నిను విడ నంటి||
              చరణములు
1. మాట మూట గట్టి కొని|
   పాటిదప్పి తనుట నా పొర|
   పాటుగాక, మాటన నే|
   పాటిర నీ సాటి దొరకు||

2. బ్రతుకు నందు లేని స్థిరత|
   వెతక నేల భాషయందు!
   నతుకు వేష భాష కోడు!
   నతివలదే తప్పుగాక||

3. సాటి లేదు నా కంటివా!
    మాట నిజము నేడు గంటి|
    సాటి కలదె నమ్మి భంగ|
    పాటు పడిన పడఁతి కెందు||

4.మేటివైన నీ యెద మొగ|
   మాట మెటుల బాసె, నొక్క|
   మాటురా, నీ యోటు మాటె
   కోటి ధనము లిచ్చి కొందు!!లేవొకో మంత్రములు

రాగము, శంకరాభరణము- తాళము, ఝంప

1. లేవొకో మంత్రములు -లేమగాఁ జేయ నిను|
   లావపుడు బయలు బడు నొక్కొ|
   కావనుచు నీలాటి-కాంతునకుఁ జిక్కి నీ|
   భావమున నలయికనుబడుదొ||

2. మంచియును చెడ్డయును మానమును గనక పటు!
   వంచనను పరకాంత దగిలి|
   యించుకయినను లోక-మెంచునని భీతిలక|
   కొంచెతన మూను టది కొమరొ||

3. మగఁడవై పగ తీర్చు-పగతుఁడవు గాక నిది!
   తగునటర తలపోయకుంట!
   మిగిలినది లేదు రిఁక మీద నిను నమ్మ నా|
   నగధరుని నమ్మెదను లేరా||

చిత్తరువని చూడ

రాగము, శంకరాభరణము- తాళము, మిశ్రజాతి చాపు

                        పల్లవి
   చిత్తరువని చూడఁ జిత్తము గొంటివి |
   చిత్తజు నపరంజి - చిలుక యెవ్వతెవే ||
                     అనుపల్లవి
   వత్తువొ నా మ్రోల - వలరాజు వేఁడిన |
   మత్తకాశిని నీదు - మనమైన నీగదె ||
                    చరణములు
1. ఇచ్చి పుచ్చుకొంట - యిలలోని మర్యాద |
   ముచ్చిలి మౌనము - మెచ్చుదు రటవే |
   వచ్చి చూచినంత - వంచనఁ జేయుదె |
   పచ్చి దొంగతనము - పడతిరొ పరువె ||

2. మనసులేని తనువు - మరి యేలనే నాకు |
   చెనటి దీనిఁగూడ - చేకొనఁ గదవె |
   వానికి బదు లొక్క - వాక్కు నే వేఁడెద |
   మానిని యీపాటి - మన్నింపఁ జెల్లునె ||

3. విలువ చాలదన్న - విరివిల్తుపై నాన |
    కలుగు జన్మములఁ - గానుక కొనవె |
    ఎలమి నానందేంద్రు - నేలిన వెన్నుఁడు |
    పలు తెఱఁగుల మేలు - పడతి నీ కిచ్చునె ||

(ఈ ఆరు పాటలు "నీలగిరి పాటలు” అనే చిన్న పుస్తకంలోనివి. ఈ పుస్తకం 1907లో అచ్చయింది. రీవా మహారాణి అప్పుల కొండయాంబ 'అనుజ్ఞ'తో ఈ ఆరు పాటలు రాసి ఆనంద గజపతి స్మృతికి అంకింతం చేశారు గురజాడ. ఈ పాటలను ఆయన Songs of the Blue Hills పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. తెలుగు మాతృక, ఇంగ్లీషు అనువాదం ఒకే పుస్తకంగా అచ్చయ్యాయి. -సం||)

విషయసూచిక[మార్చు]

ఇతర మూల ప్రతులు[మార్చు]

This work was published before January 1, 1925, and is in the public domain worldwide because the author died at least 100 years ago.