నా జీవిత యాత్ర/p237a

వికీసోర్స్ నుండి

హాజరయి, నా నిష్కల్మష హృదయాన్ని రుజువు చేసికోవడానికి వీలు లేకపోయింది. తాను రిపోర్టు మీద సంతకము చేయలేదంటూ కోర్టులో సుబ్బరామయ్యగారిచచిన వాఙ్మూలం నన్ను చకితుణ్ణి చేసింది. నిజానికి నా దగ్గర, సుబ్బరామయ్య రిపోర్టులో సంతకం చేశాడని రుజువుచెయ్యడానికి కావలసిన సాక్ష్యం ఉంది. రిపోర్టు 'హిందూ'లో విడుదల అయిన తర్వాత అది కరెక్టుగా ఉన్నది అంటూ నా పేర వ్రాసిన ఉత్తరాలున్నాయి. గాంధీ సలహాను పాటిస్తూ, కోర్టులలో వాదించకూడదనే నిశ్చయానికి వచ్చి ఉన్న ఏను ఈ రుజువులన్నీ హైకోర్టువారి ఎదుట ఎల్లా పెట్టగలను?

ప్రతిక్రియ

అందువల్ల నా మర్యాద నిలబెట్టుకోవడంకోసం, సంగతి సందర్భాలన్నీ ప్రజలముందు ఉంచాలనే నిశ్చయముతో, సుబ్బరామయ్యగారి ఉత్తరాలను ప్రజాముఖాన్ని ఉంచాలనే ఉద్దేశంతో, వాటి నన్నిటినీ పత్రికలకిచ్చాను. జస్టిస్ రామేశంగారు ఈ విషయాలన్నీ గమనించాలనీ, కోర్టుల బహిరంగంగా ఆయన చేసిన విమర్శనలు ఉపసంహరించుకోవలనీ, కోర్టువారికి యీ కేసు దర్యాప్తు చెయ్యడానికి అధికారం లేదనే అభిప్రాయంతో ఉన్న కారణంగా నేను వారి ఎదుట హాజరుకాకపోయినా, న్యాయం జరిగించడమే న్యాయం గనుక, ఈ ప్రకటించబడిన విషయాలన్నీ గమనించవలసి వుంటుందనీ, జస్టిస్ రామేశంగారిని పత్రికా ముఖంగా కోరాను. పబ్లికు కోర్టులో వారు పలికిన పలుకులు ఉపసంహరించుకోమని కోరుతూ పత్రికలలో ప్రకటించిన నా ఉత్తరాలు జస్టిస్ రామేశంగారికి రిజిస్టర్డ్ పోసటలో పంపించాను. రామచంద్రయ్యరుకు కూడా, తాను దాఖలు చేసిన అఫిడవిట్టును సరిదిద్దుకోవలసినదని కోరుతూ, ఆ లేఖల కాపీలు ఆయనకీ పంపించాను. జడ్జిగారి దగ్గరనుంచి గాని, ప్లీడరుగారి దగ్గరనుంచి గాని నాకు యే విధమయిన సమాధానాలూ రాలేదు. సుబ్బరామయ్య దాఖలు చేసిన అప్పీలు కొట్టవేసినట్లు దర్మిలా తెలుసుకున్నాఉన. జ్యూరిస్ డిక్షను లేదంటూ వదించిన నా విధానమూ, తన్ను తాను డిఫెండ్ చేసుకుంటూ క్రింది కోర్టులో సుబ్బరామయ్య తీసుకువచ్చిన తికమకలూ, హైకోర్టుల తీసుకురాబడ్డ అబద్ధపు అడ్డకులు, మున్నగునవన్నీ హిచ్‌కాక్‌కు తన పక్షాన్నే ఇవ్వబడిన తీర్పూ, నా జ్యూరిస్ డిక్షన్ అభ్యంతరమూ గమనించి కూడా, నా పైన డిక్రి అమలు పరచడానికి హిచ్‌కాక్‌ ఎప్పుడూ ప్రయత్నించలేదు. డిక్రీ హోల్డరు తన చేతులతోనే డిక్రీని చంపుకున్నాడన్నమాట. సుబ్బరామయ్యమీద డిక్రీ అమలు జరిగిందో లేదో, దాని గతి యేమయిందో తెలుసుకోవడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు. ఏదో అయి ఉంటుంది, ఏమయితే మన కెందుకు అనే భావమే ఆ డిక్రీ విషయంలో నాకు కలిగింది. ఏది ఏమయినా జీవితంలో ఇది ఒక మంచి అనుభవం.

సహాయనిరాకరణ ఉద్యమ ప్రారంభదశలో గాంధీగారిచ్చిన ఒక ఉపన్యాసంలో, పై ఉదంతాన్ని పేర్కొంటూ, ఆ సందర్భంలో ఆయన, నాకు, సలహారూపంగా సివిలు కోర్టులలో పెట్ట తగ్గ వాదనా విధానాన్ని సూచించానని చెప్పారు. అంటే ఈ కోర్టులలో నాకు నమ్మకం లేదు. ఈ కేసు విచారించడానికి ఈ కోర్టువారికి హక్కులేదు మున్నగు నినాదాలన్నమాట! ఆ సందర్భంలో ఆయన త్రివిధ బహిష్కరణ అంటే యేమిటో చెబుతూ, సహాయ నిరాకరణ వాదులపై ఏవేని కేసుల కోర్టులలో మోపబడినప్పుడు, కాంగ్రెసువారు అవలంబింప వలసిన విధానానికి ఉదాహరణగా, ఆనాటి కేసూ, తానిచ్చిన సలహా ఆ సందర్భంగా ఉటంకించారన్నమాట! ఈ ఉదంతాన్ని గాంధీగారు తమ ఉపన్యాసంలో చెపుతూన్న సందర్భంలో నా ప్రక్కనే నిలిచిఉన్న వల్లభాయ్ పటేల్ గారు, "ఏమిటి నిన్ను గురించి అంటున్నారు", అంటూ అతి మెల్లిగా, రహస్యంగా అడిగారు. ఇట్టి ఉదంతాల కారణంగానే గాంధీగారికి సన్నిహితుడనవడమూ, 1922లో ఆయన అరెస్టయి నిర్బంధింపబడే వరకూ ఆయన్ని వెన్నంటి ఉండడమూ సంభవించాయి.