నా జీవిత యాత్ర-4/సంవిధాన సభ:ఆంధ్రరాష్ట్రము

వికీసోర్స్ నుండి

16

సంవిధాన సభ:ఆంధ్రరాష్ట్రము

లోగడ ప్రకాశంగారి ఒత్తిడిపైన, మరికొందరు మిత్రుల ఒత్తిడిపైన - సంవిధానం ముసాయిదాలో ఆంధ్రరాష్ట్రం పేరు, మిగిలిన రాష్ట్రాలతోబాటు వ్రాశారనీ, కాని, 21-2-1948 న ప్రకటితమైన రెండవ ముసాయిదాలో ఆ పేరు వదిలిపెట్టేశారనీ వ్రాశాను. ఆలాగు వదిలిపెట్టడానికి, రాష్ట్రం ప్రత్యేకంగా కార్యనిర్వహణ జరుపు కోవలెనంటే, కొన్ని పనులు ముందుగా జరగవలెనని కారణాలు చెప్పారు. 1947 లో అమలులోఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు ప్రకారం క్రొత్త రాష్ట్రంయొక్క యంత్రాంగం సిద్ధం చేసుకొని ఉండాలి. రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని హంగులు, రాష్ట్రంలో చేరవలసిన భూభాగం సరిహద్దులు సిద్ధంగా ఉంటేనే సంవిధానం షెడ్యూలు (అనుసూచి) లో రాష్ట్రంపేరు ఉంటే లాభముంటుందని వారు చెప్పారు.

సంవిధాన సభలో ఈ విషయం వచ్చినప్పుడు ప్రకాశంగారు ఇలా అన్నారు.

"అధ్యక్షా! ఈ సందర్భంలో ఒక విషయం మీ దృష్టికి తెస్తున్నాను. ఇప్పటికి 36 సంవత్సరాలుగా, ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రతినిధులుగా వచ్చిన డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు, ఆచార్య రంగాగారు, నేను మొదలైనవారము ఆంధ్ర రాష్ట్రం కావాలని వాదిస్తూనే ఉన్నాము. ఇప్పటివరకు మా కోరిక ఫలించలేదు.

"అయితే, ఈ రోజున మా సూత్రాన్ని కాంగ్రెసు వర్కింగ్ కమిటీవారు ఆమోదించారు. జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయి పటేలు, పట్టాభి సీతారామయ్యగారలకు ఈ సూత్రాన్ని అంగీకరించినందుకు నా కృతజ్ఞత. దీని విషయమైన పని ఈ రోజునే ప్రారంభం కావాలి. చెన్నపట్నం సంబంధించి తగాదా వచ్చింది. అది పరిష్కరించలేకపోయాము.

"అధ్యక్షా! మీరు థార్ కమిషనును నియమించారు. వారు దేశమంతా తిరిగారు. సమస్య బాగా పరిశీలించారు. కొన్ని సిఫారసులు చేశారు. వారు చేసిన సిఫారసులు ఆధారంగా చెన్నపట్నం - ఆంధ్రరాష్ట్రానికి కలపాలి అన్న వాదము, లేక పట్నం రెండుగా చేసి, రెండు రాష్ట్రాలకు చెరొక భాగం ఇవ్వాలనే వాదము; లేక చెన్నపట్నాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న వాదము అటుంచి, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుచేయాలని కోరాము. వర్కింగ్ కమిటీవారు ఈ సమస్య విషయమై ఏ పరిష్కారానికీ రాలేకపోయారు. కాని, సరిహద్దు కమిషను వారు ఈ విషయంకూడా ఆలోచించే అవకాశ ముండగలదని తేల్చారు. అందుచేతనే, వర్కింగ్ కమిటీవారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రాంతానికి చేసిన ఈ విధమైన ఏర్పాటు భాషారాష్ట్రాలు కోరుతున్న ఇతర ప్రాంతాలకూడా చేయడం న్యాయము. భాషారాష్ట్రాలు ఐకమత్యమును తీసుకువస్తాయి గాని, అనైక్యమును తీసుకురావు. భాషారాష్ట్రాలు ప్రజలకు బలం చేకూర్చి, ప్రజావ్యతిరేక శక్తులను ఎదిరించే శక్తి వారికి కలగజేస్తాయి."

ఇందులో ఇచ్చిన సలహాలనుబట్టి చెన్నరాష్ట్ర ప్రభుత్వం వా రొక రాష్ట్రవిభజన సంఘాన్ని (పార్టిషన్ కమిటీ) ఏర్పరచారు. ఆ సంఘంలో ప్రకాశంగారు తప్ప, తక్కిన ఆంధ్ర సభ్యు లిద్దరూ తమిళ సభ్యులు చెప్పిన సూచనలన్నిటికీ అంగీకారం ప్రకటించారు. అందులో ముఖ్యమైనది - చెన్నపట్నంమీద ఆంధ్రులు అధికారం వదలుకోవలెనన్న సూత్రము. ప్రకాశంగారు అది ఎంత మాత్రం అంగీకరించము అని అడ్డారు. అ కమిటీవారు చేసిన మిగిలిన కార్యక్రమమంతా - అనగా, అప్పులు, రాబడి పంపకములు, ఈ ప్రశ్నముందు స్వల్పంగా కనిపించాయి.

ప్రకాశం - పట్టాభి

ఈ విషయమై మరొక ఉదంతం కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఎన్ని బేదాలున్నా, డాక్టర్ పట్టాభిగారు కాంగ్రెసు అధ్యక్ష పదవికి పోటీచేసిన సందర్భంలో ప్రకాశంగారు తమ అనుయాయు లందరితోను కలసి, ఆయనను తమ వోట్లతో నెగ్గించవలెనని యత్నించి, ఆ కార్యం సాధించారు. పట్టాభిగారు అధ్యక్షులయిన తర్వాత, (ఆ రోజులలో అధ్యక్షుణ్ణి రాష్ట్రపతి అని పిలిచేవారు) ఆయన చెన్నపట్నం వచ్చినప్పుడు, నేను వారి బసకు గౌరవ సందర్శనం చేయడానికి వెళ్లాను. రెండు మూడు మాటలు కుశల ప్రశ్నలు సాగిన తర్వాత, ఆయన చటుక్కున లేచి, లోపలికి వెళ్ళి, ఒక అర ఠావు సైజు కాగితంతెచ్చి, దానిమీద సంతకం చేయమన్నారు. దానిమీద అప్పటికే ఆయన సంతకం, కామరాజ నాడార్‌గారి సంతకం ఉన్నాయి. వారు సంతకం పెట్టిన భాగం పైన ఉన్న మాట లివి:

"చెన్నపట్నంమీద ఆంధ్రులు హక్కులు వదులుకో గలందుకును, తిరుపతిపై తమిళులు హక్కులు వదులుకో గలందుకును ఇందు మూలముగా అంగీకరించడమైనది."

ఇటువంటి కాగితంపైన - ఆయన, బుజ్జగింపు మాటల మధ్య నన్ను సంతకం చేయమని రెండు, మూడు పర్యాయాలు చెప్పగా, "మీరీ విషయం ప్రకాశంగారితో చర్చించగూడదా?" అని ప్రశ్నించాను.

దానిపైన ఆయన, "ప్రకాశంగారితో ఎవరికి కుదురుతుంది? మా మటుకు మాకు ఆయన సంతకం కన్నా నీ సంతకమే ఎక్కువ విలువ గలది," అన్నారు.

కాని, నేను ఆయనను తిరిగి మెల్లిగా నచ్చజెప్పి, "సాయంత్రం మీరు ఒకమారు స్వయంగా ప్రకాశంగారిని కలుసుకొంటే మనమంతా ఒక పద్దతికి రాగలము గదా!" అన్నాను.

అందుకు, "సరే, ఎందుకు చెప్పావో! ఈ సాయంత్రం జరగబోయే మీ కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశంలో ఇందులో వ్రాసింది ఆమోదించడానికి, ఎజండాలో ఈ విషయం కలుపబడుతుంది. కాబట్టి, అక్కడే ప్రకాశంగారు ఉన్నారు గనుక, ఒక అరగంట ముందుగా వచ్చి ఆయనతో మాట్లాడుతానులే," అని ఆయన చెప్పారు.

ఏలాగో, ఆయన చెప్పినట్టు సంతకం చేయకుండా, ఆయన మనసుకు నొప్పి కలిగించకుండా, పరస్పర సుహృద్భావంతో బయట పడ్డాను.

అనుకున్నట్టు, పట్టాభిగారు ఆ సాయంకాలం వచ్చి, నా గది దగ్గిర కారు నిలిపారు. దిగివచ్చి, "ఏం విశ్వనాథం! నువ్వు చెప్పినట్టు వచ్చాను. ప్రకాశంగారు ఇక్కడ ఎక్కడున్నారు?" అని అడిగారు. ప్రకాశంగారు బసచేసిన మేడగదులు చేత్తో చూపించాను. అది గవర్నర్ భవనంకాక ప్రత్యేకంగా వేరే కట్టిఉన్న ఒక చిన్న మేడ భాగము. పట్టాభిగారు, ప్రకాశంగారి గదిలోకి వెళ్ళడమనేది ఒక విశేష కార్యం క్రింద భావించి, పది పదిహేనుగురు సభ్యులు నా గది దగ్గరగా ఉన్న కారు చుట్టూ మూగారు.

మేము, - ప్రకాశంగారు, పట్టాభిగారు కలుసుకున్నప్పుడు ఎలా మాట్లాడుతారో ఊహాగానం చేయ నారంభించేంతలోనే పట్టాభిగారు ఒక చేత్తో జారిపోతున్న పంచె గోచీ సర్దుకుంటూ, రెండవ చేత్తో క్రిందికి మీదికి జారిపోతున్న కాగితాలను పట్టుకుంటూ కారు దగ్గరికి ఇలా కేక లేసుకుంటూ వచ్చారు:

"ఆ ముసలి మూర్ఖునితో ఎవరు వేగగలరు? చ....ఛ...విశ్వనాథం! నువ్వు సంతకం పెట్టనన్నావు! మీ పార్టీ మీటింగుకి నేను రానూ అక్కరలేదు, ఈ ఒడంబడిక కాగితం మీరు అంగీకరించనూ అక్కరలేదు. పోండి! మీకు చేతనైనది ఏదో చేసుకోండి!"

కఠోరమైన కంఠంతో ఈ మాటలు చెప్పి, అతి విసురుగా చేతులు ఊపి, కారులో తొందరగా ఎక్కి కూచుని, డ్రైవరుతో "తిప్పు కారు మన యింటికి," అని ఆదేశించి ఆగ్రహంగా వెళ్ళిపోయారు.

ఈ చెన్నపట్నం సమస్యే, తొలినుంచి చివరివరకు మ్రగ్గిపోయి, చివరికి అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణాన్ని కూడా హరించింది.

షెడ్యూలులో ఆంధ్రరాష్ట్రం పేరు కలుపుతామని చెప్పిన ఆ సమయంలో, అధిష్ఠాన వర్గాన్ని, ఆంధ్రుల చిరకాల వాంఛను ఈడేరిస్తూ ఉన్నందుకు నెహ్రూగారినీ - కాన్ట్సిట్యుయెంట్ అసెంబ్లీ (సంవిధాన సభ)లో ప్రకాశంగారు పొగిడారు. ఆ సందర్భంగా, తమకు చేదోడు వాదోడుగా ఉన్న ఆచార్య రంగా, డాక్టర్ పట్టాభి, అనంతశయనం అయ్యంగారు, శ్రీమతి దుర్గాబాయి మొదలగువారు చేసిన కృషినికూడా ఆయన ప్రశంసించారు.

ఇంతేకాక, ప్రకాశంగారు మరొకటి చెప్పారు:

"భాషాప్రయుక్తరాష్ట్రాలు ఏర్పడితే, భారతదేశం - బాల్కనైజు (Balkanise)[1] అయిపోతుందని కొందరు మిత్రులు చేసిన వాదం వట్టి అపోహ. పరిపాలనాసౌకర్యము హెచ్చుగా కలిగి, ప్రజలు పరిపాలనలో భాగస్వాములై, దేశాన్ని మరింత బలిష్ఠముగా చేయడానికీ, దేశాభిమానము పెంచడానికీ పరమ సహాయకారులు అవుతాయి."

చివరికి, పట్టాభిగారు, వల్లభాయి పటేలుగారు, నెహ్రూగారు సభ్యులుగాఉన్న ఉప సంఘంకూడా చెన్నపట్నం సమస్యను సందిగ్ధంగా వదిలిపెట్టింది. చివరికి, 1952 లో సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలలోని ఆంధ్ర సభ్యులు చెన్నపట్నంమీద ఆశ వదులుకోవడంవల్ల, ఆంధ్ర కాంగ్రెసుపార్టీవారు చెన్నపట్నం తమిళరాష్ట్రంతో కలిపివేయాలన్న నివేదికలో సంతకం చేయడంవల్ల - ప్రకాశంగారు, ఆయన అనుయాయులూకూడా చెన్నపట్నం లేకుండాఉన్న ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి అంగీకరించవలసి వచ్చింది.

ఇలా చెన్నపట్నం మిగిలిన రాష్ట్రానికి వదలడానికి అంగీకరించగానే, అప్పటి ముఖ్యమంత్రి రాజాజీ సలహాపైన బళ్లారి జిల్లా కూడా ఆంధ్రభాగంలోంచి తప్పించారు.

1936 లో గంజాంజిల్లా ఉత్తరభాగం, జయపుర సంస్థాన భాగాలు - ఒరిస్సాలో చేరిపోయినవి. సేలంజిల్లాలో ఉన్న తెలుగు భాగాలు, మైసూరు రాష్ట్రంలో ఉన్న కోలారు వగైరా తెలుగుభాగాలు, మధ్యప్రదేశంలో చాందావరకు ఉన్న తెలుగు భాగములు - ఇవి ఏవీ తెలుగురాష్త్రంలో చేరకపోవడమే గాక, మరికొన్ని తెలుగుభాగాలు కూడా పోగొట్టుకోవలసి వచ్చింది.

మిగిలిపోయిన తెలంగాణాతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంతవరకు సంతోషించవలసినదే.

ఇప్పటికైనా, మనము ఐకమత్యంగా ఉండడం నేర్చుకొంటే, మన ఆంధ్రరాష్ట్రం భారతదేశంలో ప్రధానరాష్ట్రంగా పరిణమింపడానికి చాలా అవకాశాలున్నాయి.

మరల ప్రకాశంగారి పత్రికా వ్యాసంగము

మంత్రివర్గంనుంచి దిగినతర్వాత, ప్రకాశంగారు మొదట్లో "గ్రామ స్వరాజ్య" మనే వారపత్రికను ప్రారంభించారు. అయితే, ఆయన - తాము ఊహిస్తున్న స్వయంపోషక గ్రామ స్వరాజ్య సంస్థాపనా విషయమై ప్రచారం చేయడానికి ఆ వారపత్రిక సరిపోదని గ్రహించారు. ఆ సమయంలో 'రినై జాన్స్ ప్రింటర్స్‌' అనేదానిని చెన్నపట్నంలో నడుపుతున్న దామర్ల వెంకట్రావుగారు అనే పిఠాపురం వాస్తవ్యులకు, ప్రకాశంగారి త్యాగశీలతమీద ప్రత్యేకమైన అభిమానం పుట్టింది. ఆయన తనచేత నున్న అచ్చుయంత్రాన్ని ప్రకాశంగారికి "విజయప్రభ" అనే తెలుగు దినపత్రిక ప్రచురించడానికిగాను ఇచ్చి సాయం చేశారు. ప్రకాశంగారి యీ యత్న సాఫల్యానికై, ఎమ్.కె.వి. రెడ్డి, బొప్పన హనుమంతరావుగారలనే బారిష్టరులు, "విజయప్రభ" ప్రచురణ నిమిత్తం ఒక కంపెనీ ప్రారంభించారు. పత్రికకు సంపాదకుడుగా బరంపురం వాస్తవ్యుడు, స్వాతంత్ర్య యోధుడు అయిన న్యాపతి నారాయణమూర్తిగారిని నియమించారు. అంతకు ఒక సంవత్సరం ముందు ఆయన కేంద్ర శాసన సభలో సభ్యుడుగా ఉండేవారు. కొంతకాలం సంపాదకుడుగా పనిచేసి - ప్రకాశంగారి దగ్గర తమకున్న చనవు నాధారంగా చేసుకొని ఆచార్య రంగాగారి వర్గంవారు తన సంపాదకీయాలతో జోక్యం కలుగజేసుకొంటున్నారనీ, ఆ పరిస్థితులలో తాను సంపాదకుడుగా పనిచేయడం కష్టమనీ చెప్పి, ఆయన మానుకున్నారు. దాంతో, అసలు పత్రికాప్రచురణకే భంగం వచ్చింది. ఆ పత్రిక నడచినన్నాళ్ళు చాలా వేగంగా ప్రజల అనురాగాన్ని సంపాదించింది.

అప్పుడు, ప్రకాశంగారు "ప్రజాపత్రిక" అనే ఆంగ్ల వార పత్రికను ప్రారంభించారు. అదికూడా తొందరగా ప్రజల అభిమానాన్ని పొందగలిగింది. ఒకసారి అ పత్రికలో, ఆలపాటి వెంకటరామయ్య గారి పైన ఆరోపణలతో ఎస్. సుబ్బారావు అనే ఆయన వ్రాసిన ఉత్తరం అచ్చయింది. (వెంకటరామయ్యగారి గురించి యిదివరలో వ్రాసి ఉన్నాను.) వెంకటరామయ్యగారు, పత్రికను నిర్వహిస్తున్న ఎస్.వి. కొండపిగారిమీద పరువునష్టం దావా వేశారు.[2] ఆ దావా కోర్టువారు కొట్టేశారు.

అంతకుముందు, డాక్టర్ పట్టాభిగారు చాలా గొప్ప ప్రచార ఆర్భాటములు జరిపి, చెన్నపట్నంలో మౌంటురోడ్డులో ఉన్న కిర్లంపూడి జమీందారుగారి భవనం కొని, అందులో బొబ్బిలిరాజా మొదలయినవారి సహాయంతో "శుభోదయ" అనే దినపత్రిక ప్రచురింప సాగారు. ఆయన అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యులు గనుక, గాంధీగారికీ, ఆయనకూ పరిచయ మెక్కువన్న పేరువల్ల, కాంగ్రెసు శాసన సభ్యులుగా ఉండదలచిన చాలామంది ఆ పత్రికలో పెద్ద పెద్ద మొత్తాలిచ్చి వాటాలు కొన్నారు. కానీ, ఆ పత్రిక దురదృష్ట వశాత్తు ప్రారంభంలోనే ఆగిపోవలసిన పరిస్థితికి (ఏ విధంగానో నాకు జ్ఞాపకంలేదు) వచ్చింది. కె. అప్పారావుగారు అనే ఆయన ఆ పత్రిక భవనాలకు, యంత్రాలకు యజమాని కావడం జరిగింది. ఆయనకు, ప్రకాశంగారిమీద భక్తి కుదరడంచేత, ఆ భవనంలోనుంచే ఆ అచ్చు యంత్రాలపై ముద్రింపబడి 'ప్రజాపత్రిక' తెలుగు దినపత్రికగా రూపొందింది. అప్పట్లో, క్రొవ్విడి లింగరాజు మొదలైనవారు సంపాదకులుగా ఉండేవారు. పత్రిక ప్రకాశంగారిది కావడంతో, పత్రికలో చదవదగిన వార్తలు, వ్యాసములు ఉండగలవన్న విశ్వాసంచేత మొదటి రోజునే తొమ్మిది, పదివేల కాపీలు చెల్లాయి.

అప్పటికి ప్రత్యేకాంధ్ర దేశమనే నినాదం నాలుగుమూలలా ఎగబ్రాకి ఉన్నది. అధికార దుర్వినియోగం చేసిన చెన్నరాష్ట్ర మంత్రి వర్గం పేరుపోయి, వారికి వ్యతిరేకంగా ఎవరేమి వ్రాసినా చదవడానికి వందలకొద్ది పాఠకులు ఉండేవారు.

అప్పారావుగారు చాలా పెద్ద వ్యవహారజ్ఞులే అయినా, ఆ పత్రికను విస్తృతపరిచే ఊహ ఆయనకు లేకపోయింది. ఆ కారణంచేత ఆ పత్రికకూడా అచిరకాలంలోనే ఆగిపోవడం జరిగింది.

ఉత్పత్తి కొనుగోలుదారుల సహకార సంఘములు

ప్రకాశంగారి అభిప్రాయ ప్రకారంగా ఈ సంఘాలను సాగనిచ్చి ఉంటే, మన సంఘ వ్యవస్థలో అహింసా మార్గంలో మన ప్రజా సామాన్యం మధ్యవర్తులనుంచి విముక్తి పొంది ఉండేది. అయితే, మధ్యవర్తుల ప్రాబల్యానికి లోబడినవారు ప్రకాశంగారి మంత్రివర్గాన్ని పడగొట్టారని యిదివరలో పేర్కొన్నాను.

ఈ సంఘాలు సరిగ్గా పనిచేయడం లేదని ప్రకాశంగారి తర్వాత వచ్చిన మంత్రుల నోట అనిపిద్దామని - వీటిని గురించి, వీటి పని విషయం గురించి ఒక సభ్యుడు ప్రశ్నించారు. అప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించిన మంత్రి డాక్టర్ టి.ఎస్. రాజన్‌గారు. అప్పటికే ఈ సంఘాలు వ్యాపించకుండా అప్పటి మంత్రివర్గం కొన్ని ఆజ్ఞలు వేసిఉన్నది.

కాని, ప్రశ్న మలబారుకు సంబంధించింది గనుక, వారు అక్కడి సంఘాల యథాతథమైన పరిస్థితిని వివరించక తప్పలేదు. మలబారులో ప్రారంభించిన 107 సంఘాలలో ఏడు సంఘాలలో మాత్రం చిల్లర తప్పులు జరిగాయని చెప్పారు. తొమ్మండుగురు ఉద్యోగులపైన దోషారోపణ జరిగినా, అవి కోర్టులో నిలవలేదు.

అప్పుడు, అనుబంధ ప్రశ్నగా ఒక శాసన సభ్యుడు అడిగారు: "ఈ సంఘాలు ముఖ్యంగా మలబారులో బాగా పనిచేస్తున్నాయని, లోగడ ప్రభుత్వం వా రన్నమాట సరిఅయినదేనా?"

దానిపై రాజన్‌గారు ఇలా జవాబిచ్చారు:

"అధ్యక్షా! సరిగ్గా ఆలాగుననే నేను జవాబు ఇచ్చి ఉన్నాను. మలబారు జిల్లాలో మొత్తంపైన ఈ సంఘాలు సక్రమంగా పని చేస్తున్నాయని, ప్రజాభిప్రాయం వాటికి అనుకూలంగా ఉన్నదని నేను గట్టిగా ఈ సభముందు చెప్పగలను."

ప్రజల ఉపయోగంకోసం నిష్కల్మషంగా కార్యక్రమం జరిగించినప్పుడు, సత్పలితం కలిగినప్పుడు, కాదని శత్రుపక్షంవారు కూడా అనలేక పోయారు. కాని, సాధారణంగా నడుస్తున్న సహకార సంఘాల వల్ల, మధ్యవర్తి తత్వంగల వారికి లాభమువచ్చే ఉద్యమానికి, ప్రకాశంగారి ఉద్యమం వ్యతిరేక మయినది. అందుచేత, ఆయన దిగిపోయిన వెంటనే, క్రొత్త ప్రభుత్వంవారు ఈ సహకార సంఘాల [ఉత్పత్తి, కొనుగోలుదారుల సహకార సంఘాల] భవిష్యత్తును నిర్ణయించడానికి ఒక ఉప సంఘం ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి అయిన రామస్వామిరెడ్డిగారికి - ఈ సంఘాల ఆదర్శాల మీద, కార్యక్రమాల మీద అభిమాన ముండేది.

అయితే, ఆయన వేసిన ఉప సంఘానికి అధ్యక్షుడు - లిమిటెడ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టరు లాగున సహకార సంఘాలను నడిపిస్తూ, సహకారోద్యమానికి నిపుణుని (ఎక్స్‌పర్ట్) క్రింద భావింపబడే రామలింగం చెట్టిగారు. ఆయనకు ప్రకాశంగారి సహకార సంఘాలపైన సహజంగానే వ్యతిరేకత ఉండేది. అందుచేత, ఒక విధమైన రాజీ మార్గంగా సంప్రదాయ సహకార సంఘాలు లేనిచోట ఇవి ఏర్పాటు కావచ్చును అని - నీటికి నీరు, పాలుకు పాలు కలిసిన ఒక సూత్రం ప్రతిపాదించారు. దాంతో, ప్రజా ఉద్యమంతో సంబంధించిన ప్రకాశంగారి సహకార సంఘాలు కొనసాగే సౌకర్యాలు లేక, రాను రాను క్షీణించినవి.

ఆంధ్ర కాంగ్రెస్ రాజకీయాలు

1950 జనవరి 26 న ఇప్పుడు అమలులో ఉన్న సంవిధానం అమలులోకి వచ్చింది. అయితే, దాని ప్రకారం ఎన్నికలు జరగడానికి 1946 నుంచి లెక్క వేస్తే, 1952 తేలింది. అందుచేత, 1951 లో నుంచి కూడా అన్ని రాష్ట్రాల ప్రజల దృష్టి ఆ రాబోయే ఎన్నికలపైన పడింది. అప్పటికి ఆంధ్ర కాంగ్రెసు రెండు వర్గాలుగా విడిపోయింది. 1946 లో ప్రకాశంగారు, తాము ముఖ్య మంత్రి అయినప్పుడు, ఆంధ్ర కాంగ్రెసు కమిటీ యాజమాన్యాన్ని ఆచార్య రంగా గారికి అప్పగించారు. పట్టాభిగారు అది తమ చేతుల్లోకి తీసుకోడాని కెంతో యత్నించారు. వారి పక్షాన పనిచేయడానికి పూనుకొన్న ముఖ్యమైన వారు - ఆయన అనుయాయులు, మంత్రులూ అయిన కళా వెంకటరావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డిగారలు.

కాంగ్రెసు కమిటీలో సభ్యులను చేర్చి, సవ్యమైన పద్ధతిలో కాంగ్రెసు కమిటీని వశం చేసుకోవడానికి యత్నిస్తే, అందులో తప్పు లేదు. కాని, వారి వర్గీయులు, సవ్యమైన మార్గాన సభ్యులు కావడానికి రంగాగారి (అనగా, ప్రకాశంగారి) వర్గంవారు అవకాశం ఇవ్వలేదన్న నెపంపైన, ఒక లక్ష పేర్లు జాబితాలుగా వ్రాసి, అవి కాబోయే సభ్యుల పేర్లని, నిర్దారణ సూచకంగా వేలి ముద్రలు అనేకములైనవి తగిలించి, లక్ష మందికి కావలసిన చందా మొత్తం ఇరవై అయిదువేల రూపాయలు కాగ్రెసు అధ్యక్షుని పేర డిల్లీకి పంపారు. ఇవన్నీ దొంగ జాబితాలని ప్రకాశంగారి వర్గంవారు వేంటనే కనిపెట్ట గలిగారు. ఈ పాతిక వేలూ, పావలా పావలా చొప్పున చందాదారు లిచ్చిన డబ్బు కాదు. ఒక రిద్దరు వర్తకులు, ఒక రిద్దరు జమీందారులు (అపుడు జమీందారీల రద్దు బిల్లు సెలక్టు కమిటీ [3] ఎదుట ఉన్న కాలము) ఇచ్చిన మొత్తాలు కలపగా పాతిక వేలయింది. అందులో ఆరువేలిచ్చిన జమీందారు పేరు నాకు జ్ఞప్తిలో ఉంది. ఈ విధంగా చేసిన ఆరోపణ లన్నీ కొంతకాలానికి చర్చకు వచ్చి, ఆ లక్ష సభ్యుల పేర్లు జాబితాలోంచి కొట్టివేయబడ్డాయి.

ఈ యత్నం విఫలం కాగానే, 1951 లో వారు తిరిగి మరొక గట్టి యత్నం చేశారు. రాష్ట్ర కాంగ్రెసు కమిటీ సభ్యులను మెల్లిగా లోబరచుకొని, రానున్న సాంవత్సరికపు ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పొందగలిగి నట్టయితే - ప్రకాశంగారిని మంత్రివర్గం లోంచి పంపించినట్టుగానే కాంగ్రెసునుంచీ పంపివేయడమో, నిర్వీర్యులను చేయడమో ఏదో ఒకటి చేయవలెనని గట్టి పట్టు పట్టారు.

మంత్రులలో కళా వెంకటరావుగారు చాణక్యుని వంటివారు. తాము అధికారంలో ఉన్నారు గనుక, రాష్ట్ర సంఘ సభ్యులను ఏ విధంగా వశపరచుకోవడమో వారు కనిపెట్టారు.

ఆంధ్ర మంత్రుల చేతులలో - రెవిన్యూ, ఆర్థిక శాఖ, స్థానిక సంస్థలు, హరిజన సంక్షేమ శాఖ, మద్యనిషేధం, రెంట్ కంట్రోలు, సినిమా మొదలైన శాఖ లుండేవి. 1951 ఏప్రిలులో రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుని ఎన్నిక జరగవలసి ఉన్నది. ఆ ఏడు బడ్జెటు చర్యల సమయంలో, రాష్ట్ర సంఘ సభ్యులను వశపరచుకొనేందుకు అనేక వాగ్దానాలు చేయబడినాయి. ఆర్డర్లు జారీ చేయబడ్డాయి.

ఎన్నికల రంగస్థలము - విజయవాడ కాంగ్రెసు భవనము

ఆనాడు, ప్రభుత్వంవారు రాష్ట్ర సంఘాన్ని తమ వశం చేసుకోకుంటే, వారి వర్గం తిరిగీ తల యెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతాయి. అందుచేత, తమ వర్గానికి వోటు బలము చేకూర్చుకోడానికి రాష్ట్ర సంఘ సభ్యులను, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో, ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరి దివ్య భవనంలో షడ్రసోపేతమైన అన్నపానాదులతో, ఒక చోట చేర్చి పెట్టుకొన్నారు.

మరునాడు ఎన్నిక జరుగుతుందనగా, ఎన్ని లెక్కలు వేసుకొన్నా వారి వర్గం వారికి ఏడు వోట్లు తక్కువగా ఉన్నట్టు తెలిసింది. వారి అభ్యర్థి నీలం సంజీవరెడ్డిగారు. ఆయన మంత్రి పదవి వదులుకొని రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కావాలని ఏర్పాటు జరిగింది. ప్రకాశం, రంగా గారల వర్గాల పక్షాన నిలబడ్డ వారు ఆచార్య రంగా గారు.

ప్రభుత్వం పక్షం వారు ఏం చేశారో తెలియదు గానీ, అంత వరకు ప్రకాశం గారంటే ప్రాణాలివ్వడానికైనా సిద్ధమని చెప్పిన నలు గురు కృష్ణా జిల్లా సభ్యులు అటు దాటివేశారు. [4] ఎన్నిక తరువాత, ఏడు వోట్లతో గెలుస్తామనుకున్న రంగాగారు నాలుగు వోట్లతో ఓడిపోయారు.

ఆనాడు జరిగిన ఉదంతాలు ఆంధ్ర కాంగ్రెసు చరిత్రనేగాక, ఆంధ్ర రాజకీయ రంగ నిర్మాణ, పరిమాణాలను సంపూర్ణంగా మార్చి వేశాయి. ఆ రోజు ఎన్నిక ఫలితం చెప్పిన వెంటనే, మంత్రి గోపాలరెడ్డిగారు ఒక సూక్తి చెప్పారు.

మంత్రులుగా తాము, హెచ్. సీతారామరెడ్డి, కళా వెంకటరావు, కల్లూరి చంద్రమౌళిగారలు కావలసిన ఆదేశాలు ఇస్తుండగా, నీలం సంజీవరెడ్డిగారు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులుగా ప్రభుత్వానికి సాయపడే ముఖ్య దళనాయకుడుగా తమ వర్గ సైన్యాలను ముందుకు నడిపిస్తే, ఆ రోజు వారికి ఎదురుగా పోటీ చేసిన ప్రతిపక్షంవారు అదృశ్యులై పోతారని ఆయన చెప్పిన మాటల సారాంశము.

దాక్షిణాత్యులతో చేయి చేయి కలిపి, కుతంత్రంవల్ల ప్రకాశంగారిని మంత్రివర్గంనుంచి దించిన తర్వాత, ప్రజా సామాన్యంలో తమపై ప్రతికూలత, దొంతరలు దొంతరలుగా ఎంత పెరిగిందో వారు తెలుసుకోలేకపోయారు.

జనరల్ ఎన్నికలలో పైన చెప్పిన మంత్రులందరు ఓడిపోయారు. మరొక విశేషం కూడా జరిగింది. మద్రాసు నగరంలో పోటీ చేసిన ప్రకాశంగారు కూడా ఓడిపోయారు! ఆయన ఓడారన్న ఫలితం ఎలా వచ్చిందో, ఎలక్షన్ పిటీషన్ లేక పోవడంవల్ల నిర్ధారణగా ఏమీ చెప్పలేము. కాని, ఒక వ్యక్తి మాత్రం వోట్లు లెక్కించే సమయంలో జరిగిన ఒక విశేషం చెప్పాడు.

ఆ వ్యక్తీ, అతని భార్యా, మరొక ముగ్గురూ కలిసి వెళ్ళి, ఒకరు తర్వాత ఒకరుగా, ఒక బాలట్ బాక్సులో తమ వోట్లను వేశారు. వోట్లు లెక్కించే సమయంలో ఆ పెట్టె విప్పగా, అందులో ఒక్క వోటయినా లేదు. కౌంటిగ్ ఆఫీసరు ఆ బాక్సులో వోట్లు 'నిల్‌' అని వ్రాసుకొన్నాడు. ఏమి జరిగిందో! ఏ దేముడు బాలట్ పెట్టెలో దూరి వోట్ల భక్షణ కావించాడో! ఇప్పటికీ తెలియదు.

ఎలక్షన్ పిటీషను వేయమని మిత్రులు బలవంతం చేసినా, ప్రకాశంగారు తమ "రాజకీయ జీవితాన్ని ఎలక్షన్ పిటీషనులతో నడుపుకోలే" మన్నారు.

1951 లో, నీలం సంజీవరెడ్డిగారు ఎన్నికకయినట్టు తెలియగానే, మంత్రివర్గీయులు కాంగ్రెసుభవనం ఆవరణ గోడలెక్కి లోపలికి దూకి, భవనం గదులలోఉన్న రంగాగారి వర్గీయులకు చెందిన సామానులను వాటినీ ఇవతల, అవతల విసిరివేయసాగారు.

రంగాగారి వర్గంలో ప్రతికూలచర్య తీసుకోడానికి సాహసము, బలమూ కలిగిన యువకులున్నా - తగాదాలు వచ్చినప్పటికీ ఒకే పార్టీ వాళ్ళము గనుక మూర్ఖులయెడల మూర్ఖత వహించడం మంచిది కాదని శాంతించారు.

ఏమైనా, ఆ రోజున మంత్రివర్గీయులు చూపించిన ముష్కరత్వానికి సమానమైనది మరెన్నడూ చూడలేదు.

బహుశ: డిల్లీలో 1970 లో క్రొత్త ప్రాత కాంగ్రెసులు విడిపోయిన తర్వాత, కాంగ్రెసు ప్రాంగణంలో జరిగిన ప్రహరణకాండ కొంచెం ఆ స్థాయికి వచ్చిందేమో!

  1. యూరపు ఖండపు ఆగ్నేయభాగంలో అనేక విధాలరాజీపడి, ఆ భాగమంతా ప్రతినిత్యమూ పోరాడే, నిస్సత్తువగల చిన్న చిన్న దేశాలుగా మారినదానిని సూచిస్తుంది ఈ 'బాల్కనైజు' అన్న పదము.
  2. ఈ కొండపిగారు ఆ రోజులలో ప్రకాశంగారికి ప్రైవేటు సెక్రటరీగా ఉండి, ఆ పత్రికను నిర్వహించేవారు. ప్రస్తుత మాయన హైదరాబాదులో బాగా ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాది.
  3. ఒక శాసనం ప్రవేశపెట్టినపుడు, అందులోని బాగోగులు బాగా పరిశీలించి చక్కదిద్దడానికి, అన్నీ పార్టీల ప్రాతినిధ్యంతో కూడిన శాసన సభ్యుల ఉప సంఘాన్ని 'సెలక్టు కమిటీ' అంటారు. వీరి నివేదికపైనే శాసన సభలో తర్వాత ఆ శాసనం గురించి చర్చ జరుగుతుంది.
  4. అందులో ఒకరు - ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.