నా జీవిత యాత్ర-3/తిరిగిపో, సైమన్!

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1

తిరిగిపో, సైమన్!

సైమన్ కమిషన్ బహిష్కరణ సంఘటనల గురించి చదువరులకు పరిపూర్ణమయిన అభిప్రాయం కలగడం కోసము, జరిగింది యథాతథంగా తెలియడం కోసము, దక్షిణా పథానికి చెందిన ఆంధ్రులూ, తమిళులూ, మలయాళీలూ, కన్నడిగులూ ఆ ఉద్యమంలో ఎల్లా ఎల్లా తమ తమ పాత్రలు నిర్వహించారో వివరంగా చెప్పి మరీ యీ కమిషన్ కథను సాంతం చెయ్యాలని ఉంది.

దక్షిణ దేశానికి సంబంధించి నంతవరకూ ఈ ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో నేనూ, చెన్నపట్టణంలోనూ - దక్షిణాదిన నా మిత్రుడు సర్గీయ శ్రీనివాసయ్యంగారూ నాయకత్వం వహించి నడిపించాము. నా నాయకత్వాన నడుస్తూన్న ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ వారికీ, శ్రీనివాసయ్యంగారి నాయకత్వాన నడుస్తూన్న తమిళనాడు కాంగ్రెసు కమిటీ వారికి మధ్యని ఎటువంటి స్ఫర్థలూ లేవు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప, పరస్పరం సంప్రతించుకునే, పరస్పర సహకారంతోనే, ఉద్యమం సాగించాలన్నదే మా వాంఛ. ఆ ప్రత్యేక పరిస్థితులన్నవి ఉభయ భాషల వారికీ ఉండుకున్న ప్రత్యేక గుణగణాలకు సంబంధించిన సున్నితమయిన సమస్యలన్నమాట.

నల్లజెండాలు

సైమన్ కమీషన్‌వారు మొదటిసారిగా[1] పట్నం వచ్చిన సందర్బంలో వారికి నల్ల జెండాలతో స్వాగతం ఇవ్వబడింది. ఇటువైపు తిరిగినా, ఏ మూల చూసినా నల్ల జెండాలే ఎదురయ్యాయి. ఆనాటి కార్యక్రమంలో ఇతర నాయకులతో కలిపి పాల్గొని ఉద్యమాన్ని జయ ప్రదంగా నడిపించాలనే ఉత్సాహంతో దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు గుంటూరునుంచి వచ్చి, 'బాయ్‌కాట్‌' పూర్తిగా విజయవంతం చేయడానికి ఎంతో తోడ్పడ్డారు.

అపురూప దృశ్యం

సైమన్ కమిషన్‌వారు బొంబాయిలో 1923 ఫిబ్రవరి 3 వ తేదీని ఓడ దిగారు. ఆ రోజున, శ్రీనివాసయ్యంగారూ, నేనూ ఇతర ప్రముఖులతో కలిసి ఊరేగింపులు సాగించాం.[2] చెన్నపట్న వాసులు ఎప్పుడూ చూడని అపురూప దృశ్యం అది. శ్రీనివాసయ్యంగారూ, ఆయన అనుచరులయిన స్వచ్ఛంద సేవకులూ మొదటి శ్రేణిలో ముందు నడుస్తూ ఉంటే, నేనూ - నా అనుచరులూ ద్వితీయ శ్రేణిలో నడుస్తున్నాం. ఊరేగింపు జార్జిటౌన్‌లో ఆరంభించబడింది. అక్కడనుంచి మౌంట్‌రోడ్డు గుండా, మెరీనా బీచికి చేరే పర్యంతం అంతదూరమూ నడిచే వచ్చాం.

అక్కడ పోలీస్ కమిషనర్ సి. జె. కన్నింగుహామ్ మమ్మల్ని అటకాయించాడు. పెద్ద పోలీసు బలగంతో మమ్మల్ని చుట్టుముట్టి, రోడ్డంతా ఆక్రమించాడు. నిజానికి మేము చులాగ్గా అ పోలీసు కార్డన్‌ని కాదని తప్పించుకుని ముందడుగు వేయవలసిన పరిస్థితే అయినప్పటికీ అటువంటి ఉద్రిక్త పరిస్థితులలో కార్డన్‌ని లెక్కచెయ్యకుండా ముందడుగు వేయవలసిందనే ఆదేశం కాంగ్రెసు ఇచ్చి ఉండలేదు. అందుకని కాస్త తటపటాయించాం.

శ్రీనివాసయ్యంగారు అటువంటి పరిస్థితులకు అలవాటు పడిఉండలేదు. కన్నింగహామ్ వెనక్కి తిరగమని చేతితో సంజ్ఞ చేసిన తక్షణం శ్రీనివాసయ్యంగారు నిశ్శబ్దంగా ఆ ఆజ్ఞను పాటిస్తూ వెనక్కి తిరిగారు.

చెప్పానుగా - మొదటి శ్రేణిలో శ్రీనివాసయ్యంగారూ, వారి వాలంటీర్లూ నడవగా, ద్వితీయ శ్రేణిలో నేనూ, నా అనుచరులూ ఉన్నాం అని. అటకాయింపులూ, వెనుదిరగడాలూ అయ్యాక, ఆ సముద్ర తీరానికివెళ్ళి, అక్కడ సావకాశంగా ఇసుకలో మీటింగు పెట్టుకున్నాం. ఆ సభలో, పోలీసువారు ఊరేగింపును ఆ ప్రకారం నడి రోడ్డుమీద నిలుపు చెయ్యడం అన్యాయమనీ, ఇంకోసా రెప్పుడయినా ఊరేగింపులను అటకాయించడం జరిగితే, పోలీసు కార్డన్‌ని కాదని ముందుకు నడుస్తాం అనీ నేను ప్రకటించాను. మాలో ఒక వెయ్యిమందికి పైగా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నాం. అటువంటి అరెస్టులే జరిగి ఉంటే - ఆ వచ్చినవారికి ఎంతో కనువి ప్పయ్యేది. కాని అలా జరగడానికి వీలులేని పరిస్థితి అయింది.

పూర్తి హర్తాలు

ఏమయితేనేం, కమిషన్‌వారు పట్నంలో మొదటిసారిగా అడుగుపెట్టిననాడు జరిగిన బహిష్కరణ జయప్రదంగా జరిగిందని ఒప్పుకోక తప్పదు. పట్నంలో హర్తాలు సంపూర్ణంగానూ, సమగ్రంగానూ, బ్రహ్మాండంగానూ సాగింది. కమిషన్‌వారు ఎక్కడకి వెళ్ళినా నల్ల జెండాలే ఎదురయ్యాయి. ఒక్కొక్క చోట అమిత ఉత్సాహం గల యువకులు నల్ల జెండాలను నడుస్తూన్న సర్ జాన్‌సైమన్‌గారి కారులోకే విసిరి వేశారు.

సైమన్ కమిషన్ మదరాసుకు రానై ఉంది. ఫలానా రోజుకు వారు వస్తున్నారు అని తేదీ కూడా నిర్ణయం అయింది. సెంట్రల్ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ నడుస్తోంది. అప్పట్లో నేనూ, శ్రీనివాసయ్యం గారూ కూడా అసెంబ్లీ పనిలోనే నిమగ్నులమై ఉన్నాం. ఎప్పుడయితే తారీఖు నిశ్చయమై, ప్రకటింపబడిందో ఆ తక్షణం మోతీలాల్ నెహ్రూగారి ఆధిపత్యాన అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు డిల్లీలో కలుసుకొని, సైమన్ కమిషన్‌వారు మద్రాసు చేరే రోజున పూర్తి హర్తాలు జరపాలని నిశ్చయించారు.

తర్వాత మద్రాసు ప్రభుర్వంవారు (సియార్. పి. సి.) 144 సెక్షన్ కింద మీటింగులూ, ఊరేగింపులూ మొదలైన ఏ విధమయిన కార్యక్రమాలలోనూ కాంగ్రెసువారు పాల్గొన రాదంటూ ఆంక్ష విధించారు. ఈ వార్త తెలిపిన వెంటనే తిరిగి కాంగ్రెసు పెద్దలు కలుసుకొని శ్రీనివాసయ్యంగారూ, నేనూ సకాలంలో మదరాసు చేరుకుని, 144 సెక్షన్ ధిక్కరించి, 'బాయ్‌కాట్‌' విజయవంతంగా సాగించాలని తీర్మానించారు.

అయ్యంగారి వెనుకంజ

నేను, మదరాసు వెళ్ళడానికి అవసరమైన సన్నాహాలన్నీ చేసుకుని, శ్రీనివాసయ్యంగారితో కలిసి బయలు దేరడానికి సిద్ధమయాను. శ్రీనివాసయ్యంగారూ, నేనూ అనుదినమూ కలుసుకుంటూనే ఉన్నాం. ఉభయులమూ కలిసి వెళ్దామని అనుదినమూ అనుకుంటూనే ఉన్నాం. కాని, ఆఖరు క్షణం వరకూ, ఆయన, తాను రావడం లేదనీ, తన భార్య అనుదినమూ పట్నం రావద్దనీ, బాయ్‌కాట్ సందర్భంగా అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ టెలిగ్రాములు ఇస్తున్నదనీ, నాతో చెప్పలేదు. ఆ రోజున మేము ఉభయులమూ కలిసి బయల్దేరవలసిందే. టెలిగ్రాముల కారణంగా తాను రావడం లేదని ఆయన అనడంచేత, ఆ సంగతి మోతీలాల్‌గారితో చెప్పి, నేను ఒంటరిగానే బయల్దేరాను.

అపూర్వ తీర్మానం

నేను కలకత్తా చేరేసరికి, కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గంవారు, తిరిగీ అర్జంటుగా కలుసుకుని, చెన్నపట్టంలో చేద్దామనుకున్న హర్తాలు, వగైరా జరుపకూడదని తీర్మానించారు. అఖిల భారత కాంగ్రెసు కమిటీ కార్యనిర్వాహకవర్గంవారు చేసిన అపూర్వ తీర్మానం అది. మదరాసు కాంగ్రెసు ఆదేశానుసారంగా హర్తాలు జరిపించడానికి నేను సగం దూరం వెళ్ళాక, హర్తాలు జరుపవద్దని ఆ కార్యనిర్వాహకవర్గం వారే, తాము చేసిన మొదటి తీర్మానానికి భిన్నంగా, ఇంకో తీర్మానం చేశారంటే - అది కాంగ్రెసు చరిత్రలోనే అపూర్వం. శ్రీనివాసయ్యంగారూ కార్యనిర్వాహకవర్గ సభ్యులే!

కార్యనిర్వాహకవర్గం తాము ప్యాసుచేసిన తీర్మానాన్ని తిరగతోడవలసిన అగత్యం ఏమీ కనబడదు. అందులోనూ నేను ఢీల్లీవదలిన 24 గంటలలో ఇంత మార్పా? దీనినిబట్టి కార్యనిర్వాహకవర్గం ఎంతటి బలహీనుల చేతులలో పడిపోయిందో తెలుస్తూనే ఉంది.

నా నిర్ణయం

నేను వెనక్కి డిల్లీ వెళ్ళాలో, మొదట్లో నిశ్చయించుకున్న ప్రకారం ముందుకు వెళ్ళి పట్నమే చేరాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో పడిపోయాను. చివరికీ వెనక్కి తిరిగి ఢిల్లీ వెళ్ళడం తలవంపుగా భావించి, ముందుకు చెన్నపట్నం వెళ్ళడానికే నిశ్చయించు కున్నాను. హర్తాలు ఆపుజేయబడడంతో ప్రభుత్వం వారి ఆంక్షకూడా రద్దయినట్లే గదా! అయినా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అని నా ప్రయాణం ముందుకే సాగించాను.

నిజానికి, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులలో నయినా, వెనుకంజ వెయ్యడమన్నది ఈ జన్మలోనే లేదు మనకి! చాలా లోతుగానూ, దీర్ఘంగానూ ఆలోచించాను. దారి పొడుగునా ఆలోచిస్తూనే ఉన్నాను. కార్యనిర్వాహకవర్గంవారి ద్వితీయ తీర్మానం చాలా పొరపాటుగా చెయ్యబడిందనీ, అటువంటి తీర్మానం న్యాయ సమ్మతమైంది కాదనీ, అందువల్ల కార్యనిర్వాహకవర్గంవారి ప్రథమ తీర్మానం ప్రకారం హర్తాలు జరపడమే న్యాయమనీ నిశ్చయించి, మద్రాసు పొరులకు హర్తాలు జరుపవలసిందిగా ఆదేశిస్తూ సందేశం ఇచ్చాను.[3] అసలు కాంగ్రెస్ మహాసభ సైమన్ కమిషన్ రాకను బహిష్కరించవలసిందనీ, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలవారూ వారి రాక విషయమై హర్తాలు మొదలైనవి చేయవలసిందనీ, ఆజ్ఞాపించి ఉండగా, కార్యనిర్వాహకవర్గంవారు కాంగ్రెస్ ఆదేశానికే విరుద్ధంగా సైమన్ కమిషన్ రాకను బహిష్కరించవద్దని అనడం చాలా విచిత్రమైన విషయమనీ, ఈ విషయంలో కార్యనిర్వాహకవర్గంవారు కేవలం పొరపాటే చేశారనీ, అందువల్ల కాంగ్రెస్ ఆదేశమే ముఖ్యమూ, అనుసరణీయమూ గనుక ఆ ఆదేశానుసారం హర్తాలు జరుప వలసిందనీ మద్రాసు పౌరులకు విన్నవిస్తూ నేను ఒక ప్రకటన జారీ చేశాను. [4]

మదరాసు పౌరుల పొంగు

నా విన్నపాన్ని మన్నించిన మద్రాసు పౌరులు బ్రహ్మాండమయిన హర్తాలు జరిపారు. అది ఎంతో విజయవంతంగా జరిగింది. పూర్తి విజయాన్నే సాధించింది. ఇంత ఘనంగా, భారతదేశం మొత్తం మీద, మరే రాష్ట్రంలోనూ హర్తాలు జరుగలేదు. అన్ని కులాలకూ మతాలకూ చెందిన మద్రాసు పౌరులందరూ తమ తమ వ్యాపారాలను పూర్తిగా బందుచేసి, సముద్రం కెరటాలలాగ, కెరటంమీద కెరటంలా, భూమి ఈనిన విధంగా, చెన్నపట్నపు పురవీథుల్లోకి వచ్చేశారు. సుమారు పదిమైళ్ళు పొడుగూ, పదిమైళ్ళు వెడల్పూ గల పట్నం వీథులన్నీ జనప్రవాహంతోనూ, కోలాహలంతోనూ నిండి పోయాయి. చెన్నపట్టణానికి దూరతీరాలు వ్యాపించిన పట్నం అని పేరు.

ఆ నాడు చెన్నపట్నంలో చీఫ్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్ కె. కె. పండాలే గారని ఒక బారిస్టరు. ఆయన స్మాల్‌కాజ్ కోర్టు జడ్జిగా నియామకం గాకపూర్వం, ఆ వెనుకటి రోజులలో, నా వద్ద జూనియర్‌గా పని చేశాడు. నేను వద్దని ఎన్ని విధాల చెప్పినా పండాలేగారు ప్రభుత్వం ఉద్యోగాన్ని స్వీకరించారు. మొదట్లో నెలకు వెయ్యిరూపాయల జీతం మీద స్మాల్‌కాజ్ కోర్టు జడ్జీగా ఆయన ప్రభుత్వపు కొలువులో ప్రవేశించారు. ఆయన మంచి తెలివి తేటలు గలిగి, బారిష్టరుగా బాగా రాణిస్తూన్న వ్యక్తే. కాలేజి చదువులు మంచి ధీమాగానే పూర్తిచేశాడు. అయితేనేం, ఎందుచేతనో అడ్వకేట్‌గా రాణించనేమో ననే భయం పట్టుకుని, ఆయన ప్రభుత్వ ఉద్యోగాలపై మోజు పడ్డాడు. ఆయన స్మాల్‌కాజ్ కోర్టు చీఫ్ జడ్జీ అయిఉంటే, అది ఆయన శారీరక మానసిక ప్రవృత్తులకు అనుగుణంగా ఉండేది. కాని ఆయన చీప్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేటు మాత్రమే. చెన్నపట్నంలాంటి మహానగరాలకు చీప్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్ అంటే సామాన్యంకాదు. అవసరం అయితే, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులలో నయినా, శాంతంగా మంచి చెడ్డలు గ్రహిస్తూ, ప్రశాంత వదనంతో గుంపులను కంట్రోలు చెయ్యగలగాలి. పౌర రక్షణ, శాంతి భద్రతల రక్షణ సరిగా నిర్వహింప గలగాలి. ఎంతో నిదానం మీదగాని కాల్పులకు అనుజ్ఞ ఇవ్వకూడదు. కూర్చుని కేసులు విచారించి తీర్పులు వ్రాయడానికైతే పండాలే దిట్టమయినవాడే.

పోలీసు కాల్పులు

శాంతి భద్రతలు కాపాడడంకోసం పోలీసు బందోబస్తూ, మిలిటరీ సహకారపు టేర్పాట్లు చాలా ముమ్మరంగా జరిగాయి. సుమారు 11 గంటల వేళ, హర్తాలు పరిస్థితి ఎలా ఉంది, ప్రజల సహకారం ఎలా ఉంది అనే విషయాలు స్వయంగా పరిశీలిద్దాం అనే ఉద్దేశంతో నేను నా కారులో బయల్దేరాను. నేను బీచికి వెళ్ళేసరికి సెనేట్ హౌస్ వద్ద ఉంచబడిన పోలీసువారు దారిని అడ్డగించారు. అప్పుడు వెనక్కి తిరిగి, మౌంట్‌రోడ్డు దారిని వెడదామని తలిస్తే, ఆ రస్తాకూడా మూసేశారు. నేను అప్పుడు ఎగ్మూరు మీదుగా కలప అడితీలవరకూ వెళ్ళి, అక్కడనుంచి జార్జిటౌనుకు వెడదామని తలచాను. నేను ఫ్లవర్‌బజారు వీదికి వచ్చేసరికి, నా కారు ఆపుజేశారు. అక్కడ కారు వదలి కాలినడకన హైకోర్టువైపు బయల్దేరాను.

హైకోర్టు దగ్గర యేవో కొన్ని గడబిడలు జరుగుతున్నాయని విన్నాను. ఈ రస్తాలన్ని యిల్లా మూసివేయడానికి కారణం, చేరుతూన్న గుంపులలోని కొందరు దుండగీండ్లు బ్రాడ్వేలో కొన్ని దుకాణాల కిటికీ అద్దాలు పగలగొట్టడం. హైకోర్టు ఆవరణలో ఉన్న ఒక సొలిసిటరుగారి కారుకు నిప్పంటించడంతో పరిస్థితులు కాస్త విషమించాయి. చీప్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్ పండాలేగారు అక్కడకు వచ్చి, ఆయనకున్న శక్తినంతా కూడదీసుకుని, శాంతిని నెలకొల్ప డానికి ప్రయత్నించాడు. నేను నడచి వెడుతూంటె యీ సంగతులన్నీ నాకు వివరించ బడ్డాయి. కేవలం పోలీసు రిపోర్టు ఆధారంగా ఆయా ప్రదేశాలను చూడకుండానే కాల్పులు జరగడానికి అనుమతులు ఇవ్వబడడమూ, మంచి చెడుగులు విచారించకుండా కాల్పులు జరపడమూ కూడా జరిగింది.

ఈ గడబిడలు జరిగిన కొన్ని గంటల తర్వాత, బ్రాడ్వేలోనూ, హైకోర్టు ఎదుట ఎస్ల్పనేడులోనూ గుంపులు గుంపులుగా జనం వెడుతూంటే, అ చివర - మిల్లరు విగ్రహం దరిదాపులలో, కాల్పులు జరపడానికి చీప్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్ ఆర్డరు జారీ చేశాడు. ఆయన కూడా తనంటత తానుగా గాక, ఒక యూరోపియన్ హైకోర్టు జడ్జీగారి సలహా ననుసరించి కాల్పులకు అనుజ్ఞ యిచ్చాడు. ఆయన ఆ కాంపౌండ్ చివరకు వచ్చి గుంపులను చెదరగొట్టే నిమిత్తం కాల్పులు సాగించ వలసినదని పండాలేగారికి సలహా యిచ్చాడట! అదృష్టవశాత్తూ అక్కడికక్కడే ఎవ్వరూ మరణించలేదు.

గుండెకు బారుచేసిన తుపాకి

పారీస్ కార్నర్ దగ్గిర మాత్రం రోడ్డుకు మధ్యగా ఒక స్థూలకాయుడు చచ్చిపడిపోయాడు. అప్పుడు గుంపులన్నీ చెదిరిపోయాయి. ఆ కూడలి దగ్గరి బీచికి వెళ్లే రస్తా, కష్టమ్ హౌసుకు వెళ్ళేదారీ, ఆర్మీనియన్ వీధినుంచి హైకోర్టుకు వెళ్ళేదారి. అన్నీ పోలీస్ కార్డన్‌తో బందయిపోయాయి. నేను ఒక కార్డన్ దగ్గరకు వెళ్ళి, అక్కడ ఉన్న సిపాయిని ఆ చనిపోయిన వ్యక్తిని చూడడానికి దారి యివ్వవలసిందని కోరాను. దారి ఇవ్వడానికి వీలులే దన్నాడు.

ఒక సిపాయి నా గుండెకు బారుచేసి తుపాకి పట్టుకున్నాడు. నాకు దారి ఇవ్వవలసిందని వానిని నేను కోరాను. "మీరు బలవంతంగా వెళ్ళదలిస్తే మేము కాల్చవలసి వస్తుం"దన్నాడు వాడు. నా ప్రక్కన గుంపులో ఉన్న ఒక మహమ్మదీయ యువకుడు, "ధైర్యం ఉంటే కాల్చు, మేమంతా సిద్ధంగానే ఉన్నాం! ఆయన ఎవరో నీకు తెలియదల్లే ఉంది" అని అరిచాడు.

కొద్ది క్షణాల తర్వాత వాడు తప్పుకుని దారి ఇస్తూ, దయయుంచి ఏ గడబిడా చెయ్యవద్దని గుంపును కోరవలసిందని ప్రాధేయపడ్డాడు. నేను వచ్చేవరకూ శాంతంగా ఉండవలసిందని గుంపును కోరి ముందుకు సాగి, గుండుదెబ్బలతో పడిఉన్న ఆ మృతదేహాన్ని చూసి, ఆ రోడ్డుకి ఎదుటి రోడ్డున, హైకోర్టులో వెనుకభాగాన ఉన్న ఒక భవనంలో ఆసీనుడయి ఉన్న చీఫ్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్‌ను చూడగోరాను.

లాఠీఛార్జీ

ఆ రోజంతా [5]పట్నం అట్టుడికిపోయి ఉద్రిక్త పరిస్థితిలోనే ఉంది. సైమన్ కమిషన్ వారికి ఎదుర్కోలు కేవలం నల్లజెండాలతోనే ఆగలేదు. నినాదాలతోటీ, కాల్పులతోటీ, ఒక చావుతోటీ జరిగిందన్న మాట! నడుస్తూన్న గుంపులమీద అనవసరంగా లాఠీచార్జీలు అవీ జరిపి, గుంపులను ఉద్రిక్త పరిచారని విన్నాను.

జనం మాత్రం పూర్తి హర్తాలు జరిపి, శాంతి భద్రతలు బాగా పాటించారని ఒప్పుగోక తప్పదు. హర్తాలు నడచిన తీరూ, ప్రజలు చూపించిన సహనం, వారు శాంతి భద్రతలు కాపాడిన విధం, అన్నీ కూడా కాంగ్రెసులోనూ, కాంగ్రెసుయొక్క అహింసా తత్వంలోనూ ప్రజలు ఎంత విశ్వాసంతో వ్యవహరిస్తున్నారో, కాంగ్రెసు ఆదేశాలు ఎంత బాగా ప్రజలలో నాటుకునిపోయాయో బాగా విశదం చేశాయి.

1927 డిసెంబరులో మదరాసు కాంగ్రెసే, సైమన్ బాయ్‌కాట్ ప్రతిపాదనని ఆమోదించింది. ఆ మదరాసులోనే, మాకు అవసరం లేదు మొర్రో అంటూన్న ఆ సైమన్ కమిషన్ కారణంగా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించాయి. ఎప్పుడయితే కాంగ్రెస్ బహిష్కరణ తీర్మానాన్ని ప్యాసు చేసిందో, ఆ తీర్మానం సక్రమంగా అమలు జరిగిందీ - లేందీ చూడవలసిన పూచీ కాంగ్రెసు నాయకుల మీద ఉంది.

మోతిలాల్ సవరణ

సెంట్రల్ అసెంబ్లీలో 1928 ఫిబ్రవరి 16 వ తేదీని లాలా లజపతిరాయ్‌గారు సైమన్ కమిషన్ని పూర్తిగా బహిష్కరించ వలసిందంటూ కేంద్ర శాసన సభలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. మోతిలాల్‌నెహ్రూగారు దాని కోసవరణ ప్రతిపాదించాడు. సైమన్ కమిషన్‌ని రాయల్ కమిషన్‌వారు ఏర్పాటు చేయలేదనీ, ఆలా భావించ బడుతున్న ఆ ఇండియన్ కమిటీని రాజుగారే ఏర్పాటు చేశారనీ, ఆ సవరణ తీర్మానంలో చెప్పబడింది.

రాయల్ కమిషన్ వారి ప్రకటన రాజుగారు చేసినట్లే నన్న భాష్యం నిజంగా ఏ యిరువురి వ్యక్తుల మధ్యనయినా వివాదం వచ్చిన సందర్భంలో బాగా వర్తిస్తుంది గాని, రాయల్ కమిషన్ వారి పదాలకు అటువంటి భాష్యం చెప్పడం అంటే, ఈపట్టున సెక్రటరీ ఆఫ్ స్టేట్ పలికిన పలుకులకు భాష్యం చెప్పినట్లే.

మోతీలాల్ నెహ్రూగారికి రాయల్ కమిషన్ అన్నది రాజుగారు స్వయంగా ఎన్నుకున్నది కాదనీ, రాజుగారి స్థానే మాట్లాడే సెక్రటరీ ఆఫ్ స్టేట్ దానిని రాజుగారి తరపున నియమించాడనీ, రాజుగారు ఇప్పట్టున రాజ్యతంత్ర ప్రధానమయిన ఒక 'రాజు' కాని, నిజంగా రాజు కాదనీ బాగా తెలుసు. కాని ఇది ఒక రాజనీతికి, రాజ్యతంత్రానికీ సంబంధించిన 'లా' పాయింటుగా తోచడాన్ని, ఆ సవరణ ఆయన ప్రతిపాదించారు.

అసెంబ్లీలో కొంత తర్జన భర్జన జరిగాక ఓటుకు పెట్టగా, మోతిలాల్‌గారి సవరణ ప్రతిపాదనే 68 ఓట్లు అనుకూలంగా, 62 ఓట్లు ప్రతికూలంగా నెగ్గింది. తాను తీసుకువచ్చిన ఈ సవరణ తీర్మానంతో అసలు లజపతి రాయ్‌గారి ప్రతిపాదన వెనక్కి నెట్టబడుతోందన్న సంగతి మోతీలాల్ గారికి స్ఫురించలేదు.

అసలుకు మోసం

ఆ ప్రకారం కాంగ్రెసువారు, తమ వేలితో తమ కన్నే పొడుచుకున్నట్లు, తమ్ముతామే దగా చేసుకున్నట్లయింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్‌చే నామినేట్ చేయబడిన ఇండియన్ లెజ్జస్లేచర్‌కి సంబంధించిన ఇండియన్ మెంబర్లు, వైస్రాయ్‌తో సలహా సంప్రతింపులతోనే నియమింపబడ్డా, వైస్రాయ్‌చే నియమింపబడ లేదన్నట్లు, అంటే "తిట్టుకాదురా కూసు కొడుకా" అన్నట్లు అయి, అసలుకు మోసం చేసుకున్నా రన్నమాట! బాయ్‌కాట్ తీర్మానానికి ప్రతిపాదించబడిన ఈ సవరణ తీర్మానం నెగ్గడంతో, కాంగ్రెసువారు, తమ పార్టీకి బలాన్ని చేకూర్చుకో లేదు సరికదా, వారి స్థాయిని మాత్రం కించపరచుకున్నట్లయింది.

ఈ పరిస్థితులు ఇల్లా ఉండగా, లాయలిష్టులు మాత్రం సైమన్ కమిషన్ విషయంలో ఆ కమిషన్‌తో ఎంత మాత్రమూ సహకరింప జాలం అనే ఒక్క ముక్కతో ఎక్కువ శక్తి సామర్థ్యాలు ప్రకటించారు.

సెంట్రల్ అసెంబ్లీలో లీడరూ, సభ్యులూ కలసి, సెక్రటరీ ఆఫ్ స్టేట్‌నీ, వైస్రాయ్‌నీ కలుసుకొని, ఇండియన్ కమిటీని నామినేట్ చేయించమని కోరుతూ ఉంటే, మద్రాసు శాసన సభ్యులుగాని, ఇతర రాష్ట్ర శాసన సభ్యులుగాని మరో రకంగా ఎల్లా వ్యవహరింప గలుగుతారు? మెంబర్లు ఎప్పుడూ నాయకుణ్ణి అనుసరించాలి. నాయకుణ్ణి వ్యతిరేకింప దలచిననాడు, మెజారిటీ ఉండక, చెరువులో చేపలలాగ బయటపడిపోతారు.

ఆ ప్రకారంగా అవలంబించ దలచిన పద్ధతిని నిర్దారణచేసికోలేని స్థితిలో ఉన్న ఆ కాంగ్రెసు పార్టీ అనబడే స్వరాజ్యపార్టీవారు (పేరు మార్చుకున్నారుగా!), బలాన్ని చేకూర్చుకుని పుంజుకోవడానికి కావలసింది పాలో, నీళ్ళో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోవడంచేత, బ్రిటిషువారు - వీరు ఎన్నికలలో బలం చేకూర్చుకోవడానికి కాంగ్రెసయ్యారుగాని, వీరి కందరికి హృదయాంత రాళాలలో తమపట్ల పూర్తి విశ్వాసమే ఉన్నదనీ, ఈ నాటకం అంతా బేరాలు ఆడే విధానంలోని భాగమేననీ, ఇస్తామన్న వాటి కంటె మరికొన్ని సదుపాయాలకోసం పీకులాట తప్ప మరేమీ కాదనీ తలచడానికి కారణం అయింది.

స్వరాజ్యపార్టీ పుట్టింది లగాయితూ, 1923 నుంచి అయిదుసంవత్సరాల కాలంలోనూ వ్యవహరించిన తీరునుబట్టి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ గౌరవాన్ని ఎంత మాత్రం పొందలేకపోయారు. కాగా ఆయన మరింత బిర్రబిగియడమే జరిగింది, "మే మేదిస్తే దానినే తీసికోవాలిగాని, ఏమి టిదంతా? ఈ అట్టహాసం అంతా ఏమిటి?" అనే స్థితికి ఆయన వెళ్ళి పోయాడన్నమాట!

తత్తరపాట్లూ, గాబరాలూ

ఉభయత్రా తత్తరపాట్లూ, గాబరాలూ, అల్లకల్లోల పరిస్థితే సంభవించింది ఈ కమిషన్ నియామకంవల్ల. దానిని ఏర్పరచిన బ్రిటిషు వారు ఇండియా పరిస్థితి, కాంగ్రెసు నాయకుల స్థితిగతులూ గ్రహించకుండా ఎల్లా తొందర తొందరగా వ్యవహరించారో, అదే విధంగా కాంగ్రెసు నాయకులూ చిందర వందర పరిస్థితి లోనే ఉన్నారు. కాంగ్రెసు బహిరంగ సమావేశాలలో ప్రజల తరపునా, అఖిల పక్ష రాజకీయ పక్షాల తరపునా 1928 ఫిబ్రవరి - మార్చి రోజులలో రూపొందించిన కోరికను చెల్లించవలసిందిగా గట్టిగా అడగ గల శక్తి, ధైర్యమూ కాంగ్రెసు వారికి లేకపోయింది. ఎక్కడకు వెళ్ళినా ఆ సైమన్ కమిషన్ వారికి చుక్క ఎదురవుతూ వచ్చిన ఆ రోజులలో, కాంగ్రెసువారికి ఆ విషయమై ఆసక్తి లోపించింది.

అఖిల పక్ష నాయకుల కోరిక, నిజానికి, అతి ముఖ్యమయిందీ, వాంఛింప తగ్గదీని. అన్ని విధాల పూర్తిగా పూచీ వహించగల ప్రభుత్నాన్నే (Full responsible government) భారతదేశంలో వెంటనే స్థాపించి తీరాలని ఏకగ్రీవంగా నూ, స్పష్టంగానూ, ఆ అఖిలపక్ష రాజకీయ సభవారు (All parties' Conference) కోరిన కోర్కెకంటే, మిన్న అయింది ఇంకొకటి ఉండబోదు కదా! 1927 డిసెంబరులో కాంగ్రెసువారు ఆమోదించిన స్వాతంత్ర్య తీర్మానానికీ, 1928 ఫిబ్రవరి - మార్చి రోజులలో ఈ అఖిల పక్ష నాయకులు కోరిన కోరికకీ భేదం లేదనే అనాలి.


1928 లో అర్ద సంవత్సరంపాటు మాకు ఉత్తర హిందూస్థానంలోనే గడిచి పోయింది. ఆల్‌పార్టీ కాన్పరెన్సులూ, అఖిల భారత కాంగ్రెసు కమిటీవారి మీటింగులూ అన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా అ ఉత్తర హిందూస్థానంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ అఖిల పక్ష సభవారే 1928 ఫిబ్రవరి - మార్చి మాసాలలో 25 సార్లు కలుసుకున్నట్లు రికార్డుంది. అందులో డా॥ అన్సారీ అధ్యక్షతను నడచిన ఒక మీటింగులో, ఒక క్రమమయిన, యుక్తి యుక్తమయిన రాజ్యాంగ పథకాన్ని (Constitutional scheme) తయారు చెయ్యడానికి "నెహ్రూ కమిటీ" అన్న పేరుతో ఒక ఉప సంఘాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ నెహ్రూ కమిటీవారు తమ నివేదిక జూన్ 1928 నాటికి తయారుచేసి సమర్పించాలని నిర్ణయించారు. ఈ లోపుగా సైమన్ కమిషన్‌వారు రావడమూ, పర్యటించడమూ, తిరిగి వెళ్ళడమూ, తిరిగీ 1929 లో వస్తామని చెప్పడమూ జరిగాయి. నెహ్రూ కమిటీవారి రిపోర్టు ఏమయిందీ మున్ముందు చెపుతాను.

ఇండియన్ కమిటీ

1927 నాటి ఇతర విషయాలను గురించి చెప్పేలోపల, సైమన్ కమిషన్‌ని గురించి విశదీకరించడం న్యాయం

మోతీలాల్ నెహ్రూగారి సవరణతో వెనక్కి నెట్టబడిన లాలా లజపతిరాయ్‌గారి 'బహిష్కరణ' తీర్మానము, కాంగ్రెసుపార్టీ నాయకుడు రాయల్ కమీషన్ ఏర్పాట్లలో తికమకలున్నాయంటూ చేసిన నిర్వచనమూ మొత్తానికి నేల విడచి సామయిన కారణంగా, వైస్రాయ్, తాను ఎన్నుకోమంటే కాంగ్రెసు పార్టీవారు ఎన్నుకోలేదని నెపంవేస్తూ, తన చెప్పు చేతులలో ఉండే నలుగురు అసెంబ్లీ మెంబర్లను ఎంచి, వారికి ఇంకో ముగ్గుర్ని జతగూర్చి, భారతీయ సహకార సంఘం (Indian Committee of Assessors) అంటూ ఏర్పరచి, ఆ సంఘం రాయల్ కమిషన్‌తో సహకరిస్తుందన్నాడు.

వైస్రాయ్ సవాలు

బొంబాయిలో కమిషన్‌వారు అడుగుపెట్టే లోపల ఎల్లాగయినా వారికి సహకారం సంపాదించి తీరాలని వైస్రాయ్ చాలా తాపత్రయపడ్డారు. ఫిబ్రవరి 2 వ తేదీని, అంటే తెల్లవారితే కమిషన్‌వారు కాలు పెడతారనగా, తాను ఎన్ని విధాల ప్రయత్నించినా సహకారం రాని కారణంగా, సహకారం ఉన్నా లేకపోయినా కమిషన్‌వారు తమ పనిని తాము చేసుకుపోతారనీ, దేశంయొక్కా, దేశీయులయొక్కా సహకారంతోగాని, సహాయ నిరాకరణంతోగాని, వారికెట్టి సంబంధమూ ఉండబోదని తెలియజేశాడు. అంటే - మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వ్యవహరించండోయి, మా పని మాత్రం మానకుండా మేము చేసుకుపోతాం అనే సవాల్ని విసిరాడన్నమాట!

వైస్రాయ్ చేసిన ఈ సవాలు కాంగ్రెసు నాయకుల వెన్నుమీద చరచి, ముందడుగు వెయ్యండోయి అనే హెచ్చరికగా పనిచేసి, సర్వత్రా బ్రహ్మాండమయిన విజయాన్ని సాధించిన ఆ బహిష్కరణ ఉద్యమానికి దోహదం చేసింది. మార్చి ఆఖరువరకూ దేశంలో పర్యటించిన ఆ సైమన్ కమిషన్‌వారు, మార్చి మాసం పూర్తిగా వెళ్ళకుండానే, బొంబాయిలో ఓడ యెక్కారు.

1929 లో, సుమారు అదే రోజులలో, ఆ కమిషన్ వారు తిరిగి వచ్చినప్పుడు, గత సంవత్సరంలో లాగే, ఎక్కడకు వెళ్ళినా వారికి చుక్కెదురయింది. ఆ నల్ల జెండాలే ఎదురయ్యాయి.

కాని, లోగడ చెప్పాను చూడండి - ప్రతి దేశంలోనూ ఎల్లప్పుడూ కొందరు విభీషణాయిలు ఉంటారని! అట్టి వారినే, ఆ 'లాయలిస్టు' లనబడే ఆ విభీషణాయిలనే కొంతమందిని కలుసుకుని, 1929 ఏప్రిల్ 14 నాటికి తమ విచారణ ముగింపు జేసుకున్నారు. ఏదయితేనేం, విరమించనున్న కన్సర్వేటివ్ ప్రభుత్వంవారు విరమించే లోపలనే, వారు కోరుకున్న ప్రకారమే, సైమను కమిషన్‌వారు తమ రిపోర్టు తయారు చేసి సమర్పించ గలిగారన్నమాట!

కృతకృత్యులైన కన్సర్వేటివ్‌లు

కన్సర్వేటివ్‌లు అనుకున్నట్టుగానే, ఎన్నికలలో వారు వోడిపోవడమూ, లేబరు పార్టీవారు రాజరికాన్ని చేపట్టడమూ జరిగింది. చేయబడిన సూచనలూ, ఇవ్వబడిన సలహాలూ ఎంత అసభ్యంగా, అవక తవకగా ఉన్నా, అవి భారతదేశం లోని కేంద్ర, రాష్ట్రీయ దృకృధాలతోనే చేయబడ్డవన్న కారణంగా, అధికారంలోకి వచ్చిన లేబర్‌పార్టీవారికి ప్రతిబంధకాలై, వారి కాళ్ళూ చేతులూ అనుకోని విధంగా బిగించేశాయి. భారతదేశ విషయంలో వారు ఏమీ చేయలేని స్థితిలోనికి వచ్చారన్న మాట! ఎలాగో ఒకలాగ లేబర్‌పార్టీవారు భారతదేశానికి ఏదయినా సహాయం చేసి పోతారేమోననే దుగ్ధతోనే కదా,కన్సర్వేటివ్‌లు ప్రజాభిప్రాయానికి భిన్నంగా, ప్రజలు కనబరచిన నిరసన లన్నింటినీ సహించి తంటాలుపడింది!

భారత నాయకత్వం బహునాయకత్వమూ, బాల నాయకత్వము అయి పప్పులో కాలువేసింది. వచ్చేవారు లేబర్‌పార్టీ వారయినా, లిబరల్ పార్టీ వారయినా, కన్సర్వేటివ్‌లే అయినా, ఇచ్చేవారు మాత్రం ఇంగ్లీషు వారేననీ; ఇండియాకు సంబంధించినంతవరకూ, ఏ పార్టీవారయినా చూపించేది తొంటి చెయ్యేననీ; ఇంగ్లీషువారెప్పుడూ, తమ ప్రత్యర్థి బలా బలాల విలువలు విలియా వేసుకుని, వాడు బలవంతుడయితేనే తప్ప కాళ్ళబేరానికి రారనీ, పాపం, భారత నాయకులు గ్రహించలేదు. భారతీయ నాయకు లరచిన ఆ అరపుల లోని బీదతనాన్నీ, అర్భకత్వాన్నీ, అది కావా లిదికావా లనే యాచక మనసత్వాన్నీ ఆంగ్లేయు డెప్పుడూ మన్నించి గౌరవించలేడు. భారతీయ మనస్తత్వం ఆంగ్లేయులకు బాగా అర్థమయిన కారణంగానే, చాకచక్యంగా వాయిదాలమీద వాయిదాలు వేసుకుంటూ దాటుకు రాగలిగారు.

గాంధీజీ నమ్మినబంట్ల వరస

భారతీయులందరూ, గాంధీగారియందు సంపూర్ణ విశ్వాసం గలవారై, ఆయన తెలిసిగాని తెలియకగాని పొరపాటునగాని గ్రహపాటునగాని, మరో ఉద్దేశంతో గాని యీ దేశానికి ఏ విధమయిన చెడుగూ ఎప్పుడూ చేయలేదని, ఆనాడే గాదు - ఈ నాడూకూడా నిస్సంకోచంగా నమ్ముతారు. గాంధీగారు, ఎప్పుడయినా ఏదయినా పొరపాటు చేసిఉంటే, తాను చేసిన పొరపాటును గ్రహించిన తక్షణం, బహిరంగంగానూ, నిస్సంకోచంగానూ ఒప్పుకుని, ప్రజాభిప్రాయమే తన అభిప్రాయంగా మార్చుకుని, దేశక్షేమాన్నే సర్వత్రా కాంక్షించిన మహా త్ముడు. కాని నిజానికి ఆయనకి ఎప్పుడయినా చిక్కులు వస్తే అవి తానే స్వయంకృతాపరాధంగా ఎంచుకున్న ఆ పెద్ద నాయకుల ద్వారానే వచ్చేవి. చిత్తరంజన్‌దాస్, మోతిలాల్ నెహ్రూ, మహమ్మదాలీ, షౌకతాలీలాంటి, అగ్ర నాయకులయిన నమ్మినబంట్లే ఆయన్ని చికాకుల్లో ముంచారు.

ఆయనకున్న బలం ఆయన సరిగా విలియా వేసుకోలేక పోయారు. భారత దేశంలో ఉన్న కోటానుకోట్లజనం, స్వాతంత్ర్యంకోసం తహతహలాడుతూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన సూచించిన అహింసాతత్వాన్ని జీర్ణించుకుని, ఎటువంటి త్యాగాలకయినా సిద్ధంగా ఉండగా, ఆయనమాత్రం తన అనుంగు అనుచరులని, తాను నమ్మినవారిని అంటిపెట్టుకుని ఉన్నాడు. వారిలో కేంద్రంవారూ, రాష్ట్రాలవారూ ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారిలో చాలా మంది గాంధీగారిలోనూ ఆయన కార్యక్రమాలలోనూ, తుదకు ఆయన విధానం లోనూ కూడా విశ్వాసం లేనివారే అయ్యారు.

అటువంటి వారిని నమ్మి, వారిపై ఆధారపడడమే ఆయన చేసిన పెద్ద తప్పిదం అనవలసివస్తుంది. పాపం, వారివల్లనే కదా ఆయన ఇక్కట్ల పాలయింది? తన మనుష్యులని తాను నమ్మిన పదిహేనుమందిలో పదిమంది మంచి క్లిష్ట పరిస్థితులలో, ఆయన విధానా లన్నింటికీ మూలకందమూ, ముఖ్యాతి ముఖ్యమూ అయిన అహింసావిధానం విషయంలోనే, ఆయన్ని జారవిడిచి ద్రోహం చేశారు. ఈ విషయం ప్రత్యేకంగా పూర్తి వివరాలతో, "శ్రీ గాంధీగారి నాయకత్వమూ, జాతీయోద్యమమూ - ఇటీవల జరిగిన సంఘటనలూ" అన్న శీర్షిక క్రింద ఆ కథంతా సావకాశంగా ఏకరువు పెడతా.

విశ్వనాథంగారి ప్రతిపాదన

కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనుకూడా సహకార నిరాకరణే ప్రాతిపదికగా ఎన్నికయిన కాంగ్రెసువారు స్వరాజ్యపార్టీ సభ్యులుగా చెలామణీ అవుతూ, దరిమిలా కాంగ్రెసును కోరి, కాంగ్రెసు అనుమ తితో, కాంగ్రెసు నామాన్నే స్వీకరించి కౌన్సిల్‌లో కాంగ్రెసు పార్టీగా ఏర్పడిన పెద్దలు, వాదనలో దిట్టలనీ, నేర్పరులయిన ప్రజా ప్రతినిధులనీ, పై దేశాలలోని శాసన సభ్యులతో తులతూగగలవారనీ ఎంతపేరు సంపాదించినా, ఏ సహకార నిరాకరణ సూత్రాన్ని మనస్సులో ఉంచుకుని వ్యవహరిస్తామని హామీఇస్తూ శాసన సభా ప్రవేశం చేశారో - ఆ సూత్రాన్నే క్రమేపీ జారవిడుస్తూ వస్తున్నారా అనే అనుమానానికి గురయ్యారు.

అందువల్లనే అఖిల భారత కాంగ్రెసు సంఘ సభ్యుడయిన తెన్నేటి విశ్వనాధం గారు కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులో శాసన సభాసభ్యుడయిన ఏ కాంగ్రెసువాదీ ప్రభుత్వం వారు సూచించే ఏ హోదానీ చేపట్టరాదనీ, ఈ ద్వంద్వ ప్రభుత్వంలో మంత్రిపదవి లభించినా తిరస్కరిం చాలనీ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించవలసి వచ్చింది. ఈ ప్రతిపాదనతో నాయకులు ఇరకాటంలో పడ్డారు. అందుచేత విశ్వనాథంగారి ప్రతిపాదనను కాంగ్రెసు అధ్యక్షులవారే స్వయంగా వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

కాని అప్పటికే కాంగ్రెస్ ప్రారంభ దినం దగ్గిరయింది. శ్రీనివాసయ్యంగారు అప్పుడు కాంగ్రెసు అధ్యక్షుడు. దాస్, నెహ్రూగారలు స్వరాజ్యపార్టీని ఏర్పరచిన దరిమిలానే ఆయన కాంగ్రెసులో చేరాడు.

కాంగ్రెసువారు తా మవలంబించిన కౌన్సిల్ ప్రోగ్రాం ఎప్పుడయినా వదిలే స్తారనిగాని, నేరుగా సహకారనిరాకరణం, శాసనధిక్కారం లాంటివి చేపట్టి ప్రత్యక్ష చర్యకు దిగుతారనిగాని ఆయన ఎప్పుడూ ఊహించలేదు.

శాంతియుతంగా శాసన సభా కార్యక్రమం నడపడమే ఆయన వాంఛితార్థం. ఆయన ఒక సమగ్రమయిన పదకాన్ని వేసి, తద్వారా కౌన్సిల్లో ఐకమత్యం నెలకొల్పి తంటాలుపడదాం అని ఎంతో శ్రమపడ్డాడు. తానే కాంగ్రెసు అధ్యక్షుడున్నూ, తానే ఆ పదకపు నాయకుడూ అవడాన్ని తన పదకం చులాగ్గా అంగీకరించ బడుతుందని తలచాడు. ఆ పదకం అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు ఒప్పుకున్నారు. కాని అప్పటికే ఆయన తలప్రాణం తోకకి వచ్చినంత పనయింది. ముందు కార్యక్రమం నడపగల ఓపిక ఆయనలో సన్నగిల్లింది. అందులో విశ్వనాథంగారి ప్రతిపాదన కొరకరాని కొయ్యే. ఆత్రుత కలిగించేదే. పైగా తాను కాంగ్రెసు అధ్యక్షుడుగా ఉండగానే, స్వరాజ్యపార్టీని శంకించే పరిస్థితి!

  1. 1928 ఫిబ్రవరి ఆఖరి వారంలో.
  2. 1929 లో సైమన్ కమిషన్ రెండవతూరి మదరాసు వచ్చినప్పుడు ఈ సంఘటనలు జరిగినట్టుగా కీ. శే. వావిళ్ల వేంకటేశ్వరులుగారి "ప్రకాశము పంతులుగారి జీవితము" (పే - 99) లో చెప్పబడింది.
  3. మదరాసులో 144 వ సెక్షన్ ఉల్లంఘించరాదని ఆంధ్ర, తమిళ కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గాల సంయుక్త సమావేశం నిర్ణయించిన సంగతి కీ. శే. వావిళ్ల వేంకటేశ్వరులుగారి ""ప్రకాశము పంతులుగారి జీవితము" (పే. 98, 99)లో వివరించబడింది.
  4. ప్రకాశంగారు కాంగ్రెసు కార్యనిర్వాహకుల పునర్నిర్ణయం నిరసించి, ప్రకటన జారీచేశారు గాని, వారి తీర్మానాన్ని ఉల్లంఘించ లేదని, మొదటిసారి కమిషన్‌వారు మదరాసు వచ్చినప్పుడు ఒక లాఠీఛార్జీకూడా జరగలేదనీ డా॥ జి. రుద్రయ్య చౌదరి తమ "ప్రకాశం: ఎ పొలిటికల్ స్టడీ" అన్న పుస్తకం (పే. 56 - పుట్‌నోట్ 21) లో వ్రాశారు.
  5. ఈ పోలీసు కాల్పులు, ఇతర సంఘటనలు జరిగింది 1928 ఫిబ్రవరి 3 వ తేదీనని కీ. శే. పట్టాభిగారి "కాంగ్రెసు చరిత్ర" (పే. 466)ను బట్టి, డా॥ జి. ఆర్. చౌదరి "ప్రకాశం: ఎ పొలిటికల్ స్టడీ" (పే. 56. పుట్ నోట్ 21) అన్న గ్రంథంవల్ల తెలుస్తూంది. ఆనాడే సైమన్ కమిషన్ బొంబాయి రేవులో దిగింది - యావద్భారతంలోను హర్తాల్ జరిగింది. ఆనాడు మదరాసు సంఘటనలలో మరి యిద్దరు మరణించారని కాంగ్రెసు చరిత్రకారుల కథనం. కమిషన్ వారు మొదటిసారి మదరాసు వచ్చింది ఫిబ్రవరి ఆఖరి వారంలో, మార్చి 31 వ తేదీని తిరిగి బొంబాయిరేవు విడిచారు, మళ్ళీ 1929 లో ఇదే రోజులలో ఇండియాకు వచ్చారు. ఏప్రిల్ 14 నాటికి వారి విచారణ ముగిసింది. మదరాసులో హర్తాలు జరిగింది మూడుసార్లని తెలియవస్తూంది: కమిషన్ ఇండియాలో దిగిననాడు, మదరాసుకు వచ్చిన రెండు దఫాలు.