నా జీవిత యాత్ర-1/వీరేశలింగం పంతులు కేసు

వికీసోర్స్ నుండి

19

వీరేశలింగం పంతులు కేసు

వీరేశలింగంగారికి మంగమ్మచేసే శుశ్రూష అనేకమైన అపార్థాలకి తావు ఇచ్చి, కొంత అపవాదుకి కారణం అయింది. ఆ విషయాన్ని గురించి తీవ్రంగా వ్రాయడంచేత వీరేశలింగంగారు శ్రీరాములుమీద జాయంటు మేజస్ట్రీటుకోర్టులో లైబెల్‌కేసు వేశారు. అప్పుడు నేను ప్రీవీ కౌన్సిలు పనిమీద లండను వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి ఈ కేసు సగం పూర్తి అయింది. అందరూ కూడా శ్రీరాములు జైలుకి వెళ్ళడం తప్పదని అనుకున్నారు. ఈలాంటి స్థితిలో కీర్తిశేషులైన చిత్రపు వెంకటాచలంగారు నాతో, "ప్రకాశం! నువ్వు సరియైన టైములో వచ్చావు. ఈ కేసు స్వయంగా చూడు. శ్రీరాముల్ని జైలుకి పంపడానికి అంతా సిద్దమై ఉంది. ఈ ప్రోసిక్యూషనులో పెద్దవాళ్ళు తెరవెనక నాటకం చాలా ఉంది," అని చెప్పారు. అప్పుడే ఆ కేసు విచారిస్తూ ఉన్న జాయింటు మేజస్ట్రీటు ట్రాన్సుఫరు అయి యఫ్. డబ్లియు. స్టూ అర్టు జాయింటు మేజస్ట్రీటుగా వచ్చాడు. మేజస్ట్రీటు మారడంచేత విచారణ మొదటినించీ జరగాలని వాదించాను. నా వాదన నెగ్గింది. స్టూ అర్టు నాతోటే లండన్‌లో ఓడ ఎక్కి ఇండియా వచ్చాడు. ఓడలో నేను ఫస్టు క్లాసులోనూ, ఆయన సెకండు క్లాసులోనూ ఉండడంచేత కలుసుకోవడానికి వీలు అయ్యేదికాదు. కాని, అప్పుడు క్రిస్టమస్‌పండుగ అవడంచత ఆయన్ని ఓడలో కలుసుకున్నాను. విచారణ ఆయన ఎదటే జరిగింది.

నేను ఇంగ్లాండులో ఉన్నప్పుడు ఆలాంటిదే ఒక కేసు జరిగింది. ఒక యువతి డ్రస్సింగుగదిలో ఉండగా కాస్త వయస్సు ముదిరిన ఫాదిరీ ఆ గదిలో కొన్నినిమిషాలు ఉన్నా డన్న కారణంచేత ఆయన మీద వ్యభిచారనేరం ఆరోపించారు. అది తండోపతండాలుగా ప్రేక్షకుల్ని ఆకర్షించిన కేసు! ఫాదిరీ తాను ఏవిధమైన అపచారమూ చెయ్యలేదనీ, ఆమెతో మాట్లాడడానికి మాత్రమే ఆ గదిలోపల ఉన్నాననీ వాదించాడు. కోర్టువారు ఆ డ్రస్సులో ఒంటరిగా ఉండేటప్పుడు ఆమెతో ఒక గదిలో ఉండడమే నేర మని నిర్ణయించి ఆ ఫాదిరీని శిక్షించారు.

వీరేశలింగంగారి కేసు కూడా ఇల్లాంటిదే. ఆయనమీద ఆమె ఏకాంతంగా ఉండగా పంతులుగారు ఆమె వీపు నిమురుతూ ఉండే వారనీ, బెంగుళూరు ప్రయాణంలో సెకండు క్లాసు కంపార్టుమెంటులో ఉభయులూ ప్రయాణం చేశారనీ, బెంగుళూరులో ఇద్దరూ మూడు మాసాలు ఒక గదిలోనే ఉన్నారనీ నిందారోపణ చేశారు. "మంగమ్మని నా అభిమాన పుత్రికగా చూసుకునే వాణ్ణి," అని వీరేశలింగంగారి వాదన. పాపం! వీరేశలింగం పంతులుగారిని సుమారు 5 రోజులు క్రాసుపరీక్ష చేసి ఈ పై సంగతులన్నీ ఒప్పించాను. ఆ ఇంగ్లీషు కేసు నాధారంగా చేసుకుని నా వాదన అంతా ఆ పద్ధతులమీద నడిపించాను.

ఒక పత్రికా రచయిత, తనకి న్యాయం అయినదని తోచే విమర్శన చెయ్యడానికి తగిన అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో మేజస్ట్రీటుకి ఒక నిశ్చయం కుదిరింది. అందుచేత మేజస్ట్రీటు "ఈ కేసు ఎందుకు కొట్టివెయ్యకూడదో చెప్ప" మని అడిగాడు. పంతులుగారు "కేసులో వాదించడానికి మద్రాసునించి ఎవ్వరో వస్తారు. అందాకా వాయిదా ఇ"మ్మని అడిగారు; కాని ఇవ్వలేదు. చివరికి మేజస్ట్రీటు కేసు కొట్టివేశాడు. స్టూ అర్టుకి ముందు, ఈ కేసు విచారించిన బార్ట్సువెల్ హైకోర్టు జడ్జీ అయ్యాక నేను ఒకసారి ఆయన్ని కలుసుకోవడం తటస్థించింది. అప్పుడు ఆయన ప్రస్తావన తీసుకువచ్చి, "తన ఎదట ముద్దాయి తరపున కేసు సరిగా చెప్పని కారణంచేతనే చార్జీ చేశాను," అన్నాడు. ఎల్లాగ అయితేం శ్రీరాములు అందులోంచి నెమ్మదిగా బయటపడ్డాడు.

కార్లీలియన్ పత్రిక తరవాత అట్టేకాలం నడపలేదు. దాని పర్యవసానం ఏమయినా, పంతులుగారు చెప్పుడు మాటలు విని ఈ కేసు పెట్టినందుకు, ఆయన అంటే భక్తి గౌరవాలు ఉన్న నేను ఆయన్ని బోనులో నిలబెట్టి చాలా కష్టమైన ప్రశ్నలతో బాధించాను. అందుకు మాత్రం నా మనస్సు చాలా నొచ్చుకుంది. కాని, వృత్తి ధర్మంచేత అది తప్పనిసరి అయింది. శ్రీరాములు రాజమహేంద్రవరంలోనే న్యాయంగా వకీలు వృత్తి చేసుకుంటూ కాలక్షేపం చేస్తూవచ్చాడు.