నా జీవిత యాత్ర-1/పూర్వగాథ

వికీసోర్స్ నుండి

1

పూర్వగాథ

మా ముత్తాతలనాడు స్వగ్రామం ప్రస్తుతం ఒంగోలు తాలూకా టంగుటూరు. మా ముత్తాత నరసరాజు గారు కరణీకం చేస్తూ మంచి ఆస్తిపాస్తులు సంపాదించారని వినికిడి. ఆయన కాలంలోనే మాకు టంగుటూరికి ఆరు మైళ్ళ దూరంలో వెంకటగిరి రాజాగారి ఎస్టేటులో ఉన్న వల్లూరు గ్రామంలో సుమారు 40, 50 ఎకరాల భూవసతి ఉండేది. వల్లూరు, టంగుటూరికీ ఒంగోలుకీ మధ్య మద్రాసు కలకత్తా ట్రంకురోడ్డు మీద ఉన్న గ్రామం.

నరసరాజుగారి కాలంలో ఆయనకి వెంకటగిరి సంస్థానంలోనూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ విశేషం పలుకుబడి ఉండేది. వారు పేరు ప్రఖ్యాతులలో గౌరవంగా కాలక్షేపం చేసేవారు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అని ఇద్దరు కుమాళ్ళు ఉండేవారు. ఆ రోజుల్లో నియోగి కుటుంబాలు కరిణీకం వగైరాలతో లౌక్యజీవనం చేస్తూ గ్రామ పాలకత్వం వహిస్తూ ఉండేవి. అందుచేత మా ముత్తాతగారు, అప్పాస్వామి టంగుటూరులో కరిణీకం చేసుకుంటూ అక్కడే నివసించడానికీ, ఆయన తమ్ముడూ మా తాతగారూ అయిన నరసరాజు వల్లూరులో కాపరం చేస్తూ, కరిణీకమూ దానితోపాటు భూములు చూసుకుంటూ జీవయాత్ర చేయడానికిన్నీ నిర్ణయించారు. ఆ ప్రకారంగా మా తాతగారు వల్లూరు రావడం తటస్థించింది. అందుచేతనే టంగుటూరు ఇంటిపేరు అయినా మా గ్రామం వల్లూరే అని చెప్పవలసి వస్తుంది.

వల్లూరులో మా తాతగారు పెద్ద నాలుగిళ్ళ భవంతి ఒకటి కట్టారు. ఆయనకి నలుగురు కుమాళ్ళూ, ఇద్దరు కుమార్తెలు జన్మిం చారు. వాళ్ళు పెద్దవాళ్లై ప్రయోజకులైన తరువాత, ఆయన ఆ భవంతి కెదురుగా ఉండే ఒక పూరింట్లో కాపరం ఉంచేవారు. నేనైతే ఆయన్ని ఎరగను. మా నాయనమ్మ సావిత్రమ్మగారినీ, ఆవిడ చెల్లెలు ఆదెమ్మగారినీ ఎరుగుదును. మా తాతగారినిగురించి నే నెరిగినదల్లా ఆయన తాలూకు పాత రికార్డులు. మేదరతడకలతో పంజరం కట్టి, దానిపైన తోలుతో బిగించిన పెద్ద కావిడిపెట్టెలవంటి పెట్టెల్లో ఆ రికార్డు లన్నీ ఉండేవి. మా అవ్వ లిద్దరూ పాడి సమృద్ధిగా చేస్తూ ఉండేవారు. మా తాతగారు 85 సంవత్సరాలు పైగా సంపూర్ణమైన జీవితం గడిపి కీర్తిశేషు లయ్యారు.

మా తాత గారికి మా తండ్రులు నలుగురు. వారి నలుగురిని నేను కొంచెం ఎరుగుదును. మా పెత్తండ్రిగారైన రాఘవయ్యగారు కొంత కాలానికి భార్యాపుత్రులతో సహా కుటుంబంతో సంబంధం ఒదులుకుని తిరుపతి వెళ్ళిపోయారు. రెండో ఆయన రామస్వామిగారు. ఆయన సంగీత సాహిత్యాల్లో మంచి ప్రవేశం కలవారు. తరుచుగా పొగాకుతో తమలపాకులు నములుతూ సంగీతసాధన చేస్తూ ఉండేవారు. మూడో ఆయన అప్పాస్వామి. ఆయన తాతగారి తాలుకు కరిణీకం చేపట్టి గ్రామ పాలకత్వం సాగిస్తూ ఉండేవారు. మా తండ్రిగారైన గోపాల కృష్ణయ్యగారు వ్యవసాయంపని చూస్తూ ఉండేవారు. మా తాతగారి మరణానంతరం మా తండ్రులు నలుగురూ ఇల్లూ, ఆస్తీ పంచుకుని వ్యష్టిగా అనుభవిస్తూ కార్యకలాపాలు వచ్చినప్పుడు సమిష్టిగా వ్యవహరిస్తూ ఉండేవారు.

అంతకు పూర్వపు సంగతులు నాకు అంతగా తెలియవుగాని, మా మేనత్తలిద్దరిలో పెద్దామె పార్వతమ్మగారు చిన్నతనంలో వైధవ్యం పొంది, ఇంట్లోనే ఉండి మా కందరికీ కంటికి రెప్పలా ఉండేది. ఆమె చెప్పిన విషయాలవల్లనే నాకు మా పూర్వుల విషయం తెలిసింది. ఆ కాలంలో పండగలూ, పర్వాలూ వచ్చినప్పుడు మా అమ్మగారూ, మా పెత్తల్లులూ, అంతా కలిసి పండుగలు చేసుకుంటూ, వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా పని అవసరం అయిన సమయాల్లో పొలాలకికూడా వెళ్ళి వ్యవసాయపు పనిపాటల్లో పాల్గొనేవారు. ముఖ్యంగా దూడలకి గడ్డి సేకరించడం వాళ్ళ అభిమాన విషయం.

మా రెండో మేనత్తగారైన నరసమ్మ గారికి అప్పట్లో అద్దంకి పరగణా ఉత్తరఖండంలో చేరిన కొరెసపాడు గ్రామంలో వివాహం చేశారు. ఆవిడికి నరసింహం, నారయ్య అని ఇద్దరు కుమాళ్ళు.

మా తండ్రి గారు సుమారు 30 వ ఏట కనపర్తి గ్రామం వారు వినోదరాయుడుపాలెలలో కనపర్తి కామాక్షమ్మగారి ఏకైక పుత్రిక సుబ్బమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఆమెవల్ల ఆయనకి సంతానం ఆరుగురు. అందులో మొదటి ఇద్దరూ ఆడవాళ్ళు. మూడో సంతానం నేను. నా తరవాత శ్రీరాములు. అతని తరువాత అన్నపూర్ణ అనే ఆడపిల్ల. ఆమె సుమారు 13 సంవత్సరాలు జీవించి, వివాహం అయిన తరువాత చనిపోయింది. ఆమె తరరువాత మా నాయనగారు చనిపోయిన రెండు మాసాలకి జానకిరామయ్య జన్మించాడు. ఈ సందర్భంలో మా తండ్రిగారి జీవితాన్ని గురించీ, నేను స్వయంగా ఎరిగినంతవరకు ఆ కాలంలో ఉండే జీవిత వ్యవహారాలని గురించి కొంచెం వ్రాస్తాను.

మా తల్లిదండ్రుల్లో మొదటి ఆయన రాఘవయ్యగారు తిరుపతి వెళ్ళిపోయినట్లు లోగడ వ్రాశాను. తరవాత కొంతకాలానికి మిగిలిన వారు వల్లూరులో ఉన్న ఇల్లూ, భూములు పంచుకుని కాలక్షేపం చేశారు. క్రమంగా మా తండ్రులందరికీ కుటుంబాలు పెరిగిపోయి, భూమిమీద వచ్చే ఆదాయాలతో జీవనం చెయ్యడం సాధ్యంకాని రోజులు వచ్చాయి. నా పుట్టుకకి పూర్వమే అల్లాంటి నిక్కచ్చి కనిపించింది. మా తండ్రిగారు, ఆ ఆదాయంతోనే నా అక్కగార్లిద్దరికీ వివాహాలు చేశారు. వారిద్దరినీ మంచి సాంప్రదాయమూ, భూవసతి కలిగిన కుటుంబాలలో ఇచ్చి వివాహం చేశారు.

ఆ కాలంలో వాళ్ళ జీవితాలు మంచి హుందాగానూ, గంభీరం గానూ, నిగ్రహంతోనూ గడిచిపోయేవి. కుటుంబాల్లో అన్యోన్యప్రేమాతిశయాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆస్తిపాస్తులలో వ్యష్టిగా ఉన్నా, ప్రేమానుబంధాల్లో సమష్టి భావమూ, ఏకతా ప్రతి నిమిషమూ కన బడుతూ ఉండేవి. జీవితావసరాలు కలిసి పంచుకుని అనుభవించే లక్షణం ఒక పవిత్రతగా భావింపబడేది. ఈనాడు మన కళ్ళఎదట కనబడే స్వార్థం ఆ రోజుల్లో అంతగా కనబడేది కాదు. సుమారు అర్ధశతాబ్దం పైనాటి ఆ రోజుల సంగతి తలుచుకుంటే, నాకు, అది అంతా ఒక స్వప్నంలో తోస్తుంది.

మనుష్యుల్లో ఉండే ప్రేమాతిశయాలు గంభీరంగా కనపడేవి. ఆనాడు మనుష్యులికి కావలసిన వస్తువిశేషాలు కూడా బహు స్వల్పమే. మా తండ్రులందరూ దేశంలో తయారైన నూలులో అక్కడి సాలెవాళ్ళు తయారుచేసిన బట్టలే కట్టుకునే వారు. 1702 వగైరా మల్లుల భ్రమలు అప్పటికి లేనేలేవు. నే నయితే స్వయంగా ఎరగను కాని, మా అమ్మగారు చెప్పిన దానిని బట్టి చూస్తే మా యిళ్ళలో కదురు కవ్వాలు ఆడడం వల్లనే లేమి అనేది లేకుండా ఉండింది. ఈనాడు మట్టి పాత్రలంటే ఐశ్వర్యవంతులం అనుకునేవాళ్ళు న్యూనతగా చూస్తారు. ఆ కాలంలో గౌరవకుటుంబాల లెఖ్ఖలో ఉన్న మా యిళ్ళల్లో కూడా మట్టిపాత్రల్లోనే వంటకాలు జరిగేవి. ఆనాటి జీవితంలో విశేషం ఏమిటంటే, నాణెం ఎంత సకృత్తుగా కనిపించినా జీవితావసరాలు, మర్యాదలు ఎంతమాత్రం లోపించేవి కావు. కుటుంబం ఎంత పెద్దదైనా పండుగలు, పబ్బాలు వచ్చినపుడు కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు అంతా కలిసి వేడుకలు చేసుకోవడమూ, అంతా సాలెవాళ్ళు తయారు చేసి యిచ్చిన నూతన వస్త్రాలు ధరించడమూ, 'ఇది లోటు' అనే మాట లేకుండా తృప్తిపడడమూ ఉండేది. ఇందలో బంధుమర్యాదలూ, స్నేహ మర్యాదలు కూడా లోట్లు లేకుండా జరుగుతూ ఉండేవి. ఈనాటి పద్ధతులతో పోల్చి చూసుకుంటే ఆ రోజుల్లో జీవితమే పరిపూర్ణమైనదనీ, సుఖప్రజమైనదనీ తోచక తప్పదు. గతించిన రోజులన్నీ మంచివిగానే తలవడం లోకంలో ఉన్నదే. అందులోనూ ఆ రోజుల సంగతి తలుచుకుంటే "సత్యయుగం అంటే అదేనా?" అనిపిస్తుంది.

ఇంతటితో మా పూర్వులగాథ విరమించి స్వీయ గాథకి వద్దాము. నేను పుట్టిన తేదీ నాకు సరిగ్గా తెలియదు. నా దగ్గిర ఎక్కడా ఏవిధమైన ఆధారాలు, - అంటే జాతకం వగైరాలు లేవు. నేను పుట్టినపుడు మా నాయనగారు నా జాతకం వ్రాయించినట్లు తెలిసింది. కానీ, నాకు జ్ఞాపకం వచ్చి నేను దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసేసరికి జాతకం వ్రాసిన దైవజ్ఞుడు పిల్లుట్ల పిచ్చయ్యగారు మరణించడం చేతను, మేము దేశాంతరాలు పట్టి ఉండడంచేతనూ అవి లభ్యమయింది కాదు. తరవాత, నా పుట్టిన తేదీ అవసరమైనప్పుడు మా అమ్మగారితో సంప్రదించగా నిర్ధారణయిన సంవత్సరం 1872. ఆ సంవత్సరం సరి అయినదే అనడానికి తరవాత అనేక నిదర్శనాలు కనిపించాయి.

అప్పటికి మా ఇద్దరు అక్కగార్లకి కొంచెం ఆదాయం వచ్చింది. వాళ్ళిద్దరికీ వయస్సు తేడా నాలుగు సంవత్సరాలు. నాకూ మా రెండో అక్కగారికీ వయస్సు తేడా నాలుగు సంవత్సరాలు. అంతే కాకుండా, మా అన్నదమ్ములకీ, అక్క చెల్లెళ్ళకీ ఒక్కొక్కరికి మధ్య వయస్సు తేడా సరిగ్గా నాలుగు సంవత్సరాలు. నాకు సుమారు నాలుగైదు సంవత్సరాల వయస్సుండగా ధాత సంవత్సరం నాటి దారుణకాటకం వచ్చింది. ఆ కరువు సంగతి నాకు బాగా తెలుసును. అప్పటికి మా అక్కగార్లిద్దరికి జరిగిన వివాహాలు నేనెరుగుదును. అందుచేత 1872వ సంవత్సరమే నా స్థిరమైన జన్మ సంవత్సరంగా నిర్ధారణ చేసుకోవచ్చును.

నేను 1872వ సంవత్సరంలో కనపర్తి గ్రామంలో మా మేనమామల ఇంట్లో జన్మించాను. నేను పుట్టిన తరవాత ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండి, వల్లూరు వచ్చినట్లు మా అమ్మగారి వల్ల వినికిడి. నేను పుట్టిన రెండు మూడు సంవత్సరాలకి దేశంలో అనావృష్టి అధికమై మా నాయనగారికి వల్లూరు భూముల వల్ల వచ్చే ఆదాయంలో కుటుంబపోషణ దుస్తరం అనిపించింది. దానివెంట ధాత సంవత్సరపు కరువు. ఇక చెప్పేదేముంది? ఆయనకి ఇంకొక ఉపజీవనం సంపాదించాలనే సంకల్పం కలిగింది. ఆ రోజుల్లో మా నాయనగారితోనూ, మా పెద్ద మేనత్తగారితోనూ ఆ పొలాల్లో తిరుగులాడడం నాకిప్పటికీ జ్ఞాపకం ఉంది. కరువు రోజుల్లో ఆహారం తక్కువైనపుడు మా మేనత్త గారు ఆకుకూరలు ఎక్కువగా సంగ్రహంచి అన్నం కన్న ఆకుకూరలు ఎక్కువగా పెట్టడం కూడా నాకు జ్ఞాపకం వుంది.

నాకు 5 ఏళ్ళు వచ్చేవరకూ మా నాయనగారు అతి కష్టంగా కాలక్షేపం చేశారు. ఈ కాలంలోనే నా అప్పగార్ల వివాహాలు, నాకు ఉపనయనమూ కూడా చేశారు. ఉపనయనం నాటికి నాకింకా 5 ఏళ్ళు పూర్తికానట్టు మా అమ్మగారు చెప్పింది. నాకు ఇంచుమించుగా 5 ఏళ్ళు వెళ్ళగానే ఉపనయనం చేసినట్లు ఆమె చెప్పింది. ఉపనయనం విషయంలో నాకు జ్ఞాపకం ఉన్న దల్లా అరుగుమీద కూర్చోబెట్టి సంధ్యావందనం చెప్పడం! మా పురోహితులైన పిల్లుట్ల చెంచయ్య గారు ఎంతో కష్టం మీద నన్ను అరుగుమీద కూర్చోబెట్టి సంధ్యావందనం చెప్పేవారు.

ఇక అప్పటి చదువు విషయం. నా అక్షరాభ్యాసం వల్లూరులో వెంకటప్పయ్య అనే ఆయన వీధి బడిలో. ఆయన నాకు ఓనమాలు నేర్పిన ఆది గురువు. ఆయన విద్యే నాకు మొదటి పునాది రాయి. అయితే, ఆయన శుశ్రూషవల్ల ఇప్పటికీ నాకు వున్నవి ఆనాటి తొడపాయసాలు! ఆయన చదవకపోతే చర్మం వూడి చేతుల్లోకి వచ్చేటట్లు పట్టేవాడు! అంతే కాకుండా, నన్ను బడికి పంపడానికి మావాళ్ళు పడిన పాట్లు కూడా నాకు కొంచెం జ్ఞాపకం ఉన్నాయి. చేతులూ కాళ్ళూ కట్టి ఈడ్చుకువెళ్ళి బడిలో వెయ్యడమూ, నేను ఆ బంధనాలు తెంచుకోవడమూ కూడా నాకు కొంచెం జ్ఞాపకం! నా వీధిబడి చదువు వల్లూరులో కొంతవరకు అయిన తరువాత కుటుంబ నిర్వహణం కోసం మా నాయన గారు వేరొక గ్రామానికి మారదలచుకొని నన్ను అద్దంకి గ్రామంలో మా పెద్దబావగారైన పోరూరి నరసింహంగారి వద్ద అప్పచెప్పారు.

ఆయన ఆ గ్రామలో వీధిబడి నడుపుకుంటూ, గౌరవంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మడు నాకు పునాదికట్టుదిట్టంగా చదువు చెప్పాడు. కాని, ఆ చదువుకోసం ఆయన నాతో పడ్డ బాధ నాకు తెలియాలి; ఆ పరమేశ్వరుడికి తెలియాలి! అల్లా నన్ను పెద్ద అల్లుడిదగ్గిర చదువుకి అప్పజెప్పి మా నాయన గారు వెంకటగిరి సంస్థానంలో ఉద్యోగ సంపాదన కోసం వెళ్ళారు. ఆయన అక్కడ ఎందరో ప్రముఖుల్ని ఆశ్రయించి చిట్టచివరికి నాయుడుపేట దగ్గిర సువర్ణముఖి నది ఒడ్డున మేనకూరు ఒంటు పారుపత్యందారు ఉద్యోగం సంపాదించారు. పారుపత్యం దారు అంటే ఈ రోజుల్లో సముద్దారు అన్నమాట. ఆ రోజుల్లో ఆయన జీతం ఎనిమిది రూపాయలు. ఆయన, కుటుంబం వల్లూరులో ఒదిలివేసి, రెండు సంవత్సరాలపాటు ఆ ఊళ్ళో కష్టపడి ఉద్యోగం చేశారు.

రెండు సంవత్సరాలు అయిన తరువాత కుటుంబం నాయుడుపేట పంపించారు. అప్పటికే అద్దంకిలో నా వీధిబడి చదువై పోయి ఇంగ్లీషు చదువు ప్రారంభానికి నాయుడుపేట చేరాను. అప్పటికే నాయుడుపేటలో ఒక ఇంగ్లీషుస్కూలు ఉండింది. మా తమ్ముడు శ్రీరాములు, నేనూ ఆ స్కూల్లో చేరాము. మా నాయనగారు మా చదువుకోసం నాయుడుపేటలో ఉండి, మేనకూరు మొదలైన గ్రామాల పని చూస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో రెవిన్యూ వసూళ్ళు ధాన్యాదుల్లోనే జరుగుతూ ఉండేవి. నేను మా నాయనగారితో అప్పుడప్పుడు గ్రామాల్లోకి వెడుతూ ఉండడం కూడా జరిగేది. అల్లాంటపుడు రైతులు పిల్లవాడు వచ్చాడని మెహనతుగా రూపాయీ, అర్ధా బహుమతిగా ఇచ్చేవారు. నేను అవి అన్నీ ఒక డబ్బాలో జాగ్రత్తపెడుతూ ఉండేవాణ్ణి. పెద్ద పెద్ద దస్తరాల ముందుకూర్చోబెట్టి ఆయన అప్పుడప్పుడూ నాచేత లెఖ్ఖలు కూడా వ్రాయిస్తూ ఉండేవారు.

అప్పట్లో వెంకటగిరి సంస్థానం గురించి కొంచెం వ్రాస్తాను. ఆ రోజుల్లో వెంకటగిరి సంస్థానం ఉత్తరఖండం, దక్షిణఖండం అని రెండుభాగాలుగా ఉండేది. ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క పేష్కారు అధిపతి. పేష్కారు కింద అమల్‌దారు అని 30 రూపాయల ఉద్యోగి ఉండేవాడు. ఆయన కింద మా నాయనగారు పారుపత్యందారు ఉద్యోగం చేసేవారు. ఈ సంస్థానంలో అప్పటికే తక్కువజీతాలు, లంచగొండితనం, ఆశ్రయింపులు, వుద్యోగం నిలకడ లేకపోవడం,

మొదలైనవి ఉంటూ ఉండేవి. ఆ రోజుల్లో బి.ఏ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం అంటే ఘనమైన మాట! అప్పట్లో నారాయణస్వామిచెట్టి అనే ఆయన బి.ఏ అయి, పేష్కారు వుద్యోగంలో ప్రవేశిస్తే ఆయనకి బి.ఏ నారాయణస్వామిచెట్టి అనే పేరు వచ్చింది. ఇల్లాంటి సంస్థానంలో మా నాయనగారు రెండుసార్లు ఉద్యోగం పోగొట్టుకుని, మళ్ళీ అనేకమైన ఆశ్రయింపులు ఆశ్రయించి ఉద్యోగం సంపాదించుకున్నారు.

నాయుడుపేటలో నా చదువు గురించీ, జీవితాన్ని గురించీ కొంచెం విస్తరించి వ్రాస్తాను. నాయుడుపేటలో ఒక గవర్నమెంటు స్కూలు ఉండేది. అందులో ఫస్టు, సెకండు, థర్డు, ఫోర్తు, అప్పరు ఫోర్తు అని అయిదు క్లాసులు ఉన్నట్లు జ్ఞాపకం. ఆ క్లాసుల్లో బ్రాద్‌షా రీడర్లు చదువుతూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ఇంగ్లీషు తెలుగు వగైరాలతోబాటు ఉర్దూ కూడా చెబుతూ ఉండేవారు. నేను ఆలీబేగ్ అనే సాహేబుల కుర్రవాడితో కలిసి ఉర్దూ చదవడం జ్ఞాపకం ఉంది. నాయుడుపేటలో చదువుకునే రోజుల్లో నేను బుద్ధిమంతుణ్ణి అనిపించుకున్నానని చెప్పవీలులేదు. వయస్సు ఎంతో లేకపోయినా, స్కూలులో ఉన్న అల్లరి పిల్లలలో మనపేరు మొదటిదిగా ఉండేది.

నాకు, ఎక్కడికి వెళ్ళినా రెండురకాల మిత్రుల స్నేహాలు తటస్థపడుతూ వుండేవి. పరమపోకిరీల స్నేహం ఒకవైపున! బుద్ధిమంతులు, సంపన్న గృహస్థులు, విద్యావంతులు మొదలైన పెద్దవాళ్ళ స్నేహం రెండోవైపున! కానూరి రంగడు అని ఒకడు ఉండేవాడు. అతని అసలు పేరు రంగారావు. అతను మాధ్వుడు. అతనితో మొదటి స్నేహం సాము, గరిడీ, కుస్తీలు, చెడుగుళ్ళు మొదలైన వాటిల్లో. అతనొక చిత్రమైన మనిషి. రోజూ అతను సువర్ణముఖి ఒడ్డున వుండే ఆంజనేయస్వామికి కోడిగుడ్లు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం అందరికీ ఇస్తూండేవాడని ప్రతీతి. చాలామంది, "అతను దుర్మార్గుడు; చదువూ సంధ్యా లేనివాడు; అల్లాంటి వాడితో నీకు స్నేహం ఏమి?" టని నన్ను మందలించేవారు. నాకు అతని స్నేహం వల్ల అలవాటయినవి బడి పూర్వగాధ

పిల్లలని ఏడిపించడం, వాళ్ళ పుస్తకాలు పారవెయ్యడం, ఉపాధ్యాయుల్ని వుడికించడం మొదలైన ఘనకార్యాలు!

ఒకసారి పుదూరు సుబ్రణ్యయ్యరు అనే మాష్టరుగారు బోర్డువైపు తిరిగి లెఖ్ఖలు చెబుతూ వుండగా నేను వేళ్ళాడుతూ వున్న ఆయన గోచీ కుర్చీకి కట్టాను. దాంతో బెత్తాల దెబ్బలు, మొట్టికాయలు మొదలయిన శిక్షలన్నీ సంపాదించాను! అంతే కాదు! నన్ను స్కూలు లోంచి డిస్మిస్ చేశారు. ఈ సంగతి మా నాయనగారికి తెలిసి, ఆయన ఆ రోజుల్లో అక్కడ డిప్యూటీకలెక్టరుగా వుండే అడక్కి నారాయణ రావుగారి నాశ్రయించగా, ఆయన దయ వల్ల మళ్ళీ స్కూల్లో ప్రవేశించాను.

కాని మరికొద్ది రోజులకే ఇంకొక తవ్వాయి వచ్చింది. అప్పట్లో అల్లాడి ఆదెయ్య కొడుకు సూర్యనారాయణ అప్పర్ మిడిల్ క్లాసు చదువుతూ ఉండేవాడు. అతను నన్నేదో తిరస్కారంగా మాట్లాడి కొట్టేసరికి, నేను అతని ఇంగ్లీషు టెక్స్టు పుస్తకం ఎత్తుకుపోయి సువర్ణముఖి నది ఒడ్డున ముక్కలు ముక్కలుగా చింపివేశాను. ఆ చింపడం నా వెనకాలే ఉన్న యానాది వాడొకడు చూసి, నేను చింపి పారవేసిన కాగితం ముక్కలన్నీ తెచ్చి నా వెనకాలే స్కూల్లో అప్పజెప్పాడు. దాని ఫలితంగా నాకు మళ్ళీ బెత్తం ప్రహరణాలు జరిగించి, డిస్మిస్ చేశారు. తిరిగి ఆ డిప్యూటీ కలెక్టర్ మూలంగానే ఆ స్కూల్లో పునఃప్రవేశం లభించింది.

ఈ సారి ఆయన నన్ను ఇంటికి పిలిపించి, "ఎందు కల్లాంటి తప్పుపని చేశా?" వని అడిగారు. నేను నిర్భయంగా వున్నది వున్నట్లు చెప్పాను. ఆ క్రితం రోజున అతను నన్ను కొట్టాడనీ, అతను నాకన్న పెద్దవాడవడం చేత మళ్ళీ కొట్టలేననీ, కాబట్టి పగ తీర్చుకోవడానికి ఈ పని చేశాననీ చెప్పాను. దాంతో ఆయన మందలించి మళ్ళీ స్కూల్లో ప్రవేశపెట్టాడు. నాకు ఒకవంక ఇల్లాంటి అల్లరి స్నేహాలున్నా, రెండోవంక పెద్దవాళ్ళతో స్నేహాలు కూడా వుండేవి. అప్పుడు నరసింహరాజు అనే ఒకాయన బి.ఏ చదువుతూ వుండే


వాడు. ఆయనతో స్నేహం చేస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండేవాణ్ణి. ఆయన తరవాత సబ్‌జడ్జీ పనికూడా చేశాడు. మొత్తం మీద అల్లరికి ప్రఖ్యాతి పొందుతూ, చదువు సాగించాను. ఏవైనా వస్తువులు కావలిస్తే అవి వున్నవాళ్ళ దగ్గిర లాక్కోవడమూ, వాళ్ళు మా అమ్మగారి దగ్గిర ఫిర్యాదులు చేయడమూ జరుగుతూ వుండేవి. ఇల్లాంటి తవ్వాయి లెన్నో ఆ ఇల్లాలు తీర్చింది!

నేను దండాలు, కుస్తీలు మొదలయిన తాలింఖానా వ్యవహారాల్లో అప్పటికే ముందంజ వేశానని ఇదివరకే చెప్పాను. దేశంలో అప్పటికే క్రికెట్టు ఆట ప్రవేశించింది. ఆ ఆటలో కూడా ప్రవేశం కల్పించుకున్నాను. ఆ కాలంలో వెంకటగిరి రాజావారి ఏనుగులు వేసవికి సువర్ణముఖి దగ్గిర తోటల్లో విడిసి వుండేవు. నేనూ, కొంతమందీ కలిసి మావటివాడికి కానో అర్ధణో ఇచ్చి, ఆ ఏనుగులెక్కి షికారులు కొట్టే వాళ్ళము. తరచు ఆ సువర్ణముఖి ఇసక తిన్నెల్లోకి తినుబండారాలు పట్టుకుపోయి, అక్కడ ఒకటి రెండురోజులు మకాం వేసి, ఆటపాటలతో కులాసాగా కాలక్షేపం చేస్తూ వుండేవాళ్ళము. మొత్తంమీద నాయుడుపేట విద్యార్థి దశ మొదటికాలం ఒకవిధమైన గణనీయతతో, కులాసాగానూ, నిర్లక్ష్యంగానూ గడిచిపోయింది.

ఆ రోజుల్లో నాయుడుపేట ఒక చిన్న గ్రామం. ఇళ్ళు చాలా సకృత్తుగా ఉండేవి. ఆ గ్రామానికల్లా ఘనమైన విషయాలు మా బడీ, సువర్ణముఖు కాలువగట్టున ఉండే అన్నపూర్ణ దేవాలయమూ, వెంకటగిరి వారి ఏనుగులు విడిసే ఠాణా మాత్రమే. మా నాయనగారు పొరుగూళ్ళో ఉద్యోగం అవడంచేత మమ్మల్ని ఒక స్వాములవారి మఠానికి చేరి వుండే చిన్న పూరి ఇంట్లో వుంచారు.

రెండు మూడు సంవత్సరాలు- అంటే నేను మోడరన్ థర్డురీడరు చదివేవరకు - మా కుటుంబం అంతా నాయుడుపేటలోనే వున్న రోజుల్లో, మా నాయనగారిని ఎస్టేటు వారు మల్లాం పారుపత్యానికి బదిలీ చేశారు. అందుచేత, ఆయన కుటుంబం మల్లాం తీసుకుపోయారు. నన్ను ఆ మఠంలోనే వుంచారు. అక్కడ కన్నేపల్లి వెంకమ్మగారనే ఆవిడ ఇంట్లో నన్ను భోజనానికి కుదిర్చారు. ఈ కాలంలోనే వల్లూరు గ్రామంలో మాకు వున్న భూములుపైని కాటకం చేత పన్నులు చెల్లకపోవడంవల్ల, వెంకటగిరి ఎస్టేటు వారు వాటికి జప్తులు పెట్టి, వేలం పాడించి అమ్మించారు. మా నాయనగారు నాయుడుపేటలో వుండగానే వల్లూరులో మా పెత్తండ్రులు స్థితి కూడా చితికిపోయింది. వల్లూరు కరిణీకం చేస్తూవున్న అప్పాస్వామిగారి అప్పుడే మరణించారు. ఆయన పిల్లలు చిన్నవాళ్ళవడంచేత కరిణీకం ఇంకొక కుటుంబంలోకి సంక్రమించింది. ఆనాడు కరిణీకాలు జమీన్ దారుల కటాక్షం మీదనే ఆధారపడి వుండేవికదా!