నా జీవిత యాత్ర-1/నాటకాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

6

నాటకాలు

ఈ కాలంలో రాజమహేంద్రవరంలో కూడా నాటకాల గొడవ ప్రారంభం అయింది. నేను రాజమహేంద్రవరం చేరేసరికే కందుకూరి వెంకటరత్నం, దాసు మాధవరావు ప్రభృతులు ఇంగ్లీషులో షేక్సుపియర్ నాటకాలు ఆడుతూ వుండేవారు. మా హనుమంతరావు నాయుడుగారికి వుండే నాటకాల పిచ్చికి అంతం లేదుగదా! దాంతోబాటు మాకు పిళ్లారిసెట్టి త్రయంబకరావు అనే ఒక కంట్రాక్టరు తోడైనాడు! అతను ఆనాటి నాటకాలకి కావలసిన డబ్బూ, హంగూ సమకూర్చేవాడు.

సుప్రసిద్ధకవిశేఖరులైన బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మినరసింహం గారు అప్పటికి మెట్రిక్యులేషను పాసయ్యారో లేదో జ్ఞాపకం లేదు. అప్పటికి ఆయనదృష్టి ఇంకా బాగానే వుండేది; కళ్ళు జబ్బుగా వుండడమే గాని అంధత్వం రాలేదు. అప్పట్లో ఆయనకి అంత ప్రసిద్ధిలేదు. మాకు ఆయన నాటకాలు వ్రాయడమూ, మేము ఆడడమూ జరుగుతూ వుండేది. కొన్ని నాటకాలు ఆయన మా కోసమే వ్రాశారంటే ఏమీ అతిశయోక్తి లేదు.

నాకు గయోపాఖ్యానం, పారిజాతాపహరణం నాటకాల సంగతి బాగా జ్ఞాపకం వుంది. గయోపాఖ్యానంలో నేను గయుడి భార్య అయిన చిత్రరేఖ వేషమూ, ఆ తరవాత వెంటనే అర్జునుడి వేషమూ వేసేవాణ్ణి. హనుమంతరావు నాయుడుగారు గయుడి వేషం వేసేవారు. వెంకటకృష్ణుడు, రామకృష్ణుడు అని ఇద్దరు నటులు వుండేవారు. సామాన్యంగా రామకృష్ణుడు ప్రధానపాత్ర ధరిస్తూ వుండేవాడు. అయినాల తాతయ్యనాయుడు సంజయుడి వేషం వేసేవాడు. ఇంతకాలమైన తరవాత నాకిప్పుడు మిగిలిన వాళ్ళపేర్లు జ్ఞప్తికి రావడంలేదు. సామాన్యంగా ఈ నాటకాలకి ముఖ్యపాత్రలం నేనూ నాయుడుగారే. నాకు ఈ నాటకాల గొడవవల్ల "సంగీతముచేత బేరసారము లుడిగెన్" అన్నట్లు చదువు బాగా సాగలేదు.

సాగకపోవడమే కాదు! నాకు 1887వ సంవత్సరం డిసెంబరులో మెట్రిక్యులేషన్ పరీక్షపోయింది. అంతేకాక, ఈ నాటకాల మూలాన్ని రౌడీ జనాభాతో భేటీ రావడం, ఒక విధమైన నిర్లక్ష్యమైన జీవితానికి అలవాటుపడడం జరిగింది. హనుమంతరావునాయడుగారు ఈ నాటకాలు తయారుచేసుకుని అమలాపురం, కాకినాడ మొదలైన పట్టణాల్లో ఆడించారు.అందువల్ల అక్కడి రౌడీ జనాభాతో పౌరుష జీవనానికి, నిర్లక్ష్యమైన జీవనానికి అలవాటుపడ్డాను. 'మామూలు సాంసారిక దృష్టిలో కొంచెం న్యూనమైన జీవితంలో పడిపోతున్నానా?' అనే స్థితి వచ్చింది. హనుమంతరావునాయుడుగారు నన్ను నాటకాలలో ప్రవేశపెట్టినా, నా నైతికాభివృద్ధీ, విద్యాభివృద్ధి, క్షేమాభివృద్ధీ కావడానికి శక్తివంచన లేకుండా పాటుపడేవారు. నా లోపాలకీ, పతనానికీ ఆయన ఎంతమాత్రమూ బాధ్యులు కారు. పరీక్ష పోగానే వెంటనే మళ్ళీ రాజ మహేంద్రవరం ఎందుకు వచ్చానో జ్ఞప్తికి తెచ్చుకుని ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ చదివిపాసయ్యాను.

ఈ సందర్భంలో సాధారణంగా లోకదృష్టిలో నాటకాలు నా జీవితానికి చేసిన మంచిచెడ్డలు చర్చించడం చాలా అవసరము. నాయుడుపేటలోనూ, ఒంగోలులోనూ ఉన్నప్పుడు నాటకాలవృత్తి నన్ను ఒక విధంగా చిన్నతనపు చిలిపిచేష్టలనించి తప్పించింది. కాని, ఆకతాయులతో సాహచర్యం కలిగింది. నా జీవితప్రారంభం నించేకూడా బహుశ: ఒక అదృష్టం నన్ను వెంటాడిస్తోందని చెప్పాలి. స్నేహాలవల్ల, సాహచర్యాలవల్ల జీవితం అధ:పాతాళంలోకి పడిపోయే పరిస్థితులలో పడడమూ, మళ్ళీ వాటిల్లోనించి దైవికంగా తప్పుగుని బయట పడడమూ జరుగుతోంది. అదే ఈ నాటకాల ప్రకరణంలో కూడా జరిగింది. రాజమహేంద్రవరం నాటకాలలో కూడా ఇదే జరిగింది. ఈ నాటకాలలో అభినయనైపుణ్యం చూసి పేరుపొందిన పెద్దలంతా, మన్నించి, హర్షించేవారు.

మేము ఆ రోజుల్లో ప్రస్తుతం టౌనుహాలుకు తూర్పున ఉన్న పెద్ద ఖాళీస్థలంలో తాత్కాలికంగా ఒక పెద్ద నాటకపు హాలు నిర్మించాము. ఒకసారి మేము అందులో నాటకం ఆడుతూవుంటే, సుప్రసిద్ధన్యాయవాదులై, కాంగ్రెసు అధ్యక్షపదవి అలంకరించిన పి. ఆనందాచార్యులుగారు వచ్చి చూశారు. ఆయన అప్పుడు పిఠాపురంవారి కేసు సందర్భంలో వచ్చారు. అప్పుడు నా అభినయానికి మెచ్చి ఏదో బహుమతీ కూడా ఇచ్చారు. ఆ మెప్పు అల్లా వుండగా ఆ సంవత్సరం 1887 లో మెట్రిక్యులేషన్ తప్పించి! క్రమంగా రౌడీలతో స్నేహం చేసి కొట్లాటలు, కక్షల్లో పడ్డాను.

ఇంతకన్నా ప్రమాదమైనది నా నైతికప్రవర్తన. నేను నా అభినయంవల్ల నాకు తెలియకుండానే కొందరు అమాయికస్త్రీల మనస్సులు కలవర పెట్టాను. ఆ కలవరంలో నేను కూడా ప్రమాదంలో పడ్డాను. చారిత్రిక పౌరాణిక నాటకాలవల్ల నటకుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ కొంత జాతీయతా, స్వాతంత్ర్యభావమూ హెచ్చినా నైతికంగా కొన్ని ప్రమా ఉండేవాళ్ళము. అందులో నేను మంచి ఆటగాడి కిందే లెఖ్ఖ. ఇక దీపావళి పండుగ రోజులుసంగతి చెప్పనే అక్కరలేదు. పండుగనాడు రకరకాల బాణా సంచాలతో యుద్ధాలు సాగవలసిందే! పండుగ పది రోజులు వుంది అనగా ఈ మందుగుండు సామాను తయారు చేసి పార్టీలకి సవాళ్ళు చేసేవాళ్ళము. నేను ఈలాంటి ఒడుదుడుకు పరిస్థితుల్లో చదువుకుంటూ వుండేవాణ్ణి.

అప్పట్లో రాజమహేంద్రవరంలో రౌడీజట్లు బాగా వుండేవి. పెద్దమనుష్యు లనుకునే వాళ్ళల్లో చాలామందికి ఈ రౌడీలతో సంబందాలు వుండేవి. చూస్తూ వుండగా ఏ వీథిలోనో రెండుపార్టీలు తటస్థపడి అమాంతంగా ఒకళ్ళని ఒకళ్ళు పడపడ కొట్టుకొంటూ వుండేవాళ్ళు. నేను కూడా ఈ పార్టీల గందరగోళంలో పడ్డాను. ఆ పడడంలో సంఘంలో కిందశ్రేణిలో వుండే జనంతో సంపర్కం కలగడంలో ఆశ్చర్యం ఏమి వుంది? చేపలు పట్టుకుని జీవించే బెస్తలతోనూ, వాళ్ళ నాయకులతోనూ చేతులు కలపవలసి వచ్చింది. వాళ్ళ అభిమానం సంపాదించడానికి వాళ్ళ యిళ్ళకికూడా వెళ్లేవాణ్ణి. వాళ్లు కల్లు తాగుతూ వుంటే పక్కని వుండవలిసిన అవస్థ కూడా కలిగేది. కాని, యెన్నడూ అది ముట్టుకోవాలనే ధోరణిమాత్రం కలగలేదు.

ఈ కాలంలోనే నాకొక బ్రహ్మాండమైన గండం తప్పింది. ఒకసారి గోదావరి మంచి వరదలో వున్నప్పుడు నేనూ కొంతమంది స్నేహితులూ కలిసి ఒక చిన్న పడవ ఏట్లోకి తోసుకువెళ్ళాము. తెడ్డు ఒకటే దానికి చుక్కాని. నేను చుక్కానిదగ్గిర వున్నాను. పడవ కోటి లింగాలదాకా బాగా ఎగువుకి పోనిచ్చి ఏట్లోకి వాలుగా ఒదిలి వేశాము. నావ ప్రవాహంలో మంచి జోరుగా వస్తూ వుంటే నా చేతిలో వున్న చుక్కాని జారిపోయింది. దానికోసం నేను గభాలున ఏట్లోకి దూకాను. దాంతో నా స్నేహితులు కంగారు పడ్డారు. నేను తెడ్డు పట్టుకుని పడవ దగ్గిరకి చేరాను; కాని పడవ యెక్కలేకపోయాను. పడవలో వున్న స్నేహితులు నన్ను చూసి కంగారు పడడమే కాని తెడ్డు చేతి కందివ్వాలని యెవరూ అనుకోలేదు. నేను అల్లాగే ఒకటిరెండు సార్లు పడవ దగ్గరకి వెళ్ళడం పడవ యెక్కలేకపోవడం జరిగింది. చాలాసేపు ప్రాణాల మీద ఆశ ఒదులుకొని ఆ మహానదితో యుద్ధం చేశాను. చిట్టచివరికి నేనే నా స్నేహితులికి తెడ్డు అందివ్వండని సూచించాను. దాంతో వాళ్ళు తెడ్డు అందివ్వగా దాని ఊతంమీద పడవపైకి వచ్చాను. ఈ రీతిగా మృత్యు సన్నిధికి వేంచేసి వెంట్రుకవాసి తేడాలో అక్కడి నించి బయటపడ్డాను.

1889వ సంవత్సరంలో ప్రైవేటుగా చదివి మెట్రిక్యులేషన్ పాసయినాను. ఆ వేసవికాలంలో ఒంగోలు ఒదిలినప్పటినించీ మళ్ళీ ఒంగోలు వెళ్ళలేదు. ఆ తరవాత నేను కొద్దిరోజులపాటు రాజమహేంద్రవరంలో స్వంతంగా వండుకుని భోజనం చేసేవాణ్ణి. తరవాత కొన్నాళ్ళపాటు హోటల్లో భోజనం చేశాను. చివరికి నా చదువుకి తగిన భోజనవసతి కుదరకపోవడంతో మా అమ్మమ్మగారిని ఒంగోలునించి తీసుకువచ్చాను. మేము ఆ తరవాత ఇన్నీసుపేటలో నోరివారి ఇంట్లో ఒక చిన్నగదిలో ఉండేవాళ్ళము.

మెట్రిక్యులేషన్ పరీక్ష పాసయిన తరవాత, "మరి ముందు సంగతి ఏమిటీ?" అనే సమస్య వచ్చింది. నా లక్ష్యమెప్పుడూ ప్లీడరీ మీదే వుండేదని యిదివరకే వ్రాశాను. రాజమహేంద్రవరంలో రౌడీ జనాభాతో జోస్తీగా వుండే సమయంలో కూడా నా మనస్సు ఆ న్యాయవాది వృత్తిమీదనే లగ్నమై వుండేది. మెట్రిక్యులేషన్ పాసవడంతోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా సంపాదించడానికి అవకాశం ఉన్న రోజులవి! స్నేహితులు కొందరు "ఎన్నాళ్ళు నువ్వు నాయుడు గారిమీద ఆధారపడతావు? ఏదో మెట్రిక్యులేషన్ అయింది కనక మరి నౌఖరీలో జేర," మని సలహాయిచ్చారు. నా దృష్టి అయితే కళాశాలలో చదివి ప్లీడరీ చెయ్యాలని వుండేది. కాని నిజంగా నాయుడుగారికి నే నిచ్చేశ్రమ చూస్తే స్నేహితులు చెప్పిన సలహా న్యాయమైనదేమోననిపించింది.

గుమస్తా పని చేస్తూ కూడా ప్రైవేటుగా ప్లీడరీకి చదివే అవకాశం వుండడం చేత చిట్ట చివరికి ఇష్టం లేకుండానే రాజమహేంద్రవరం సబ్ రిజిష్ట్రారు ఆఫీసులో రెండో గుమస్తాపనికి దరఖాస్తు చేశాను. జీతం 14 రూపాయలు. నేను దరఖాస్తు చేసినట్లుగానే సబ్‌రిజిష్ట్రారుగారు నా దస్తూరీ పరీక్ష చెయ్యాలనీ, తెలివితేటలు చూడ్డం నిమిత్తమై ఒకసారి తనని చూడవలసిందనీ నోటీసు చేశారు. ఆ నోటీసు నా ఆత్మగౌరవానికి భంగకర మని తోచింది. నేను "మెట్రిక్యులేషన్ పాసు అయినట్టు సర్టిఫికెట్టు ఉండగా మళ్ళీ ఈ పరీక్ష ఏమిటి? నీ వుద్యోగం నాకక్కరలేదు పొ"మ్మని జవాబు వ్రాశాను. దాంతో ఆ వుద్యోగం తప్పింది. ఏ మనిషి జీవితంలో నైనా యిల్లాంటి స్వల్పవిషయాలతోనే జీవిత పంథా మారిపోతూ వుంటుంది. బహుశ: ఆనాడు నేను సబ్‌రిజిష్ట్రారు ఆఫీసులో చేరివుంటే ఏమయ్యేవాణ్ణో! చెప్పడం కష్టము.

నేను మెట్రిక్యులేషన్ మొదటి సంవత్సరం చదువుతూ వుండగానే యిక్కడ రౌడీలతో స్నేహం చేస్తున్నాననీ, నాటకాల్లో తిరుగుతున్నాననీ, చదువు గుంటపెట్టి గంట వాయిస్తున్నాననీ మా అమ్మగారికీ, బావగారికీ, బంధువులకీ తెలిసింది. ఈ విషయం మా అమ్మగారిని చాలా బాధపెట్టింది. నాకు వండిపెట్టడానికి వచ్చిన మా అమ్మమ్మగారు కూడా నా అవస్థ చూసి బాధపడుతూ వుండేది. నేను 5 వ క్లాసు చదువుతూ ఉండగానే మా అమ్మమ్మగారు నాకు వివాహం చెయ్యాలని సంకల్పించింది. ఆవంకనైనా దూరాన్ని వున్న నేను అక్కడ ఎక్కడో వుండి పాడైపోకుండా ఇంటికి వస్తానేమో నని ఆమె ఆశ.

నేను రాజమహేంద్రవరం వచ్చాక, మా కుటుంబానికి ఇంకొక ఆపత్తు వచ్చింది. మా పెద్దక్కయ్య జానికమ్మగారు చనిపోయింది. అప్పటికి ఆవిడకి చాలామంది పిల్లలు పుట్టి పోయారు. చివరికి హనుమాయమ్మ అనే పిల్ల ఒక్కర్తే మిగిలింది. ఆవిడ చనిపోయేటప్పుడు మా అమ్మగారిని దగ్గిరకి పిలిచి ఆ పిల్లని ఆవిడ చేతుల్లో పెట్టి పిల్లని జాగ్రత్తగా పెంచమనీ, ప్రకాశాన్ని కిచ్చి పెళ్ళి చెయ్యమనీ చెప్పింది. అందుచేత హనుమాయమ్మ నిచ్చి నాకు పెళ్ళి చెయ్యాలని మా అమ్మగారు ఆత్రతపడింది. కాని రాజమహేంద్రవరంలో నాకు వచ్చిన పేరుప్రతిష్ఠలు విని మా బావగారు మాత్రం నాకు పిల్లని ఇవ్వ డానికి సందేహించారు. చివరికి మెట్రిక్యులేషన్ పాసయ్యాక కొంతధైర్యం వచ్చి, మా బావగారు నాకు కూతుర్ని ఇవ్వడానికి అంగీకరించారు.

మా అమ్మగారు అద్దంకిలో వివాహం చెయ్యడానికి నిశ్చయించి ముహూర్తం పెట్టించి కబురు పంపించింది. నేను మా అమ్మమ్మగారిని ముందు పంపించి 1890 ఫిబ్రవరిలోనో, మార్చిలోనో అద్దంకి చేరాను. రాజమహేంద్రవరంనించి బెజవాడదాకా కాలవమీద వచ్చి, అక్కడినించి గుంటూరుమీదుగా అంచెబళ్లమీద అద్దంకి చేరుకున్నాను. వివాహం చాలా సామాన్యంగా జరిగింది. కావలసిన బంధువులు నలుగురూ వచ్చి ఐదురోజులూ పెళ్ళి సులువుగా తేల్చారు. మా అమ్మగారు నా పెళ్ళితోబాటు మా చెల్లెలు అన్నపూర్ణ పెళ్ళి కూడా చేసింది. అప్పటికి అన్నపూర్ణకి సుమారు 8 సంవత్సరాల వయస్సు వుంటుంది. మా అమ్మగారు మా పెద్దఅప్పగారు చనిపోయింది కనక అన్నపూర్ణని మా బావగారికే ఇచ్చి వివాహం చేసింది. నేను పెళ్ళికి వచ్చేసరికే మా అమ్మగారు కార్యక్రమం యావత్తూ నిర్ణయించింది. మొత్తంమీద నా అభిప్రాయా లెల్లా వున్నా పెళ్ళి జరిగిపోయింది.

నా వివాహం అయిన వెంటనే మళ్ళీ కాలేజీలో చేరడానికి రాజమహేంద్రవరం వచ్చాను. అప్పటికి యమ్. యస్. యమ్. రైల్వేలైను వేస్తున్నారు. ఆ రోజుల్లో బెజవాడనించి సంతమావులూరువరకూ రైలు పడింది. నాకు యఫ్. ఏ. పుస్తకాలు ఒక మోపెడు వుండేవి. అవన్నీ ఒక మనిషి నెత్తిని పెట్టి, మా ఊరినించి నడిచి, సంతమావులూరు వచ్చి, అక్కడ రైలెక్కి, బెజవాడ చేరి, మళ్ళీ పడవమీద రాజమహేంద్రవరం చేరుకున్నాను. వివాహసందర్భంలో నేను చెప్పవలసిందల్లా ఆనాటి పెళ్ళిళ్ళసొంపు. పెళ్ళి అంటే వేలకివేలు మూట కట్టుకుని బెంగపడవలసిన అవసరం వుండేది కాదు. అయిదురోజులు పెళ్ళి అయినా నలుగురూ కలిసి పనిచెయ్యడంవల్ల సూక్ష్మంగా తేలిపోయేది. లక్షాధికారులైనా పల్లెటూళ్ళో ఉన్న భజంత్రీలమేళం, పల్లకీ, రామడోళ్ళూ మాత్రమే కుదుర్చుకునేవారు. భిక్షాధికారులైనా అంతే! వంట బ్రాహ్మణుల ఆర్భాటాలూ అవ్వీ ఏమీ లేవు. తరవాత నా చేతిమీదుగా నేను మా కుటుంబంలో అయితే ఏమి, - హనుమంతరావు నాయుడుగారి కుటుంబంలో అయితే ఏమి - అనేక వివాహాలు చేయించాను. ఈ వివాహాల్లో ఆర్భాటమూ, ఆడంబరమూ, శ్రమేకాని, ఆనాటిసౌలభ్యమూ, సౌఖ్యమూలేవని అనిపిస్తోంది.

ఈ కాలంలో నా సహాధ్యాయుల్ని గురించీ, సహచరుల్ని గురించీ కొంచెం వ్రాస్తాను. నేటి సర్ కె. వి. రెడ్డినాయుడు నేను రాజమహేంద్రవరంలో చదువుకి ప్రవేశించి నప్పటినించీ కూడా నా సహాధ్యాయి. అతని తండ్రిగారు అప్పట్లో తాలూకా కచ్చేరిలో చిన్న బంట్రోతుగా వుండేవారు. అతను అరుగుమీద కూర్చుని చదువుకోవడం నా కిప్పటికి జ్ఞాపకం వుంది. అతనైతే క్లాసులో 'Good boy' అంటే - 'మంచి పిల్లవాడి' కిందే లెఖ్ఖ. నేను నా సహాధ్యాయుల్ని ఏదో విధంగా అదమాయిస్తూ వుండేవాణ్ణి. ఇన్ని సంవత్సరా లయిన తరవాత ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని వ్రాయడానికి నేను చాలా గర్వపడుచున్నాను. నా మిత్రుడు కూడా అల్లాగే గర్వపడతాడని అనుకుంటాను. "ఎటువంటి సామాన్య పరిస్థితుల్లోనించి మేము నిగ్రహించుకు వచ్చాము!" అని తలచుకున్నప్పుడు ఇదంతా నాకే ఆశ్చర్యంగా వుంటుంది. తరవాత మునిసిపల్ వ్యవహారాల్లో వెంకటరెడ్డి నాకు కొంచెం దూరం అయ్యాడు. క్రమంగా రాజకీయాల్లో మేము యింకా దూరులమై ఇప్పుడు కేవలమూ ప్రతికూల రాజకీయ పక్షాల్లో వున్నాము. కాని, వ్యక్తిగతంగా నా మనస్సులో వున్న ఆనాటి ప్రేమకేమీ కొరత కలగలేదు. అతనికీ అల్లాగే వుంటుందని నమ్ముతున్నాను.

మహమ్మదుబజులుల్లా సాహేబుకూడా నాకు సహాధ్యాయి. అతను ఎంతెంత పుస్తకాలైనా బట్టీ పట్టడంలో మంచి ఘనుడు; ఇంగ్లీషు బాగా వ్రాస్తా డనే ప్రతీతి వుండేది. అతను బి. ఏ. అయి, సర్వీసులో పడిపోయాడు గనక, ఆ పైన మాకు అంతగా సంబంధం లేకపోయింది. ఇక రాజమహేంద్రవరంలో ఇప్పటికీ జీవించి ఉన్న సారంగు భీమశంకరం కూడా నా సహచరుడే. అతని తమ్ముడు సోమసుందరమూ, నేనూ సహాధ్యాయులము. భీమశంకరం మాకన్న పెద్దక్లాసులో చది వినా, మెట్రిక్యులేషన్ దండయాత్రలు చెయ్యడంవల్ల మేము అతన్ని కలుసుకున్నాము. వాళ్ళు నాకిప్పటికీ జ్ఞాపకం వుండడానికి కారణం నాకు వాళ్లయింట్లో వుండే చనువు. నేను వాళ్ళతో పాటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లాడిలాగే మెలుగుతూ వుండేవాణ్ణి. నాటకాలు చూసి అర్థరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా, వాళ్ళ ఇంట్లోనే పడుకుని వాళ్ళతో కలిసి తెల్లవారకుండా వంట ఇంట్లో చల్ది అన్నము తింటూ వుండేవాణ్ణి. మెట్రిక్యులేషన్ లో శంకరాన్ని "గుబ్బక్" అని పిలిచే వాళ్ళము. మెట్రిక్యులేషన్ పాసయ్యాకా అతను ఎక్కడా అడ్డు లేకుండా పరీక్షలు పాసయి, ప్లీడరు అయ్యాడు. మళ్ళీ ప్లీడరీకి చదివినప్పుడు మేమిద్దరమూ కలిసి చదివామేమో అనుకుంటాను.

ఇక నా జీవితంలో అత్యంత సన్నిహిత మిత్రుడూ, నాకు అన్ని విధాల సహాయం చేసిన ఆప్తుడూ, నా రాజకీయా లెల్లా ఉన్నా నన్నాదరించిన ఆత్మీయుడూ అయిన కంచుమర్తి రామచంద్రరావు, నేను 5 వక్లాసు చదివినప్పటి నుంచి నా సహాధ్యాయిగా వుండేవాడు. పాపం! చదువులో అతను సామాన్యంగా ఉండేవాడు; పరీక్షలో మార్కులు వచ్చేవి కావు. అతను చాలా విశాలహృదయుడు; ప్రేమ పాత్రుడు. చదువుకునే రోజుల్లోనే నాకు స్వల్పంగా కావలసిన ధనసాహాయ్యమూ అదీ చేస్తూ ఉండేవాడు. క్రమంగా మేమిద్దరమూ చాలా జోస్తీగా తిరిగేవాళ్ళము. తరవాత జీవితంలో కూడా నాకతను చేసిన సాహాయ్యం ఎన్నడూ మరవలేను. నేను బారిష్టరునై, డబ్బు గణించి, ఖర్చుచేసి, ఏదో కొంత పెద్దరికం సంపాదించగలిగా నంటే దానికి అతనే ముఖ్యకారణమని చెప్పాలి. ముందు ముందు ఆ విషయాలు వ్రాయవలసివచ్చినప్పుడు ఇంకా వివరిస్తాను. మాకు ఇటీవలి జీవితంలో రాజకీయాల్లో ఎన్నో అభిప్రాయభేదాలు కలిగాయి. కాని, మా హృదయాల్లో అనురాగం మాత్రం ఇనుమడించింది. కాని, అణువంతైనా చలించలేదు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీపట్టుదలకోసం ప్రతికూలపక్షంలో పనిచేస్తున్నా, అతను నాకు అవసరమైన సహాయం కూడా చేస్తూ ఉండే వాడు. చిన్నప్పుడే అతనికి ఈ దేశంలో పెద్దపెద్ద పరిశ్రమలు సాగించాలని ఉండేది. పెద్దవాడయ్యాక వాటికోసం అనేక ప్రయత్నాలు చేసి కొంత డబ్బు ఖర్చుపెట్టాడు. రాజమహేంద్రవరానికి అతను మహత్తరమైన సేవ చేశాడు. అతని ఆత్మకి శాంతి కలుగుగాక!

నాకు ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చిట్టూరి సూరయ్య ప్రభృతులు స్ఫురణకి వస్తున్నారు. వాళ్ళందరిని గురించీ వ్రాయడానికి ఈ సందర్బంలో అవకాశంలేదు కాని, లేకపోతే వ్రాసేవాణ్ణే. వాళ్ళలో ఎవళ్లైనా జీవించి ఉంటే దీనికి అన్యథా భావించరని నమ్ముతున్నాను. మొత్తంమీద, ఆప్తులైన స్నేహితుల మధ్య వాళ్ళందరకీ ఇష్టుడుగా ఉంటూ కులాసాగా విద్యార్థి దశ పూర్వభాగం గడిపివేశాను.

ఇంక కాలేజీచదువు మాట, 1890 ఫిబ్రవరిలో రాజమహేంద్రవరం ఆర్ట్సుకాలేజీలో యఫ్. ఏ. క్లాసులో జేరాను. మళ్ళీ ఆ కాలేజీలో చేరడానికి కారకుడు హనుమంతరావు నాయుడుగారే! తమజీతం 30 రూపాయిలే అయినా, ఒక పెద్దకుటుంబం భరించవలిసి వచ్చినా, మరి ఎల్లాగ తంటాలు పడేవారో ఆయనకే తెలియాలి! ఆ పరమేశ్వరుడికే తెలియాలి! నేను "ఈ చదువు గట్టెక్కడం ఎల్లాగ?" అని ఆత్రత పడుతూంటే ఆయన ఎల్లాగో డబ్బు సంపాదించి ఇస్తూ ఉండేవారు. యఫ్. ఏ. లో ప్రవేశించడానికి కావలసిన జీతంకూడా అల్లాగే ఇచ్చారు; దానికి ఆయన ఇంట్లోవాళ్ళు సహజంగా కొంత బాధపడే వాళ్ళు. ఆయన భార్య లక్ష్మమ్మగారు మాత్రం మహాఇల్లాలు. హనుమంతరావు నాయుడుగారు నన్ను తన బిడ్డలకంటె కూడా ఎక్కువగా ఆదరిస్తూ ఉంటే, ఆమె కొంచెం అయినా బాధపడేది కాదు. నాయుడుగారి తల్లి కొంత మమకారంతో ఏదో బాధపడేది కాని నాయుడుగారు లెఖ్ఖపెట్టేవారు కారు; వాళ్ళకి ఏదో విధంగా సమాధానం చెప్పేవారు. ఆయనా నేనూ కలుసుకున్న వేళావిశేషం ఎట్లాంటిదోగాని ఆయనకి నే నంటే అంత వాత్సల్యం ఉండేది.

అప్పట్లో, మా కాలేజీ పరిస్థితులు కొంచెం వ్రాస్తాను. కాలేజీ ప్రిన్సిపాల్ మహావిద్యావేత్త అయిన మెట్కాఫ్. ఒక్క రాజమహేంద్ర వరంలోనే కాక, ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్లవిద్యావంతు లెందరో ఆయనకి కృతజ్ఞులై ఉండాలి. ఆయన విద్యార్థుల్ని తనబిడ్డలకంటే కూడా ఎంతో ఆప్యాయంగా చూసుగునేవాడు. ఆయన లెఖ్ఖలూ, ఇంగ్లీషూ, షేక్సుపియరూ కూడా అత్యద్భుతంగా చెప్పేవాడు. ఆరోజుల్లో హెన్సుమన్ అనే అత నొక ప్రొఫెసర్‌గా వుండేవాడు. యమ్. రంగాచారిగారు కూడా ఒక ప్రొఫెసరే. ఆయన ఇంగ్లీషు చెప్పేవాడు అనుకుంటాను. రామలింగయ్యరు అనే ప్రొఫెసరు ఫిజిక్సు చెప్పేవాడు. బజులుల్లాలాగ నాకు బట్టీ పట్టే అలవాటు వుండేదికాదు. చదువు మీద కూడా అంతగా శ్రద్ధ వుండేదికాదు. కాని చదివిన కాస్సేపూ ఏకాగ్రతతో చదివి ప్రొఫెసర్ల అభిమానం సంపాదించేవాణ్ణి.

ఆ రోజుల్లో చదువు చాలా హెచ్చుస్థాయిలో వుండేది. ఎఫ్. ఏ. క్లాసులోనే ఇంగ్లీషులో ఛాసరు, డీక్వీన్సీ, కార్లైలు మొదలయిన వారి వుద్గ్రాంథాలన్నీ చెప్పేవారు. హిష్టరీలో ప్రపంచ చరిత్ర అంతా క్షుణ్ణంగా చెప్పేవారు. లెఖ్ఖలలో ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా బాగా బోధించేవారు. అప్లయిడ్‌సైన్సెస్ కూడా బాగా చెప్పేవారు. అన్నిటికన్నా ముఖ్యంగా మెట్కాప్ వడ్రంగం మొదలయిన చేతిపనులు కాలేజీలో అందరికీ నేర్పించే వాడు. ఆయన దానికి కారణంగా "నీ ఇంటి సామగ్రి నువ్వు చేసుకోవడమూ, నీ ఇల్లు నువ్వు కట్టుకోవడమూ నేర్చుకోవా"లని చెప్పేవాడు; తన శిష్యకోటిలో జాతీయాభిమానమూ, జాతీయసంప్రదాయమూ బాగా వృద్ధిచేసేవాడు.

ఈ కాలంలోనే నాకు బాగా గడ్డైన తగాదాలూ, కొట్లాటలూ సంభవించాయి. నా భవిష్యత్తు విషయంలో ఎంతో ఆశ పెట్టుకున్న హనుమంతరావు నాయుడుగారికి ఇతర బంధుమిత్రులికీ ఎంతో ఆదుర్దా కలగజేశాను. కొట్లాటలు, కేసులు, ఒకటేమిటి? తెల్లవారి లేస్తే రాత్రి అయ్యేలోగా ఏమి వస్తుందో తెలిసేది కాదు!

ఆ కాలంలో నాలో ఎక్కడలేని చొరవా, అఘాయిత్యమూ వుండేవి. ఎవరైనా నన్ను కొంచెం 'ఆ' అన్నా రంటే చెయ్యెత్తి మాట్లాడే టంత గోరోజనం వుండేది. చివరికి హనుమంతరావు నాయుడుగారు కూడా నన్ను అదిలించలేని స్థితి వచ్చేసింది. ఈ స్థితిలోనే 1891 వేసవికాలంలో కాకినాడలో కొందరు నాట్యకళాభిమానుల కోరికమీద నాటకా లాడడానికి అంగీకరించి అక్కడ మకాము వేశాము. అప్పట్లో కాకినాడలో కూడా తాలింఖానాలూ, వాటికి సంబంధించిన గంద్రగోళాలూ చాలా హెచ్చుగా వుండేవి.

సింగితపు అబ్బాయి అనే వేపారిపంతులు ఈ తాలింఖానాలకీ, అందులోని వస్తాదులకీ గురువు. మనిషి మంచి ఆజాను బాహువు; అప్పటికే అతనికి 50 ఏళ్ళు పైగా వుండేవి; మీసాలు, కనుబొమ్మలు నెరిసిపోయి వుండేవి; పెద్ద బొజ్జకూడా వుండేది. కాని, మనిషి మంచి భీకరంగా వుండేవాడు. వృత్తి ఆయుర్వేదవైద్యం. అప్పట్లో పెద్దవాళ్ళందరితోనూ ఆయనకి వైద్యసంబంధం వుండేది. ఆయన పెద్దవాళ్ళలో పెద్దవాడు; రౌడీలలో రౌడీ! ఆ కాలపు కాకినాడ చరిత్రలో ఆయన ముఖ్యపాత్రధారి. సామాన్యంగా నాటకాలకి ఇల్లాంటి పలుకుబడిగల బలశాలుల సాహాయ్యం ఎప్పుడూ అవసరమే. ఆ రోజుల్లో నాటకాల శాంతి భద్రతలు ముఖ్యంగా వాళ్ళమీద ఆధారపడి వుండేవి. ఆనాటి కాకినాడలో ఏ కసరత్‌చేసినా, కర్ర తిప్పినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన శిష్యుడు అయి తీరాలి!

అందులో తాడి వెంకటరత్నం, ముమ్మడి వెంకటరత్నం, బావాజీ మొదలయిన ముఖ్యులు బాగా ప్రఖ్యాతి సంపాదించారు. ఆ తాడి వెంకటరత్నం మరీ ఒడ్డూ పొడుగూ, కండపుష్టీ ఉన్నమనిషి. మా హనుమంతరావునాయుడుగారు ఈ మనిషి ఒడ్డూ పొడుగూ చూసి నాటకం బందోబస్తుకి ఇతన్నీ, ముమ్మడి వెంకటరత్నాన్నీ, బావాజీనీ దగ్గిరకి జేర్చుకున్నారు. అంటే వాళ్ళకి నాటకాలకి ఫ్రీటిక్కెట్లు ఇచ్చి గౌరవించారన్నమాట. మా నాయుడుగారు ఆ తాడి వెంకటరత్నాన్ని చూసి ఆయన బలశాలి అనీ, ధైర్యవంతుడనీ అపోహపడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ శాండోల బలం నమ్ముకుని నాయుడుగారు అబ్బాయి తోడ్పాటు ఆశించలేదు. ఒకటి రెండు నాటకాలు అయ్యాక సింగితం అబ్బాయి మేనల్లుడు గోపాలకృష్ణుడు ఫ్రీటిక్కెట్టు ఇవ్వాలని అడిగాడు. ఆయన ఫ్రీటిక్కెట్టు ఇవ్వలేదు. దాంతో అతను అబ్బాయి దగ్గిరికి వెళ్ళి "చూశావా! నీ శిష్యులు వెంకటరత్నం వగైరాలని అసరా చేసుకుని నిన్ను తోసివేశా,"రని పురి ఎక్కించాడు. అబ్బాయి సాధారణంగా అరుగు దిగకుండానే ఈ తాలింఖానా జనాభా నంతనీ స్వాధీనంలో వుంచుకునేవాడని ప్రతీతి. మనిషి అకారణంగా తొందరపడే స్వభావం కలవాడు కాడని కూడా చెప్పేవారు. అయితే, తన మేనల్లుడు వచ్చి పురి ఎక్కించేటప్పటికి అతను కొంచెం తొందరపడ్డాడు.

మర్నాడు మా నాటకం హాలుమీద రాళ్ళు పడ్డాయి. మా వద్దీలో వున్న ఈ తాడి వెంకటరత్నం వగైరాలు బయటికి వచ్చి, రాళ్ళువేసే వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుపడ్డ వాళ్ళలో ఈ గోపాలకృష్ణుడున్నాడు. వాళ్ళతో కొంత కొట్లాట జరిగింది. ఆ పైన ఆ గోపాలకృష్ణుడు మేనమామతో చెప్పుకోగా అతను కదిలి వచ్చాడు. వెంటనే మా పెండాలు మీదికి, మేము వున్న యింటి మీదికీ ఆ అబ్బాయిసేన కదిలి వచ్చింది. మేము తలుపులన్నీ వేసుకుని లోపల కూర్చున్నాము. యనమండ్ర కొండయ్య అనే అతను ఇల్లెక్కి వచ్చి చీకట్లో మేడమీద కిటికిలో కూర్చున్న నన్ను ఒక్క దెబ్బ తీశాడు. అదృష్టవశాత్తు ఆ దెబ్బ కొంచెం ఊచకి దూసుకుపోవడంచేత నాకు గట్టిగా తగలలేదు కాని, లేకపోతే మూతి పగలవలసిందే!

ఈ దెబ్బతో బాగా పౌరుషాలు రేగాయి. "మా సహాయం లేకుండా నాటకా లాడతారా!" అని అబ్బాయి పార్టీవాళ్ళూ, "మే ముండగా మీ కేమీ పరవాలే"దని తాడి వెంకటరత్నం ముఠావాళ్ళూ చెలరేగారు. మా నాయుడుగారికి బాగా పౌరుషం వచ్చింది. ఆయన అల్లరి చేస్తే ఝడిసి వెళ్ళిపోతామా! నాటకాలు ఆడవలసిందే!" అని నిర్ణయించారు. ఇల్లాంటి విషయాల్లో నాయుడుగారు చాలా పట్టుదల మనిషి. మొత్తంమీద బందోబస్తుతో నాటకాలు ఆడాము; అది అంతటితో ఆగలేదు. "విచ్చలవిడిగా ఊరేగుతాము" అనే ప్రగల్బాలు మా ముఠాలోనించీ, "ఊరేగితే తంతాము" అనే ప్రగల్భాలు వాళ్ళ ముఠాలోనించీ బయలుదేరాయి.

ఇల్లా వుండగా నాలుగయిదురోజుల్లో దేవుడి ఊరేగింపు వచ్చింది. ఆ ఊరేగింపులోకి మేము కొందరం తయారయ్యాము. తాడి వెంకటరత్నం ధీమాకబుర్లవల్ల మేము ఎదటివాళ్ళ బెదిరింపులు లక్ష్యపెట్టలేదు. ఉత్సవం కాకినాడ బజారు దగ్గిర మసీదుదాకా వచ్చింది. అంతవరకూ ఏ గంద్రగోళమూ రాలేదు. "ఇంక ఇంటికి వెళ్ళిపోదా" మని అనుకుంటూ వుండగా ఆ ఎదటనించి 'ఘల్లుఘల్లు' మని గొలుసు చప్పుడు చేసుకుంటూ అబ్బాయి స్వయంగా మా మీదికి వచ్చాడు. అతని చేతుల్లో చెయ్యెత్తు బాణాకర్ర ప్రత్యక్ష మయింది. ఆ కర్రకి ఆ చివరనించి ఈ చివరిదాకా ఒకే గొలుసు! మనిషి తన ముఠాతో కేవలం కాలాంతకుడులాగ వచ్చి పడ్డాడు. పడుతూనే వస్తాద్ తాడి వెంకటరత్నాన్ని ఒక దెబ్బ తీశాడు! దాంతో పక్కని నిలబడ్డ నాకే గీరెత్తింది! తాడి వెంకటరత్నానికి నఖశిఖపర్యంతమూ దెబ్బతగిలింది! అబ్బాయి, ఆ తరవాత తాడి వెంకటరత్నానికి, ముమ్మడి వెంకటరత్నానికీ కూడా తగిలేటట్లుగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఇది ఎందుకు ఇంత వివరంగా వ్రాస్తున్నానంటే - ఆ నాడు అబ్బాయి పోరాటపుచాకచక్యాన్ని వుదహరించడానికే! ఆతని నేర్పు, సాహసమూ అత్యద్భుతంగా వుండేవి. దెబ్బ కొట్టడంలో మంచి శాస్త్రోక్తంగా కొట్టాడు. మూడో దెబ్బ తగిలే సరికి ఇంత బలమైన మనిషీ ఒక్కసారిగా, కాలికి బుద్ధి చెప్పాడు!

అప్పటి కింకా తాలింఖానాల్లో దెబ్బ నేర్పుగా కొట్టడమూ, ఎదుటివాళ్ళు కొట్టేటప్పుడు ఒడుపుగా తప్పుకోవడమూ, నేర్పుతూ వుండేవారు. ఇంగ్లీషురాజ్యం వచ్చి అప్పటికి కొంచెం కాలమే అవడంచేత జాతిలో యింకా ఆ విషయంలో ప్రావీణ్యం మిగిలే వుంది. సింగితం అబ్బాయి ఆ రోజున మా జనంమీద వీరవిహారం చేశాడు. నాతోకూడా వుండిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే మా ప్రధాననటకుడికి తల పగిలిపోయి మెదడు బయటపడింది. నాకు చేతులమీదా, బుజాలమీదా దెబ్బలు తగిలాయి. మాలో ముమ్మడి వెంకటరత్నం మాత్రం ఎదటివాళ్ళ దెబ్బలు తిని మమ్మల్ని కాచాడనే చెప్పాలి.

ఈ స్థితిగతుల్లో నేను, విధిలేక పక్కనే ఓరగా తెరచివున్న ఒక కోమటియింట్లో దూరాను. ముమ్మడి వెంకటరత్నం సుమారు 200 దెబ్బలు తిని పడిపోయాడు. నిజంగా ఈ ముమ్మడి వెంకటరత్నం మాకు అడ్డపడి, దెబ్బలు కాయకపోతే ఈ చరిత్ర అంతా జరిగేది కాదు! వాళ్ళు పడిపోయిన కొంతసేపటికి పోలీసు లంతా యథాప్రకారంగా విచ్చేశారు! వాళ్ళతోబాటు నేనూ బయటపడ్డాను! పోలీసులు మామూలు నాటకం జరిపించి అప్పట్లో వాళ్ళను ఆసుపత్రిలో చేర్చారు. మాకు పట్టుదలలు హెచ్చాయి. ఆ ఊళ్ళో యింకా నాటకాలు ఆడాము. తరవాత పోలీసువాళ్ళు సింగితం అబ్బాయి మీదా అతని యోధవర్గం మీదా కేసులు పెట్టారు. కాని సాక్ష్యం ఎల్లాగ? ఎవ్వరూ సాక్ష్యం పలకడానికి సాహసించలేదు. అందరికీ సాక్ష్యం చెబితే ఏమి కొంప ములుగుతుందో అన్న భయమే! కేసు విచారించే మేజస్ట్రీటుకి కూడా భయమే అయింది!

ఆ భయంచేతనే చామర్లకోటలో విచారణ జరిగింది. విచారణ జరిగిన తరవాత సాక్ష్యం లేదనే కారణంచేత కేసు కొట్టేశారు. దాంతో మా కసి మరింత హెచ్చయింది. మమ్మల్ని నడిబజారులో కొడితే కేసు లేకుండా పోవడమా!" అని బాధ కలిగింది. దీనికి ఎల్లాగయినా ప్రతీకారం చెయ్యాలనే పట్టుదల కలిగింది. ఇదీ కాకినాడ చరిత్ర!

కొద్ది రోజులకి నేను కిటికీలో కూర్చుని వుండగా కొట్టిన యనమండ్ర కొండయ్య అనే అబ్బాయి పార్టీమనిషి ఒకనాడు రాజమహేంద్రవరం వచ్చాడు. అతను వర్తకులదగ్గిర లెఖ్ఖలు వ్రాస్తూ వుండేవాడు. అతను ఊళ్ళోకి వచ్చాడని తెలిసి నేనూ, మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడుగారి తమ్ముడు చలపతిరావూ - (అతను తరవాత చనిపోయాడు) మరికొందరు జట్టువాళ్ళమూ బయలుదేరి దారికాశాము. ఆ కొండయ్య ఊళ్ళో పని చూసుకుని కాకినాడ వెళ్ళడానికి పడవ ఎక్కాలనే వుద్దేశంతో ఒంటెద్దు బండిమీద ధవళేశ్వరం వెడుతున్నాడు. అప్పటికి సాయంకాలం సుమారు 4 గంట లయింది. "సమయం దొరి కిందిరా!" అని నేను ముందుగా వెళ్ళి బండి దిగమన్నాను. అతను దిగకపోతే ఒంటెద్దుబండి ఎదటకి వెళ్ళి ఎద్దుని విప్పివేసి కాడి పైకి ఎత్తివేశాను. ఆ మనిషి అమాంతంగా లుంగజుట్టుకుని కిందికి జారాడు. వెంటనే చలపతిరావు, జట్టు జనాభా, నేను కలిసి అతన్ని పచ్చడికింద చితకగొట్టాము!

ఇది జరిగింది రాజమహేంద్రవరం తాలూకాకచ్చేరి ఎదట! ఆర్ట్సు కాలేజీకి 100 గజాల దూరంలో వున్న మెయిన్‌రోడ్డుమీద! జనం గుంపులుగా చేరారు గాని, ఎవళ్లూ "ఇదేమి?" టని దగ్గిరికి రాలేదు. గట్టిగా కొట్టివేసిన తరవాత మేము మా దారిని పారిపోయి, గోదావరి ఒడ్డున వున్న పత్రివారి దొడ్లో పడ్డాము. కొందరు మొదట మా వెంట పడ్డారు. కాని చివరికి ఝడిసి చక్కాపోయారు. మేము కొడుతూ వుండగా దుగ్గిరాల కాశీవిశ్వనాధం అనే షావుకారూ (ఆనరరీ బెంచి మేజిస్ట్రీటు), కొరళ్ళు సుబ్బారాయుడూ (టి. డి. పి. కాకినాడ) కలిసి ఫీటన్‌మీద వస్తున్నారు. వాళ్ళుకూడా చూసి చక్కాపోయారు; అంతే!

తరవాత పోలీసులు మా మీద కేసు పెట్టారు. మాదిరెడ్డిచలపతిరావు, నేనూ ముద్దాయిలము. పోలీసులు అన్యాయంగా హనుమంతరావు నాయుడుగారిని కూడా ముద్దాయిగా చేర్చారు. కేసు నడిచింది. నా జీవితంలో తీగెమీద నడిచిన ఘట్టాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఆ చలపతిరావు ప్లీడరే చేస్తూవున్న వెంకటరత్నం నాయుడుగారి తమ్ముడే! అయినా అతనికీ ఈయనికీ పడేదికాదు. అతను తమ్ముడికి యింట్లో భోజనం అయినా పెట్టేవాడు కాడు. అతనికి తన సంఘం తాలూకు బంధువులు అనేకు లున్నారు కాని, ఎవ్వరూ సహాయపడేవాళ్ళే లేక పోయారు. ఎవరి మట్టుకు వాళ్ళే వెనక్కి తీశారు.

ఇక నా సంగతి చెప్పనే అక్కరలేదు కదా! హనుమంతరావు నాయుడుగారి భవిష్యత్తు దానిమీదనే ఆధారపడివుంది. పోలీసులు వార్డు అనే ఒక పెద్దప్లీడర్‌ని పెట్టారు. మా దగ్గిర ప్లీడరు ఫీజు మాట అల్లా వుండగా వకాల్తనామా ఖర్చులకి కూడా డబ్బులేదు. అల్లాంటి స్థితిలో మాకు తోడ్పడింది మంచిరాజు పాపారావు. అతను కేవలం తెలుగు వకీలు. పైగా, చెట్టుకింద వకీళ్ళలో ఒకడు! కాని ప్రయోజకుడుగా పేరుపడ్డాడు. అతను వకాల్తనామా ఫీజు ఎనిమిదణాలూ కూడా చేతిది పెట్టుకుని వకాల్తా దాఖలు చేశాడు. వెంకటరత్నం నాయుడుగారు తన తమ్ముడి విషయంలో అంతగా శ్రద్ధ వహించక పోయినా, అతని కులస్థుడైన సామినేని బుచ్చిఅబ్బాయి నాయుడు, - (రిటైర్డు సబ్‌జడ్జి) తాయి సూర్యప్రకాశరావు - (తహసీల్దారు) గార్లు మమ్మల్ని పిలిచి "ఏమిటిరా అబ్బాయిలు! ఇట్లాంటి కేసు వచ్చిం దేమిటి మీ మీద?" అని అడిగారు. మేము వున్నది వున్నట్లుగా చెప్పాము; ఆ సూర్యప్రకాశరావునాయుడుగారు నన్ను పిలిచి, "మిమ్మల్ని వాళ్ళు ఏ వేళ కొట్టారు?" అని అడిగాడు. "రాత్రి" అని చెప్పాను. "వాళ్ళు రాత్రి కొడితే మీరు పగలెందుకు కొట్టారు!" అని సంయుక్తికంగా అడిగి మామీద నేరం ఆరోపించాడు! కేసు నడిచింది.

మేమంతా, మమ్మల్ని కాకినాడలో కొడితే వాళ్ళమీద సాక్ష్యానికి ఎవ్వరూ రాలేదు గదా! ఇప్పుడు మేము వాళ్ళని కొడితే ఈ ఊళ్ళోవాళ్లు సాక్ష్యానికి ఎల్లా వస్తారో చూదా మనే ధీమాతో వున్నాము! పోలీసులు ఘరానాగా దుగ్గిరాల కాశీవిశ్వనాథం, కొరళ్ళు సుబ్బారాయుడుగార్ల నిద్దరినీ సాక్ష్యం వేశారు. సుబ్బారాయుడికి "కాకినాడనించి సాక్ష్యానికి వస్తే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రావాలి అనీ ధవళేశ్వరం రాజమహేంద్రవరాల మధ్యన మాట దక్క" దనీ ఆకాశరామన్న ఉత్తరం వెళ్ళి పోయింది. ఇంక నేనూ చలపతిరావూ కలిసి ఒకనాడు రాత్రి 12 గంటలకి దుగ్గిరాల కాశీవిశ్వనాథం ఇంటికివెళ్లాము. తలుపు కొట్టేసరికి అతను ఉలికిపడి లేచి వచ్చాడు. మేము కాస్త తమాయించి, మామీద సాక్ష్యం చెప్పడం సబబు కాదని చెప్పాము. చలపతిరావు కొంచెం మొరటు తనంగా "మా మీద సాక్ష్యం చెప్పి, మా కే ఆరునెలలో శిక్ష వేయించినా, తిరిగి వచ్చిన తరవాత నీ ప్రాణాలు దక్కవు సుమా!" అని బెదిరించాడు.

ఏ మైతేనేమి, తీరా సాక్ష్యానికి వచ్చేసరికి దుగ్గిరాల కాశీవిశ్వనాథం "దెబ్బలాట జరుగుతూ వుంటే చూచాననీ, అక్కడ దెబ్బలు తగులుతూ వుంటే తనకి గీర ఎత్తిందనీ, ఇంక అక్కడ ఆగలేక వెళ్ళిపోయాననీ, ఎవరు కొట్టారో చెప్పడం అసాధ్యం," అనీ చెప్పాడు. కొరళ్ళ సుబ్బారాయుడు సాక్ష్యానికి రానేలేదు. అతనికోసం కేసు రెండు మూడు వాయిదాలు వేశారు; గాని చివరికి పోలీసులు అతని సాక్ష్యానికి నీళ్ళు వదులుకున్నారు. చివరికి కేసు విచారించిన మేజిస్ట్రీటు మేము నేరం చేసివుండడానికి అవకాశా లున్నాయనీ, కాని, శిక్షించడానికి తగిన సాక్ష్యం లేదనీ వ్రాసి కేసు కొట్టేశాడు.

50 ఏళ్ళయిన తరవాత ఇప్పుడు ఆ విషయం తలచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుండి. ఆనాడే ఏ ఆరునెలలో శిక్షవేసి జైలుకి పంపించి వుంటే, ఈ జీవితం ఏ పంథాపట్టేదో, ఏ మైపోయేదో ఆ పరమేశ్వరుడికే ఎరుక! కాలు అణుమాత్రం జారితే అథ:పాతాళంలోకి పడిపోయే స్థితిలోనించి బయటపడ్డాము. ఎప్పటికప్పుడు కొండయ్య చచ్చిపోతాడనీ, కేసు కూనీ కేసవుతుందనీ భయంకరమైన వార్తలు వస్తూవుండేవి. కాని, ప్రారబ్ధం ఎల్లా నడిపిస్తోందో ఎవరు చెప్పగలరు? కాకినాడలో అక్రమంగా కొట్టినప్పుడు మేము బ్రతకడమూ దైవికమే; మేము మళ్ళీ కొండయ్యని కొట్టినప్పుడు అతను బ్రతకడమూ దైవికమే! ఈ సంఘటనలన్నీ దైవికంగా ఈ జీవితపు భవిష్యత్తు ఈ విధంగా నిర్ణయించాయి.

ఈ గాథ సందర్భంలో ఆనాడు నా మనోభావాల పోకడలు కొంచెం వ్రాస్తాను. పాఠకులు వాటిని గురించి, ఈనాటి శాంతిసూత్రాలతో ఆలోచిస్తే లాభంలేదు. నేను ఎన్నో సాహసకార్యాల్లోపడి, ప్రమాదావస్థలు తప్పించుకున్నా నంటే దానికి దైవికమైన బలం అల్లా వుండగా, నేను చేసిన పనిలో ఒకన్యాయం వున్నదనే విశ్వాసం కూడా నాకు తోడ్పడిందనుకుంటాను. కొండయ్యని మెయిన్‌రోడ్డుమీద వుతికే సాహసం వచ్చిందంటే, దానివెనకాల నా మనస్సు ఎంతగా ఆందోళన పడిందో గమనించాలి. కాకినాడలో అర్ధరాత్రివేళ మమ్మల్ని అక్రమంగా కొట్టారు; వాళ్ళమీద న్యాయంగా కేసు పెడితే న్యాయపక్షాన్ని సాక్ష్యం ఇచ్చేవాళ్లే లేకపోయారు! చివరికి వాళ్ళకి కాస్త బుద్ధిచెప్పే పెద్ద మనిషి కూడా లేకపోయాడు! అందుచేతనే నా మనస్సులో బయలుదేరిన తీవ్రమైన ప్రతీకార బుద్ధిచేత నే నిందుకు పాల్పడ్డాను. ఆ రోజుల్లో నా మన:ప్రకృతి అల్లా వుండేది. బహుశ: అల్లాంటిదే ఇప్పుడు జరిగితే ఆ ప్రతీకారం మరో రూపం ధరించేదేమో!

ఈ కేసు సందర్బంలో నేను చూపించిన ధైర్యం తలుచుకుంటే ఇప్పటికి నాకే ఆశ్చర్యంగా వుంది. కొట్టడం అంటే నలుగురూ కొట్టారు. కాని, కేసు వచ్చేటప్పడికి అంతా జావ అయిపోయారు. ఏ పాపమూ ఎరక్కపోయినా, నాకు అన్నివిధాలా సంరక్షకులుగా వుండిన హనుమంతరావు నాయుడుగారు కూడా కేసులో ఇరుక్కున్నారు. ఎందుకైనా డబ్బు కావలిస్తే, ఎల్లాగో అల్లాగ సంపాదించి ఇవ్వగలరు గాని, ఆయన ఇల్లాంటి పిల్లసమ్మేరీలకి కూడా ఎక్కడ అవస్థ పడగలరు? ఈ విషయంలో ఆయన కూడా నిరుత్సాహపడ్డారు. అయితే నేను చేసిన దాంట్లో ఏమీ తప్పు లేదనే ఒక ఘనవిశ్వాసంవల్ల ధైర్యం చిక్కబట్టుకుని బయటపడ్డాను.

సహాధ్యాయు లంతా "నేను ఈ రౌడీగందరగోళాల్లో పడిపోయాననీ, ఇంక బయటపడడం అసాధ్యం అనీ" అనుకుంటూ వుండేవాళ్లు. నాకు మాత్రం ఎందుచేతనో నిస్పృహ కలగలేదు. ఇన్ని గత్తర్లలో పడినప్పటికీ నాకు చదువుమీద మాత్రం లక్ష్యం తప్పలేదు. యథాప్రకారంగా పాఠాలు చదువుతూనే వుండేవాణ్ణి. ఆ విషయంలో మాత్రం నా మనస్సు ఏ విధంగానూ చెదరలేదు.

కాలేజీలో నేను మెట్కాప్ అభిమాన శిష్యుల్లో ఒకణ్ణి. నేను నాటకాల గంద్రగోళంలో వున్నా, నామీద కేసులు నడిచినా, ఆయన నన్ను ఒక కంటితో కాపాడుతూ వుండేవారు. ఒకసారి చింతలూరి కృష్ణారావూ - (ఆయన ఇటీవల చనిపోయినట్లు వింటున్నాను) - నేనూ తగువులాడుకున్నాము. అతను నాకన్న పెద్దవాడై వుండి నేను ఒంటరిగా వున్నప్పుడు నన్ను కొట్టాడు. నేను అదును చూసుకుని, కొందరి జట్టు చేర్చుకుని, అతన్ని మళ్ళీ కొట్టి, కసి తీర్చుగున్నాను. అప్పట్లో నా మనస్తత్వం అంతే! ఆపైన కృష్ణారావు మెట్కాఫ్‌తో ఫిర్యాదు చేశాడు. మెట్కాఫ్ మమ్మల్ని ఇద్దర్నీ ఎదట నిలబెట్టి, "ఏమిటి సమాచారం?" అని అడిగాడు. నేను అక్షరమైన తప్పకుండా వున్నది వున్నట్లుగా చెప్పివేసి, "నాకన్న పెద్దవాడై పైక్లాసు చదువుతూ వుండి మాట పట్టింపు మాత్రానికి నన్ను కొట్టాడు. కనక నాకసి తీర్చుకున్నాను," అన్నాను.

దానిమీద దొర కేమీ తోచలేదు. కృష్ణారావుకేసి చూసి, "దానికేమి చెబుతా?" వని అడిగాడు. పైగా, "నీకు ఏమి శిక్ష వెయ్యమన్నావు?" అని కూడా అడిగాడు. "అది నే నేం చెబుతాను; మీ యిష్టం," అన్నాడు కృష్ణారావు. దొర విచారణ మర్నాటికి వాయిదా వేశాడు. మర్నాడు మెట్కాఫ్, మూడు రోజులు తన ఇంటిదగ్గిర పని చెయ్యడమే శిక్షగా విధించాడు. అది బహు ఆనందదాయకమూ, విద్యాదాయకమూ అయిన శిక్ష! మెట్కాఫ్ బొమ్మూరు మెట్టమీద తను వుండేచోట రాళ్ళు పేర్చి రోడ్డు వేస్తూ వుండేవాడు. ఆ కొండమీద ఎప్పుడూ ఏదో పని చేస్తూ వుండేవాడు. నేను కూడా ఆయనతోబాటు పనిచేశాను. ఆయన పనిచేస్తూ వుంటే అనేక విషయాలు బోధపరుస్తూ వుండేవాడు.

మెట్కాఫ్ దొరకి రాజమహేంద్రవరం అన్నా, తనశిష్యులన్నా చాలా అభిమానం. నేను తరవాత చాలా కాలానికి ఇంగ్లాండు వెళ్ళినప్పుడు ఆవకాయ తీసుకువెళ్ళి ఆయన్ని చూశాను. మెట్కాఫ్ దంపతులు నన్నెంతో ఆదరించి భోజనంపెట్టి పంపించారు. ఆయన ఉండేచోటికి రాజమహేంద్రవరంనించి, వెదురు మొక్కలు తీసుకువెళ్ళి, వాటిని రాజమహేంద్రవరం స్మారక చిహ్నలుగా తనగదిలో పెట్టుకున్నాడు. ఇంకా ఆ గదినిండా రాజమహేంద్రవరం చిహ్నాలు అనేకం వున్నాయి. మెట్కాఫ్ నా యెడల ఎంత శాంతం చూపించేవాడో, నేను ఆయన యెడల అంతస్వేచ్ఛ కనబరచేవాణ్ణి!

ఒకరోజున రాత్రి నాటకంలో వేషంవేసి పొద్దున్నే కాలేజీకి వచ్చాను. హడావిడిగా రావడంలో రాత్రివేషం తాలూకు పౌడరు కొంచెం వుండిపోయింది. అది. పురాణపండ మల్లయ్యశాస్త్రుల్లుగారి క్లాసు. ఆయన క్లాసు చాలా కులాసాగా వుండడంచేత, బాగా శ్రద్ధగా వింటున్నాను. ఇల్లా వుండగా మల్లంపల్లి వీరభద్రుడు అనే ఒక సహాధ్యాయి నా పౌడరు చూసి హేళనగా మాట్లాడడం ఆరంభించాడు. ఒకటి రెండు సార్లు సహించుకుని, అతను అదేపనిగా విసిగించడం చేత బాగా చిరాకుపడి, శాస్త్రుల్లుగారు బోర్డుకేసి తిరిగి వుండగా, వెనక్కి తిరిగి ఫెళ్ళున ఒక్క చెంపకాయ లాగాను! దాంతో క్లాసంతా గొల్లుమన్నారు! శాస్త్రుల్లుగారు చట్టున నాకేసి తిరిగి, విషయం అంతా గ్రహించి, "ఏమిరా, వీరభద్రంతో షేక్ హాండ్ చేశావా ఏమిటి?" అన్నారు! క్లాసు మరింత గొల్లుమన్నారు!

ఈ విషయం అంతా సహజంగా మెట్కాఫ్ దగ్గిరికి ఫిర్యాదుకి వెళ్ళింది. మెట్కాఫ్ నన్ను పరీక్షకి పంపించకుండా నిలిపివేస్తానని బెదిరించారు. దానిపైన నేను వీరభద్రుడికి క్షమాపణ చెప్పడంతో ఆ వ్యవహారమంతా సద్దణగిపోయింది. మెట్కాఫ్ పరిపాలనలో వుండే విశేషం కూడా అదే! ఏదో విధంగా తను సద్దిచెయ్యడమే కానీ విద్యార్థి భవిష్యత్తుకి ఎప్పుడూ భంగం కలిగించేవాడుగాడు. ఆ తరవాత చాలాకాలానికి నేను ఇంగ్లాండులో కలుసుకున్నప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపడి "నువ్వు ఇంత వృద్ధిలోకి వస్తావని అనుకోలేదుసుమా!" అన్నాడు.

ఈ కాలంలో రాజమహేంద్రవరంలో వీరేశలింగంగారి సంస్కరణోద్యమం చాలా తీవ్రంగా సాగుతూ వుండేది. నేను రాజమహేంద్రవరం వచ్చేసరికి ఆ ఊళ్ళలో ఈ ఆందోళన చాలా హెచ్చుగా వుండింది. నేను మెట్రిక్యులేషన్ చదువుతూ వుండగా, వీరేశలింగం గారి ఆధిపత్యం కింద విధవా వివాహాలు జరుగుతూ ఉండడం జ్ఞాపకం వుంది. మానూరి పురుషోత్తం వివాహ సందర్భంలో పంతులుగారి చాకచక్యమూ, పద్ధతులూ నేను బాగా గమనించాను. తమ కార్యసాధనకి అవసరమని తోస్తే ఆయన రౌడీల సహాయమూ, లౌక్యుల సహాయమూ కూడా పొందేవాడు.

అప్పట్లో విద్యావంతులై సంఘానికి నాయకులుగా వుండినవాళ్లు అంతా సంస్కర్తలే. న్యాపతి సుబ్బారావు పంతులుగారు, పెద్దాడ సాంబశివరావుగారు నేతి సోమయాజులుగారు మొదలైన పెద్దలు చాలామంది ఆయనకి తోడ్పడుతూ వుండేవారు. కాని ఈ పెద్దలంతా ఆ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టడానికి సమయం వచ్చినప్పుడు, ఆ సిద్ధాంతాలు ఆయనకి అప్పజెప్పి, తప్పుగున్నవాళ్ళే! ఆ కాలంలోనే నా వివాహంతో బాటు మా చెల్లెలు అన్నపూర్ణ భర్త ఆకస్మికంగా మరణించాడు. పెళ్ళి నాటికే ఆయన పెద్దవాడు. నా చెల్లెలు వ్యక్తురాలు కాకుండానే ఆయన మరణించడంచేత, నాకు రాజమహేంద్రవరంలో కలిగిన సంస్కరణ భావాల వల్ల, ఆమెకి పున ర్వివాహం చేయ్యాలని దృఢసంకల్పం కలిగింది. నే నీ ప్రయత్నంలో వుండగానే ఆమె కూడా చనిపోవడం తటస్థించింది.

యఫ్.ఏ. క్లాసు ఈ విధంగా సాగింది. కేసుల గందరగోళాలతో వుడుకు రక్తం కాస్త చల్లారింది. పైగా, జీవితలక్ష్యం అంతా ప్లీడరీమీద వుండడంచేత చదువుకి ఏమీ ప్రతిబంధకం కలగనియ్యకుండా చూడాలనే దృఢసంకల్పం ఒకటి తోడుపడింది. అందుచేత చదువంటే బాగా శ్రద్ధ పట్టాను. నాటకాల వ్యవహారం మాత్రం ఏమీ తగ్గలేదు. మొత్తంమీద 1891వ సంవత్సరంలో యఫ్.ఏ. పరీక్షకి హాజరై పాసయ్యాను. అప్పట్లో యఫ్.ఏ.పాసయితే ఫస్టుగ్రేడు పరీక్షకి ప్రైవేటుగా చదవవచ్చును. అందుచేత కూడా ఆ లక్ష్యశుద్ధి ఎక్కువైంది.

1892వ సంవత్సరంలో ప్లీడరు పరీక్ష కోసం బాగా క్షుణ్ణంగా చదివాను. అప్పటికి ఏలూరి లక్ష్మీనరసింహంగారు బి.ఏ. పాసయి స్కూలు పెట్టుకుని వున్నారు. ఆయన అప్పటికి మున్సిపల్ చెయిర్మన్ గా వుండి మునిసిపల్ వ్యవహారమంతా ఏకటాకీగా నడిపించేవారు. ఆయన కూడా నాతోబాటు ప్లీడరుపరీక్షకి చదువుతూవుండేవాడు. ఉభయులమూ కలిసి పరీక్షకి చదువుతూ వుండేవాళ్ళము. తీరా చదువంతా పూర్తి అయ్యాక నాకొక విఘ్నం వచ్చింది. 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయితేనేగాని ఫస్టుగ్రేడు పరీక్షకి కూర్చోడానికి వీలులేదని ఎక్కడో ఒక నియమం ఉందిట. నేను అది చూసుకోకుండానే చదువు పూర్తిచేశాను. చివరికి ఆ అభ్యంతరం బయటకి వచ్చింది. వయస్సు సర్టిఫికెట్ కోసం అక్కడ సివిల్ సర్జనుగా వున్న మేజర్ కోమా దగ్గరకి వెడితే, అతను నాకు 'జ్ఞాన దంతం' (Wisdom tooth) రాలేదని సర్టిఫికెట్ నిరాకరించారు.

దాంతో నా ఆశయానికి భంగం కలిగింది. ఒక్క సంవత్సరం వృథా అయింది. ఆ సంవత్సరంలో ఫస్టుగ్రేడ్ కి ప్రైవేటుగా వెళ్ళడానికి అవకాశం తీసివేస్తారు. త్వరలో బి.ఏ. పాసయితే కాని ఫస్టుగ్రేడు పరీక్షకి వెళ్ళడానికి వీలులేదనే నియమాలు వస్తున్నాయి. అందుచేత 1892లో లాకాలేజికి వెళ్ళి చదవడం తప్ప వేరే మార్గం లేదు. మద్రాసులో లాకాలేజిలో చదువంటే తాడూ బొంగరమూ లేని నాబోటి వాడికి ఎల్లాగ సాధ్యం అవుతుంది? మళ్ళీ హనుమంతరావు నాయుడు గారి కొక సమస్య. నే నాయన్ని శ్రమపెట్టడానికి మొహమాటపడ్డాను. కాని, ఆయనే "ఎల్లాగో తంటాలు పడదాము; సాహసించ"మన్నారు. ఆయన డబ్బు ఎల్లాగ తెచ్చేవారో నాకు తెలియదు. అప్పుడప్పుడు అప్పులు కూడా చేశారనుకుంటాను. కొణితివాడ జమీందారుదగ్గర 90 రూపాయలు తేవడం మాత్రం నాకు తెలుసును. ఆ జమీందారు థీయిస్టిక్ స్కూలులో నాకు సహాధ్యాయి. ఆ చనువుచేత నాయుడుగారు జమీందారు దగ్గిరికి నడిచివెళ్ళి 90 రూపాయలు పట్టుకుని వచ్చి నాకు పంపించారు.

అప్పటికింకా మదరాసుకి రైలు పడలేదు. బెజవాడదాకా పడవ మీద వెళ్ళి, అక్కడనించి గుంతకల్లు పోయి, గుంతకల్లునించి మదరాసు వెళ్ళాము. ఆ తరవాత మదరాసులో నేను లాకాలేజిలో చేరాను. అక్కడ పెమ్మరాజు గుర్రాజు, సారంగు భీమశంకరం, వరాహగిరి జోగయ్య, వేములూరి వెంకట్రాయుడు మొదలైనవారు నా సహాధ్యాయులు, మేము నలుగురైదుగురూ కలిసి నల్లతంబివీథిలో ఒక చిన్న భోజనవసతి ఏర్పాటుచేసుకున్నాము.

అప్పుడు లాకాలేజీకి ప్రిన్సిపాల్ నెల్సన్. అధ్యాపకులు వి.కృష్ణస్వామయ్యరుగారు, టి.వి.శేషగిరయ్యరుగారు, హెచ్.రంగప్పగారు

ఇంకా జీవించే వున్నారు. నెల్సన్, పీనల్ కోడ్ చెప్పడంలో నిధి. అప్పట్లో అతని వ్యాఖ్యానమే ప్రమాణంగా వుండేది. ఈ అధ్యాపకులంతా చాలా పేరుకెక్కిన వాళ్ళు. నేను లా కాలేజిలో చదివిన సంవత్సరం బహుశ్రద్ధగా చదివాను. ఇండియన్ లా అంతా చాలా క్షుణ్ణంగా చదివాను. నా విషయంలో మిత్రులంతా కూడా మొదటి తరగతిలో వస్తానని అనుకున్నారు. కాని పరీక్షల్లో అప్పుడప్పుడు జరుగుతూ వుండేటట్లుగానే ఆశాభంగం అయింది. మొత్తం మీద 650 మార్కులు వచ్చినా, నాకు బాగా వచ్చిన క్రిమినల్ ప్రొసీజరుకోడు పేపరు అతిగా చదవడం వల్ల సరిగ్గా రాయలేక పోయాను. దాంతో నేను రెండో తరగతిలో వచ్చాను. అంటే సెకండ్ గ్రేడ్ ప్లీడరీ పట్టా మాత్రమే లభించింది.

పరీక్ష పాసుకావడంతోనే ఒంగోలు వచ్చాను. సర్టిఫికెట్ వచ్చేటప్పటికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఈ లోగానే నేను ఒంగోలులో యాథాలాపంగా ఐదారు క్రిమినల్ కేసుల్లో పనిచేసి గెలిపించాను. అప్పటికింకా క్రిమినల్ కోర్టుల్లో దేశభాషల్లో వాదించడమే కనక, సర్టిఫికెట్ లేక పోయినా పాసయినట్టు దాఖలా వుండడంవల్ల వకాల్తా పనిచెయ్యడానికి అనుమతి దొరికింది. అప్పటికింకా మా అమ్మగారు హోటలుతో శ్రమపడుతూ, శ్రీరాములు చదువు సాగిస్తోంది. నేను ఏదో ఆషామాషీగా పనిచేసి రెండుమూడువందల రూపాయలు సంపాదించాను. దాంతో ఆ తాలూకాలో నాలుగుమూలలా వున్న బంధువుల మూలంగా నామాట బాగా వ్యాప్తి చెందింది. అందుచేత నాకొక సమస్య వచ్చింది. బంధువులు, చిన్ననాటి మిత్రులు కలిసి నన్ను ఒంగోలులో ప్రాక్టీసు పెట్టమని బలవంతం చేశారు. రాజమహేంద్రవరం ఊరుగాని ఊరనీ, అక్కడ బి.ఎల్.లూ, ఫస్టుగ్రేడులూ చాలామంది వున్నారనీ, సెకండుగ్రేడు ప్లీడరికి అట్టే అవకాశం వుండదనీ ఈ కారణాలవల్ల బంధువులందరికీ దగ్గిరిగా వుండే ఒంగోలులో ప్రాక్టీసు పెట్టమని నిర్బంధించారు.

కాని, నేను అంగీకరించలేదు. నాకు చిన్నప్పటినించీ విద్యాబుద్ధులు చెప్పి, నా విద్యకోసం తమ కుటుంబాన్ని కూడా అసౌకర్యాల పాలుచేసి నామీద అత్యంతమూ ఆశతో వున్న హనుమంతరావు నాయుడుగారికి ఆశాభంగం కల్పించడం నాకు న్యాయం కాదని నిష్కర్షగా చెప్పాను. హనుమంతరావు నాయుడుగారు మొదటినించీ నాతోపాటు తమ మేనల్లడైన పిళ్లారిసెట్టి నారాయణరావు నాయుడికి కూడా విద్యాబుద్ధులు చెప్పేవారు. అతను చాలా సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చాడు. అతనికి నాయుడుగారు జీతం వగైరాలు ఇచ్చి ఇంట్లో పెట్టుకుని శ్రద్ధగా చదువు చెప్పించారు. అతనూ నాతో బాటే చదువుకుంటూ వుండేవాడు. అప్పుడప్పుడు నాటకాల్లో చిల్లర పాత్రలు ధరించేవాడు. నాయుడుగారి మనస్సులో అతనికి కూతుర్నిచ్చి పెళ్ళి చేద్దామనే ఆశ వుండేది. కాని, నారాయణరావు మెట్రిక్యులేషనూ, యఫ్.ఏ. అయ్యాకా తన భవిష్యత్తు కోసం ఆయన్ని ఒదిలిపెట్టి కలెక్టరు దగ్గర శిరస్తారుగా వుండిన తాయి శేషగిరిరావు నాయుడుగారి కుమార్తెని పెండ్లి చేసుకుని తద్వారా ఉన్నతవిద్య సంపాదించాడు. అప్పుడు అతనిచర్య అనేక విధములైన విమర్శలకు గురి అయింది. మొత్తంమీద నేను నాయుడుగారి దగ్గర ఉండడానికి నిశ్చయించి, రాజమహేంద్రవరం వచ్చేశాను. కొద్దిరోజుల్లో కుటుంబం అంతా ఒంగోలునించి రాజమహేంద్రవరం మార్చడానికి నిశ్చయించి, అక్కడవున్న వ్యవహారమంతా ఆపివేయడానికి తగిన ఏర్పాట్లు చేశాను.

సర్టిఫికెట్ రావడంతోటే రాజమహేంద్రవరంలో 1894వ సంవత్సరంలో ప్రాక్టీసు పెట్టాను. ప్రస్తుతం కంభంవారివీథిలో మాదిరెడ్డి వీరాస్వామి నాయుడుగారి ఇంటికెదురుగా కొత్తగా నిర్మించబడిన రెండు కొట్లల్లో ప్రాక్టీసు ప్రారంభించాను. ప్రాక్టీసుకి కావలసిన పరికరాలు, కర్రపెట్టెలు జంబుఖానాలు, కుర్చీలు, బల్లలు మొదలయిన ఆర్భాటాలన్నీ సుబ్బారావు పంతులు గారివంటి పెద్ద ప్లీడర్లకే వుండేవి. అప్పటికి రాజమహేంద్రవరంలో ప్రసిద్ధిగా ప్లీడరీ చేస్తూన్న వాళ్ళని గురించి, ప్లీడర్ల పరిస్థితుల్ని గురించి కొంచెం సూక్ష్మంగా రాస్తాను.

న్యాయవాదులంతా బి.ఎల్.ప్లీడర్లు, ఫస్టుగ్రేడు ప్లీడర్లు,

సెకండ్ గ్రేడు ప్లీడర్లు, వాలస్ పట్టాదార్లు అని నాలుగు విధాలుగా ఉండేవాళ్ళు. సుబ్బారావు పంతులుగారు, మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడుగారు, మాకర్ల సుబ్బారావునాయుడుగారు, చిత్రపు వెంకటాచలంగారు మొదలైన వాళ్ళంతా ఒక తరహా. వీళ్ళందరికీ సుబ్బారావు పంతులుగారు నాయకుడు. ఆయన్ని గురించీ, ఆయన రాజకీయాలని గురించీ, ముందుముందు వ్రాస్తాను. మాకర్ల సుబ్బారావునాయుడుగారు మారడుగులవారి సందులో వున్న కంచుమర్తివారి మేడలో ప్రాక్టీసు చేస్తూ వుండేవారు. ఆయన దివ్యజ్ఞాన సమాజసభ్యుడు. అస్తమానమూ ఆ ధ్యాసలోనే వుండేవాడు. అప్పటికి వెంకటరత్నంనాయుడుగారు, వెంకటాచలంగారు, ఆట్టే అంత పెద్ద ఎన్నికలో పడలేదు.

ఇంక ఫస్టుగ్రేడ్ లో, నిడమర్తి దుర్గయ్యగారు అనే జలదుర్గ ప్రసాదరాయుడుగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు, నేతి సోమయాజులుగారు, వగైరాలు వుండేవారు. వారంతా మంచి ప్రాక్టీసుదారులు. సెకండు గ్రేడులో కనపర్తి శ్రీరాములు, ఏలూరి వెంకట్రామయ్యగార్ల ఫైలు జోరుగా వుండేది. ఇక వాలస్ (wallace) పట్టాదార్లలో దామరాజు నాగరాజుగారి ప్రభ జోరుగా వుండేది. ఆయన ఒక్క అక్షరం ఇంగ్లీషు ముక్క అయినా లేకుండా ఎంతసేపైనా చాలా సరసంగా ఆర్గ్యుమెంటు చెప్పేవారు. అప్పట్లో కాకినాడలో ఉన్న గంజాం వెంకటరత్నం, కృత్తివెంటి పేర్రాజుగార్లు జిల్లాకంతటికీ పెద్ద ప్లీడర్లుగా వుండేవారు. వీరు జమీందారుల ప్లీడర్లుగా వుండి పేరు ప్రఖ్యాతులు, డబ్బూ కూడా సంపాదించారు. వీ రుభయులూ కాకినాడ మునిసిపల్ రాజకీయాల్లో కూడా బాగా పేరుపడ్డారు. ఉభయులూ మెట్రిక్యులేషన్ పాసయిన ప్లీడర్లయినా కేసులు నడిపించడంలో వారికి ఏ బి.ఎల్.లూ సరిపోయేవారు కారు. పేర్రాజుగారు మంచి హుందా అయిన సరళిలో కేసు ఆర్గ్యుమెంటు చెప్పేవాడు. వెంకటరత్నంగారు మంచి మేధావి. ఇక ఇటు ఏలూరులో ములుకుట్ల అచ్యుతరామయ్యగారు అనే ఆయన వుండేవారు. ఆయన శుద్ధ తెలుగు ప్లీడరు. మనిషి మంచి స్ఫురద్రూపి. చంకీజోళ్ళు వగైరాలు ధరించి బాగా దర్జాగా వుండేవాడు. వెంకటేశ్వరరావుగారి ప్రాపంకం వల్ల నూజివీడు జమీందార్లకి ప్లీడరీ చేస్తూండేవాడు. ఆయనకి ఫీజురూపాయలు ఏనుగుల మీద వేసుకుని తీసుకువచ్చి ఇచ్చేవారు. ఆనాటి వృత్తి స్థితి అది.