నా జీవిత యాత్ర-1/ఇంగ్లండు ప్రయాణం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

9

ఇంగ్లండు ప్రయాణం

అప్పటికి రాజమహేంద్రవరంలో నా సంసారం స్థిరపడింది. సంపాదన పుష్కలంగా ఉండడమూ, బంధువు లంతా తృప్తి పడడమూ జరిగింది. ఇల్లాంటి స్థితిలో లండన్ ప్రయాణం అనేసరికి ఇంట్లో కల్లోలం పుట్టింది. ఆ కాలంలో సముద్రయానం అంటే కులంపోయిం దన్నమాటే. ఆ కారణం పురస్కరించుకుని రేకపిల్లి లచ్చయ్యగారు అనే పురోహితుడు మా యింట్లో ఆడవాళ్ళకి - ముఖ్యంగా మా అమ్మగారికి - బాగా ఆందోళన కలిగించాడు.

అంతకి పూర్వమే సుబ్బారావుపంతులుగారికి సుస్తీచేస్తే, వైద్యులు ఆయనకి, "ఆరోగ్యంకోసం సముద్రయానం అవసరం" అని చెప్పారు. ఆయన అప్పుడే వీరేశలింగం పంతులుగారితో తగాదాపడి సనాతన హిందూ ధర్మోద్ధరణకోసం హిందూ సమాజం స్థాపించి ఉండడంచేతనూ, మాధ్వస్వాముల వారి ప్రాపకం చెడగొట్టుకోవడం ఇష్టంలేని వారవడం చేతనూ, చాలా తటపటాయించి, చివరికి తూర్పు తీరాన్ని ఓడప్రయాణంచేసి చక్కావచ్చారు. దీనికి మాధ్వస్వాములవారు అంగీకరించారు కూడాను. ఆ సంగతి మా అమ్మగారితో చెప్పి ఆవిడ మనస్సుకి తృప్తి కలిగించాను.

అసలు అప్పటికి మనదేశంలో ఎవ్వరూ బారిష్టరు చదువుకోసం ఇంగ్లండు పోయినవారులేరు. అంతకిముందు ఎవరో ఒక క్షత్రియుడు 50 సంవత్సరాల క్రితం విశాఖపట్నంనించి సీమ వెళ్ళారట. కాని ఆయన లెఖ్ఖలో పడలేదు. యం. ఆర్. అయ్యంగారు అనే దాక్షిణాత్యులు ఒకరు బారిష్టరు అయి రాజమహేంద్రవరంలో కొంతకాలం కిందట ప్రాక్టీసుచేస్తూ వచ్చారు. ఆయన చాలా తెలివైనవాడేగాని, తాగడం అలవాటు అయింది. ఒక్కొక్కప్పుడు ఆ నిషామీద వాదితరపున వకాల్తీ పుచ్చుకుని ప్రతివాది తరపున ఆర్గ్యుమెంటు చెప్పేవారు. ఆయన ఇంగ్లాండునించి వచ్చాక ఆయన భార్య ఆయనతో కాపరం చెయ్యడానికి నిరాకరించింది. ఆయన రాజమహేంద్రవరంలో ఒక ఆంగ్లో ఇండియన్ యువతిని పెళ్ళాడి చాలా నిర్భాగ్య జీవితం గడుపుతూ ఉండేవాడు.

మా వాళ్ళకి బారిష్టరు అంటే అదే అభిప్రాయం. కష్టాలు పడి, పడి నామీదే ఆశలన్నీ కేంద్రీకరింపచేసుకున్న మాఅమ్మగారికి నా భవిష్యత్తుని గురించి భయం కలిగింది. అందుచేత ఆవిడికి లండన్‌ప్రయాణం అంటే కొంచెం జంకు పుట్టింది. నేను ఆవిడికి ఆ విషయమై భయం ఉండనవసరం లేదనీ, బారిష్టరు చదువంతా రెండుమూడు టెరముల్లో పూర్తిచేస్తాననీ, మత్స్య మాంసాలు ముట్టుకోననీ చెప్పి శపధంచేసి, ఎల్లాగో అల్లాగ చిట్టచివరికి ఒప్పించాను. ఆవిడ సహజంగా ధైర్యస్థురాలు. కనక అతికష్టంమీద అంగీకరించింది. ఆ తరవాత నా భార్యని కూడా ఒప్పించి, ఆవిణ్ణి గుంటూరుజిల్లా కొత్తపట్నంలో ఆవిడ పినతల్లిగారింట్లో - అంటే మా చిన్నక్కయ్యగారింట్లో - దిగబెట్టాను. మా అమ్మగారిని మా తమ్ముడు శ్రీరాములు దగ్గిర ఉంచి ఇంగ్లండుకి ప్రయాణం అయ్యాను.

ఈ రీతిగా సంసారపు సర్దుబాట్లన్నీ చేసుకుని అక్టోబరు మొదటి వారంలో లండన్ వెళ్ళడానికి నిశ్చయించాను. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ - అంటే స్టీమరు బుక్కింగు వగైరాలన్నీ - డాక్టర్ స్వామినాథన్ గారి ద్వారా చేశాను. మునిసిపల్ ఛైర్మన్‌పని శ్రీ పి. నారాయణరావుగారికి డెలిగేటుచేశాను. ముందు మద్రాసువచ్చి అక్కడ రెండురోజులున్నాను. రెంటాల వెంకట సుబ్బారావుగారు నా ప్రయత్నం మెచ్చుకుని స్వయంగా నాకు కావలసినవన్నీ ఏర్పాటుచేశారు. ఆవకాయ వగైరా ఊరగాయలన్నీ చక్కగా మూటలు కట్టించి ఇచ్చారు. అక్కడ నించి బొంబాయివెళ్ళి బొంబాయిలో నా క్లయింట్లూ, శ్రీమంతులూ అయిన గొల్లపూడి చిన నరసింహంగారి ఇంట్లో రెండురోజు లుండి, మెయిల్ బోట్‌మీద ఇంగ్లండుకి ప్రయాణం అయ్యాను. మా అమ్మ గారికి మత్స్య మాంసాదుల విషయమై మాట ఇవ్వడంచేత, రెండు బస్తాల బత్తాయి కాయలు కూడా ఓడలో వేయించాను.

నాతోబాటు చెంగల్రావునాయుడుగారు అనే ఒకాయన ప్రయాణం అయ్యారు. ఆయన రంగూన్‌లో ఎక్కౌంటెంటుగా వుండి, బాగా డబ్బు సంపాదించి, అ తరవాత బారిష్టరు చదువు ప్రారంభించారు. నాతో ప్రయాణం చెయ్యడానికి ముందు అప్పుడే ఆయన ఒకసారి లండన్ వెళ్ళి ఒక టెరమ్ పూర్తిచేసుకుని వచ్చారు. అది కారణంగా అక్కడి వ్యవహారాలన్నీ పూర్తిగా ఆకళించుకున్నవా రవడంచేత నాకు మంచి సహాయంగా ఉండేవారు. ఓడ ఎక్కిన మర్నాడే నాకు సముద్రపు జబ్బు (సీ సిక్ నెస్) వచ్చింది. మొదటి రోజున డైనింగు హాలులోకి వెళ్లేసరికి ఓడలో మాంసాదులు వండుతూన్న వాసన భరించలేక పోవడంవల్ల నాకు వాంతి చేసుకునేటంత పని అయింది. వెంటనే నా గదిలోకిపోయి సర్దుకున్నాను. రెండు రోజులవరకూ ఆ జబ్బుతోనే పడుకున్నాను. క్రమంగా అయిదు రోజులకి ఏడెన్ చేరుకున్నాము. మరి మూడు రోజులకి పోర్టుసెడ్ చేరాము. ఈ రేవుల్లో కనబడే జనం అంతా అరబ్బులు. వాళ్ళు సామాన్యంగా నల్లచర్మంవాళ్లే. మొత్తంమీద 12 రోజులు ప్రయాణంచేసి మార్సెల్సు చేరాను.

మార్సెల్సు చేరేసరికి నావలో ఉండే ప్రయాణీకుల వ్యవహారం అంతా మారిపోయింది. నాతోపాటు ప్రయాణం చేస్తూన్న వాళ్ళలో ఈ దేశంలో పెద్దపెద్ద వుద్యోగాలలో వుండి, నవాబ్‌దర్బారీ సాగిస్తూ వుండేవాళ్ళు చాలామంది వున్నారు. మధ్యధరా సముద్రం దాటేవరకూ ఈ వుద్యోగస్థుల దర్బారీ, ఠీవీ యథారీతిగానేవున్నాయి. కాని, మార్సెల్సు రేవులో దిగడంతోనే ఎవరి సామాన్లు వారు జాగ్రత్త పెట్టుకుని బుజాన వేసుకుని మిగిలిన సామాన్య జనంలాగే దిగడం ప్రారంభించారు. అల్లాగ లండన్‌కేసి వెళ్ళిన కొద్దీ వాళ్ళధోరణి మారిపోయింది.

పాశ్చాత్య ప్రపంచాన్ని గురించి మొట్టమొదటి చూపులో నాకు కలిగిన అభిప్రాయాలు కొంచెం వివరిస్తాను. ఆకాలానికే పాశ్చాత్య నాగరకతా వాసనలతో నిండిన నాకు, ఆ ప్రపంచం తెల్లవాడి మాయగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమి వుంది! పూర్తిగా బ్రిటిష్‌పాలనలో పడిపోయి, స్వీయమైన నాగరకత గుంటపెట్టి గంటవాయించి, కొత్త నాగరకతకి వరవళ్ళు దిద్దుతూ వుండే ఈ దేశంలో నించి వెళ్ళిన నన్ను, చక్కటి సురక్షితమైన పాశ్చాత్య నాగరకత ఆకర్షించడం ఒక వింతకాదు. మార్సెల్సులో దిగేసరికి ఓడ దగ్గిరా, రైలు దగ్గిరా పోర్టరు దగ్గిరనించి పై వుద్యోగస్థుడివరకూ, అందరూ చూపే శిక్షణా, మర్యాదా నన్ను బాగా సంతోష పెట్టాయి. హోటళ్ళలో స్త్రీ పురుషుల నడవడీ వాళ్ళ మర్యాదలూ కూడా బేష్ అనిపించాయి. అన్నిటికన్నా వాళ్ళు అనుభవించే స్వాతంత్ర్య వాయువులు నా కెంతో ఆనందం కలిగించాయి. పాశ్చాత్య పద్ధతులమీద ఆలోచనలు పారే ఆ రోజుల్లో "ఎప్పటికైనా మనదేశం ఈ వున్నత స్థితికివచ్చి, ఈ జాతులతో తులతూగుతుందా!" అని అనిపించింది.

లండన్‌లో చెంగల్రాయన్ నాయుడుగారు నివసిస్తూ వున్న చెస్ వాటర్ చేరుకున్నాము. మొదటిరోజున ఆయనతోపాటే ఒక గృహస్థు ఇంట్లో వున్నాను. రెండో రోజున ఆ నాయుడుగారు నన్ను ఆ పక్కని వున్న ఇంట్లో బసకి, భోజనానికీ కుదిర్చారు. ఆ దేశంలో సామాన్య గృహస్థులు కొంచెం డబ్బు తీసుకుని అతిథులికి ఆశ్రయం ఇస్తారు. అల్లాచేస్తే ఆ దేశపు సాంఘిక జీవనంలో తప్పు లేదు. నెలకి రెండు పౌనులు ఇచ్చే పద్ధతిమీద నేను బస, భోజనమూ కుదుర్చుకున్నాను. ఒక పెద్ద ష్టవ్ కొనుక్కొని ఒకగదిలో ప్రత్యేకంగా కాయగూరలు పప్పులుపచనం చేసుకుని భోజనంచేస్తూ వుండేవాణ్ణి. చెంగల్రాయన్‌గారు గ్రే ఇన్‌లో మెంబరుగా వుండి, బారెట్లాకి చదువుతూ వుండేవారు. ఆయన నన్ను కూడా ఆ ఇన్‌లోనే చేర్చారు.

ఈ సందర్భంలో ఈ బారిష్టరీ చదువుని గురించి కొంచెం వ్రాస్తాను. ఆ సమయంలో మన దేశంనించి, ముఖ్యంగా వంగ దేశంనించి ఎందరో యువకులు ఈ చదువుకోసం వచ్చేవారు. విశేషంగా చదువుకోసం శ్రమపడకుండానే డిన్నర్‌లకి హాజరై, పరీక్షలకాలంలో ముఖ్యమైన విషయాలు పరీక్షల ఏజంట్లద్వారా సంపాదించి, ముక్కుని పెట్టుకుని బారిష్టర్లయి మనదేశానికి తిరిగి వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో చాలా మంది వృత్తిలో ముందుకి రాలేక కేవలం డిన్నరు బారిష్టర్లనే అప్రతిష్ట తెచ్చుకున్నారు. అందుచేతనే మద్రాసులో కొద్ది కాలానికే బారిష్టర్ల పరువు సన్నగిలింది. మైలాపూరు మేధావుల సునిశిత బుద్ధివిశేషం ఈ డిన్నరుబారిష్టర్లని నెట్టివేయడంలో ఆశ్చర్యమేమివుంది? బారిష్టరు చదువు పద్ధతి అల్లాగ వున్నప్పటికీ, కష్టపడి చదువుకునేవాళ్ళకి పరిపూర్ణమైన అవకాశాలు ఉండేవి. ఆ కాలంలో ఈ న్యాయవిద్య అంతా ఇంగ్లండులో కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ చేతుల్లో వుండేది. ఆ దేశంలో నాలుగుచోట్ల పెద్దపెద్ద న్యాయశాస్త్ర గ్రంథాలయాలు ఏర్పాటుచేసి వాటికి చేరికగా, నివాసానికీ, భోజనానికీ చక్కని వసతులు ఏర్పాట్లు చేస్తారు. వాటినే 'ఇన్‌'లు అంటారు. టెరముకి ఇన్ని డిన్నర్‌లు - అంటే విందులని - పరిమితి వుంటుంది. ఈ విందులికి తప్పకుండా హాజరు కావాలి. మన యూనివర్సిటీల్లో అట్టెండెన్సు ఎంత ముఖ్యమో ఇక్కడ ఇది అంత ముఖ్యము.

ఆ విందులే కాకుండా కౌన్సిల్ ఆఫ్ లీగలు ఎడ్యుకేషన్‌వారు ఏర్పాటు చేసిన లెక్చర్లు వుంటాయి. వాటికీ హాజరు కావాలి. ఆ లెక్చర్లు చాలా ఉన్నతశ్రేణిలో ఉంటాయి. ఆ లెక్చర్లు విని లైబ్రరీలో కూర్చుని శ్రద్ధగా చదువుకుని మిగిలిన కాలంలో సమీపంలో వుండే ఇంగ్లీషు కోర్టుల్లో వ్యవహారాలు పరిశీలించే శ్రద్ధావంతులికి బారిష్టరు చదువు ప్రశస్తమైనదని చెప్పక తప్పదు. నేను మన దేశంలో 8 సంవత్సరాలు సివిల్, క్రిమినలు కేసుల్లో పనిచేసి న్యాయశాస్త్ర ప్రధానసూత్రాలు అవగాహన చేసుకుని అనుభవం సంపాదించాను. అంతేకాక, చిన్ననాటినించీ ఈ వకీలు వృత్తి అంతం కనుక్కోవాలనే కుతూహలంతో వుండేవాణ్ణి. అందుచేత ఈ విద్యమీద బాగా లక్ష్యం ఉంచి చదివేవాణ్ణి. లా కౌన్సిలు ఉపన్యాసాలు అన్నీ శ్రద్ధపట్టి సంగ్రహంగా వ్రాసుకునేవాణ్ణి. కోర్సు పూర్తి అయ్యేసరికి నోట్సు పుస్తకాలన్నీ నా యెత్తుని పెరిగాయి. నేను పాఠ్య గ్రంథాలు శ్రద్ధగా చదువుతూ, అవకాశం ఉన్నప్పుడల్లా ఇంగ్లీషు కోర్టులలో పద్ధతులూ, పెద్దపెద్ద బారిష్టర్లు నడిచే రీతులూ చూస్తూ వుండేవాణ్ణి. మొట్టమొదటి కొద్దిరోజుల్లో ఆంగ్లజీవితం చూశాక నాకు కలిగిన అభిప్రాయాలు వ్రాస్తాను. రైలు దిగుతూంటేనే కూలీల కట్టుబాట్లని గురించి నాకు కలిగిన ఆశ్చర్యం ఇదివరకే వెలిబుచ్చాను. మొత్తంమీద బజారులోగాని, హోటళ్ళలో గాని, సినీమాలలో గాని ఎక్కడ చూసినా సాధారణ జీవితంలో నిజాయితీ, శ్రద్ధ ఎక్కువగా కనిపించాయి. అక్కడ కాలం వృథా చెయ్యకుండా వుండే చురుకుతనం బాగా గోచరించింది. బజారులోకి వెడితే కూరగాయ లమ్మే స్త్రీలతో గాని, పురుషులతోగాని బేరమాడ నక్కరలేదు. ఒకే వెల. మంచి నాణ్యం. ఇక పోస్టాఫీసుకి వెడితే అక్కడ వుండే స్త్రీ అతి మర్యాదగా, క్షణం ఆలస్యం లేకుండా కౌంటరు దగ్గిర మన పని చూసి, వెంటనే పంపించివేస్తుంది.

ఒకసారి నేను ఎడింబరోకి కొన్నిపౌనులు మనియార్డరు చేద్దామని ఒక పోస్టాఫీసుకి వెళ్ళాను. 16, 17 ఏళ్ళ యువతి నా దగ్గిర డబ్బూ, ఫారమూ పుచ్చుకుని ఉత్తరక్షణంలోనే ఇతరుల పని చూడడం మొదలు పెట్టింది. నేను మన దేశంలో అలవాటుకొద్దీ రసీదుకోసం కాచుకుని కూర్చున్నాను. కొంతసేపటికి ఆమె నన్ను చూసి "అట్లాగ నిలబడ్డారేమిటి?" అని అడిగింది. "రసీదు కోసం" అని చెప్పేసరికి, "ఇక్కడ రసీదు లివ్వరు. ఈ పాటికి మీ డబ్బు చేరవలసిన చోటికి చేరే వుంటుంది, మీరు వెళ్ళవచ్చును," అని చెప్పింది.

అక్కడ సామాన్యజనులు స్నానం చెయ్యడానికి స్నానాలగదులు ఏర్పాటై వుంటాయి. వాటిని ఉపయోగించే జనం ఒకరి నొకరు తోసుకోరు. ముందు వచ్చిన వాళ్ళు ముందు తమపని ముగించుకుని పోతూ ఉంటారు. నాటకశాలల దగ్గిర టిక్కట్లు కొనేచోట, హోటళ్ళలోనూ, రైలుస్టేషన్‌లలోనూ ముందువచ్చిన వాళ్ళకి ముందుగా టిక్కట్లు ఇచ్చివేసి పంపిస్తారు. జనంకూడా గుంపులుగూడి తోసుకోకుండా ఒక్క వరసగా నిలబడి, ఒకళ్ళ వెనక ఒకళ్ళు తమతమ పనులు నెరవేర్చుకుంటూ ఉంటారు. ట్రాముల్లోనూ, గుర్రపుబళ్ళలోనూ డ్రైవర్లు ప్రయాణీకుల్ని అతిమర్యాదగా చూస్తారు. ఈ గుఱ్ఱపు బళ్ళవాళ్ళు మద్రాసులో రిక్షాబళ్ళవాళ్ళలాగు కాకుండా పట్టణం అంతా బాగా తెలుసుకుని ఉంటారు. దానికి తోడుగా వాళ్ళు మంచి నిజాయితీ ఉన్నవాళ్ళు.

ఒకసారి నేను నా లా పుస్తకం ఒకటి గుఱ్ఱపు బండిలో మరిచిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. తీరా ఇంటికి వెళ్ళాక ఆ దేశంలో సి. ఐ. డి. పోలీసులకి హుజార్ ఆఫీసు అయిన స్కాట్లండు యార్డుకి తెలియపరచాలని అనుకుంటూ ఉండగా కొన్ని గంటలలో పుస్తకం నా గదిలోకి వచ్చిపడింది. జరిగింది ఏమిటంటే - ఆ గుఱ్ఱపుబండివాడు ఆ పుస్తకం పోలీసులకి అప్పచెప్పాడు. ఆ పోలీసులు నా చిరునామా తెలుసుకుని పుస్తకం నాకు పంపించారు. మనదేశంలో లాగు యజమాని ఫలానా అని నిర్దారణ చేసే ఐడెంటిఫికేషన్ హంగామా ఏమీ చెయ్యలేదు.

ఇల్లాంటి చిన్న విషయాలే నాకు ఆంగ్ల జాతీయ జీవనం మీదా, నీతి వర్తనంలోనూ బాగా గాఢాభిమానం కలిగించాయి. ఆ అభిప్రాయలతోనూ, అభిమానంతోనూ వెనక్కి తిరిగి మనదేశం సంగతి తలుచుకుంటే నిస్పృహ కలిగింది. "ఎప్పటికైనా మన ప్ప్రజాసామాన్యం ఈ ఔన్నత్యానికి రాగలదా?" అని బాధ కలిగింది. అప్పట్లో నా మనస్సు నా ఒక్కడిదేకాదు. అది నా సమకాలికు లందరిదీని! అదీగాక ఒక కొత్త వింతలాగ పాశ్చాత్యనాగరకతను అత్యంత వ్యామోహంతో చూస్తూవుండే రోజులవడంవల్ల కూడా నా కీ నిస్పృహ కలిగింది. తరవాత నా అనుభవం వల్ల మనదేశంలో మన జాతిలో కూడా ఒకప్పుడు ఇల్లాంటి నీతినియమాల ఔన్నత్యం ఉండేదనీ, మాట ఘరానా ఒకటేగాని, ఇచ్చి పుచ్చుకోవడాలలో రాతకోతలు, రిజిస్టరీలు లేవనీ తెలుసుకోగలిగాను. తమ స్వార్థంకోసం ఆంగ్ల రాజనీతిజ్ఞులు తమ సభ్యత్వ పద్దతులు అసంపూర్తిగా మన నెత్తిని రుద్ది, మన సభ్యతను మరిపించడంవల్లనే మన జాతికి పతనం కలిగిందని కూడా తెలుసుకున్నాను. ఈ విషయాలు ఇంకొక సందర్బంలో వ్రాస్తాను. ఈ విధమైన అభిప్రాయాలతో ప్రారంభించిన బారిష్టరీ చదువు మొదటి టెరము పూర్తి అయింది.

లండనులో నాకు మొట్టమొదట పరిచితులు అయిన భారతీయులు డెల్గాడో అనే గోవా సొలిసిటరూ, వరేష్ అనే పార్సి బారిష్టరూ మాత్రమే. వరేష్ అనే ఒకాయన ఆంగ్ల స్త్రీని పెళ్ళాడి అక్కడే బారిష్టరుగా ప్రాక్టీసు చేస్తూవుండేవాడు. ఆయన ఒకరోజున నా గదికి వచ్చి నేను కాయగూరలు వండుకు తింటూవుంటే చూసి, "ఏమండీ! ఈ చలిదేశంలో మాంసాహారాలు తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సుమండీ!" అని హడలగొట్టాడు.