నారాయణీయము/దశమ స్కంధము/72వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

72- వ దశకము - అక్రూరునిఆగమనము


72-1
కంసో౾థ నారదగిరా వ్రజవాసినం త్వాం
ఆ కర్ణ్యదీర్ణహృదయస్స హి గాందినేయమ్।
ఆహూయ కార్ముకమఖచ్ఛలతో భవంతం
అనేతుమేనమహినోదహినాథశాయిన్॥
1వ భావము :-
అనంతశయనా! భగవాన్! 'నీవు వ్రజములోనుంటివి' - అని నారదుడు చెప్పగానే - కంసుని హృదయమున భీతికలిగెను. అప్పుడు , కంసుడు ' గాందిని' పుత్రుడగు 'అక్రూరుని' పిలిచి - మధురలో జరుగుచున్న 'ధనుర్యాగము' చూచుటకు ప్రభూ! నిన్ను ఆహ్వానించి - తీసుకొని రమ్మని పంపెను.

72-2
అక్రూర ఏష భవదంఘ్రిపరశ్చిరాయ
త్వద్దర్శనాక్షమమనాః క్షితిపాలభీత్యా।
తస్వాజ్ఞయైవ పునరీక్షితుముద్యతస్త్వాం
ఆనందభారమతిభూరితరం బభార॥
2వ భావము :-
భగవాన్! అక్రూరుడు నీ భక్తుడు. అతనికి నీ దర్శనము చేసుకొనవలెననెడి కోరిక ఉండియు - కంసుని భయముతో, అది దుర్లభమని ఇన్నినాళ్ళు భావించుచుండెను; అట్టి కంసుడే ఇప్పుడు నీ వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించగా - అతడు ఆనందపరవశు డయ్యెను; రాజాజ్ఞతో ప్రభూ! అక్రూరుడు నీ వద్దకు పయనమయ్యెను.
 
72-3
సో౾యం రథేన సుకృతీ భవతో నివాసం
గచ్ఛన్ మనోరథగణాంస్త్వయి ధార్యమాణాన్।
ఆస్వాదయన్ ముహురపాయభయేన దైవం
సంప్రార్థయన్ పథి న కించిదపి వ్యజానాత్॥
3వ భావము :-
భగవాన్! పుణ్యశాలియగు అక్రూరుడు - నీ దర్శనభాగ్యమునకు ఉవ్విళ్ళూరుచు - రథములో వ్రేపల్లెకు బయలుదేరెను. నీ లీలలను తలచుకొనుచు, నిన్నే ధ్యానించుచు - కంసుని వలన నీకు కీడు కలుగునేమోనను భయముతో - నీక్షేమము కొరకు పదేపదే ఆ దైవమును ప్రార్ధించుచు - బాహ్యస్మృతిలేక పయనించసాగెను.
 
72-4
ద్రక్ష్యామి వేదశతగీతగతిం పుమాంసం
స్ప్రక్ష్యామి కింస్వి దపినామ పరిష్వజేయమ్।
కిం వక్ష్యతే స ఖలు మాం క్వను వీక్షితః స్యాత్
ఇత్థం నినాయ స భవన్మయమేవ మార్గమ్॥
4వ భావము :-
భగవాన్! అక్రూరుడు ఇంకనూ ఇట్లు తలచసాగెను. వందలకొలదీ వేదములు ఏ పరమాత్మ స్వరూపమును స్తుతించునో అట్టి శ్రీకృష్ణుని నేను దర్శించగలనా? ఆయనను స్పృశించగలనా? ఆ పరమాత్మ నన్ను ఆలింగనము చేసుకొనునా? కృష్ణుడు నాతో మాటలాడునా? ఆ గోపాలుడిని నేను ఎచ్చటచూడగలను? అని పరిపరి విధములుగా యోచించుచు - అక్రూరుడు తన ప్రయాణమును సాగించెను.
 
72-5
భూయః క్రమాదభివిశన్ భవదంఘ్రిపూతం
బృందావనం హరవిరంచసురాభివంద్యమ్।
ఆనందమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే
కిం కిం దశాంతరమవాప న పంకజాక్ష॥
5వ భావము :-
పంకజాక్షా! భగవాన్! అక్రూరుడు అట్లు ప్రయాణము చేసి చేసి, తుదకు - నీ పాదస్పర్శతో పునీతమయినది, బ్రహ్మరుద్రాదిదేవతలకు సహితము వందనీయమయినది - అగు - బృందావనమును ప్రవేశించెను. ఆ సమయములో అక్రూరుడు మహదానందమునే పొందెనో! లేక ఆనందపారవశ్యముననే మునిగెనో! అతని హృదయము ఎన్నెన్ని విధములుగా స్పందించి ఆనందించెనో - చెప్పశక్యముకాదు.
 
72-6
పశ్యన్నవందత భవద్విహృతిస్థలాని
పాంసుష్వవేష్టత భవచ్చరణాంకితేషు।
కిం బ్రూమహే బహుజనా హి తదాపి జాతాః।
ఏవం తు భక్తితరలా విరలాః పరాత్మన్॥
6వ భావము :-
ఆకాలములో ఎందరో భక్తులు జన్మించి ఉండవచ్చును. కాని, అక్రూరునివంటి పరమభక్తులు మాత్రము ఏకొద్దిమంది మాత్రమో ఉండి ఉందురు. అక్రూరుడు బృందావనమును చేరి - అచ్చట నీవు విహరించిన స్థలములను చూచి పులకాంకితుడయ్యెను; సంతోషముతో రథముదిగి - భక్తిపారవశ్యముతో - నీ పాదస్పర్శతో పునీతమయిన ఆ ధూళిని తనశరీరమున ధరించెను. అప్పుడు అతడు పొందిన ఆనందము వర్ణనాతీతము.
 
72-7
సాయం స గోపభవనాని భవచ్చరిత్ర-
గీతామృత ప్రసృతకర్ణరసాయనాని।
పశ్యన్ ప్రమోదసరితేవ కిలోహ్యమానో
గచ్ఛన్ భవద్భవనసన్నిధిమన్వయాసీత్॥
7వ భావము :-
అక్రూరుడు వ్రజము చేరునప్పటికి సాయంసమయమయ్యెను. ప్రభూ! నీ గృహమునకు చేరు - త్రోవలో గోపజనుల గృహములనుండి - నీలీలలను వర్ణించు శ్రావ్యమయిన గానములను - ఆ అక్రూరుడు వినెను. వీనుల విందుచేయు వారి గాన-గీతామృతములను ఆస్వాదించుచు ఆనందపారవశ్యముతో అతడు నీ గృహము చెంతకు చేరెను
 
72-8
తావద్దదర్శ పశుదోహవిలోకలోలం
భక్తోత్తమాగతిమివ ప్రతిపాలయంతమ్।
భూమన్।భవంతమయమగ్రజవంతమంత-
ర్ర్బహ్మానుభూతిరససింధుమివోద్వమంతమ్॥
8వ భావము :-
భగవాన్! అక్రూరుడు నీ గృహము చేరు సమయమునకు - నీవు నీ అన్న బలరామునితో కలిసి గోమాతలనుండి గోక్షీరము స్వీకరించు కార్యక్రమమును పర్యవేక్షించుచుంటివి. నిన్నుచూచిన అక్రూరునికి - ప్రభూ! నీవు అతనిరాకకొరకే వేచి చూచుచున్నట్లుగా అనిపించెను; అతని అంతరంగము - బ్రహ్మానంద జ్ఞానామృత స్వరూపమును చూచిన అనుభూతితో - పొంగిపొరలెను.
 
72-9
సాయంతనాప్లవవిశేషవివిక్తగాత్రౌ
ద్వౌ పీత నీలరుచిరాంబర లోభనీయౌ।
నాతిప్రపంచధృతభూషణచారువేషా
మందస్మితార్ర్ధవదనౌ స యువాం దదర్శ॥
9వ భావము :-
ప్రభూ! నీవూ - నీ సోదరుడు బలరాముడు -సాయంకాల సమయమగుటచే, స్నానమాచరించిరి; ఆకర్షణీయమగు పసుపు నీలివర్ణపు దుస్తులను, అతి ఆడంబరముకాని ఆ భరణములను ధరించిరి; మందస్మిత ప్రసన్న వదనములతో వచ్చిరి. అట్టి మిమ్ములను - ఆ అక్రూరుడు చూచెను.
 
72–10
దూరాద్రథాత్ సమవరుహ్య నమంతమేనం
ఉత్థాప్య భక్తకులమౌళిమథోపగూహన్।
హర్షాన్మితాక్షరగిరా కుశలానుయోగీ
పాణిం ప్రగృహ్య సబలో౾థ గృహం నినేథ॥
10వ భావము :-
ప్రభూ! అక్రూరుడు మిమ్ము చూడగనే వేగిరమే రథము దిగి మీకు నమస్కరించెను; ప్రభూ! నీ పాదములపై వాలెను. నీవప్పడు ఆ భక్తాగ్రేసురుని లేవనెత్తి అతనికి సంతోషము కలిగించుచూ కౌగలించుకొంటివి; మర్యాదపూర్వకముగా సంభాషించితివి; కుశలమడిగితివి. అతని హస్తములను మీరు చెరియొకవైపున పట్టుకొని గృహాంతర్భాగమునకు తోడ్కొని వెళ్ళిరి.
 
72-11
నందేన సాకమమితాదరమర్చయిత్వా
తం యాదవం తదుదితాం నిశమయ్య వార్తామ్।
గోపేషు భూపతినిదేశకథాం నివేద్య
నానాకథాభిరిహ తేన నిశామనైషీః॥
11వ భావము :-
భగవాన్! నీ తండ్రి నందునితో కలిసి ఆ యాదవుని (అక్రూరుని) నీవు అత్యంత ఆదరముతో గౌరవించితివి. 'ధనుర్యాగమునకు మిమ్ము రమ్మని' - కంసుడు పంపిన ఆహ్వానమును - ఆజ్ఞను - అతడు చెప్పగా వింటివి. ఈ వార్తను ఇతరగోపాలురకు తెలిపితివి. అక్రూరుడు అనేక విశేషములను ప్రస్తావించుచు ఆరాత్రి నీతో గడిపెను.
 
72-12
చంద్రాగృహే కిముత చంద్రభగాగృహే ను
రాధాగృహే ను భవనే కిము మైత్రవిందే।
ధూర్తో విలంబత ఇతి ప్రమదాభిరుచ్ఛైః
ఆశంకితో నిశి మరుత్పురనాథ।పాయాః॥
12వ భావము :-
భగవాన్! ఆ రాత్రి నీవు అక్రూరునితో ఉన్న సంగతి తెలియక - గోపికలు - "ఈ అల్లరి కృష్ణుడు 'చంద్రా' గృహముననో , 'చంద్రభాగ' గృహములోనో – రాధగృహము నందునో - లేక మిత్రవింద గృహములోనో ఈ రాత్రి ఉండి ఉండవచ్చును" అని వారిలో వారే ఊహించుకొనుచూ, ప్రభూ! (నిద్రలేమితో) వారు ఆ రాత్రిని గడిపిరి. అట్టి గురవాయూరు పురనాధా! నన్ను రక్షింపుము.
 
దశమ స్కంధము
72వ దశకము సమాప్తము
-x-