నారాయణీయము/దశమ స్కంధము/67వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

67వ దశకము - శ్రీకృష్ణాంతర్ధానము-గోపికాన్వేషణము


67-1
స్పురత్పరానందరసాత్మకేన త్వయా సమాసాదితభోగలీలాః।
అసీమమానందభరం ప్రపన్నాః మహాంతమాపుర్మదమంబుజాక్ష్యః॥
1వ భావము
భగవాన్! నీవు శ్రీకృష్ణునిరూపమున భూమిపై అవతరించిన స్వప్రకాశ పరమానందరూపుడివి. అట్టి నీతో కలిసి ఆ గోపకాంతలు స్వేచ్చగా విహరించి పరమానందమును అనుభవించిరి. దీనితో ఆ అంబుజాక్షులకు అతిశయము కలిగెను.
 
67-2
నిలీయతే౾సౌ మయి మయ్యమాయం రమాపతిర్విశ్వమనో౾భిరామః।
ఇతి స్మ సర్వాః కలితాభిమానాః నిరీక్ష్య గోవింద।తిరోహితో౾భూః॥
2వ భావము
భగవాన్! ఆ గోప భామినులు - ప్రతి ఒక్కరూ - రమానాథుడు, విశ్వమనోహరుడు అయిన శ్రీకృష్ణుడు - తమలో ఐక్యమై తమతోనే విహరించుచున్నాడని భావించసాగిరి. ఆ భావనతోనే వారిలో దురభిమానము పెరిగినది. గోవిందా! అప్పుడు నీవు వారెవ్వరికి చెప్పకనే అంతర్థానమయితివి.
 
67-3
రాధాభిధాం తావదజాతగర్వామతిప్రియాం గోపవధూం మురారే।
భవానుపాదాయ గతో విదూరం తయా సహా స్వైరవిహారకారీ॥
3వ భావము
మురారీ! ఆ గోపకాంతల అందరిలోను - రాధ! అను నామముగల గోపికకు మాత్రము గర్వము రాలేదు. అత్యంత ప్రీతి కలిగిన ఆ రాధతో, నీవు విహరించుచు చాలాదూరము వెళ్ళితివి.
 
67-4
తిరోహితే౾థ త్వయి జాతతాపాః సమం సమేతాః కమలాయతాక్ష్యః।
వనే వనే త్వాం పరిమార్గయంత్యో విషాదమాపుర్భగవన్నపారమ్॥
4వ భావము
భగవాన్! నీవు అంతర్ధానముచెందగానే కమలాక్షులగు గోపకాంతల హృదయములు నీ కొఱకు పరితపించసాగెను. అప్పుడు - వారందరూ కలిసి ఆ వనములందు, ప్రభూ! నిన్నే వెతుకుచు తిరుగుచూ మిక్కిలివ్యధచెందిరి.
 
67-5
హా చూత। హా చంపక। కర్ణికార।హా మల్లికే।మాలతి।బాలవల్ల్యః।
కిం వీక్షితో నో హృదయైకచోర ఇత్యాది తాస్త్వత్ప్రవణా విలేపుః॥
5వ భావము
భగవాన్! వారందరూ ఆ వనములలో తిరుగుచూ - "ఓ! చూత (మామిడి) వృక్షమా! సంపెంగ వృక్షమా! పచ్చగన్నేరు వృక్షమా! మల్లికా - మాలతీ తీగలారా! మా హృదయచోరుడు మీకు ఎచ్చటైననూ కనిపించెనా?" అని ప్రతి చెట్టును - తీగను అడుగుచు, తిరుగుచూ విలపించిరి.
 
67-6
నిరీక్షితో౾యం సఖి।పంకజాక్షః పురో మమేత్యాకులమాలపంతీ।
త్వాం భావనా చక్షుషి వీక్ష్య కాచిత్ తాపం సఖీనాం ద్విగుణీచకార॥
6వ భావము
"చెలీ! పద్మనేత్రుడగు శ్రీకృష్ణుడు నా ఎదుట నిలిచినాడు!" అని ఒక గోపిక ఉద్వేగముగా పలికెను. భగవాన్! నిజమునకు ఆ గోపిక నిన్ను చూడలేదు. తన భావనలోమాత్రమే భావించినది. ఆ పలుకులు వినిన గోపికలలో - తాపమింకను అధికమయ్యెను.
 
67-7
త్వదాత్మికాస్తా యమునాతటాంతే తవానుచక్రుః కిల చేష్టితాని।
విచిత్య భూయో౾పి తథైవ మానాత్ త్వయా వియుక్తాం దదృశుశ్చ రాధామ్॥
7వ భావము
భగవాన్! ఆ గోపకాంతలు - వారు నీతోనే ఉన్న - భావనా భ్రాంతితో, నీ చర్యలను అనుకరించుచు ఆ యమునానదీతీరమున నీకై వెతుకుచు తిరుగసాగిరి. ఆ సమయమున వారివలె గర్వితురాలై - నీ నుండిదూరమైన - రాధ అను గోపిక వారికి కనబడెను.
 
67-8
తతః సమం తా విపినే సమంతాత్ తమో౾వతారావధి మార్గయంత్యః।
పునర్విమిశ్రా యమునాతటాంతే భృశం విలేపుశ్చ జగుర్గుణాంస్తే॥
8వ భావము
ప్రభూ! ఆ రాధతో కలిసి - ఆ వ్రజాంగనలు ఆ అరణ్యప్రాంతమునంతను - పూర్తిగా చీకటిపడు సమయమువరకు వెదికిరి. (కాని నీవు వారికి కనపడలేదు). ఆ కీకారణ్యములో వెదికి వెదికి చివరకు ఆ యమునానదీతీరమునకు తిరిగి వచ్చిరి; నీ మహిమలను గొంతెత్తి పాడసాగిరి; కీర్తించసాగిరి.
 
67-9
తథావ్యథాసంకులమానసానాం వ్రజాంగనానాం కరుణైకసింధో।
జగత్ర్తయీమోహనమోహనాత్మా త్వం ప్రాదురాసీరయి మందహాసీ॥
9వ భావము
భగవాన్! ఆ వ్రజాంగనలు - శోకతప్తహృదయములతో నిన్ను స్మరించుచుండగా , కరుణాసాగరా! ముల్లోకములను మోహపరవశులనుచేయు మోహనరూపమున – మందహాసముతో - ఆ గోపికలను మోహపరవశులనుచేయుచు, ఆకస్మికముగా వారి ఎదుట కనిపించితివి.
 
67-10
సందిగ్ధసందర్శనమాత్మకాంతం త్వాం వీక్ష్య తవ్వ్యః సహసా తదానీమ్।
కింకిం న చక్రుః ప్రమదాతిభారాత్ స త్వం గదాత్ పాలయ మారుతేశః॥
10వ భావము
భగవాన్! నీవు అంతర్థానమగుటచే దిక్కుతోచనిస్థితిలో ఆ ఉన్న గోపవనితల ఎదుట నీవు ఆకస్మికముగా కనిపించగనే వారు ఆనందభరితులయ్యిరి; తమ ఆనందమును వివిధరీతులలో వ్యక్తీకరించిరి. అట్టి కరుణార్ద్రహృదయా! గురవాయూరు పురాధీశా! నా రుగ్మతలను హరించుము.

దశమ స్కంధము
67వ దశకము సమాప్తము
-x-