నారాయణరావు (నవల)/ద్వితీయ భాగము

వికీసోర్స్ నుండి

౧ ( 1 )

మంగళగౌరి

శ్రావణమాసము. గోదావరి గాలులతో, వర్షపాతములతో, ముసురులతో, సూర్యనారాయణుని దాగుడుమూతలతో, సర్వత్ర పొడచూపు శాద్వలహారితవర్ణముతో వరదల బురదనీటి జేగురువర్ణముతో, నీలిమబ్బులతో మంగళవారము నాడు వీధుల తేలియాడు మందగమనల కౌశేయ వివిధ వర్ణములతో బ్రత్యక్ష మగును.

ఆడువారి మంగళవారములనోము లీ మాసమున ఏల ఏర్పడెను? వివాహమైన వెనుక నైదుసంవత్సరము లీ నోము నోచుకొనవలెనట. నోముపట్టిన పిమ్మట నే వత్సరముననైన నుద్యాపన చేయవచ్చునట. పెళ్ళిలో ‘సప్తపది’ నాడు ఉద్యాపన చేసికొనవలెను. ఆ వధువునకు మంగళసూత్రము మెడనుగట్టి, కాళ్లకు మట్టియలు దొడిగి, పాదాంగుళులపై మిఠాయి నుంచి, పదమూడు జతల యరిసెలు గిన్నెలోనుంచి, రవికెలగుడ్డ వాసినెగట్టి, పసుపు కుంకుమలతో వాయనమిచ్చి, యుద్యాపన చేసికొనవలెనట. శ్రావణ మంగళవారమునా డుదయమున నభ్యంగన మొనరించి, మడితో మంగళగౌరీదేవి నారాధించి కథచెప్పుకొని, యక్షతల శిరస్సున నిడుకొని, చలిమిడిగురుగులందు నావునేతితో దీపాలు వెలిగించి, యా పొగతో కాటుకబట్టి నేత్రముల నలంకరించి, మహానైవేద్యము, సెనగలు నైవేద్యము సమర్పణజేసి ముత్తయిదువులకు బసుపురాచి, బొట్టుపెట్టి, కాటుకనిచ్చి, గంధమలది, తాంబూలములతో సెనగల వాయన మీయవలెను.

శ్రావణ మంగళవారముల నూరిలోనున్న వనితామణు లొకరిపరిచయ మొకరు సంపాదించుకొని కుశలప్రశ్నము లొనర్చుకొనుచు, విడ్డూరముల నాడుకొనుచు, లోకాభిరామాయణము చెప్పికొనుచు, వీరిని వారిని ఆడి పోసుకొనుచు, నగల విషయ మడుగుకొనుచు గాలక్షేప మొనర్తురు. తమకున్న చీని చీనాంబరముల, బనారసు, బెంగుళూరు, మధుర చీరల ధరించి, రవికల తొడుగుకొని, యత్తరవు లలంది, పూవుల ధరించి, నగల గైసేసికొని, జట్టులుగా మందగమనములతో వోయారముతో దారిలో క్రీగంటి చూపులతో దేవతా స్త్రీలవలె పేరంటములకు బోవుదురు. చేతనున్న రుమాళ్ళయందు సెనగలు మూటగట్టుకొందురు. మాతలు శిశువుల నెత్తికొనియే బయలు దేరుదురు. విలాసవతుల హావభావముల గమనించి యువ్విళులూరుటకు వేషములు దాల్చిన కోడెగాండ్రు పనియున్న వారివలె నూరంతయు దిరుగుదురు. ఇంతలో నొక జడివచ్చిన బరుగిడలేక యెట్లో నొకపంచ జేరి వాల్గంటులజూచి దరహాసవదను లగుదురు. కొత్తపేటలో సూర్యకాంతమును, ఒక వత్సరము మానివేసినందున, మాణిక్యమును నోముబట్టిరి. తమయింట నాచారమున్నది గాన గోడలిచే నోము పట్టింపవలయునని సుబ్బారాయుడుగారు వియ్యంకునకు వ్రాసినారు.

పూర్ణిమ ముందు శుక్రవారమునాడు జమీందారుగారి యింట వరలక్ష్మీ వ్రతము జరిగినప్పుడు జానకమ్మగారు పూర్ణాభరణభూషితురాలై వరలక్ష్మీవలెనే వియ్యాలవారింటికి వెళ్ళినది. కోడలికి నిరువది కాసులును, వియ్యపురాలికి గోడలికి వెలగల చీరలును, బంగారు కుంకుమబరణియు నన్నూరురూపాయల వెండి బొమ్మసామాను మొదలగునవి శ్రావణపట్టి పట్టుకు వెళ్ళినది. జమీందారు గారు సోదరితో నాలోచించి యల్లునికి వేయిరూపాయల సరుకు లాషాఢపట్టీ పంపించినారు. కోడలిచే నోము నోపించి జానకమ్మగారు కోడలితోపాటు చారుమతీదేవీ కథ విని మూడవ వారమువరకు అచ్చటనే యుండుడని సుందరవర్ధనమ్మ గారు కోరుటచే నాగిపోయెను.

రాజమహేంద్రవరములో శారదతో నామె పెద్ద పెద్దవా రిండ్లకు కారుమీద వెళ్ళివచ్చినది.

మంగళ గౌరీదేవికథ వినినప్పుడు శారద మేనత్తను కథార్థము విపులముగా నడిగినది. బిడ్డలులేని భార్యాభర్తల తపస్సు, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్ష మగుట, ‘అయిదవతనము లేని బాలికయా, ఆయుస్సులేని బాలుడా వర’ మన్న ప్రశ్న. బాలుడు కావలెనని కోరుటయు, బాలుడు జనించుటయు, కుమారుని గొనిపోవ యమునిదర్శనము, పదునారవ యేట పదునారవరోజు గొనిపోయెద నని యముని వాగ్దానము (పండ్రెండవయేట, పండ్రెండవమాసాన, పండ్రెండవ దినాన నని కొందరిమతము), ఆదినము వచ్చుముందు కుమారుడు మాతులునితో మృత్యువును దప్పించుకొను మార్గము దొరకదాయని దేశములపాలగుట, వారట్లు పోవుచుండ, నొక నగర బాహ్యోద్యానవనమున గొందరు బాలికలు పూలు గోసుకొనుచుండ రాచవారి బాలయొక్క పూలు ఒలికిపోయి యెప్పటియట్ల చెట్లపై జేరుకొనుట, అది కనుంగొని మాతులు డా బాలను ఒప్పించి తన మేనయల్లునకు వివాహము చేయుట, ఆ బాలిక యింటికిపోయి, తల్లిదండ్రుల ఇచ్ఛచే నా బాలకునికి సరియైన కర్మకాండతో నతివైభవముగ పెండ్లి చేయుట మున్నగు వివరముల నెఱిగికొన్నది. ఆ బాలకుని మృత్యుదినంబునాటి రాత్రి, మృత్యువు పండ్రెండుతలల యాదిశేషుడై వచ్చి నిదురబోవు యువకుని కాటు వేయబోవుచుండ నచ్చట నా రాజకుమారి మిఠాయియుండ నునిచెనట. శేషు డా యుండపై కాటువేసెనట. ఆ బాలిక యొక యరిసెల పాత్రను జూపుటయు నాసర్ప మందు దూరెనట. తన కంచుక మూడ్చి యా పాత్రపై వాసెన గట్టినదట. అటువెనుక భర్త దేశాలు తిరుగబోయెనట. భర్త దేశాలు తిరిగివచ్చునప్పటికి ఆ పాము బంగారుపామై యుండెనట.

జానకమ్మ గారు సర్వ సౌందర్యాలు వెలిగిపోవు కోడలినిజూచి ఆనందపర వశురా లైనది. అటు నవమన్మథుడగు కుమారుడు, ఇటు సౌందర్యోజ్జ్వలయగు కోడలు, సాక్షాత్కరించిన రతీబాల. ఒకరికొర కొకరు జన్మించినారా!

ఆ రాత్రి జానకమ్మగారు కోడలికి ఉప్పు మిరపకాయలను, పారాణినీళ్ళు దృష్టితీసి, పారాణినీళ్ళు దొడ్డిలో దూరముగాను, ఉప్పు మిరపకాయలను నిప్ప లోను వేసినది. యెంత దృష్టితగిలెనో కాని ఘాటేమియు రాలేదట. ఈవింతను వరదకామేశ్వరీదేవి చూచి వెడనవ్వు నవ్వుకొన్నది.

శారద కివియన్నియు జిత్రముగా నుండెను. అత్తవారింటివారు బూర్వ సంప్రదాయములతో, బూర్వాచారములతో మెలగుదురు. తన పెద్దత్తగారు నిప్పులు కడుగును. మైలపడితి నేమోయన్న భయముచే బదిసారులు స్నానము చేయును. ఏ పర్వదినము వచ్చినను గోదావరికి స్నానమునకు బోవును. వంట వండుటకు వలయు జలమంతయు దానే తోడుకొనును. తక్కినవారి కొక నీళ్ళ బ్రాహ్మణుడు నీళ్ళుపోయును.

ఆ మరునాడు జానకమ్మగారు కొత్తపేట వచ్చి వేసినది.

జానకమ్మగారి కంత చేదస్తము లేకపోయినను ఆమెయు బూర్వాచారవతియనియే యెన్నవలెను.

వంటయింటిలోనికి బిల్లలెవ్వరు వెళ్ళగూడదు. వారి భోజనాలగది వేఱు. ఉదయము వారి వంటజేయవలసిన దచ్చటనే.

లక్ష్మీనరసమ్మ గారు భోజనము వేళ మంచినీరు త్రాగిన చెంబులోని నీటితో జేయికడుగనీయదు. పట్టుబట్టలగాని, మడిబట్టలగాని కట్టుకొనకుండ భోజనము చేయరాదు. బొట్టులేకుండ నుండరాదు. ఆమె మోమోటము లేకుండ నెట్టి వారిని లెక్కచేయకుండ నాచారము గమనించుడని బోధించుచుండును. శారద యత్తవారింట నున్న గృహప్రవేశపు రోజులలో ఆమె కాచారవిషయికములగు నీతు లెన్నియో పెద్దత్తగారు కఱపినది. తాంబూలము నమలుచు శారద పంటిలో దూరిన నలుసును చేతితో దీసికొని రుమాలతో దుడుచుకొనుచుండ లక్ష్మీనరసమ్మగారు చూచి ‘అయ్యయ్యో! యెంగిలమ్మా, తల్లీ! చేయికడుక్కోవమ్మా. ఆ రుమాలును పనిచేసేది తడిపి ఆరేసేగుడ్డలో వెయ్యి’ అని కోడలిచే నాపనులు చేయించినది.

‘ఏమే అక్కా! ఇంత చాదస్తం నీ కెప్పుడు తగ్గుతుందే?’ యని జానకమ్మ పాటపాడుచునే యుండును. అయిన నేమి లాభము?

లక్ష్మీనరసమ్మ వేదాంతురాలు. ఎప్పుడును వేదాంత గ్రంథాలు చదువు చుండును, చదివించుకొనుచుండును. ఆమెకు జుట్టముల గ్రామములందు పలువురు శిష్యురాండ్రున్నారు. వారందరు గురువుగారిని దర్శించుటకు వచ్చుచునే యుందురు. అప్పుడు గురువుగారి పాదాలకు నమస్కరించి, ఫలములు, రూపాయలు, వెండిగిన్నెలు దక్షిణలిచ్చి వేదాంతపు ముక్కలు చెవిలో వేసికొని యానందించుచుందురు. నోరూర జక్కగా వేదాంతోపన్యాసాలు చేయగలదామె.

‘జన్మం రజ్జు సర్పభ్రాంతి వంటిది. దారు పురుష భ్రాంతి, ఎండమావులు నీరను భ్రాంతి. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలు చంపుకోవాలి. లేకపోతే ఎరుకలోబడి తనబిడ్డ, తనమగడు, తనయిల్లు తన నగలు, తన సంసారము అని జీవుడు భ్రమించి పుట్టుటా గిట్టుటా అనే మాయలోబడి, మూత్ర పురీషాదుల్లో దొర్లి, అచలతత్త్వం గ్రహించలేక, ముక్తి పొందలేక ఉంటుంది. శుద్ధనిర్గుణమైన అచలతత్త్వం గ్రహించాలి. పంచాక్షరి జపిస్తూ ఉండాలి’ అని లక్ష్మీనరసమ్మగారు శిష్యురాండ్రకు బోధించుచుండును.

ఆమెకు బంచీకరణము కంఠస్థము. పండ్రెండు రాజులకథలు, ఇంద్రజాలపుగథలు క్షుణ్ణముగా వచ్చును. సీతారామాంజనేయము మంచినీళ్ళ ప్రాయము, శుద్ధనిర్గుణతత్త్వ కందార్థదరువులు ఎల్లప్పుడు పాడుకొనుచునే యుండును.

శారద కివియన్నియు పల్లెటూరి గొడవలని తోచినది. తనతల్లి కెప్పుడిట్టి ఛాందసములు లేవు. పట్టణవాసస్థులువచ్చి పల్లెటూళ్లలో నెట్లు జీవింపగలరో యని యామె తలపోసినది. అత్తవారింటి కథలన్నియు దల్లితో మేనత్తతో దనయింట నున్న యితర స్త్రీలతో జెప్పి నవ్వించినది.

అత్తగారు వెడలిపోయిన నాలుగురోజులలో శారద యుక్తవయస్కురాలైనది. జమీందారుగారింట మూడురోజు లుత్సవములు విందులు జరిగినవి. దినదినము పేరంటాండ్రు విచ్చేసినారు. పంచదారతో జిమ్మిలిగొట్టి పంచినారు. బ్యాండుమేళము వచ్చినది. పంక్తినాడు సూర్యకాంతము, మాణిక్యాంబ జమీందారు గారింటికి వచ్చి పంక్తిజరిపి వెలగల బహుమతులు, చీనిచీనాంబరముల నిచ్చి వెడలిపోయిరి. నగరమునందున్న వారి నెందరినో స్త్రీ, పురుషులను భోజనములకు బిలిచినారు.

నవనాగరికుడై వీరేశలింగాఖ్యుని ప్రియశిష్యుడైన జమీందారుగారు నేడు పల్లెటూరివారితో వియ్యమంది ఛాందసపు పూర్వాచార పిశాచగ్రస్తులైనారని పలువురు విచారించిరి.

యజ్ఞోపవీతముగూడ దీసివేసి అనుష్టానిక బ్రాహ్మసామాజికుడైన శ్రీనివాసరావుగారు మిత్రుని జూచి ‘ఆడపిల్లకీడురావడమనేది శరీరంలో జరిగే ఒక మార్పుకు చిహ్నం. దానిని లోకానికి టాంటాంజేయడ మంత మొరకుదనం ఇంకోటుందా’ యని ప్రశ్నించిరి.

‘అది నాకు ఇష్టంలేదు కాని, అది మొరకుతనమని మనం గ్రహించింది పాశ్చాత్యుల సంపర్కం చేతనేనా! మనవాళ్ళ పూర్వాచారాలు అనేకం ఈ నాటికి మూఢత్వము అని అనుకుంటున్నాము. ఇదివరదాకా మోటుతనము అని అనుకునేవి నేడు నాజూకువి అయ్యాయి. మనవాళ్లు స్త్రీ, పురుష సంబంధ విషయములయిన చర్యలన్నీ వెల్లడిగా ఉంచారా లేదా!’

‘అదేగా నేను పనికిరాదు అనేది!’

‘ఉండవోయ్! కాని ఇప్పుడింగ్లీషువాళ్ళు ఆడవాళ్ళ మోకాళ్ళపైకి గౌన్లు తొడిగి వక్షోజములు సగం కనపడేటట్టుగా కట్టి తిరగడము, బట్ట ఉందా లేదా అన్నట్లుగా లంగోటీలు కట్టి మగవాళ్ళతో ఈత లీదడము, ఈ రకముగా ఉన్నారు. వాళ్ళనుబట్టి మన వాళ్లుకూడా దుస్తులు అనుకరిస్తున్నారు. కాని అటువంటి దుస్తులు ధరించిన ఆడవాళ్ళను కౌగలించుకొని వందలకొలది జట్టులుగా నాట్యమాడుతూ తిరిగే పురుషులు, స్త్రీలదగ్గిర స్త్రీ రహస్య విషయాల్ని సూచనగా నైనా అనకూడదు. డాక్టర్లుమాత్రం వచ్చి రహస్యాలు మాట్లాడవచ్చును. మొగవాళ్ళే పురుళ్ళు బోయవచ్చును. మనవాళ్లో? కాస్త ఒళ్లు కనబడితే సిగ్గు లేని రట్టుమనిషి అంటారు. ఆడ డాక్టర్లు తప్ప ఎవ్వరూ రహస్యభాగాలు పరీక్ష చేయగూడదు. విడిగా మగవానితో ఉండకూడదు. స్నానాలకుకూడా గోదావరిలో పురుషులుండ గూడదు. కాని సమర్తలని గర్భాదానాలని ఉత్సవాలు చేస్తారు. ఇదంతా నీ దృష్టిపథంలో ఉంది. ఒకటి మొరకుతనం, ఒకటి నాజూకుతనం అని వాటి నుదుటిమీద రాసిలేదోయి శ్రీనివాసు!’

‘అలాగా?’

౨ ( 2 )

అమెరికాయాత్ర

రామచంద్రరావు జపాను చేరుకున్నాడు. జపాను దేశములో నొక నెల యాగి, యాదేశమునందున్న వింతలన్నియు దిలకించి, యానందించి మఱి యమెరికా వెళ్ళవలెనని సంకల్పము. రంగూనులో నుండగానే అతడు జపాను వెళ్ళుటకు, అమెరికా వెళ్లుటకు నారాయణరావు చేసిన కృషి వల్ల ‘అనుమతి పత్రములు’ రంగూనులోనున్న ఆంధ్రులలో గొప్ప షాహుకారగు పుల్లంరెడ్డిగా రిప్పించినారు.

రామచంద్రరావు తండ్రి భీమరాజుగారి స్నేహితుడగు అమరచందు గిరిధారిలాలను గుజరాతీ వర్తకుడు రామచంద్రరా వోడ దిగుటతోడనే యెదుర్కొని యాతని తనఇంటికి తీసికొనిపోయెను. గిరిధారిలాలుకు అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాను, ఫ్రాంసు, ఇటలీ, ఇంగ్లండు, రష్యా, చీనా మొదలగు దేశములతో వర్తకసంబంధ మున్నది. అతడు వివిధ దేశములకు జాలసారులు ప్రయాణము చేసియున్నాడు. కాబట్టి ఆయన మనస్సులో రామచంద్రుని వెనుకకు బొమ్మని చెప్పుట కిష్టము లేకుండెను. అయినను మిత్రునియాదేశము చొప్పన రామచంద్రుని జూచి భోజనమైన వెనుక నిట్లనెను. ‘రామచందర్! మీకు ముక్కుపచ్చలారింది లేదు. మీరు చిన్నవాళ్లు! దేశం కొత్తది. చాలా మాయకోరులుంటార్. మీరు ఎనక్కిపోయి కాశీలో లక్నోలో కలకత్తాలో చద్వవచ్చును కాదుఅండి? అక్డకూడా చాలా ఎక్వ చద్వు చెప్తార్ కాదా?’

‘మీకూ, మా తండ్రిగారికీ ఉండే స్నేహాన్నిబట్టి అల్లా చెప్తారు కాని, నా మనస్సు నిశ్చయం అయిపోయింది. ఇంక ఎంతమాత్రము నా సంకల్పము మార్చుకోలేను, మార్చను. మీరు పెద్దలు, నాతండ్రితో సమానులు. మీరు చెప్పడం, నేను వద్దనడం బాగుండదు.’

‘సరే! సరే! మీయిష్టం, పర్వాలేదు. నేను అంతా జాగ్రత్త కనుక్కుంటాను. మాచుట్టం ఒకాయన లాల్ చంద్ జీవన్ లాలు న్యూయార్కు పట్నములో మకాం. ఆయనకు ఉత్తరం రాస్తా. మీకూ ఒక ఉత్తరం ఇస్తాం.’

‘చిత్తం. మీ మేలు ఎప్పటికీ మరిచిపోను.’

‘మీ నాయన గారు నాకు, మీకు యివ్వమని, డబ్బుపంపినారు. అది మీకు ఇస్తాను. జాగ్రత్తగా ఉండండి. చాలా చిన్న వాళ్ళు.’

‘చిత్తం. చిత్తం.’

మరునాడు పుల్లంరెడ్డిగారు అమృతలాలు గారి హర్మ్యమునకు విచ్చేసి రామచంద్రుని గూర్చి వాకబు చేసెను. పుల్లంరెడ్డిగారు, ఆమృతలాలుగారు చాలాకాలమునుండి స్నేహితులు, ఒకరన్న నొకరికి గౌరవము.

పుల్లంరెడ్డిగారు అమలాపురం తాలూకా పేరూరు గ్రామవాసులు. చిన్నతనములో కూలికై రంగూనుపట్నమువచ్చి సహజమేధాసంపన్ను డగుటచే త్వరలో మేస్త్రీ అయి, ధనము నిలువచేసికొనెను. తాను గూలికి కుదిరిన గుజరాతీ షాహుకా రొక వ్యాపారమునకై తన్ను సింగపూరు పంపినప్పుడు, పుల్లంరెడ్డి తనకడ నున్న ధనమునంతయు నొడ్డి స్వయముగా వ్యాపారము చేసి సింగపూరునుండి వచ్చులోపల నిరువదియైదు వేలు లాభము నొందెను. తన షాహుకారుపనిగూడ చాల శ్రద్ధమై, లాభకరముగ నెరవేర్చి రంగూను వచ్చి వేసెను. చదువురాని పుల్లన్న అంతటనుండి పుల్లంరెడ్డియై, షాహుకారు తనకొక యణా భాగమీయ, నాయన వర్తకములో భాగస్వామియయ్యెను. నాటి నుండియు పుల్లంరెడ్డి పట్టినది బంగారమై, యాతని ధనము నాలుగు లక్షల వరకు బెరిగినది. నలుబదవయేట తన షాహుకారనుమతీయ దాను వేరుగా వ్యాపారముచేసి పదియేళ్లలో నిరువదిలక్షల సంసారియు, ‘రావుబహదూరు’ నై పాశ్చాత్యులచే ‘పులియన్ రెడ్డి’ యని వాకొనబడుచు, దానకర్ణుడై రంగూను నాగేశ్వరరాయుడని ప్రఖ్యాతి వహించినాడు.

రంగూన్ లో నాంధ్రులందరును గూలిచేయువారలే. కొంతమందిమాత్ర ముద్యోగములు చేయుచుండిరి. వర్తకము చేయువారు మరియు తక్కువ. వారిలో గొలదిమందియే భాగ్యవంతులు. రంగూన్, మోల్ మేన్ మొదలగు ప్రదేశములలో నెక్కువగాను, దక్కిన దేశమునం దచ్చటచ్చట చాలదక్కువ గాను, ఆంధ్రులు బర్మాదేశమునకు వలసపోయినారు. సముద్రములుదాటి, దూర దేశములకు వర్తక మొనర్చుటకు, మత ప్రచారమునకు, రాజ్యస్థాపనకు పోయిన తొల్లిటి మనయాంధ్రుల సాహసోత్సాహముల దలంచుకొని, నేటిమనభీరుత్వమును అలసతను, పురుషార్ధ శూన్యతను చూచుకొన్నచో సిగ్గగునుగదా! నేటికిని పొట్టలు చేత బట్టుకొని బర్మా, నేటాలు, మలేద్వీపము, అస్సాములకు బోవుచున్న కూలీలుతక్క మనలో పురుషకారపరులు కానరారు. బర్మాలో తెలంగులను నొక జాతి వారున్నారట. వారేపల్లవుల కాలములోనో, చాళుక్యుల కాలములోనో, లేక కాకతీయుల కాలములోనో ఆ సువర్ణ ద్వీపము జేరియుందురు. తన పదియవ యేటనే ఆంధ్రులచరిత్ర చదివి వినిపించుకొనియున్న పుల్లంరెడ్డిగారు, రామచంద్రరావు సాహసమున కెంతయు మెచ్చుకొనిరి. రెడ్డిగారు నలువదియవ యేట చదువను వ్రాయను నేర్చుకొన్నారు. అయినను తనకు భారతరామాయణాదులగు పూర్వకాలపు టాంధ్రగ్రంథములను, ఆంధ్రులచరిత్ర మొదలగు నూతనయుగపు గ్రంథములను జదివి వినిపించుటకు విద్యాధికు నొకని నేర్పరచుకొన్నారు.

వెంకటరత్నం నాయుడు గారు మొదలగు మువ్వురు ముఖ్యులచే రెడ్డిగారికి నుత్తరములు వ్రాయించి పుచ్చుకొని, తన బావమరది బాలకుడనియు, నాతనికి వలయు సహాయమొనర్చి తన కుటుంబపు కృతజ్ఞతకు బాత్రులు గావలయుననియు వ్రాయుచు గమ్మలన్నియు నారాయణరావు రెడ్డిగారికి బంపించెను. రంగూనులో నుండి వార్తాపత్రిక నెలకొల్పి యనేక విధముల నాంధ్రులకు సహాయ మొనరించు ఆవటపల్లి నారాయణరావు గారికిగూడ నారాయణరా వుత్తరములు వ్రాయించినాడు.

రెడ్డిగారివలన, నమృతచందువలన, నారాయణరావుగారివలన పెక్కు విధములగు సలహాలనొంది రామచంద్రరావు జపాను వెళ్ళినాడు. టోకియో, యోకొహామా మొదలగు నగరములు, ధ్యానబుద్ధుని, ఫ్యూజియామాపర్వతమును రామచంద్రరావు దర్శించెను. జపాను విశ్వవిద్యాలయములను రసవిహారి బోసు గారి సహాయమున దర్శించెను. బోసుగా రనేక పరిశ్రమాగారములనుగూడ జూచుటకు సౌకర్యములు సమకూర్చినారు. బొమ్మలు, కాగితములు, గ్లాసు సామానులు, కత్తులు, సూదులు మొదలగు లోహపుసరుకులు, బొత్తాములు, పూసలు, దువ్వెనలు, వస్త్రములు, రబ్బరు సరుకులు, మందులు, నింక నెన్నియో వస్తువులను జపానుదేశము భారతదేశమున కెగుమతి జేయుచున్నది. ఆ కర్మాగారములలో బెక్కింటిని రామచంద్రరావు కనుగొనెను.

హిందూదేశము తన్నావరించిన దౌర్భాగ్యపిశాచమును వదల్చుకొని మరల సర్వతోముఖముగ నెప్పటికి విజృంభించగలదో యని రామచంద్రరావు నిట్టూర్పు నించెను. నారాయణరావునకు గొన్ని కుంచెలు రంగులు కొని రామచంద్రరావు పంపించెను.

రామచంద్రరావు అమెరికాకు వెడలుదినము సమీపించినది. రాజకీయ కారణమువలన జన్మభూమిని విసర్జించి జపాను దేశమును బెంపుడుతల్లి నొనరించుకొని, కలలలో, జాగ్రదావస్థలో గంగానదిని, కాళీఘట్టమును, హిమాలయ పర్వత శ్రేణిని స్వప్నములగాంచు రసవిహారుడు రామచంద్రరావును గవుంగి లించుకొని ‘బాబూ! అప్పుడప్పుడీ దేశము వచ్చు భారతీయులే నాకు భారత దేశము సుమా! వారి మూర్ధములందు హస్తతలములందు నా వంగదేశపు పంట భూములను, శేఫాలికా జపాకుసుమములను నాఘ్రాణించుచు వారి కన్నుల కాంతిలో నా గంగానదీ పావనోదకముల దర్శించుచు, వారి నుదుటిలో నా దేశపు నీల గగనాల ప్రత్యక్షించుకొందును.

‘పంజాబ్ సింధు గుజరాత మరాటా ద్రావిడ ఉత్కల వంగా

వింధ్యహిమాచల యమునాగంగా ఉచ్చలజలధితరంగా’

‘నువ్వు బాలుడవు. నా దేశమాత ముద్దుబిడ్డను. నా సోదరుడవు. అహో రామచంద్ర! నువ్వు నాలుగేళ్లకయిన మనతల్లికొడిలో నాడుకొందువు. మన తల్లి మట్టిలో దొర్లుదువు. మనమాత యిచ్చిన ఆటవస్తువులతో గేరింతలాడుదువు. ఆ పవిత్ర వాయువులు పీల్చెదవు. ఆ యమ్మ చనుబాలు గోదావరి పావనోదకాలు త్రాగుదువు. పో! పో! ఒక్కసారి నన్ను కౌగిలించుకో. మరల నింటిదారి నిటు వచ్చిన సంతోషించెదను. అమెరికా జేరిన వెంటనే నాకు జాబు వ్రాయి’ అని యాతని నా తరణిలో దిగవిడిచి గట్టునకు విసవిస వెడలిపోయినాడు.

టంగ్ టంగ్ మని గంట మ్రోగి తుదికూత నుచ్చైస్వనమునగూసి యా యోడ పెద్ద చప్పుడుతో యోకొహామారేవు వదలినది. రామచంద్రుడు రసవిహారిబాబు మొదలగు భారతీయుల సలహాచే మొదటితరగతి టికెట్టు పుచ్చుకొన్నాడు.

అమెరికా దేశము బీదలను రానీయదు. డబ్బుగల వారిని గౌరవించును. విద్య నేర్చుకొనుటకు వచ్చినను సరియే, నిర్భాగ్యుడు అమెరికా దేశమున ఉపజీవి క్రిమి (ప్యారాశైట్) వలె సంచరించుటకు వీలులేదు. భరతభూమి కన్న పెద్దదియైనను నచ్చట పదికోటులజనులుమాత్ర మున్నారు. వారికి అమెరికా చాలదట. అమెరికనులు రంగుజనులను తమ కుక్కలు, పిల్లులు, గుఱ్ఱములకన్న హీనముగ జూతురు. నల్ల నీగ్రోలు, చైనా జపాను దేశముల పసుపుపచ్చని మంగోలియనులు, ఆదిమనివాసులగు ఎఱ్ఱఇండియనులు, వివిధ వర్ణములు కలవారైన హిందూ దేశస్థులు వారిదేశములో నివసించి అమెరికనులు కాగూడదట. తాత్కాలికముగ కొలది సంవత్సరములుమాత్రము నివసించి పోవలయునట. నీగ్రోజాతివా డేదైన తప్పు చేసినచో, న్యాయస్థానములకు గొనిపోయి విచారించకుండగనే ప్రజలు వాని నురిదీయుదురు. లేదా స్తంభమునకుగట్టి కిరసను నూనెలో తడిపిన కఱ్ఱలను బేర్చి కాల్చుదురు. వానిని గుఱ్ఱములకుగట్టి, చచ్చునంతవరకు రాళ్లమీద నా గుఱ్ఱమును పరుగెత్తింతురు.

హిందూదేశ మమెరికనుల దృష్టిలో నొక చిత్రభూమి. భారతీయులకు మతములేదు. రాళ్లను రప్పలను గొలిచి రౌరవాది నరకమునబడు మూర్ఖులతో భరతభూమి నిండియున్నదట. కాన కోటీశ్వరభూమియగు నమెరికా, భారతభూమికి క్రైస్తవ మతప్రచారకుల బంపుచుండును. భారతభూమిలోని రాజాధిరాజులైనను, అమెరికాలోని గొప్ప హోటళ్ళలో బస చేయుటకు వీలులేదు. అమెరికా రైళ్ళలో ‘పుల్ మాను’ అను నుత్తమతరగతి బండ్లలో ప్రయాణము సలుపకూడదు.

ఉత్తంగములై లేచు సముద్రవీచికల గమనించు చూపులతో రామచంద్రు డమెరికానుగూర్చి యాడిపోసిన పంజాబీయుడగు నొక సిక్కు సోదరుని మాటలను దలపోయుచు నౌకా ముఖ్యోపరిభాగమున నడ్డముగా గట్టిన యినుపగొట్టపుకడ్డీల నానుకొని నిలుచుండి యుండెను.

జపాను దేశము నిన్ననే కొన్ని వందలమైళ్ళదూరాన మాయమై పోయినది. రాత్రియంతయు వివిధాలోచనలతో నిదురరాక, పన్నెండుగంటలకు గొంచెము కన్నుమూసి, తఱువాత నావికులు మ్రోయించిన నాలుగు గంటల చప్పడువిని మోము కడుగుకొని, శుభవస్త్రముల ధరించి, యాబాలకుడు ఓడ పైతట్టునకుబోయి సముద్రమున సూర్యోదయాద్భుతము కనుంగొనవలెనని వేచియుండెను.

ఎటు చూచినను సముద్రమే. ఆ కనుచీకటిలో ఆకసము, నీరధి ఏకమై పోయినవి. ఊయెలవలె నా మహాతరణి యిటునటు నూగుచు పోవుచున్నది. ఓడలోని యంత్రముల పెనుమ్రోతలు రామచంద్రుడున్న తావునకు మద్దెల మ్రోతవలె మాత్రము వినవచ్చుచున్నవి. ఆ శ్రుతిమేళవింపులో ఓడను ముందునకుద్రోయు ఆకుచక్రములు నీటిలో నపరిమిత వేగమున తిరుగు కవ్వపు మ్రోతయు, ఓడ ముందుభాగమున ఉక్కు (కీల్) బద్దియ నీటిలో మహావేగముగ గోయుచు బోవు గంభీర నాదమును లీనమై ఉత్కృష్ట గీతికయై యాతని హృదయమును రంజించినవి.

కలలలో, కథలలో, గ్రంథములలో, వార్తాపత్రికలలో వినబడిన విదేశకంఠములు, విదేశశబ్దములు నేడు వినిపించినప్పుడు, నూతనవర్ణములు, నూతన రేఖాప్రవాహములు, నవీన వస్తుసంబంధములు నేడు గోచరించునప్పుడు రామచంద్రుని కంతయు విచిత్రమై, విస్మయమై మాయాపూర్ణమై కనంబడి యాతడు నిస్తబ్ధుడైపోయినాడు. తాను మున్నెన్నడు విననివియు, నూహింపనివియు నగు నద్భుత సందర్భము లచట సర్వసామాన్యములై తోచి యాతనికి గనులు మూయని కలలైపోయినవి.

ఇంతలో నెవరో యాతని భుజముపై తట్టినారు.

౩(3)

జపాను

రామచంద్రరా వులికిపడి వెనుదిరిగి చూచెను. జపానులో రసవిహారుని గృహమునందు దనకు స్నేహితుడై ఆ యోడలోనే అమెరికా పోవుచున్న సర్దారు ఆర్జునసింగుగారును, చెంతనొక యమెరికాదేశీయుడును, ఒక అమెరికా బాలికయును నిలిచియున్నారు.

‘అయ్యా! ఈ బాలుడు మా హిందూదేశములో దక్షిణాపథమందున్న ఆంధ్రదేశస్థుడు. ఉత్తమబ్రాహ్మణుడు. బుద్ధవరపు రామచంద్రరావు. మీ దేశము చదువునకు వచ్చుచున్నాడు. రామచంద్రరావ్ జీ! వీరు న్యూయార్కు పట్టణ వాసస్థులు. రౌనాల్డుసన్ గారు. సుప్రసిద్ధ డాక్టర్లు, వడ్డి వ్యాపారస్థులున్ను, అనేక కంపెనీలలో పెద్ద షేర్లున్న వారునుకూడ వీరికి దాసానుదాసులు. ఆమె వారి తనయ, ఆమె బి.ఏ ఆనర్సు హార్వర్డులో జదువుచున్న లియోనారాకన్య.’

డా. రౌనా: రామచంద్రరావుగారు! మాకు మిమ్మును చూడడం చాల సంతోషం.

లియో: నమస్కారములు రామచంద్రరావు గారూ!

రామచంద్రునకు జాల సిగ్గువేసినది. పరదేశయాత్ర ప్రారంభించినది మొదలు రామచంద్రుడు విదేశీయులతో ననవసర సంభాషణ నెన్నడు చేయలేదు. ఇంగ్లీషు భాషతప్ప మరేవిదేశీయభాషయు రామచంద్రునికి రాదు. పెద్దవారితో జనువుగా మాట్లాడుట చిన్నతనమునుండియు నెరుంగడు. తండ్రికడకూడ భయభక్తులతో సంచరించువాడు. కాబట్టి రామచంద్రుడు నమస్కారమని మిన్నక నిలిచెను.

అర్జున సింగ్: రామచంద్రరావుగారు మెత్తనిహృదయము కలవాడు. మా దేశములో గొంచెము తలయెత్తుకొని తిరుగు కుటుంబములోనివాడు. అమెరికా దేశమునందు జ్ఞానము సరస్సులుకట్టియున్నదని యాయన నమ్మకము. ఆ జ్ఞానము మనసార గ్రోలవలెనని తలంపు.

డా. రౌనా: రామచంద్రరావు గారూ! బ్రాహ్మిన్సు మీ దేశం వదలి వెడితే నరకములో పడతారటకాదా! మీ రేల వచ్చారు?

రామ: ఇప్పుడంత పట్టింపులు లేవండి.

లియో: కులము తేడాలు పుట్టుకతోనే వుంటాయటకాదూ? వారు వీరిని, వీరు వారిని వివాహము చేసుకోకూడదట, భోజన ప్రతిభోజనము లుండవట?

రామ: అవునండి. మ ... మ....

డా. రౌనా: మీ సిక్కులుగూడా హిందువులేనా అర్జునసింగుగారూ? అర్జున: హిందూదేశములో వున్న క్రైస్తవులూ హిందువులే.

లియో: ఏలాగు?

అర్జున: అమెరికా దేశములో జ్యూమతస్థులున్నారు. మహమ్మదీయులున్నారు. బౌద్ధులున్నారు. వీరందరూ అమెరికనులే. హిందూదేశములోని వారంతా హైందవులు.

డా. రౌనా: (నవ్వుచు) అలాగా! అయితే క్రైస్తవులూ, మీరూ హిందూమతస్థులు కారన్నమాట.

అర్జున: మామతం సర్వమత సమ్మతము. అన్ని మతాలను తల్లివలె హిందూమతం కడుపులో పెట్టుకుంటుంది. హిందూమతంలో ఉన్న లోటును తీర్చడమునకు శ్రీ నానకు సింగు గురుమహారాజ్ సిక్కుమతము ఉద్భవింప జేశారు. కాబట్టి సంఘసంస్కరణరూపమైనది మా మతం. అలాంటి అంతర్మతాలే బౌద్ధ జైనమతములున్ను, ఇప్పటి బ్రాహ్మసమాజము, ఆర్యసమాజము, సత్సంగసమాజము మొదలైనవిన్నీ.

లియో: ఈ సంఘసంస్కరణ మతాలలో బ్రాహ్మణు లున్నారా?

అర్జున: లేరు. ఈ మతాల్లో చేరిన వారికి వర్ణ భేదము ఉండదు.

డా. రౌనా: ఒక సంఘమువారికీ ఇంకో సంఘంవారికీ వివాహాలున్నవా?

అర్జున: లేవు. కాని ఏ పిల్లనైనా వారు చేసుకొనుట కభ్యంతర పెట్టరు. దానినిబట్టి వెలితప్పులేదు.

లియో: ఆంధ్రదేశం అన్నారు. అదేమిటి?

అర్జున: హిందూదేశములో పదిహేనో పదహారో పెద్దభాష లున్నవి. అందులో ఆంధ్రభాష లేక తెలుగుభాష ఒకటి. ఆ భాష మాట్లాడే జనులు మూడుకోట్లపైన ఉన్నారు.

లియో: అమెరికాలో ఏమి చదువుకొనుటకు వచ్చుచున్నారండి రామచంద్రరావు గారూ?

రామ: ఆఁ... ఉఁ... లెక్క లండి.

లియో: ఏ విశ్వవిద్యాలయములో?

రామ: జపానులో స్నేహితులు యేల్ విశ్వవిద్యాలయములోనో లేక హార్వర్డులోనో చేరమన్నారు.

లియో : మీ దగ్గిర శిఫారసు ఉత్తరా లున్నాయా ?

రామ : నాలుగైదున్నాయండి.

లియో : హార్వర్డులో చేరండి. నేను ఎమ్. ఏ. చదువుచున్నాను, విద్యుచ్ఛక్తి అభిమానశాస్త్రంగా. తర్వాత అమెరికాకు శాస్త్ర పరిశోధనములో తండ్రి, మహావిద్వాంసుడు, విద్యుచ్ఛక్తిచే వూడిగంచేయిస్తున్న మంత్రవేత్త థామస్ ఎడిసన్ గారి విద్యుచ్ఛక్తి కర్మాగారాలలో కృషి చేయవలెననియూహ.

రామ: అలాగాండి. హార్వర్డు బాగుంటే అక్కడే చేరుతాను.

డా. రౌనా: మీ దేశంలో వైద్యసహాయం చాల తక్కువట కాదా?

అర్జున: అవునండి. మీ మిషనరీలు మా దేశ దౌర్భాగ్యములన్నీ గ్రంథములలో వ్రాసినారు. పాపం మిషనరీలే లేకపోతే మాదేశం ఈపాటికి నీగ్రో దేశంవలె అయిపోయియుండును.

రామచంద్రుని వినయసంపదయు జ్ఞానసముపార్జనా తీవ్రోత్కంఠతయు డాక్టరు రౌనాల్డుసన్ గారి హృదయమును జూరగొన్నది. రామచంద్రుడు చక్కని ఇంగ్లీషుభాషలో తన దేశస్థులు, తన మతము, తన దేశములోని రాజకీయాందోళన, గాంధిగారి వర్తమాన కార్యక్రమము మొదలైనవానిని గూర్చి ఆయనకు దెలిపినాడు. గాంధీమహాత్ముని యుపదేశములు ప్రజా సామాన్యమునకు బాగుగా నచ్చినవనియు, నుద్యోగ వాంఛాపరులగు విద్యాధికులకు మాత్రము పదవులపై నాశ వదలలేదనియు తెలిపినాడు.

డాక్టరు రోనాల్డుసన్ అమెరికాకు ప్రథమమున వలసపోయిన పిలిగ్రిం ఫాదర్సు (యాత్రిక వృద్ధులు) సంతతివాడు. ‘నీలిరక్తము’ (అచ్చరక్తము) ప్రవహించు ఉత్తమకుటుంబములోనివాడు. కష్టపడి చదువుకొని అమెరికాలోని గొప్పవైద్యులలో నొకడై భాగ్యవంతుడై గౌరవము సంపాదించుకొన్నాడు. సదయహృదయుడు, నీగ్రోల బానిసత్వము సంపూర్ణనాశనము చేయవలెనని వాదించు నానుష్ఠానిక క్రైస్తవుడు. క్రైస్తవమతము చర్చిమత మైనదనియు, యేసుక్రీస్తు బోధించిన మతము మహోత్కృష్టమైనదనియు అందలి పరమార్థమును గ్రహించినవారు కొలదిమందియే యనియు రౌనాల్డుసన్ వాదించును. హోల్మ్సు మతగురువు బోధ రౌనాల్డుసన్ మహాశయునకు బూర్తిగా నచ్చినది. అన్ని శక్తులలో బ్రేమశక్తి దొడ్డది. ప్రేమయే భగవత్స్వరూపము. సూర్యుడు మంచును కరగించునట్లు, పేమ పాషాణ హృదయమునైన ద్రవింపజేయును. ప్రేమ జగమును వెలిగించు దివ్యజ్యోతి. ప్రేమ లేనినాడే క్రోధము, హింస, స్వలాభము, మాయ, అహంభావము, అసత్యము విజృంభించును. లోకమునందలి యుద్ధములు, దొంగతనములు, వర్తక కౌటిల్యము మొదలగు దుర్గుణములకు గారణము ప్రేమలేమియే యని యాయన స్నేహితులతో వాదించుచుండును.

పరదేశ స్వతంత్రత, యుద్ధరాహిత్యము, వర్ణభేదవిచ్ఛేదనము మున్నగు నాశయములతో పనిచేయుట కమెరికా దేశములో నెవ్వరు ప్రయత్నించుచున్నను వారికి రౌనాల్డుసన్ తన చేతనైన సహాయము జేయుచుండును. సన్‌డర్ లాండు, హోల్మ్సు, శాసనసభికుడు బోరా మొదలగువారాయన స్నేహితులు. ‘రామచంద్రగారు! అమెరికా దేశ ప్రజలు విచిత్రభావములు కలవారు. స్వతంత్రతకై ప్రయత్నించు ప్రజలకు జయము గోరుదురు. జయము గాంచినచో మిక్కిలి సంతసించెదరు. కాని ఫిలిప్పైనుదీవులను వారు వదలరు. వారి క్రైస్తవ మతము సర్వ దేశముల వ్యాపింప కోట్లకొలది డాలర్లు ఖర్చుచేసెదరు. తమ దేశస్తులకు క్రీస్తు ఉపదేశవాక్యముల నేర్పుటకైనను రాగిడబ్బు ఖర్చుచేయరు. తాము ఆంగ్లదేశముపై శఠించి విడిపోయి స్వతంత్రత సముపార్జించుకొన్నారు. హిందూదేశము స్వతంత్రతకై సర్వస్వము ధారపోయుచుండ, క్రైస్తు అవతారమనదగు మహాత్ముని గూర్చియు, హిందూదేశమును గూర్చియు నీలి వార్తలు ప్రకటించెదరు. కాని ఎన్ని చెప్పినను చదువుకొన్న ప్రతి అమెరికనునకు హిందూదేశము మాయాసంపూర్ణము, సర్వమతజనని, సర్వకళాశ్రయము, సర్వాద్భుతనిలయము. ప్రతిహిందువుడు కవి, వేదాంతి, భక్తుడు. ఊహా ప్రపంచ సంచారి. కాబట్టియే, ప్రతి ఏట అనేకులు అమెరికనులు హిందూదేశ యాత్ర గావించెదరు. కోట్లకొలది ధనము ఖర్చు చేసెదరు. క్రిందటి సంవత్సరము నుండియే నేను, మా అమ్మాయి ఆసియాను దర్శించ ప్రారంభించినాము. అదివర కమెరికాఖండములలోని దేశము లొకవత్సరము, యూరోపియను దేశము లొకవత్సరము చూచినాము.’

లియొనారాకన్య తల్లి ఇటాలియను. అప్పటికే ప్రసిద్ధికెక్కి, సంపూర్ణ యౌవనములోనున్న డాక్టరు రౌనాల్డుసన్ గారికడ చికిత్స బడయుట కామె విచ్చేసినప్పుడు వైద్యుడు రోగియు ఒకరినొకరు ప్రేమించుకొన్నారు. మ్యారియానా, కౌంట్ గ్యాలెటీ ఫెబియానో గారి కుమార్తె. తండ్రి ఇటలీదేశము తరఫున రాయబారియై వాషింగ్టన్ పట్టణములో నున్నప్పుడు బాలిక యగు మ్యారియానాప్రభుకుమారికి హృదయరోగము సంభవించి హృదయరోగ చికిత్సాదక్షుడగు రౌనాల్డుసన్ గారి వైద్యమునకై గొనిపోబడినది. దేహసంబంధ మగు హృదయరోగమును మాన్పి, మనస్సంబంధమగు కామరోగమును గల్పించినాడు ధన్వంతరి రౌనాల్డుసన్. తమ కుమార్తెను అపరిమితముగ బ్రేమించు ఫేబియానో బ్రభుదంపతులు తుదకు వారిరువురి వివాహమునకు సమ్మతింపవలసి వచ్చినది.

ఆ రౌనాల్డుసన్ దంపతుల గర్భమున చంద్రకిరణమువలె లియోనారా జనించినది.

లియోనారా స్వప్నకుమారి. మధుర మధురముగ సంగీతము పాడగలదు. లాటినుదేశస్తుల బ్రునెటీ (నల్లజుట్టు కలవారు) యందము, నార్డుజాతివారి స్వర్ణకేశసంపద, నిర్మలనీలదృష్టి, స్నిగ్ధశరీర ధావళ్యము నామెలో బ్రతిఫలించి, లియొనారాను అమెరికా బాలికలలో ఆనాటి అందగత్తెలలో రాణిని జేసినవి, ఆధ్యాత్మికానుభవ విషయములన్నియు నామె హృదయమును చలింపజేయును. హిందూదేశము, చీనా, జపాను, బర్మా, జావా, బలి, సింహళ దేశముల చరిత్రలు, కథలు, కవిత్వము ఆ బాలిక బ్రతుకు మూలమంట గదలించి వేయును.

తండ్రి కుమార్తె లిరువురు భారతీయులతో స్నేహ మొనరింప ముచ్చట పడుచుందురు. ప్రసిద్ధ భారతీయు లమెరికా వచ్చినపుడు వారిని తమయింటి కతిథిగా బిల్చుచుందురు. రవీంద్రనాధుడు, మెహర్ బాబా, ప్రేమానందస్వామి, కృష్ణాజీ మొదలగువా రాయన భవనమున కతిథులుగా వచ్చినారు. తారకనాధ దాసు, సుధీంద్రబోసు, లజపతిరాయి వారియింటికి తరచు వచ్చుచుండువారు.

రామచంద్రు డొక యుత్తమ బ్రాహ్మణకుమారుడు, భారతీయుడని వినినంతనె తండ్రి కుమార్తె లిరువురు నాతని స్నేహ మొనరించి తమగృహమునకు దీసికొనిపోయి ప్రసిద్ధినొందిన హార్వర్డు విశ్వవిద్యాలయములో బ్రవేశ పెట్టింప దలపోసినారు.

౪(4)

హార్వర్డు

శాంతమహాసముద్రము మహాసముద్రములలోనెల్ల విచిత్రమైనది. ఇందున్న దీవులు పెక్కులు. దీవులలోని పంట అద్భుతము. ఇచ్చటనే బొప్పాయి, టొమాటో, పొటాటో, పొగాకు, సదాపనస, పంపర, అనాస, జీడిమామిడి మొదలగు జాతులు ప్రథమమున నుద్భవించినవి. నిర్మల శర్వరీగగనముల మినుకాడు నక్షత్రకాంతులు సముద్రపు నీటిమెరపులలో బ్రతిబింబము లైనవి. ఉబుకు తరంగముల గీతికలలో జ్యోత్స్నారేఖలు పొదిగింపబడినవి. ఆ మహానౌక యపరిమిత వేగమున నడుచుచున్నది.

రామచంద్రునకు రౌనాల్డుసన్ తన స్నేహితులందరితో పరిచయము కలిగించినాడు. రామచంద్రుని విజ్ఞానమునకు వారందరపరిమితానందము నొందుచుండిరి. ఎంతటి చిక్కులనైన నాతడిట్టె విప్పి చెప్పగలడు. పదార్థ విజ్ఞానశాస్త్ర రహస్యములన్నియు వానికి గరతలామలకములు. కావున నాతడు విద్యుచ్ఛక్తి విషయికమగు జ్ఞానమునెల్ల సముపార్జించుట యుత్తమ మనియు, దనదేశమునకు, దనకు ఖ్యాతితెచ్చుట కింతకన్న వీలింకొకటి లేదనియు లియోనారా యాతనికి జెప్పి యొప్పించెను.

ఓడలోనుండియే రౌనాల్డుసన్ హార్వర్డు విశ్వవిద్యాలయమునకు వాయు వార్త బంపి రామచంద్రుని ప్రవేశమున కంగీకారము సంపాదించెను.

అర్జునసింగు శాంతనుహానీరధీ తీరములనున్న పట్టణములలో వర్తకముజేయు నొక చీనా కోటీశ్వరుని యుద్యోగి. అతడును స్వంతముగా గొంత వర్తకము జేయుచుండును. అర్జునసింగు నివాసము శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరము. కతిపయదినములకు నౌక శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరము వచ్చి చేరినది. ఆ మహాపట్టణము అమెరికా పడమటితీరముననున్న గొప్ప నౌకాశ్రయస్థలము. ప్రసిద్ధికెక్కిన రేవుపట్టణము. పశ్చిమతీరమున నిది మహాపట్టణ మగుటవలన ఇక్కడనే చీనావారివి, జపాను వారివి అనేకవేల కుటుంబములున్నవి. శాంత మహాసముద్రమున దిరుగు నౌకలు శాన్‌ఫ్రాన్సిస్‌కో వచ్చి యచ్చటనుండి పెనామాకాలువ దాటి అట్లాంటిక్ మహాసముద్రోపశాఖయగు మెక్సికో సముద్రమునుండి న్యూయార్కు, బోస్టన్, ఫిలెడెల్ ఫీయా మొదలగు పట్టణములకు బోవును.

రామచంద్రరావు, అర్జున సింగు, రౌనాల్డుసస్, ఆయన కుమార్తె యందరు ఓడదిగి ‘ది గేట్ వెస్ట్రన్’ అను భోజనహర్మ్యమునకు బోయిరి. హిందూ దేశ వాసస్థుల ఆచారవ్యవహారాదులకంటె జపాను దేశస్తుల ఆచారవ్యవహారాదులు వేఱు. ఈ రెంటికీ, నమెరికా సంప్రదాయములకు నెంతయో భేదమున్నది. అడుగడుగునకు నాయాభేదములు గాంచుచు రామచంద్రరావు విస్మయము పడుచుండెను. రెండురోజుల కర్జునసింగు రామచంద్రుని హాలీవుడ్ అను సినిమా పట్టణమునకు దీసికొనిపోయెను. నెలకు లక్షలకొలది డాలర్లు జీతములు గలవారు, సంవత్సరమున కొకసారి వివాహవిచ్ఛేదమును జేసికొని మరల నితరుల వివాహమాడువారు, మిక్కిలి బలసంపన్నులు, సాహసవంతులు, అందమైన వారు, నాట్యకళావేత్తలు, హాస్యరసచూడామణులగు ప్రసిద్ధ నటీనటుల సమూహము లచట నున్నవి. ఆ పట్టణవీధులలో, నుద్యానవనములలో, కర్మాగారములలో పట్టణములు, ఎడార్లు, మహాసముద్రములు, కొండలు, నదులు, గాలి వానలు, ఎండలు, చీకటులు, మంచుప్రదేశములు, వేలకొలది సంవత్సరముల నాటివి, వందలకొలది సంవత్సరముల నాటివి, నేటివి ప్రతిదినము పుట్టుచు మాయమైపోవుచుండును. సృష్టిమాయాతత్వమెల్ల నచ్చట ననుక్షణము కన్నుల గట్టుచుండును.

అచ్చటనుండి మోటారులో, రైలులో ననేకవేలమైళ్లు పయన మొనర్చి న్యూయార్కు పట్టణమునకు మన యాత్రికులందరు విచ్చేసినారు. రామచంద్రరావు మూడుదినములు రౌనాల్డుసన్ వైద్యశేఖరుని కతిథియై మర్యాదలు చూరగొనినాడు. రౌనాల్డుసన్ గారి వైద్యాలయమునకు వారి జనపదావాసమునకు లియోనారాకన్యయు, నిటలీనుండి తండ్రి కుమార్తెలకన్న ముందుగా వచ్చిన రౌనాల్డుసన్ సతియు, రామచంద్రుని గొనిపోయిరి. వారి భవనములన్నియు స్వర్గలోకతుల్యములైయుండెను. రౌనాల్డుసన్ భారతీయ విగ్రహములను, జిత్ర లేఖనములను, లక్కబొమ్మలను, దెరలను అలంకరించిన యొక శాలకు ‘భారతీయ మందిర’ మను నామకరణముంచెను. వేరొక మందిరము ‘చీనా మందిర’ మట. వేరొకటి ‘గ్రీకుమందిర’ మట. ఇంకనొకటి ‘ఈజిప్టుమందిర’ మట. వీని యన్నిటియం దలంకరించిన విగ్రహములకు, చిత్రములకు, బంగారు, వెండి, రాగి సామానులకు, గంథము, దంతము, పింగాణీ చెక్కడములకు, దెరలకు గొన్ని లక్షల డాలర్లు రౌనాల్డుసన్ వెచ్చబెట్టియుండును. తన తండ్రియు, నారాయణరావు ప్రోత్సాహముచే తన మామగారును బంపిన పదివేల రూప్యములకు సరియగు డాలర్లను రౌనాల్డుసన్ రామచంద్రుని పేర మంచి బ్యాంకిలో వేయించెను.

రామచంద్రరావు బి. ఎస్‌సి. తరగతిలో చేరుటకు వలయు సౌకర్యముల నన్నియు జూచుకొని హార్వర్డు విశ్వవిద్యాలయమునకు లియొనారా కన్యతో రౌనాల్డుసన్ సతీమణితో గలసివెళ్ళి విశ్వవిద్యాలయములో చేరినాడు.

విద్యార్థులనేకులు త్రోవబత్తెముమాత్ర మెట్లో సముపార్జించుకొని, అమెరికాకుబోయి విద్యాలయములలో ప్రవేశించెదరట. అమెరికా ధనవంతుల కాటపట్టగుటచే, ఇంగ్లండు దేశమునకన్న నక్కడ నన్నివస్తువులును మిగుల గిరాకిగా నుండును. తక్కిన యూరపియను రాజ్యములకన్న ఇంగ్లండులో వస్తువుల విలువ ఎక్కువ. భారతదేశమునకన్న యూరపియను దేశములలో వెల అధికము. కావున అచటికేగిన విద్యార్థులు హోటళ్లలో వడ్డించియో, సినిమాలలో బ్రేక్షకులకు దారిచూపియో, ఇంచుకించుక సంపాదించుకొందురు. కొందరు సెలవులకు పల్లెటూళ్లకు బోయి, యచట రైతులకడ గూలిపనిచేసి ధనము సేకరించెదరట. బీదవిద్యార్థు లిట్లెన్నియో యగచాట్లుబడి చదువు కొందురు. కొందరు బాలురకు శ్రీరామతీర్థ వివేకానందులేర్పరచిన యుచిత వేతనములు దొరుకునట. అమెరికాలోని భారతీయులను అమెరికనులు చాల గౌరవము చేయుచుందురు. భారతీయులు అమెరికా ప్రజలగుటకు మాత్రము అమెరికను లొప్పరు. తమతో వర్తకము జేయుటకు, తమదేశపు విచిత్రములు జూచుటకు వేదాంతములగూర్చి ఉపన్యసించుటకు, తమ విద్యాలయములలో జదువుకొనుటకు భారతీయులు విచ్చేయుట అమెరికనుల కెంతయు నిష్టము.

అమెరికాదేశమునకు బోయిన యాంధ్రులసంఖ్య చాల స్వల్పము, వంగల శివరాముగారు పి.హెచ్.డి. రాజ్యతంత్రజ్ఞానమునందు పట్టమునంది, భరతదేశమున, కలకత్తా విశ్వవిద్యాలయములో, నటుతర్వాత లక్నో విశ్వవిద్యాలయములో పండితులుగాజేరి ప్రఖ్యాతిబడసియున్నారు. బాపినీడుగారు ఎమ్.ఏ. వ్యవసాయశాస్త్రమున పట్టమునంది, భారతదేశమునందు వ్యవసాయమున నూతనమార్గముల నెలకొల్ప దీక్షతో నున్నారు.

ఎలాప్రగడ సుబ్బారావుగారిని రామచంద్రరావుగారు హార్వర్డు లోనే సందర్శించినారు. చెన్నపట్టణములో నాయన వైద్యవిద్యలో ఎల్.ఎమ్.ఎస్. పట్టమునంది, హార్వర్డు విశ్వవిద్యాలయములో ఉన్నత వైద్యవిద్య బడయుటకు సంకల్పించి, యా విద్యాకృషిలో దన్మయులై, యుత్తమ పరీక్షలలో గృతార్థులై, వైద్యవిద్యలో సత్యనూత్రార్జన తపస్సులో లీనమైపోయినారు. ఆయన విద్యయే యాయనకు భార్యయట, తల్లియట, బిడ్డలట. మరల భారతదేశమున కెప్పుడు రాగలడో? తన గురువు గారితో నేకమై బయోకెమిస్ట్రీ విద్యలో ననేక నూతనపథములు కనుగొని నూతన విషయముల ప్రపంచమున కర్పించుచున్నాడు.

రామచంద్రరావుయొక్క యుత్కృష్టధీశక్తి గాంచి హార్వర్డువిశ్వవిద్యాలయ పండితోత్తము లాశ్చర్యపూరితులైనారు. గణిత శాస్త్రమున బ్రపంచ ప్రఖ్యాతిగాంచిన కమింగ్సు పండితుడు రామచంద్రుని మేధాసంపన్నతకు మెచ్చి, యాతని దనయండ జేర్చుకొని వేయికనులతో గాపాడుచుండెను.

౫(5)

గాఢస్నేహము

నారాయణరావు మదరాసులో బి.ఎల్. తరగతిలో జేరినాడు. టెన్నిసు, కాలిబంతి, క్రికెట్టు ఆటలలో నాతడు మొనగాడు. న్యాయకళాశాలలో నాంధ్ర విద్యార్థులందరు నారాయణరావును విద్యార్థి సంఘ కార్యదర్శిగా నెన్నుకొని ధన్యులైనారు. పరమేశ్వరుని తనకడ కొన్ని నాళ్లుండు మని నారాయణ కోరుటచే నా యువకుడును వచ్చి చెన్నపట్టణములో నాతని చెంతనే నివసించెను. ఆలం నారాయణుని వదలడు.

పరమేశ్వరునకు చిత్రవిద్యా సంబంధమగు ఉద్యోగమేదైన దొరకు వరకు, విశ్వదాత యగు నాగేశ్వరరాయలు ఆంధ్రపత్రికా కార్యాలయమున నాతనికి బ్రవేశము ప్రసాదించిరి. కావున ‘భారతి’కి కథలను బద్యములను వ్రాసి యిచ్చుచు, దినమునకు రెండుగంటలు చిత్రవిద్యాపరిశ్రమము సల్పుమని నారాయణరావు బోధించెను. తానును బరమేశ్వరునకు వేవిధంబుల సహాయము చేయుచుండెదనని నెమ్మదిగా దెలిపినాడు. నారాయణుడు తీరికయైన వేళలందు పరమేశ్వరునితోగలసి, మహదానందరూపములై అద్భుత లేఖనా మూర్తిమంతములగు చిత్రములు చిత్రించువాడు. పరమేశ్వరు డాంధ్రపత్రికా కార్యాలయమున బ్రవేశించినాడు.

పరమేశ్వరున కయిదుగు రన్నదమ్ములు. పరమేశ్వరమూర్తి తండ్రియగు వెంకటరమణమూర్తిగారు మునసబీ చేసి యుపకారవేతనము (ఫించను) బుచ్చుకొన్నారు. బహుకుటుంబి యగుటచే నాయన ధనమేమిము వెనుక వైచుకొన లేదు. కుమార్తె వివాహమున కాఱువేలు ఖర్చుచేసినాడు. లంచములమాట వినబడినచో నగ్నివలె మండిపోవువాడు. నేడు ప్రభుత్వమువారిచ్చు వేతనము తప్ప నాయన కితరాధారము లేదు. ఆరుగురు కుమారులకు జదువులు చెప్పించెను. నెలకువచ్చు మూడువందల రూపాయలు తిండికి, కడగొట్టు బాలుర చదువులకు, వృద్ధురాలగు తల్లి వైద్యమున కాయనకు బప్పువలె ఖర్చయి పోవును. పెద్దకొడుకులు ముగ్గు రుద్యోగములలో నున్నను వారు తెచ్చు జీతములు వారి కుటుంబములకే సరిపోవును, అప్పుచేయుట యన్నచో నాయనకు దేహము కంపించిపోవును. ధనము లేనిచో పస్తుండును గాని ఒక కాని పద్దువ్రాయడు, నోటు వ్రాయడు.

పెద్దకుమారుడు విశాఖపట్టణము కాలేజీలోనున్న ఉన్నత పాఠశాలలో చరిత్ర పాఠముల చెప్పు నుపాధ్యాయుడు, వరదరాజులు బి. ఎ., ఎల్. టి. గారు. రెండవ కుమారుడు శ్రీరంగనాయకరావు. ఎటులనో స్కూలు ఫైనలు పరీక్ష పూర్తిచేసి, పెద్దాపురము మునసబు న్యాయస్థానములో లేఖరి యుద్యోగము తండ్రిగారి ప్రాపకముచే బొంది, తగులంచములుగొనుచు భార్యాబిడ్డలతో గాలక్షేపము చేయుచుండెను. మూడవయాతడు బి. ఎ.,బి. ఎల్. పరీక్షలలో గృతార్థత నొంది అప్రెన్‌టిస్అయి, హైకోర్టు వకీలయి, అనకాపల్లిలో న్యాయవాదివృత్తి సలుపుచు, బదిరాళ్ళయిన నింటికి దేలేక, తండ్రిగారి ప్రాపకముచే నెప్పుడు మునసబీపని యగునా యని గడియలు యుగములుగా లెక్కపెట్టుచుండెను. పరమేశ్వరమూర్తి నాల్గవవాడు. పరమేశ్వరమూర్తి వెనుక నొక బాలిక ఉమ, ఆమె వెనుక నిరువురు కవలలు, రామారావు, లక్ష్మణరావులు. వేంకటరమణమూర్తిగారి జన్మమును దరింపజేయ నుద్భవించిరి. వారిరువురు నాల్గవఫారము చదువుచుండిరి. ఇట్టి చిక్కులలో నుండుటవలననే వెంకటరమణమూర్తిగారు, పరమేశ్వరునికి అనేక విధములగు సహాయము తామొనరింపజాలమనియు, కుమారుడు అందరితోబాటు తనకడనున్న ఎట్టులో కలో గంజో పోయగలననియు, నితరస్థలములకు బోయినచో, పరమేశ్వరుడు తన కుటుంబమును దానే భరించుకొనవలయుననియు మొగమాటము విడిచి జెప్పినారు.

పరమేశ్వరుడు నారాయణకన్న రెండేండ్లు పెద్ద, పందొమ్మిది వందల ఇరువది రెండవ సంవత్సరము గాంధీమహాత్ముడు భరతదేశ దాస్యశృంఖలా విమోచనమునకని ప్రారంభించిన అసహాయోద్యమములోజేరి, పరమేశ్వరుడొక సంవత్సరము కారాగారవాస మనుభవించెను. అప్పటి కాతని వయస్సు పందొమ్మిది. బి. ఏ. చదువుచుండెను. నారాయణరావునకు పరమేశ్వరునకు చెఱసాలయందు గాఢస్నేహము కుదిరినది. చెఱ వదలి వచ్చిన వెనుక వారిరువురి మైత్రి తీగవలె నల్లుకొనిపోయి వారిరువురి యాత్మలొకటి, దేహములు మాత్రము వేరైనవి. పరమేశ్వరుడు 1924 లో బి.ఏ. పూర్తి చేసెను.

నారాయణరావు పరమేశ్వరులిర్వురు సర్వకళోపాసకులు. నారాయణరావపరిమిత మేధాసంపన్నుడు. పరమేశ్వరునికి జ్ఞాపకశక్తికన్న సృజనాశక్తి మెండు. నారాయణరావునకు కళాసృష్టి శక్తికన్న, ధీశక్తిమిన్న. నారాయణరావు చూపుమాత్రాన నెట్టివిషయమును సర్వార్థములతో గ్రహింపగలడు. ఏ జటిలవిషయమునైన సులువుగ బోధపడురీత నుపదేశింపగలడు. ఉపన్యాస మీయగలడు. నారాయణునకు జ్ఞాపకశక్తి యత్యద్భుతము. శాస్త్రజ్ఞానములో ఎయిన్ స్టెయిన్ మొదలగు పండితోత్తముల గ్రంథము లాతనికి మంచినీళ్ళ ప్రాయములు. అర్థమయిన విషయములు తలచినంతమాత్రాన నాతని మనోముకు రమున ప్రత్యక్షములగును. నారాయణ జ్ఞానపిపాసకు, ఈశాస్త్రమాశాస్త్ర మని హద్దులేదు. అతని ధీకిరణము సర్వశాస్త్రములపై ప్రసరించును. రామన్ గారి ‘కిరణ’ విషయజ్ఞానమన నెంత ప్రేమయో ఆంధ్రేతిహాస విషయమునందు నంత ప్రేమయే. న్యూటను, ఎయిన్ స్టెయిన్, ఆడిసన్, గౌతమ కణ్వాదులు, నాగార్జునులు అతనికి చిరపరిచితులు. మహాపండితుల సిద్ధాంతము లెంతశ్రద్ధమై గ్రహించునో, శోణానదిపైని వంతెన పొడవును, చీనా కుడ్యచరిత్రను, ఆర్మీనియనుజాతివారి చరిత్రమును, సముద్రమీన భేదములను, అవి యివి యన నేల సమస్త వస్తుజ్ఞానమును ఆతడంత యాస్థమే గ్రహించును.

పరమేశ్వరుని జ్ఞానశక్తి నారాయణరావు మేధాశక్తి యంత యగాధము కాదు. ఇరువురి హృదయములు రసార్ద్రములే యగును కాని, పరమేశ్వరుని యందు లలితకళాశక్తి యెక్కువ విజృంభించియున్నది. ఇరువురు సౌందర్యోపాసకులే. ఇరువురు జ్ఞానప్రియులే కాని పరమేశ్వరుడు తుమ్మెద, నారాయణుడు తేనెటీగ. జ్ఞానామృత సంపాదనమున నిదియే వారికిగల భేదము.

నారాయణరావు గంభీరహృదయుడు. పరమేశ్వరుడు దర్పణప్రతిమాన హృదయుడు. ఒక రహస్యము దాచలేడు. ఒక భావము గుప్తపరచుకొనలేడు. అయినను అతని జ్ఞానము సర్వతోముఖము. అతని జన్మలగ్నమున బుధు డున్నాడు.

పరమేశ్వరుడు లతవలె నెల్లకాలము నెవరో యొక ధీశాలియగు స్నేహితుని జుట్టియుండును. స్నేహితులేనినా డాతడు ప్రపంచమున నొంటియై యుంటినని భావించును. కాని పెక్కుఘంటిక లాత డొక్కరుడు ధ్యాన స్థిమితుడై యుండగలడు. ధీరత్వమునగూడ పరమేశ్వరుడు తక్కువవాడు కాడు. కారాగృహవాసమన్న వెనుకంజ నిడలేదు. ఒక్కడు గోదావరిలో బాతువలె నీదుకొనుచు మైళ్ళకొలది పోగలడు.

పరమేశ్వరుని హృదయము వెన్న వంటిది. స్త్రీలలో స్త్రీవలె మెలగగలడు. ఆడువారికున్న నాజూకులన్నిటిలోను నాతడు నిధి. అన్నిరకముల పాటలు పాడగలడు. అభినయము చేయగలడు. ఆడువేషము వేసినచో సుందర స్త్రీమూర్తియై, వనితలనే భ్రమింపజేయగలడు.

అతని మనస్సు మైనమువంటిది. ప్రాపంచిక సాధకబాధకము లాతని మనస్సు నెక్కువ కలత బెట్టినను, అవి తాత్కాలికములై, క్షణభంగురములై మఱునిమేషమున నంతరించిపోవును. అతని మనము యథాసంతోషస్థితి నందును.

నారాయణరావు తన హృదయమునకు నచ్చినవారితోడ స్నేహ మొనరించును; పరమేశ్వరు డందరకు స్నేహితుడే. కాని పరమేశ్వరుడు కొలది మందికే తన సంపూర్ణహృదయము ధారపోయును. ఇరువురును గాఢముగ ప్రేమింపగలరు. నారాయణరావు ప్రేమ యాతని బ్రతుకును మూలమంట గదల్చి యాజన్మాంతము దివ్యజ్యోతివలె వెలుగుచుండవలసినదే. పరమేశ్వరుడు స్నేహితు డొకసారి తన్ను మరచినచో తానును మరచిపోగలడు.

నారాయణరావు స్నేహము తనకు లభించినందులకు బరమేశ్వరుడు సంతతము భగవంతునికి కృతజ్ఞత తెల్పుచుండును; ఆనందము నొందును. కన్నులరమోసి తన్మయుడగును. నారాయణుడు నిజమా కాదా యన్న ప్రేమచే నాతని యొడలంటును, ఆతని యొడిలో దలనుంచి యంతర్దృష్టి వహించును. ‘మీకు నారాయణరావు అన్నగారు భర్తగారా, భార్యగారా?’ యని రుక్మిణి పతిని మేలమాడును.


౬(6)

కవిత్వము

పరమేశ్వరునకు భారతి పత్రికలో నేబది రూపాయల జీతమును గరుణార్దృహృదయుడగు నాగేశ్వరరాయ డేర్పరచెను. తన భార్యను దీసికొని వచ్చి, పరమేశ్వరమూర్తి మాంబళంలో గాపురము పెట్టెను. మంచి నెయ్యి రాజమహేంద్రవరము నుండి వచ్చినదని, తనతండ్రిగారు కొత్తపేట నుండి కమ్మని పప్పునూనెయు, గొబ్బరినూనెయు బంపించినారని, నారాయణరావు పరమేశ్వరున కెన్నియో వస్తువులందించుచుండును. రుక్మిణమ్మకు పట్టణము చూపించమని, సినిమాకని నారాయణరావు తన మోటారును పరమేశ్వరునికి నాతని సెలవుదినములలో బంపుచుండును. పరమేశ్వరుని మంచిగృహము నద్దెకు తీసుకొనుమని బ్రేరేపించి నారాయణు డా గృహమున వారికి వలయు మంచములు పీఠములు వంట సామానులు మొదలగునవి కొనియిచ్చినాడు.

రాజారావు తనకున్న కొద్ది తీరుబడికాలములో నారాయణరావుతోడనో, పరమేశ్వరునింటనో, పరమేశ్వరునితో నారాయణరావింటిలోనో, స్నేహితులతో నానందము ననుభవించువాడు. ఏ స్నేహితుడు కావలయునన్నను నారాయణరావు తన మోటారులో బోయి యాతని గొనివచ్చువాడు. ఆలం నారాయణరావును కలిసికొనని దినమే లేదు. రాజారావు, ఆలం, పరమేశ్వరమూర్తి, నారాయణరావులు ఒకరి కొకరు గాఢమిత్రులైనారు.

పరమేశ్వరుడు ఆనాటి యువకవులు రచించిన పాటలు, పద్యములు కలకంఠముతో మధురముగ బాడుచుండెను. అత డెన్ని సభలలోనో పాటలు పాడువాడు. తాను పాటలను పద్యములను రచించును. చిన్న కథలను వ్రాయుచుండును. తనరచనముల ‘భారతి’ లో బ్రకటించుచుండును.

ఒకనాడు పాట నొకదాని రచియించి పరమేశ్వరుడు నారాయణరావు కడకు గొనివచ్చెను.

‘ఓహో తాతా నీ దేవూరు?
నీ వేడపోతవోయ్?

ఊరులేదు వాడలేదు
దేశమంతా నీదే వూరు
ఊరిబైట చెరువుకాడ
చేరుతోనే పాదుకొంటవ్.

తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?

గిత్త పైన యిల్లుచుట్తావ్
ఇంటి సామానంతా కట్తావ్
బిడ్డాపాపలు కూడా నడుస్తే
యిడ్డూరాలే రాజ్యాలన్నీ.

తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?

బిచ్చమేసేతల్లి ఉంటే
విచ్చిపోయిన పూవే బతుకు
యేసాలేసి బైరాగవుతవు
సేతులు సూసి సుద్దులు సెపుతావు.

తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?’

పరమేశ్వరుడు పాట పాడుచుండగనే రాజారావక్కడకు వచ్చినాడు. ఆలము పాట ముగిసినవెనుక వచ్చినాడు. ఆతడు పరమేశ్వరుని మరల పాడుమన్నాడు. పరమేశ్వరుడు మరల పాడినాడు. సంధ్యారుణమధురిమలో పరమేశ్వరుని గొంతుక తారాశ్రుతిలో విరిసిపోయినది. పల్లెటూళ్ళలో వివిధ వేషాల తీరుగాడు బిచ్చగాండ్ర గుంపును వారి కనులయెదుట నిలిచినట్లయినవి. బిచ్చమెత్తుకొను జాతు లెన్ని శతాబ్దములనుండియో బిచ్చము లెత్తుకొనుచునే యున్నవి. జంగములు, బుడబుక్కలవారు, బైరాగులు, గంగిరెడ్ల దాసరి వారు, కొమ్మదాసరులు, కోయవారు, ఎరుకలవారు, పగటివేషగాండ్రు, విప్రవినోదులు, మంత్రగాండ్లు, అడవిచెంచులు, యానాది భాగవతులు, రామదాసులు, నూనెగుడ్డల వారు, అమ్మవారి దేవరలు, దాసులు, తోలుబొమ్మలవారు, దొమ్మరివాండ్లు రుంజలవారు, కాశీపటములవారు, భటరాజులు, బీబీనాంచారి వారలు, గంగానమ్మ భక్తులు, జంగాలు మొదలైన బిచ్చగాండ్రు వారి మనస్సీమలో జట్టు జట్టులుగా బ్రయాణము చేయుచు తోచినారు.

రాజా: నారాయణరావు! మన దేశానికి ఈ బిచ్చగాళ్లు చెదపురుగులురా! నారా: అది నేను ఒప్పుకోనోయి.

ఆలం: నేనూను.

నారా: ఎందుకంటావా? అసలు వీళ్ళలో పూర్వం నుంచీ మనస్సులకు వినోదము కలిగించేవారు కొందరు, కొందరు దేశదిమ్మరిజాతులు, అడవిజాతులు. వారివల్ల భూతవైద్యం ఎరుక చెప్పించుకోవడం మొదలయిన లాభాలు పొందుతున్నాం మనం.

రాజా: అయితే ఆ భూతవైద్యం, ఎరుకచెప్పడం నీ కిప్పుడు నమ్మకమేనా?

నారా: నేను బిచ్చగాళ్ళ చరిత్ర చెప్పుతున్నానేగాని నాకు నమ్మకం అన్నానామరి. విను! వీళ్ళంతా మనకు ఏదో లాభం కలుగజేసి, మనవల్ల లాభము పొందేవాళ్లు. రానురాను మనకు పాశ్చాత్యనాగరికతవచ్చి ఈ బిచ్చగాళ్ళ జాతులలో ఉండే కళాసౌందర్యము అనుభవించడము రూపుమాసింది. జంగాలు పాడే బొబ్బిలిపాట, దేశింగురాజుకథ, సర్వాయిపాపడుకథ, బాలనాగమ్మకథ, మరాటీకథ, చెన్నప్ప రెడ్డికథ, కామమ్మకథ మనము వింటున్నామా? ఆ కథలలో చమత్కృతీ కళాధిక్యత గమనిస్తున్నామా? పాటక జనం మాత్రం నేటికీ ఆ కథలు విని ఒక అనిర్వచనీయానందం పొందుతూ, వారికి తోచిన బహుమతులు యిస్తున్నారు.

ఆలం: మా మతం ఎప్పుడూ ధర్మం చేయమంటుందిరా !

రాజా: అసలే మనదేశం బీదదేశం. ఇప్పటికైనా వీళ్ళు వదలక పోవడం ఏమిటని?

పరం: వాళ్లెలా వదలుతారోయి? వాళ్లకి ఆధారం యేదయినా చూపించూ. వాళ్లకీ వృత్తి మహాసౌఖ్యమా ఏమిటి? వాళ్ళపాట వినో, ఆట చూసో, మాటకు ఆనందించో ప్రతిఫలంక్రింద గుప్పెడు గింజలిస్తున్నాం. అంతేనా?

రాజా: అలా మనకు నువ్వు చెప్పే ప్రతిఫలం ఇవ్వకపోతే?

పరం: ప్రతిఫలం ఇవ్వకుండా ఉట్టి ముష్టి ఎత్తుకునేవాళ్లు చాలాతక్కువ కాదటోయి. వాళ్లయినా ప్రప్రథమంలో ఏదో ప్రతిఫలం యివ్వకుండా ఉండిఉండరు.

రాజా: నేను చెప్పేవిషయం యిద్దరూ గ్రహించలేదు.

నారా: ఉండరా పరమం! నువ్వనేది, రాజారావు! వాళ్ళిచ్చే ప్రతిఫలం ఇవ్వనిదానితో సమం. కాబట్టి బీదదేశమయిన మన దేశానికి వీళ్లు బరువు చేటు. కనుక యా ముష్టియెత్తడం మానిపించి వెయ్యాలని. అదేనా నీవాదన?

రాజా: అవును.

నారా: సరే, బిచ్చగాళ్ళకు నువ్విప్పుడేదైనా పని చూపిస్తావా? రాజా: పని చూపించే, వాళ్ళని మాన్పించివెయ్యాలని.

నారా: అదేదోషం. పిచ్చి కుదిరితేగాని పెళ్ళి కుదరదు, పెళ్ళి కుదిరితేనేగాని పిచ్చి కుదరదు. ఇప్పుడు వ్యవసాయంలోనూ, గోడకట్టు బండి తోలడం మొదలైన చిన్న చిన్న కూలిపనులలోనూ, పట్టణవాసంలో ఫ్యాక్టరీ కూలిమోత మొదలైన పనులలోనూ కావలసినంతమంది జనం ఉన్నారు. కాబట్టి ఇప్పడు ముష్టియెత్తుకునేవాళ్లకి పనులిచ్చేందుకు పనులులేవు. అదికాకుండా ఇదివరకు పనులుచేసే సర్వవిధములైన పాటకజనములోనే అందరికీ కడుపునింపే పనిలేక, పోటీలతో ఏదోరకంగా ఒక విధమైన సగటుకూలి అందరికీ దక్కుతోంది. ఆ సగటు కూలీవల్ల పాటకపుమనిషికి ఏడాదిలో ఆరోవంతు రోజులకు పూర్తియైన తిండి, అనగా రోజుకు ఆరోవంతుతిండి దక్కుతోంది. ఇంక ఈ బిచ్చగాళ్లుకూడా పనికిదిగితే, మనిషికి ఒక నెల తిండే సగటున వస్తుంది. ఎందుకంటే కూలిజనం ఎంతమంది ఉన్నారో అంతమంది బిచ్చగాళ్ల జనం ఉన్నారు.

రాజా: అదంతా నేనూ ఒప్పుకున్నాను. కాని మన దేశంలో ఇంకా వ్యవసాయానికి రావలసిన భూమెంత ఉన్నది?

నారా: సుమారు ఇప్పుడున్న దానిలో నాలుగుపాళ్లలో మూడువంతులు వ్యవసాయానికి వచ్చేటందుకు వీలైనభూమి మిగిలింది. అల్లా వీలులేని కొండా, అడవి, ఎడారిభూమిన్నీ.

రాజా: మూడు పాళ్లైనా ఉందా లేదా?

నారా: ఉంది. కానీ ఆ భూమిని వ్యవసాయానికి తీసుకువచ్చేటందుకు కొన్ని వందలకోట్లు ఖర్చవుతాయి. అది ఎక్కడ? ఇప్పటి గవర్నమెంటు యివ్వలేదు. లక్షాధికారులు తక్కువ, వారూ ఇవ్వడం కష్టం. దేశం మొత్తంలో డబ్బు హుళక్కి.

రాజా: నువ్వు చెప్పింది, పాటకజనమే వీళ్ల కళాఉత్కృష్టత కానందిస్తున్నారు అన్నావు. వాళ్లు ముష్టివేసి వాళ్ల రాబడి సగం చేసుకుంటున్నారుగా ఎల్లాగూనూ.

నారా: కాని ఆ బిచ్చగాళ్లు పాటకజనం దగ్గిరపొందే బిచ్చం ఉన్నదే, అది డబ్బుగలవాళ్ల దగ్గిర సంపాదించే బిచ్చంలో మూటిలో ఒకపాలే ఉంటుంది.

రాజా: మన స్త్రీలు పాశ్చాత్య విద్యాధికులు కానంతకాలం బిచ్చగాళ్లకు భయం లేదు. పాశ్చాత్యవిద్యకూడా మన యీ పూర్వసంప్రదాయ వాసనను మార్చలే దెప్పుడును.

పరం: మీరిద్ద రేమన్నా సరేగాని, బిచ్చగాళ్లు కళాభాగం. వాళ్లలో ఉన్న రసాభిజ్ఞత మనలోలేదు. తోలుబొమ్మలవాళ్లలో చిత్రకారులున్నారు, రామదాసులలో పాటగాళ్లున్నారు, జంగాలలో కథకులున్నారు. టిక్కెట్లు పెట్టి గారడీ చేసి డబ్బు సంపాదిస్తే మాంత్రికుడు, వీధిలో డోలువాయిస్తూ బుట్టలో మనిషిని మాయం చేయిస్తే బిచ్చగాడూనా? నా ఉద్దేశమునకు స్వరాజ్యము వచ్చి దేశం బాగుపడ్డాక ఈ బిచ్చగాళ్లని బాగుచేసి, వాళ్ల కళా సంబంధమైన వృత్తులలోకి ప్రవేశించిన దోషాలు మాయముచేసి, ఆ వృత్తులు వృద్ధిపొందేందుకు కళాశాలలు ఏర్పరచాలని. ఆ ఆశయము నన్ను పులకరాలతో నింపుతూ ఉంటుంది.

రాజా: మన పరమేశ్వరుడు ఏదో కలలుకంటూ ఉంటాడు.

నారాయణరావు బిచ్చగాళ్లను తలచుకొని మనవారి ధార్మికత సార్వజనీనముగ దేశములోని ధనము పంచుచున్న విధము ఊహించెను. హిందూదేశములో రష్యారాజ్యపద్ధతి యవసరములేదు. అది ప్రాపంచిక సంబంధమైనది. మనదేశ మాత్మోపలబ్ధికై పాటుపడినది. కావున రష్యా పద్ధతి నవలంబింప జాలదు. రెండు రాజ్యములూ ముఖ్యముగా వ్యవసాయ దేశములేయైనను మనుష్యుని యాత్మవికాసమునకు దోడుపడని పద్ధతు లేవియును భారతవర్షమునకు బనికిరావు. ఏ దేశమునకును పనికిరావు. భరతఖండము సర్వప్రపంచమునకును ధారబోయు బోధన మిదియే. జపానుదేశము నిమేషమాత్రమున పాశ్చాత్య మార్గ మవలంబించినది. టర్కీ అనుకరించుచున్నది. పెరిసియా యా మార్గము వెంట నడువనున్నది. కాని నూటయేబది సంవత్సరములనుండి పాశ్చాత్య నాగరికతాసారము మన రక్త నాళములలోనికి ఇంజెక్షను చేయబడుచుండినను, మనలోనున్న పూర్వసంప్రదాయవాసనల నది నశింపజేయలేకున్నది. ‘అయ్యో, నాతల్లీ! నీకీ పాశ్చాత్యనాగరికతా విమోచన మెప్పుడోగదా’ అనుకొనుచు నారాయణరావు నిమీలితలోచనుడైనాడు.

పరమేశ్వరుడు ‘ఏమర్రా! మీరిద్దరూ ఆలోచనలలో పడ్డారు. ఆలం మాట్లాడడు. నాపాటను గురించి మంచీ చెడ్డా చెప్పారుకారు. కష్టపడి తయారు చేశాను. కోకిల్లా పాడాను’ అని మిత్రుల నిరువురిని బ్రశ్నించెను. ఆలం నవ్వుచు ‘నిన్ను మా పారశీకకవి ఒమారు ఖయ్యాముతో పోల్చానురా, పో’ అన్నాడు.

నారాయణరావు ‘కారువాడికి కబురుపంపినాను. వాడు కారుపట్టుకు వస్తాడు. కాస్త కాఫీ పుచ్చుకోండి. రాజారావు సిగరెట్లు కాల్చడు. మనకు త్రీకాజీల్సు ఉన్నాయి. పదండిరా సినీమాకు, డగ్లాసు ఫిలుము ‘త్రీమస్కెటీర్లు’ వచ్చిందిరా పదండి. సుబ్బయ్యా కాఫీపట్టుకురా!’ యని కేక వేసెను.

ఆలం: నాకు పరాటాలు, కోడిగుడ్లు కావాలిరా.

పరం: ఈ కుంకాయికి ఒక జందెం తగిలించరా నారాయుడూ.

ఆలం: మీ కందరికీ ముస్లీముమతం ఇద్దామని చూస్తూంటే!

నారా: తెలుగు తురకలకు, అరవ తురకలకు హిందువులతో దెబ్బలాట లేనేలేదుకాదట్రా! మీ కందరికి హిందూమతం ఇద్దామని మేము చూస్తున్నాం.

౭(7)

జగన్మోహనరావు

శ్రీ రాజా క్రొవ్విడి బసవరాజ రాజేశ్వర శ్రీ జగన్మోహనరావు బహద్దరుగారు గంజాంజిల్లాలోని నారికేళివలస జమీందారుగారు. నారికేళివలస బరంపురమునకు గొలదిమైళ్ళదూరములో నున్నది. జమీయంతయు బది గ్రామములు. సాలుకు ముప్పదివేలు రాబడి.

కాని జగన్మోహనరావు బహద్దరుగారు మహోదారపురుషులు. ధనమొకచోట కూడియుండుట వారికి బడదు. ఏరీతినైననేమి ధనము ప్రపంచములోనికి బంపుట లోకకల్యాణప్రదము. భోగకాంతలు, బ్రాందీషాపు యజమానులు, జూదరులైన స్నేహితులు మొదలగువారు ధూమశకటములవంటివారు. ధనమును దేశములో వెదజల్లుటలో వారు ప్రసిద్ధులు. వారి సహాయము లేనిచో, నొకచోటనే పాదుకొని పనికిమాలినదగును. ఇదీ వారి అర్థనీతి. పరదేశముల నుండి వచ్చు చాంపేను బోర్డియా, ఎక్షాబ్రాంది, విస్కీలు సేవించితిమేని మనకు విశ్వసౌందర్యమలవడును. సిగరెట్లు మెదడును శుభ్రపరచి జ్ఞానాభివృద్ధిని జేయును. నాట్యస్త్రీలను బ్రోత్సహించుట లలితకళాభివృద్ధికే.

జమీలలో జమీరైతుల క్షేమము ముఖ్యము అని వారిముందు ఎవరయిన పలికిరేని ఆయన పకాలున నవ్వును. అట్లయినచో ప్రభుత్వమువారేల జమీందారీ పద్ధతి ప్రవేశపెట్టెదరు? రైతు వారీపద్ధతినే యుంచియుందురు. కాబట్టి జమీధనము చిత్తమువచ్చినట్లు జమిందా రుపయోగపరచుకొనవలయును. అప్పులు చేసిన జమీ పాడగుట యేల సంభవించును? జమీలు జమీందారుల పాలినుండి తప్పింపకూడదట! జమీందారులు శాశ్వతబ్రహ్మకల్పముగ జమీల గట్టుకొని యూరేగెదరా? బ్రతికియున్ననాళ్లు ననుభవించవలెను. తరువాత వేరొకనికి బోవుగాక! ఈ సంపద ఎల్లకాలము నొక్కరే యేల అనుభవింపవలెను? జమీ లమ్మకూడదని శాసన మెందుకయ్యా? అని జగన్మోహనరావు వాదించుకొని తన్ను తాను సమాధాన పెట్టుకొనుచుండును. ‘ధనము ననుభవించుట నెఱుగని కాశ్మీరగార్దభములు, అనుభవించు నాబోట్లను భోగలాలసులనియు, విలాస పురుషులనియు నిందింతురు. దూషణ భూషణ తిరస్కారములు దేహమునకు గాని యాత్మకు గావు. నేను బహుసహస్రనారీ పరివేష్టితుడగు గోపాలకృష్ణుడను’ అని యనుకొనుచు జగన్మోహనరావు విశాఖపట్టణములోని తన మేడనుండి దిగి, వీథిలో వేచియున్న కారులోనికి నెక్కెను. వారు వేగముతో నా శకటము సముద్రతీరమున ‘డాల్ఫినుముక్కు’ వైపుననున్న మాక్లిన్ జేమ్సు ఆను నొక యూరేషియను గృహస్థునింటికడ నాగెను. జగన్మోహనరావు పాలిపోయిన తెలుపునగలియు పసిమివర్ణమువాడు. సున్నితమగు పలుచని మేనివాడు. కోలనగు మోము, కొంచెము బుర్రముక్కు, ఫ్రెంచి మీసములు, పెద్దనోరు, చిన్నచెవులు, సూదివలెనున్న గడ్డము, ఉంగరములు చుట్టియున్న తుమ్మెదరెక్కలవంటి జుట్టు, విపరీతముగా నెత్తైన ఫాలము నా యువకునకు వింతసొబగు సమకూర్చినవి. ఆతనికడ జమీందారీఠీవి యున్నది. జమీందారీహృదయ మున్నది. ఇంగ్లండు దేశములోనున్న ప్రభువుల వలె దా నుండవలయునని యాతనికోర్కె. డైమ్లరుకారు, పియానో వాద్యము, గిండీ పోటీపందెములకు నొక యరబ్బీగుఱ్ఱము, నెలకు డెబ్బది రూపికలకొక యాంతరంగిక మంత్రి, వేసవికాలములో ఊటీ ప్రయాణము, గోల్ఫుఆట, ఇంగ్లీషు నాట్యము, పాశ్చాత్య వేషము ...... ఇది వారి రాచఠీవి.

విశాఖపట్టణములో ఆగస్టు నెలలో ఆనాటి సాయంవేళ తన డైమ్లరు కారునుండి మాక్లిన్ జేమ్సుగారి ఇంటిలోనికి బోవగనె, యాతని సహోదరి డయానా జేమ్సు జగన్మోహను నెదుర్కొని తన రెండుచేతు లాతని కందీయ జగన్మోహను డా యువతిని బిగియార కవుగిలించి తనివోవ ముద్దుగొనెను.

‘మోహన్! కొంచెం ఆలస్యం అయిందే! నువ్వు సరిగా వేళకు వచ్చే వాడవు, ప్రాణప్రియా?’

‘ఒక చిన్న వ్యాపారం వల్ల ఆలస్యం అయింది. ప్రియతమమైన డయన్! క్షమించు. ఎప్పుడు నీ పెదవుల ద్రాక్షసుధారసము త్రాగుదామా అని ఉవ్విళ్ళూరుతూ నిముషానికొక యుగంగా లెక్క చూసుకుంటూ చెన్నపట్నాన్నుంచి వచ్చాను. రెక్కలు కట్టుకొని నీ దగ్గర వాలా!’

‘నీ గుఱ్ఱం బొబ్బిలిపందెములో మూడవదిగా వచ్చినందుకు చాలా సంతోషం అయింది. నీకప్పుడే తంతినిచ్చా! ముందుసంవత్సరం ‘గవర్నరు’ పందెములో మొదటిదిగా వస్తుంది.’

‘ఆ! ఈయేడు గవర్నరు పందెంలో మొదటిదిగావచ్చిన ‘హ్యాపీ వారియర్’ గుఱ్ఱాన్ని స్వారీచేసిన బ్రౌను కిప్పుడే కంట్రాక్టు ఇచ్చాను. ప్రసిద్ధి కెక్కిన రెయినాల్డ్సుకు గుఱ్ఱాన్ని తయారుచేయుటకు అప్పజెప్పివచ్చాను షికారు రా! డయిన్.’

మరల నామె నాతడు గ్రుచ్చి గౌగిలించుకొని, గబగబ పెదవి, కన్నులు, మెడ, చెవులు ముద్దిడుకొనెను.

వారిరువురు కారులోనికిబోయి కూర్చుండబోవుచుండ జేమ్సుతల్లి లోపలి నుండివచ్చి త్వరితముగ దిరిగిరండని చెప్పిపంపినది. జేమ్సింకను వివాహము చేసికొనలేదు. తల్లిదే ఇంటి పెత్తనము. ఆమెయే డయానా జగన్మోహనులకు సంబంధము కలిపి యద్దాని నానాటికీ వృద్ధిచేసినది. జగన్మోహనుడు డయానాకు నెలకు రెండువందలు జీతమిచ్చును. అప్పుడప్పు డాతడిచ్చు బహుమతులు మొత్తము సాలుకు మూడు నాలుగువేల రూపాయల ఖరీదుండును. డయానాకన్య సుందరి. ఆమె దేహకాంతి దంతమువలె స్నిగ్ధమైన తెలిపసిమి కలది. ఆమె పెదవులు రంగులేకయే ప్రవాళములవలె నెఱ్ఱనై తేనె లూరుచుండును. పొట్టియైనను, మంచి యవయవస్ఫుటత కలిగి ‘చక్కని జంతువు’ అని యూరేషియను యువకులచే బొగడ్తలందినదామె. ఈతలో, టెన్నిసుబంతి ఆటలో, నాట్యములో నామెదే ముందంజ. పియానో అద్భుతముగ వాయించగలదు. ఆమె గొంతు ---మగు ‘సొప్రానో’ స్వరము కలదియట. వాల్టేరులో జరుగు క్రిస్‌మస్ వేడుకలలో నామెయే నాయకురాలి వేషము వేయును. సంగీత ప్రదర్శనములో నామెదే ముందంజ. వాల్టేరు విశాఖపట్టణముల పాశ్చాత్యులలో యూరేషియనులలో నవనాగరికులలో నామె నాసించని పురుషుడొక్కడును లేడు. అట్టి తరుణమున నామె శ్రీమంతుడగు జగన్మోహనుని వరించినది.

వారి కారు సింహాచలము రాచబాటపై నలమండ మొదలగు గ్రామములు దాటి భీమునిపట్టణము వెళ్ళినది. వారు బండి దిగి సముద్రతీరమున నడుచుచూ ఏకాంత ప్రదేశమునకు జని యా సైకతముపై నధివసించిరి. వారపరిమిత మోహావేశులై యా చీకటిలో తారకాకాంతులలో సముద్రము గంభీర సంగీతము పాడుకొనుచుండునప్పుడు సర్వము మరచిపోయిరి.

కొంతసేపటికి వారు నర్మసంభాషణము లాడుకొనుచు మందహాసముతో మరల బండినెక్కి యెనిమిది గంటలకు విశాఖపట్టణమువచ్చి చేరుచు, వాల్టేరులో రొజారియొ యను గార్డు గృహముకడ నాగి గార్డు దంపతులను వారి బాలికను కనుగొనివచ్చిరి. ఆ రోజున జేమ్సు ఇంటికడ జగన్మోహనునకు విందు. జగన్మోహనునకు గొడ్డుమాంసముతప్ప తక్కిన మాంసాహారము భక్షించు నలవాటు లేదు. మాక్లీను దన హృదయము చూరగొన్న రొజరియో కూతురు, ఆమె తల్లిదండ్రులను వాల్టేరునుండి విందుకు బిలిచినాడు. వారికై మాక్లీను నాతని తల్లియు నుచిత వేషములతో నెదురుచూచుచుండిరి.

జేమ్సు మాక్లీను ఇంటి ముందరి వసారాలో గోడలకు నీటిరంగు చిత్రములు, పెద్దపులి తలలు, బల్లెములు, బాణములు తగిలించియున్నవి. పరుపు, కుర్చీలు, బల్లలు, బల్లలపై చీనాదేశపు ఇత్తడి కూజాలు, కూజాలలో పుష్పములున్న కొమ్మలు అలంకరింపబడి యున్నవి. గుమ్మములకు డమాస్కసు తెరలు వేలాడదీయబడియున్నవి. దూరముగా నా వసారాలో బల్లలపై దీపము లిరు ప్రక్కల వెలుగుచున్నవి. మనవా రందఱు కుర్చీలపై నధివసించిరి. ఆ రోజు మెయిలులో జరిగిన యొక వింతనుగూర్చి మిస్టర్ రొజారియొ చిరునవ్వుతో డయానావైపు తిరిగి చెప్పచుండెను. డయానా తల్లియు, మిసెస్ రొజారియొ యు దక్కినవారికి వినబడకుండ నేదియో చెప్పుకొనుచుండిరి. జేమ్సు తన బాలిక ఫ్రాన్సిస్‌ను దీసికొని తోటలోనికి నాలుగడుగులు పచారు చేయుటకు వెళ్లి యా నడకలో నామె చెవిలో ‘నా హృదయం నీ కర్పించాను. ఏమి చేసినా నీదే భార’మని యస్పష్టముగ గాఢవాంఛాగద్గదికమైన స్వరమున జెప్పచుండెను. జగన్మోహనుడు డయానా యందము కన్నులార గ్రోలుచు తన్మయు డగుచుండెను.

ఇంతలో దేశవాళీ క్రిస్టియను బట్లరు వచ్చి యందరకు షెర్రీద్రాక్షాపానీయము గాజుగ్లాసులలో నందిచ్చెను. అందరు నది నెమ్మదిగా త్రాగినారు.

డయానా దుస్తులుమార్చి భోజన సమయోచితమగు గౌను ధరించుటకు లోనికి బోయినది. జగన్మోహనుడు, సేవకుడు తన దుస్తు లొక తోలు పెట్టెలో కొనిరా, నవి ధరించుటకు లోనికి బోయెను.

తొమ్మిదిగంటల కందరు విశాలమగు భోజనమందిరమునకు బోయి యచ్చట మందిరమధ్యమున నమర్చియున్న మేజాబల్ల చుట్టు నధివసించినారు. బల్లపై తెల్లటి దుప్పటి పరచి, యందు పదికొవ్వువత్తి దీపపుబుడ్లు వెలిగించినారు. బల్ల పెద్ద కోడిగుడ్డాకారమున నున్నది. ఒడిలో నేపదార్థము పడినను దుస్తులు పాడయిపోకుండ కప్పుకొనుట కై మడతలిడి యుంచిన తెల్లని రుమాళ్ళు తీసికొని యందరు నొడులపై నడ్డముగా బరచుకొనిరి. ప్రథమమున వారందరు ద్రవ పదార్థము పుచ్చుకొందురు. అయ్యది యెముకల రసములో బోపు వేసినది. తర్వాత కోడిపిల్లవంటకము, కాబేజీ మధురము మొదలగు రుచ్యములైన పదార్థము లొకటివెనుక నొకటి తీసికొనివచ్చుటయు వారందరవి పుచ్చుకొను నుండిరి. మధ్యమధ్య చాంపేనుపానము సోడాతో కలిపి త్రాగుచుండిరి.

పదిగంటలన్నర యగునప్పటికి భోజనములు పూర్తియైనవి. పిమ్మట వారు చిత్రవిచిత్రములుగ తయారు చేసిన చాంపేనుబ్రాంది, విస్కీ బోర్డియో ద్రాక్షాది పానములు త్రాగి యానందించినారు.

డయానాను పియానో వాయింపుమని జగన్మోహనుడు ప్రార్థించెను. వారందరు సంగీతపు గదిలోనికి బోవుటయు, డయానా పియానో వాయించుచు నతిశ్రావ్యముగ బాడినది.

పిమ్మట డయానా వాయించుచుండ ఫ్రాన్సిస్‌కన్య కొంతసేపు పాడినది. పాశ్చాత్య సంగీతము పాడుటలో వాయించుటలో యూరేషియను జాతివారు చాల ప్రసిద్ధి చెందినవారు. యూరపియనుల సభలలో, వీరు పోయి మధురముగ బాడి వారిహృదయముల రంజింపుచుందురు.

పాశ్చాత్య సంగీతమునకు భారతీయ సంగీతమునకు మూల మొక్కటియే యైనను భారతీయ సంగీతసంప్రదాయ మొకమార్గమున ప్రవహించి మహాద్భుతముగ విజృంభించినది. ఆ మార్గముననే కొంతవరకు నడచిన పాశ్చాత్య గానవిద్యా సంప్రదాయ మంతటితో నాగిపోవ, నూతన సాంప్రదాయమును నిర్మించి జర్మనుజాతి యా గానమునకు క్రొత్త జీవము పోసినది.

భారతీయ సాంప్రదాయము రాగతాళముల ననేకరీతుల వృద్ధిచేసినది. పాశ్చాత్య సంప్రదాయము శ్రుతిని వివిధమార్గముల బెంపొందించినది. వారికి శ్రుతి ముఖ్యము, శ్రుతి సర్వము. దానికై వారు రెండుమూడు రాగములనే తీసికొన్నారు. భారతీయ సంప్రదాయము రాగము లెన్నియేని సృజించు కొన్నది. తాళభేదముల వృద్ధి చేసినది.

౮(8)

యూరేషియను సాంగత్యము

జగన్మోహనుడు భారతీయ గానసాంప్రదాయము విని యానందించలేడు. పాశ్చాత్య గాంధర్వమేనియు నాతని హృదయము గరిగింపలేదు. బడాయి కొరకు, గౌరవము కొరకు మర్యాదకొరకు నాతడు వినినట్లు నటించును. కాని మనస్సులో దన యాలోచనలలో నాతడు మునిగిపోవును. ఆడువారు, అందులో పడుచువారు కచ్చేరీ చేయునపుడుతక్క, నాతడు గానసభలకేగడు. పాడునట్టి యామె కన్నుల దిలకించును. కంఠము, పెదవులు, వక్షము గమనించుచు వివిధభావపథముల విషయలోలుడై యానందించును. లోకముమాత్రము జగన్మోహనరావుగారికి సంగీతమన్న పరమప్రీతియని ముచ్చటించుకొను చుండును.

డయానా పాడుచున్నంతసేపు నామె గంభీర నిషాదకంఠము నాలకించుట మాని యామె కంఠసౌందర్యము, గిరజాలవలె కత్తిరించియున్న యామె జుట్టు మెలికలు గమనించుచు, నా ప్రోడ తనకు ప్రియురాలగుటకు తానెంతటి యదృష్టశాలియో యని తన్ను దా మెచ్చుకొనుచుండెను. ఈమెను పెండ్లి యాడుటయే ధన్యత యనుకొనెను. తనకన్న రెండేడులు పెద్దయైన నేమి, అట్లెన్ని వివాహములు పాశ్చాత్య దేశములలో జరుగుట లేదు? నిజమైన నాగరికత వారికడనే యున్నది. వారివలె జీవించుటకన్న మానవుని బ్రతుకున కింక నేమి సౌందర్యము కావలెను? ఈమె యూరేషియను బాలికయని కొందరు తన్ను నిరసించవచ్చును. ఇంగ్లీషు బాలికలకన్న నీమె మిన్న యైనపుడు ఈ స్త్రీరత్నము నేల గ్రహింపరాదు? చెన్నపట్టణములో జదువుకున్న ఈ బాలిక విద్యావంతురాలు. తన తల్లి యొప్పుకొనక కొంచెము గడబిడ చేయు మాట నిజమే. ఆమె యెంతసేపు జమీందారీయెత్తుగల సంబంధము కావలయునని కోరును. ఇంగ్లండు దేశములో గూలివా డీ దేశములోని జమీందారులతో సమానము. వారితో సమానమగువారే యూరేషియనులు. అట్టిచో తల్లి యెట్లభ్యంతర పెట్టగలదు? ఇక జాతి మతముల మాటయా? బ్రాహ్మణులకన్న యూరేషియను అన్ని విధముల గొప్పవారే కద! డయానా యెంత సంతసించును? ఆ సుకుమార శరీర, యా దివ్య సుందర విగ్రహ తనకు బ్రియతమయగు భార్యయై, తన జమీకి రాణియై, తన భవనములో జక్రవర్తినియై సంచరించుచుండ చూచిన వారు పరమపవిత్రులైపోదురు. తన మేనత్త కూతురు ముద్దుల మిటారి, శారదను తాను పెండ్లియాడక పోవుటచే ఆ పల్లెటూరి పందకు, ఒరాంగు ఉటాంగుకోతి కీయవలసిన యగత్యము సంభవించినది యని మేనత్తకు కోపము గావున, తానీ భూలోకరంభను పెండ్లిచేసుకొన్నచో మొదట నీసు చెందినను తన్నతి ప్రేమచే జూచు మేనత్త చివరకు నొప్పుకొని తీరును. ఇంక నామె భర్తయా? ఆయన యనుమతి యెవరికి గావలయును? తన బాలికను తనకిచ్చుట కిష్టములేక పోయినదట. ఆయనకు యిష్టములేక, తుదకు పొలముదున్ను దున్నపోతు కిచ్చి వివాహము చేసినాడు. అట్టివాని యంగీకారముతో దనకు నిమిత్తములేదు.

సంగీతము పూర్తియైనది. పన్నెండు గంటలయినది. డయానా గ్రామ ఫోను తీసి ‘హావైను’ నాట్యగీత మొకటి తగిలించి జగన్మోహనుని నాట్యమునకు రమ్మని పిలిచెను. జేమ్సు ఫ్రాన్సిసుకన్య నడిగెను. ఆ పడుచుజంటలు పాశ్చాత్య ‘జాజు’ నాట్యానందములో మునిగిపోయినారు. పదునేను నిముషము లట్లు పరమ సంతోషపూరితులై నాట్యమాడి తక్కినవారితోబాటు వచ్చి కూర్చుండిరి. ‘జాజు’ ‘వాల్డుజు’ మొదలగు నాట్యములం దొక పురుషుడు నొక వనితయు గలసి నాట్యమాడవలెను. పురుషుడు వనిత నడుముచుట్టు గుడిచేయినుంచి కవుగిలించుకొని ఎడమచేతితో నామె కుడిచేయి పట్టుకొనును. పల్లవాధరియు పురుషుని భుజముపై ఎడమచేయి నుంచవలెను. ఆ సంశ్లేషముతో తాళమునకు సరిపోవునటు లడుగులు గలుపుచు చిత్రగతుల నాట్య మాడెదరు.

జగన్మోహనుడు యూరేషియనులుకూడ మెచ్చునటుల నాట్యమాడ గలడు. అతనితో నాట్యమాడుటయన్న యూరేషియను సుందరీమణులకు నెంతయో ప్రీతి.

వారందరు కూర్చుండిన వెనుక యూరేషియనుల దుస్థితిగూర్చి యావద్భారత యూరేషియను సంఘనాయకుడగు కాల్నెల్ గిడ్నీగారు కలకత్తాలో నిచ్చిన యుపన్యాసమునుగూర్చి చర్చవచ్చినది. ‘ప్రపంచములో నెవ్వరి స్థితియైన విచారకరముగ నున్నదన్న నది భరతదేశపు మన యూరేషియనుల స్థితి. మనల భారతీయులు దరికి జేరనీయరు. పాశ్చాత్యులదృష్టిలో మనము సంకరులము. శుద్ధయైరోపీయ రక్తము మనవారి నాడుల బ్రవహించుటలేదట. ఇటుల నీ రెండుజాతులచే నిరసింపబడిన మనము తీవ్రముగా మన కర్తవ్యము, మన భావిభాగ్యోదయమును గురించి యాలోచింపవలయును. హిందూ దేశములో మన జనసంఖ్య చాలాతక్కువ. మనమును కొలదికొలదిగ దేశమెల్లడ నున్నాము. కావున మనవోట్లెవరికి నుపయోగములేదు. మనకు స్థానిక సంస్థలలోగాని శాసనసభలలోగాని సరియైన ప్రాతినిధ్యము లేదు. మనవా రెందరో రైలు కంపెనీలలో బండినడుపువారుగా, గార్డులుగా, టిక్కెట్టు పరీక్షచేయు వారుగా, స్టేషనుమాస్టర్లుగా, ఇంజను పారిశ్రామిక స్థానములలో పనివారలుగా నియమింపబడియున్నారు. రైలుమార్గము లింగ్లీషు కంపెనీల చేతులలో నున్నంతకాలము మనవారి యుద్యోగముల కంత భయములేదు. అవియన్నియు బ్రభుత్వమువారిచేతికి వచ్చి ప్రభుత్వము ప్రజారాజ్యమైనచో మన గతియేమి? ఇప్పటికి రైళ్ళకంపెనీలలో భారతీయు లెక్కువగా నియమింపబడవలయునని సంచలనము కలిగినది’ అని చెప్పినాడు గిడ్నీ జ్ఞాపకమున్నదా?’ యని రొజారియో వాక్రుచ్చినారు.

జగన్మోహనుడు: అవునండి. కాని యూరేషియనులు సర్వవిధముల యూరపియనులతో సమానము. వారి సంతతియే అయినప్పు డేల యూరేషియనులకు భయముండవలయునో నాకు గ్రాహ్యమగుట లేదు.

రోజారియోసతి: మన దేశ మింగ్లాండుదేశము. ఎప్పటికైనా మన మక్కడకు వెళ్ళవలసిన వారమే. పాపం! ఇంగ్లీషు ప్రముఖుడొకడు సెలవిచ్చిన సంగతి నీవు వినలేదు. ‘అటు ఇంగ్లీషువారికి, ఇటు హిందూ దేశస్థులకు గూడ కాక యూరేషియనులు రెంటికీ చెడిన రేవడలైపోయినారు’ అని.

జగ: మీరంత యనవసరముగా భయపడుటకు నాకు గారణము కనబడుట లేదని ఇదివరకే చెప్పినాను. ఈ బ్రిటిషు ప్రభుత్వము పోదు. ఈ ప్రభుత్వ మున్నంతకాలము మనకు భయములేదు.

జేమ్సు: ఆలాగున మనం అనుకొనుటకు వీలులేదులే, రాజబహదూరూ! ఏనాటికైనా మనము భారతీయుల మనుకోవాలి.

ఫ్రాన్సిసు: భారతీయులు మనల జేరనీయరని అంటున్నారుగాదా!

జేమ్సు: అవును. అందుకనే మనం ఇంగ్లీషువారి ప్రియశిశువులముగాన భారతీయులకన్న గొప్పవాళ్ళము; మనల కూరుచుండబెట్టి వారందరు మనల బోషించవలయునన్న పిచ్చియాలోచన లిక మనం మానివేయవలయును. భారతీయులు వారి యభివృద్ధికై సలుపు నన్ని ప్రయత్నములలో మనము పొల్గొనవలయును. ఆ యుద్దేశముతోడనే రైలులో నుద్యోగములు చేయు మనవారందరు తక్కిన భారతీయులతో గలసి పనివారి సంఘము లేర్పరచినారు. సమ్మెలు మొదలైన వాటిలో వారితోబాటు మనవారును కష్టపడి పనిచేయుచున్నారు.

కొజా: జేమ్సు చెప్పినది బాగున్నది. మనం ఈ దేశములో బుట్టినాము. ఈ దేశములో ప్రాణాలర్పించి, ఈ మట్టిలో గలిసిపోవుచున్నాము. ఇంగ్లీషు వారుకాని, ఫ్రెంచి జర్మను వారలుగానీ మనల వారి యింటికి భోజనమునకు బిలుచుచున్నారా? మనతో సంబంధ బాంధవ్యముల నెరపుచున్నారా? మన కిత రాధారములు లేవు. రెక్కలే యాధారములు. అయినప్పడు మనము భారతీయులు సలుపు స్వరాజ్యాందోళనములలో వారికి వ్యతిరేకముగ బనిచేయకుండ, మన నాయకులతో మన సాధకబాధకములు చెప్పుకొని వారి ప్రేమ సంపాదించుకొనవలయును. ప్రభుత్వమువారికి మన కృతజ్ఞత, మన రాజభక్తి వెల్లడించి వారిదయకు బాత్రులమును గావలయును.

డయానా: మీరు చెప్పినది బాగున్నదండీ. కాని తీరా కాలం సమీపించే సరికి వీరూ మనల ద్రోసిరాజనెదరేమో? రొజా: ఆ చిక్కు రాకుండగ తప్పకొనుమార్గమే నేను చెప్పునది.

డయానాకు వీరి సంభాషణచే విసుగు జనించి తాను సీతాకోకచిలుక నాట్యమాడెదనని తెలిపి ఫిడేలువాద్యము వాయించగల తన యన్నగారిని ఫిడేలును, తన తల్లిని పియానోను వాయింప నియమించి, గెరార్డుబ్లాండెల్లో రచించిన ‘సీతాకోకచిలుక’ గీతముయొక్క స్వర ప్రస్తారము గుర్తుగల కాగితములు తెచ్చియిచ్చెను.

వారిరువురు వాయించుచుండ డయానా సీతాకోక చిలుక రంగుగల సన్న శాలువ రెక్కలుగబట్టి విచిత్రనాట్య మొనరించినది. ఆ నృత్యమున వారందరు తన్మయులై యుండ టింగ్ మని యొంటిగంట కొట్టినది. నాట్య మాగినది.

జగన్మోహనుని మోటారుశకటముపై రొజారియో దంపతులు, ఫ్రాన్సిస్ కన్య వెడలిపోయిరి.

జగన్మోహనుడు డయానాకన్యతో మేడమీద గదులలోనికి బోయినాడు.

జేమ్సు ఆ చీకటిలో సోఫాపైన కూర్చుండి స్పెన్సరుచుట్ట కాల్చుచు నేదో యాలోచనలో మునిగిపోయినాడు.


౯(9)

పొలం

సత్తెయ్యకు భార్య కొత్తగా గాపురమునకు వచ్చినది. పదునేడేండ్ల వయసుకత్తె. చామనచాయ. బిగువయిన యవయవములు, సోగచూపులు, స్ఫుట రేఖలుగల మోము, నవనవలాడు నూత్నయౌవనములోనున్న యామె పంట లక్ష్మివలె నవతరించినది. సోమయ్య ఇల్లు పావనమైనది. ఆతడా పేదయింటి పడుచు రూపు రేఖలకు వలచి కోడలుగా వరించి తెచ్చుకొనెను.

‘ఒక నూరురూపాయలు కట్నం తేస్తే నిండిపోతాదా? మన అదురుట్టం బాగుండాలి గాని, అదురుట్టం లేకపోతే కోడలు యెయ్యిరూపాయలు కట్నం తెచ్చినా అత్తింటిలో అడుగెట్టిందా అన్నీ భగ్గున మండిపోవడమే. మాకోడలు మాలచ్చే; చూస్తుండండి. మావోడి జల్మ పావనం అయిపోతాది!’ అని సోమయ్య తన చుట్టాలతో జెప్పికొన్నాడు. వెండివడ్డాణం, దండకడియాలు, పిల్లకాసులపేరు పెట్టుకొని చిరునవ్వు నవ్వుచు ‘పల్లెటూరి కాపుబాలయైనదా లక్ష్మి' యని అనిపించునట్లు సూరమ్మ సుబ్బారాయుడిగారి దొడ్డిలో బ్రత్యక్షమైంది.

జానకమ్మగారికి, సుబ్బారాయుడుగారికి నూత్నవధూవరులచే నమస్కారములు చేయించుటకు దీసికొనివచ్చినప్పుడు, సుబ్బారాయుడుగారు నూరురూపాయలు వారికిచ్చి, సంసారమునందలి కష్టసుఖములు వారికిబోధించి, భార్య మనస్సు నొవ్వకుండా పువ్వులలోనుంచి కాపాడుకొనుచుండవలయును అని సత్తెయ్యతో జెప్పుచు ‘దీర్ఘాయురారోగ్యాభివృద్ధిరస్తు, దీర్ఘసుమంగళీభవ, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు’ అని దీవించినారు. ‘అమ్మాయీ, అత్తగారికి, మామగారికి, మగనికీ మనస్సు నొవ్వకుండా సంచరించుకుంటూ ఉండు. వారికి సేవచేసి మెప్పుపొందు. ఈ రూపాయలు పెట్టి వీరికి నగలు చేయించి పెట్టరా సత్తెయ్యా! నీ తల్లికడుపు చల్లగా నీ అత్తకడుపు చల్లగా పిల్లల్నీ మనుమల్నీ యెత్తి వేయికాలాలకు మీరంతా చల్లగా ఉండండి’ అని ఆశీర్వదించి జానకమ్మగా రొక చీరెయు రవికెలగుడ్డయు పసుపు కుంకుమ పళ్ళు కొబ్బరిబొండములు పెండ్లిగూతునకు నిచ్చినారు.

మరునాడు సోమయ్య యుదయముననే యూడ్పు పొలముల కలుపు తీయించుటకు వెళ్ళినాడు. బుడమ, కొణామణి, ఆట్రగడా, అక్కుళ్ళు, కృష్ణ కాటుకలు సుబ్బారాయుడుగారి ఇంటిఖర్చుకై పాలాట్రగడము నూడ్చినారు. చేలన్నియు బాగుగా పెరిగినవి. ఇదివరకే యెనుబది ఎకరములకు కలుపు తీయించినారు. తక్కిన యిరువది యకరములలో పదిమంది మాలవాండ్రు నితరులు కలుపు తీయుచుండిరి. సోమయ్య తాటియాకుల గొడుగు వేసికొని గట్టుమీద కూర్చుండి పని చూచుచుండెను.

మాలపెద్ద ముసలినాగడు ‘యీ రోజులలో కుఱ్ఱోళ్లు పని చేయగలరంట్రా! ఆడు సూడు, యెదవనాయాలు. కబుర్లేగాని, పనిలేదు. వంగండఱ్ఱా వంగండి? యని కేక వేసెను.

సోమయ్య: ఒరేయి! పోతుగోయ్! ఏవిట్రా అదీ! కలుపు తెంపుతున్నావా, మేస్తున్నావా? వెదవబద్దకాలా? యేళ్లలోంచి లాగరా! మళ్ళీ పెరగవంట్రా! ఓరే నాగన్నా ఆడిపని సూడరా. సరీగ్గా చెయ్యకపోతే ఈ వాళ కూలి సున్నే. ఆ ఆడపిల్లల్ని చూసి బుద్ధి తెచ్చుకోరా కుంకన్నా, యీ పిరగేస్తాను.

నాగన్న: బాబూ! యీళ్ల పని మజాఅయిపోతోందండా! పెద్దోళ్ళ మాట యింటారా యావన్నానా?

సోమన్న: ఒరే పెద్దమాలా మంచికథ చెప్పరా! అది వింటూ పని సురుగ్గా చేస్తారు. మట్టగిడసల్లా ఉన్నారు. పనంటే తొంగుంటారు.

నాగన్న: మరి రాగంతో సెప్పేత్తాబాబూ! ఆళ్లందరిని కలిసి ఊకొట్టమనండీ!

అందరు: తప్పక, ఆ! ఆ.........! (అని కూనిరాగంతో ఊకోట్టుచుండిరి.)

నాగన్న కథ దీర్ఘంగా చెప్ప నారంభించెను.

‘అనగనగా ఓ దేచంలో ఓపట్టణముందా’ ‘ఆ పట్టణానికి పరుగుదూరంలో పెద్ద మాలపల్లి! ఆ పల్లెలో రెండు వందల గుడిసెలు, ఓదాని పైన ఓటెక్కి, ఉక్కిరి బిక్కిరిగా ఉన్నాయా.’

‘ఆఁ....!’

‘ఓ మాలపల్లి పెద్దమాలోడు! ఆడు పూర్వం రాజులనుంచీ ఆరికి కాపలా కాసుకుంటూ సాకిరీ చేసుకుంటూ, నమ్మకంగా పెబువువోరి మణుసొచ్చిన బంటై ఉన్నాడా.’

‘ఆఁ...!’

‘ఓ రా పెద్దమాల యెంకటిదాసుకు భూమి, బుట్ర, పశువులు, పెంకుటిల్లు, సిరి సంపద యేసీ యెయకుండా ఉన్నా ఓడు ఎఱ్ఱబణాతుగోచెట్టి, ఎండి పొన్నుకర్ర సేతబట్టి, యీదెంట యెల్తావుంటే యెలాగుండేది! అతగాడికి మాబగితి, పొద్దత్తమానం బజినేలు, సదువుకోడం, పాడుకోడమున్నూ. అతగాడికి దైభముగొంతెమ్మల్లాగో, పాండవులోరిలాగో కిట్టమూతిలాగో కనబడే వోడంట. అతగాడిమాట నిజమైపోవాల. అతగాడు యిగిబూతి పెడితే దెయ్యాలు గియ్యాలు పారిపొయ్యేవి. సెయ్యెత్తితే రోగాలు సెదిరిపొయ్యేవి. అమ్మవోరిని పలకరిస్తే ‘వూ’ అంటదంటా...’

‘ఆఁ...!’

‘అతగాడికి ఓకొడుకు, ఆడికి దేముడు దయ్యం గియ్యం బయం లేదు. ఆడికి దెయ్యాలకంటె బలం! రాక్షసుడులాంటిశగితి, బల్లూకం_అంటే ఎలుగుబంటిలాంటి పట్టు! ఆణ్ణిసూత్తే అందరికి బయమంటా!’

‘ఆఁ...!’

‘మరిగంటే ఆడిపేరు మరకడు! మరకడికి ఆడపిల్లలంటే మణుసు. పయిటంటె పక్క లెగరేస్తాడు. రైక అంటే రంకెలేస్తాడు. ఇంతకొప్పెట్టి ఇంత కుంకుమెట్టి, చెవిలో తురాయిపూవు, మెళ్ళో గందం అలంకరించుకొని, చీర ఎనక్కుకట్టి, సంకకింద తట్టెట్టి, సంతలో కోమటాయనతో యేళాకోళాలాడి, కొబ్బరిచిప్పలో కొబ్బరినూనె యేయించి తలకు రాసుకొని, నవ్వుకొంటోయెళ్ళే నల్లపిల్లని సూసినాడంటే ఆడంతే ఆగిపోతాడు. పాణమైన యిచ్చేస్తుడా ...’

‘ఆఁ...!’

‘అయ్యబత్తిమాట తలచడూ, ఆడి మరియాద తలచడూ, ఆ పిల్ల యెనక బడి లంచమిత్తానంటాడూ, రయికలిత్తానంటాడూ, సీరలిత్తానంటాడూ, ముద్దెట్టే నాపిల్లా, నేనందంగా లేనంటే అని మిణకరిస్తాడు, మీసం తిప్ప కొంటాడు.’

‘ఉఁ...!’

‘కాలవరేవుకీ, పొలంలోకి, గడ్డికోతకాడికీ యెళ్ళే పిల్లల్ని చూస్తే, ఆంబోతు ఆవుల్ని చూసినట్లే. ఒంటిపిల్ల యెల్లిందంటే ఆడి మొగతనానికి కొండచిలవకి లేడిలా అయిపోతదే, నక్కపోతుకు కోడిపెట్టలా అయిపోతదే!’ ‘ఊఁ ...’

‘ఆ మరకదాసు తండ్రి సెప్పినమాట యినడు, దర్మ పెబువులు సెప్పిన మాట యినడు, తలారి సెప్పినమాట యినడు, తన దాచ్చిణ్ణెం సెప్పినమాట యినడూ.’

‘ఊఁ...!’

‘ఆ పల్లెలో పెద్దోళ్ళు, సిన్నోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు ఆ ముసలి మాలపెద్దతో మరకాయి సేసే దురంతాలు సెబుతుంటే, ముసలోడు పెద్దూపిరిడిసి కళ్లు సగం మూతలైపోగా, ‘యీయాళ కాకపోతే రేపు, ఇంటికాడ కాకపోతే పొలంలో, మొగోడి సేత కాకపోతే ఆడదానిసేతే ఆడికి బుద్దొత్తది. ఆడు నా కొడుకుగాడు, మనిసిగాడు, ఆడిసేటు ఆణ్ణి కొట్టేస్తది’ అని సెప్పినాడురా.’

‘ఆఁ...!’

‘మరకడే దున్నపోతంటే. ఆడికి సేగితులు, దురిబోదనుడికి శకుని గాడు కరుణూడులాగ! రాబణాసుడికి కడగరోముడు, కుక్కతలోడు కుంబ కరుణూడులాగ! పది పిచ్చి కుక్కల్లాంటి బలగం ఉందిరా.’

‘ఆఁ!’

‘ఆ మాలగూడేనికి పెద్ద యీరమ్మ సెరువుపక్క, యెట్టి యీరన్న గుడిసుంది. ఓరందులో నీలాలు ఆడి కన్న కూతురుంది. అది గoటే గంగన్న బారియంట. గంగన్న మరింకో మాలపల్లికి యెట్టివోడంట. దాన్ని సూత్తే మైనంగోరువంక సిగ్గుపడాలి. బేతాళుడు గుడిలో నున్నగా తోయిన బాకులా తళ తళ లాడేటి వొళ్లు, లేత రావాకు అరసేతులు, సెంగలువకాడ సేతులు, సెందురుడులాంటి మొగమూ, నగచత్రాల్లాంటి పళ్లు, పిల్ల రెపరెపలాడిపోతూ గున్నమాయిడి సెట్టులా ఉండేదంటా!’

‘ఆఁ!’

‘ఒరే దాని మొగుడు ఒంగోలు కారాంబోతు; గోదావరి కాలవలాగ మాసోకైన మనిసంట. నీలాలుపిల్లా దాని బరత గంగన్నా రాయిసెట్టు యేపసెట్టు, తాడిసెట్టూ నల్లేరుతీగ, జంట పావురాలులో ఒకళ్లొకళ్ళు యిడవకుండా మా ఆపేచ్చంగా, మోగంగా ఉండేవోరు.’

‘ఊఁ!’

‘మొగుడు పనిమీద ఐదరాబాదెళ్ళితే, పుట్టింటికొచ్చిందీ. పెద్దపులికి ఆవు కనపబడ్డట్టు, బెమ్మరాచ్చసికి మనిసి కనపడ్డట్టుగా, సక్కనైన నీలాలు మరకన్న కంట పడిందంటరా!’

‘ఆఁ!’

‘ఎప్పుడైతే నీలాలు పిల్లదాన్ని సూసినాడో ఆడిమనసు మనసులో లేదు. దీన్ని అనుబయించకపోతే జల్మం ఎందుకు, బలం ఎందుకు, పాణం ఎందుకు? అని అనుకున్నాడు. నీలాలు పిల్లదాని బాబుకి మాయిడిపళ్లు, సెకరకేళీలు, సీరలు, రైకలు పంపించేవోడు. నీలాలుతండ్రి అవన్నీ పట్టుకుపోయి కోపంతో ఆళ్లింటిలోనే పారేసి, యెంకటదాసుతో ‘నీ కొడుకు సేసే దురన్యాయాలుకి మితుండటంలేదు. ఆడికి నువ్వు బుద్ది సెప్పుకుంటే మాం అంతా సంతోషిస్తాము’ అన్నాడు...!’

‘ఊఁ ... !’

‘ఓరోజున మరకడు, సెరువుకు నీరుకోసం ఒంటిగా ఎడుతూన్న ఆ సక్కనిపిల్ల నీలాలుదానిసూసి ‘ఒలే నీకంటిమిద నామణసు, నీ వొంటిమీద నా సూపు, నీ సేతులు, నీ నడుము, నీ అందం నన్ను నీ కుక్కను సేసినై. నువ్వూ నేనూ మారుమనువు సేసుకొందం, నీ మొగుణ్ణి తోలెయ్యే. ఆడికి ఎంత సొమ్మయినా తప్పు ఇచ్చేస్కుంటాను, నేనంతగా దేన్నీ బతిమాలలేదే. నీకు దాసుణ్ణి. నీ ముందర నా బలం అంతా నీరయిపోయింది. నన్ను రచ్చించుకో’ అని దణ్ణం బెట్టాడు. నీలాలు బయపడి గజగజ లాడిపొయ్యింది. ‘ఓరన్నా, నీ తోడుబుట్టిందాన్ని, నాయనా నువ్వల్లా అనవచ్చునంటరా ’ అన్నాదుండి.’

‘ఈలా ఒక సారికి రెండుసార్లు, మూడుసార్లు దాన్ని రెట్టించినాడంటా... లొట్టలేసినాడంట సివాల్న సీరకొంగు యిసిరిపట్టి సేయిపట్టుకొన్నాడంట.’

‘ఆ ... !’

‘సెయ్యి యిదిలించుకోని సెలపెయ్యలాగా పోతూన్న నీలాల్ని, యిడిపొయ్యేదాని కొప్పుసూసి ఒళ్ళు బిగి వొదిలేసినాడు. ‘ఇది మామూలుగా లొంగదు, దీన్ని బలవొంతం సెయ్యాల్సినదే. మామూలుగా లొంగేది కాదురా మా గెట్టి మణసు. దీని పొంకవైన ఒళ్ళు నా ఒళ్లు నొక్కేస్కోవాల; దీన్ని ముద్దెట్టుకున్న వోడిజల్మమే జల్మం’ అనుకున్నాట్ట.’

‘ఆఁ ... !’

‘ఆరి! ఓ రోజు సీకటడేయాల కుప్ప నూరుస్తుండే అయ్యకి కూడిచ్చేందుకు ఒంటిగా పొలం ఎల్లే నీలాల్ని సూశాడు. ఆడివొళ్లుప్పొంగిపోయింది. ఆడి కళ్ళెఱ్ఱబడినై. ఆడి గుండె జల్లుమందిరా నాయనా, పుంత దారిలో బైరాగుల సింతకాడ, ఆడు తన జట్టుతో దాంకోని ఉన్నాడు. దారికడ్డంగా నిలుస్సొని ‘ఓసీ! నాదాన! నీ కన్నులు కరిగిపోను, నీ గుండె మరిగిపోను, నా సేతుల్లోకి రాయే!’ అంటూ దానిమీదపడ్డాడు. ఆ సిన్నది లేడిలా ఒణికిపోయింది, బతిమాలింది, బయ మెట్టినాది. ఎలా తప్పించుకొందో, ‘ఓలమ్మో, ఓలిబాబో, రచ్చించండో అన్నల్లారా!’ అంటూ ఒకటే పరుగు, ముందు నీలాలు యెనక మరకడు ఆడి సేగితులు! మరీ యెల్లావచ్చిందో యెంకటదాసింటిలోకి వచ్చిపడ్డాదంటరా.’

‘ఆఁ ... !’ “యెంకటదాసు ‘ఏటినాతలి! నీకు బయం లేదులే!’ అంటూ గువ్వపచ్చిలా ఒణికిపోయే పిల్లను అదిమిపట్టుకొని, సల్లసల్ల కబురులు సెపుతూ ఇంటి తలుపు యెయ్యబోతూ ఉంటే మరకడుగాడు తలుపు తోసేస్కోని లోపలపడ్డాడు. ఆడు దెయ్యంపట్టిన రాక్షసిలా ఉన్నాడు. అయ్యను సూసి ఆగిపొయ్యేడు. ఆడిసేగితులంతా గుమ్మందగ్గర నిలబడ్డారంటఱ్ఱా!”

‘ఆఁ...!’

‘ఓ రప్ప డెంకటదాసు రామా! రామా! అంటూ ‘ఓరి యెదవన్నా రాచ్చసీ, ఇంటిలోకి వచ్చావుంటే నీ పాణం పోతాది. నీ సేటుకాలం నీకింత తెస్తాఉంది. నా కడుపుకు సెడపుట్టినావురా! నాబగితికి యేరుపురుగువురా!’ అంటూ రెండు సేతులూ సాసి మరకడి కడ్డంగా నిలబడిపోయాడు.’

‘ఊఁ...!’

‘తండ్రనిలేదు, దైభమని లేదు, బయమని లేదు, బగితని లేదు; తండ్రిని తప్పించుకొని, గజగజలాడిపోతూ మూలనుంచోని ఉన్న నీలాలుమీద పడ్డాడు. తండ్రి లాగబొయ్యాడు, తప్పించ పొయ్యాడు; తండ్రిని ఒక తోపుతో మూలకు పడేసేప్పటికి యెంకటదాసు గోనెబస్తాలాగు కూలబడిపోయినా డంట్రా!.’

‘ఆఁ...!’

‘మరకడు పిశాచంలా అయిపొయ్యాడు. నీలాలుదాని కోక యిప్పి పారేసి మూలకిసిరాడు. తళతళ లాడిపోయే దానివళ్ళు ముడుసుకుపోయింది. ఒరే మరకడు పందయ్యాడు, యాగ్రము అయ్యాడు, అడవిదున్నపోతు అయిపోయాడు. తనబట్ట యిప్పిపారేసికొన్నాడు. తండ్రి సూత్తున్నాడని లేకుండా, రాక్షసిముండకొడుకుల్లాంటి సేగితులు సూత్తున్నారని లేకుండా ఆ సిన్నదాన్ని కింద పండబారేసి మీదడిపొయ్యాడు...’

‘ఊఁ...!’

‘మూల సినిగిపోయిన గుడ్డలా, సీపురుగట్టలాపడి ‘రామా! రామా! రామా! రామా! మహప్పెబూ రచ్చించు, రచ్చించు’ ఆంటూ కళ్ళుమూసుకొని ఉన్న యెంకటదాసు కళ్లు తెరిసి చూసినాడు మరకడు దానిమీదడ్డము, ఆ పిల్ల సాయాశక్తులా ‘ఓరిబాబో! యెంకడదాసూ! తండీ రచ్చించో!’ అంటు ఆడికిలొంగకుండా తిరిగిపోడమున్నూ.’

‘ఊఁ...!’

‘హుమ్మని ఉగ్రుడై లేచాడురా యెంకటదాసు! ఆడికి యెయ్యి యేనుగుల బలము వొచ్చినట్లయిందిరా! అమ్మవోరి జాతరకు యేటపోతుల్ని తెగేసే యేటకత్తి గోడమీదెట్టిందాన్ని తీశాడు. ‘అల్లల్లాభైరాహూం! ఆకాశ భైరాహుం అలలలలా! లలా! లలా!” ఆంటూ కత్తి మూడుసార్లుతిప్పి ఒక్క యేటుతో కొడుకు తలకాయ యేట యేసేసరికి తాటి సెట్టుమీంచి పండ డ్డట్టూ, తలకాయ మూల్నబడింది. మొండెము గిజగిజ కొట్టుకుంది. ‘హుమ్ము! అలా! అలా!’ అంటూ యెంకటదాసు ఆ రగతము ఒళ్లంతా రాసుకోనీ ‘నేను బైరవుణ్ణీ! నేను ఆంజనేయుణ్ణి! హుం!’ అంటూ యీదిని బడ్డాడు. యొక్కళ్ళేని బలము, యెక్కళ్ళేని శగితి, పెద్దపులిలా, మరకడిగాడి సేగితుల్ని యెంటాడించి, దపా, తపా, ధం అంటూ పారిపొయ్యేవోళ్లని తరిమీ, తరిమీ యిద్దర్ని సంపేసినాడు. తక్కినాళ్లు ‘ఓలమ్మో ఓఓ’ అంటూ తలో దారిమీదా పారిపొయ్యేరు.’

‘ఊఁ...!’

‘ఆ ఉగ్గరం తగ్గలేదు. పెజలు యేనకుయేలు మూగారు. పొగలేశారు, కొబ్బరికాయలు కొట్టినోరు, కోళ్లనుజంపినోర్లు, రగతం మొగం మీద జల్లినోళ్ళు. అప్పుడు యెంకటదాసుకు పూనిన యీరబద్దుడు చల్లారాడు. అప్పుడు యెంకటదాసుకు మెలకూ వచ్చింది. కొడుకుని, ఆడి సేగితుల్ని సంపినానని తెలుసుకొని యెంకటదాసు ‘శీ రామా సీతారామా నీ కరుణా!’ అంటు మంచమెక్కి రెండు రోజుల్లో ఆ భగవంతుడిలో ఐక్యమైపొయ్యాడు. నీలాలు మరకడెప్పుడు తన సీరిప్పేసి నాడో అప్పుడే మూరసపోయింది. ఆ మూరసలోంచి తెలివిరాలేదు, పేణం పోయిందిరా.’

‘ఆఁ...!’

‘ఓరి నీలాలు పాణం ఒదిలేసింది అని నీలాలు తండ్రికి తెలిసిందోలేదో ఆడుకత్తిపుచ్చుకొని బయలుదేరి, దారికాసి పుంతకాసి మరకడు సేగితుల్ని యావన్మందిని సంపేసి తాను నదిలోపడి నీళ్ళలో కలసిపోయినాడురా!!

‘ఆఁ...!’

౧౦(10)

పాలేర్లు

శంనోమిత్రః శంవరుణః శంనోభవత్వర్యమా

శంనఇంద్రో బృహస్పతిః శంనో విష్ణురురుక్రమః

భరత ఖండము పంటభూమి. చరిత్రయను మాయాపటమును తొలగించి చూడగలిగితిమేని యీగడ్డపై బుట్టిన ప్రజలు తొలినాళ్ళనుండియు కర్షక వృత్తినే ప్రధానముగ నమ్మియున్నారని తేట తెల్లము కాకమానదని సుబ్బారాయుడుగా రాలోచించుచు కూర్చుండినారు. ‘ఓ వరుణదేవుడా! మా నాగేటిచాళ్ళను మేఘములను గొనివచ్చి తడుపుమా. ఓ ఇంద్రుడా! నీ సప్తవర్ణముల ధనువు మా మనముల కానంద మొనరింపుచుండ, మా పొలములను ఫలవంతము చేయుము’ అను ఆర్యఋషుల సూక్తము లాయన హృదయమున ప్రతిధ్వనించినవి. సుబ్బారాయుడు గారు దేశమున జరుగు విషయముల నన్నింటి నప్పటి కప్పుడు కనుగొనుచునే యుండిరి. ఆంధ్ర, కృష్ణాప్రత్రికల నాయన చదివెడు వారు. ఆంధ్రదేశమున నేపత్రిక వెల్వడినను, దానిని సుబ్బారాయుడు గారు తెప్పించవలసినదే. ఆంధ్రప్రకాశిక తెప్పించినారు, మనోరమ తెప్పించినారు. ఆంధ్రభాషాభివర్ధనీ సమాజమునకు, విజ్ఞానచంద్రికా మండలికి నింక ననేక గ్రంథ ప్రచురణ సంఘములకు సుబ్బారాయుడుగారు చందాదారు. అన్ని గ్రంథములను బరిశీలనాపూర్వకముగ జదివి ఆయన మనన మొనర్చుచుండును, ఆయన సేకరించిన గ్రంథాలు బదివేలవరకు నున్నవి. ఆవి తనగుమాస్తాచే వరుస నేర్పరిచి సంఖ్య నియమించి గ్రంథాలయము చేసినారు. ప్రపంచమున యేయే దేశముల నేయే పంటలు పండునో వాని కనువగు పరిస్థితులేవో తెలిసికొనుటకు, ఆయన భూగోళ పాఠ్యగ్రంథములు పరిశీలించినారు. కావుననే పాశ్చాత్య విద్యలో గడిదేరిన నారాయణరావు, శ్రీరామమూర్తులుగూడ సుబ్బారాయుడు గారు తమలో జర్చచేయుచు చూపు వివిధ విషయజ్ఞానమునకు నచ్చెరువందు వారు. నారాయణరావుచే నాయన ఇంగ్లీషులోనున్న అర్థశాస్త్ర గ్రంథముల జదివించుకొని యర్థము చెప్పించుకొని అతనితో నాయావిషయములు విపులముగ చర్చించి యర్థముజేసికొన్నారు. ఆయా దేశములందు భూములపై రాబడి యెంత యైనది, పన్నుల మొత్త మెంతయైనది, పన్నులకు రాబడికి గల సంబంధమేమో విపులముగ జర్చచేసినారు.

భరతదేశమున నన్నిటి ఖరీదులతోపాటు భూమి ఖరీదులును బాగుగానున్నవి. యుద్ధము మొదలిడిన నాటినుండి ఖరీదులు మఱియు పెరిగిపోయినవి. భూమి ఖరీదులు బాగుగా నున్నవని ప్రజలు అధికవ్యయము సేయ నారంభించినారు. అధికవ్యయ కారణమున నప్పులు పెరిగిపోతున్నవి. సుబ్బారాయుడుగారు దేశ మెక్కడకు బోవుచున్నదో యని యనుకొన్నారు. వడ్డీ విపరీతము, మారువాడీలు, దేశములోని షాహుకార్లు, నూటికి నెలకు మూడు నాలుగు రూపాయల వడ్డీ పుచ్చుకొనుచుండిరి. అర్ధరూపాయి, తప్పిన బదియణాలుకన్న నెక్కువ పుచ్చుకొననని యాయన ప్రతిజ్ఞ. ఆప్పు పుచ్చుకొనునప్పుడే షాహుకారు కమిషనట. నూరురూపాయలు పుచ్చుకొనువాడు నిజముగా పుచ్చుకొన్నది తొంబదియైదే. తక్కిన యయిదు కమిషను. అదిగాక గుమాస్తాలకు మామూలు, దేవుడికి ధర్మానికి మామూలు. పుచ్చుకొన్న నిముషమునుంచీ వడ్డీ పంజాబు మెయిలు వేగముతో, వాయువేగముతో, మనోవేగముతో పెరిగిపోవు చుండును.

‘అబ్బాయి, యీధరలున్నాయా! యీ దేశానికి తగ్గనిధరలు. మాయ యుద్ధం ఎక్కడనుంచి వచ్చిందో ప్రపంచం అంతటా ధరలు పెంచేసింది. పోనీ మనవాళ్లు యీ పదేళ్ళు కాస్త జాగ్రత్తపడి ఋణాలు పణాలు తీర్చుకొని వెనకటివలెనే జీవనం చేసుకుంటూవుంటే రైతుకు పదిరాళ్లు వెనకబడి ఉండేవి. నువ్వు నాదగ్గరకు అప్పుకువచ్చావు. నువ్వు ఈధరలలో అప్పుతీర్చడం ఉత్తమాట. ఇక భూమి అమ్మాలి. ఎవరైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిన వాళ్లు కొనాలి. అల్లాంటి వాళ్ళు ఎప్పుడూ దొరుకుతారా? ఎక్కడ కావలిస్తే అక్కడ దొరుకుతారా? ఏమోయి వసంతయ్యా!’ అని సుబ్బారాయుడు గారు తన్ను బదులడుగుటకు వచ్చిన వసంతయ్య అను గోపాలపురం పెద్దకాపును పృచ్ఛచేసెను. వసంతయ్యకు నారువేలప్పు భూమితాకట్టుమీద కావలయునట.

‘స్వంత కమతం ఎప్పుడైనా లాభమిచ్చిందోయి? మాతండ్రి నాటి నుంచీ మేమూ స్వంతకమతం చేయిస్తూనే ఉన్నామా, పల్లంసాగుపై ఒక్క సంవత్సర మైనా లాభించింది కనబడదు. ఎంతపంటయినా ఈ పన్నులు మింగేస్తున్నాయయ్యా. అదీ కాకుండా ధనం దేశంలోంచి ప్రతినిమిషము పోతోంది. దానితోటి మనకొంపలు మునిగిపోతున్నాయి.’

‘అదేమిటండీ బావయ్య గారూ! ‘వాడికేం పచ్చగాఉన్నాడు’ అని మనం అనుకునే ప్రతివాడు లోపల లొఠారమే కదాండి.’

‘ఏమిటంటావు దానికి కారణం?’

‘అప్పులండి మరి.’

‘ఎందుకా అప్పు అయిందీ అంట?’

‘తమరిందాకటినుంచి అన్న కారణమేనండి బావయ్య గారూ. ఒళ్ళు తెలియకుండా అప్పులు చేశాము. నా చిన్నతనంలో వెండినగలేకాదండీ! ఎట్లా వచ్చిందండి బంగారం, అప్పులు చెయ్యకపోతే? యుద్ధం వచ్చినదగ్గర నుంచీ బంగారం కొనడం మొదలెట్టాము. మాకప్పులే, ఆడోళ్లకిమాత్రం ఒళ్ళంతా బంగారం.’

‘దానికేమిలే బంగారమైనా కనబడుతూంది. తక్కిన ఖర్చులమాట?’

‘అవును బావయ్య గారు! కుఱ్ఱాళ్ళకి చదువుఖర్చులు, మావోళ్ళిద్దరూ రాజమండ్రిలో కాలేజీలో ఓడు, పెద్దస్కూల్లో ఓడు. వాళ్ళు డబ్బు మింగేస్తున్నారండీ బావయ్య గారూ.’

‘చదువు చెప్పించడం తప్పననుగాని, మనం చదువులికి కుఱ్ఱాళ్ళను ఎందుకు పంపిస్తున్నాము? యుద్ధము రాక పూర్వం దేశంలో పైచదువులు చదువుకున్న వాళ్లు తక్కువ. చదువుకున్నవాళ్లు నలుగురే. వాళ్లందరికీ తలాఒక ఉద్యోగం అయింది. వాళ్ళు కాస్త పచ్చగావుండడం, నెలకి తప్పకుండా నాలుగురాళ్లు వస్తూవుండడం. మన రైతులదగ్గిర ధాన్యంరోజులలోనేగా నాలుగు రాళ్లు కనబడడం?’

‘చిత్తం.’

‘కాబట్టి మనవాళ్ళేంజేశారు? ఉద్యోగాలు మన్ని పోషించాలికాని భూములు కాదనుకున్నారు. ఇక అసలే లేవలేనమ్మ అట కెక్కుతానందని, చదువుల్లో తగలడి చక్కాపోయ్యాము. మనదేశంలో చదువంత ఖరీదుగల వస్తు వింకోటి లేకుండావుంది. పూర్వం చదువు యొక్క లోపలివిలువ ఎక్కువ. ఇప్పుడు పైవిలువ ఇంటిని గుండం వేసి గోదావరిలో కలిపి దిబ్బ చేసే ఖరీదు. జీతాలునాతాలు, పుస్తకాలు, హోటళ్లు, కాఫీహోటళ్లు ఇంటి నుంచి కుఱ్ఱాడు చదువుకునే ఊరికి డబ్బు కాల్వకట్టాలిసిందే. ఈ చదువుకి ఇంతా తగలేసి దానికి వడ్డీ తీసుకురాగలడా? ఇక ముందూ? ఇంకా కొంచెం మీ బ్రాహ్మణేతరులలో ప్రస్తుతం చదువులవల్ల లాభం ఉండవచ్చులే. కానీ ముందుముందు ఈ చదువులు మన కొంపలు తీసే చదువులనీ, ఉద్యోగంకోసం చదివించడం అంత తెలివితక్కువ ఇంకోటి లేదనిన్నీ మనకు పూర్తిగా తెలుస్తుంది. అందుకని వ్యవసాయాన్నే నమ్ముకుందామా అంటే నష్టం నష్టం నష్టం.’

‘నామట్టుకు నేను ముప్పయి యకరములభూమి వ్యవసాయం చేస్తున్నాను. నాలుగువందల ఏబది పైచిలుకు వస్తాయి బస్తాలు. పన్నులకు మామూళ్లకి ఎనభై బస్తాలు పోతాయి. పాలేళ్లకు, దూళ్లకి, కూలికి, విత్తనాలకి అన్నిటికి ఇంకోనూరు బస్తాలు పోతే యింక మిగిలే రెండువందల ఎనభై బస్తాలలో తిండికి మాకుటుంబానికి ధాన్యంమట్టుకు యాభైబస్తాలు పోతాయండి. ఇంకున్న రెండు వందల ముప్పయి బస్తాలకువచ్చే పదమూడువందల ఎనభైరూపాయలూ ఏడాదికి గడవాలి. దీంట్లోనే చదువులు, దీంట్లోనే గుడ్డలు. రామ రామా! బావయ్య గారు, ఆడవాళ్ళ గుడ్డలకి చాలవండీ మనపంటలు.’

‘అంతటితో అయింది! మఱి వ్యాజ్యాలు వల్లకాళ్ళు, కక్షలతో క్రిమినలు కేసులు, కౌళ్లుకదపాలకు రిజిష్టర్లు, అమ్మకాలకు రిజిష్టర్లు, రిజిష్టరీఖర్చులు, లంచాలు, పురుళ్ళు పుణ్యాలు, రైళ్లు, మోటార్లు - ఎన్నని? ఈ లోపుగా ఏ పెళ్ళో వచ్చిందా, యిక దానితో ముంపేకదా.’

‘బావయ్యగారు అదేనండి. మా మూడోఅమ్మాయి పెళ్ళిఖర్చువచ్చి నెత్తిన కూర్చుందండి. ఇదివరకు చేసిన పెళ్ళిళ్ళకి వాటికి కష్టపడితీర్చానండి. మీకివ్వవలసిన నోటు బాకీ పదిహేను వందలు, ఈ పెళ్లికి కట్నంవగైరా ఖర్చులు, అంతా నలభై వందలు కావాలండి.’

‘సంబంధం ఎక్కడిదోయి?’

‘పూళ్ళండి. డబ్బు నిలవవుందండి, కొండ్రా ఉందిట కొంచెం. కుఱ్ఱవాడు మా వాడితోపాటు రాజమహేంద్రవరంలో చదువుతున్నాట్టండి. కట్నం నాలుగు వేలు, లాంఛనాలు పదిహేనువందలు.’

‘పెళ్ళిఖర్చులు రెండువేలు. నాలుగువేల అయిదువంద లేమి సరిపోతాయోయి?’

‘ఇంటిదగ్గర బాకీ తీర్చడానికి ఉంచిన పదిహేనువంద లున్నాయండి. మా యింటావిడ వెయ్యరూపాయ లిచ్చింది.’

‘పెద్ద రైతువు. నీకున్న ముప్పై యకరాలు నాకు తనఖా అక్కర లేదు. ఇరవైచాలు, వాయిదాలు పది. వడ్డీ మామూలు అర్ధరూపాయి. కావలిస్తే యింకో పదిహేనువందలు పుచ్చుకో.'

‘వద్దండి బావయ్య గారు, నేను చేసిన అప్పు నేనే తీర్చివెయ్యాలండి. మీ అప్పుతప్ప నేనింకో అప్పు చెయ్యలేదు. మీ దగ్గిరతప్ప నే నింకోళ్ళదగ్గిర తేను.’

తనఖాపత్రము వ్రాయుటకు ముహూర్త మేర్పరచుకొని వసంతయ్య వెళ్ళిపోయినాడు.

సుబ్బారాయుడు గారు దినదినము ఏ పొలమునకోపోవు నలవాటు కావున నా సాయంతనము వసంతయ్యను బంపి, లోనికేగి కండువా వేసికొని, మంచి లంకాకుచుట్ట వెలిగించుకొని, చేత వెండిపొన్ను కఱ్ఱ బుచ్చుకొని, కిఱ్ఱు చెప్పుల జోళ్లు కిఱ్ఱుమని చప్పడు చేయుచుండ గొందరు పాలేళ్లు, కొలగాండ్రు, నిరువురు కాపు స్నేహితులు, ఒక క్షత్రియరైతు కూడరా, గాలువ యవ్వలి పొలము జూచుకొనబోయెను.

సుబ్బారాయుడు గారి కనుదినము పొలము లొకసారి తొక్కివచ్చుట యలవాటు. ఒకప్పుడు తోటల జూచుటకై పోవును. ఏ పొల మెట్లున్న దనియు గమనించుచుండును. వంగతోటలు, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మిర్చి, పసుపు వారి మెరకపొలములలో విరిగా బండును.

చీకటిపడువరకు నాయన బొలముల దిరిగిదిరిగి దీపములు పెట్టిన వెనుక నింటికేగును. ఇంటికి వచ్చుతోడనే మంగలి కాళ్ళుబట్టును. అటు వెనుక చలికాలమయిన వేడినీళ్లు, తదిర కాలములలో జన్నీళ్లు నింటిలో నెవరో యొకరు తోడిపెట్ట స్నానమాడి, సంధ్యావందన మాచరించుకొనును.

సుబ్బారాయుడి గారి హృదయమున రషియను బోల్షవిక్కుల రాజ్యతత్వము మెరుపువలె తోచినది. ప్రపంచమున నెంతకాలము ‘ఆస్తులు’ నా డబ్బు, నా పొలము అని అనుకోగలరు? డబ్బు లేని వాళ్ళు, ఆస్తిలేనివాళ్ళు ఎక్కువమంది ఉన్నారుకదా! వాళ్ళు తలుచుకుంటే డబ్బుగలవాళ్లు ఎక్కడ ఉంటారు? ఈ సైన్యాలన్నీ అడ్డుపడాలికాని, మనుష్యుడెంత విచిత్రమైన హృదయం కలవాడు. ఒక్క రష్యాలో తప్ప ఎక్కడైనా సైన్యం, ప్రజలూ తిరగబడ్డారా? తక్కిన రాజ్యాలలో రాజుల్ని తీసి వేసినప్పుడు తిరగబడ్డవాళ్లు రాజు క్రింద రాజుని ఆడించే ప్రభువులో, లేకపోతే కోటీశ్వరులో కాని, సైన్యాలు అనగా తక్కువ జీతం పుచ్చుకొనేవాళ్లు తిరగబడలేదు. అంటే ఇంతకూ డబ్బులో ఒక విధమైన సమ్మోహన శక్తి ఉంది. డబ్బుగలవాణ్ణి చూస్తే మామూలు మనుష్యుడెంతో భయపడిపోతాడు, కాలూ చేయీ కదపలేడు. రష్యాలో మరీ విపరీతమైన స్థితి ఉండాలి. లేకపోతే అల్లా ప్రజలు అంటే బీదవాళ్ళు తిరగబడివుండరు అని యాలోచనాపథగామియై సుబ్బారాయుడు గారు భోజనము చేయుచుండెను. నారాయుడూ వాళ్ళూ చెప్పడం పూర్వం హిందూదేశములో బోల్షవిజము లాంటి ఉత్కృష్ట రాజ్యపద్ధతి ఉండేదిట. ఎంతవరకు నిజమోకాని ఈరోజున డబ్బువదిలే మహానుభావుడెవరు, గాంధీమహాత్ముడంటివాళ్లు ఏ పదిమందో?

౧౧ ( 11 )

విషబీజములు

శారద దినదిన ప్రవర్థమానయగుచున్నది. ఆమె సౌందర్యము ఇంకను సౌందర్యముల బ్రోవుచేయుచు జగన్మోహనమగుచున్నది.

తన యంద మామె యెఱుగును. ఇంక అందగత్తెనగుదునని యామె గ్రహించినది. అందము తన్ను వీడియుండకూడదు. ఉదయమున నిదుర లేచినది మొదలు మరల రాత్రి నిదురగూరువర కామెకు దాను సౌందర్యవతినన్న చైతన్యముండును. సంగీతము నేర్చుకొనునప్పుడు, పాఠములు చదువుకొనునప్పుడు, బజారులో కారుమీద పోవునప్పుడు, భోజనమప్పు డామె యితరులు తనయంద మెటుల చూచుచున్నారోయని పరికించుచుండును. ఏమనుష్యుడైన తన్ను తేరిపారజూచిన నామె హృదయము హాయియనును.

‘పరపురుషుడు, శీలము’ అను వాక్యములయర్థ మా బాల కింకను గోచరింపలేదు. ఆ వయస్సులో నేబాలకును వానియర్థము తెలియదు. వారి హృదయముల నింకను స్త్రీ, పురుషుల పరమరహస్యవర్తనపుం బులకరము లొదవవు. వారి హృదయములో కోర్కె, విరియు మొగ్గలో ప్రత్యక్షమగు చిరుపరిమళము బోలియుండును. రానున్న స్త్రీత్వ మా వయస్సులో సౌందర్య బోధమాత్రమై యుండును.

దసరా పండుగలకు నత్తవారందరు వచ్చెదరని యామె విన్నది. అత్తవారిట్లు మాటిమాటికి వచ్చుచుండుట యామెకు సమ్మతముగా లేదు, డబ్బులేక వచ్చుచున్నారని కాదు గాని, యేదో వంక బెట్టి జమీందారులయింటికి దఱచు వచ్చుచున్నారా? అయినచో దన యత్తగా రొక్కపర్యాయమే దమయింటికి వచ్చినది. తన మామగారు అసలు రాలేదు. తన యత్తవారింటి లోను దర్జాగానే యున్నది. తమ తోటకన్న వారితోట బాగున్నది.

ఏది యెట్లున్నను శారద కత్తింటివారిపై ప్రేమ కుదరలేదు. కావుననే చెన్నపట్నము వెళ్ళుచు రాజమహేంద్రవరములో దిగిన జగన్మోహనరావుతో శారద విరగబడి నవ్వుచు, గృహప్రవేశమునకు దాను వెళ్లినప్పుడు కొత్తపేటలో నడచిన యపహాస్యపు బనులెల్ల వర్ణించి చెప్పినది.

జగన్మోహనుడు సౌందర్యరాశియగు మేనమరదలిని జూచినాడు, విస్తుపోయినాడు. పెద్దమనిషి అయినదని విన్నాడు. ‘యౌవనోదయమాత్రమున నాడువారిలో నెట్టి విచిత్రమైన మార్పులు వచ్చును’ అని యాతడనుకొన్నాడు. ఈ బాలిక , యీ జగన్మోహిని, తన రాణి కావలసిన యీ శారద, నొక పందికి నంటగట్టినారు. ఈ బాలికయే తన భార్య యైయుండిన దా నింగ్లండు దీసికొని వెళ్ళియుండును. ఆమెను పువ్వులలో బెట్టికొని పూజించువాడే. జమీందారిణియన్న నీమెయే. ఇంత అందకత్తె యగునని యెఱిగియున్నచో, నీ వివాహము చెడగొట్టియుందునే! అనేక మార్గము లున్నవే! అప్పుడు తన మేనత్త భర్త యేమిచేయును? తుదకు దనకీయక తప్పెడిదికాదు. తన స్నేహితురాండ్రగు యూరేషియను బాలికలు, వేశ్యాసుందరులు శారద ముందర గ్యాస్ దీపం ముందర, హరికేన్ దీపాలే.

ఆమెను జూచి లోలో గుటకలు మ్రింగినాడు. అనతిస్ఫుటమైన స్నిగ్ధమైన యామె యవయవ విలాసము నా వలిపపు పయ్యెద పావడలలో నాలోకించి మురిసినాడు. ఏదియో వంకతో శారదతో మాట్లాడును. ఆమెతో గూర్చుండి యుండును. యామెను ముట్టుకొనుచుండును.

అతని యాందోళనమునకు శాంతి యాతని మేనత్త సమకూర్చినది. వరదకామేశ్వరీదేవికి మేనల్లుడన పరమప్రీతి. హృదయాంతరాళమున తన బిడ్డలపై నెంత ప్రేమ యున్నను తన కుమారునికన్న, తన కుమార్తెలకన్న మేనల్లునామె యాదరముమై గాంచును.

‘ఏమయ్యా మోహనం! వదినగారు విశాఖపట్టణంలో యున్నారా? నువ్వు చెన్నపట్టణం వెడుతున్నావా? అత్తయ్య అంటే ప్రేమగనుక పాపం, యిక్కడ దిగావు. ఎన్ని సారులు చెన్నపట్నం వెడుతూ ఇక్కడ దిగకుండా వెళ్లలేదు?’

‘ఏమిటో అత్తా! పనితొందరలు. నేనూ మామయ్యగారికిమల్లే మా జిల్లానుంచి శాసనసభ సభ్యుడుగా వెడదామని ప్రయత్నం. ఏమవుతుందో! అందుకనే ఇప్పుడు చెన్నపట్నం వెడుతున్నాను. అయినా నిన్నూ శారదను చూడాలని దిగాను. శారద అందాలరాశి అవుతూంది అత్తయ్యా.’

వరదకామేశ్వరీదేవి: ఏమిటో! ఇంతకూ నీ భార్య కావలసిన బంగారు తల్లికి యిలారాసిపెట్టి ఉంది. మీ యిద్దరికీ ఎంత యీడూ జోడుగా ఉండేది! సర్వవిధాలా మీ ఇద్దరూ తగివుందురు. నాకన్నులున్నూ ఆనందం పొందుతూ ఉండును. నీ అందానికి మా శారద సాటి. మా శారద అందానికి నీ అందం సాటి. మన్మథుడూ, రతీదేవిలా వెలిగిపోతూ ఉండేవారు. ఒకరి తాహత్తు కొకరు సరిపోతారు. మీ మామయ్యగారి ఉద్దేశం నాకు బోధపడలేదు. కాకి ముక్కుకు దొండపండు కట్టారు. మా అల్లుణ్ణి చూస్తే నాకు ....

జగ: అల్లా అనకు అత్తా! అతగా డేం తక్కువ అందమైనవాడా యేమిటి!

వర: ఆ! ఆ అందం! పెద్ద రాక్షసుడు.

జగ: శారద దేవకన్యలా ఉంటుంది. వర: అవును. ఈ నా గారాలకూచిని ఆ ఆత్తవారింటికి చేతులారా యెలా పంపింతునా అని తపించిపోతున్నాను.

జగ: అయితే అల్లుణ్ణి ఇల్లరికం తీసుకొని వస్తావమ్మా అత్తా?

వర: ఇల్లరికం! అతన్ని చూస్తేనే నాకు భయం. ఇంక రోజూ ఇంట్లో ఉంటే, నా ప్రాణాలు అప్పుడే పోతాయి.


తల్లికి జగన్మోహనునకు జరుగు సంభాషణయంతయు శారద వినుచున్నది. ఆమెలో సంభాషణ మించుకయు విడ్డూరముగా కన్పింపలేదు. ఆమె వినుచుండ తల్లి యెన్ని సారు లల్లుని తిట్టినదో! హేళన చేసినదో! ఆమె హృదయమున నత్తవారన్న నొకవిధమగు నసహ్యము జనింప నారంభించినది. సూర్యకాంతమన్న కరుణయు నున్నది. తాను గొప్పకుటుంబములో జనించినందుకు నెక్కువయని తలంచుచు తన హృదయమును జూరగొన్న సూర్యకాంతమును దలపోసికొని ‘పాపము’ అని జాలిపడుచుండును.

తన భర్త! మరి? తండ్రి కంత యిష్టమేమో? అందరును తెలివుందని చెప్పుకొనెదరు. ఈ రోజులలో తాను చదివే నవలలలో నాయికా నాయకులు ఒకరి నొకరు ప్రేమించునట్లు తానెవరిని ప్రేమించుచున్నదో? అందరు తా నపరిమిత సౌందర్యవతి యని చెప్పెదరు. ఇంత యందకత్తెయగు తనకు, తగిన అందగా డెవరో యని ఆమె పలుమారు తలపోసుకొన్నది.

‘ఏమిటి శారదా ఆలోచిస్తున్నావు?’ అని జగన్మోహను డా బాలికను ప్రశ్నించినాడు.

‘ఏమి లేదయ్యా బావా!’

వారిరువురి నచట వదలి వరదకామేశ్వరీదేవి లోనికి వెళ్ళిపోయినది.

‘భర్తను గురించి ఆలోచిస్తున్నావు?’

‘చీ!’

‘చీ, ఏమిటి? ఎందుకు చీ? పోనీ నా కెందుకుగాని, నువ్వింత అందం ఎక్కడనుంచి సంపాదించావు? నేను చాలా సినిమాలు వెళ్ళిచూశాను. జీనెటీ మాగ్డనాల్దు, మారియన్ డేవీస్, మేరియాస్టరు, నార్మాటాల్మిడ్జీ, మిర్నాలోయ్ వీళ్ళెవరూ నీముందర నిలవగలరాంట?’

‘నువ్వెప్పుడూ పొగడ్తూనే ఉంటావు.’

‘నాది పొగడ్తా? నేను నిజంగా చెపుతున్నాను. శారదా! ఇప్పుడు ప్రపంచానికంతా సుందరిని యెన్నుకుంటే నిన్నే ‘మిస్ యూనివర్సు’ అనగా విశ్వసుందరిని చెయ్యాలన్నమాట. నేను ప్రపంచం చాలా చూశాను. అనేక మంది దొరసానుల్ని, ఇతరదేశం స్త్రీలనీ, జమీందారిణీలను, ఉద్యోగస్థుల భార్యల్నీ ఎందర్నో చూచాను. ఎవ్వరు నీసాటిరారు శారదా.’

‘అయితే నువ్వు నాన్నగారికిమల్లే శాసనసభలో సభ్యుడవు అవుతావా?’  ‘ఆ’

జగన్మోహనుడు శారదదగ్గిరకు జేరి యామె నడుముచుట్టూ తన ఎడమ చేయి చుట్టి ‘శారదా మనం యిద్దరం ఒకరొకరికి బాగా సరిపోయాము. ఈ పాపపు దేవుడు ఇల్లా చేస్తూవుంటాడేమిటో! ఇంగ్లండు దేశంలో ఇష్టంకాని పెళ్ళిళ్ళు రద్దుచెయ్యవచ్చును. ఇక్కడ అల్లాలేదు. పెళ్ళి రద్దయితే మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చును ... ఆ దేశాల్లో.’

శారద మాట్లాడక మొగము చిట్లించుకుంది.

‘శారదా నువ్వీయేడు స్కూలు ఫైనలు పరీక్షకు వెళతావటకాదూ? అయితే మన జమీందారులకు పరీక్ష లెందుకు? చదువులు, ఉద్యోగాల కోసం కాదూ?’

‘మా నాన్నగారు ఏ ఉద్యోగంకోసం చదివారోయి బావా మరి?’

‘మీ నాన్నగారు జమీందారుగారు. ఆయన చదువుకోవడం ఒక గొప్పే. కాని సాధారణంగా ప్రజలంతా ఎందుకు చదువుతారు, ఉద్యోగంకోసం గాకపోతే మరి?’

‘డబ్బుగల వాళ్ళూ గొప్పకోసమేగా చదివేది బావా?’

‘వాళ్ళ మొగo! కోమట్లు చదివితే గొప్పకోసమా ఏమిటీ?’

‘మరెందుకు?’

‘బడాయికోసం!’

‘కాని మనబోటి జమీందారులు చదవడం సరదా. ఆ సరదా లేక చదవకపోయినా ఇబ్బందిలేదుగా.’

‘సరేగాని నీకు చెన్నపట్నం నుంచి యేమిటి తీసుకురమ్మన్నావు నన్నూ. శారదా?’

‘ఏమి అక్కర్లేదు బావా.’

‘శారదా, నేనంటే నీకు ప్రేమేనా?’

శారదాదేవి మాటాడలేదు. చిరునవ్వు నవ్వినది. ‘నాకేమి తెలవదు బావా.’

‘ఇంగ్లీషువాడు ‘మాటాడకపోతే సగం ఒప్పుకున్న’ ట్లన్నాడు. మరి ఏమంటావు? ఏదో చెప్పాలి.’

శారదాదేవి నవ్వుట మాని యేదేని యాలోచనల్లో మునిగినది.

‘శారదా! నిన్ను చూసి మోహించని మగవాడు వట్టిదద్దమ్మ! నిన్ను చూసి ఋషులే ప్రేమిస్తారు. నాబోటి మేనబావ సంగతి వేరే ఆలోచించి చెప్పాలి!’

ఇంతలో శారద తమ్ముడు శ్రీ కుమారరాజా కేశవచంద్రరావు, అయిదేండ్ల బాలుడు, విసవిస పరుగెత్తుకొని యచ్చటకువచ్చి, ‘చిన్నక్కా! ఇవ్వాళ నా కుక్క మొన్న మనం చూసిన సర్కసులో కుక్క కన్న బాగా మొగ్గవేసిందే!’

‘ఏమోయి చిన్నబావా! నువ్వు సర్కసు పెట్తావా యేమిటి?’

‘పెద్ద సర్కసు పెట్తాను. మా నాన్నగారికి గుఱ్ఱాలున్నాయా! రెండు ఏనుగులు మూడు సింహాలు కొంటాను ...?’

‘ఎంతపెట్టి కొంటావు తమ్ముడూ?’

‘నూరు రూపాయలు... కాదు, లక్ష రూపాయలు పెట్టి కొంటాను.’


౧౨ ( 12 )

కేశవచంద్రరావు


శ్రీ కుమారరాజా కేశవచంద్రరావు శారద తర్వాత ముగ్గురు పుట్టి పోయిన వెనుక జనించినాడు. ఆడపిల్లలవంటి యందముగల బాలకుడు. పనసతొనలవలె వెన్నముద్దవలె మెత్తని బొద్దైన అవయవములుగల బంగారుబాబు. అల్లారుముద్దుగా పెరిగినాడు. పెద్దక్క పైకన్న చిన్నక్కపై నాతనికి బ్రీతి ఎక్కుడు. తల్లి వరదకామేశ్వరీదేవి చేయు గారాబము విపరీతము. నేలపై అడుగుపెట్టనీయ దామె. అస్తమానము డాక్టర్లకు కబురులపై కబురులు; ఆ బాలుడు చిఱ్ఱున జీదరాదు. కొంచెము దేహము వెచ్చబడినచో నిదురబోవదు, వరదకామేశ్వరీదేవి ప్రాణము లన్నియు నా బాలకునిమీదనే యుండును.

తండ్రిగారు కుమారునిజూచుకొని యానందముతో మునిగిపోవుచుందురు. ఆయన బిడ్డలను దరికి చేరదీసి ముద్దులాడుట తక్కువ. ఒక్కొక్కప్పుడు, ప్రేమవివశులై ఏకాంతమున, బిడ్డలనట్టే బిగియార కవుగిలించుకొని, తనివార మూర్ధాఘ్రాణ మొనర్చుటయు కలదు.

కేశవచంద్రరావు మాటలు ముద్దుల మూటలే. ఆ బాలకుడు కొందరన్న దరికి జేరును, గొందరన్న దగ్గరకు రానేరాడు. అతనికి నారాయణరావుపై శారద పెండ్లిచూపులకు వచ్చిననాటినుండియు బ్రేమ జనించినది. పెండ్లిలో బావగారి నొక్క నిమేషము వదలియుండలేదు. నారాయణరావు తన బావ మరదిని దగ్గరకు తీసికొని యాతడడుగు విపరీతపు బ్రశ్నల కోపికగా జవాబులు చెప్పచుండువాడు. చిన్న చిన్న కథలు చెప్పువాడు.

నారాయణరా వెప్పుడు వచ్చిన నప్పుడు కేశవచంద్రుడు దగ్గరకు జేరుట జమీందారునకు పరమహర్ష కారణమైనది. కాని వరదకామేశ్వరీదేవికి బొమముడి తెప్పించినది. ఆ బండచేతులలో బిల్లవాడు నలిగిపోవునేమోయని యామెకు భయము కలిగెను. ఆ బాలకునితో రహస్యముగా దల్లి, నారాయణరావు బండవాడనియు అస్తమాన మాతని కడకు వెళ్లవద్దనియు, నాతని బండతనమే యా బాలకుని కంటుకొనుననియు జెప్పినది. ‘బావ బండవాడుకాడు! మంచివాడు. నాకు కథలు చెప్తాడు, ఇంకా ఎన్నో సంగతులు చెప్తాడు. బావ అక్కయ్యకన్న బాగా సంగీతము వాయిస్తాడు ఫిడేలుమీద.’

తల్లి తెల్లబోయి కుమారునికి జవాబు చెప్పకుండ వెళ్ళిపోయినది.

అతని చిన్న హృదయములో, దన బావగారిని దండ్రిదక్క తక్కిన యందరు హేళనజేయుచున్నారని యస్పష్టముగా దోచినది. నే డా బాలకుడు, శారదయు జగన్మోహనరావు మాట్లాడుట చూడగనే, అతని హృదయమున జిరుకోపము వచ్చినది. జగన్మోహను డాతని జూచి ‘ఏమండో కుమారరాజా బావగారు! నీ పుస్తకాలన్నీ ఏవోయి?’

‘లేవు. ఎక్కడో ఉన్నాయి.’

‘కోపం వచ్చిందా బావా?’

‘రాలేదు.’

‘మరి కోపంగా ఉన్నట్లున్నావే బావా?’

‘అబ్బా! నాకు పనివుంది. ఒరే రాముడూ!’

‘బాబు!’ అని నౌకరు రాముడు లోనికివచ్చినాడు. ఎత్తుకోమని కేశవచంద్రుడు చేతులు జాచుటయు, సేవకుడు రాముడా బాలు నెత్తుకొని బయటికి వెళ్ళెను. శారదయు లోనికిబోయినది.

జగన్మోహనుడట్లే యాసోఫాపై నధివసించియుండి, శారదావిగ్రహమును తలపోసికొనుచు కూరుచుండెను. ఇంకను జిన్నపిల్ల. శారద వైఖరిజూడ భర్తను ప్రేమించుటలేదని తోచుచున్నది. తన మేనత్తయు నల్లుని పూర్తిగా రోయుచున్నది. తెలిసియో తెలియకయో తనకు మేనత్త సహాయము చేయునట్లే యున్నది. కొంచెము బాగుగా పాచిక పారించినచో శారద యవలీలగ దన గౌగిలింతకు జేరును. ఈ సంగతి యితరులకు దెలిసినచో నెవరేమిచేయగలరు?

శారద యింటిలోనికిబోయి, సంగీతపు గదిలో తన గురువుగారు శ్రీరామయ్య గారు వచ్చియుండుటచే, ఫిడేలు తీసి సవరించుకొని కమానుకు రజను రాచి తీగలపై ‘ససరిరి’ యని ప్రసరింపజేసెను.

శారదాదేవి ఫిడేలును, తండ్రిగారు తమ స్నేహితుడొకడు యూరపు ఖండముపోవుచుండ, హాలండునుంచి తెప్పించినారు. ఫిడేలువాద్య మరబ్బులది. అది సారంగికి సంబంధించినది. అచ్చటనుండి యరబ్బుల ప్రభుత్వము పాశ్చాత్య దేశములకు దన తేజస్సును బరపినపుడు ఫిడేలును ఫ్రాన్‌సు సృజించినది. పాశ్చాత్యదేశమే దాని జన్మభూమి యనునంతవరకు బెంపొందింపబడినది. ముఖ్యముగా ఫ్రాన్‌సు, ఇటలీ, జర్మనీ, హాలండు దేశములలో ఫిడేళ్ళ నద్భుతముగ నిర్మించెదరు. కొన్ని కొన్ని ఫిడేళ్లు యేబదివేల రూప్యములు ఖరీదుగలవి యున్నవి. వానిలోని శ్రుతిధ్వను లతిసున్నితములు, నపరిమితమధురములు, నత్యంత గంభీరములై అతి సూక్ష్మములై యుండునట. సారంగి భరతదేశమునకు ప్రథమమున క్రీ.వె. నయిదాఱు శతాబ్దులలో వచ్చినది. పదునెనిమిదవ శతాబ్దిలో ఫ్రాన్‌సు వర్తకులు ఫిడేలు తీసికొనివచ్చినారు. పందొమ్మిదవ శతాబ్ది కది భారతదేశమున ముఖ్యములగు సంగీతవాద్యము లలో నొక్కటియైనది. ఆనాటినుండియు నీ వాద్యము తన వాద్యముగా, గాత్రమునకు వీణకు అనుకరణవాద్యముగా, విజృంభించి, యార్యసంప్రదాయ వాద్యమై పురాతనమైన వేణు వీణావాద్యముల కనుంగు చెలియలైనది.

ఆంధ్రదేశమున నీ వాద్యము నెక్కువ నాట్యవిద్యాపారంగతులగు గణికల నాట్యమున కనుకరణముగా నుపయోగించినారు. పండితులును దీనిని మహావాద్యములలో నొకదానిగా నంగీకరించిన నాటినుండియు దక్షిణాపథమున గోవిందస్వామి పిళ్లయు, చౌడప్పయు, నాంధ్రమున కోటయ్యగారు, వారణాసి బ్రహ్మయ్య, బలరామయ్యగారలు, హరి నాగభూషణముగారు, ద్వారం వెంకటస్వామినాయుడుగారు నీ వాద్యమున కుత్కృష్టత సముపార్జించి పేరెన్నికనొందిరి. ఇంకను దక్షిణాపథమున, వాద్యముగ ఫిడేలు నానాటికి విజృంభించిపోవుచు, పాశ్చాత్య విద్వాంసులగు సొనానిని మొదలగు వారి వాద్యముతో దులదూగుటకు సిద్ధులగు పండితుల గననున్నది. జపాను దేశమునను నీ వాద్యము పరమవాద్యమైనది. హాలండు మొదలగు పాశ్చాత్య దేశములతో సమానమై, ప్రపంచమునకెల్ల నుత్కృష్టమగు నొకటి రెండు ఫిడేళ్లతో సమానమగు నైదో, యారో ఫిడేళ్లను జపాను సృజించుకొనినది.

శ్రీరామయ్యగారు ఫిడేలులో నసాధారణ ప్రజ్ఞ కలవారు. గాత్రము నందును బండితుడు. సంగీతపాఠములు శిష్యురాండ్రకు జెప్పి వారిని బ్రజ్ఞావంతుల జేయుటలో నమిత చాతుర్యముగలవారు. గానవిద్యాప్రవీణులగు పండితులందరు నధ్యాపనమున సమర్థులుగారు. ఉపాధ్యాయునకు బూర్ణ హృదయ ముండవలయును. దీక్ష్ణమగు మనస్సుండవలయును. శిష్యుని హృదయము, మనస్సు గ్రహించు తేజశ్శక్తి యుండవలయును. లేనిచో గురువెంత విద్యాపారంగతుడైనను శిష్యునికి విద్య రానేరదు. అతని విద్య లోహపేటికాంతర్నిగూఢ గుప్తధనమువంటిదే. ఎమ్. ఎస్ సి., డి. ఎస్ సి. మొదలగు మహోన్నత పరీక్షలలో నుత్తములుగా గృతార్థులైన మహానుభావులు కొందరు శిష్యులకడ నోరు విప్పలేరు.

శ్రీరామయ్యగారు పవిత్రహృదయుడగుటచే గొందరివలెగాక, తన విద్య పూర్ణముగా, శక్తిగల శిష్యుల కీయ సంకల్పించినారు. అట్టి మహానుభావునికడ విద్య నేర్చుకొనుటకు శారద యేమినోము నోచుకొన్నదో యని జమీందారుగారు పరమానందము నందుచుందురు.

ఆ రోజున శ్రీరామయ్యగారు శిష్యురాలికి ‘ఎందరో మహానుభావు’ లను త్యాగరాజకృతి నేర్ప సంకల్పించినారు. కుమారరాజా కేశవచంద్రరావునకు సంగీతమన్న చిన్నతనమునుండియు నిష్టమే. శారదకు పాఠము పూర్తిగా వచ్చినరోజున మరల నాఖరుపరీక్ష చేయునప్పు డాడింభకు డెట్లు గ్రహించునో సంగీతపు గదిలోనికి చల్లగావచ్చి కూర్చుండును. పాటయంతయు నగువర కచ్చటనుండి యమందానంద మొందును. తరువాత నొక్కనిముసమైన నచ్చట నుండడు.

ఆ రోజున నదివరకు బూర్తిగావచ్చిన కృతి బాడునప్పు డా గదిలో కూర్చుండి, కొత్తపాఠము మొదలుపెట్టుటతోడనే యచ్చటినుండి కేశవ చంద్రుడు విసవిస వెడిలిపోయి ‘రాముడూ!’ అని కేక వేసెను.

‘చిన్నబాబుగారు పిలుస్తున్నారు!’ అని కేశవచంద్రు నాడించు సేవకుడు పరువిడివచ్చినాడు.

బ్రాహ్మణ జమీందారు నింట నెవ్వరైనసరే సేవకులుగా నియమింపబడుదురు. కాని వెలమ, క్షత్రియ, కాపు, కమ్మ జమీందారుల యిండ్ల దాసీలు, కాసాలు వంశపారంపర్యముగా సేవజేయుచునుందురు. జమీందారులను వారి సేవకులు ‘బాబు’ లనియు గుమారరాజులను ‘చిన్న బాబు’ లనియు బిలుచుచుందురు.

జమీందారు బిడ్డలగుటయే గారాము, అందులో లేక లేక జనించిన బిడ్డడగుటచే సేవకులందరు నాతని కనుసన్నల మెలగుచుందురు. బాలకుని యేడువనీయకూడదు. బాలకు డాడుకొనుటకు వలయు సామాను లనేకము లున్నవి. నడుపుటకు రైళ్ళు, మోటార్లు, ట్రాములు, ఇంజనులు, బొమ్మలు మొదలగు నాటవస్తువు లెన్నియేని యున్నవి.

కేశవచంద్రుడు బాలకుడయ్యు మితభాషి, పలికిన రెండు పలుకులు ముద్దు లొలుకును. ఒకసారి యీడుకుంమించిన గాంభీర్యము వహించి మిన్నకుండును.

తల్లి యాతని కొకప్పుడు శ్రీకృష్ణునివలె వేషమువేయును, ఒకనాడు అక్బరుపాదుషావలె వేషమువేయును, ఒకనాడు జార్జిచక్రవర్తి వేషము వేయును.


౧౩ ( 13 )

శా స న స భ


జమీందారుగారు చెన్నపట్టణము శాసనసభ సమావేశమునకై వెడలినారు. రైలుకడ కెదురువచ్చిన యల్లుని గుశలమడిగి యేదియేని విషయముల మాట్లాడుకొనుచు నింటికి బోయినారు. లా కాలేజీ యొంటిగంటకు మూసివేసెదరు కాన వీలయినచో దానొక పర్యాయము సమావేశమునకు వచ్చెదనని నారాయణరావు మామగారితో జెప్పినాడు. సభికులందరు రెండుభాగములుగా కూర్చుందురు. ప్రభుత్వపక్షమువా రధ్యక్షుని కుడిచేతివైపునను, ఎదిరిపక్షమువా రెడమభాగమునను పీఠములపై నధివసించెదరు. ప్రభుత్వపక్షమున మంత్రులు, గవర్నరు, కార్యనిర్వాహక సభాసభ్యులు, మంత్రులపక్షము వారు శాసనసభకు ప్రభుత్వముచే నియమితులైన సభ్యులు నుందురు. ప్రభుత్వవిధానములో జరిగిన పొరపాట్లు, తప్పులు, మాయలు ప్రపంచమున కెరిగించుటకు, ప్రభుత్వము వారి బడాయిని పటాపంచలు చేయుటకు, కష్టనిష్ఠురములు చెప్పుకొనుటకు, ప్రభుత్వ కార్యనిర్వాహకవర్గము వారిని మంత్రులను ఎదిరిపక్షము వారు ప్రశ్నలడిగెదరు.

ఆయా ప్రశ్నల నడిగెదమని సభ్యులు ముందుగానే తెలియజేయవలను. ప్రశ్నకాలము వచ్చినప్పుడా ప్రశ్నకు సంబంధించు నితర ప్రశ్నలనుగూడ నడుగవచ్చును. ఇట్టి ప్రశ్న వేయుచున్నానని సభ్యుడు తెలియజేయుటతోడనే యాజిల్లాలో నా శాఖముఖ్యోద్యోగికి ఆ విషయమును గూర్చి వివరములకొరకు వ్రాసెదరు. వా రేజవాబిచ్చెదరో యాజవాబే శాసనసభలో ప్రభుత్వసభ్యుడు వినిపించును. ఒక్కొక్క ముఖ్యవిషయము వచ్చునప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పక్ష సభ్యులు ప్రభుత్వ కార్యనిర్వాహకవర్గసభ్యులను ప్రశ్నలచే గజిబిజి చేయుదురు. ప్రభుత్వ సభ్యులుమాత్ర మీ తాటియాకు జప్పుళ్లకు వెఱవరు.

చెన్న రాజధానిలో బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్య తీవ్రముగా నున్నది. చెన్నరాజధానికన్న కొంచెము తక్కువగా బొంబాయి రాజధానిలో నున్నది. చెన్నరాజధానిలో బ్రిటిషు ప్రభుత్వము వచ్చినప్పటి నుండియు బ్రాహ్మణులు ప్రభుత్వోద్యోగములు సముపార్జించియుండిరి. అందు అరవ దేశపు టయ్యర్లు, నయ్యంగార్లు నుత్తమోద్యోగము లన్నియు తమ కాణాచిగా జేసికొనిరి. మరియు దక్షిణాపథమున బ్రాహ్మణేతరులను బ్రాహ్మణులతి నీచముగ జూచుచుండిరి. బ్రాహ్మణాగ్రహారవీథుల బ్రాహ్మణేతరులు వెళ్లుట యెంతయో కష్టతమమై యుండునది. బ్రాహ్మణునకు బ్రాహ్మణేతరునకు నెంతస్నేహమున్న నా బ్రాహ్మణేతరుడు బ్రాహ్మణుని యింటికి భోజనమునకు వచ్చినప్పు డింటిలో నందరు భోజనము చేసినవెనుక, వీథిసావడిలో భోజనము వడ్డించెదరు. కాఫీ దుకాణములలో బ్రాహ్మణులకు వేఱు, బ్రాహ్మణేతరులకు వేఱు.

రాను రాను బ్రాహ్మణేతరులకు బ్రాహ్మణులన్న కోపము, ఉడుకు బోతుతనము, తమస్థితి వృద్ధిచేసికొనవలెనన్న యిచ్ఛయు జనించినవి. వైద్యశిఖామణి యగు డాక్టరు నాయరు యాజమాన్యమున బ్రాహ్మణేతర సమావేశములు జరిగినవి. ఉపన్యాసములు, వ్యాసములు, కొరడా చురుకువలె కత్తిపోటుల వలె తీవ్రముగ ప్రబలినవి. బ్రాహ్మణేతర సమస్య యాంధ్రదేశమున కెగబాకినది. త్యాగరాజశెట్టి, కూర్మా వెంకటరెడ్డినాయుడు, రాజా పానగల్లు, రామస్వామి మొదలియారు మొదలగువారు నాయకులై విజృంభించినారు. ఉద్యమ స్థాపకుడగు డాక్టరు నాయరు చనిపోయినారు. ఇంతలో మహాత్మాగాంధి గారు దేశమోక్షమునకై సహాయ నిరాకరణోద్యమము మొదలుపెట్టిరి. బ్రాహ్మణేతర నాయకులు ప్రభుత్వపక్షము జేరిరి. మాంటేగు చెమ్సుఫర్డు రాజ్యవిధానము వచ్చుటతోడనే శాసనసభలో నెన్నుకొన్న సభ్యులలో నుండి మంత్రుల నియమించవలసివచ్చినది. బ్రాహ్మణేతర నాయకులు తమ్ము మంత్రుల జేయవలయు ననియు లేనిచో మహాత్మాగాంధిగారి యుద్యమమునందు జేరెదమనియు బెదరించిరట. అప్పుడు వెల్లింగ్టన్ ప్రభువు పానగల్లురాజాను ముఖ్యమంత్రిగా, వెంకటరెడ్డినాయుడు, పరుశురాము పాత్రోల నుపమంత్రులుగా నియమించెను.

మహాత్మాగాంధీ బార్డోలీలో సత్యాగ్రహోద్యమమును చౌరీచౌరా దౌర్జన్యము కారణముగా మానివేసినయపుడు దేశబంధుదాసు, పండిత నెహ్రూ గారలు స్వరాజ్యపార్టీ నేర్పాటుజేయ దేశమంతట నాపార్టీ వ్యాపించి శాసనసభలలో బ్రవేశించెను. కాని నిరాకరణవాదులే భరతదేశమున నెక్కువగా నుండుటచే స్వరాజ్యపార్టీ వారొక్క నాగపురములోను, బెంగాలులోను మాత్రము శక్తిసంపన్నులు కాగలిగిరి. చెన్నరాజధానిలోగూడ నా పార్టీ విజృంభించు చిహ్నములున్నవి. వారు ముఖ్యపక్షముగా మదరాసు శాసనసభలో ప్రభుత్వమువారి నెదుర్కొనుచుండిరి. జాతీయవాదులనువారు కొందరొక చిన్నపార్టీ గట్టి స్వరాజ్యపార్టీ వెనుక మద్దత్తుగా నుండిరి. అట్టి జాతీయ పక్షమునకు మన జమీందారుగారు నాయకుడు.

ఆరోజు సభలో జమీందారుగారు కృష్ణా గోదావరిజిల్లాలలో రైతుల కష్టములగూర్చి పెక్కు ప్రశ్నలడిగిరి. స్వామి వెంకటాచలసెట్టి మొదలగువారు మన జమీందారుగారికి బలము గలుగచేసిరి. అరగంటవరకు ప్రభుత్వమువారు ముళ్ళపై నడిచినట్లయినది.

ఇంతలో జమీందారుగారు నాంధ్రజిల్లాలను ప్రత్యేక రాష్ట్రముగా విడ దీయవలయునను తీర్మాన ముపపాదించిరి.

‘అయ్యా అగ్రసనాధిపా! నేనీ యుపపాదన చేయుట రెండవసారి. అప్పుడప్ప డాంధ్రనాయకు లనేకు లీ యుద్యమము నీ సభలో ప్రకటించియే యున్నారు. ఆంధ్రోద్యమ మిప్పటికి బదిపదేను సంవత్సరముల నుండియు దేశమున వ్యాపించి ఆంధ్రులనుత్సాహశీలుర నొనర్చుచున్నది. అఖిల భారత జాతీయ మహా సభవారు దాని నామోదించి యా ప్రకారము వారి సంఘముల యేర్పాటుతో ఆంధ్రరాష్ట్రమును ప్రత్యేకముగా విభజించిరి.’

‘ఆంధ్రరాష్ట్రము చెన్నరాజధానిలో కొంచె మెచ్చుతగ్గుగా సగమున్నది. పదునొకండు తెలుగుజిల్లాలు, నేజన్సీయు నున్నవి. రెండుకోట్ల పైచిల్లర జనమున్నారు. రాష్ట్రాదాయము సగము తెలుగుజిల్లాల నుండి వచ్చుచున్నది. ఆంధ్రదేశము అస్సాముకన్న, మధ్య రాష్ట్రముకన్న, పంజాబుకన్న పెద్దరాష్ట్రము. ఇప్పుడే చెన్నరాష్ట్రీయ పరిపాలనము రెండు రాష్ట్రపరిపాలనములవలె జరుగుచున్నది. పోలీసు, ఎక్సయిజు, రెవిన్యూ, విద్య, డి.పి.డబ్ల్యు, అటవి, గృహములు మొదలగు నన్నిశాఖలపై రాష్ట్రాధికారులున్నను, రాష్ట్రాధికారులకు జిల్లాయధికారులకు మధ్య రాష్ట్రాధికారులతో సమానులను నిరువురు మువ్వు రధికారు లుండియున్నారు. అఖిల భారతీయ ప్రభుత్వ సంబంధమగు పోస్టలు, తంతులు, రాబడి ఆదాయము, ఉప్పుపన్ను మొదలగు శాఖలును రెండు రాష్ట్రముల కేర్పరచినట్లే రాష్ట్రమున రాష్ట్రాధికారి చేతిక్రింద నిరువురు మువ్వు రధికారుల నేర్పరచినారు.

‘న్యాయస్థానముల విషయములో మదరాసు ఉన్నత న్యాయస్థానమున సరిగా పని జరుపవలెనన్న నిప్పుడున్న న్యాయాధికారులకు రెట్టింపుమంది నింకను నేర్పరుపవలయును. ఒక్కొక్క వ్యాజ్యము పరిష్కరింపబడవలె నన్న పెక్కు సంవత్సరములు పట్టుచున్నది. అట్టియప్పుడు రెండు ఉన్నత న్యాయస్థానముల నేర్పరుపవచ్చును. నేను వేసి చూపించిన లెక్కల ప్రకారము రెండు రాష్ట్రములు చేసినచో ఖర్చెక్కువ యేమాత్రము కాదు.

‘కలిసియుండుటచే నుద్యోగములకని, సౌకర్యములకని ఆంధ్రులను తమిళసోదరు లణగద్రొక్కి వేయుచున్నారని గోల యెక్కుడగుచున్నది. ఈ రెండుజాతులును విడిపోయినచో నిరువురు నపరిమిత స్నేహముతో సౌహార్ద్రముతో నుండుటకు వీలున్నది.’

ఈ విధముగా జమీందారుగా రొకగంటన్నర మాట్లాడినారు. కొందరిటు కొందరటు మాట్లాడినపిమ్మట కాలముదాటిపోవుటచే ఓట్లుగైకొనుట ఆగిపోయినది.

మధ్య ఫలహారములకు లేచునప్పుడు జమీందారుగారు, శాసనసభా ఫలహారశాలనుండి యుపాహారములు దెప్పింప తన యల్లుని, నాతనితో వచ్చిన ముగ్గురు స్నేహితులను బిలిచి విందొనర్చెను. తన స్నేహితుల కనేకుల కల్లుని, యాతని స్నేహితులను బరిచయ మొనరించెను. వారందరు రెండు కారులలో వారి గృహములకు వెడలిపోవుచుండ ఆంధ్రపత్రిక తరఫున శాసనసభా కార్యక్రమము బత్రికకు నివేదింప వచ్చిన పరమేశ్వరునితో జమీందారుగా రిట్లనిరి :

‘చూశారూ, పరమేశ్వరమూర్తి గారూ! ఇల్లాగ ఉంటుంది. మా అకాండతాండవం. ప్రభుత్వము వారు సూత్రధారులై తమ యిచ్చవచ్చినట్లు మమ్ము కీలుబొమ్మలను జేసి ఆడిస్తూ తమ పబ్బం గడుపుకొనిపోతూవుంటారు, మా అంతట మే మొక్క వ్యాపారంకూడా చేయలేము. ఎన్నిక సభ్యులు ప్రభుత్వపక్షము వారికన్న అధికంగా వున్నారనుకొందాం. మావారొక విషయము శాసనము చేయించాలనుకుంటే గవర్నరు, వైసురాయిగారల అనుమతి కావాలి. తర్వాత దేశంఅంతా ప్రచురణము చెయ్యాలి; తర్వాత ప్రత్యేక సంఘంవా రా విషయం తర్జనభర్జన చేసి నివేదిక తయారుచేస్తే, దానికి శాసనసభలో ఎక్కువమంది ఒప్పుకొని నడిపిస్తే గవర్నరుగారు, గవర్నరుజనరలుగారు ఇండియా కార్యదర్శిగారు అనుమతులిచ్చి దస్కతులు చేస్తే అప్పటికది ‘లా’ అవుతుంది. ఎన్నిచోట్ల పురిటిలో సంధికొట్టవచ్చునో ఆలోచించుకోవయ్యా!’

పర: అందుకనేనండీ మా నారాయుడంటాడు సరియైన స్వరాజ్యం రానంతకాలం ఈ ఫార్సు జరుగుతూనే ఉంటుంది. నిజమైన ప్రజాపరిపాలన కవకాశంగల స్వతంత్రం ఉంటే చాలు. దాన్ని మనం ప్రజాస్వామికం (రిపబ్లికు) అన్నాసరే, వలసరాజ్య పరిపాలనావిధానము (డొమినియన్ స్టేటస్) అన్నా సరేనటండి.

జమీందారు: అంతవరకు మనం ఏమి మాట్లాడకుండా ఊరుకుంటే ప్రభుత్వం పెచ్చుమీరిపోదండీ? కాబట్టి గడబిడ చేస్తుంటే కొంతవరకయినా లాభం ఉంటుందా ఉండదా?

నారా: ఉండదని కాదండి; ఆ లాభం, అసలు భూమిరావలసి వ్యాజ్యాలు జరుగుతూంటే వరి ఊడ్చలేదు, వరిలో కిచిడీసాంబా ఊడ్చలేదు అని దెబ్బలాడితే వచ్చేలాభంలా ఉంటుందండి. వ్యాజ్యదార్లకు వాజ్యం ఆలస్యమయినకొద్దీ ఫలసాయం నష్టం. ఒకవేళ ఫలసాయానికి ఖర్చులకు డిక్రీ అయినా అవి వసూలు అవుతాయని వ్యాజ్యదారుకు ధైర్యం ఎల్లా ఉండకూడదో అంతే మనస్థితి అవుతుంది. దేశం అప్పులు ఎక్కువవుతున్నాయంటున్నాము. ప్రభుత్వంవా రిదివరకు చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతూ వుంది. కొత్తఋణాలు చేస్తున్నారు. మనం ప్రభుత్వంతో ఇప్పుడైనా రాజీపడితే ఈ పన్నులన్నీ బ్రిటిషు ప్రభుత్వంపైన రుద్దడానికి, ధర్మం ఎల్లా వున్నా, వ్యవహారంవల్ల వీల్లేకుండా చేస్తున్న వీ సభలు. అప్పుడు మనకు నష్టం కాబట్టే యావన్మందీకలిసి యేదో ఒక స్వతంత్రతకు, ఏక తాటిమిద పని చేస్తే నిమిషంలో ప్రభుత్వంవారు రాజీకి చక్కా వస్తారు, అంటుంది కాంగ్రెసు.

జమీం: అవును, మన ఆశయాలు చాలా గొప్పగానే ఉంటాయి, నారాయణరావూ! కాని మానవప్రకృతికూడా మనం ఆలోచించాలి. ఒక్క చిన్న కుటుంబంలో నలుగు రన్నదమ్ములకు నాలుగు భావాలుండి నాల్గుమార్గాల వెళ్తారుగదా? అటువంటప్పుడు ముప్పదిమూడుకోట్ల జనంవున్న మనరాజ్యంలో మూడుకోట్ల భావాలైనా వుంటాయి. అందుకని దారులు రకరకాలుగావున్నా ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’ అన్నట్లుగా అందరూ కలిసి ఒక చోటికే వెడుతున్నాం గనుక మన గమ్యస్థానం చేరుకోవచ్చును. అట్లాకాక ఒక పక్షంవారు తదితరులు అంతా తమపక్షమే చేరాలని మూర్ఖపు పట్టుపట్టి కూచుంటే అసలు మనప్రయాణానికి అడ్డంరాదా అని నేననేది.

నారా: చిత్తం. మీరు చెప్పింది నేను కాదనను. మహాత్మాగాంధిగారు మూర్ఖపుపట్టు పట్టినాడని మనం అనుకోడానికి సావకాశం లేదని నా మనవి. ఎందుకంటారా, పెద్ద జబ్బులకు పెద్దరకం మందులు, గట్టిరకం వైద్యం కావాలి. సర్వతోముఖం అయిన జ్ఞానం కలిగిన గొప్ప వైద్యుడు జబ్బుకు తగిన వైద్యం సమకట్టుతాడు. మహాత్మాగాంధి, అట్టి వైద్యుడనే నిర్ధారణలున్నవి. కాబట్టి ఆయనమార్గము పూర్తిగా తొక్కక తలోవైద్యం చేస్తే దేశం యొక్క జబ్బు ఎల్లా కుదుర్తుందండి?

జమీందారు: దేశబంధుదాసుగారి పద్ధతికూడ మనం ప్రయత్నంచేసి చూస్తే మంచిదికాదా?

పర: దానికి గాంధీగా రడ్డుపడకుండా తప్పుకొని దాసుగారు మొదలగు వారితో రాజీనామా చేసుకొని తాను ఖద్దరు, పంచమోద్ధరణ నెరవేర్చెదనని సంకల్పించుకొన్నారు గాదండీ?

జమీం: నిశ్చయమే కాని ప్రజలందరు స్వరాజ్యవాదులకు సహాయము చేయుటలేదు. అందువల్ల స్వరాజ్యపార్టీ వారి బలం రెంటికిచెడిన రేవడిలా ఉన్నది. కాంగ్రెసు తమ చేతులలో లేదని ప్రజాదరణం చూరగొన్న నిరాకరణవాదులు, గడ్డితట్టలో పడుకున్న కుక్కల్లా తాము తినకుండా ఇతరులను తిననీయకుండా చేస్తున్నారు. తాము శాసనసభలకు సభ్యులుగా వచ్చి జాతీయపక్షాన్ని బలపరచి ప్రభుత్వము చేతబూని, ప్రజలకు అనుగుణమైన ప్రభుత్వం చేయడం మంచిదికాదటయ్యా పరమేశ్వరరావుగారూ?

పర: అల్లా ప్రభుత్వం ఒప్పకపోతేనండీ?

జమీం: ఒప్పరూ, ఒప్పకుంటే గవర్నరు శాసనసభను రద్దుచేసి, కొత్త ఎన్నికలు ప్రచురించాలి. అందులో మనవాళ్ళే తిరిగి ఎన్నుకోబడతారు. మళ్ళీ మనవాళ్లే ప్రజలపక్షమై మంత్రులై మరల యుద్ధంచేసి విజయం పొందవచ్చు కాదా?

పర: అప్పుడు గవర్నరుగారు ఒప్పుకోకపోతేనండి?

జమీం: ఈ ప్రభుత్వవిధానం రద్దుచేసి తాను, తన కార్యనిర్వాహక వర్గపు మంత్రులు రాజ్యం చేసుకోనీండి. శాసనసభ వట్టి నాటకం అని ప్రజలకు తెలుస్తుంది.

నారా: అదేనండి, అట్టినాటకము అని గాంధీగారు గ్రహించి, ఆ రోగము మూలానికే తగుచికిత్స చేయవలె నంటున్నారు! టైఫాయిడు జ్వరం వచ్చిన రోగిని డాక్టరొకరు మలేరియా కాదని తెలిసియు, ప్రపంచమునకిది టైఫాయిడు అని నిర్ధారణచేయుటకు క్వయినా యిచ్చి యిచ్చి జ్వరం తగ్గలేదండి అని చూపించి, అప్పుడు టైఫాయిడు అని చికిత్స చేయదలచుకొన్నట్లు వుంటుంది కదాండి. ఈ ఆలస్యంవల్ల రోగికి ప్రాణాపాయంకూడా రావచ్చుకదాండీ?

జమీం: మలేరియా యని నిజంగా అనుకుంటే!

నారా: చిత్తం. అలా అనుకునే, ముప్పదియైదు సంవత్సరములు చికిత్స చేసినారు. ఇంకెంత కాలమండీ?

పర: మనదేశం దివ్యమైనది. నాలుగురోజులు ఆలస్యం చేస్తే ఏమిరా?

నారా: అవును, మన ఆత్మలు ఆద్యంతరహితములు. వైద్యమెందుకు?

౧౪ ( 14 )

శ్యా మ సుం ద రీ దే వి


నారాయణ మరునాడు హైకోర్టులో శ్రీయుత అల్లాడి కృష్ణస్వామి అయ్యరును, శ్రీయుత ఎస్. శ్రీనివాసఅయ్యంగారును సంపూర్ణ న్యాయాధికార సభలో హిందూధర్మశాస్త్రవిషయమై సలుపువాదన వినుటకై యేగి, సాయంత్రము నాల్గింటివరకు విని యానందించి రామకృష్ణలంచిహో మను ఉపాహార శాలకుబోయి యచ్చట పూర్ణముగ మెసవి, తన కారునెక్కి తిన్నగ కీలుపాకు లోని మామగారి భవనమునకు బోవునప్పటి కచ్చట సహాధ్యాయుడగు యరవ స్నేహితుడొకడు వేచియుండుట జూచెను. మామగా రప్పటివరకు నింటికి వచ్చియుండ లేదు.

నవ్వు మోముతో స్నేహితుని రెండుచేతులపట్టి యూపుచు, ‘ఎంతసేపయిందండీ, సాంబారయ్యరుగారూ?’ యని ప్రశ్నించెను.

‘నారాయణ్ నీ వరగంట లేటండిదా.’

‘తలవనితలంపుగా రెండుత్తరాలు వ్రాయవలసి వచ్చింది. అందుచేత ఆలస్యం అయింది క్షమించు.’

‘ఆ ఫరవాలేదుదా.’

‘ఒక పదినిమిషాల్లో వస్తున్నాను. కొంచెం కాఫీ, పళ్లు పుచ్చుకోండిమీ. మణీ! నా ఫలహారం అయింది, మణీ!’

‘వరాం సార్!’

‘అవసరందా లేదయ్యా ఆవకాయరావుగారూ.’

‘పనికిరాదు సాంబారు అయ్యరూ!’

నారాయణ త్వరత్వరగా క్షురకర్మ చేసికొని లోనికిపోయి దుస్తులుతీసి స్నానజలముల నిర్వాణయను సువాసనాద్రవ్యమును గలపి స్వదేశీ లవండెరు సబ్బు రుద్దుకొని జలకమాడి, తన దుస్తులగదిలోనికిపోయి, ఖద్దరుపంచెయు ఖద్దరులాల్చీయు ధరించి, ముందుజుట్టులో యూడికొలోను పూసికొని నున్నగా వెనుకకు దువ్వి, సీతానగరం ఆశ్రమం అత్తాకోడలంచుల జరీఖద్దరు ఉత్తరీయం దక్షిణాది మడతలు బెట్టినదానిని భుజమున వేసికొని కాళ్లకు లూథియానా చెప్పులుతొడిగి, చేత నొక చక్కని బెత్తముధరించి, యవయవములన్ని ఛలఛల మన, రెండవ యర్జునునివలె స్నేహితుడు కూర్చుండు మధ్య మందిరములోనికి విచ్చేసినాడు. అంతకుముందే ఉపాహారపుగదిలో ఉపాహారము మెసవి, కాఫీత్రావి యా యరవ స్నేహితుడును గనిపెట్టుకొనియుండెను.

మామగారి పెద్దకారును డ్రైవరు తీసికొనివచ్చి ప్రాంగణము ముందుంచుట తోడనే మన స్నేహితు లిరువురు నెక్కి యందు గూర్చుండిరి, దేహముకదలని కదలికతో, కారు బొంయి, బొంయి మనుచు పున్నేమలై రోడ్డు, ఎగ్మోరు, హారిస్ వంతెన, రౌండుఠానా, మౌంటురోడ్డు, తిరువల్లిక్కేణి పోయి యచ్చట అక్బరుసాహెబు వీథిలో నొక చిన్న మేడకడ నాగినది.

అరవస్నేహితుడు: నారాయణ్! వీళ్ళు ఇక్కడనుంచి ఇంకోచోటి కిదా మార్తురు. ఈ మేడ ఒక మోస్తరుగా ఉండును.

నారా: అవును. ఈ ప్రాంతాలు అంత ఆరోగ్యంగా ఉండవు. వీళ్ళేమన్నా డబ్బుగలవాళ్ళేనా?

అర: అంత పరవాలేదు. తండ్రి జిల్లా ముఖ్య వైద్యుడుగా ఉద్యోగం చేసి పింఛను తీసిదా చచ్చిపోయినాడు. ఇప్పుడు తల్లి, నలుగురు కూతుళ్ళు, నలుగురు కొడుకులు. ఏభైవేలు మణీ యిచ్చిపోయినాడు తండ్రి.

నారా: వీళ్లు సరీగా మంగుళూరు దేశస్థులేనా?

అర: వీళ్లు తెలుగు మైసూరు కలియక. అందరికీ ఇంగ్లీషు, తెలుగు అన్ని భాషలు వచ్చునుదా. మంగుళూరు తల్లి గారిది. తండ్రి మైసూరు.

ఇట్లు మాటలాడుచు మన స్నేహితు లిరువురు లోనికి బోయిరి. లోనికి బోవునప్పటికి మధ్యమందిర మంతయు కన్నుల వైకుంఠముగ నలంకరించి యున్నది. అచ్చట పేము సోఫాలపై రకరకములగు చక్కని తెరదుప్పట్లు పరచివున్నవి. మధ్య నొక గుండ్రని బల్లయు, బల్లమీద అల్లికరుమాలును, అందుపై చీనాబుడ్లు, అలీఘరు కూజాలు వానిలో వివిధజాతి పుష్పములు నున్నవి. అచ్చట నొక కుర్చీపై మేలు పసిడిపచ్చని పదునెనిమిదేండ్ల యీడు బాలకుం డాసీనుడై యుండెను. వీరిరువురును వచ్చుటతోడనే ఆ బాలకుడు లేచి ‘నటరాజన్! వచ్చినారా?’ అని ఇంగ్లీషున ప్రశ్నించుచు దయచేయండి యనెను.

నట: ఈయన మా తెలుగు స్నేహితుడు నారాయణరావుగారు. ఫిడేలులో నిధి. నారాయణరావు! ఈ బాలకుడు మంగేశ్వరరావుదా. ఇక్కడే బి.ఎ. జూనియరుదా చదువుచున్నారు.

నారాయణరావు మంగేశ్వరరావులు హస్తస్పర్శ గావించుకొనిరి.

మంగే: నేను లోనికి బోయి మా యక్కగార్లను చెల్లెళ్లను బిలుచుకు వచ్చెదను. ఇచ్చట గూర్చుండుడు.

అని యాతడు లోనికిబోయెను. నారాయణరావు చదువుకున్న బాలికల సమీపించి వారితో మాట్లాడుట కిదే ప్రథమము. స్త్రీలు విద్యాధికులగుట, నారాయణరావుకున్న ఉత్కృష్టాశయములలో నొకటి. స్త్రీ విద్య జాతీయముగా నుండవలయును. లేనిచో పాశ్చాత్య విద్య నయమేమోకాని, ఏవిద్యయు లేక మూర్ఖత లోనుంచుట మంచిదికాదని యాత డూహించినాడు. ‘విద్యలేకుండా స్వచ్ఛహృదయులై యుండినచో స్వరాజ్య పవిత్రముహూర్తము వచ్చినప్పుడు, వారికి నిజమైన పూర్వసాంప్రదాయవిద్య గరపుటకు వీలేమో’ అని యాతని తండ్రి యనును.

ఇంతలో నలువురు బాలికలతో మంగేశ్వరరావు లోపలినుండి మందిరములోనికి వచ్చినాడు.

నలువురు బాలికలు మెరపుతీగెలు, నలువురు బాలికలు గౌతమీనదీ చిరు కెరటాలు.

వారి సౌందర్యమున ఆర్యత్వము నిండియున్నది.

‘నారాయణరావు! వీరు శ్యామసుందరీదేవిగారు, వీరు రోహిణీదేవిగారు, ఈమె సరళాదేవిగారు, ఈమె నళినీదేవిగారు, వీరు నారాయణరావుగారు’ అని నటరాజన్ స్నేహితునకు నా బాలికలకు పరిచయము గలుగచేసెను. అందరు ఒకరి కొకరు నమస్కృతులిడి, నాసనములపై నధివసించిరి.

‘నారాయణ్! శ్యామసుందరీదేవిఫిడేలును; రోహిణీదేవి వీణను; సరళాదేవి జలతరంగము పియానో, యిస్ రాజ్ చిరతారు, సారంగి మొదలయినవెన్నో వాద్యాలను; నళిని మురళిని అద్బుతముగా వాయించగలరుదా. వీరి తండ్రిగారు చూస్తివా పింఛను పుచ్చుకొన్నవెనక మైసూరులో జాలకాలముండిరి. అక్కడ ఆస్థానవిద్వాంసులుదా కుమార్తెలకు నేర్పినారూ చూస్తిరా? శ్యామనుందరీదేవిగారూ, ఈ నారాయణరావుదా చాల జాగ్రత్తగా, దీక్షగా విద్య అభ్యసించాడు. చిన్నతనాన్నుంచి రామస్వామి అయ్యరికిదా నూరురూపాయలిచ్చి యీ ఊరిలో నెలలు నెలలు విద్య నేర్చుకున్నాడు. ఇట్టి మీ రిద్దరుదా కూడపలుక్కుంటే, ఇద్దరివిద్యా చాలా బాగుగా వృద్ధి అవునుదా నా ఆశయం’ అని నటరాజన్ సంతోషమున జేతులు నులుముకొనుచు పలికెను.

శ్యామసుందరి యిరువదిరెండేండ్ల మిసిమిపసందుల చంపకీసువర్ణగాత్రి. నారాయణరావును చూచి ‘కొంచెమాలస్యం కావడం చూచి మీరీ రోజున వచ్చుటకు వీలుకాదేమో అనుకున్నాము’ అన్నది.

నారా: నేనే మా ఆలస్యానికి గారణము. క్షమించండి. మంగేశ్వరరావుగా రేవాద్యమన్నా వాయించగలరా?

నట: వాయించకేమి! అత నెప్పుడున్నూ నేర్చుకోలేదు కాని, అప్పచెల్లెళ్లు నలుగురూ నేర్చుకొనేవి వినికిడివల్ల చూస్తిరా, అవి పట్టుకొని అన్ని వాద్యాలమీదా వాయించగలడుదా.

నారా: అలాగా! బాగుంది. మీరు చాలా అదృష్టవంతులండీ, మంగేశ్వరరావు గారూ!

మంగే: మా నటరాజన్ ఏదో ఒకటి అంటూ ఉంటాడులెండి. రోహి: నారాయణరావుగారు! వాద్యాలన్నిటిలో ఏది మంచిదంటారు?

నారా: నా ఉద్దేశం వీణా, ఫిడేలు రెండూను.

శ్యామ: ఆ రెంటిలో ఏదని మీ అభిప్రాయం?

నారా: మీ రడిగింది చాలా చిక్కు ప్రశ్న. పురాతనచరిత్రప్రియులకు వీణ యెక్కువ ప్రీతికరము. సంప్రదాయబద్ధులనుగూడ ఫిడేలు ప్రీతివంతుల చేస్తున్నది. వీణలోని చమత్కారాలు ఫిడేలులో లేవు. ఫిడేలులోనీ అద్భుతాలు కొన్ని వీణలో రావు. హృదయంలో నానంద మిమిడియున్న వారి కేదయినా పరమప్రియం. అయినా నామనస్సు వీణతో నెక్కువ కలసి పోయింది. నేనింకా వీణ నేర్చుకోవాలన్న ఊహ మానలేదు.

నళిని: (నవ్వుతూ) నారాయణరావుగారు కోమటిసాక్ష్యమిచ్చినారు. అందరు ఘొల్లుమని నవ్వినారు.

నారా: (హృదయపూర్వకముగ నవ్వుచు) అవును ‘గాంధిగారా, మాలవియా?’ అని అడిగితే ఏమి చెప్పమన్నారు? నేనా ప్రశ్నకు తగు సమాధానమీయలేను; కాని వీణంటే నా మనస్సు పొంగినట్లు ఫిడేలన్న పొంగదు. వెంకటస్వామినాయుడు, బలరామయ్య, గోవిందస్వామిపిళ్ళలు మాత్రము నన్ను కరిగించి వేస్తూవుంటారు.

నళిని: ఫ్లూటు?

నారా: వేణాండి? వేణువు దివ్యగానమే, కాని వేణువు పైరెండు వాద్యాలకు విద్వత్తులో తక్కువ కాదాండి? సంజీవరావువంటి అపరవేణు బ్రహ్మ వీణ, ఫిడేళ్ళతో దానిని తుల్యము జేయవచ్చును. నళినీదేవిగారి పాట యెల్లా ఉంటుందో వినాలి.

శ్యామ: నారాయణరావుగారు! మీ ఫిడేలు పట్టుకువచ్చారా?

నట: ఆ! కారులో ఉంది. తెప్పిస్తా.

నారా: మీరంతా ముందువాయిస్తే వింటాను; నా పాట ఎంతలెండి!

శ్యామ: అల్లాకాదు.

నట: మా అక్క చెల్లెళ్లుముందరదా పాడవలసిందని నేనుదా మునవి.

శ్యామ: సరే.

మంగేశ్వరరావును, నళినియు, సరళయు లోనికి బోయి తంబూరా, వీణ, ఫిడేలు, వేణు, చితారు పట్టుకువచ్చినారు. రోహిణి తంబూరాను ధరించినది. ఫిడేలును శ్యామసుందరి తీసికొనినది. ఇరువురును శ్రుతి సరిచూచుకొన, శ్యామసుందరి పల్లవి నాలపించి, వాయించ నారంభించినది.

౧౫ ( 15 )

అ క్క చె ల్లెం డ్రు

ఆ నలువు రక్క చెల్లెళ్ళ యందమునం దెక్కువ తక్కువలు నిర్ణయించుట దుస్తరము. నలువురు నొకేయచ్చున పోతపోసిన విగ్రహములు, చటుక్కున జూచినచో బోలికలలో నేమియు వ్యత్యాసమున్నట్లు సాధారణులు గ్రహింపనేరరు. పరిశీలనాదృష్టిగలవారు ఆ నలుగురు బాలికలకు ముక్కులు, అడుగు పెదవులు, గడ్డములలో భేదమున్నదనియు, గన్నులలోని పాపల రంగులు వివిధములుగా నున్నవనియును, నుదురుకొలతలు రెండవ నాల్గవ బాలికల కొకతీరు నను, మొదటి మూడవ బాలల కొకతీరున నున్నవనియు, మొదటి యిద్దరి బాలలకు నుంగరముల జుట్టనియు, చివరి యిద్దరి బాలలకు నున్నని సమకేశములనియు, పెద్దయామెయు ఆఖరి బాలయు నిద్దరు పొట్టివారనియు, మధ్య వారిరువురు పొడగరులనియు గ్రహింపగలరు.

శ్యామసుందరి కంఠము కిన్నెర కంఠము, కలస్వనము, పంచమస్వర పూరితము.

రోహిణీదేవి గళమున కాకలీస్వనము, నిషాదస్వరశ్రుతి గలది.

సరళాదేవి గొంతు ధైవతస్వరశ్రుతి, వేణునాదపూరితము.

నళినీదేవి గళ మింక నేర్పడలేదు. కాని మధురమైనదగునని స్పష్టము.

శ్యామసుందరీదేవి వైద్యవిద్యయందు మూడవతరగతి చదువుచున్నది. ఆమె చెల్లెలు రోహిణి రాజధాని కళాశాలలో బి. ఎస్. సి. ఆనర్సు మూడవ సంవత్సరము చదువుచున్నది. మూడవ బాలిక ఇంటరు ప్రథమతరగతి. నాలుగవ బాలిక అయిదవ ఫారము.

శ్యామసుందరీదేవి కుటుంబము సంగతి నారాయణరావునకు నటరాజను చెప్పినాడు. రాజారావు తరగతిలో శ్యామతో మాటాడుచుండెనే గాని లజ్జా శీలుడగుటచే నామెతో దక్కినవారందరు స్నేహముగా నున్నట్లుండలేదు. నటరాజన్ కూడ వైద్యవిద్యార్థి, అతడు శ్యామతో, నామె కుటుంబముతో బాగుగా స్నేహమొనర్చెను. శ్యామాసహోదరీబృందము సంగీతలోలమని నారాయణరావు పరమేశ్వరులకు దెలిసినప్పటినుండియు వారచ్చటకు బోయి ఈ సంగీతము విని యానందింపవలయునని యనుకొనుచుండిరి.

పరమేశ్వరుడు స్త్రీలతో నంతలో స్నేహము చేయగలడు. నారాయణరావు తమంత తాము స్నేహము కోరివచ్చినవారితో గలసి మెలసి యుండగలడు. ఒక్క రాజారావునకే స్త్రీ లనిన తగని సిగ్గు.

నారాయణరావు నటరాజనులు వచ్చిన గంటకు గాని పరమేశ్వర రాజారావులకు శ్యామఇంటికి వెళ్ళుటకు వీలు చిక్కినదికాదు. మన మిత్రులారోజున శ్యామ ఇంటికి వచ్చి సంగీతము వినుటకును, నారాయణరావు తన సంగీతము వినిపించుటకును నటరాజనే ఏర్పాటు చేసినాడు.

ఇంతలో రాజారావును బరమేశ్వరుడు నక్కడికి వచ్చిరి. ఈతడు కవి, చిత్రకారకుడు, విమలగానవిలోలుడు. అభినయమునం దారితేరిన కళాహృదయుడు. చిత్రచిత్రమగు విషయముల పాటలుగా గూర్పగలడు. అని పరమేశ్వరుని గూర్చి యెఱింగించిరి. రాజారావు నందరు నెఱింగిన వారే.

సభ యంతట పూర్ణమై పరిమళించినది. నారాయణరావు ఫిడేలు వాయించినాడు. పరమేశ్వరు డభినయముతో, తీపియైన కంఠముతో బాటల బాడినాడు. నటరాజన్ అరవపాటల మధురముగ వినిపించినాడు. శ్యామ, రోహిణి, సరళ, నళిని యందరు వారి వారి కళాచమత్కృతి గనబరచినారు. రాచప్పను, కిట్టప్పను, బాలగంధర్వుని, ఫండేర్కరును అనుకరించుచు మంగేశ్వరరావు తియ్యనిపాట పాడినాడు.

విమలగాంధర్వము వియద్గంగాఝరియై సుళ్లుకట్టుచు, కరుళ్లు వోవుచు, ఫెళ్లున విరుగుచు, పతనములై తూలుచు ఉప్పొంగుచు, ఊగుచు ప్రవహించినది. చిరువాగు లందు కలిసినవి. ఉపనదీనదంబు లందుజేరి త్రివేణులైనవి. శాఖా నదు లందుండి వీడ్వడి వేరుదారుల శాలికేదారముల దడుపబోయినవి.

గానకళారహస్యము లావేళ పూలదోటలైనవి, నక్షత్రకాంతులైనవి, చంటిబిడ్డలనవ్వులైనవి. చక్కని లేబెయ్యగంతులైనవి, సంధ్యాసమయ శ్రీనటేశ్వర పాదకింకిణీతాళములైనవి.

ఒకరినొకరు మెచ్చుకొన్నారు. ఎవరికివారు పరవశులైనారు. ఒకరినొక రానందపరవశుల గావించినారు. లయగతులజూపు వేడుకమై లయావిష్టుడై లయబ్రహ్మను ప్రత్యక్షముచేసినా డానాడు నారాయణుడు. కమాను వేగములో ‘తానం తానం తానం ఆనంతా, నంతానననన, ననాం ననాం నాంనా అనంతా’ యన్న తోడిరాగములోని తానం శ్రీ బాలకృష్ణ పాదనూపుర ఘలం ఘలిత మధురతర మధుగతీవేగమై వారి నందరిని ముంచెత్తినది. అస్పష్ట మధుర సూక్ష్మ స్వరధ్వనులలోనికి గొనిపోయి యణుమాత్రము జేసి, రానురాను విజృంభింపజేసి, బ్రహ్మాండము నావరింపజేసి సమస్తసృష్టిలయముజేసి కమాను ఆపి వేసినాడు. శ్యామసుందరీదేవి పరవశయై చటుక్కునలేచి నారాయణరావునకు నమస్కరించి, ‘అయ్యా! విద్వత్తుమాట యటుండనిండు, ఈ పోకడలు, ఈ స్వకపోలకల్పనాప్రవాహము అద్భుతమైయున్నది. ఈ పద్ధతి ఎక్కడ నేర్చుకున్నారండీ’ యని యడిగినది.

‘అమ్మా! నే నెల్లప్పడు ఫిడేలు వాయించుకొనుచునే ఉంటాను. మన దేశమున ఒక్కొక్క యుత్కృష్టవ్యక్తి జన్మించి, సంగీతాది కళలలో పురాతన సంప్రదాయజనితమగు నొక నూతన సంప్రదాయము నప్పటికి నెలకొల్పి, భవతారకమగునట్లు చేయుచున్నాడు. నేటివరకు త్యాగరాజు ననంతరమున మరియొక వ్యక్తి జన్మింపలేదు. నేను బాశ్చాత్య గానవిశారదుడగు నొక ఫిడేలు వాదనాకుశలునికడ పాశ్చాత్యుల పోకడలు నేర్చుకొన్నాను. జపాను సంగీతము, బర్మా, సయాము, పెరిశియా, రషియా మొదలగు వివిధదేశముల వాద్య విశేషములు జాగ్రత్తగా విని స్వరముకూర్పు, వేగము, రాగము, తాళము పరిశీలించి కొత్త కొత్త పద్ధతులు రాగములలోనికి, తాళములోనికి, కూర్పులోనికి జొప్పించినాను’ అని నారాయణ ఇంగ్లీషున ఆన్నాడు.

‘యెనిమిదిగంట లయినది. మనము సెలవుపుచ్చుకొందమా’ యని రాజారావు లేచినాడు. తక్కినవారందరు లేచుటయు, నొకరి కొకరు వందనము లాచరించుకొనిరి. నారాయణరావు, రాజారావు, పరమేశ్వరుడు, నటరాజన్ అందరు కారుమీద నెక్కి నెమ్మదిగా సముద్రతీరముననే ప్రయాణము చేయుచు నటనుండి వీధులు తిరిగినారు.

ఎవరిండ్ల వారిని దిగవిడచి నారాయణు డింటికి చేరినాడు. ఆతని హృదయము శ్యామసుందరీదేవిని గనుగొన్నప్పటినుండియు ద్రవించిపోయినది. శ్యామసుందరి తన చెలియలైనట్లు హృదయమున ప్రత్యక్షమైనది. తన కారుగురు చెల్లెళ్ళనుకొన్నాడు. శ్యామసుందరిలో సూర్యకాంతమును జూచినాడు. సూర్యకాంతము తన యప్పచెల్లెళ్ళలో కడుగూర్చు చెలియలు. ఆమె యనిన ప్రాణమే తనకు. నూర్యకాంతము తనలో నొకయంశ, ఈ శ్యామసుందరి తనకు కొంచెము దూరపు చెల్లెలా? అవును, తన యిరువురు చెల్లెళ్ళ వెనుక చెల్లెలు. తన వాత్సల్యమును జూరగొన్నది సూర్యకాంతము. శ్యామకుకూడ నా వాత్సల్యమున నేడు చోటుదొరికినది.

కాని ఎక్కడ దీ సంబంధము! ఏజననాంతర సౌహృదమో ప్రత్యక్షమైనది. తాను తన చిన్నారి భార్యయగు శారదను బ్రేమించుకొన్నాడు. శారద తనదైవము. తన్ను బ్రోవ చనుదెంచిన దివ్యభామిని. ఆమె తన ప్రాణమునకు బ్రాణము. ఆమెను జూచినప్పుడు తన పురుషత్వ ముప్పొంగినది. తనలోని దివ్యత్వము ప్రస్ఫుటితమైనది. ఆమెను కౌగిలించుకొనవలె, ఆమెను బిగియార తనలో జేర్చుకొనవలె. ఆమె పెదవులు అమృతంపు సోనలని తాను కవనమల్లుకొన్నాడు. శారదను జూచినప్పుడు ప్రేమ, దయ, హృదయమున సంగీతము, కపోలముల వేడి, దేహమున మత్తు, ఆత్మకు ఆనందము కలుగును. ఏ స్త్రీయైన దన్నట్లు పులకరమున ఓలలాడించగలదా? తన్నట్లు పొంగింపచేయగలదా? అదియ ప్రేమ కాబోలు, అదియే ప్రణయ మహిమ!

శ్యామసుందరిపై గలిగిన ప్రీతిలో ఆమె దేహము తనకు స్ఫురించదు. ఆమె తనకు చెల్లెలు.

పరమేశ్వరుడు దీర్ఘాలోచనాపరుడై ఇంటిదగ్గర కా రాగినసంగతియు గ్రహించలేదు. ‘ఓ కవీ! కలలోంచి మెలకువ తెచ్చుకోరా’యని నారాయణుడన్నాడు. ‘ఒరే, నేను కలకంటుంటే నువ్విందాకటినుంచి తెగ మెలకువగా ఉన్నావుకాబోలు, పక్కనే ఉన్నావుగాని ఒక్కమాట లేదే?’

‘నువ్వేదో ఆలోచిస్తున్నావని!’

‘నామీద పాపం దయతలచి నన్నుకూడా కాస్త ఆలోచించుకోనిచ్చా వన్నమాట. వహ్వా!’

‘ఏమిటిరా నువ్వాలోచించేది? నేనూ ఆలోచిస్తూనే ఉన్నానులే!’

‘అలాగా! ఈవాళ మా ఆవిడ నాపై అనుమానం పడుతుంది. నా హృదయాన్ని అద్దంలోని బొమ్మలా గ్రహిస్తుందిరా!’

‘ఆ ఉపద్రవం ఎందుకు? నీ మదిని యీవాళ కదిపి కదిపి మధించి ప్రేమ అనే విషమునో, అమృతాన్నో ఉద్భవింపజేసుకున్నావా?’

‘ఒరే, వాళ్లు అప్సరసలురా. వాళ్లమధ్యవుంటే ఋషులైనా నిష్కల్మష హృదయులై ఉండగలరట్రా! రోహిణీదేవి చెంత నేను చంద్రుణ్ణనుకున్నా!’

‘పరమేశ్వర మూర్ధాభరణమ వనుకొన్నావు, పరమేశ్వరమూర్తివికాక!’

‘అహో అవునురా! నాకళ్ళు ఆమె కళ్ళు ఏకమయినవి. ఆమె వాయించినంతసేపు నావైపు చూస్తూ పాడిందిరా. ఆమె కళ్ళు సోగలా, వాగులా!’

‘ఆమె అంత అందకత్తెటరా?’

‘ఒరే, నువ్వూ కవివి, చిత్రకళయందు నీకున్నూ ప్రేమ. ప్రకృతి చిత్రాలు చాలా వేస్తావు. గానహృదయం కలవాడివి. గానమే జీవితం అంటావు. నీకు తెలియదురా!’

‘అరే పరమేశ్వరం! మనము మన జీవితాలు సార్ధకపరుచుకోవాలంటే మనలో ఇదివరదాకా లోటయిన స్త్రీ హృదయసందర్శనం పూజనమ్రహృదయంతో జేసుకోవాలిరా. మనకిదివరదాక స్త్రీ అంటే ఒక వస్తువో, ఏదో మనది అనే భావమే కాదుట్రా?’

‘అవునోయి! నువ్వు ఇదివరదాకా అంటూనేవున్నావు. మనది త్రిశంకు స్వర్గం. మనం ఉత్కృష్టమైన పూర్వసాంప్రదాయకాలంలో అంటే వేదకాలంలోనూ లేము, నవనాగరికులమూ కాము.’

‘అయితే వీళ్ళెలాంటి వాళ్ళంటావు?’

‘ఇప్పుడు మనం చూస్తున్నాం. పాశ్చాత్యనాగరికతావ్యామోహంలో పడి, రెంటికీ చెడ్డవాళ్ళయితే, బడాయి, టక్కులు, ప్రాపంచికదృష్టీ కలవాళ్ళవుతారు. కాదూ...’

‘కాదురా మరి! అందంగాఉన్న చక్కని జంతువులూ అవుతారు. తమ్ము ఇతర్లు చూచి ఆనందిస్తున్నారా లేదా అనేజాతి అలాంటిరకం అవునా కాదా అన్న సంగతి రాజేశ్వరుడికే తెలియాలి. రేపు మనవాడు వస్తున్నాడు. మాట్లాడితే రాజమండ్రి పరుగెత్తుతాడు. వాడిసంగతి బాగాలేదు.’

౧౬ ( 16 )

పు ష్ప శీ ల

రాజేశ్వరరావు బి. ఇ. మూడవతరగతి చదువుచున్నాడు. ఈ యేడాతని చదువు తిన్నని మార్గమున నడుచుటలేదు. తల్లికి జబ్బుచేసినదని వంకబెట్టి రాజమహేంద్రవరము పరుగెత్తిపోయి యచ్చట పుష్పశీల సాంగత్య మెప్పుడు దొరుకునాయని యనేక మార్గముల నన్వేషించుచుండెను. పుష్పశీలయు ననేక చిత్రవిచిత్రమార్గముల దన ప్రియుని గలసికొను నేర్పాటులు సేయుచు నావేళ పరవశురాలై యున్నది. ఆ రోజులలో బుష్పశీల భర్తపై చూపు ననురాగమునకు మితిలేదు. సుబ్బయ్యశాస్త్రిగారును దనరసికతకును భార్యచూపు నపరిమితానురాగమునకును మురిసిపోవుచుండెను.

మిత్రుడగు నొక వైద్యునిచే దన తల్లికి చాల జబ్బుగానున్నట్లు పత్రము నంది, యయ్యది తన కళాశాలాధ్యక్షునకు బంపి, రాజేశ్వరరావు మరి పది రోజులు రాజమండ్రిలో మకాము వేసినాడు. పుష్పశీలాదేవి నొంటిగా గలిసి కొనుటకు వీలు కుదరలేదు. సుబ్బయ్యశాస్త్రిగారి యింటిలోనివారు నమ్మకమైన బంట్లు, యజమాని నిధినిక్షేపములను, వస్తువులను, భార్యను నితరులు తస్కరింపకుండా వేయికన్నుల కాపాడుచుందురు, లంచములకు లొంగరు. మాయమాటలకు కరిగిపోరు.

పుష్పశీల తన హృదయ మితరులకు దెలియనీయకూడదు. ఆమె తన యింటిలోనైన ఏకాంతము సంఘటించవలయును; లేదా, యొంటిగా బయట కెక్కడికైన వెళ్లుటకు వీలుచేసికొనవలయును.

రాజేశ్వరుని కౌగిలింత యొకనాడు రుచిచూచి, ఆనాటి ముద్దుల సువాసనల రుచుల తన పెదవులపై నింకను ఆఘ్రాణించుచున్న దామే. తనయీడు వాడగు రాజి తనకు భర్తయైయున్నచో తన జన్మము తరించియుండును. అహో! తన యౌవన మానాడు రాజేశ్వరుని కౌగిలింతలో రాగాలుపాడుకొన్నది. భర్త తనకెప్పుడు నంత తీపి యీయలేదే; ప్రేమయన నదియే. తాను కూడ నొక నవలలోని కథానాయికవలె నున్నది. తాను రాజేశ్వరుని నిక నెన్నటికి నెడబాయకుండుట ఘటింపదా? రాజేశ్వరుని కలుసుకొనుమార్గమే దొరకదాయె. పదిరోజులు పుట్టింటికేని పంపడు తనభర్త. అయినప్పటికిని పుట్టిల్లు రాజమహేంద్రవరమే కావున నప్పుడప్పుడచటికేగి యచ్చట రాజేశ్వరు నేల కలసికొనగూడదు? అది బాగుగా నున్నది.

ఆ రోజున తన హావభావవిలాసముతో పుష్పశీల భర్తను ప్రేమసాగర లీనుని జేసినది. సుబ్బయ్యశాస్త్రి గారికి బ్రపంచకమంతయు గాఢమధురమై తోచినది... ఆడవాళ్లంత యానంద మియగలరా? వారి జన్మయే యానందము, వారులేని పురుషుని జన్మము మరుభూమియే. ‘నీకింత ప్రేముందా, పుష్పం?’

‘నా బ్రతుకంతా ప్రేమేనండీ!’

‘నువ్వు పుష్పంలా దివ్యమైన చరిత్రగలదానివిసుమా ప్రణయసుందరీ.’

‘మీ మిద కవిత్వం రాయాలి. ఇంతవరకూ అందరూ మగవాళ్లే కవులు. నేను మీమీద పాటలు పద్యాలు రాస్తాను. మారుపేరు పెట్టుకొంటాను. పత్రికకు పంపించనా?'

‘తప్పకుండా పంపించు. నువ్వు పంపించబోయేముందర నాకుచూపిస్తూ ఉండు. నాకు కవిత్వం రాదు. లేకపోతే నేనును నీమీద వందలకొలది పాటలు రాస్తూ ఉందును.’

‘ఓ సామి నిను జూసి
నాయెడద తీపినై
నిలువెల్ల ప్రవహిస్తు.
మంచుకొండై నువ్వు
మబ్బు బాలిక నేను,
నీపై ననవరతము
నృత్యాన సోలెదను’

‘ఈపాట బాగుందండీ?’

‘నువ్వు రాసిం దేదిబాగుండదు! నాకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు. కాని, ఇప్పుడు భారతి మొదలైన పత్రికల్లో ప్రచురింపబడే భావకవిత్వంకన్న తక్కువగా ఉన్నదా యేమిటి!’

మరునాడు భర్త కోర్టుకు వెళ్ళినప్పుడు, తన్ననవరతము కాపాడుచుండు పనిమనిషి నెట్లయిన వదలించుకొనదలచి భర్తకొక యుత్తరము వ్రాసి పంపించినది. పనిమనిషి యా యుత్తరము పట్టుకొని జడ్జీకోర్టుకనిపోయినది. వీథిలోని బాలకునిచే రాజేశ్వరున కొక యుత్తర మంపినది. రాజేశ్వరుడువచ్చి దొడ్డి గుమ్మమున దొడ్డిలోనికి ప్రవేశించినాడు. వంటచేయు చుట్టపుమేనత్త ముసలమ్మ కేదియో వంకబెట్టి పని కల్పించినది. వసారా గుమ్మమున లోనికి రప్పించి రాజేశ్వరుని మేడమీద గదిలోనికి పంపినది. తల నొప్పిగా నున్న దనియు, కొంచెముసేపు గదిలోనికిబోయి పరుండెదననియు జెప్పి, మేడమీద గదిలోనికిబోయి తలుపు వేసికొన్నది.

కొందరు స్త్రీలు తమకోర్కెను దెలిపియు దెలుపని కటాక్షవీక్షణాదులచే దెలుపుచు, పురుషహృదయములు జూరగొని మనోభీష్టము తీర్చుకొందురు. కొందఱు తమ కోర్కెను భయముచే, లజ్జచే బ్రియునకు దెలియనీయక, అపరిమితమగు బలవంతముచేవలె బ్రియుని యాశ్లేషములో నణంగుదురు. తామై బయల్పడి, కోర్కె నెరింగించుకొని బ్రియునకు వశలగు వనిత లరుదు. అట్టి వారి ప్రేమము గట్లుతెంచుకొని పాఱుచుండ దాని నెవరడ్డగలరు?

పుష్పశీలకు రాజేశ్వరునిపై నట్టి వెఱ్ఱి జనించినది. ఎట్లయినసరే తన కోర్కె తీర్చుకొనవలెను. ఆమెకు సతతము రాజేశ్వరుడే ప్రత్యక్షమగుచున్నాడు. రాజేశ్వరుని నవ్వులు, రాజేశ్వరుని వట్రువలుతిరిగిన ఛాతీదండలు మనోనేత్రమున దోచి యొడలు ఝల్లుమనుచుండెను.

నిముషముల నలంకరించుకొన్నది. మోము కడిగికొని సుగంధ మలది కొన్నది. సువాసనపొడిచే మొగము కైసేసినది. సన్నని చీరకట్టి, సన్నని రైక తొడిగి గదిలోనికి వెడలిపోయినది. తలుపు వేసికొన్నది.

రాజేశ్వరుడు నిముషమొక యుగముగా వేచియున్నాడు.

‘నీవు రావనుకొన్నాను. ఆనాడు మీ ముసలమ్మకు జబ్బు చేసినప్పుడు వస్తే సమయానికి నీ భర్త వచ్చాడు. ఈ రోజున ఏమి అడ్డమో అనుకున్నాను.’

‘మీరు పరపురుషులు. నేనిల్లా రాకూడదు. పొరపాటు. నే వెళ్ళిపోతా.’

‘అయితే, నన్నెందుకు రప్పించావు?’

‘ఎందుకో? ప్రతిరోజూ మాయింటికిరావడం, మాయింటిముందర యింటి అరుగుమీద మధ్యాహ్నము స్నేహితులతో మాట్లాడుతూ కూర్చుండడము, కారణం నాకు తెలియక ఏమిటో కనుక్కుందామని అనుకున్నాను.’

‘అల్లాగా’ అని రాజేశ్వరుడు డా బాలికను పొదిగిట నదుముకొన్నాడు. పెదవులపై ఫాలముపై ముద్దులిడినాడు. ఆ బాలిక తప్పించుకొని పారిపోయి రోజుచు, చిరునవ్వు నవ్వుచు, నురస్థలమెగుర మంచముపై పడిపోయినది. రాజేశ్వరుడు నవ్వుచు మంచముపై నా బాలిక నదిమిపట్టి మెడ ముద్దుకొన్నాడు.

కాలేజీ కేగుటకింక నాలస్యము చేసినచో జాల నష్టమువచ్చునని సహాధ్యాయు లిరువురు మువ్వురు వ్రాయుటతోడనే రాజేశ్వరుడు రాజమహేంద్రవరము నుండి కదలివచ్చుచు, తన్ను గిండీకి బోవుదారిలో గలియుమని నారాయణరావుకు తంతి నిచ్చినాడు. ఆ మాట పరమేశ్వరునకు దెలిపెను నారాయణరావు.

ఉదయమున మెయిలు వచ్చునప్పటికి తనకారుమీద నారాయణరావు సెంట్రల్ స్టేషన్ చేరునప్పటికి మెయిలుబండియు వచ్చినది.

సెలవులు పుచ్చుకొని స్వస్థలముల కేగుచున్న రెండు మూడు తమిళయ్యరు కుటుంబములు తప్ప తక్కినవారందరు తెలుగువారే. వర్తకమునకు, హైకోర్టు పనికి, యాత్రలకు, వైద్యములకు వచ్చువార లాబండి మూడవ తరగతుల నిండియుండిరి.

బండి యాగుటతోడనే వందలకొలది కూలీలు బండిలోనికిబోయి ‘వద్దు వద్దు’ అనుచుండగనే చేతిమూటలు లాగువారు, ‘సామాను దించినతర్వాత బేర మాడవచ్చు’ ననువారు, ‘మీరుదా బేర మేమిసామి! నాను బీదవాడుదా, నువ్వు యిచ్చే కూలిదా నాకుపొట్ట, సామి!’ అనువారు నైయుండిరి. చుట్టములను, స్నేహితులను కలుసుకొన వచ్చినవారు, భోజన వసతిగృహముల తరఫు మనుష్యులు, వీరియందరి రణగుణధ్వనితో నాప్లాటుఫారము బోరుకలుగుచుండెను. నారాయణరావు విసవిస మధ్యతరగతి బండికడకు బోవుటయు నందుండు రాజేశ్వరుడు చిరునవ్వు నవ్వుచు దిగినాడు.

‘ఏమిరా వచ్చావు? మీ అమ్మగారి జబ్బు ఎల్లావుందిరా?’

‘నిమ్మదిగావుంది. అందుకనే వచ్చాను.’

‘కళ్ళు గుంటలడ్డాయి, మీ అమ్మగారికి రాత్రింబగలు పరిచర్యకాబోలు. వెఱ్ఱికాయా! దిగు నీపనిచెపుతా.’

‘చిత్తం సామి!’

‘సామాను కారుకు పట్టుకురారా!’

‘ఏవిస్తురు సామి?’

‘నీ మెడ విరుస్తురుగాని రారా!’

కూలివాడు సామానుతో రా, మిత్రు లిరువురు నారాయణ కారుకడకు బోయి కారు వెనుక సామాను కట్టినారు. ఆకా రిరువురికే సరిపోవును. బండిని బాగుచేయుటకు, నవసరమైన నడుపుటకు నొక యువకుడు బండి వెనుకతట్టున నున్న యాసనముపై గూర్చుండును. నారాయణరావు కారునడుపుచు, గవర్నరుగారి భవనముదారిని సైదాపేట మీదుగా గిండీదారి పట్టించెను.

దారిలో రాజేశ్వరుడు తన యదృష్టమును వర్ణించినాడు. ‘వెళ్ళినందుకు పని సఫలమయినది. నాజన్మ తరించిందిరా. ఒరే, నారాయుడూ! ఆ పిల్ల అందం నువ్వు కనివిని యెరగవురా. అందమైన స్త్రీతో చెలిమిచేయని మగవాడి జన్మ వ్యర్ధంరా!’

‘నీ ప్రేమతత్వంతో నాకు మతిపోతూవుంది, రాజీ!’

‘నువ్వు వట్టి పిరికిపందవురా నారాయణా! నీపిరికితత్వాన్ని నువ్వు ‘ధర్మం’ అని పేరుపెట్తున్నావు.’

‘ఒరే దద్దమ్మా! నిన్ను ముక్కలు ముక్కలుకింద విరగగొట్టేస్తా. విను. వాదన సరీగాచెయ్యడం నేర్చుకో. ‘నేను చేసింది తప్పు, నా దేహాన్ని నా మనస్సును ఆపుకోలేకుండా ఉన్నాను. అది నా దౌర్బల్యం’ అని ఒప్పుకోక మమ్మల్ని పిరికివాళ్ళంటావు. ఇంతకీ నువ్వంటే నాకుండే ప్రేమ చేత చెపుతున్నాను. నువ్వెలాంటివాడవైనా నాకు స్నేహితుడవే. పరస్త్రీ, పరునిభార్యను నువ్వు గంగలోకి దింపావు. ఇప్పుడైనా ఒడ్డుకు చేర్చు; లేదూ, నీయిష్టం. నేను చెప్పేది యింతే,’ 

౧౭ ( 17 )

రా జే శ్వ ర రా వు

నారాయణరావు, పరమేశ్వరుడు, రాజేశ్వరునితో నొక రాత్రియైన గడపుటకు సాయంకాలము గిండీ హాస్టలుకు బోయినారు. రాజేశ్వరుడు స్నేహితు లిరువురితో బుష్పశీలకు దనకుగల స్నేహము పూర్ణముగా వివరించి తెల్పెను. ఆమెలేని జన్మము తనకు దుఃఖభాజనమని తెల్పెను. ఎట్లయినను దన కామె కావలె. తనకు జదువు వలదు, ఆస్తి వలదు, చుట్టములు స్నేహితులు వలదు, పుష్పశీలయే కావలెను. ఆమె తనదగ్గర నున్న జాలును.

భర్తకడ నామెయుండ దాను రహస్యముగా రాకపోకలొనర్చుట దుర్భరము. ఆమె పూర్తిగా దనది కావలె. ఎట్లయిన ప్రపంచము తలక్రిందులుచేసియైన సరియే, యామెను గొనివచ్చెదనని యాత డుత్సుకుడై స్నేహితులతో నాడినాడు.

నారాయణుడు నిర్ఘాంతపోయినాడు. పరమేశ్వరుడు నిస్తబ్ధుడైనాడు.

నారా: ఒరే! నీపైన క్రిమినల్‌కేసు పెట్టి ఖైదులో వేయించ వచ్చురా భర్త!

రాజే: ఇంతకంటే ఆ ఖైదే మెరుగురా.

పర: ఖైదుకు వెడితే నీకేమి సౌఖ్యం? పుష్పశీల రాదుగా నీతో ఖైదుకు?

రాజే: ఒరే నారాయుడూ! నువ్వు గాంధిమహాత్ముని శిష్యుడవు, దేశంకోసం ఖైదుకు వెళ్ళావు. నువ్వూ నీవంటి పవిత్రులు ఎల్లాగైతే ధర్మం కోసం, దేశంకోసం పదేపదే ఖైదుకు వెళ్ళడానికి సిద్ధమో, అల్లాగే నేనున్నూ నాకు ధర్మం అని తోచిన యీ పవిత్రకార్యంకోసం జైలుకు వెళ్తాను. అప్పటికి దేశంలో దీన్ని గురించి ఆందోళనపుట్టి, చట్టం మార్పుచేస్తారు. ఇతర దేశాల్లో ఇంకోళ్ళ భార్యను లేవదీసుకువెళితే శిక్షిస్తారా?’

నారా: ఇతర దేశాలలో పెళ్ళి సంపూర్ణ మతసంబంధమైన ముఖ్య ధర్మంకాదు. వ్యక్తీ వ్యక్తీ ఏర్పరచుకొన్న షరతులతో కూడుకున్న ఒక ఏర్పాటు కాబట్టి, ఒకని భార్యను ఇంకోడు తీసుకుపోతే, వాడిచేత భర్తకు నష్టపరిహారం ఇప్పిస్తారు. భర్త కోరితే వాడి పెళ్ళి రద్దుచేస్తారు. నీచజాతులకు మన దేశంలోనూ కులతప్పులూ, మారుమనువులూ ఉన్నవి. ఆర్యవివాహం మోక్షసంబంధమైన మతంతో కూడుకొన్నది. నాలుగాశ్రమాలు మానవు డాత్మతత్వం తెలుసుకోడానికై చేసేయాత్రలో మజిలీలవంటివి. అందుచేతనే ఒకసారి అయిన పెళ్ళి రద్దుకాదు, మతసంబంధమైన దోషాలన్నీ శిక్షాస్మృతిలో చేర్చారు. రాజే: నువ్వు న్యాయం చెప్పరా! మనం ఇప్పుడు జీవితాన్ని ధర్మ దృష్టితో చూస్తున్నామా? మనం ఉదయం లేస్తే సాయంత్రం వరకు చేసే పనులు మతదృష్టితో చేస్తున్నామా! వట్టి అల్పభావాలతో సూపర్‌స్టిషన్‌తో చేస్తున్నాము. అల్లాంటప్పుడు పెళ్ళి రద్దుచేసుకునేందుకు వీలుండే శాసనం, పరపురుషుడితో విహరించడానికి స్త్రీకి స్వేచ్ఛయిచ్చే శాసనం. ఇవన్నీ ఉండవద్దూ?

నారా: అవునులే! ప్రభుత్వం తన యిష్టంవచ్చినవి శిక్షాస్మృతిలో జేర్చి ఇష్టంలేనివి వ్యాపారసంబంధం చేసిపెట్టిన స్మృతే యిప్పుడు మనకు అది పోయినా నా------------ కాని ... వివాహం రద్దుశాసనం... నాకు ఏమీ ఇష్టం...... లేదు.

పర: ఏమిటిరా ఆ నసగడం! విను మరి. ఇప్పుడన్నీ ప్రభుత్వంవాళ్ళు లాలు చేశారు. ఇదివరకు ధర్మాలిప్పుడు అమల్లోలేవు. ఇక ఎన్ని లాలు చేస్తే ఏమిభయం అంట.

నారా: (కోపంతో) అసలే మండిపోతోంది. మన దౌర్భాగ్యతవల్ల మనదేశం పరులపాలయింది. అందువల్ల వచ్చిన కష్టాలు, దోషాలు తప్పనిసరిగా వచ్చినవే మన్ని వేపుకుతింటోంటే, మన్ని మనం బాగుచేసుకోని, శాసనాల చేతుల్లో బడని ధర్మాలనన్నా కాపాడుకోకుండా, యింకా తగులడాలీ? నేను పూర్వాచారపరాయణుణ్ణి, సనాతనవాదిని అనిచెప్పి మూర్ఖపు పట్టులు పట్టే దద్దమ్మను కాను. కాని అత్యుత్తమ ఉదారహృదయంతో, మతదృష్టితో, ఆత్మసామ్రాజ్య దృష్టితో వివేకానంద, మహాత్మగాంధి మొదలగు అవతార పురుషులు మన కిచ్చిన ఆదేశాల్ని ఆధారంచేసుకొని సంఘం బాగుచేసుకుంటే అభ్యుదయ మంటాను. కాదా?

రాజే: కోపం మాని ఇప్పుడు నా విషయం నువ్విచ్చే సలహా ఏమిటో చెప్పు. పరమం ఇచ్చే సలహా ఏమిటి? చెప్పండి. నేను ఉడికిపోతున్నా. చదువుమీదికి దృష్టిపోదు, నిద్రలేదు, ఆహారం సహించడం లేదు. చెప్పండి. లేక పోతే... ఏరోజునో హిందూపత్రికలో ‘ఒక యువకుని మరణము.... ఎస్. ఐ. ఆర్. రైలుపట్టాలమీద శవము, ఆత్మహత్య!’ అని వింటారు.

పర: ఛీ! ఛీ! నావళ్ళు జలదరిస్తోంది. నాకు గుండె దడదడమంటూంది.

రాజే: గుండెకాయ గంతులేసి నోట్లోంచి ఊడిపడలేదుకదా! ఆడంగి కానా!

నారా: కుంకాయి! వాడిజోలికి వెళ్ళకు. ఆదివారంనాడు నేనూ, రాజూ, పరమం వస్తాము. ఆరోజున నీ సంగతి ఆలోచిద్దాం, మరి పడుకుందాం.

రాజే: నారాయుడూ! నాకు నిద్దర పట్టదు, మీకుమాత్రం నేను ఎందుకు పట్టనివ్వాలిరా!  నారా: ఒరే! నీ బుర్ర చిదకకొట్టి నిద్దరోగొట్టుతా!

రాజే: ఒరే! నువ్వు చెన్నపట్టణంలో వున్న విద్యార్థిమండలాలన్నిటిలో బలవంతుడవైతే కావచ్చును. త్రోవలో అడ్డంవచ్చిన చంటిపిల్లవాడిమీద పడి సైకిలుమీదనుంచి దిగి, కుఱ్ఱాణ్ణి బెత్తం పుచ్చుకొని చావగొట్టిన యూరోపియను సోల్జరును మెడనొక్కి, గుడ్లు తేలవేయించి, దెబ్బలాటకు రమ్మంటే, వాడు తెల్లబోయి నీకు దండం పెట్టి, క్షమార్పణ అడిగితే అడగవచ్చును. కాని నీ దెబ్బ నాకు నిద్దర తెప్పించగలదురా?

అందరు నవ్వుకొనిరి. నారాయణుడు పండుకొనగనే నిదురపోయెను. పరమేశ్వరుడును, రాజేశ్వరుడును మాట్లాడుచునే యుండిరి. భళ్ళున తెల్లవారినది.

మృదుహృదయుడగు పరమేశ్వరు డనేక సాంత్వనోక్తులతో రాజేశ్వరుని హృదయమునకు శాంతి నొనగూర్చెను.

ప్రేమ ఎవరెఱుంగగలరు? ప్రేమతత్వములో నెన్ని ఛాయలున్నవో? చిత్త కార్తిలో కుక్కలకు కలిగే యిచ్ఛ ప్రేమపదార్థములో నొక కళయే. అందమైన వస్తువు నాసించుట ప్రేమయే. సౌందర్యపిపాసయు ప్రేమలో అంశమే; కరుణ ప్రేమజనితమే. ఆత్మలు రెండు నేకమైపోవుట ప్రేమయొక్క ఉత్తమదశ. ఆత్మనెరిగి పరమాత్మనెరుంగుటకు ప్రేమయొక్క పరమావధి.

‘ఒరే! సర్వవిధాలా నా హృదయం ఆకర్షించి, నాజన్మం సువాసనా లహరిలో ముంచి, నాకు ఉపాస్య అయ్యే బాలికను ప్రేమించడానికి మరి నేను ప్రేమింపబడటానికి ఇన్నాళ్ళు ఎదురుచూస్తున్నాను. నీకున్న ఆశయం చాలా తక్కువది. నీకు చిఱుతపులిలా అందంగా ఉండి డాబుడీబుగావుంటే చాలు, నీమనస్సు ఆకర్షింపబడుతుంది రా రాజీ! నా హృదయం అల్లా సరిపోదు. నాకు కళాపూరితమైన హృదయం కావాలి. కళాపూరితమైన రూపం కావాలి. రెండూ ఎక్కడ సమకూడతాయి! ఒరే రాజీ! నాకట్టి బాలిక సాక్షాత్కరిస్తే నా కామెతో దేహసంబంధమే కావాలని కోరను. నన్ను ‘మగతనం లేనివాడవు’ అను, ఇబ్బంది లేదు. ‘బడాయి’ అను, భయంలేదు. లేదూ ‘దొంగసన్యాసివి, లోకాన్ని మాయ చేస్తున్నావు’ అను, పరవాలేదు. నేను దేహసంబంధం అయిన సంతోషమునూ, పరవశత్వాన్నీ కోరని పవిత్రుడనని చెప్పను. అలా చెపితే దొంగనవుతాను. దేహంమాత్రం అందంగావున్న ఇద్దరు బాలికలతో ఆవేశ పూరితుడనై సంతోషం అనుభవించా. మళ్ళీ వాళ్ళను కోరలేదు. నారాయుడంటి మహానుభావుడు తప్ప ఇంకోడు ‘నేను పరస్త్రీని ఎరుగను’ లేకపోతే ‘కోరను’ అని చెప్పలేడు. చెపితే వట్టి ఝూటామాట అనుకో.’

‘అల్లాంటి సందర్భంలో, రాజీ! ‘రెండురోజుల క్రితం శ్యామసుందరీ చెల్లెలు రోహిణిని చూశానురా! ఆమె నాకన్ని విధాల తగిన పరమపవిత్రురాలు. అందానికి అందమూవుంది. నా ఆశయాలకీ తగింది. నేను కలలోమాత్రం యుగయుగాలుగా చూస్తున్న నా స్వప్నదేవీమూర్తిరా, ఆమె’ అని యిట్లు పాడినాడు పరమేశ్వరమూర్తి.

( పాట: కలబాల )

‘ఓ చెలీ నీ వెవరు ఓ చెలీ నీ వెవరు?
కలబాలవా? ప్రకృతి వలపులపాపవా?
నింగిపై మేఘాల నీలియంచులమీద
చుక్కల్లో మినుకాడు సూక్ష్మకాంతుల్లోన
నాట్యమాడుచు దివ్యమందాకినీదీప్తి
లీనమై యానందలీలలో సుడివోదు

ఓ చెలీ నీ వెవరు
ఓ చెలీ నీ వెవరు
కలబాలవా ప్రకృతి
వలపుల పాపవా?’

‘శ్యామసుందరి యెవరురా? ఆ మంగళూరు అమ్మాయి, మెడికల్ కాలేజీలో చదివేపిల్లేనా? ఆ! నేను ఎరక్కేం! వాళ్ళప్పచెల్లెళ్లంతా మాంచి అందమయినవాళ్ళు. అబ్బో! వాళ్ళల్లో, పెద్దాళ్ళు ముగ్గురిలో ఎవరైనా నాకు దక్కుతారేమో అని మహాప్రయత్నం చేశాను. శ్యామసుందరి గుట్టూ మట్టూ అన్నీ, రహస్యభటుల ద్వారా కనుక్కున్నా! ఏమి లాభంలేదాయె. శ్యామసుందరి చాలా విచిత్రమైన పిల్లరా. ఖద్దరు కట్తుంది. ఆ అమ్మాయి 1922 లో నిరాకరణంచేసి, మళ్ళీ కాలేజీలో చేరింది. మంచి పవిత్రమైన జీవితం. నాకు మొదట అంతామాయ అని అనిపించిందికాని, రహస్యంగా అంతా కనుక్కునేటప్పటికి నిజం తెలిసిపోయింది. నేను మీతో అక్కడికి వచ్చేందుకు వీలులేదు. నేనంటే శ్యామసుందరికి భయం!’

నిద్దురబోవుచున్న నారాయణు డేట్లు లేచెనో ‘ఏమిటిరా ‘శ్యామసుందరి’ అని అంటున్నావు. నువ్వు ఎరుగుదువా ఏమిటీ?’ అని ప్రశ్నించెను.

రాజే: అదేమిటిరో ! ఆడవాళ్ళ పేరు చెప్పితే శుకమహర్షి కంగారు పడ్డట్టయింది నువ్వు లేవటం. ‘శ్యామసుందరి’ అన్న పేరులో ఏముందిరా దద్దరిల్లి లేచావు!

నారా: ఒరే రాజీ! నోరుముయ్యి. వాగకు. శ్యామసుందరీదేవి చాలా పవిత్రచరిత్ర యని నే ననుకున్నాను. అది నిజమని నా నిద్దట్లో నాకు కలలో వినిపించినట్లయింది. మెలకువ వచ్చేప్పటికి నువ్వూ ఆముక్కలే అంటున్నావు. ఏమిటదీ...అంట?

పర: చాలా పవిత్రురాలు, మాంచి హృదయంకలదీ అని వాడు చెప్తాడురా. వాడు డిటెక్టివులను పెట్టికూడా నిర్ధారణ చేసుకున్నాట్ట.

నారా: ఎల్లాగన్నా భారతీయ నారీమణులు పవిత్రచరిత్రలురా. పర: సరే ఒప్పుకున్నామురా.

రాజే: ఇంతకూ నువ్వులేచి, పరమేశ్వరుడు చెప్పే అద్భుతమైన కథకు అడ్డువచ్చావు. వాడి ఆశయమైన కలబాల కనబడిందటగా? రూపంతో, శరీరంతో అవతారం ఎత్తివచ్చిందట!

నారా: రోహిణీదేవేనా? నిజంగా ఆ బాలికలంతా అద్భుతమైనవాళ్లే. ఒరే రాజీ! నువ్వు పోనీ పై ఆదివారం పట్నానికివస్తే మనమంతా వాళ్ళింటికి వెళ్ళవచ్చును.

రాజే: ఓహో! నన్నామె పూర్తిగా ఎరుగును. నేనంటే హడలు. ఆ కథంతా తర్వాత చెప్తా.

పరం: ఏమి లేదురా నారాయుడూ! వాళ్లు మామూలు ‘చిలుక’ లని అనుకొని టోపీ వేయాలని చూశాట్ట. కాని బెడిసికొట్టిందట. వాళ్ళు వీడంటే హడలిపోయారుట.

నారా: (నవ్వుచు) ఆరి పరమదౌర్బాగ్యదామోదరా!

పర: నా పేరెత్తకు.

రాజే: (నారాయణరావుతో) నీ పేరూ ఎత్తుకోకు. అంటే నన్నను అంతే!

నారా: నారాయణుడు వట్టి దామోదరుడు కాదురా! జాగ్రత్త!

అందరు నవ్వుకొని పడకలు వేసినారు.

౧౮ ( 18 )

ద స రా

దసరా పండుగలకు నారాయణరావు, జానకమ్మగారు, సుబ్బారాయుడుగారు, సూర్యకాంతము, రాజమహేంద్రవరములో గాపురము చేయుచున్న రమణమ్మ లక్ష్మీపతి గారలు, వెంకాయమ్మయు బిల్లలు, సత్యవతియు బిల్లలు, శ్రీరామమూర్తిగారు ఆయన కుటుంబము, అందరును జమీందారు గారింటికి రాజమండ్రి వచ్చిరి.

జమీందారుగారు స్వయముగా వెళ్ళి వీరినందరిని దీసికొనివచ్చినారు. ‘నేను రాను. మీ వియ్యపురాలుగారిని తీసుకొని వెళ్ళు’డని సుబ్బారాయుడుగా రెంత నిరాకరించినను జమీందారు భల్లూకమువలె విడిచినారుకారు.

జమీందారుగారు సుబ్బారాయుడుగారి పెద్దయల్లుళ్ళ నిరువురను దీసికొని వచ్చుటకు జాల బ్రయత్నించిరిగాని వారు రామని స్పష్టముగా జెప్పివైచిరి.

జమీందారుయొక్కయు, సుబ్బారాయుడుగారి యితర స్నేహితుల యొక్కయు ప్రాపకముచే లక్ష్మీపతికి గవర్నమెంటు ఆర్ట్సు కళాశాలలో నాచార్యపదవి దొరికినది. అప్పటినుండియు రమణమ్మతో, బిడ్డతో, దనతల్లితో లక్ష్మీపతి రాజమహేంద్రవరమున గాపురము ప్రారంభించినాడు. జమీందారుగారి పెద్దమ్మాయి శకుంతలాదేవి వచ్చినది. పెద్దయల్లు డా పండుగ రెండు రోజులు వచ్చునట. జగన్మోహనరావునకు భర్తను పోరి యాహ్వాన మంపించినది వరదకామేశ్వరమ్మ, తానును తప్పక రావలసినదని వ్రాయుచు, కొమార్తె శారదచేగూడ వ్రాయించినది. చెన్నపట్టణమునుండి యానందరావుగారి భార్య వచ్చెను.

నారాయణరావునకు సెలవులు ముందుగనే యిచ్చుటచే, నాతడు కొత్తపేట వెళ్ళి, యచ్చటనుండి, రేపు మహర్నవమి యన దన చుట్టములతో గలసి వచ్చినా డత్తవారింటికి.

జమీందారుగారి పెద్దయల్లుడగు డిప్యూటీకలెక్టరు గారున్ను, చెన్నపట్టణము నుండి ఆనందరావుగారును పండుగనాటికి విచ్చేసినారు.

నారాయణరావు చెన్నపట్టణములో నున్నంతకాల మొక్కసారియైన నానందరావుగా రా బాలుని దనయింటికి బిలిచినపాపాన బోలేదు. జమీందారుగారు శాసనసభా వ్యవహారములపై నచ్చటికి వచ్చినప్పు డానందరావుగారు తన కారుమీద జమీందారుగారి భవనమునకు వచ్చి కలుసుకొని, యాయనను దన యింటికి బిలుచుకొనిపోయినాడు. నారాయణరావుతో మాట్లాడనైన మాట్లాడలేదు.

జమీందారుగారి యింటిలో నారాయణరావుతో మాట్లాడునది యొక్క జమీందారుగారి యప్పగారు సుందరవర్థనమ్మ గారును, జమీందారుగారి బీద చుట్టములలో రంగమ్మగా రొకరును నారాయణరావన ఆపేక్షగానుండి గౌరవము చేయుచుండిరి. సేవకు లందరు నారాయణరావన భయముతో బ్రేమతో మెలగుచుండిరి. పరిచారికలతో జమీందారిణి అల్లునిగూర్చి నిరసనగా మాట్లాడునపు డెల్ల వారామె యెదుట మౌనము దాల్చుచుండిరి.

ఆ భవనమంతటిలో జమీందారుగారి తర్వాత నారాయణరావన్న ప్రేమ కురిపించునది కుమారరాజా కేశవచంద్రరావే. కేశవచంద్రుడు బావగారిని వదలడు. బావగారికడ భోజనమునకు గూర్చుండవలె. బావగారితో మాట్లాడవలె. బావమరిది నిద్రకు దనగదికి బోవునంతవఱకు కేశవచంద్రు డాతని కడనేయుండి, కబుర్లుచెప్పి యప్పుడు వెళ్ళి నిద్రపోవును. తనకడకుదక్క నితరులకడకు జనువుగా బోని కుమారుడు నారాయణరావునెడ సౌహార్ద్రముతో మెలంగుట జమిందారునకు నాశ్చర్య సం----------ను.

జమీందారుగారు నారాయణరావున కొక గదియు, పెద్దయల్లుని కొక గదియు, సుబ్బారాయుడుగారి కొక గదియు, స్త్రీజనమున కొక గదియు, మేనల్లు డానందరావుగారి కొక గదియు, నీరీతి వచ్చిన చుట్టము లందరి గదు లేర్పాటుచేసెను, గదులన్నియు బాగుగా నలంకరింపబడినవి. పడక గదులు మేడపైనను, క్రిందను దక్షిణవైపున నున్నవి. మేడపైన తూర్పునగూడ కొన్నిగదు లున్నవి. వెనుకభాగములకు ముందుభాగములకు సంబంధము ముఖ్యమగు హుజూరు కచ్చేరీ జమీందారుగారు నివసించు భవనమునకుముందు నేబదిగజముల దూరములో నున్నది. హుజూరుకచ్చేరీ యొక మేడ. అచ్చట పురాతనములగు కాగితములగది, మేనేజరు దివానుగారి కచ్చేరి, హుజూరుఠాణేదారుగారి కచ్చేరి, గుమాస్తాల చావడి, ఖజానాకొట్టు, సిరస్తాదారుకచ్చేరి మొదలగునవి యున్నవి.

జమీహుజూరు కచ్చేరీకి సింహద్వార మిన్నీసుపేటలో నొక వీథి వైపున నున్నది. రాజాగారి మేడకు సింహద్వారము వేరొకవీథి నున్నది.

జమీందారుగారింట ఆశ్వయుజ శుక్ల పాడ్యమీ దినమున కలశ ప్రతిష్ఠాపన మొనర్చి దశరాత్రములు పూజలు, హరికథలు, సంగీతపుకచ్చేరీలు జరుపుదురు. జమీందారుగారు వీరేశలింగంపంతులు శిష్యుడగుటచే పూజాపురశ్చరణలపట్ల నుపేక్ష వహించియుందురు.

శ్రీరాజావిశ్వేశ్వరరావు (డిప్యూటీకలెక్టరు) గారు తోడల్లుని జూచుట తోడనే కొంచెము తల పైకెత్తి క్రిందిచూపు చూచి మామగారికి దనకన్న తోడల్లునిపై నెక్కుడు ప్రేమయున్నదని గ్రహించినాడు. అతని హృదయమున నుడుకుబోతుతనము ప్రవేశించినది. ఎంత ధనమున్నను, ఈ సామాన్య సంసారిబిడ్డపై మామగారి కేల యీ గౌరవమో తెలియదు.

ఆరోజున నారాయణరావుతో మామగారు వివిధవిషయములగూర్చి చర్చించుట జూచినాడు. నారాయణరావు చాల తెలివైనవాడనియు, నింత వరకు ప్రతిపరీక్షయు విశ్వవిద్యాలయమునకు మొదటివాడుగా నుత్తీర్ణుడైనా డనియు బెద్దయల్లునికి దెలియజేసినాడు జమీందారు.

తోడల్లుళ్ళిద్దరకు సంభాషణ జరిగింది. ‘ఏమండీ ఖైదుకు వెళ్ళివచ్చారే, మళ్ళీ కాలేజీలో ఎందుకు చేరారూ?’ అని విశ్వేశ్వరరావు ప్రశ్నించెను.

‘నేను చేసింది పొరపాటేనండి అన్నగారు. నేను మాతండ్రీ, ఇతర చుట్టాలూ ఎంతచెప్పినా వినక, యింటరులో నెగ్గిన సంవత్సరము వేసవి కాలంలో సహాయనిరాకరణంలో జేరాను. ఖైదుకు వెళ్ళాననుకోండి.’

‘రాజమండ్రి జైల్లోనే ఉన్నారా?’

‘రెండునెలలు రాజమండ్రీ, నాలుగునెలలు కడలూరు.’

‘అలాగా!’

‘అవునండి. జైలునుంచి వచ్చాను. జైలుకుముందు ఆరు నెల్లు దేశంఅంతా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వడం, ఖద్దరమ్మడం మొదలైన ప్రచారం చేశా. ఆ తర్వాత జైలు. మొదట దిగేటప్పుడు పాశ్చాత్యవిద్య మానేసి ఏ సంస్కృతమైనా నేర్చుకుందా మనుకున్నాను, లేకపోతే ఏ గుజరాతీ విద్యాపీఠంలోనో చేరదామనుకున్నాను. చిన్నతనము గనుక గుండెధైర్య మెక్కువ. దేశానికి పరీక్షలు నెగ్గి సేవచేయడం ఎక్కువవీలు అనే దురభిప్రాయం వదుల్చుకోలేక మళ్ళీ చెన్నపట్నంపోయి ప్రెసిడెన్సీ కాలేజీలో బి. ఏ. ఆనర్సులో చేరాను. 1928 వ ఏప్రిల్‌లో ఆనర్సు ఫిజిక్సులో నెగ్గేటప్పటికి ఇంతలో స్వరాజ్యపార్టీ ప్రాబల్యం ఎక్కువయింది. అందుచే విసుకెత్తి లా కాలేజీలో చేరాను.’

‘కోర్టులు పూర్తిగా విసర్జించాలి అని కదా మీ అసహాయవాదులు బోధించేది. మీరు లా కాలేజీలో చేరా రేమిటి అని ఆశ్చర్యంగావుంది!’

‘ఎవరికన్నా ఆశ్చర్యంగానే ఉంటుంది. నేను న్యాయస్థానాల్లో న్యాయవాదిగా ఉంటానని చెప్పలేను. ఒకవేళ న్యాయవాదినైనా యెంతకాలమో! నా మనస్సు ఇంకా నిర్ధారణ చేసుకోలేదు. మొత్తంమీద నా హృదయానికి పూర్తిగా వ్యతిరేకమయిన కార్యం చేస్తున్నాననిమాత్రం నే నెరుగుదును.’

‘నా మాట విని మీరు నిరాకరణం గిరాకరణం అన్నీ మాని, హైకోర్టు న్యాయవాదిగా చేరి ఏ మునసబీకన్నా ప్రయత్నం చేస్తే నిముషంలో అవుతుంది. అయితే జైల్లో ఎల్లా ఉండేదేమిటండీ?’

‘మొదట వెళ్ళినప్పుడు కొంచెం నాకు భయం వేసింది, ఒక పది నిముషాలు, అన్నీ వదలి వచ్చినందుకు. తర్వాత అలవాటు అయింది.’

‘ఏంపని చేయించారు?’

‘నాబోటివాళ్ళకు నూనెగానుగ, మోట, పిండివిసరటం వేశారు. నేత, తాళ్ళు పేనడం, చాపలు అల్లడం, గొంగళీల నేత మొదలైనవి ఉన్నాయి. తివాసీనేత ఉన్నది. రాజమండ్రి జైల్లో అప్పుడే మోపలాలు వచ్చారు. వాళ్ళనందరిని ఒక డేరాలో కాళ్ళకి కడియాలువేసి, ఒక యినుపమోకు వాటిల్లో నుంచి దూర్చి, కట్టివేసి పశువులకన్న కనాకష్టంగా చూసేవారు.’

‘భోజనం?’

‘మాకు వేరేభోజనం ఏర్పాటు చేయించారు సాంబమూర్తిగారు. సీతారామశాస్త్రిగారు, విల్సనుగారి పదునాలుగు షరతులులాగ, జైలు ముఖ్యాధికారిని పదునాలుగు షరతులు కోరారు. దీపాలు, వ్రాతకు గ్రంథాలు, పాయిఖానా, మూత్రపుదొడ్డులు విడివిడిగా మనుష్యులకు కనబడకుండగా కట్టించడము, భోజనములో పప్పు, కూర, పులుసు విడిగా ఉండడము, నేయి, మజ్జిగలు ఇవ్వడము, తద్దినాలు పెట్టుకోనివ్వడము, నెలకు రెండుత్తరాలు, నెలకో బంధుమిత్ర సందర్శనము, కాళ్ళకు కడియాలు తీసివేయడము, భోజనము హెచ్చించడము మొదలైనవి.’

‘వాళ్ళిచ్చారా?’

‘ఎక్కడిస్తారు! రాజమండ్రిలో రాతకు కలాలు, కాగితాలు ఇచ్చారు. సబ్బులు, కంచాలు, నేయి, మజ్జిగ యిచ్చారు. ఎవరిదీపము వారిని తెచ్చుకో నిచ్చారు. అవన్నీ కడలూరులో తీసివేశారు. మళ్ళీ అక్కడ దెబ్బలాట; మళ్ళీ కొన్ని యిచ్చారు. ఇంతట్లో ఆరునెలలూ అయ్యాయి, నేనూ బయటకువచ్చాను.’

‘ఎల్లాగన్నా చాలా కష్టం అండీ, మీ రెల్లా ఉన్నారో! నాకు ఈ సహాయనిరాకరణం వృథా అని దృఢమైన నమ్మకం ఉంది. మీరు ప్రభుత్వము వాళ్ళిచ్చినవి పరిపాలిస్తూ ఎక్కువ కావలెనని గడబిడ చేస్తూవుంటే, నెమ్మది నెమ్మదిగా అవే వస్తాయి. స్వరాజ్యమూ వస్తుంది.’

‘అభిప్రాయాలు వేరులెండి. వానినిగురించి తేల్చుకోవాలంటే తెమలదు.’

‘వీరి సంభాషణ అంతా జమీందారుగారు నిశ్శబ్దముగానుండి వినుచుండిరి. జైలునుగూర్చి నారాయణరావు చెప్పుచున్నప్పు డాయన కళ్లు చెమర్చినవి. ఆ పరిసరములనే కూర్చుండి వినుచున్న సుబ్బారాయుడుగారు డగ్గుత్తికలు మింగినారు. విశ్వేశ్వరరావుగారికిని తోడల్లుని యసహాయశూరత ఆశ్చర్యము గొలిపి, వానిపై కొంత గౌరవము నావిర్భవింపచేసినది.

విశ్వేశ్వరరావుగారికి అసహాయవాదులు కాలము వృథాజేయు పిచ్చివారని యనిపించినది.

నారాయణరావు వీరుడని జమీందారుగారనుకొన్నారు. తానిట్టిపుత్రుని కన్నందుకు జన్మము సఫలమైనదని సుబ్బారాయుడుగారు హృదయమున రహస్యముగా నుప్పొంగిపోయినారు.

తన్ను హేళనజేయుటకు సంగతులు తెలిసికొనుటకుగూడ తోడల్లు డట్లడిగినాడని నారాయణరావు గ్రహించుకొన్నాడు. నారాయణరావు నిష్కల్మష హృదయముతో సత్యమునే సతతము వాక్రుచ్చు స్వభావము కలవాడు. నిజము చెప్పు మానవుడు ప్రపంచమున మానవులలోకెల్ల బలవంతుడని యాతడు వాదించును.

అతనికి మామగారి హృదయము గోచరించినది. తండ్రిగారి హృదయము తెలియవచ్చినది. అల్పమానవునివలె తానుచేసిన యల్పకృత్యముల జెప్పుకొంటి నేమోయని నారాయణరావునకు లజ్జ జనించినది. కాని యాతడు తన హృదయమును దరచి తరచి చూచుకొన్నాడు. దోషములేదని సమాధానపడినాడు. చీకట్లు క్రమముగ నావరించినవి.

౧౯ ( 19 )

బ హు మ తి

శారద తన యత్త గారికడకే పోవునదికాదు. జానకమ్మగారు, తన వియ్యపురాలు తనతో మాట్లాడకపోవుటయు, దన తోడలు కూడ తమ గదుల లోనికి రాకుండుటయు, దన వియ్యాలవారి చుట్టములు ముభావముగా మాట్లాడుటయూ జూచినది. కాని సుందరవర్ధనమ్మగారు మాత్రము వేయికన్నుల జానకమ్మగారికి నామె కుమార్తెలకు మర్యాద కేమియు లోటు లేకుండ జరిపించుచుండెను. భర్త మోటుగా నున్నాడనియు రాక్షసియనియు జగన్మోహనుడు తన్ను గూర్చి జాలిపడుటవలన శారదకు భయ మంకురించినది. భర్త బాగా చదివిన నేమిలాభ మని జగన్మోహనరావు బావ అన్నాడు. దివ్యారోగ్యసంపన్నుడగు నారాయణుని విమల హరిద్రారుణవర్ణము, వెలవెలబోవు జగన్మోహనుని యనారోగ్యపు దెలుపు బసిమిముందర నలుపేయని యామె యనుకొన్నది. దశమినా డందరును గలసి భోజనశాలలో బట్టుబట్టలు ధరించి కూర్చుండినప్పుడు, సుబ్బారాయుడుగారు పచ్చనివాడయ్యు జమీందారుగారు, విశ్వేశ్వరరావు, సుందరరావు, జగన్మోహనరావుల ముందర నల్లనివానివలె గనబడెను. నారాయణరావు లక్ష్మీపతులు నీగ్రోలవలెనున్నారని తనతల్లి పెదవివిరుపుతో దనకు జూపించినది. భర్త బరంపురం వంగపండుచాయ పెద్ద జరీరుద్రాక్షఅంచుల తాపితాలు కట్టుకొని, విశాలవక్షముతో, విశాలఫాలముతో వట్రువలుదిరిగిన దేహసంపదతో, విజ్ఞానము, ధైర్యము, బలము, శాంతము వెదజల్లు తీక్షణములగు చూపులతో స్ఫుటములైన కనుముక్కుతీరుతో ప్రద్యుమ్నునివలె నున్నట్లు ఆమె హృదయాంత రాళము విశ్వసించినను, తల్లిమాటలచే నా విశ్వాస మడగిపోవుచున్నది.

ఆ రోజున తాంబూలములు వేయునప్పుడు శారదను బిలిచి, తండ్రి యాపూట శ్రీరామయ్యగారితో గలసి జంత్రగాత్రముల నైపుణ్యము జూపుమని కోరెను. వీరందరికి నేను సంగీతము వినిపించవలయును గాబోలు ననుకొని తండ్రితో ‘నాన్నగారూ నా కేమి యివ్వాళ పాడాలని లేదండీ’ యనెను.

తన యిరువురు కుమార్తెలను కుమారుని జమీందారుగా రత్యంతము ప్రేమించినారు. వారు కోరునది కొండమీద కోతినైనను దెచ్చినారు. ఆ మువ్వురు బిడ్డలకు దండ్రియన్న భయము, గాఢ ప్రేమయు. తండ్రికి సంతోషము గలుగజేయవలెననియే ప్రయత్నంచెదరు. తండ్రి తెల్లబోయినట్లు కనిపించగనే శారద ‘సరేలెండి నాన్నగారు తప్పకుండా పాడ్తాను’ అని తండ్రియొడిలో తలనిడి కంటనీరు పెట్టుకున్నది. తండ్రి యామె నుదురు ముద్దిడుకొన బైకెత్తి నపుడు శారద దల నెత్తనిచ్చినదికాదు. జమీందారుగారు ‘సరేలే అమ్మా’ యని కొంచె మనుమానపడి, తలయెత్తి కంటనీరు తుడిచికొన్నట్లుండుటచూచి, యేమదియని చిన్న బుచ్చుకొని ‘పోనీ అమ్మా నీకు బాగాలేకపోతేవద్దు, కచ్చేరీ వద్దు. ఇంకొకసారిలే’ యన్నారు.

శారద చెంగున యచ్చటనుండి పారిపోయినది. ఏమది? తన ముద్దుల కుమార్తె యట్లు కంటనీరు పెట్టుకున్నది?

నారాయణరావు తన చిన్నారి పొన్నారి ప్రేయసికై పండుగ బహుమతి పట్టుకొని వచ్చినాడు, బంగారపు గొలుసులో ఆణిముత్యములు, నాయకమణి యైన గోమేధికపతకము మిలమిలలాడుచున్నవి. ఆ హారము వెల పదునెనిమిది వందలరూపాయలు. ముద్దులొలికిపోవుచున్నది. ఆ హారము దనంతట తాను భార్యమెడలో నలంకరించదలచి యువ్విళ్ళూరినాడు.

రంగమ్మగారితో రహస్యముగ శారదను మేడమీదకు దీసికొని రమ్మనియు, దానొక బహుమతి యీయదలచుకొంటి ననియు జెప్పినాడు. రంగమ్మగారు శారద నేదేని వంకబెట్టి మేడమీదకు దీసికొనివచ్చినది. నారాయణరావు లేచి ‘శారదా! ఈ బహుమతి నీకోసం పట్టుకువచ్చాను. పండుగ బహుమతి’ అని సుందరమగు నొక రజితపేటిక సీలనొక్కి మూతదెరచి, లోన మొఖమల్ పరుపుపై పవళించియున్న యా హారము జూపించినాడు. శారద తెల్లబోయి యాపెట్టె నందుకొనక యటులనే నిలుచుండెను. రంగమ్మగారు ‘పుచ్చుకోతల్లీ! పుచ్చుకో అమ్మాజీ! బాగుండదు పుచ్చుకోకపోతే’ అన్నది. శారద చేయిచాచి యాపెట్టె పుచ్చుకొని విసవిస నడచి, గదిలోనికిబోయి తన పెట్టె తెరచి యందులో నా బహుమతి పెట్టె నుంచి తాళమువేసి క్రిందిగి దిగి పోయెను. నారాయణరా వామె ధరించిన యెట్లుండునో చూడవలయునని కుతూహలముపడినాడు.

తన్ను మేడమీద నొక విచిత్రము జరుగునని రంగమ్మగారు తీసికొని వచ్చుటయు, భర్త బహుమతి నొసగుటయు శారదకు దిగ్భ్రమ కలిగించినవి. ఆమె యేమియు మాటలాడలేక, రంగమ్మగారిపై గోపము తెచ్చుకొనలేక, యక్కజమున నాలోచించుకొనుచు గ్రింద తమ్ము డాడుకొనునట్టి గదిలోనికి బోయి యచ్చట గూర్చుండెను.

‘చిన్నక్కా! ఏనుగు బాగా పరుగెత్తుతుందా, గుఱ్ఱమా?’

‘ఏనుగు, తమ్ముడూ.’

‘మరి కీయిచ్చి వదిలిపెడితే రెండూ ఒకమోస్తరుగా పరుగెత్తుతున్నాయేమి?’

శారద నవ్వుకొనుచు ‘ఈ యేనుగూ ఈ గుఱ్ఱమూ అల్లాగే పరుగెత్తుతాయి తమ్ముడూ!’ అన్నది.

‘చినక్కా! చిన్నబావ నీ కెప్పుడన్నా కథలు చెప్పాడా?’

శారద మాట్లాడదు.

‘చిన్నక్కా! చిన్నబావ నిన్ను చెన్నపట్నం తీసుకువెడతాడా?’

‘ఛీ! ఊరుకోవోయి!’

‘పోనీలే చిన్నక్కా అంతకోపంవస్తే! నీ కన్న మా చిన్నబావే మంచివాడు.’

శారద కోపంతో నచ్చటనుండి విసవిస వెడలిపోవుచు జగన్మోహనుని రెండవ సభామందిరమందు చూచినది. జగన్మోహనుడు ‘శారదా! యిల్లారా! ఏమిటి? ఎక్కడదాగున్నావూ? అంతా వెతికానే!’

శారద ఇంకను కోపముతో మౌనమూని యచ్చటనొక కుర్చీ పైకూర్చున్నది. ‘ఇంత కోపంగావున్నావు, ఎవరిపై నేమిటి? నా పైని కాదుగదా? ఇదిగో! నీకో బహుమతి పట్టుకువచ్చినాను, పండగ బహుమతి. ఎంత చిన్న గడియారమో! ఇది అసలు బంగారంగాజుకు అతికించిఉంది. ఈ గడియారము చూడు. ముద్దులు గులుకుతూ లేదూ శారదా?’

శారద యదిజూచి ‘చాలా బాగుంది. మా నాన్న నాకిచ్చినగడియారం కన్న బాగుందే!’ యన్నది.

‘చేయియేదీ?’ యని జగన్మోహనరావు శారద యెడమచేయి పుచ్చుకొని యా బంగారుగాజు చేతిగడియారము నామె చేతికి బెట్టి, యాచేయి నిటు నటు త్రిప్పుచు ఆ చేయిని దన పెదవులకడకు గొనివచ్చి ముద్దిడుకొన్నాడు. శారద యొడలు ఝల్లుమన్నది. జగన్మోహనుడు శారద బుజముచుట్టు దనచేయి వేచి యామెను దనకడకు లాగుకొని యామెతల తన హృదయమునకు హత్తుకొనెను. శారద హృదయము దడదడ కొట్టుకొన్నది. అతని హస్తమునుండి నెమ్మదిగ తప్పించుకొని యాబాలిక ‘నువ్విచ్చిన గడియారము అమ్మకు చూపించివస్తా’ నని లోనికి వెడలిపోయినది.

ఆ సాయంకాలము పై మేడపై నొంటిగా గూర్చుండి జగన్మోహనుని కౌగలింతను గూర్చి యాలోచించుకొనుచున్నది. జగన్మోహనరావుబావ చాల మంచివాడు, అందమైన వాడును. కాని అతని కౌగిలింత తనకంత యిష్టమేల కాలేదు? తియ్యని జలదరింత పొందినమాటమాత్రము నిజము. ఇరువురి బహుమతులలో నెవరి బహుమతి బాగున్నది? వారిచ్చిన బహుమతియు చాల యందముగా నున్నదనుట కామె హృదయ మొప్పుకొనక తప్పినదికాదు.

జగన్మోహనుడు చాల అందగాడని యామెకు బాఠము నేర్పబడినది. కాని చదివిన ప్రతి నవలలో బలమైనవాడు, ఉత్కృష్ట గుణసంపన్నుడు, మేధావి, నిజమైన సౌందర్యవంతుడని వర్ణించినారు. చక్కని రవివర్మబొమ్మలు కాని, మోడరన్ రివ్యూలోని బొమ్మలుకాని అన్నియు తనభర్తను తలపింప జేయుచున్నవి. ఇరువురిలో నెవరెక్కువ యందమగువారో యామెకు నిర్ధారణ కాలేదు. అయినను వారికన్న జగన్మోహనుడే సుందరుడు కాకుండు టెట్లని యామె యనుకొన్నది.

జగన్మోహనుని బెండ్లి చేసికొనియున్నచో, దానొక జమీకి రాణియై యుండును. ఇప్పుడు పల్లెటూరిలో నుండవలసివచ్చినది. భర్త ఉద్యోగము చేసినమాత్ర మేమిలాభము? బావ యెప్పుడు చక్కని కబుర్లు చెప్పుచుండును. ఎంతయో ప్రేమజూపియుండును. ఏమో? జగన్మోహనరావు బావకు తన్ను పెండ్లి చేసికొనుట అంత యిష్టములేదేమో అని భావించుకొన్నది. ఏది ఎట్లయిన నీయత్త వారు తన కర్మముచే దనకు సంభవించినారని యక్కగారును తల్లియు నెన్ని సారులో యనుకొన్నారు. అది నిశ్చయమని యా బాలకు స్పష్టమై తోచినది.

౨౦ ( 20 )

తా త ము చ్చ టు లు

పండుగనాడు భోజనములైనవెనుక జమీందారుగారు స్వయముగా వియ్యంకునకు క్షీరాబ్దితాపితా బహుమతినినిచ్చెను. బాలకుడగు కేశవచంద్రునిచే నల్లుళ్ళకు, మేనల్లుళ్ళకు, లక్ష్మీపతికి, శ్రీరామమూర్తికి బహుమతుల నిప్పించెను. ఆడవారికి జమీందారిణియు, నాయమ కొమరితలు నిచ్చిరి. అందరును క్రొత్త వస్త్రముల ధరించిరి.

పండుగ మరునాడు సుబ్బారాయుడుగారు కుటుంబముతో కొత్తపేట వచ్చి చేరిరి. సుబ్బారాయుడుగారి ముత్తాతగారి పెద్దకుమారుని కుమారుడు రాధాకృష్ణయ్యగారు దొడ్డంపేటనుంచి విచ్చేసిరి. డెబ్బదియెనిమిదేండ్లవృద్ధు. బండియెక్కడు. ఎంతదూరమైన నడవగల శుద్ధసత్వుడు. ధవళమై నెరసిన మీసములతో, జుట్టుతో భీష్మునివలె నాజానుబాహుడగు మానిసి. సుబ్బారాయుడు గారికన్న నెక్కువ సత్వముగలవాడు.

‘ఒరే సుబ్బారాయుడూ! పిల్లలు మేకలు కులాసాగా ఉన్నారురా! చూసివద్దాము, మళ్ళీ చూడ్డంపడుతుందో లేదో అని వచ్చాను. చిక్కావేమిటి? ఏమిటో ఈ రోజుల్లో నీఅంత చిన్నతనంలోనే ముసలితనాలురా. ఏరీ నీ కొడుకులూ! వీడు పెద్దాడా? చిన్నాడా వాడు? నలుగురేగా కూతుళ్ళు నీకు? అది పెద్దగా? నీపిల్లలేరీ, శ్రీరామమూర్తీ? ఆ గొట్టికాయవెధవ నీకొడుకే! పరవా లేదురా నీ సంతానమూ, సంతానం సంతానమున్నూ. ఏదీ నా కోడలు. రాజమండ్రి పెళ్ళికి వద్దామనుకుంటే విజయనగరం వెళ్ళాలిసొచ్చింది. నడిచి వెళ్లవలసిందే. కాని ఈ పట్టు రైలులో వెళ్ళాలి తప్పదని మా చలమయ్య చంపాడురా. వెధవ రైలు. దానికన్న నేనే ముందు వెళుదును. కాని అదీ ఒక విచిత్రంగానే ఉంది. రైలెక్కడం అదే మొదలు. ఆస్తి ఏమాత్రం సంపాదించావు?’

‘ఉంది, బాబూ! నీ వెరగనిదేవుంది!’

‘నీపని బాగుంది అన్నారులే. జమీందారుతో సంబంధం చేశావుట. సంతోషం. నీ రెండోకోడల్ని చూడాలి. రాజమండ్రి వెడుతున్నా. నే నక్కడికి వస్తానని నీ వియ్యంకుడికి రాయి. వెళ్ళి చూసి మోటారెక్కి ద్రాక్షారం వెళుతా.’

‘నువ్వు ఒక వారం, పదిహేనురోజు లిక్కడుండాలి బాబూ!’

‘వీల్లేదు రా!’

‘అలా అంటే పనికిరాదు.’ ‘సరేలే!’

తటవర్తి వారి కుటుంబాలు పెద్దవే. అచ్చటచ్చట దేశమల్లా ఉన్నవి. బాగా ఆస్తులు సంపాదించుకొన్నారు. రాధాకృష్ణయ్యగారికి మంచి ఆస్తి ఉన్నది. కాని యాయన తదనంతరము కుమారులు నలువురు పంచుకొన్నచో, తలకొక యిరవై యకరాలు వచ్చును. పైగా పెళ్ళిళ్ళకు, భూములు కొనుటకు అప్పులు చేసినారు. అవి పెరుగుచున్నవి.’

‘బాబూ! మీ అప్పులన్నీ తీర్చారా?’

‘ఏమి తీర్చడమోరా, మనవాళ్ళ బతుకులు మారువాడీల చేతుల్లో అంతరిస్తా యనుకుంటాను. రామచంద్రపురంవాళ్ళకు ఏడువేలు తణకాలమీద ఇవ్వాలి. ఎవ్వణ్ణి చూసినా అప్పులే. దేశం అంతా అప్పు నానాటికీ పెరిగిపోతోంది. ఎలాగో తీర్చుకోడం. నాలుగురాళ్ళు మిగుల్చుకున్న వాడెవ్వడూ కనబట్టంలేదు.’

‘అవును. దేశంలో పండిన పంటంతా ఏమవుతోందో, మనవాళ్ళు_ ఇదంతా రూపాయికీ కాసుకూ ప్రభుత్వంవారు ఏర్పాటు చేసిన మారకం రేటు వల్లనే అంటారు. అట్లాకాకుండా మారకంరేటు తగ్గించి, వెండి ఖరీదుచేసి, మేలిమి వెండి పట్టుకువెళ్ళినవారికి, చేయుబడి ఖరీదు తీసుకొని, గట్టికి ఇతర లోహం కలిపిన ఖరీదు తీసివేసి, రూపాయ చేస్తే దేశం దౌర్భాగ్యం తగ్గుతుంది అంటారు. జపానులో అల్లా చేస్తారు. కనుకనే వాళ్ళ దేశంలో వస్తువులు వెఱ్ఱిచవుక. అప్పు లేదు, బీదతనం లేదు అని మా నారాయుడు చెప్పాడు.’

‘ఏమి లెక్కలో! మా చిన్నతనంలో మేము జొన్నన్నం తిన్నాం, వరీ తిన్నాం; వస్తువులు వెఱ్ఱిచవుక. మనవాళ్ళందరికీ, మెరకాపల్లం అంతా కలిసి రెండువందల యకరం ఉంటే, స్వంతంగా వ్యవసాయం. కాయగూరలు పండేవిరా! మా నాయన జొన్నమోపు పొలాన్నుంచి మోసుకువచ్చేవాడు. మళ్ళీ దేశపాండేలంకూడా. లోకం అంతా గజగజలాడేది. కుంఫినీరాజ్యం రాని క్రితంసంగతి యెరుగుదునని మా తాతయ్య రామయ్యగారు నాకు చెప్పేవారు, మీ నాన్నా యెరుగును. మీ తాత ఈ ఊరు దౌహిత్రం వచ్చాడు. ఇల్లరికం కూడాను. ఆ రోజుల్లో మా తాతయ్య తండ్రి పల్లకీమీద వెడుతోంటే వీధుల్లో జనం కూచునిఉండేందుకువల్లా! మీ తాతయ్య తాత మా తాతయ్య తండ్రి. తెలుసునా? ఆయన నవాబుదగ్గిరకు పల్లకీమీదేరా వెళ్ళడం సుబ్బారాయుడూ!’

నారా: ఏం తాతయ్యా, మీ తాతయ్యా వాళ్ళూ బాగా వడ్డూపొడుగూ మనుష్యులేనా!

రాధా: ఒరే నారాయుడూ! నన్ను చూశావా, నా పొడుగుముందర మా తాతయ్య గోపురం అనుకోవాలి. వాళ్ళ శక్తి, సామర్థ్యం మాదగ్గిర ఎక్కడుందిరా?

నారా: మీదగ్గరున్నది మాదగ్గిర లేదు తాతయ్యా! రాధా: మీరా, మీరు వాలఖ్యిలులే! మా నాయన గారు కరణీకం ఊళ్ళు పధ్నాలుగూ తిరిగి మిట్టమధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పటికి మా బామ్మా వాళ్ళు వడ్లుదంచి, బియ్యంచేసి అన్నంవండి, అటక మీంచి గుమ్మడికాయదింపి, తరిగి కూరవండేవారు. వంటా అయ్యేది, మా తాతయ్య వచ్చేవాడుట. స్నానం, సంధ్యావందనం అంతా అయ్యేటప్పటికి పన్నెండున్నర. అతిథి అభ్యాగతీ, ఇంట్లో వాళ్ళూ అంతా కలిసి యిరవైమంది భోజనాలు మగవాళ్ళు.’

నారా: నేను చెన్నపట్టణం వెళ్ళేలోపుగా దొడ్డంపేట వచ్చి మనవాళ్లందరిని చూసి వెళ్తాను తాతయ్యా!

రాధాకృష్ణయ్యగారు ఉన్న నాలుగు రోజులును సుబ్బారాయుడుగారు పినతండ్రికి తన పొలములు, దొడ్లు, పాకలు, తోటలు మొదలైనవన్నియు జూపించినారు.

తెలుగుదేశమే కాదు, భారతభూమియే యంత కంత కధోగతిలో బడిపోవుచున్నదని రాధాకృష్ణయ్యగారి మతము. మనుష్యుల కెప్పడును జబ్బులే, అలసులు, పట్టుమని పది అడుగులు నడువలేరు. నూరు సంవత్సరముల మాట యటుండనిచ్చి డెబ్బదియేండ్లు బ్రతికిన మగవాడేడీ!

‘ఒరే సుబ్బారాయుడూ, మనదేశం చేసిన పూర్వకర్మలవల్ల యింకాబతికి వుంది కాని ఈ రోజుల్లో జబ్బులకూ, వాటికీ దేశం నిర్మానుష్యమై యుండ వలసిందే, ఏమంటావు?’

‘అవును బాబూ! ఎట్లాగో దారీ తెన్నూ కనబడటంలేదు. చదువులు, నాగరికత, మోటార్లు, రైళ్లు, తిండిలోబలం తగ్గడం__ఈలాంటివన్నీ కూడు తున్నాయి.’

‘అవునురా. ఈ ఆనకట్ట వచ్చి మన కొంప మాడ్చింది. డెల్టాలలో ఉన్న జనం మెరకజనంకన్న భాగ్యవంతులు అని చెప్పుకోవడమే కాని వాళ్ళంత బీదవాళ్ళింకోళ్ళు లేనేలేరు. కాలవ మాగాణి అంతా నిస్సారం అయిపోయింది కాదుట్రా?’

‘దానికి తగినట్లు మిల్లుబియ్యం కూడాను.’

‘సరిపోయె, మఱేమీ! మా యింట్లో దంపుడుబియ్యం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే యిప్పటివాళ్లు డబ్బు లేకుండా, జవసత్తువులు లేకుండా వుండడానికి సగం కారణం ఏమిటనుకున్నావు? వీళ్ళకి దైవభక్తి నశించింది, సంధ్యావందనం లేదు, దేవుడుగుళ్ళోకి వెళ్ళరు, పూజా పునస్కారాలు లేనేలేవు. ఇవన్నీ సగం దేశాన్ని తగలేస్తున్నాయి.’

నారా: తాతయ్యా, నువ్వలా అంటావు, ఎప్పుడు ఉండేవంటావు భయం భక్తి పూజా పునస్కారాలున్నూ?

రాధా: ఎప్పుడా? మా కాలంలో. నారా: అయితే మా అంత అప్రాచ్యులు పుట్టడానికి కారణం మీ కర్మా, మా కర్మా?

రాధా: మీదీ మాదీ కూడా రా.

నారా: మీదే అందాము. అలా అయితే మాతప్పు కాదుకదా? మా భక్తి రాహిత్యానికి కారణము మీరు కాబట్టి, మేము చేసేది ఏమీ లేదు. ఇక మేమే కారణము అందాము. అయితే ఎప్పుడో ఒకప్పుడు దీనికి కారణమైన దుష్కర్మ చేసివుండాలిగదా! ఆ! అప్పుడు భగవంతునిమీద భక్తి లేని వాళ్లున్నారన్న మాటేగా? అప్పుడే ఉంటే ఇప్పు డుండడంలో ఆశ్చర్యము ఏమీ లేదన్నమాట.

రాధా: ఆ! తెలివైనఘటమేరా నీ కొడుకు, సుబ్బారాయుడూ!

ఆ సాయంకాల మంతయు నారాయణరావుకు తాత గారు చెప్పిన సంగతియే జ్ఞప్తికి వచ్చినది. తానుగూడ రాముడు దేవుడు కాడని వాదించిన రోజులు జ్ఞప్తికి వచ్చినది. తాను ఇంగరుసాలు వ్రాసిన గ్రంథములు చదివి నిజమని నమ్మిన వత్సరము లెన్నియో! ఈనాటి యువకులు భక్తిరహితులైనారు. తాను దేశములు తిరిగినప్పుడు గుడులలో భక్త్యావేశము కలిగెడిది. తన స్నేహితు లనేకులు పూజ సేయించు టననేమో యెరుంగరు.

భక్తి యెందుకు? మోక్షముకొఱకా? మోక్షమననేమి? యని వాదించువాండ్రు. మోక్షము భగవంతునితో నైక్యమందుటా? మోక్షము లేనిచో నష్టమేమి? పుట్టుచు గిట్టుచునుందుము. పుట్టుచు గిట్టుచు ననంతమువరకు భగవంతునికి దూరులమై సైతానులవలె నున్న మాత్రమున భయమేమి? అని వారడుగుదు రనుకొందము. భగవంతుడన నేమిటి ? భగవంతుడొక వ్యక్తి యందురా? ఆ భగవంతు నెవరు పుట్టించిరి? కాదు నామము, రూపము, మొదలు, చివర లేని__ నేతి, నేతి నేతి యనజెల్లు నొకానొకటి యని యందురా? అదికాదన్న నేమి నష్టము? అని నారాయణరావు హోరాహోరి వాదించువాడు. నే డాసంగతు లన్నియు మనస్సునకు దట్టినవి.

ఈ బ్రహ్మాండములో ననంతవిశ్వములో నొక సౌరకుటుంబములో నొక చిన్న భూగోళములో నొక చిన్న పురుగువంటి తాను భగవంతుడనుట నిజమా? ‘శివోహం’ అని తెలిసికొనుటయే శుద్ధ మోక్షమా? నేను బ్రహ్మమునైన, సమస్తము బ్రహ్మము. కాని ఒక చక్రవర్తి నిద్రబోవుచున్నంత కాలము తాను చక్రవర్తి నను జ్ఞానములేక, తానేమియో తెలియక మైమరచియుండి మేల్కొనుట తోడనే దాను చక్రవర్తినను జ్ఞానమును బొందునట్లు, నీ బ్రహ్మము తన్ను తానెరుగునా? ఆత్మజ్ఞాన పరిపక్వముచే ఈ గ్రంథములన్నియు జదువుచున్న కొలది నేమో తెలిసినట్లుండును. ఏమి తెలిసినది? మనకు తెలిసినట్లున్న దంతయు మాయకావచ్చును. నిజము గోచరించుట యుత్తమపురుషునకే కాబోలు. ఆస్థితి, తనకీజన్మములో నున్నదో లేదో? తన కొక్క వాసనయు వీడిపోలేదే. శారద తనకుగావలె. తన బందుగులు, తన యాస్తి, తన మిత్రులు తన చదువు, తన! తన! తన!


౨౧ ( 21 )

ఆడవాళ్ళ బ్రతుకు అథోగతి బ్రతుకు

మరునాడు సుబ్బారాయుడుగారి రెండవ కొమరితకడనుండి యుత్తరము వచ్చినది. సత్యవతి యిరువదియారేళ్ళ స్త్రీరత్నము. తీర్చిన కనుముక్కుతీరు కలిగి జామపండు చాయతో సుందరియని చెప్పతగిన వనిత. కాని బెంగచే కృశించి శలాకవలె నైపోయినది. భర్త రంపపుగోత, ప్రథమసంతానమగు నొక బాలిక తప్ప తక్కిన పిల్లలందరు పోయినారు. ఇప్పుడు మరల నెలతప్పి మూడు నెలలయినది.

వీరభద్రరావు కెప్పుడు ననుమానమే. ఛాందస బ్రాహ్మణుడు, కఠిన హృదయుడు. చిన్నతనమున నెంత సంతోషజీవియో, నేడంత పరమకోపియై నిప్పులు గ్రక్కుచుండును. అతని తల్లికిగూడ కుమారుడన్న భయము. చేయు నుద్యోగము పెద్దాపురమున డిప్యూటీకలెక్టరు కచ్చేరీలో రెండవగుమాస్తా పని. యేబదిరూపాయల జీతము ఖాయము. ఎనభై తాత్కాలికపు జీతము.

రివిన్యూపనిలో మంచి తెలివితేటలుగలవాడు. ఇంటిదగ్గర నెంతపులియో, కచ్చేరిలో అంతపిల్లి. పైఅధికారులన్న గజగజలాడుచుండును. వారి మెప్పును బొంది ప్రాపకము సంపాదించుకొనుచుండును. గ్రామాధికారులపై తోడేలువలె పడును. తనదగ్గరకు బనియుండివచ్చిన వారు పెద్దవారైనచో నిమిషమున వారిపని చేసి పంపును. చిన్నవారైన కస్సుమనును, బుస్సుమనును. అట్టిచో నెవరైనా దిరుగబడి ‘ఏమిటయ్యా! ఇదిగో వీళ్ళందరిని సాక్ష్యం వేసి పెద్ద కలెక్టరుకు పిటిషను పెట్టి డిప్యూటీకలెక్టరుగారికి ఇప్పుడే ఆర్జీ దాఖలుచేస్తాను ఉండు’ అని యనెనా తక్షణమే వీరభద్రుడు చిరునవ్వునవ్వి ‘ఏందుకు లేకోపం’ విసిగిస్తే అన్నాను. ఇదుగో చూశావూ, అబ్బాయి! పొద్దున్నుంచీ పని చేస్తూ ఉంటా. చూశావూ! అలాంటప్పుడు కాస్త కోపమూ వస్తుంది. చూశావూ, తొందర పడకు, ఏమిటీ నీపని?’ యని మేకపిల్లయైపోవును.

మంచి ఆస్తిగల కుటుంబము, గౌరవమైన కుటుంబమని యీయ, నిట్లు కొమార్తె యగచాట్లుబడుచున్నదిగదా యని సుబ్బారాయుడుగారి మనస్సు కలత నొందుచుండును.

సత్యవతి నారాయణరావు తోబుట్టువులలో నెల్ల నందగత్తెయని యెన్న దగిన పూబోడి ఆమె. కన్నులు పరమకరుణాపూరితములై, శిశునిర్మలత్వమును గోచరింపజేయును. ఆమె లేడివలె సాధుహృదయ, సాధ్వి, పతిభక్తి పరాయణ, ఆ బాల తెలివియైనది. ఏ మానిసియైన యట్టిభార్య రావలయునని తప మొన రింపవలయునంతటి సుశీల. కఱ్ఱతో మోది కుక్కనువలె భర్త కొట్టుచుండినపుడు కిక్కురుమనదు. ‘రామ! రామ! రామ!’ యని మాత్రమనుకొనుచు, నశ్రుధారలు తుడుచుకొనుచుండును.

సత్యవతి కొమరిత బంగారుబొమ్మ. తల్లి నోటిలో నుండి యూడిపడినది. తండ్రి తల్లిని గొట్టునపుడు విరగబడి యేడ్చును. ఒకనాడు ‘నాన్నా నాన్నా! అమ్మను చంపెయ్య రక్తము వస్తూంది’ అని అడ్డంపడితే ఆమెను కూడ చావగొట్టినా డా కర్కోటకుడు.

జానకమ్మగారి పేర సత్యవతికూతురు నాగరత్నం ఉత్తరం వ్రాసినది. ‘అమ్మమ్మా, ఈరోజు అమ్మను కొట్టిన దెబ్బలకి అమ్మ మూర్ఛపోయింది. రెండుగంటలు తెలివిరాలేదు. నాన్న డాక్టరుకోసం వెళ్లగానే ఈ ఉత్తరం మీకు రాయమని మా యింట్లోనేకాపురంవున్న విజయలక్ష్మమ్మత్త యీ కార్డు యిచ్చింది. నీకు ఉత్తరం రాశాను, వాళ్ళే పోస్టులో వేశారు. ఈమధ్య నాన్నకు కోపం ఎక్కువైంది. తప్పులు క్షమించవలెను. చిత్తగించవలెను. -----మనుమరాలు, నాగరత్నం.’

ఈ యుత్తరము చూచుటతోడనే జానకమ్మగారు కళ్లనీళ్ళు క్రుక్కికొనుచు వాపోవజొచ్చెను. సుబ్బారాయుడుగారు చిన్నబోయి మనసున కుములుచున్న కోపమున, నేమి చేయవలెనో యాలోచన తేలక కూరుచున్నారు. తన చిన్నతనములో నిట్టివ్యాపారము తనచెల్లెలికి జరిగియుండినచో దానేమి చేసి యుండును? వానిని బోయి తొక్కి పాతర వేసి, తన చెల్లెలి నింటికి తీసికొని వచ్చియుండునా? అయ్యో, అది తప్పు. స్త్రీ, పతివ్రత; పతిభక్తి పరాయణ. భర్త చంపినను సరే, భరించవలయును. తాను దుర్మార్గుడైనచో తన బావమరది తన్ను హతమార్చుటకు దా నొప్పుకొనునా? ఏది ఎట్లయినను దన బాలికగతి యంతియ. వెళ్ళి తీసికొనివచ్చి తన యింటిదగ్గర నుంచుకొనిన లోకము హర్షించునా? పోనీ, లోకముకొరకు వెరువక తీసికొనివచ్చి పంపించక యూరకుండినచో? తన ముద్దులబిడ్డ బ్రతు కథోగతియేకదా. ఏది ఎట్లయినను తనకుమార్తె యనుభవించవలసినదే! అని యూహాలోకమున బడి సుబ్బారాయుడుగా రుస్సురని కూర్చుండిపోయిరి.

రాధాకృష్ణయ్యగా రది విని ‘ఏమిరా సుబ్బారాయుడు! మా పినతల్లిని ఆవిడ మొగుడు యిలాగే వేపుకుతింటుంటే రెండుసార్లు కాపురానికి వెళ్లిన రెండు సంవత్సరాలలో నూతిలో బడిందట. రెండుసార్లూ ఎవరో బతికించారటరా అబ్బాయి! ఆ తర్వాత మొగుడుమీద తిరగబడి మహాశక్తి దేవతై వెధవన్నని పిల్లిలా చేసిందట. అల్లాగే నువ్వు చేసేదేముంది? నేను చేసేదేముంది? భార్యాభర్తలకు దెబ్బలాటవస్తే వాళ్ళే సముదాయించుకోవాలి’ యనెను.

నారాయణరా వీ సంగతివిని, తండ్రిగారితో చెప్పి, పెద్దాపురం వెళ్ళినాడు. తన చిన్నక్కగారు మొన్ననే పండుగకువచ్చి, పెద్దాపురం వెళ్లినది. ఇంతలో నేమి మునిగినదో! ఆడవాళ్లను గష్టపెట్టు పరమ దౌర్భాగ్యులు, చదువుకొన్న పశువులు నున్నారు. వారికి శిక్ష యెటులో భగవంతుడు ఎరుగడు కాబోలు.

మధ్యాహ్నము రెండుగంటలకు నారాయణరావు పెద్దాపురం చేరుకున్నాడు. ఇంటిదగ్గర బావగారు లేరు. తన చిన్నక్కగారు, మేనకోడలు నాగరత్నము నున్నారు. ‘చిన్న మామయ్యా! నిన్నే వచ్చింది మెలుకువ అమ్మకు. ఆ కట్టుకట్టిందే, అమ్మకు తల పగిలిపోయింది. ఉగ్రుడైపోయి చేతిబెత్తంతో కొట్టాడు. మామయ్యా! నన్నూ కొట్టాడు మా నాన్న’ అని నాగరత్న మన్నది.

‘ఒరే తమ్ముడూ! నా కర్మానికి మీరంతా ఇదిఅవుతే ఏం లాభం! ఈ తెలివతక్కువ మొద్దు మీకు ఉత్తరం రాయడం ఎందుకు చెప్పు? అమ్మకీ, నాన్నకీ, మాకూ గుండెలు తరుక్కుపోవడం తప్ప ఏం లాభం ఉందీ?

‘ఎందుకు కొట్టాడే చిన్నక్కయ్యా?’

‘ఎందుకైతే ఏమిరా బాబూ! నేను పూర్వజన్మలో చేసుకొన్న పాపం నన్ను ఇల్లా బాధిస్తూంది. ఏదో కారణం. ఆయన మంచివారే. ఊళ్ళోవాళ్ళందరికీ మంచే. అందుకనే ఆయన కొట్టిన సంగతి ఊళ్ళోవాళ్లకి తెలియగానే నావల్లే తప్పుందనీ, నీ బావగారివల్ల తప్పేమీ లేదనీ ఈ చుట్టుప్రక్కల వాళ్లు కొందరు అనుకున్నారు. నన్ను గురించి మీ రనుకొనేది తప్పు అని వాళ్లతో నేను చెప్పగలనురా! నా కర్మం.’

‘అమ్మని పెద్దమామయ్య తీసుకువచ్చి దిగబెట్టగానే, అమ్మని ఏదో అని, నాన్న కోప్పడ్డాడు మామయ్యా! అప్పణ్ణుంచి ఏదో ఒక కోపమే?’

‘అయితే నిన్ను అంత చావగొట్టడానికి కారణం ఏమిటే?’

‘ఏవుంది, పండుగకు వెళ్ళి ప్రతిమగవాణ్ణి చూశానట. ఇంకా ఏమో ఏమో అన్నారు. జవాబుచెప్పను నాయనా! చెపితే అప్పుడే ప్రాణాలు వదులుకోవాలి.’

‘అదా! సరేలే!’

‘నా తోడు! ఒట్టు! ఒరే తమ్ముడూ! ఏమన్నా తొందరపడతావేమో సుమా! నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను!’

‘ఒసే అక్కయ్యా! నీ మొగుడు పశువు కాని మేమంతా పశువులు కాము. జన్మం ఎత్తినందుకు జ్ఞానం కలిగిన మనుష్యులుగా సంచరించాలి. ద్విపాద పశువైపోవాలా! ఛీ! వెధవజన్మలు. కుక్క నయం. పందినయం. పెళ్ళాన్ని చావగొట్టి ఆమెచస్తే, మళ్ళీ పెళ్లి చేసుకొని, కొత్తగావచ్చిన పెళ్లానికి అడుగులకు మడుగులొత్తుతారు మగ సన్యాసులు, పురుగుజన్మ లక్కయ్యా.’

‘ఒరే బాబూ నీకు కోపం వస్తూంది. నువ్వు బలంకలవాడవు. చేయి చేసుకొని నన్నథోగతిపాలు చెయ్యకు. నా కర్మం నేను అనుభవిస్తాను గాని, నువ్వు ఇంటికి వెళ్ళిపో.’ ‘ఒసే అక్కయ్యా! నువ్వు వెఱ్ఱి అభిప్రాయం ఎందుకు పడతావు! నేను బావను కొట్టలేను. కొట్టగలిగివుంటే అతనిపని బాగానే ఉండును. నాకు బలం లేక కాదు. అట్టి నీచపుపనికి నేను దిగలేను.’

ఆ సాయంకాలమునకు వీరభద్రరావు వచ్చునప్పటికి పడకకుర్చీలో గూర్చుండిన బావమరిదిని జూచి తెల్లబోయి ‘ఎప్పుడువచ్చావోయి బావా?’ యని ప్రశ్నించెను.

‘మధ్యాహ్నం.’

‘ఏం పనిమీద?’

‘చెన్నపట్నం వెళ్లబోతూ మిమ్మల్ని చూద్దాం అని వచ్చా.’

‘అలాగా! అని లోనికిబోయి ‘నాగరత్నం!’ అని కూతుర్ని పిలిచి, ఎందుకు వచ్చాడే మీ చిన్న మామయ్య?’ అని ప్రశ్నించెను.

నాగరత్నం గజగజలాడిపోయినది. ఆమె కళ్ళనీళ్ళు తిరిగినవి. నారాయణరావు గ్రహించి లోనికిబోయి బావగారితో నిట్లనెను.

‘బావా! ముసుగులో గుద్దులాట యెందుకు? నాగరత్నం వాళ్ళమ్మకి తెలియకుండా పక్కయింటివారు యిస్తే, కార్డుమీద మాయింటికి ఉత్తరం రాసింది. నేను వచ్చాను. నువ్వు చదువుకొన్నవాడివి. రేపు వియ్యమంద దలచుకున్నావు. నిన్ను గుఱించి ప్రపంచం ఏమనుకుంటున్నదో నీకు తెలియటంలేదు. బావా! మన కుటుంబాలలో ఇలాంటిది ఎక్కడన్నా ఉందటోయి!’

‘నాపద్ధతి అంతే. నన్నేమి చెయ్యమంటావు? నాకు కోపం జాస్తి, దాన్ని చంపుకుందామని ప్రయత్నంచేస్తే చావదు. నన్నేమి చెయ్యమంటావు?’

‘రాత్రి మాట్లాడుదాములే. ఇప్పుడేమి మాడ్లాడకు.’

తాను వాడుకొనుటకు కొన్న వెస్టు అండు కంపెనీ వారి ఎనుబది రూపాయల ఖరీదుగల బంగారు ‘కీపుసేక్’ అను చేతిగడియారము నారాయణరా వీయబోగా నతడు వలదని వారించినాడు. నారాయణరావు బావగారిని తీక్షణంగా జూచి ‘బావా, నువ్వంతకంతకు చాలా చిత్రంఅయిన మనిషివి అవుతున్నావోయి. మనం మగవాళ్లం. ఆడవాళ్ళు నీరసులు. ఎలా చూసినా వాళ్ళు మన చేతిలో ఉన్నారు. మనం దయదలచి, ఆడవాళ్ళని మనుష్యులుగా ఎంచాము. అయినా వాళ్ళు మన దృష్టిలో పశువులు. అంతే. వాళ్ళని చంపినా ఎవరూ ఏమనరుగదా? ఆఫ్రికా నీగ్రోలల్లే ఆడవాళ్లు వస్తువులేకదా బావా! బానిసలే ఆడవాళ్ళు? నిన్న మొన్నటిదాకా అరబ్బీ, పెరిసియా, టర్కీ దేశాలలో ఉన్నట్లు, బానిసత్వం మన దేశంలో కూడా ఉండాలనా మనం ఈరోజున ప్రయత్నం చేయవలసింది? బావా, నీ హృదయం సర్వవిధాలా మంచిది. పది మందిలో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుంటున్నావు. నీకోపం అంతా యింట్లో చూపిస్తున్నావుగాని, నీ పైఅధికారి పైన చూపించగలవా? అలాగైతే వెయ్యి రూపాయిలిస్తాను బహుమతి నీకు. నీ పైఅధికారి నిన్ను కోపపడినా రాని కోపం, నీ చేతిలో ఉండి నీకు దాసివలే వంగి ఉన్న భార్య పైన ఎందుకు వస్తుంది? అధికారి పైన వచ్చినకోపం అంతా ఏమయింది? అది మనము అణచి వేసుకుంటాము, చంపివేస్తాము. ఆ శక్తే మనం, మనకింద వాళ్లపట్ల కూడా ఎందుకు చూపకూడదు? యుగ పురుషుడు గాంధీమహాత్ముడు, క్రైస్తు, బుద్ధుడు మనకు బోధచేసింది. ప్రేమకాదా బావా? మనం కోపం చంపుకుని ప్రేమ చూపించడంవలన మనలను నమ్ముకున్న వారు జన్మజన్మకు మనయం దపరిమిత కృతజ్ఞత చూపిస్తారు. ఒకరియెడ ద్వేషంపూని వారిని హింసిస్తూ తక్కిన యావన్మంది విషయంలో ఎంత ప్రేమచూపినా, అది క్రోధస్వరూపము, అసత్యమూ అవుతుంది సుమా! క్రోధం రావడం, మనలో పశుత్వం ఇంకా చావలేదనేదానికి సూచన. నీకన్న చదువు రాని యానాదివాడు గొప్పే!

‘నేను ఉపన్యాసం ఇస్తున్నాను అని అనుకుంటావేమో? ప్రపంచంలో అందరికీ ఇలాంటి విషయాన్ని గురించే నేను ఉపన్యాసం ఇవ్వాలసివస్తుందా బావా?

‘బావా! నన్ను బాగా ఎరుగుదువుగదా? మామయ్యగారూ, అత్తయ్యగారూ ఈ విషయంలోనే నీతో కలహం పెట్టుకున్నారు. మా వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. నీమనస్సుమట్టుకు నీకు బాగుందా? నేను చిన్నవాణ్ణే! అయితే నీకూ నాకూ ఉన్న చనువునుబట్టి చెప్పాను.

‘ఆడది ఎల్లాగా దెబ్బలు పడుతుంది. ఎదిరించలేదు. అది పతివ్రతలకు ధర్మం. సహజం. కాని, వాళ్ళూ మన తోటివాళ్ళు అని ఆలోచించాలి. నేను నిన్ను వేడుకొనేదింతే.’

౨౨ ( 22 )

నాదీ భారం

బావమరిది మాటలు విన్నకొలదీ వీరభద్రరావుకు కోపము, నా వెనుక లజ్జయు, నా వెనుక విషాదము కలిగినది. అతడు మారుమాటాడలేదు. అతని కన్నుల నీరు తిరిగినది. ఇంతలో గోపమువచ్చినది. మరల నాపుకొన్నాడు. తానిచ్చిన యుపన్యాసమునకు బావగారికి గోపమువచ్చునని నారాయణరా వనుకొన్నాడు. అందుకై యేమి చెప్పవలయునా యని యాత డాలోచించుచుండెను.

లోపల సత్యవతి యేది యెట్లగునో యని లోన గజగజ వణకిపోవుచు, సత్వరముగ వంటచేసెను. బావమరదు లిరువురు కాళ్లుకడిగికొని భోజనముల ముందు గూర్చుండిరి. వీరభద్రరావునకు భోజనము సహించలేదు. నారాయణరా వది చూచి ‘బావా! నువ్వు సంతోషముగా భోజనము చెయ్యి. లేకపోతే నాకు అన్నం వంటపట్టదు’ అనెను. భోజనములైనవెనుక వీరభద్రరావు నారాయణరావును ‘మీ అక్కయ్యను మీ యింటికి తీసుకెళ్తావా?’ అని ప్రశ్నించెను.

‘అదేమిటి బావా! రెండురోజులేగా అయింది మా అక్కయ్యవచ్చి! తర్వాత యేడోనెలలో తీసుకెడ్తాము. అన్ని రివాజులు తప్పించాలి అని మా అమ్మ గారంటూనే ఉన్నారు. పురిటికి రాజమండ్రి తీసుకెళ్లాలని ఉన్నది. ఏమంటావు? నీ యిష్టం అయితే మావాళ్ళ యింటికి తీసుకువెళ్తాం. లేకపోతే ఆస్పత్రిలోవుంచి అక్కడ పురుడుపోస్తాం. లేకపోతే నేను చెన్నపట్టణం తీసుకొని వెళ్ళిపోతాను. ఆలోచించుకో, అమ్మా వాళ్లూ వస్తారు.’

వీరభద్రరావుకు దానెందుకు దన యిల్లాలిని కొట్టినాడో తెల్లమైనది. జమీందారుగారువచ్చి పిలిచినాడు. జమీందారు వీరభద్రరావుగారిని బంపుడని డిప్యూటీకలెక్టరుగారి నడిగినాడు. డిప్యూటీకలెక్టరుగారు వీరభద్రరావుగారిని దీసికొనిపోవచ్చుననియు దనకు పరమసంతోషమనియు వీరభద్రరావు ఆఫీసులో కెల్ల మంచి గుమాస్తాయనియు దానును బ్రమోషనుకు వ్రాసినాననియు జెప్పినాడు. వీరభద్రరావు వెళ్ళవలెననియున్నను కలెక్టరుగారికి ముఖ్యమగు బనులుండుటచే, మకాంగుమాస్తా వీరభద్రరావు తప్ప నింకొకరు పనికిరారని యాయనకు తోచి వీరభద్రునితో నీవువుండి ‘నీ భార్యను బిల్లను బంపు’ మని చెప్పినారు. వీరభద్రరావు చేయునదిలేక, నిట్టూర్పులతో, హృదయమున ఝంఝామారుతముతో, భార్యను గూతును జమీందారుగారితో బంపినాడు. జమీందారుగారు తన మోటారు తోలువానితో ముందు కూర్చుండి, సత్యవతిని, కొమార్తెను వెనుక గూరుచుండబెట్టి, తన కారులో రాజమహేంద్రవరమునకు తీసికొని వెళ్ళిపోయినాడు.

జమీందారు గారు పెద్దలు, పూజ్యులు అని తానెరుగును. వేఱుతలంపులు దలంచుట హైన్యమనియు నెరుంగును. పండుగ నాలుగురోజులు వీరభద్రరావనుభవించినది యమలోకము. ఎంతమంది పరపురుషులు జమీందారుగారి యింటికి వచ్చెదరో? భార్య వారిని చూచునేమో? వారు తేరిపార భార్యను జూచెదరు కాబోలు. ఇదివరకెప్పడు భార్యను బుట్టింటికి పంపినను దానుగూడ వచ్చి, తనతో దీసికొనిపోవువాడు. పండగనా డెట్లయిన దాను రాజమహేంద్రవరము పోవలయునని యెన్నియోవిధముల బ్రయత్నించినాడు. కాని డిప్యూటీకలెక్టరుగా రొప్పుకొనలేదు.

ఇంటికి తన భార్యను పెద్దబావగారు శ్రీరామమూర్తి తీసికొనివచ్చి దిగబెట్టుటతోడనే భార్యపై మండిపడినాడు.

‘నువ్వు దౌర్భాగ్యురాలివి! నువ్వు పెద్దాపురం సానిదానికన్న నీచురాలివి. ఆపళంగా పరుగెత్తుతావూ! నీ మనస్సు చెడుమనస్సు కాకపోతే నువ్వలా తయారవుతావా? నీచపుముండా! అక్కడ యెందరకు ఉత్తరాలు రాశావో...’ ఇట్లు వినగూడని, వ్రాయగూడని, యుచ్చరింపరాని కారుమాట లన్నాడు. వీథిలో కాట్లాడు నూరకుక్కయైపోయినాడు. నేడు వీరభద్రరావుకు దన నైచ్యమంతయు గనులకట్టినది. సత్యవతి తనకు చేసినసేవ, యామె ప్రేమ, యామె మెత్తని హృదయము జ్ఞప్తికి వచ్చినది. మరల ననుమానపు బిశాచము పీడించినది. భార్య యెవరో యొకనిని ప్రేమించుచున్నదని కాదు, తన్ను మాత్రము ప్రేమించుటలేదని యాతని భావము.

నారాయణరావు రెండురోజులక్కడ నుండి వీరభద్రరావుకు వేదాంతము బోధించినాడు. ఇతర దేశములలో, స్త్రీలను జూచు విధ ముగ్గడించినాడు. స్త్రీలను పూర్వమునుండియు భారతీయులు గౌరవించుచుండి రన్నాడు.

‘బావా! మనకు స్త్రీ లెంత గౌరవనీయులోయి! మన నాగరికతను, మన గౌరవాన్ని, మన నీతిని, మన జాతిని కాపాడుచున్నది ఆడవాళ్ళోయి బావా. ఖడ్గతిక్కనను జ్ఞప్తికి తెచ్చుకో. రుద్రమదేవిని, తరిగొండ వెంకమాంబను, మొల్ల మొదలగువీరవనితలను స్మరించుకో! మాంచాల భర్తకొరకై తపస్సు చేసి, భర్త బోగందాని వలలో బడితే, భర్తను కాపాడుమని దైవమును ధ్యానించి, భర్తపాదాలు స్మరించి స్మరించి ఉంటూ ఉన్నప్పుడు, బాలచంద్రుడు యుద్ధానికి అనుజ్ఞ అడగడానికి మాంచాలదగ్గరకు వస్తే, మాంచాల కత్తినిచ్చి యుద్ధానికి పంపి, భర్త వీరమరణం పొందితే తాను సహగమనం చేసింది. మల్లమ్మదేవి చరిత్ర తెలియదు బావా నీకు?’

కొన్నిగంట లాతని బొగడినాడు. ‘నీ హృదయం చాలా మంచిది బావా! నువ్వెందరకు ఉపకారం చెయ్యడం నే నెరగను! నీబోటి మనిషి మా సహాయ నిరాకరణంలో జేరితే గొప్ప నాయకుడవు అవుదువు. నీ హృదయము ఈ ఉద్యోగంలో చేరడంవల్ల యిల్లా పాడయింది. కాని యిలాంటి ఉద్యోగాలలో ఉండి తమ జీవితాలను న్యాయమార్గాన్ని నడిపే మహానుభావులున్ను ఉన్నారని యిప్పటివరకు ప్రజలు చెప్పుకోవటం లేదటోయి?’

మరునాడు నారాయణరావు బావమరదికడ సెలవు పుచ్చుకుని, అక్కగారికి దండ్రియిచ్చిన ఇరువది రూపాయలు సేత బెట్టి కొత్తపేట వెడలి పోయినాడు.

తల్లితో సంగతులన్నియు జెప్పి తాను తన బావమరది మనస్సును కొద్ది నెలలలో మార్చగలనని ధైర్యము చెప్పెను.

‘నాయనా, నువ్వలా అంటావు. ఎవరు మార్చగలరురా ఆ కర్కోటకుడి మనస్సు! అల్లాగే కుళ్ళి కుళ్ళి కృశించి, సత్యం ఏ నుయ్యో గొయ్యో చూచు కొంటుందిరా నాయనా!’

‘అదికాదు అమ్మా! నువ్వలా కుంగిపోతా వెందుకే? దాని బాధ తప్పించడం నాది భారం. అతను ఈ పట్టు నా చిన్నక్కయ్యను కష్టపెట్టాడా, నేను వెళ్ళి అతని యింటిదగ్గిర నిరశనవ్రతం చేస్తాను. దానివల్ల ఆతని మనసు పూర్తిగా కరుగుతుంది.

అ ఇ ఉ ణ్ ఋ ఌ క్

చెన్నపట్టణమునకు బ్రయాణమై, రాధాకృష్ణయ్యతాతగారు తోడరా, నత్తవారింటికి నారాయణరావు మధ్యాహ్నమునకు జేరుకొనెను. జమీందారుగారు తనయల్లుడు వచ్చుటకు ముదమంది, యల్లుని జ్ఞాతియగు తాతగారి నపరిమిత గౌరవమొనర్చి తమ సంతోషమును వెలిబుచ్చి నాలుగురోజులు తమ యింటికడ నుండవలయునని బలవంతపరచిరి. కాని రాధాకృష్ణయ్యగారు తనకు జాలకార్యము లున్నవనియు, దాను త్వరితముగ జుట్టముల నందర జూచి యింటికి బోవలయు ననియు జెప్పినారు.

నారాయణరా వారాత్రి మెయిలుమీద చెన్నపట్టణమునకు బ్రయాణమై పోవుట యాగినది. జమీందారుగారు మరియు బలవంతము పెట్టుటచే రాధాకృష్ణయ్యగారు మరుసటిదినమంతయు నచటనే యుండిరి. జమీందారుగారు వారికి వెలగల యుడుపులు భక్తితో సమర్పించినారు. వారును శారదకు నొక వెండిగంధపుగిన్నె ఆశీర్వాదముతో చేతనిడి, తమ నారాయణునకు తగిన భార్యయని సంతోషించినాడు. లక్ష్మీపతి యింటికి బోయి చూచివచ్చి, మోటారుబస్సుమీద మరునాడు రాధాకృష్ణయ్యగారు ద్రాక్షారామము వెడలి పోయిరి.

జగన్మోహనుడు రాధాకృష్ణయ్యగారు వెళ్ళినప్పటినుండియు నాయన గూర్చి శారదకడ, నావెనుక తన మేనత్తకడ హేళన ప్రారంభించెను.

‘మామయ్య గారికి మతిపోయినట్టుంది. నానారకము అడివిమనుష్యుల్ని ఆయన గౌరవము చేస్తూవుంటారు.’

‘ఎంత ముసలివాడో ఆయన బావా!’

‘నాకు చూస్తే భయమువేసింది. ఆ ముసలి మీ ఆయన తాతటగాదూ?’

‘అనుకున్నారు.’

‘మీ ఆయనా, ఆ ముసలివాడూ కలిసి నుంచుంటే పెద్దకోతీ చిన్నకోతీలా ఉన్నారు. నేను నవ్వుపట్టలేకపోయాను శారదా! హహహ.’

శారద మాట్లాడలేదు. జమీందారిణి తన మేనల్లుని జూచి,

‘నీవు పోల్చిన పోలిక సరిగా సరిపోయినదోయి!’ యన్నది.

ఆనాడు జమీందారుగారి చుట్టములలో నారాయణరావు కుటుంబమును గూర్చి చిత్ర విచిత్ర సంభాషణ బయల్వెడలినది. వేళాకోళములు, వెక్కిరింతలతో విరుగబడినారు. ఆ సాయంకాలము జగన్మోహనుడు శారదకడకు జేరి ‘శారదా! తోటలోకి షికారువెడదాము, రా!’ అని అడిగెను. ఆరోజు పున్నమ. ఆశ్వయుజ పూర్ణిమ ఆనందకల్లోలిని. నీలములు ధవళములునగు శారదాజ్యోత్స్నలు మీగడతరకలై, మధురషీరతరంగములై యుబికిపోవును.

శారద వల్లెయని తోటలోనికి బయలుదేరినది. ఆ బాలకు యౌవనము నానాటికి పూవునకు దావివలె జేరుచున్నది. ఆమెను సౌందర్యము వెన్నెలవలె నావరించియున్నది.

పూవుతోటలోని సౌరభము, దిశల నావరించియున్న పండు వెన్నెలలు శారదాసౌందర్యములో లీనమైపోయినవి.

శారదను శలభమును చూచు గౌళివలే జగన్మోహనుడు తేరిపార చూచుచు, వెనుక నడచుచు నా బాలిక నొక వేదికకడకు గొనిపోయెను. సుగంధములగు వేడినీళ్ళ స్నానమాచరించి, పాముకుబుసమువంటి గ్లాస్గోమల్లు పంచగట్టి, అట్టి లాల్చీయేతొడిగి, ‘కూటికూర’ పొడి దేహమెల్ల నలది ఘమ ఘమమనుచు, జరీపూవు బుటేదారిపనిచేసిన ముఖమల్ పాదరక్షలు ధరించి తెల్లనిదేహము వెన్నెలలో తళుకులాడ, ప్రక్కనే నడచు జగన్మోహనుని జూచుచు శారద ముగ్ధురాలై పోయినది. జగన్మోహను డామెకు నవమన్మథుని వలె కన్పట్టినాడు. ఆ బాలకుని బెండ్లి చేసికొనియుండిన నెంత చక్కగా నుండెడిదో అని ఆమె నిట్టూర్పుపుచ్చినది. చిన్నతనమునుండియు దా నాతనినే ప్రేమించినానని యామె యప్పుడనుకొన్నది. ‘ప్రేమించుట’ యను విషయ మామెకు నవలలవలన తెలియునుగదా. ప్రతిబాలికయు నెవరినేని పురుషుని ప్రేమించునుగదా . ప్రేమలేని పురుషుని బెండ్లిచేసికొనినచో నామె గతియెట్లు? తన తండ్రిగారట్టి ప్రేమకు దన్నెడసేసి వేరొకరికిచ్చి వివాహమొనరించుట తన దురదృష్టముగదా! తాను జదివిన పెక్కు నవలలలో కథానాయకులకు నాయికనిచ్చి వివాహముచేయక తల్లిదండ్రులందరు నిట్లే యితరుల కిచ్చుటకు బ్రయత్నించినారు.

‘శారదా! ఏమిటీ ఆలోచిస్తున్నావు? ఇదివరకు నీరక్తం ప్రవహించడమే పైకి కనబడుతుంది అనుకున్నాను. ఇప్పుడు నీ ఆలోచనలుకూడా కనిపిస్తున్నాయి ప్రియా!’

‘ఏమి లేదు బావా!’

‘శారదా! నీ అందం నా అందం కలిసిపోతే ఎంత బాగుండును! నేను నీభర్త నైయుంటే రోజూ నీపాదాలదగ్గర కూచుని నిన్ను ప్రేమిస్తూఉందును.’

శారద మాట్లాడలేదు కాని యామె హృదయము జగన్మోహను డన్న మాటకు సంతోషముచే బొంగిపోయినది. శారద నాతడు దగ్గరకుజేరిచి యామెచుట్టు చేయివైచి, యామె మోము పైకెత్తి తమితో ముద్దుగొనబోవుచుండ, కేశవచంద్రరావు గబగబ నచ్చటికి, బరువెత్తి వచ్చి ‘చిన్నక్కా, నాన్నగారు నీకోసం చూస్తున్నారు’ అన్నాడు.

కేశవచంద్రరావు మాట వినబడుటతోడనే శారదా జగన్మోహను లిరువురు నులికిపడినారు. జగన్మోహనుడు తన చేయి శారదచుట్టునుండి తీసివేసి, దూరమునకు జరిగినాడు. శారదయు గబుక్కునలేచి, త్వరితముగ లోనికి వెడలిపోయినది.

జగన్మోహను డచ్చటనే యొంటరియై కూర్చుండెను. అబ్బా! యీ పిశాచిబాలకుడు సమయానికి దాపరించుచున్నాడు. తాను జమీందారుబిడ్డ యయ్యు వీనికి నా వెధవపల్లెటూరి మొద్దంటే ఇంత ప్రేమ యేమిటి? ఆ తండ్రిపోలిక తగలబడింది కాబోలు. ‘నిమిషంలో జారిపోయినది. ఇంకొక చిటికలో నామెను ముద్దుగొనియుండువాడే. ఎప్పటికైనా తనదే శారద!’

శారద లోనికి బోవునప్పటికి జమీందారుగా రొక పడుకకుర్చీపై నధివసించి యేవేని వార్తాపత్రికల జదువుకొనుచు, శారద వచ్చుట జూచి, యామెను దగ్గరకు లాగికొని ‘ఎక్కడకు వెళ్ళావమ్మా’ యని ప్రశ్నించెను.

‘తోటలోనికి నాన్నగారూ.’

‘జగన్మోహనుడు నిన్ను కొట్టబోయాడు అని తమ్ముడు చెప్పాడేమిటమ్మా?’

కేశవచంద్రుడు తండ్రికడకుబోయి తండ్రిగారి చేతిమీద రెండుచేతులు వైచి తండ్రి మొగముచూచి, ‘ఆ! బావ శారదను దగ్గిరగా తీసికొని కొట్టబోయాడు. అది కిటికీలోంచి చూచాను. రంగమ్మను కనుక్కోండి నాన్నగారూ!’ జేవురించిన మోముతో పలికినాడు.

జమీందారుగారు కుమారునెత్తి యొడిలో కూర్చుండబెట్టుకొని, కౌగిలించుకొని, క్రిందికి దింపివేసెను.

‘అమ్మాయీ! జగన్మోహనరావు తోటలో నున్నాడా!’ యని యడిగెను.

‘అవును నాన్నగారూ. నేనూ బావా తోటలోకి వెళ్ళాం. అదిచూచి బాబు బావ నన్ను కొట్తున్నాడు అనుకున్నాడు కాబోలు.’

‘అదేలే! లేకపోతే ఏమిటి కాని, నువ్వు లోనికివెళ్లు తల్లీ! బాబూ నువ్వు బువ్వతిన్నావా? నిన్ను ఎవరూ పడుకోబెట్టలేదూ? తల్లీ, బాబుకు నువ్వు జగన్మోహనునితో మాట్లాడటమే ఇష్టంలేదు.’

శారద మరల వచ్చునేమో యని జగన్మోహను డచ్చటనే కూర్చుండి యుండెను. ఎంతకును నామె రాకుండుటయు, భోజనమువేళదనుక నచ్చటనే యుండెను. శారదచుట్టు చేయివేసినప్పు డాతని కన్ను లెఱ్ఱపడినవి. కాయము మోహావేశముచే వణకిపోయినది. ఆ వణకంతయు నెమ్మదించుకొనుచు శారద యందమును గూర్చి తలపోయుచు నా జమీందారు డటులనే యాలోచనాపరుడైపోయినాడు. వెనుక విజయనగరములో మనోహరియను వేశ్యతో దాను సలిపిన క్రీడలన్నియు నాతని స్మృతిపథంబునకు వచ్చినవి. ఆ పిల్ల కన్నెరికమునకు లక్షాధికారు లనేకులు ధనమిచ్చెదమన్నను, వారందరు సమర్పణ చేసెదమన్న రొఖ్కముకన్న మిన్నగా తానర్పింప నీయకొనెను. దానే కన్నెరికముచేసి, యా రాత్రి దాననుభవించిన మహదానందము స్మరించుకొనుచు, శారద తన కౌగిలి జేరినచో నంతకన్న నెక్కువ సంతోషము బొందువాడనుగదా యని, తలంచికొని యుస్సురుమనియెను.

జమీందారుగారు తన కొమార్తె శారద జగన్మోహనునితో నెక్కువ చనువు చేయరాదని యూహించుకొని శారదను జూచి ‘అమ్మా నువ్వు జగన్మోహనరావుతో నంత చనువుగా నుండకూడదు. నువ్వీమధ్య చదువుతగ్గించి నట్లున్నది. ఈ యేడు తప్పక స్కూలు ఫైనలు పరీక్షలో నెగ్గాలిసుమా. మీ గురువుగారితో ఇంకా జాగ్రత్తగా చెప్పమని చెప్తాను. సరే, లోపలికి వెళ్ళు’ అని చెప్పినారు.

శారద తెల్లపోయి నెమ్మదించుకొని ‘బాగానే చదువుకుంటున్నానండి నాన్నగారూ! తప్పకుండా పరీక్షలలో నెగ్గుతానని ధైర్యంగా వుంది’ అని జవాబు చెప్పినది. ఆమె కన్నులలో నేలనో నీరుతిరిగినది.

జగన్మోహనరావు బావ తన్ను ప్రేమించుచున్నాడని తండ్రి గ్రహించి నాడేమో యని యామె కొంచెము భయపడినది. ఆమె మాటలో చూపులో నిర్మలత్వము ప్రద్యోతమగుచున్నది. ఆమె హృదయము నిష్కలుషము. ఒక నిమేషము తనయను దీక్ష్ణముగా జూచి యామెకు దెలియకుండగనే కనులు వాల్చి కొమరితను దగ్గరకు దీసికొని, యామె శిరంబు మూర్కొని ముద్దిడుకొనెను. శారద లోనికి వెడలిపోయినది.

జగన్మోహను డంతకంతకు నథోగతిలో పడిపోవుచున్నాడనియు, విజయనగరములో కొందరు వారకాంతలతో దిగంబరుడయి యొక గణికా గృహంబున జలక్రీడలు సలిపినాడనియు, జమీందారీవలనవచ్చిన రాబడిచాలక దినదినము వేలకువేలప్పుచేయుచున్నాడనియు, యూరేషియను సాంగత్యమున వారికి ధనము దోచిపుచ్చుచున్నాడనియు జమీందారు గారికి అస్పష్టమైన వార్తలు వినవచ్చినవి.

రెండవ బావగారగు నారాయణరావు తనకు కథ చెప్పచున్నట్లు కల గనుచు కుమారరాజా కేశవచంద్రరావు నిదురగూరినాడు.

నారాయణుడు రాత్రి రైలులో వెళ్లుచున్నాడు. వేగము! వేగము! రైలు సంగీతము పాడునా! ఒకొక్కప్పుడు రైలు తాళము వేయుచున్నట్లు తనకు తోచును. ఎంత చిత్రమో? టక టక టక టక. శారద మెరపువలేమాత్రమే తోచినది. నారాయణుడు పాడుకొన్నాడు.

ఓహో కవిత్వమా, నీవు విశ్వమోహినివి. శివుని డమరుకమున జనించితివా?

‘అ ఇ ఉ ణ్ ఋ ఌ క్.’

ఈ రైలుచక్రముల చప్పుడు అందుండియే జనించినదా?

‘అ ఇ ఉ ణ్ ఋ ఌ క్.’

‘శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజేషుయే.’

కవిత్వము సర్వకళాస్వరూపము. కవిత్వము విశ్వస్వరూపము. సర్వ సృష్ట్యాత్మకము. అఇఉణ్ఋఌక్. టక టక టక టక. ఆతడు నిద్రగూరినాడు.