Jump to content

నాటికి నేడు

వికీసోర్స్ నుండి

దొంగాటకం


పాత్రలు

ప్రకాశరావు

రాజ్యం

దొంగ


నాటికి నేడు


పాత్రలు

నరుసు పంతులు

మహలక్ష్మమ్మగారు

నాటికి నేడు

యమ్. యన్. యమ్. మెయిలులో చిన్న యింటరు క్లాసుపెట్టె. ఆసనంమీద పెద్ద సూటుకేసు. జాయబద్దల. సజ్జా పళ్ళతో; జాలరుసంచీ, కంచుమరచెంబూ - కాశీమజిలీల పుస్తకమున్ను. మహాలక్ష్మమ్మగారు 60 ఏండ్ల ముత్తైదువు. ఒక 5–10 ఏండ్లు చిన్నగానే కనబడుతుంది. తల మూడువంతులు నెరసింది. నిండువిగ్రహం. నగలు, పూర్వకాలపు పట్టెడా నానుతో, ఇప్పటిగడియారపు గొలుసు, జాజిమొగ్గలపేరు, కలసిఉన్నవి. ఒడ్డాణంమాత్రంలేదు. కంచిచీర, రవిక లపేటాసిల్కు కాబోలు, తమలపాకులు ఒక్కొక్కటీ చీరి వేసుకుంటూ మధ్య మధ్య పండిందో లేదో అని నాలుకచూచుకుంటూ వుంటుంది.

తలుపు తెరచుకొని నరసుపంతులు. సన్ననిమనిషి - కాయశరీరం గనుక వయసు సరిగా చెప్పలేము. 65 సం॥ వుండ వచ్చును. చిన్న క్రాపింగూ— పెద్దమీసాలు. రెండింటికీరంగూ, కమీజు మీదుగా పంచ.

మహా : ఇందులోకి వచ్చే రేమిటి? వెళ్ళండి వెళ్ళండి.

నరు: నేనేం బిచ్చానికిరాలేదండి - నేనూ ప్రయాణీకుణ్ణి - టిక్కట్టు కొన్నాను.

మహా : మీకీబండియే దొరికిందా యేమిటి ? నరు : ఏబండీలోవాళ్ళు ఆ బండీలోకి రావద్దు పొమ్మంటుంటే ఎందులో కూచోవడం ? దింపరాసామానూ.

మహా : అయితే ఆడవాళ్ళపెట్టెలో ఎక్కిపోతావయ్యా ?

నరు : కొంపమునిగింది - ఇది ఆడవాళ్ళబండి వా - చెప్పవేమిరా? చూస్తూవూరుకుంటావు. పద. పద. (దిగి పోతాడు.)

మహా : తలుపు గట్టిగా వేసుకపొండి... అబ్బా ! సిగ్గులేకుండా ఈ మగాళ్ళు ఏమితోసుకొస్తారు ఆడవాళ్ళ బండ్లలోకి ? (నరుసుపంతులు తలుపుతెరచుకొని వచ్చాడు.) మళ్లావచ్చేరేమిటి ?

నరు : మళ్ళీ ఎక్కడ వచ్చాను? అప్పటినుంచి ఈలాగే కాళ్లు కాలిన పిల్లి లాగు తిరుగుతున్నాను. దింపరా సామాను దింపు.

మహా : విూకీబండితప్ప ఇంకొకటి పనికిరాదాఏమిటి ?

నరు : ఇది ఆడవాళ్ళబండి కాదటమ్మా, పైన ఆడబొమ్మలేదు. లేడీస్ (Ladies) అని వ్రాసిలేదు.

మహా : లోపల నేనున్నాను కానటయ్యా? పైకి బొమ్మా పేరూ వుండాలా ? ఇది ఆడవాళ్ళ బండి కాకుంటే మా మనుమడు నన్ను ఇక్కడెందుకు కూర్చోపెట్టేడూ?

నరు : నాకేం తెలుసునండీ! మీ మనుమడెవరో ఎందుకు కూర్చో పెట్టాడో - ఇంటికివెళ్ళి ఉత్తరం వ్రాయండి. బండీ కదుల్తున్నాది. తేరా సామాన్లు తే ? (లోపలికి ట్రంకూ, పరుపూ, కోటూ, మూటా, లాంగ్‌కోటూ మొదలైనవి అందుకొని) అదుగో బేడకాసు క్రిందపడిపోయింది తీసుకో... బ్రతుకుజీవుడా! గంట ముందర వచ్చానుగానీ ఈ వేళ ట్రైనులో కూర్చుంటాననుకోలేదు.

మహా : ఇది ఇంటరుక్లాసయ్యా !

నరు : నాబుర్రచూస్తే మీకు మూడవక్లాసు బుర్రలాగు కనబడుతుందా ? నేనూ ఏదో గౌరవంగల మనిషినేకాని అంత గతిలేని వాణ్ణికానండీ.

మహా : అయితే యింతదూరము నేను మీ ఒక్కరితోనూ ప్రయాణం చేయవలశిందే ! నా వొళ్లు చచ్చిపోతున్నాది- ఏందారి ?

నరు : నేను బండీ యెక్కిపోయినాను. రైలేమో నడచిపోతున్నాది. మీరు లక్షచెప్పినా నేను దిగనుగదా ? ఎందుకు సణుగుతారు ?

మహా : ఏమోచెప్తారుగాని - ఆడపిల్ల ఒక్కర్తే వున్నది అక్కడ మనకేం పని అన్న జ్ఞానం వుండవద్దుటండీ యెవరికైనా?

నరు: మీరు నోరు మహాజోరుగా వదిలేస్తున్నారు. మీ పక్షంలో అది ఏమీబాగుండలేదు. మీకంత పరాయిపురుషుల వాసన కిట్టకపోతే ఆడవాళ్ల బండిలో కూర్చుండవలసింది.

మహా : ఆ భడవ అలాగైనా కూర్చోబెట్టాడా ? లేక తాను రానైనా వచ్చాడా ? పగటివేళ భయమేమిటి నాయనమ్మా అని ఒక్క ర్తెనూ పంపించివేశాడు. నరు : ఇప్పుడు మాత్రం భయమేమిటి చెప్పండి. మీ రాలాగు బెంబేరుపోతున్నారుగాని, మీరు ఎక్కడికివెళ్తారు ?

మహా : ఎక్కడబాబూ - బెజవాడ.

నరు : శ్రీరామచంద్రా ! మాపైనే! కానియ్యండి.

మహా : మీరో !

నరు : నిడదవోలు.

మహా : భగవంతా! అంతవరకూవుందీ - ఈ యమయాతన ?

నరు : ఎందుకండీ వట్టీ రవ్వా రట్టూనూ? తోడులేకుండా మీరొక్కరుమాత్రం ఎంతకని ప్రయాణం చెయ్యగలరు? నేనేం రాక్షసుణ్ణిగాను, పిశాచాన్నిగాను. ఏదో మీ సోదరుడిలాంటివాణ్ణి.

మహా : కానీవ్వండి ఏంచేస్తాము.

సరు : సామాన్లు సర్దుకుందామా ?

మహా : నేను ఒక్క వస్తువా ముట్టుకోలేను. మా మనుమడు సామాన్లు ఇక్కడపడవేశాడు బెజవాడ దగ్గర మా మనుమరాలు మొగుడువచ్చి దింపేస్తాడు. ఆ సామాన్లు పక్కనే ఏదో చోటుచూచుకొని కూర్చుండండి... అసలు ఇంటి దగ్గర నేనొకపనిచెయ్యను.

నరు : నేనున్నానుకదూ – లోకంలో పుట్టినవాళ్ళకీ, పుట్టబోయేవాళ్ళకీ అందరికీ చాకిరీచేసే నౌకరీవాణ్ణి. నేనుసర్దుతాను. (చిల్లరవస్తువులు పై బల్లమీదుగా వేరు వేరుగా సర్ది ట్రంకులు క్రింద పెడతాడు.) మహా : ఆ కాశీమజీలీల పుస్తుకం ఈలాగు యిచ్చి వేయండి (పుచ్చుకుంటుంది) ఈ ట్రంకు యిక్కడపెట్టారేమిటి ?

నరు : చవట ముండాకొడుకుని, ట్రంకులు మీదికెత్తితే నెత్తిపగిలి చస్తాను.

మహా : చెయ్యివేలవేస్తే చేతికి తగుల్తున్నాది. ఎలాగండీ ?

నరు : సర్దుతాను. ఏంచేస్తానుమరి (లేచి కాళ్ళకు క్రిందుగాలాగుతాడు.)

మహా : అక్కడవద్దండీ కాలుక్రిందపెడితే బ్రద్దలౌతుంది.

నరు : (లేచి మళ్ళా మధ్యకు సర్ది) సరా! ప్రాణం పుచ్చుకొన్నారు.

మహా : మిమ్మల్ని ఎవరు సర్దమన్నారు. ఎవరు సణువుకోమన్నారు? ఏమిటీ ముసలికోపం?

నరు : ఆ, లోకంలో అందరూ పడుచువాళ్ళూ యవ్వనవంతులూ! నేనొక్కణ్ణే ముసలివాణ్ణి - పుట్టినప్పుడే మా అమ్మ ఒక ముసలిముద్దను కని భూభారంగా పడవేసింది.

మహా : ఆఁ అంటే కోపం - ఊఁ అంటే కోపం - ఏ మహాయిల్లాలు మీ దగ్గర కాపురం చేస్తున్నదోకానీ.

నరు : మీవల్ల మీ భర్త భూలోక స్వర్గం అనుభవిస్తూ ఉంటాడు.

మహా : (దిగ్గున లేచి) ఏమిటి నాకీ సవతిపోరు? మీరు నాతో' మాటాడవలసిన అగత్యం లేదు. మాటాడకండి (పండుకొండి.) నరు : రక్షించేరు గదూ (తానూ తనబల్లపై పండుకొన్నాడు.)

మహా : నాతో సమానంగా పండుకొన్నారు నన్ను బ్రతక నివ్వరా ఏమిటి ?

నరు : రెండుగంటలు స్టేషనులోకూర్చొని నడుము పీకి పీకి చస్తున్నాను. ఎలాగుచచ్చేదమ్మా!

మహా : ఆలాగు కిటికీకి చేరబడి కూర్చుండండి.

నరు : నేను కూర్చుండి మీరు వండుకొంటేమాత్రం ఘనమా ఏమిటి ?

మహా : ఉదయం లేచి ఎవరిమొఘం చూచానో (కూర్చుంటుంది.)

నరు : సామర్ల కోట దగ్గర పెట్టె మార్చుకొంటాను. లేకుంటే అక్కడదిగి ప్యాసింజేరులో పోతా. అందాకానన్ను కాపాడండి. (కూర్చుంటాడు.) ఏ ముహూర్తాన బయలుదేరినానో అల్లరి,- చీదరా-చిరాకూ.

మహా : (కొర కొర చూస్తుంది.)

నరు : ఇంక నన్ను మాటాడించకండి, నావైపుచూడకండి. నే నీ బండిలో లేననుకొనే యీ రెండుఘడియలు కళ్ళుమూసుకొని కాలక్షేపం చెయ్యండి. నేను చదువుకుంటాను . ( పుస్తకం లాంగుకోటులో నుంచి తీస్తున్నాడు. )

మహా : నేనూ చదువు కుంటాను (కాశీమజిలీలు విప్పి కథ క్షణం వెదుకుతుంది ?) (ఇద్దరు ఒక్కమారుగానే గట్టిగా) పూర్వకాలంబున ఆంధ్రదేశంబునకెల్ల తలకాయ మానం బగు విదర్భ దేశంబను పురంబున నవభాను కోటిసుందరాకారుండను రాజన్య పదపద్మలాంఛిత శిరోరుహుండను-


నరు : గీ॥ కన్నులొసగియు నీమూర్తి గాంచనీడు
              వీను లొసగియు నీ నుడుల్ వినగనీడు
              తను వొసంగియు నీమేను తాకనీడు
              విధికి నేనేమి విసము మేపితిని తరుణీ !
              ప్రేయసి ! నీ శరీరంబు ఫ్రీ
                                       (ప్రియ?) తమంబు.


మహా : ఇదేమిటి మాలగోల? ఉత్తికుత్తినే ఎందుకు నన్నీ లాగు వెర్రెత్తిస్తున్నారు ?

నరు : ఎవరు మీరా నేనా ? ఆ వచనంముక్కలంత గట్టిగా చదవాలటండీ !

మహా : నా భర్తగారు నాకు రాసిన ఉత్తరాలైనా నేను గట్టిగా చదువుతాను. ఆలాగు పైకి చదివితేనేగాని నాకు బోధపడదు.

నరు : మీరు గట్టిగా చదివితే నాకు బోధపడదు.

మహా : బోధపడక పోతే మానివేయండి.

నరు : మీ కాశీమజిలీలకోసం నా పద్యాలు మానుకోవాలా? ఏకులు వస్తున్నాయి బళ్లు అడ్డంగా తీయండన్నారట.

మహా : మీరేం మహాభారత భాగవతాలు చదువుతున్నారు - భక్తచింతామణి పద్యాలేకదూ ?

నరు : ఏమైనా పద్యాలవునుకదా! ఎంతపుచ్చిన మిరియాలైనా జొన్నలుపాటి చేయకపోవు. ఇత్తడి ఇత్తడే పుత్తడి పుత్తడే. నామాట విని రెండు పద్యాలు చదువుతాను వినండి. మహా ఉత్కుృష్టమైన గ్రంథం. ఉన్నత భావాలు. ప్రతీపద్యం రసంతో చిప్పిలుతుఉంటుంది. పద్యం గ్రంథకర్తనోట వినడంలో ఒక ఆనందం వుంది - అదో అదృష్టం.

మహా : మీరు వడ్డాది సుబ్బరాయ కవిగారటండీ చెప్పారు కారే ?

నరు : నేనూ రమారమి అలాంటివాడనే - వినండి.


గీ॥ ప్రేయసీ | నీశరీరంబు ఫ్రీ (Free) తమంబు;
     పొంతి! నీడెందము కుబేర పుష్పకంబు;


ఇక్కడ కొంచె చెమెత్కరించినాను. కుబేరపుష్పకంలో ఎందరు కూర్చొన్నా యింకొకరికి చోటు వుంటుంది. అలాగే ఆవిడమనసులో -

మహా : ఇదేమిటిది? ఏభక్తచింతామణి పద్యాలో చదువుతారని నేను చూస్తూవుంటే, ఈ పోకిరీపద్యాలు ప్రారంభించావేమిటయ్యా. నీకువచ్చినఏళ్ళు ఎవరికి వచ్చాయి అన్నంతిని బట్టకట్టే మనిషికి బుద్ధి సుద్ధీ వుండద్దు. నీభార్యదగ్గరా నీ అక్కచెల్లెండ్రదగ్గరా యింకొకరు యిటువంటి కూతలు కూస్తే నువ్వూరుకుంటావా? నువ్వేమో దగుల్బాజీ మనిషిలాగున్నావు. నీ వ్యవహారం నాకు అనుమానంగా వుంది. నువ్వు ఎంతకైనా సాహసుడివి. గొలుసులాగి రైలు నిలిపి నిన్ను స్టేషన్ మాస్టరికి అప్పగిస్తా. ( లేస్తుంది.) నరు : (దిగ్గునలేచి కాళ్ళమీద పడి) తల్లీ ! రక్షించు. రక్షించు నా కర్మం కాలి ఈ పెట్టెలో యెక్కేను. నువ్వు తొందరపడి గొలుసులాగితివా చచ్చిపోతే చచ్చిపోయినాను నేను వెంటనే వెలుపలికి గెంతివేస్తాను. నా మనసులో నాకు దురుద్దేశం లేదు- నా ప్రారబ్ధం నన్నీలాగు ముప్ప తిప్పలు పెడుతున్నాది కానీ.

మహా : అయితే భ క్తచింతామణి పుస్తకం పట్టుకొని బంగాళీ పద్యాలు చదవడమేమిటి?

నరు : బంగాళీ పద్యాలు కావుతల్లీ - బంగాళీ పద్యాలననుసరించి వ్రాసినవి. ఇది ప్రేమామృతమనే గ్రంథము. స్వయంకృతాపరాధము. ఇది భక్తచింతామణి పుస్తకంతో కలిపి కుట్టాను. ప్రియురాలూ భగవంతుడూ ఇంతేకదాప్రాణికి ? ఇది కావలిస్తే ఇది అది కావలిస్తే అది చదువుకుంటాను.

మహా : నీకు 60 వెళ్ళి 70 వడి వచ్చింది కళ్ళు గుంటలుపడి పళ్ళు రాలిపోయి ఒళ్ళు సడలిపోయిన యీ వయస్సులో రామా, కృష్ణా, గోవిందా అనుకుంటే బాగుంటుందికాని, నోరు తెరచుకొని ప్రేయసీ ప్రేయసీ అని అరిస్తే ఎవరైనా హర్షిస్తారా? ఏమి బుద్ధిమంతుడివి ? విశేషించి ఆ పుస్తకం తెచ్చి ఒంటిగా నున్న ఆడదాని దగ్గర చదువుతావా ?

నరు : క్షమించి నా మాట కొంచెం జూరనివ్వండి. ఇది పూర్వకాలపు శృంగారము కాదు ప్రబంధాలులోలాగు ఇందులో కుచకచాదుల వర్ణనలూ, అధరపాన ఆలింగనాది సంభోగ వర్ణనలూ లేవు ఇప్పటి కాలంలో ప్రేమ శృంగార ప్రధా నం కానక్కరలేదు. ఇది విషాదప్రేమ. ఆ ప్రేమనే ప్రేమామృత మనే యీ గ్రంథంలో చూపించినాను.

మహా : జీవామృత మన్నట్లు ప్రేమామృత మేమిటి?

నరు : ప్రేమ భగవత్స్వరూపము భగవంతుడు ప్రేమమయుడు. లోకం ప్రేమపూర్ణము. ఇందులో ఒకడు ఒక తెను ప్రేమిస్తాడు. ఆమె అతణ్ణి ప్రేమించక ఇంకొకణ్ణి పెండ్లాడుతుంది మొదటి వాడు చస్తాడు. ఇదీ కథ !

మహా : చస్తే మరి ఈ అమృతం బ్రతికించ లేక పోయిందా ? అయినా యింత అసందర్భపు కథ ఏమిటి ? ఎవర్తో ఎవణ్నో పెండ్లాడితే ఇంకొకడు చచ్చిపోతాడా? తుంటికి కొడితే పళ్ళు రాలేయట! మొన్న ఎక్కడనో భూకంపంపెట్టిందే - ఎందరో స్త్రీ పురుషులు చచ్చిపోయినారు- చచ్చిన మొగుడు కోసం పెళ్ళాంగాని, చచ్చిన పెళ్ళాం కోసం మొగుడుకాని చచ్చినట్లు ఒక్క నిదర్శనముందా ? ప్రేమట. ప్రేమ, ఆ మాట అంటే నా కసహ్యం. బుద్ధిలేని భగవంతుడిలాగు చేసి పెట్టాడు? గనుక దిక్కుమాలిన జీవులు మొగుడని, పెళ్లామనీ, యేడవడం. అదైనా బ్రతికి వున్నంత కాలమే ప్రేమకోసం చచ్చినవారితో ఎవ్వరూ చావరు.

నరు : అది నిజమే కాని మరి పుస్తకాలలో ఆలాగు వ్రాయవలె - కలిస్తే చాలా సుఖపడ్డారనీ, విడిపోతే చచ్చిపోయినారనీ. అది జరిగిన కధే. ఇందులో కథానాయకుడు నిజంగా చచ్చిపోలేదు. ఎర్రెత్తిపోయినాడు. వెర్రెత్తినవాడు చచ్చిపోకపోతాడా అని చచ్చిపోయినట్లే వ్రాసేను. మహా : అందరూ ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవలసినవాళ్ళే. చచ్చిపోయినట్లు చేతనైనంతవరకు ఉత్తరాలువ్రాసి పారవేయండి. మనుష్యులలో కవిత్వం ప్రవేసించేసరికి ఆ వున్న బుద్దికాస్తా పోతుంది కాబోలు. ఆ గ్రంథం మూసేసి ఆ జరిగిన కథ ఏదో చెప్పండి విందాం.

నరు : చెప్తాను! మహావిషాదకరమైనగాథ. హృదయం బద్దలుకొటేస్తుంది. కథ సగం చెప్పేసరికి ప్రతివాళ్ళూ నేల బడి దొర్లటం, ఎక్కి ఎక్కి ఏడవడమున్నూ.

మహా : నే నాలాగు దొర్లలేను. యేడవలేను. మీ యిష్టం వస్తే చెప్పండి. లేకుంటే మానివెయ్యండికాని. (తమలపాకులు తీసింది).

నరు : వినండి. (చుట్ట ముట్టిస్తాడు)

మహా : ఏమండోయ్ ! చుట్ట పారేయండి. ఆ పొగ నాకు పడదు.

నరు : రోజుకు 40 చుట్టలు కాల్చేముండాకొడుకుని 2 గంటలైంది – చుట్ట అన్న వాసన యేమిటోయెరుగను - నన్నెందుకు పీడిస్తారు.

మహా : ఆ పొగ తగిలితే నాతల గిర్రున తిరిగిపోతుంది.

నరు : అదిలేకపోతే నాకు మొఖం తిరిగిపోతుంది. ఏందారి ?

మహా : ఏమిటి నాకీబాధ యిక్కడ ?

నరు : బాధ మీకా నాకా ?- కోపపడకండిగాని మీరు తమలపాకులు వేసుకొంటుంటే నేను వద్దన్నానా? మహా : అయితే దానికీ దీనికీ సాటూ? మీలాటివాళ్ళతో మాటలేమిటి? నాకు కథావద్దు, కాకరకాయవద్దు. కాశీమజిలీలు చదువుకుంటా.

నరు : వద్దు వద్దు. చుట్టపారేస్తా (విసరి) కథ వినండి. ఇది 40 ఏండ్ల క్రిందటి ముచ్చట. రాజమండ్రీలో - ఆరోజులలో- ఇం కేమిటిలేండి - ఆహా అవోరోజులు. పోయింది. పోయింది-

మహా : ఏమిటి పోయిందండి ?

నరు : ఏం చెప్పను! మనిషి జీవితమందే - ప్రేమామృతములో చెప్పాను - తీసిచదువుతానుండండి. (పుస్తకమువిప్పి).


గీ॥ ధరణి లోపల తానొండుదలచునేని.
      ఒనరనెందున దైవమింకొకటి తలచు...


మహా : (పుస్తకం చేతులోనుంచి లాగుకొని వెనకవేసుకొని) ఇంక కథ సజావుగా టూకీగా చెప్పండి.

నరు : ఆ రాజనుహేంద్రవరములో - ఆ ఇన్నీసుపేటలో ఆ రోజుల్లో- ఆహా; అవోరోజులు-

మహా : ఆరోజుల్లో ?

నరు : ఒక ఆడమనిషివుండేది.

మహా : ఇన్నీసుపేట కంతకీ ఒక్క ఆడమనిషావుండేది ?

నరు : అంటే ఒక పిల్ల వుండేది. పిల్లేమిటి చక్కనిచుక్క. దివిటీ లాగుండేది. ఇంతలేసికళ్లు జిగ జిగ మెరుస్తూ. పట్టపగలు దివిటీలాగుండేది. ఆ తలకట్టూ, ఆ ముక్కూ- ఆ సౌందర్య మంటే అప్పటివాళ్ళదేనండి- ఇప్పుడేముంది గనుక కుండ బొమ్మలు - ఆ అందం ఒక్క సీసంలో ఎక్కించేను.. ఆ పుస్తకమిటివ్వండి.

మహా : ఎందుకులేండి. మీరేమబద్దమాడుతారు గనుకనా? ఆవిడ చాలా అందమైనదే అయివుంటుంది తర్వాత చెప్పండి.

నరు : ఆవిడ బాల వితంతువు.

మహా : యిది ఎన్నాళ్ళక్రిందట ముచ్చటన్నారు.

నరు : ఎన్నాళ్ళంటే యేమిటి చెప్పను? కాలచక్రం అన్నారు. కాలం రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. ఇంకా నిన్నో మొన్నో జరిగినట్లుంది– అప్పుడే 40 ఏండ్లు అయిపోయింది. (ఏడుస్తాడు.)

మహా : మధ్య మీరు తన్మయులై పోతున్నారేమిటి ? ఈ బాధ అంతా మీ కేలాగుంది ?

నరు : గ్రంథకర్తకు కథానాయకుడితో సంపూర్ణ సానుభూతి వుంటేనేకానీ సరిగా రసనిష్పత్తికాదు. కథానాయకుడు నా పినతండ్రికొడుకు. తర్వాతకథ వినండి.

మహా : 40 ఏండ్ల క్రిందటా? ఇన్నీసుపేటలోనా? ఆవిడ పేరు?

నరు : పేరా ! పేరు! ఆహా ఆరోజుల్లో! అవో రోజులు! ఆవిడపేరు నాయనమ్మపేరేగాని ఆవిడను మావాడు ముద్దు ముద్దుగా లిల్లీ అని పిల్చేవాడు. లిల్లీ అనగా జాబిల్లిలోని చెవులపిల్లి అని అర్ధం అంతచక్కని మనిషి. అంత చక్కని రూపు. అంత....

మహా : (ఒక్క పెద్ద నిట్టూర్పుపుచ్చి బల్లకు చేరబడిపోయింది.)

నరు : అదేమండీ అలాగై పోతున్నారేం?

మహా : (కాళ్ళు చాచుకొని పండుకొంది).

నరు : లేవండి ! లేవండి!, ఏమిటి సంగతి.

మహా : (పైటచెంగు మొగముమీదనుంచి ముసుగేసుకొంది).

నరు : అదేమిటండీ, సంగతి చెప్పండి నావల్ల తప్పులేదుకదా! నాకు భయంవేస్తున్నాది. ఉండుండి దిగ్గునలేచి గొలుసు లాగరుకదా ?

మహా : (సమదాయించుకొని లేచి కూర్చుండి) ఆవిడ మేనమామ కూతురులెండి.

నరు : ఎవరు? మా లక్ష్మమ్మగారా?

మహా : అవునండి. మీ పినతండ్రికొడుకు నరుసుపంతులుగారు గారటండీ ?

నరు : అవును మీకేం తెలుసును ?

మహా : మా మహలక్ష్మి అన్ని సంగతులూ నాతో చెప్పేది?

నరు : మా నరుసుపంతులు అలాగే. ఇంక మీకు చెప్పవలసిన దేమున్నది? వారిద్దరిదీ ఏమనురాగమండీ. భగవంతుడు చూడలేకపోయినాడుగాని వారికే వివాహమైయుంటె వారి దాంపత్యం సీతారాముల దాంపత్యంలాగు - సావిత్రీ సత్య వంతుల దాంపత్యంలాగు ఇంకా పురాణములలోనూ పుణ్య కథలలోనూ వున్న దంపతులందరి దాంపత్యంలాగు అమోఘంగా వుండేది. ఈ వివాహమే జరిగివుంటే విధవా వివాహాలన్నీటిలోనూ శిరోమణి కావలసింది.

మహా : నిజం. ఆవిడ గుణ సంపత్తి అటువంటిది. కలియుగ సీతాదేవి.

నరు : ఆవిడ గుణంఏలాగున్నా అతడు మహానీయుడు. సాక్షాత్తూ ప్రణయమూర్తి.

మహా : అతడే అంత మహానీయుడైతే ఆ పెండ్లి అలాగు నీరు కారడ మేమి ?

నరు : ఆవిడ తెలివి తక్కువతనంవల్ల. ఆవిడకేమో మనసు నిండా ప్రేముంది - నిజమే - కాని ఎంత ప్రేమ వుందో అంతకు 10 రెట్లు భయం వుంది. ఆ భయమే కొంప ముంచివేసింది.

మహా : భయం సిగ్గూ ఆడదానికి అలంకారాలుగావటండీ!

నరు : పెళ్ళయితే అలంకారాలుగాని పెళ్ళికాకముందు వితంతువుకు అలంకారాలేమిటండీ ! నా కిప్పటికి మంట రగిలిపోతున్నది. మనుషులుంటే మాటాడేదికాదు. లేకుంటే మాటాడేదికాదు. పెళ్ళి చేసుకోవలెననివుందీ - ఆ మాట తన తండ్రితో చెప్పేదికాదు. మా వాణ్ణి చెప్పనిచ్చేదికాదు. కొసకు యిక్కడుంటే వ్యవహారం తెమలదు. తన తండ్రిని వుత్తరం ద్వారా అడుగుదామని మా వాడు స్వగ్రామం వెళ్ళాడు. కాలూ చెయ్యి కూర్చోవడంలో కొంత ఆలస్యమైంది. ఈ లోపున ఎవడో వచ్చి తన తండ్రిని అడిగాడు ఈవిడ భయంచేత కాదనలేక పోయింది. వీళ్ళని వీరేశలింగంగారు పుణ్యం కట్టుకొన్నారు. మా వాడు వెర్రి వెధవఅయి పోయినాడు. (ఏడుస్తాడు)

మహా : విూరు చెప్పిందంతా శుద్ధ తప్పు. ఈ లాగునే మీరు గ్రంథంలో వ్రాసివుంటే గ్రంథమంతా మార్చి తిరిగివ్రాయ వలసి వుంటుంది. సాక్షాత్తూ ప్రణయమూర్తి అని మీరు చెప్పిన ఆ మహనీయుడు ఒక నాడు అర్ధరాత్రివేళ చెప్పకుండా చేయకుండా లేచిపోయినాడు. రోజులు వారాలు నెలలూ చూసింది ఆ మహాయిల్లాలు. అతనిపత్తాలేదు. తర్వాత కొన్నాళ్ళకు ఇతడు మద్రాసులో విధవావివాహం చేసుకొన్నట్లు - ఆవృత్తాంతం - ఆ ఫొటోలు పేపర్లో చూసింది. నిద్రాహారాలు మాని యేడ్చి, యేడ్చి చిక్కి శల్యమైపోయింది. తర్వాత, మేమందరమూ దీనిని బ్రతికించుకోవడమేలాగురా భగవంతా అని బోధించగా బోధించగా కొసకు, ఆయనకేది గతి అయితే “నాకూ అదేగతి అని తానూ పెండ్లాడింది.

నరు : ఏమిటి ఏమిటి ? వాడు పెండ్లాడినతర్వాతనా తాను పెండ్లాడింది ? అన్నీ తెలుసునేమో ఈలాగంటారేమిటండీ? తనపెండ్లిఅయిన ఆరుమాసాలకు మేమందరమూ బోధించగా బోధించగా పరువు నిలబెట్టుకొందుకు వాడేదో పెండ్లాడేడు. మహా : లేదులేదు. ఆయనపెండ్లే ముందర అయింది. ఆసంగతి తెలిసే తాను పెండ్లాడింది.

నరు : లేదండీ – ఈప్రేమామృతం పట్టుకొని ప్రమాణంచేసి చెప్తాను - ఆపెండ్లి మార్చిలో - ఈ పెండ్లి అక్టోబరులో.

మహా : నెలలేమో రైటే - నేనూ కాశీమజీలీలు పట్టుకొని ప్రమాణంచేసి చెప్తాను- మొదట తన పెండ్లి తర్వాత నా పెండ్లి .

నరు : లేదులేదు తర్వాతనే నాపెండ్లి

మహా : ఆఁ ఆఁ మీపెండ్లా ? మీ పెండ్లా ?

నరు : ఆ. ఆ. ఆ. మీ పెండ్లా? మీ పెండ్లా? మీరేనా మీమేనత్తకూతురు ?

మహా : మీరు! మీరు! మీరేనా మీ పినతండ్రికొడుకు ?

నరు : మహలక్ష్మమ్మా!

మహా : నరుసుపంతులుగారు !

(ఇద్దరూ పరాఙ్మఖులై కాళ్ళుజాచుకొని పండుకొని యేడుస్తారు.)

నరు : (ఇటుతిరిగి ఏడుస్తూనే) ఊరుకోరూ?

మహా : (ఇటుతిరిగి ఏడుస్తూనే) మీరూరుకోరూ?

నరు : (ఏడుస్తూ కూర్చుండి) 40 ఏళ్ళనుంచీ దేముడు నాబ్రదుకొక్క యేడుపే చేసివేశాడు. ఏలా గూరుకోనేది ? మహా : (కూర్చొని ఏడుస్తూ) ఈ 40 ఏళ్ళనుంచీ కంటికి నేలకీ ఏకధారగా ఏలాగేడుస్తున్నానో ఆభగవంతుడికి తెలుసును.

నరు : నాబ్రతు కీలాగుకావడానికి మీరే కారణం ఊరుకోండి.

మహా : మీవల్లనే నాకిటువంటిగతి పట్టింది ఊరుకోండి !

నరు : మహాలక్ష్మమ్మా మహాలక్ష్మమ్మా!

మహా : అదుగో స్టేషన్ వచ్చింది. అది దాటే వరకూ మాటాడకండి.

నరు : ఇంకా మొదటిరస్తావే? అది పుట్టుకతో పుట్టింది. ఏం చెయ్యను. (భక్త చింతామణి తీసి పద్యాలు కూనురాగంతో చదువుతాడు.) ఆఁ ట్రెయిన్ కదిలింది (పుస్తకం టప్పున మూస్తాడు).

మహా : ఆ. ఆ. పుస్తకం తెరవండి. ఈట్రెయిన్‌కాదు, ఎదురుగుండావున్న గూడ్సు ట్రెయిన్ పోతున్నాది. ఇదిగో స్టేషన్ వేపు చూడండి. తెలుస్తుంది.

నరు : (మరోపద్యం చదివి) ఆ ట్రెయిన్ కదిలింది.

మహా : ప్లాటుఫారం దాటిపోనివ్వండి.

నరు : (పుస్తకం మూసి) ఎన్నాళ్ళకు మిమ్మల్ని చూచినాను.

మహా : మిమ్మల్ని చూచి 40 ఏళ్ళయిపోయింది - కళ్ళుకాయలుకాచి పోయినాయ్.

నరు : ఆమాలదైవం మన మొప్పిదం చూడలేక యీలాగు విఘాతం కలిగించాడు మహా : యింతపాపానికి నెట్టుకొన్న ఆ భగవంతుడి నెత్తి బ్రద్దలుకొట్టితే పాపంవుందీ. ఏమిఏడిపించాడు ఏమిఏడిపించాడు ఇద్దరినీ.

నరు : ఇప్పుడు, ఇక్కడ, ఈలాగు - అనుకోకుండా మనమిద్దరమూ కలియడమనేది కేవలంగా భగవత్సంకల్పం కనుక భక్తపరాధీనుడైన ఆ భగవంతుణ్ణి మనమిద్దరం కలసిమెలసి ఒక్కసారి ప్రార్థిద్దాము.

మహా : మంచిది మీరు చెప్పండి; నేను వెనక అంటూవుంటాను (ఇద్దరు తమతమ బల్లలమీద మోకరించి)

నరు : ఓ సర్వేశ్వరా - నీవు దయామయుడవు. నీవు ప్రేమమూర్తివి. ప్రేమమూలముననే నీవు లోకమును సృష్టించి తెంచుచున్నావు. ప్రేమగలవారిని నీవు ప్రేమింతువు. ప్రేమను నడుమ తెంచినను తర్వాత ముడివేయుదువు. ప్రేమమూర్తులమైన మమ్ము-ఇట్లుకలిపినందుకు నీకు-మేము కృతార్థులము.

మహా : చాలులెండి.

నరు : మహలక్ష్మమ్మగారు! ఈ ట్రైన్‌లో యిద్దరం కలసి వుండి కూడా ఎంతకాలం వ్యర్థము చేశినాము.

మహా : అప్పుడు 2 ఏండ్ల తరువాత 40 ఏళ్ళు ఇంతా వ్యర్థం కాగా ఈ రెండు గంటలకేనా ? బ్రతుకులే వ్యర్థమై పోయినవి.

నరు : మొదట నేను ఫలానా అని ఎందుకు చెప్పేరు కారండీ. మహా : ఆ మాటలు మీరైనా చెప్పారా ?

నరు : తీరా నన్ను బండిలోనుంచి తరుముతూనే వున్నారు. నయం నేను దిగి వెళ్ళిపోతే, అడిగేరూ - నా కంటె దౌర్భాగ్యుడుండునా ?

మహా : పరాయపురుషులనుకొని మిమ్మల్ని ఆలాగు తరమటంలోనే నా గుణం మీకు తెలిసివుండవలసింది.

నరు : ఇప్పుడానందిస్తున్నాను. మీ గుణం నా కిప్పుడు మిమ్ము చూడకముందే తెలిసింది కనుకనే అంత ప్రేమతో అంత విశ్వాసంతో అంతగా ఆసించాను. ఆహా! అనుకొన్నట్లు మనము పెండ్లాడివుంటేనా ?

మహా : మనమనుభవించే సౌఖ్యం ఎవరనుభవించిఉందురు.

నరు : నా కిప్పుడొకకోరికవుంది. కాదనకుండా మీరు మన్నించవలె. పూర్వం మీరు నడుస్తూవుంటే నవరత్నాలూ రాలుతున్నట్లుండేది. పరుగిడితే పార్వాపిట్ట ఎగిరినట్లుండేది. అది చూడాలని వుంది. ఒక్క ... ఒక్కసారి నడవరూ ? నా ఆశ తీర్చరూ ?

మహా : (సిగ్గుతో) ఎందుకులెండి. పోనిస్తురు వద్దు

నరు : లేకుంటే నేను బ్రతకను. నడకకు తప్పేమిటి ? ఒక్క మారు.

మహా : (అందంగా నడవాలని నడుస్తుంది)

నరు : (అదేదృష్టిగా చూచి అసంతృప్తితో) బాగానేవుంది. మహా : ఏం బాగు లెండి. ఇంకా పూర్వకాలం మనషులం గనుక ఈ మాత్రం ఇప్పటి వాళ్ళయితే మన వయసు వచ్చేసరికి......

నరు : అంతే......అంతే.....మీ కిపుడు వయసు 50 కంటె ఎక్కువ వుంటుందా ?

మహా : ఎక్కడిదండీ మీకు తెలీదూ ! 42 కాబోలు అంతే. మీ వయస్సు?

నరు : ఇదుగో 28 ఏళ్ళు సర్వీసు మీద రిటైరైనాను రిటైరై 15 ఏళ్ళయింది. అంతే 28 +15= 43 అన్నమాట, ఎవరి కంటె మనమేం ముసలివాళ్ళంకనుక, నిన్న మొన్నటి వాళ్ళం.

మహా : మనోవ్యాధి ఎక్కువగావుంటే తల నెరసిపోవడమనీ -

నరు : పళ్లు పడిపోవడమనీ...

మహా : శరీరంబిగువు చెడి ముదుతులు పడిపోవడమనీ.

నరు : దృష్టి ఏవస్తువుమీదా సరిగా ఆనకపోవడమనీ.

మహా : ఇప్పుడెందుకు పోనిస్తురూ ఈ ఓఘాయిత్యం మాటలు ?

నరు : అడిగేను మాటవరసకి. వయసెవరుచూస్తారు! రూపమెవరు లెక్కిస్తారు? ప్రేమ, ప్రేమ అదేముఖ్యం.

మహా : నావుద్దేశంకూడా అదే - ప్రేమవుండాలి. ప్రేమ అంటే. ప్రాణంనాకు.

నరు : నాహృదయం మీబానిస. ఈజన్మలోకాకుంటే వచ్చే జన్మలోనైనా మిమ్ములను పొందవలెనని నాతపస్సు. మహా : శరీరం ఎవరిదైతేనేమి. హృదయం అది మీ ఆధీనం అనుకొండి.

నరు : ఆ సంతృప్తితోనే ఇంతకాలం బ్రతికివున్నా.

మహా : పాపం మిమ్మల్ని చాలా యిబ్బందిపెట్టాను. ఎంత బాధపడుతున్నారో చుట్టకాల్చుకోండి.

నరు : అబ్బబ్బా ! వద్దులేండి. మీకు తలతిరుగుతుంది ఆపొగకు.

మహా : విూరుకాలిస్తే తిరగదు. కాల్చకపోతే నామీదవట్టు.

నరు : ఇదీ ప్రేమలక్షణం - ఏది పరాయిమగవాడినోటినుండి వచ్చేటప్పుడు తనకు తల త్రిప్పుతుందో అదే తనప్రియుడి నోటినుండి వచ్చేటప్పుడు... మరి.....

మహా : తనకు అమృతంలాగుంటుందో అదేప్రేమ. మరి కాల్చండి.

నరు : (కాలుస్తూ) మహలక్ష్మమ్మా ! నీకెందరుపిల్లలు?

మహా : ఏంపిల్లలు పోనిస్తురు. 5 గురు కూతుళ్ళు ఒక కొడుకూ. మనుమలో 12 గురున్నారు. మీకో ?

నరు : సంతానం కేవలం భగదిచ్ఛ నాకు 5 గురు కొడుకులు ఒకకూతురున్నూ. మనుమలుంటారు. 14-15 గురు.

మహా : ఏదో ఒకరిదగ్గర వున్నప్పుడు ఏ ఎండకాగొడుగు పట్టక తప్పదు. నరు : నిజమే ఇంతకీ ఈలోకంలో వున్న తర్వాత యీ ఆట ఆడకతప్పుతుందా ?

మహా : ఇప్పుడు నే నీ సంసారం బెడదఅంతా వదులుకొన్నాను.

నరు : నేనూ వదులుకొన్నాను. - కనుక ఒక్క మాట చెప్తాను వింటారు- మీకూ నాకూకూడా పిల్లలు పెద్దవాళ్ళయి పోయినారు. ఏ బాదరబందీలేదు. పదండి ఈలాగు ఎక్కడనైనా దేశాంతరం వెళ్ళిపోదాం - తక్కిన జీవితశేషమైనా సుఖంగా గడిపివేదాం.

మహా : ఎక్కడికి వెళ్ళిపోదాం?

నరు : ఎక్కడికైనాసరే, ఏ కోమటికొట్టు మీదనో గుమాస్తాగానైనా ప్రవేశించి రోజుకు 6 అణాలు సంపాదించలేకపోను.

మహా : మీరు సంపాదించకుంటే నాఒంటిమీద బంగారం లేదూ?

నరు : అదికాకుంటే యోగినై నేనొక ఆశ్రమం పెడతాను. విూరు శిష్యురాలుగా వుందురుగాని.

మహా : కాని యిన్నాళ్ళయిపోయిం తరువాత ఈ వయసులో లేచిపోవడమేమిటి ?

నరు : అన్నా ఆడవాళ్లతో యిదే చిక్కు. తమకు తోచదు. చెప్తేవినరు. శాస్త్రరీత్యా లేచిపోవడానికి ఇదేవయస్సు. దిలీపుడు, రఘుమహారాజు మొదలైన వాళ్ళందరూ తమ ప్రియురాండ్రను తీసుకొని ఈ వయసులోనేకదా వాన ప్రస్థమునకు వెళ్లడం ?

మహా : ఇప్పుడు కలుసుకొన్న తర్వాత నోటివెంబడిని ఇన్ని చిలుకపలుకులు వస్తున్నవి కానీ ఈ 40 ఏళ్ళలో ఒక్కమారు ఒక్కమారైనావచ్చి మొఖం చూపించారా ? వరుసగా 20 ఏళ్ళు రాజమండ్రీలోనేవున్నా మే.

నరు : రాజమండ్రిలో అంతఘోరం అన్యాయం జరిగిన తర్వాత మళ్ళీ నాకు రాజమెండ్రీ రమ్మనివుందీ? గోదావరిలో స్నానం చెయ్యమనివుందీ? గౌతమీలైబ్రీకి వెళ్ళమనివుందీ? గున్నేశ్వరరావు నాటకం చూడమనివుందీ? నేను కొడుకులకీ మనుమళ్ళకీ యిన్ని సంబంధాలు చేశాను గాని రాజమండ్రి సంబంధం ఒక్కటీ చేయలేదే! ట్రెయిన్‌లో ప్రయాణముచేసేటప్పుడు కూడా రాజమండ్రీ స్టేషను వచ్చే సరికి యిటున్న వాణ్ణి అటుపోతాను.

మహా : పోనీ బరంపురమేమిచేసింది ? బరంపురం రాకూడదా?

నరు : ఏమని వచ్చేది ఏ మొఖంతో వచ్చేది ? ఒక మారు కాకినాడలో ఒకావిడ జట్కాబండిమీద వెళ్తున్నాది - మీరే అనుకొన్నాను. వెంటనే జట్కా వేయించుకొని తిరిగి కలుసుకొని మహలక్ష్మమ్మగారూ అన్నాను. ఎవరు మహలక్ష్మమ్మ అంది ఆవిడ తిరిగి వచ్చేశాను.

మహా : ఇంకొకమారు నేను రైలులోంచి వెళుతూ వుంటే - ఆ ప్రక్కపొలాలలోనుంచీ నడిచివెళ్తున్నారు ఒకాయన. అచ్చం మీ లాగే వున్నారు. మీరేనేమోకూడా రైలులోనుంచి గెంతివేదామనుకున్నాను.

నరు : (ఆదుర్దాతో) గెంతివేయలేదు కదా కొంప తీసి ! ప్రేమ మహా చెడ్డది.

మహా : మీరవునోకాదో నిశ్చయంగా తెలియక పోవడంవల్ల గెంతలేదు.

నరు : నేనే అయి వుంటాను- నేనే మిమ్మల్ని తలచుకొంటూ పొలాలమీదినుంచి వెఱ్ఱివాడిలాగ తిరుగుతుంటాను.

మహా : నిజంగా నా మీద విూ కటువంటి అనుమానం వుందీ !

నరు : ఉందో లేదో తెలుసుకొనే వుత్సాహం మీకుంది గనుకనా ? ఇదిగో నా గుండె చీల్చి చూస్తే. (ఆవిడ బల్ల మీదకు వెళ్తాడు)

మహా : ఆఁ ఆఁ ఇక్కడ కూర్చోవద్దు- ఎవరైనా చూచి అనుమానించగలరు.

నరు : ఏమనుమానిస్తారు ? భార్యాభర్తల మరుకొంటారు. అంతేనా ?

మహా : వద్దు. వద్దు – వెళ్ళండి. నేను చెప్తాను వెళ్ళండి. పోనీండి అయితే ( తాను వెళ్ళి అతని బల్ల మీద కూర్చుంటుంది.)

నరు : మీ పిరికితనమే మన బ్రతుకు లింతవరకు తెచ్చింది ఆ మాత్రం ఒక్క బెంచీ మీద కూర్చుంటే వచ్చినతిప్పేమిటి? (తన బల్లమీదకు వెళ్తాడు) మహా : మొదటినుంచీ ఒకటే మచ్చు. మీకు తోచదు. ఒకరు చెప్తే వినరు. (తన బల్లమీదకు వస్తుంది)

నరు : బాగుంది - కానివ్వండి. అయినా చెప్తాను. మీ హృదయంలో దయా దాక్షిణ్యం అన్నవిలేవండి. (దిగాలుపడి కూర్చుంటాడు)

మహా : అప్పుడే కోపం వచ్చిందా ? అబ్బా! మీవంటిమనుషులతో వేగడమంటే మహా కష్టమండీ... ఔను ఎందుకు కోపం ?

నరు : నేనింక అట్టేకాలం బ్రతకను. ఈ బాధ భరించలేను. - నాగుండె బ్రద్దలైపోతూవుంది- నేను చచ్చిపోతాను.

మహా : మీరుపోతే నేనా ఏమిటిబ్రతుకుతాను? మీరు పోయినతర్వాత నాకేముందిగనుక- నేనూ చచ్చిపోతాను.

నరు : ఆ నాతో ఒకబెంచీవిూదనుంచి మరోబెంచీవిూదకు రాలేరు. - ఒక లోకంనుంచి ఇంకొకలోకానికి వస్తారు. నేనో వెర్రివాణ్నికనుక నాతో ఇన్ని ఆట లాడుతున్నారు.

మహా : ఈకూ సాకూలేని ఈలాటి మనుష్యులకి ఏమిటిచెప్పడం? ఆయెదురుగుండా పొలాల్లో ఎందరు మనుష్యులున్నారో చూశారా ? మనయిద్దరం ఒక్కదగ్గరకూర్చుంటే మేమనుకుంటారు ?

నరు : అంటే నాజీవితానికి ఆమాత్రమదృష్టముకూడా లేదన్నమాట ! ఈజన్మలో ఆ ముచ్చటయినా నాకు రవంతతీరదు. మహా : కొంచెమోపికపడితేసరి; అన్ని ముచ్చటలూ తీరుతవి.

నరు : ఇంకా ఆశవుందీ ?

మహా : ఎందుకుండదూ? మీరుండేవరకూ నేనుండేవరకూ తప్పకుండా వుంటుంది. [తమలపాకులుతీసింది]

నరు : నాకు రెండుచిలకలు చుట్టియివ్వరూ?

మహా : ఇందండి [ఆకూవక్కా ఎత్తి చేతిలో పడేయబోతుంది]

నరు : ఆహాహా ! ఏమిసరాగమండీ! బిచ్చగాడికి విస్తరాకు పడేసినట్లు ఎత్తిఎత్తి మరీ పడేస్తున్నారు. ఆకులూ-చక్కా చుడుతూ మీరొకటికొరికి నాకొకటి యివ్వకూడదటండీ! ఆమాత్రం ముచ్చటైనా తీర్చకూడదా ?

మహా : బాగుంది. ముసలికాలానికి ముచ్చటలనీ - ఆఖరికి మీరింత నిర్భయంగా ఒడితెగిపోయినా రేమిటి? ఆకులు చుట్టి యివ్వడమే! ఇంకా నోటికందించుమన్నారుకారు! అమ్మో! ఎవరైనాచూస్తే ?

నరు : ఇక్కడ ఈగదిలో మీరూ నేనూ తప్ప ఎవ్వరూ లేరాయె ! ఆకులందించినమాత్రంచేత ఏంకొంపమునిగి పోతుంది?

మహా : విూధర్మమాయె – అంతలేసికేకలు పెట్టకండి. ఇవతల పెట్టెలలోనూ మనుషులున్నారు. వినగలరు.

నరు : అవునవును. ఆకొసను డ్రైవరు ఈకొసను గార్డూ వున్నారు. లోకమంతా మన యిద్దరినే, యీనాటికి కలిసే మని, కనిపెట్టుకొని తిరుగుతున్నాది. అక్కరలేదులెండి నాకాకులక్కరలేదు.

మహా : అయితే నేనూ వేసుకోను.

నరు : మీరు వేసుకోకపోతే నామీద వొట్టు. నాకోసం మీ సౌఖ్యమేమీ మీరు చెరచుకోకండి. చెరచుకోరుగాని! ఎదీ నాచేతికివ్వండి, నేను చుట్టియిస్తాను.

మహా : అబ్బా ! వద్దని ఎన్ని మార్లు చెప్పవలె? నే నెందుకు చెప్తున్నానో వినండి. మీరా వూసెత్తకండి. ఇదిగో స్టేషను. అలాగు దిగాలుపడి పండుకొంటారేమిటి ? లెండి భక్తచింతామణి పద్యాలు ప్రారంభించండి. (తమలపాకులు వేసుకొంటుంది)

నరు : (అటే ఆశతో చూస్తూ నిరుత్సాహంగా భక్త చింతామణి పద్యాలు చదువుతాడు.)

మహా : ట్రైన్ కదిలింది లెండి.

నరు : కదిలిందంటె నా గుండెకాయ కదిలిపోతున్నాది - ఇంకేముంది. వచ్చేను ! తర్వాత స్టేషనే వెధవ నిడదవోలు.

మహా : తర్వాతదే తర్వాతదే నిడదవోలు. దొంగముండ స్టేషన్ ఎంత వేగంగా వచ్చేసింది ?

నరు : అయినా యీ డ్రైవరు ముండాకొడుకుల కేమి తొందర? తాపీతరుణం లేదు.

మహా : ఆహా !! ఈ రైలు ఇక్కడ నిల్చిపోకూడదూ! నరు : అదే....... అదే ఈ యింజన్ పేలిపోకూడదు! నే నెలాగుదిగిపోయేది? ఈ రైలు క్రిందపడి చచ్చిపోతాను ?

మహా : అదేమిటది! మీ రాలాగంటే నే నీ రైలులోనుంచి క్రిందకురికి వేస్తాను. ధైర్యం తెచ్చుకోండి.

నరు : మళ్ళీ మనమెప్పుడు కలుస్తామో ?

మహా : ఇప్పుడు కలిసేముకామూ? దేముడి దయవుంటే మళ్ళీ మళ్ళీ కలుస్తూనే వుంటాము?

నరు : ఏమిటి 40 ఏసి ఏళ్ళకొక్కమారా ?

మహా : ఆలాగెందుకనుకోవలె? ఎప్పుడైనా కలియవచ్చును.

నరు : మళ్ళీ మీరెప్పుడు తిరిగి వస్తారో కదా?

మహా : నేను చెప్పను. చెప్తే మళ్ళీ మీ రా ట్రైనుకు వస్తారు. ఇప్పుడు కలిసి వచ్చిందే చాలు చాలు. లోకం నవ్విపోతుంది. మనసులో వున్నంతా పయికి వెళ్ళదియ్య కూడదు.

నరు : పోనీ-నాది 'ఒక్క కోరిక వుంది- ఆఖరుకోరిక చెల్లిస్తారా? చెల్లించరా ?

మహా : ఏమిటండీ ?

నరు : మీతో నేనూ బెజవాడదాకా వస్తాను. దయవుంచండి. ఇక్కడ ఒక్కడనూ దిగిపోలేను ?

మహా : అమ్మో అమ్మో! బెజవాడదాకా రావడమే ! అక్కడికి నన్ను దింపడానికి మా మనుమరాలి మగుడు వస్తాడు. అతడు మనయిద్దరినీ ఒక బండిలో చూస్తే ఏమనుకుంటాడు ?

నరు : పోనీ— ఆ ముందు స్టేషనులో మరోబండిలోకి వెళ్ళి పోతాను.

మహా : ఏమిటండీ విూకింత ఆలోచనలేదు. కొత్తగా ఆ బండీలోకి మీరు వెళ్తే అబండిలోవాళ్ళేమనుకుంటారు ?

నరు : ఆ ముందలి స్టేషనులో దిగిపోతాను సరా?

మహా : మీ రా స్టేషనులో దిగి నేనా ముందు స్టేషన్లోదిగితే యింకేమయినా వుందా ? మీకు వయసయితేవుంది కానీ లోక జ్ఞానం లేదండి.

నరు : అయితే చచ్చినట్లు నేనిక్కడ దిగిపోవలసిందే.

మహా : నా మాటవినండి. ఈమాత్రం జాగ్రత్తగా వుండబట్టే మనం మాట పడలేదు.

నరు : మళ్ళీ మీ సుందరవదనారవింద మెప్పుడు చూస్తాను?

మహా : పర్వాలేదులెండి.

నరు : మీరువ్రాసి ఏ దాసిదాని చేతైనా పోస్టుచేయించవచ్చు. ఒక్క జాబైనావ్రాస్తారా ?

మహా : ఎందుకులేండి నేనూరాయనూ, మీరురాయకండి.

నరు : స్టేషను, వెధవస్టేషను వచ్చేస్తున్నాది. పోనీ నా జ్ఞాపర్థం ఈ వుంగరం వుంచుకోండి. మహా : వద్దు, వద్దు, ఇదెక్కడిదంటె నేనేమిచెప్పేది ?

నరు : పోని మీ ఉంగరం నాకివ్వండి. మీ వారితో పోయిందని సుళువుగా చెప్పవచ్చును.

మహా : దీని మీద నా పేరుందికదా? లోకమంతా గుప్పుమనిపోదూ?

నరు : ప్రతీమాటకూ ఈలాగు అడ్డుచెప్తే ఏందారీ ? పోనీ నా జ్ఞాపకార్థంగా ఈ హేయిర్ డై (Hair Dye) తలరంగు డబ్బీ వుంచుకొండి. ఎంత నెరసిన తల అయినా నల్లగా తుమ్మెదలాగుంటుంది.

మహా : మీరు మహా చెడ్డవారండీ. (పుచ్చుకుంటుంది.)

నరు : మీ జ్ఞాపకార్థం నా కేమైనా యివ్వరూ?

మహా : ఏమిచ్చేది ? ఏమిచ్చినా మీరు వూరంతా గొప్పకొద్దీ చాటుతారేమో అని భయం. పోనీ వుండనివ్వండి-- ఈ పళ్ళపొడిడబ్బా- (ఎత్తిపడవేస్తే క్రిందపడి పౌడరు జల్లి పోతుంది.)

నరు : నేను బ్రాహ్మణే కానీ పంచముణ్ణి కాను. (పౌడరెత్తుకొని దీనిమీద మీపేరు మీచేత్తో వ్రాసియివ్వరూ?

మహా : అమ్మో! మీతోవచ్చిన చిక్కిదే! ఏమీవద్దు అది యిచ్చి వేయండి. నరు : (జేబులో దాచుకొని) ఇది నా యావజ్జీవం నాగుండెల దగ్గరే వుంటుంది. మరి సామాన్లు సర్దుకుంటాను. (సర్దుతూ) ఈ పాడుజన్మలో నేనేమైనా సుఖం పొందిన ఘడియ లుంటే అవి యీనాలుగు ఘడియలే.

మహా : నాకూ అంతే.

నరు : నేను మీకు జ్ఞాపకం ఉంటాను?

మహా : మీకు నేను జ్ఞాపకం ఉంటానూ?

నరు : మీరే నా సౌఖ్యదేవత, అదృష్టదేవత, ఆనందదేవత.

మహా : ఆ అభిమానముంచండి చాలు.

నరు : (సర్దుకొని) ఆ చెయ్యి ఒకమారు యిలాగివ్వరూ? ఒక్కసారి ముద్దులాడుతా ?

మహా : మీకేం మతిపోతున్నదా యేమిటి ?

నరు : బలవంతంగానయినా చెయ్యి ముద్దులాడక తప్పదు.

మహా : అయితే గొలుసు లాగమన్నారా ఏమిటి? కొసను రసాభాసచేస్తూన్నారు.

నరు : బండీ నిల్చింది. దిగుతాను - పోతాను - చస్తాను. దయవుంచండి.

మహా : చిత్తం వెళ్లండి. ఇటు చూడకండి - బాగుండదు.

నరు : (దిగి, కిటికీలోనుంచి తలపెట్టి) ఏదో యీమాత్రం సుఖం కలిగింది. మహా : నేనూ అదే అనుకుంటున్నా - వెళ్ళండి, వెళ్ళండి.

నరు : ప్రేమంటే ఏమిటో యిప్పుడు నాకు తెలిసింది. వెళ్తాను (వెళ్లాడు.)

మహా : వెళ్ళిపోయినారు - వెళ్ళిపోయినారు - నేనూ ఆవలకు గెంతివేద్దునా ? (కప్పుకొని పండుకొంటుంది.)

సమాప్తం