Jump to content

నవ్వు మొగముతో నన్ను

వికీసోర్స్ నుండి

మంగళహారతులు

నవ్వు మొగముతో నన్ను జూచిన

శ్రీరాగము - ఆది తాళం

పల్లవి:
నవ్వు మొగముతో నన్ను జూచిన నాముద్దు సామికి మంగళం ౹౹నవ్వు౹౹

అనుపల్లవి:
పువ్విలుతు పోరున నలసి సొలసి నివ్వటిలుచును నేనిలచిన తరి ౹౹నవ్వు౹౹

చరణం 1:
కడునిక్కి గబ్బిగుబ్బలముడి వీడిన పైరినితో
తడబడిన చిక్కున బడిన చక్కని తారహార నాయక మణితో
విడినీల జలద కరకల కైవడి విరులు జారిన వేణి భరముతో
సడలియోరలకు బెడసిన ముంగర చక్కజేయు దక్షిణ కరముతో
యెడమచేత పావడ చెరుగుబట్టి వడి వడి నే పాన్పు డిగ్గిన తరి ౹౹నవ్వు౹౹

చరణం 2:
కొనగోటి నొక్కులు దేరిన చెక్కుదోయి సోయగముతో
మొనపంటి గంటుల నవసి సొంపులు గుల్కు మోవిరాగముతో
మొనసిన చిరు చెమటల దడసిన ముద్దుమొగమున కస్తురి తిలకముతో
కనకపు టొడ్డాణము పట్టుదప్పి కానవచ్చు నాభి వివరముతో
ఘనసుధాకలశ కలిత హస్తయై తినది వెడలు మోహిని క్రియనున్నతరి. ౹౹నవ్వు౹౹

చరణం 3:
ఆసచే నుపరతి నలసిన కతన నాయాసపుటూరుపు సోకుతో
భాసిల్లు వెన్నెల బయలను సంపంగి పూసురటి విసరుశీకుతో
వాసిగ వల్లూరివాసుడైన గోపాలుజూచు క్రీంగంటి చూపుతో
దాసురామకవి కృత మృదుమధుర గీతము గానముసేయు సొలపుతో
హౌసుగ బంగరు టరుగుల నీరెండగాసినట్లు పిరుదులొప్ప నిలిచిన
నవ్వుమొగముతో నన్ను జూచిన నా ముద్దుసామికి మంగళం ౹౹నవ్వు౹౹