నరసభూపాలీయము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

నరసభూపాలీయము

కావ్యాలంకారసంగ్రహము

గ్రంథాదికృత్యములు



లీలావతి దా నురోమణిసభాసింహాసనత్కౌస్తుభా
వేలాభాప్రతిబింబితాంగి యయిన న్వే ఱొక్కతం దాల్చినాఁ
డౌలే యంచుఁ దలంచునో యన యమందానందుఁడై లక్ష్మి నే
వేళం గౌఁగిటఁ జేర్చుశౌరి నరసోర్వీనాథునిం బ్రోచుతన్.

1


సీ.

ఏలేమ కడలిరాచూలి యౌ టెఱిఁగించుఁ, గలితవళీతరంగములరంగు
ఏమానినీరత్న మిందుసోదరి యౌటఁ, బ్రకటించుమొగముపోలికతెఱంగు
ఏతన్వి కందర్పుమాత యౌ టెఱిఁగించు, గరగృహీతాంభోజకాండకలన
ఏసాధ్వి దనుజారియిల్లా లవుటఁ దెల్పు, వలి వినీలాబ్జజిన్నయనగరిమ


తే.

యట్టి శ్రీదేవి సుకవివాగమృతదంబు, నఖిలభువనోన్నతము నైనయౌబళేంద్ర
నరసవిభుమందిరం బాత్మశరణ మనుచు, నుండి యేకాలమును బాయకుండుఁగాత.

2


చ.

పలుకులకొమ్మనెమ్మొగముఁ బార్వణచంద్రునిఁ గాఁ దలంచి యు
జ్జ్వలనిజభద్రపీఠజలజంబు నిమీలిత మౌనొ యంచు నే
ర్పలవడ భారతీవనిత నాత్మముఖంబులలోనె తాల్పుచుం
జెలఁగువిధాత యోబయనృసింహున కిచ్చుఁ జిరాయురున్నతుల్.

3


సీ.

 ఒకటి యక్షరవిలాసోల్లాసమున మించ, నొకటి తాళప్రౌఢి నుల్లసిల్ల
నొక్కటి నారికేళోన్నతిఁ దాల్ప నొ, క్కటి గోస్తనీగుచ్ఛకలనఁ దనర
నొకటి సువృత్తభావోన్మేష మొంద నొ, క్కటి పల్లకీతుంబికలనఁ జెలఁగ
నొకటి భారవిశేషయుక్తిఁ బెం పొంద నొ, క్కటి గిరీశమతానుకారి గాఁగ


తే.

నసమసాహిత్యసంగీతరసము లనెడు, గుబ్బపాలిండ్లు దాల్చుపల్కులవెలంది
సరసగుణహారు నోబయనరసధీరు, నవ్యకృతనాయకునిఁ గా నొనర్చుఁగాత.

4


శా.

 గంగం దాల్చితి వుత్తమాంగముననన్ గైకోలు గావించి త
ర్ధాంగీకారమునం బురంధ్రి నిను వామాంగంబునం దాల్పనే

శృంగారోన్నతిఁ జూడు మంచు గిరిజ న్శీర్షాపగాబింబిత
స్వాంగానందితఁ జేయుశంభుఁడు నసింహాధీశ్వరుం బ్రోవుతన్.

5


చ.

అరుదుగ వామభాగలలనాకలనాచలనాత్ముఁడైన యా
హరుగురుఁగాంచి తానును దదాకృతియౌగతి నేకదంతుఁడై
కరికరిణీగుణంబులు మొగంబునఁ దాల్చి జగంబు లేలు నాం
తరకరుణాసనాథు గణనాథు మరుద్గణనాథుఁ గొల్చెదన్.

6


సీ.

తనయాస్యగహ్వరంబునకు ఖద్యోతజృం, భణము ఖద్యోతజృంభణము గాఁగ
దనకరాంభోజాతమున కలగంధమా, దన మొకగంధమాదనము గాఁగఁ
దనశౌర్యరహర్యక్షమునకు మైరావణ, స్ఫురణ మైరావణస్ఫురణ గాఁగఁ
దనవాలదంభోళి కెనయు కర్బురగోత్ర, గరిమ కర్బురగోత్రగరిమ గాఁగ


తే.

నఱలు రామానుజన్మజీవప్రదాన, ధుర్యపర్యాయధాత మేదురవిరోధి
బలపయోధివిలంఘనప్రబలశక్తి, యోబయనృసింహభూభర్త కొసగుఁగాత.

7


సీ.

ఎవ్వాఁడు మొదలఁ దా నిలకు భారతి డించెఁ, దగ భగీరథుఁ డభ్రతటినిఁ బోలె
భ్రమరకీటన్యాయభాతి నేకవిరాజు, వాగ్దేవి దాన యై వన్నె కెక్కె
వారవృత్తములు మాని వాణి యెవ్వానికై, వలచి నానాశ్లేషములకుఁ జిక్కె
నెవ్వానివాఙ్మాత్ర మినుని ధాత్రికిఁ దెచ్చి, పేర్మితోఁ గరము లర్పించుకొనియె


తే.

నట్టిమహిమాధికులఁ గొల్చి యఖిలమునివ
చోనుపమశక్తిధృతపురాణార్థవితతు
లనుఁగుఁదెనుఁ గనుభవ్యదివ్యాంజనమునఁ
గనుఁగొనఁగఁ జేయునంధ్రసత్కవులఁ దలఁచి.

8


సీ.

ఏమహాత్ములు గల్గ భూమీశసభలలోఁ, గవులకు నధికవిఖ్యాతి గల్గె
నేకృతార్థులు గల్గ నెల్లపామరులకు, గణన మీరుప్రబంధకములు గల్గె
నేవాఙ్నిధులు గల్గ నిరవొందురసికుల, కమితలీలావినోదములు గల్గె
నేప్రవీణుల గల్గ నిల నలంకృతికృతో, ద్యములకు దోషలక్ష్యములు గల్గె


తే.

నేదయాళులు బుధవచోహేతిచకిత, విసరదపశబ్దభరణలాలసముఖాబ్జు
లట్టి నిఖిలోపకారధీరాత్ములయిన, సకలకవిధూర్వహులకు నంజలి యొనర్తు.

9


వ.

ఇవ్విధంబునఁ బ్రారీప్సితగ్రంథనిర్విఘ్నపరిసమాప్తిసంప్రదాయావిచ్ఛేదలక్షణ
నిబంధనంబు గా నిఖిలాభీష్టదేవతానమస్కరణంబును, సుకవిబహూకరణంబును,
గుకవినిరాకరణంబును గావించి, యుదంచితవిరించిసంచితప్రపంచచరదభంగ
బుధపుంగవహృదయంగమంబును, గంభీరరససముజ్జృంభితకవితాంభోధితరణ
కరణప్రగుణోపకరణపరిణతతరణిప్రకాండంబు, నశేషగుణదోషవిశేషదుర్వారనీర

క్షీరవివేచనోచితప్రశంసితహంసాయమానప్రతిమానబంధంబు నగు నొక్క
ప్రబంధంబు నివర్తింపఁ బూనియున్నసమయంబున.

10


సీ.

లలితాకలంకకలాకలాపంబున, నేరాజు రేరాజు నేవగించి
భూభారభరణలీలాభిముఖ్యంబున, నేమేటి తామేటి నెగ్గులాడుఁ
జతురభాషామనీషావిశేషావాస్తి, నేభోగి యాభోగి నీసడించు
శరణాగతగణాతిభరణాధికగుణాప్తి, నేశౌరి యాశౌరి నేపు సూపు


తే.

నతఁడు రిపురాడఖర్వగర్వాంధకార, గంధనిర్గంధనాంభోజబంధుబంధు
బంధురావార్యశౌర్యధురంధరుండు, సరసగుణహారుఁ డోబయనరసవిభుఁడు.

11


వ.

వెండియు బ్రచండభుజాదండతాండవమండలాగ్రఖండితారాతిమండలుండును
నఖండనవఖండపృథ్వీమండలధురాధరణపరాభూతఖండపరశుకుండలుండును
నజాండకరండపిచండిలయశఃపూరకర్పూరహారుండును సరస్వతీమనోభండార
చౌర్యకారుండును సమరసమయసముజ్జృంభితజంభారిదోస్స్తంభసముత్తరభీత
దంభోళిధారావిదారితమహాభీలశైలాళివిసాలరవకోలాహలలీలాహళహళికా
సమారంభసుభగంభావుగంభీరవిజయభేరీభయంకరభాంకారసంకలసముట్టంకిత
దిగ్విటకుండును నక్షుద్రతరసురక్షోభకరమదోన్మత్తరక్షోన్నతరక్షోవరక్షోవి
క్షోదవిచక్షణాక్షీణనృహర్యక్షరూక్షవీక్షణీభవదాశుశుక్షణిక్షణసముత్క్షిప్తకీలా
కరాళావిచ్ఛిన్నాచ్ఛచ్ఛాయాచ్ఛటాపటిమఘటనచటులప్రతాపవైభవుండును
నుభయగండగండభేరుండాదిబిరుదామందసందీపితప్రాభవుండును నసాధారణ
మేధావిదారితవేధోమేధోపబోధనిర్నిరోధమధురమధురసావధీరణసమగ్ర
వాగ్గ్రధనధనసుధీజనగృహద్వారనిర్నిద్రభద్రవారణఘటావికటకటకటా
హతటపతదనూనదానాంభోఝరీపరిమళపరిలబ్ధిలుబ్ధలబ్ధామోదమధురభృంగీ
తరంగితభంగీప్రసంగతప్రసంగాంగీకృతనిరంతరదిగంతరవిశ్రాంతవిశ్రా
ణనజయానకుండును గుశికసుతకులజలధిజైవాతృకుండును నానావిధఖానాధిక
సేనాంబువిధానానుపమానాహవమానామితామోఘవైఖరీపరీతబరీదసపాద
సప్తాంగహరుండును భోజరాజవంశసంభవుండును లక్కాంబాగర్భపావనుండును
జరమభాగవతసంభావనుండును నోబభూపాలపుత్త్రవరుండును గడిదుర్గస్థాపనా
చార్యుండును సత్యభాషాహరిశ్చంద్రుండును నగునృసింహక్షితీంత్రుం డొక్క
నాఁడు రుచిరరుచిశుచితావిశేషదూషితోషర్బుధులు బుధులు సరస్వతీప్రవాహ
సంతతవిహరమాణమహాకవులు కవు లజిహ్మజిహ్వారంగనృత్యదుత్తుంగగైర్వాణ
వాణీప్రాకృతశౌరసేన్యపభ్రంశపైశాచికామాగధులు మాగధులు నటనజితమహా
నటులు వరయౌవనసౌందర్యవసతులు సతులు నయవినయసౌజన్యులు రాజన్యు
లవధీరితసురరాజమంత్రులు మంత్రులు ప్రబలబలోద్భటులు భటులు పురోహి

తులు హితులు పౌరాణికులు వైణికులు గాయకులు గణికులు నాదిగాఁ గల నిఖిల
నియోగిజనంబులు బలసి కొలువ మణిమయాస్థానమధ్యభద్రాసనంబున సుధర్మాసీ
నుం డగుశునాసీరుచందంబున నందంబుగాఁ గొలువుండి యప్పుడు.

12


సీ.

శతలేఖినీపద్యసంధానధౌరేయు, ఘటికాశతగ్రంథకరణధుర్యు
నాశుప్రబంధబంధాభిజ్ఞు నోష్ఠ్యన, రోష్ఠ్యజ్ఞు నచలజిహ్వాక్తినిపుణుఁ
దత్సమభాషావితానజ్ఞు బహుపద్య, సాధితవ్యస్తాక్షరీధురీణు
నేకసంధోచితశ్లోకభాషాకృత్య, చతురు నోష్ఠ్యనిరోష్ఠ్యసంకరజ్ఞు


తే.

నమితయమకాశుధీప్రబంధాంకసింగ, రాజసుతతిమ్మరాజపుత్త్రప్రసిద్ధ
నరసవేంకటరాయభూషణసుపుత్త్రు, నను బుధవిధేయు శుభమూర్తినామధేయు.

13


క.

కనుఁగొని దయామరందము, కనుఁదమ్ములఁ గ్రమ్మ నుచితగౌరవలీలా
ఘనతరగభీరభాషల, ననియె న్నరసింహుఁ డభినవానందముతోన్.

14


సీ.

బాణు వేగంబును, భవభూతి సుకుమార,తయు, మాఘు శైత్యంబు, దండి సమత,
యల మయూరు సువర్ణకలన, చోరుని యర్థ, సంగ్రహమ్ము, మురారి శయ్యనేర్పు,
సోము ప్రసాదంబు, సోమయాజుల నియ, మంబు, భాస్కరుని సన్మార్గఘటన,
శ్రీనాథుని పదప్రసిద్ధ ధారాశుద్ధి, యమరేశ్వరుని సహస్రముఖదృష్టి,


గీ.

నీక కల దటుగాన ననేకవదన, సదనసంచారఖేదంబు సడలుపఱిచి
భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె, మూర్తికవిచంద్ర విఖ్యాతకీర్తిసాంద్ర.

15


ఉ.

కావున నీయుదగ్ర మతిగౌరవయోగ్యనిరూపణంబుగా
నీ నొనరింపఁ బూనిన యనేకమహాకవివాఙ్మోపకా
రావహ మైనకావ్యము మదంకితమై వెలయంగఁజేయు ము
ర్వీవలయప్రసిద్ధబుధవిస్మయదానధురంధరంబుగన్.

16


వ.

అని సబహుమానంబుగాఁ గర్పూరతాంబూలజాంబూనదాంబరాభరణచ్ఛత్రచా
మరాందోళికాచతురంతయానాగ్రహారాదిప్రదానంబుల బహూకరించుటయు
నేను నానందకందళితతరంగితాంతరంగుండనై.

17


సీ.

నిజరూపమునకు వన్నియ దెచ్చు వేఱొక్క, బెళుకొందు ధ్వని హీరకళిక లమర
ఛాయాంతరాలక్ష్యసహజతేజము లైన, లక్షణవైదూర్యలక్ష లలర
రతులతోఁ దులఁదూగు రమణీయరసవిశే,షములను గారుత్మతములు మెఱయ
గురుసువర్ణగుణైకగుంభితస్థితిఁ దాల్చు, నాయకనాయకోన్నతులు సెలఁగ


తే.

నిల నలంకారనికరంబు లిరవుకొలిపి, కమలభవగేహినీపరిష్కరణకరణ
యోగ్యములుగా నొనర్చినభాగ్యనిధుల, భామహాదుల ననిశంబు ప్రస్తుతించి.

18

క.

వారిప్రసాదమున నలం, కారము ధ్వని లక్షణాధికారరసాలం
కారము నొనర్చు నాంధ్రవ, చోరచనచమత్క్రియాభిశోభితమతినై.

19


తే.

 అసదృశరసప్రధానశబ్దార్థములును, రీతులును వృత్తులును నలంకృతులు గుణము
లాది యగులక్షణంబుల నలరుఁ గావ్య, సరణియందు రలంకారసారవిదులు.

20


క.

ఈకావ్యలక్షణంబు ల, నేకులు దొల్లింటిపెద్ద లేర్పఱిచిన సు
శ్లోకనృపచరితనుతి దీ, క్షాకలనయు నభినవాంధ్రకవితము నగుటన్.

21


వ.

ఏతత్ప్రబంధబధురావ్యాజకావ్యాలాపలక్షణకృతక్షణప్రసంగసంగ్రహణ
నిర్వహణకృత్యంబున నిత్యంబు నత్యంతకృతావసరుండనై.

22


క.

బంధురతరప్రబంధుల, బంధముల కనంతకీర్తిభాగ్యప్రదధౌ
రంధర్యగ్రంథిలము వ, సుంధర ననవద్యరమణసుగుణస్తనముల్.

23


సీ.

రామాయణాదికగ్రంథంబు లనవద్య, నేతృవర్ణనల వన్నియకు నెక్కె
వైశేషికాదినానాశాస్త్రములు శివ, ప్రతిపాదనమున సన్నుతి వహించె
సంధ్యాదిమంత్రము ల్శశ్వదీశ్వరనామ, జపసాధనత ననశ్వరము లయ్యెఁ
బలుకు లొండొంటికిఁ బ్రామిన్కులును బర, బ్రహ్మగోచరముల ప్రణుతిఁ గాంచె


తే.

 ననినఁ గావ్యం బమేయనాయకవికస్వ,రస్వరూపనిరూపణభ్రాజి యగుట
నేర వివరింప నేల బంగారమునకుఁ, జటులసౌరభ్యలహరి యబ్బుటయు కాదె.

24


శా.

వేదంబుల్ నృపశాసనంబులు సుహృద్విజ్ఞాపనంబు ల్పురా
ణాదిగ్రంథము లంగనాజనవిలాసాలాపలీలాసమ
ప్రాదుర్బావము లౌర కావ్యములు కర్తవ్యోపదేశక్రియా
వాదప్రక్రియ లెన్నఁ గావ్యమహిమ ల్వర్ణింపఁగా శక్యమే.

25


మ.

పరమజ్ఞానలతాలవాలము జగత్ప్రఖ్యాతవిఖ్యాతసా
గరచంద్రోదయ మిష్టసంఘటనరేఖాదివ్యధేనూత్తమం
బురుకార్పణ్యదశానిశాదినముఖం బుద్వేలనిర్వాణభ
వ్యరసాస్వాదరసాయనం బనినఁ గావ్యం బెన్న సామాన్యమే.

26


క.

కావున నేవంవిధసుగు, ణావాసం బైన కావ్య మలరును నవర
త్నావేలహారవల్లిక, కైవడి ననవద్యనాయకభ్రాజితమై.

27


మ.

అని యూహించి మదీయసంఘటిత కావ్యాలంకారసంగ్రహం
బనఘంబై వెలుఁ గొందకున్నె రవివంశాధీశ్వరుండౌ నృసిం
హనృపాలాగ్రణికీర్తివర్ణనముచే నాశాంతవిశ్రాంతపా
వనమౌఁ గావున నందు నాయకమహావంశంబు వర్ణించెదన్.

28

నాయకవంశవర్ణనము

సీ.

శ్రీమించు పద్మినీభామామణి కినుండు, నిరతసంసారవార్నిధికిఁ దరణి
త్రిజగతీసజ్జనశ్రేణికి మిత్త్రుండు, బహుమతోవనికి విభావసుండు
సమదమందేహదేహములకుఁ దపనుండు, చతురాగమార్థసంతతికి సవిత
సకలచోరపరంపరకు సహస్రకరుండు, వినతలోకవితానమునకు ద్యుమణి


తే.

హరిహరవిరించిముఖదేవతానుభావ, ఘనతస్వర్ణకారు లొక్కటియ కాఁగఁ
గరఁగి కూర్చిన యపరంజికడ్డి యనఁగ, సూర్యుఁ డిరవొందుఁ దేజోనివార్యుఁ డగుచు.

29


క.

అతనికి వైవస్వతమను, వతనికి నిక్ష్వాకునృపతి యతనికిఁ గుక్షి
క్షితిపతి యతఁడు వికుక్షిం, బ్రతాపఖనిఁ గనియె నతఁడు బాణునిఁ గనియెన్.

30


సీ.

అనరణ్యుఁ డతని కాయ నఘుఁడు పృథుఁ గాంచెఁ, బృథుఁడు త్రిశంకుధాత్రీంద్రు గనియె
నతనికి దుంధుమారాభిఖ్యుఁ డతనికి, మాంధాత యతఁడు సుసంధిఁ గాంచె
నతనికి ధ్రువసంధి యతనికి భరతుఁ డా, ధన్యున కసితుఁ డాతనికి సగరుఁ
డతనికి నసమంజుఁ డతఁ డంశుమంతునిఁ, దిలీపుఁ డాతని సుపుత్త్రుఁ


తే.

డతఁడు గాంచె భగీరథు నాత్మవంశ, పావనుని నాతనికిఁ గకుత్స్థావనీశుఁ
డతఁ డురముఁ గాంచెఁ గనియె నాక్షితితలైక, పతి సునాభాగు నతఁడు నాభాగు గాంచె.

31


చ.

అతనికి నంబరీషుఁ డయుతాయువు తత్సుతుఁ డవ్వసుంధరా
పతి గనియ న్మహాత్ము ఋతుపర్ణు నతండును సత్యకాము నా
తత బలుఁగాంచె నాతఁడు సుదాసునిఁ గాంచెఁ దదీయుఁ డస్తికుం
డతనికి మూలకుం డతని కాశితసంఖ్యరథుండు వెండియున్.

32


క.

ఘనుఁ డతఁ డైలబిలేంద్రుని, గనియెం బృథుధర్మవిభునిఁ గనియె నతఁ డతం
డును విశ్వమహునిఁ గనియెం, గనియె నఖట్వాంగు నతఁడు గాంభీర్యనిధిన్.

33


సీ.

భవ్యుఁ డాతఁడు దీర్ఘబాహునిఁ గనియె నా, తఁడు గాంచె రఘువు నాతనికిఁ గలిగెఁ
బురుషాదుఁ డతనికిఁ బొడమెఁ గల్మాషపా, దుఁడు తత్సుతుఁడు శంఖనుఁడు సుదర్శ
నుఁడు దత్తనూజుఁ డాతఁడు గాంచె నగ్నిప, ర్ణమహీశు నతఁడు శీఘ్రగునిఁ బడసె
నతనికి మరుఁడు దదాత్మజుఁడు శుకుఁ డా, తని కంబరీషుఁ డాతనికి నహుషుఁ


తే.

డతనికి యయాతి నాబాగుఁ డతని కతని, కజుండు దశరథుఁ డతనికి నతని కొదవె
రామభద్రుఁడు దద్వంశరత్న మయ్యె, సొరిది గలివేళఁ గలికాలచోళవిభుఁడు.

34


సీ.

ఏరాజు వివిధపుష్పారాధనమున గం, గాధరునితలమీఁది కౌచు మానె
నేరాజు దివ్యాన్నసారార్పణంబున, శితికంఠు మెడ నున్న చేఁదు మానె

నేరాజురత్నోపహారానుభవభూతి, రుద్రునెమ్ములదండరోఁతి మానె
నేరాజుకాంతనాగారారచనకేళి, భవునకు గిరు లెక్కుపాటు మానె
తే. జలధి దేవేరిఁ గావేరి జనులు సూడ, కుండ నాచ్ఛాదన మొనర్చునొఱపు మెఱయ
నుభయతటములఁ దరుపఙ్క్తు లునిచె నేనృ, పాలుఁ డతఁ డొప్పుఁ గలికాలచోళవిభుఁడు.

35


చ.

అతఁడు మహాదిగంతవిజయం బొనరించి సురాద్రియౌల ను
న్నతనిజమీనలాంఛన మొనర్చుటకై గిరిరాజుఁ ద్రిప్ప న
ప్రతిమతదీయదోర్యుగభరభ్రమితాచలశృంగసంగతా
మితజనరూఢి నేఁడును భ్రమించుఁ దదగ్రగతిన్ గ్రహావళుల్.

36


తే.

శ్రీలఁ జెలువొందు నాకలికాలచోళ, కుంభినినాథుకులమున సంభవించె
ఘనఖనిక్షోణిరత్నంబు గలుగురీతి, భోగసౌభాగ్యసురరాజు పోచిరాజు.

37


సీ.

తనకీర్తికబరవాహిని యీడుగామికి, నమ్మహానదితోడియమున సాక్షి
తనప్రతాపస్ఫూర్తి కినువేఁడి సరిగామి, కతనిబింబము దూఱునరులు సాక్షి
తనధైర్యమహిమకుఁ గనకాద్రి ప్రతిగామి, కచటఁ గాఁపున్నగోత్రాల సాక్షి
తనకాంతికి మృగాంకుఁ డెనగామి కతనితో, సరిపొత్తు మనుకర్మసాక్షి సాక్షి


తే.

గాఁగ విలసిల్లు ననుపమక్షాత్త్రధర్మ, పరత నృపపఙ్క్తి కితఁ డోజబంతి యనఁగ
రాజమృగరాజు వైభవరాజరాజు, భూరిసౌందర్యరతిరాజు పోచిరాజు.

38


క.

ఆపోచిరాజువంశసు, ధాపారావారమునకుఁ దారాపతియై
యే పొందుఁ దిరుమలక్షో, ణీపాలుఁ డనంతకీర్తినిత్యోజ్జ్వలుఁడై.

39


సీ.

రక్షించినాఁడు హిరణ్యధారావృష్టిఁ, జతురార్థిసంఘాతచాతకముల
శిక్షించినాఁ డుగ్రకౌక్షేయపవిధారఁ, బ్రతిపక్షగిరిలక్షపక్షగరిమ
వీక్షించినాఁడు సద్విభవావహవివాహ, సదనంబుఁ గదనంబు సరియకాఁగఁ
బ్రోక్షించినాఁడు సంపూర్ణదయాధార, వితతావదాతపావృతులమీఁద


తే.

నతఁడు రాజన్యమాత్రుఁడు యపరశిఖరి, చరమగహ్వరబంహిష్టజరఠతిమిర
పటలపాటనపటుమహాభాస్వరుండు, రాజకులహేళి తిరుమలరాయమౌళి.

40


క.

ఈరాజశిఖామణికిన్, ధీరాత్ములు తనయు లైరి తిప్పువిభుఁడు గం
భీరరుణాంభోరాశి య, పారకృపమూర్తి వల్లభక్షితిపతియున్.

41


వ.

అందగ్రజుండు.

42


సీ.

తనజయధ్వజమారుతములు వైరికిరీట, ఖచితసన్మణిదీపకళల మలుపఁ
దనశిలీముఖము లుద్ధతవిరోధిశిరోధి, జలశోణితరసాసవము లానఁ
దనతేజము లరాతిధరణీశమదవతీ, కబరికానిబిడాంధకార మడఁప
దనవాహినీప్రౌఢిదర్పితప్రతికూల, భూమిభృన్మదభేదమునఁ దలిర్ప

తే.

నాజి మాంధాత యనఁ బొల్చు రసికలోక, సతతసంరక్షణాస్తోకజాగరూక
నవనవానందహృల్లగ్ననందగోప, బాలకుం డైనతిప్పభూపాలకుండు.

43


తే.

ఆతడు రామప్రభుని బానెమాంబయందు, నౌబళేంద్రుని లక్కాంబయందుఁ గనియె
జలజనయనుండు రుక్తిణీజాంబవతుల, యందుఁ బ్రద్యుమ్న సాంబుల నందినట్లు.

44


క.

వారలలోన ధురంధరుఁ, డై రానునృపాలుఁ డమరు నమరపురంధ్రీ
చారుకరగ్రహలీలా, కారణదోరగ్రకుటిలకౌక్షేయకుఁ డై.

45


చ.

హరిభజనప్రవీణుఁ డగునాధరణీంద్రుఁడు బైచమాంబికం
బరిణయమై తనూభవులఁ బ్రాజ్ఞులఁ దిమ్మనృపాలు నోబభూ
వరు వరదేంద్రుఁ దిప్పమహిల్లభుఁ బానెమరాజు వేంకటే
శ్వరు నిలఁ చక్రవర్తిసదృశప్రథితాతులఁ గాంచె నార్వురన్.

46


చ.

అరయఁగ నమ్మహీవరుల కగ్రజుఁ డైతగు తిమ్మరాజు ని
ర్భరతరఛాటికాతురగపాటనమూర్ఛిత యౌ ధరాతలో
దరికి నిరామయౌషవిధానము నిర్జరవైద్యు వేఁడఁగా
నరిగెడులీల నద్భుతసమగ్రరజోవ్రజ మేఁగు నింగికిన్.

47


క.

ధర నతఁడు రామనృపసో, దరి యగు కొండాంబయందుఁ దనయుని గాంచెన్
వరనుతు నెర వేంకటనిభు, హరిసిరియం దతనుఁ గన్నయాకృతి దోఁపన్.

48


సీ.

మిత్త్రగేహముల నమిత్త్రగేహములఁ, గనకసంఘాత మేవిభుఁడు నిల్పె
ధరాగమమున సద్ధర్మాగమమున ని, ర్భగుణారోప మేరా జొనర్చె
విగ్రహంబున భీమవిగ్రహంబున మహా, విషమాంబకత్వ మేవిభుఁడు దాల్చెఁ
గృతులయందు నిఖిలాకృతులయందును రాగ, భరితవీక్షణ మేనృపాలుఁ డునిచె


తే.

జగతి నే రాజు కువలయోత్సవ మొనర్చు, రాజు గావున నటు స్వీయరక్షచేతఁ
గోరి యన్వర్ణ మగుచంద్రగుప్తదుర్గ, మతఁడు విలసిల్లు వేంకటక్షితివరుండు.

49


తే.

అతఁడు తిమ్మాంబయందుఁ దిమ్మావనీశుఁ, జిన్నతిమ్మప్రభునిఁ గాంచె సీతయందు
రవికులోద్దారకుండైన రాఘవుండు, గరిమఁ గుశలవవీరులఁ గన్న కరణి.

50


క.

ఈ సంతతిఁ దగు తిమ్మ, క్షాసుత్రామునకుఁ గూర్మి సహజన్ముఁ డనన్
భాసిల్లు నోబనృపతి శు, నాసీరమహీజవితరణగుణాస్పదుఁ డై.

51


చ.

సరసనఖప్రసూనభుజశాఖలఁ జెంది వచోమరందమా
ధురిఁ జెలు వొంది కీర్తి యనుతోరపువాసనఁ బొంది సొంపునం
బరఁగుదళంబులం బ్రబలి పండితకీరపరంపరాఫల
స్ఫురణ మొసంగు నోబనృపపుంగవుఁ డాశ్రితపారిజాత మై.

52

ఉ.

భూనుతశౌర్యుఁ డోబనృపపుంగవుఁ డుగ్రరణోర్విభీమబా
హానిశితాసిధార నవతాహితకోటియుదన్తహస్తము
ల్పూని హరింపఁ దద్గళితభూరిసమున్నతఖడ్గము ల్పర
స్థానము చేసిన ట్లమరు సారెకు వారికి నూర్థ్వయాత్రకున్.

53


క.

అతఁ డోబళాంబయం ద, ప్రతిముని నోభనృపాలు రామమహీశున్
క్షితి గాంచె విద్యయం ద,ద్భుతధీనిధి వినయబోధములఁ గాంచుగతిన్.

54


క.

తదనుజుఁడు వరదభూపతి, సుదతీమకరాంకుఁ డమరు సురపురవనితా
విదితవరదానచాతురి, గదిసిన యాత్మీయనామకము సార్థముగన్.

55


వ.

తత్క్రమంబున.

56


సీ.

అవనినభోంతరం బాస్యరంధ్రము గాఁగ, ఘనపంక్తిమోము పైకప్పు గాఁగ
హిమశైలవింధ్యశైలములు కొమ్ములు గాఁగఁ, బూర్ణచంద్రుండు మూఁపురము గాఁగ
శరధులు నాలుగు గొరిజపట్టులు గాఁగ, నైలింపనది గంగడోలు గాఁగ
వాసుకి యాభీలవాలదండము గాఁగఁ, దారకల్ కింకిణీతతులు గాఁగ


తే.

గరిమఁ జెన్నొందు బసవశంకరమహాంక, మాజి నేరాజశేఖరుం డావహించె
నతఁడు నిలువెల్ల మగఁటిమి యనఁగఁ బరఁగు, రామవిభుతిప్పశౌరి నిర్వారితారి.

57


సీ.

బలధూతధూళిచేఁ బందిళ్లు సమకట్టి, యహితరక్తము కలయంపి చల్లి
వనయశోరుచివితాననితానములు గట్టి, వివిధవాద్యధ్వను ల్వెలయఁ జేసి
విమతాస్థిపటలచూర్ణముల ముగ్గులు పెట్టి, ద్విజపరంపరలకు విం దొనర్చి
దళితారికుంభిముక్తాఫలంబులనేస, చల్లి ప్రతాపాగ్ని సాక్షి గాఁగ


తే.

మెఱయు నేరాజు విజయలక్ష్మీవివాహ, విదితసన్నాహుఁడై యతఁ డదురుగుండె
పిఱికికండయు లేనిగభీరఘోర, రణజయోత్సాహి పానెమరామవిభుఁడు.

58


చ.

అతని సహోదరుండు చతురంబుధివేష్టితభూధురంధరుం
డతులితశౌర్యభీకరభుజాగ్రుఁడు వేంకటరాజు వొల్చు నా
క్షితిపతి దానవాసనల ఖేచరశాఖిఁ దిరస్కరింపఁగా
వితతతదీయదుర్యశము విస్ఫుట మౌ నలిమండలాకృతిన్.

59


క.

ఈవంశకర్త యగుతి, ప్పాననిపాలునకుఁ గూరియనుజన్ముఁడు దా
నై వెలయు న్వల్లభధా, త్రీవల్లభుఁ డఖలరాజతేజోనిధియై.

60


సీ.

కమలాప్త కమలాప్త కమలాప్తసన్నిభుం, డేవిభుండు రుచి ప్రభావ దయల
గోరాజ గోరాజ గోరాజసంకాశుఁ, డేరాజు మతి భోగ గౌరవముల
హరిపుత్త్ర, హరిపుత్త్ర హరిపుత్త్ర సదృశుఁ డే, ధన్యుండు జయరూప దాసవిధుల
నాగారి నాగారి నాగారికల్పుఁ డే, మేటి ప్రాభవ వేగ పాటవముల

తే.

నతఁడు సువిచారుఁ డవికారుఁ డనఘుఁ డలఘుఁ, డప్రమేయుఁ డజయ్యుఁ డతి ప్రతాపుఁ
డప్రతీపుఁ డనేకలోకాభివంద్యచరితుఁ డింపొందు వల్లభక్ష్మావరుండు.

61


ఉ.

వల్లభరాజశౌర్యగుణవైభవ మెన్న విచిత్ర మమ్మహీ
వల్లభువైరిరాజి వనవాటికనుండి నిజాంబుజాస్య త
న్వల్లభ యంచుఁ బిల్వఁగ నవార్యతదుజ్జ్వలనామసంస్మృతిం
బెల్లు వడంకుఁ గాంతపయిప్రేమము గొంతనెపంబు సేయుచున్.

62


క.

అతులప్రతాపుఁ డాభూ, పతి ప్రోల్దేవేరియందుఁ బ్రబలునిఁ దిమ్మ
క్షితిపాలునిఁ గాంచెం బశు, పతి పార్వతియందు గుహునిఁ బడసినభంగిన్.

63


సీ.

భోగి మట్టినవానిఁ భోగి జుట్టినవాని, భోగిఁ బట్టినవానిఁ బోలనేర్చుఁ
దమ్మిఁ దాల్చినవానిఁ తమ్మి దొల్చినవానిఁ, దమ్మి మొల్చినవానిఁ దారసించు
మృగము నుంచినవాని మృగముఁ ద్రుంచినవాని, మృగముఁ బొంచినవాని మీఱజాలుఁ
గొండ నొక్కినవానిఁ గొండఁ జెక్కినవానిఁ,గొండఁ గ్రుక్కినవానిఁ గొదవ సేయు


తే.

భరణభూతిజవప్రభాబాహుశక్తి, మతికళాశౌర్యసత్యశుంభత్ప్రభావ
భోగగాంభీర్యగుణములఁ బుడమి నేనృ, పాలకులు సాటి యాతిమ్మపార్థివునకు.

64


తే.

అతఁడు గంగాంబయం దౌబళావనీంద్రు,మూర్తిఘను సింగనిభుఁ గాంచెఁ గీర్తినిధుల
నత్రి యనసూయయందు మున్నబ్జగర్భ, కమలనాథకపర్దులఁ గన్నయట్లు.

65


ఉ.

వారలలో గభీరగుణవారిధి వారిధిపంక్తిలో సుధా
వారధి వోలె భూమిధనవర్గములోఁ గనకాద్రి వోలె దో
స్సారము బీరముం దెగువ సత్యము శౌచము సద్విచార మా
చారము గల్గి పొల్చె బుధసన్నుతుఁ డౌబళరాజు ధన్యుఁ డై.

66


సీ.

అప్పుపా లైనశుభ్రాబ్జంబు రుచి యెంత, మాటమోచినయంచతేట యెంత
నీళ్లు మోచినభవానీభర్తకలి మెంత, బిలము దూఱిన శేషుబలిమి యెంత
తమ్ములతోఁ బోరుతారేశుకళ యెంత, తృణ మైనశరపుంజదీర్తి యెంత
పండ్లిగిలించుకల్పకశాఖిదళ మెంత, విరిసినమల్లెలవీఁక యెంత


తే.

యనుచుఁ దనగీర్తి ధవళాబ్జహంసమదన, మధనవరభోగివిధుశరామర్త్యవిటపి
వికచవిచికిలమాలికావితతిఁ దెగడ, వసుధఁ బాలించు నోబభూవల్లభుండు.

67


సీ.

ఇతనివైరులు వనప్రతతిలోఁ గాఁ పుండ, నన్వర్థ యై ధాత్రి యవని యయ్యె
నితఁ డంతరీపంబు లేల ముద్రాసమున్నిద్రుఁడై జలధి సముద్రుఁ డయ్యె
నితనియాలము చూచి యెల్లవేల్పులు నిమే, షము మాన ననిమేష సంజ్ఞఁ గనిరి
యితనిసేనాధూళి హిమసేతువులు గప్ప, గౌరీశుఁ డపు డంధకారి యయ్యె

తే.

నితనికరుణాంబురాశిసంభృతతరంగ, సంగతం బైనమనమున సంచరించి
శౌరి నారాయణుం డయ్యె జగతి ననుచు, సుకవులు నుతింతు రౌబళక్షోణివిభుని.

68


వ.

తత్క్రమంబున.

69


సీ.

చతురాననాధికశ్రుతిహితశీలుఁడై, విబుధాన్నదానప్రవీణుఁ డగుచు
వసుమతీభారధూర్వహుఁడై నృసింహతా, భ్రాజియై బలిశిరోరత్న మగుచు
నర్జునకరగర్వహరణసత్కీర్తియై, యతనుశాత్రవధర్మహారి యగుచుఁ
గామపాలాఖ్యుఁడై గరిమసర్వజ్ఞుఁడై, నరవరోచిత మైననడత యెఱిఁగి


తే.

శౌరి బహురూపవిహరణశ్రమముఁ జెంద, లేక యన్నిగుణంబులు నేకమూర్తి
యంచు నిరవొందఁ జేసినయట్లు వొల్చు, మూ క్తినిర్జితరతిరాజు మూర్తిరాజు.

70


చ.

చిరతరకీర్తి మూ ర్తినృపశేఖరుఁ డాహవదుర్మదారిభూ
పరులఁ గరాగ్రలోలకరవాలముఖమ్మున గ్రుచ్చి యెత్తుఁ ద
ద్వరశరణాభిలాషయుతవాసనలోకవివిలాసినీపరం
పరలకు వీరు వల్లభులు పట్టుఁ డటంచు నొసంగుకైవడిన్.

71


సీ.

గురువనీపకుల కాదర మొప్పఁ గొం డని, యొసఁగియుఁ గొండని యొసఁగకుండు
నమితలావణ్యలీలావాప్తి వే మారుఁ, గినిసియు వేమారుఁ గినియకుండు
సత్కీర్తిచే సుధాకరదేవసరసుల, నాడియు సరసుల నాడకుండు
నరులపై నిశితసాయకపంక్తి చేపట్టి, విడిచియుఁ జేపట్టి విడువకుండు


తే.

ఫణిపతికి నైన భారతీపతికి నైనఁ, బశుపతికి నైన నలబృహస్పతికి నైన
నవని నవలీలఁ బొగడంగ నలవిగాని, చరితములఁ బొల్చు నాసింగజనవిభుండు.

72


చ.

చకచకమించు సింగనృపచంద్రునిశాక తకృపాణవల్లిలోఁ
బ్రకటవిరోధియూధరథభద్రగజాశ్వవరూథినీకదం
బకములు గాన వచ్చు సులభప్రతిబింబితమూర్తులై మహా
జికలితసాధ్వసోదయముచే నసిగర్భముఁ జొచ్చెనో యనన్.

73


తే.

ఇట్లు సుగుణాభిరాములై యెనయుమూర్తి,ఘనుఁడు సింగక్షితీంద్రుఁడుఁ దను భజింప
నెలమి భీమార్జునులు గొల్వ నింపు మీఱు, ధర్మసుతుమాడ్కిఁ దగునోబధరణివిభుఁడు.

74


సీ.

ఘనభుజాశౌర్యరాఘవుఁడు రాఘవదేవ, ధరణీశుఁ డేరాజు తాతతాత
నరనుతుఁ డైనపిన్నమరాజు సౌజన్య, ధన్యుఁ డేరాజన్యుతాతతండ్రి
యమితవైభవుఁ డైనయార్వీటిబుక్కభూ, తలనాథుఁ డేరాజు తండ్రితండ్రి
యసమానదానవిద్యాధురంధరుఁ డగు, రామరాజేంద్రుఁ డేరాజుతండ్రి

తే.

యట్టి సోమాన్వయాబ్ధిశీతాంశుఁ డనఁగ, నమరు శ్రీరంగవిభుపుత్త్రియై చెలంగు
లక్కమాంబను వరియించె లలితశీల, నమ్మహాసాధ్విసోదరు లధికయశులు.

75


క.

కోనక్షితిపతితిమ్మమ, హీనాథుఁడు రామనృపతి యెఱతిమ్మధరా
జానియును వేంకటేంద్రుఁడు, భూనాయకతిలకు లగుచుఁ బొల్తురు ఘను లై.

76


వ.

అం దగ్రజుండు.

77


సీ.

లాటీకుచాభోగపాటీరపంకంబు, బోటిముఖాబ్జకర్పూరకలన
గౌళీనవీనాంకపాళీదుకూలంబు, చోశీకుచాళీప్రసూనరాజి
యంగీముఖాభంగసంగీతవాణి క, ళింగీవిలాసకేళీమరాళి
భోజీకరస్వచ్ఛరాజీవకాంతి కాం, బోజిమహాహీరముకురరేఖ


తే.

కుంతలీకర్ణమౌక్తికకుండలప్ర, కాశ మెవ్వానియభినవాకాశదేశ
చంద్రికాయితసత్కీర్తిజాల మతఁడు, ప్రబలు శ్రీరంగవిభుకోనపార్థివుండు.

78


వ.

తదనుజుండు.

79


శా.

శ్రీరంగప్రభుతిమ్మశౌరిభుజఖౌక్షేయంబుచే నాజుల
న్వీరారాతులఁ ద్రుంప నాక్షితిపతు ల్వేవేగ మార్తాండునిం
దూఱందూఱఁ దదీయమండలసముద్భూతవ్రణశ్రేణికి
న్నీరంద్రౌషధచూర్ణభాతిఁ దగు నెంతేఁ దచ్చమూరేణువుల్.

80


వ.

తత్క్రమంబున.

81


సీ.

ఖలు నతిద్రోహి సల్కయతిమ్మని హరించి, సకలకర్నాటదేశంబు నిలిపె
నతుని వర్దితునిఁ దత్సుతునిఁ బట్టముఁ గట్టి, కుతుపనమల్కన క్షోణి నిలిపె
బదిలుఁ డై రాచూరు ముదిగల్లుగప్పంబు, సేయఁ గాంచి సపాదసీమ నిలిపె
శరణన్న మల్కనిజాముని కభయం బొసంగి తదీయరాజ్యంబు నిలిపె


తే.

నవని యంతయు రామరాజ్యంబు సేసె, దనగుణంబులు కవికల్పితములు గాఁగ
నలవియె రచింప సత్కావ్యములను వెలయ, భూమి నొకరాజమాత్రుఁ డే రామవిభుఁడు.

82


సీ.

ఖరదూషణాఖర్వగర్వనిర్వాపణం, బాజి నెవ్వానిసాయకనికాయ
మధికతారావరాహంకారవారణో, ద్వేల మెవ్వనియశోవిమలశోభ
వివిధారికామినీవిఘటసాటోప మే, యవనీశురోషారుణాక్షిరేఖ
పౌలస్త్యనిరసనప్రౌఢిమాఢౌకితం, బేరాజు చారిత్రచారుభూతి

తే.

యతఁడు కలియుగనవ్యరామావతార, చారుతాసార్థనామప్రదానుఁ డగుచు
వెలయు బ్రహ్మాండపేటికావితతకీర్తి, ధనుఁడు శ్రీరంగవిభురామధరణిధవుఁడు.

83


సీ.

తనభుజాదండకోదండ మఖండమై, యనువేలశరసృష్టి నాచరింపఁ
దనహేతి శతకోటిఘనధాళధళ్యమై, ప్రతిపక్షబలభిదాపటిమఁ నెఱప
దననిగ్రహంబు సజ్జనమనోహారియై, మంజుఘోషాశ్లేషమహిమఁ జెలగఁ
దనవైభవంబు సంతానసమగ్రమై, సురభిసంభృతగుణస్ఫురణఁ జెంద


తే.

రాజదేవేంద్రుఁ డితఁ డనఁ దేజరిల్లు, ననఘచాళుక్యనారాయణాంకవివిధ
బిరుదమన్నెవిభాళాదిబిరుదశాలి, ప్రాభవోపేంద్రుఁ డెఱతిమ్మపార్థివుండు.

84


సీ.

అసురారిరాణి నే నధివసించుట యెట్లు, బహువిధాసురవంశభవులయందు
సురలోకధేనుసోదరి నేను నిలుచు టె, ట్లకట గోఖాతపాతకులయందుఁ
త్రైలోక్యమాత నేఁ దగిలి యుండుట యెట్లు, త్రైలోక్యకంటకోద్ధతులయందు
దేవతారాధ్య నే దిరముగాఁ దగు టెచెట్లు, కడుదేవతాద్రోహకరులయందు


తే.

ననుచు యవనులఁ దెగడి త న్నాశ్రయించు, వారిసామ్రాజ్యలక్ష్మి నెవ్వాఁడు గొనియె
నాహవోగ్రబదరీసప్తాంగహరణుఁ, డతఁడు విలసిల్లు శ్రీవేంకటాద్రివిభుఁడు.

85


మ.

ప్రతికూలాదనిభృద్విభేదనకళాపారీణ మై సంగర
క్షితిలో వేంకటరాజశేఖరునికౌక్షేయంబు కృపాధిక
చ్యుతిఁ జెన్నొందఁ దదీయధారఁ బడి కా దోషాకరు ల్యావన
క్షితిపు ల్గాంచిరి నాకలోకవనితశృంగారసాంగత్యముల్.

86


మ.

బలధుర్యుం డగువేంకటేంద్రునిమహాబాహాబలాటోపవి
హ్వలుఁడై ము న్నతిధావనక్రియ సపాదాభిఖ్యుఁ డైనట్టియే
దులఖానుం డిదె నేఁడుఁ గ్రమ్మఱ సపాదుం డయ్యె నా నర్మిలిం
దలఁ దత్పాదము దాల్చె భీమరథిపొంతం గాన నిత్యోన్నతిన్.

87


మ.

స్థిరసంగ్రామజయాభిరాముఁ డగునాశ్రీవేంకటక్ష్మావరుం
డరయ న్రాజశిఖావతంసుఁ డగుఁ దధ్యర బుర్విఁ గాకున్న నీ
ధరణీపాలకు లెల్ల మెచ్చఁగ సపాదక్షోణిభృత్ప్రాప్తి భా
సురదుర్గాధిపతిత్వవైభవభవస్ఫూర్తి న్విజృంభించునే.

88


క.

ఈ రాజమణులసోదరి, యై రాజిలు లక్కమాంబ యమృతాశనధా
త్రీరుహముల కైదింటికి, నారయఁ దోఁబుట్టు వగురమాంగనపగిదిన్.

89


సీ.

ప్రతి వచ్చు నన్నపూర్ణాదేవి భైక్షాన్న, మిడక సంయమి నలయింపకున్నఁ
బాటి సేయఁగ వచ్చు భాగిీరథి నభంబు, ముట్టి పెన్ ఱాఁగయై మురయకున్న

సరి వచ్చు భూకాంత సకల ప్రజాభార, పూర్ణాసహత్వంబుఁ బూనకున్న
రూపింపవచ్చు నరుంధతి నేప్రొద్దుఁ, దనయల్పభావంబు దాల్పకున్న


తే.

నిమ్మహాసాధ్వి కని జను లెల్లఁ బొగడ, నలరు నోబక్షితీశు నర్ధాంగలక్ష్మి
బాంధవాసనధుర్యవైకదంబ, లలిత సద్గుణనికురుంబ లక్కమాంబ.

90


తే.

పొలోమికి నింద్రునకు మ, హాలలితాకృతి జయంతుఁ డాత్మజుఁ డైన
ట్లాలక్కమాంబ కోబనృ, పాలునకు నృసింహధరణిపతి జనియించెన్.

91


సీ.

కాశ్యపి తా నౌటఁ గశ్యపోద్భవుఁ డైన, కాకోదరస్వామిఁ గలయు టెట్టు
ఛాత్రి యౌ తనపయోధారచేఁ బెరగినఁ, గమఠకులాధీశుఁ గవయు టెట్టు
తను ధేను వగువేళఁ దర్ణకం బగు ధరా, ధరశిరోమణిఁ గూడఁ దలఁచు టెట్టు
తనక యావిర్భవించినపంచనామహా, క్రోడంబుతోఁ గూడి యాడు టెట్టు


తే.

తగవు గా దంచు ఫణికూర్మధరణిధరన, రాదిభూదారముల మాని యవనికాంత
తనభుజాదండమున నుండఁ దనరుచుండు, సరసగుణహారి యోబయనరసశౌరి.

92


క.

అతఁ డిల రామయతిమ్మ, క్షితిపతిసత్పుత్త్రుఁ డగుచుఁ జెలు వొందుగుణా
న్వితుఁ డగుతిరుమలధాత్రీ, పతితనయం దిరుమలాంబఁ బరిణయ మయ్యెన్.

93


సీ.

పొలు పగు నేసాధ్విభుజవల్లి రుక్మిణీ, సత్య యేగరితవాచావిశుద్ధి
జనకనందిని యేవిశాలాక్షిమతిరేఖ, భద్ర యేమగువ శోభనవినీతి
యససూయ యేకుటుంబిని దృష్టి సర్వమం, గళ యేశుభాంగనలలితరీతి
ధృతి సుదక్షిణ యేపతివ్రత కరుణసం, పత్కాంత యేయింతి భవ్యమూర్తి


తే.

యట్టిగుణధన్యయై తనయాత్మయెల్ల, నఖిలపతిదేవతాసంగ్రహం బనంగ
నలరు నరవీరవల్లి తిమ్మావనీంద్ర, శరధనుందారవల్లి యై తిరుమలాంబ.

94


తే.

ఆమగువయందు నరసంహభూమివిభుఁడు, రసికసారంగరాజు శ్రీరంగరాజుఁ
గనియె ననఘుని దేవకీకాంతయందు, ఘనుఁడు వసుదేవుఁ డచ్యుతుఁ గన్నపగిది.

95


క.

అతఁ డుభయవంశపావనుఁ, డితఁ డన బాలార్కవిజయహేనాకవిభా
నితతియు నమంమంద, స్మితచంద్రాతపము దాల్చు శ్రీరంజితుఁ డై.

96


సీ.

ఘనతఁ బెసాఁపనేర్చిన నాఁటనుండియు, శత్రులమీఁదఁ జేఁ జాప నేర్చె
ననయంబు నడుగువెట్టిననాఁటినుండియు, నరిశిరంబులమీఁద నడుగు వెట్టె
నవనీతము గ్రసించునాఁటనుండియు వైరి, కలయశోనవనీతముల గ్రసించె
ననపాంసుగతిఁ జెందునాఁటనుండియు ఖలా, భీలధాటీపాంసుకేళిఁ జెందె


తే.

నిలువ నేర్చిననాటనుండియు విరోధి, నృపతిసేనాపతుల గెల్చి నిలువ నేర్చె
నరసవిభునసిరంగభూనాథవిభుఁడు, ప్రబలెఁ బ్రబలుచునున్నాఁడు ప్రబలగలఁడు

97

ఈకుమారనారాయణుం గాంచిన రాజన్యపుంగవునకు.

98


క.

ఏతాదృశగుణమణికి ధ, రాతల పరిపూర్ణకీర్తిరమణికి జలధి
వ్రాతవృతధరణిభరణస, మాతతనిజభుజభుజంగమగ్రామణికిన్.

99


క.

ధన్యునకుఁ దరణికులమూ, ర్ధన్యునకు నిజప్రధానిరస్తవదాన్యం
మన్యున కరాతినృపపర్జన్యనిబంధనవిశేషశతమన్యునకున్.

100


క.

అజరగజరజతరజనికృ, దజతనుజద్యుకుజపురజిదభుజగగజభు
గ్వ్రజవిజయినిజయశోమయ, సుజననుతధ్వజున కధికశోభానిధికిన్.

101


క.

గండరగండని కభినవ, మండలికాఖండమన్నెమార్తాండునకున్
జండప్రతాపపిహితా, జాండునకున్ లోభిమన్నియరగండనిన్.

102


క.

లక్కాంబానందనునకు, దిక్కాంతాచికురనికురదీపితకుసుమ
స్రక్కాంతదంతురయశో, ఢక్కానిధి కహితకరిఘటాభీమునకున్.

103


క.

గాధేయగోత్రసవనధు, రాధేయున కఖిలసుకవిరాజికళాధా
రాధేయదానవిద్యా, రాధేయునకును ధరామరవిధేయునకున్.

104


క.

గర్వితబరీదసేనా, సర్వస్వహరానివార్యశౌర్యునకు సమి
ద్ధూర్వహసపాదభయదా, ఖర్వమహావిజయభేరికాభాంకృతికిన్.

105


క.

పీననమల్కాస్థాపన, మానితకరుణాప్రసంగమాంగళ్యునకున్
ధీనిధికి నృహరిచరణ, ధ్యానవిధానావధానధౌరేయునకున్.

106


క.

తొరగంటి దుర్గరాజ్య, స్థిరసింహాసననివాసదీక్షానిధికిన్
వరయంత్రమత్స్యభేదన, బిరుదోద్దండునకు గండభేరుండునకున్.

107


క.

ప్రతిదినకనకవసంతా, ర్జితకృతికాంతునకుఁ దురగరేవంతునకున్
గ్రతుపురనారాయణగృహ, వితతప్రాకారఘటనవిఖ్యాతునకున్.

108


క.

అరుణారుణకరుణారస, పరిణామసమగ్రనయనపద్మాభునకున్
శరణాగతభరణాపర, నరసింహున కోబశౌరినరసింహునకున్.

109


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన యిమ్మహాలంకారప్రబంధం
బునకు నాదికారణం బగునాయకగుణవ్రాతం బభివర్ణించెద.

110

నాయకగుణములు

క.

కులము మహాభాగ్యము ను, జ్జ్వలత యుదారత మహోవిశాలత ధర్మా
కలనయు వైదగ్ధియు నన, నిల నాయకగుణము లమరు నివి యేర్పఱుతున్.

111

క.

వీనికి లక్ష్యములెల్లను, శ్రీనరసింహేంద్రుపేరఁ జెప్పెద నెలమి
న్నానావిభక్తిసూచిత, నానావిధపద్యగుంభన సమగ్రముగాన్.

112

కులీనత ౼

సీ.

ఏవంశమునఁ బుట్టెఁ బావనశ్రుతిధర్మ, మర్మకర్మకుఁ డైన మనునృపాలుఁ
డేవంశమునఁ బుట్టె నింద్రాదు లరు దంద, సత్య మాడినహరిశ్చంద్రనృపతి
యేవంశమునఁ బుట్టె నిలఁ జతుర్దశ లోకరక్షణక్షముఁ డైన రావణారి
యేవంశమునఁ బుట్టె నిహపరాద్భుతపుణ్య, చరితధుర్యుఁడు చోళచక్రవర్తి


తే.

 యట్టి యిందుగ్రహారిసేనాధిపత్య
సత్యయశుఁ డైనభానువంశమునఁ బుట్టి
పరఁగుభూపాలసింహు నోబయనృసింహుఁ
దలఁప గలికాలదోషంబు దొలఁగు టరుదె.

113

మహాభాగ్యము ౼

మ.

ప్రకటాభీలవిరోధిసైన్యముల ద్రుంపంజాలు నొక్కొక్కసే
వకుఁడే వారణవాజితాలలు సమర్ద్వైరిక్షితీంద్రార్పితా
ధికవేదండహయాన్వితంబులు భుజాదీప్తాంగదం బుర్వి భా
గ్యకళావైభవ మెన్న శక్యమె నృసింహక్ష్మాతలస్వామికిన్.

114

ఔజ్జ్వల్యము ౼

మ.

స్థిరసోమాన్వయదుగ్ధవార్ధి జనియించె న్వేంకటాద్రీంద్రభూ
వరచంద్రుండు తదీయసోదరిరమావామాక్షి లక్కాంబ యై
పరఁగెం దద్వనితాసిరోమణికి నోబక్షోణిపాలేంద్రు శ్రీ
నరసింహాధిపుఁ డై జనించె మరుఁ డౌన్నత్యంబు దీపింపఁగన్.

115

ఔదార్యము ౼

సీ.

అలబలీంద్రునిచేత నడుగు వెట్టగ నేర్చి, ధారాధరముచేత నీరు వోసి
కానీనుచేఁ గంచుకముఁ బూనఁగా నేర్చి, యెలమి దధీచిచే నెముక బలిసి
క్షీరాంబురాశి ద్రచ్చినవెన్న నీడేర, నైలింపగవి చన్నుపాలఁ బెరగి
కల్పపాదపఫలోత్కరములఁ జని గాంచి, వనజారి నెమ్మేన ననఁగి పెనఁగి


తే.

ధరణిఁ బ్రోది వహించినదానకన్య, సకలయాచకబాంధవు ల్సన్నుతింప
నీకరగ్రహణావాప్తి నెఱసె నౌర, సరసగుణహార యోబయసరసధీర.

116

తేజస్విత —

సీ.

బహుతరాశాభ్రాంతి బయిలు వ్రాఁకక యున్నఁ, గువలయద్వేషంబు గోర కున్న
మీటితమ్ములవిరిపోటు సేయక యున్న, వారుణీసక్తికిఁ బాఱ కున్న
జగతి నందఱఁ దను బగ లొనర్పక యున్న, దోషాభిభూతుఁ డై తొలఁగ కున్న
ద్విజరాజపరిభవోద్వృత్తి సేకొన కున్న, సరసుల నింకింపఁ జాల కున్న


తే.

సాటి యగునిశ్వవినుతశశ్వత్ప్రతాప, వైభవిధ్యస్తదుర్వారవైరివీరుఁ
డైనయోబయనరసింహు నమితభువన, భవనభృతతేజమున కబ్జబాంధవుండు.

117

ధార్మికత్వము —

చ.

పలుకుట సత్యవాసన కపారవిరోధి జయోత్సవంబు దా
నలఘుయశోధనంబుకొఱ కంబుధివేష్టిత భూపరిగ్రహం
బలరు నగణ్యపుణ్యచరితాచరణంబున కాత్మజీవనం
బల సుజనావనంబు కొఱ కౌర నృసింహనృపాలమౌళికిన్.

118

వైదగ్ధ్యము —

సీ.

వనజారి కళలచేఁ దనివి నొందించిన, నిల ఖేచరుఁడు ప్రాణ మిత్తు ననిన
ననదంబు తనదుజీవన మెల్ల నొసఁగిన, నెమ్మేను శిబి కోసికొమ్మటన్న
నీగిగి మ్రానేసొమ్ము లిచ్చినసురమణి, మి న్నంది తెలఁపులో మెలఁగు చున్నఁ
జేరి పాదము బలి శిరసావహించినఁ, బాధోధి దా నెంత భంగపడిన


తే.

వారి నెవ్వారిగా దని వసుధ నౌర, నిక్కముగఁ గీర్తకామిని నీకుఁ దక్కె
నీదువైదగ్ధ్యగుణము వర్ణింపఁదరమె, నరనుతాటోప తొరగంటి నరసభూప.

119


క.

అనయము నాయకసుగుణము, లనేకములు గలవు వాని నతివిస్తరభీ
తిని రూపింపఁగ లే నిఁక , ననుపమనేతృస్వరూప మభివర్ణింతున్.

120

నాయకస్వరూపము

క.

కీర్తిప్రతాపసుభగుం, డార్తావనుఁ డఖిలగుణగణాఢ్యుఁడు బాహా
వర్తితభూభరుఁ డై పరి, కీర్తితుఁ డగు భర్త కాన్యగీతప్రియుఁడై.

121

కీర్తిప్రతాపసుభగత్వము —

మ.

అరినిర్భేదనధుర్య యోబయనృసింహా సింహసత్వాఢ్య నీ
వరసత్కీర్తిమరాళబాలిక భవద్వర్థిషుశౌర్యప్రభా
భరితారుణ్యముఖాగ్రయై పరఁగుచుం బా ల్నీరు నేకంబుగా
ధరఁ గావించు సమస్తవిస్మయకళాదానప్రవీణోన్నతిన్.

122

అర్తావనత్వము —

మ.

ఒక ప్రహ్లాదుని నార్తుఁ గాచితి మదయోత్సేక మేకానన
ప్రకటం బౌనె యటంచుఁ దా బహుతరార్తత్రాణపారాయణో

త్సుకత న్శ్రీనరసింహుఁ డుర్వి నరసక్షోణీశుఁ డై పుట్టెఁ గా
కొకభూపాలున కిట్టియార్తభరణోద్యోగంబు వాటిల్లునే.

123

గుణాఢ్యత్వము —

చ.

అరయఁ బయోధపాత్రమును నంజనశైలము కజ్జలంబుఁ ద
త్సురతరుశాఖ లేఖిని వసుంధర పత్త్రముఁ జేసి వేడ్కతోఁ
గెరలి విరించి గేహిని లిఖించిన బారము వొంద దౌర మా
నరసనృపాలమౌళి సుజనస్తుతసద్గుణసంప్రదాయముల్.

124

భూభరణము —

చ.

విపులఫణాసహస్రమున వీఁక ధరింపఁగ నేని మేదిని
న్నిపుణత బాహుపీఠమున నిల్పె నృసింహుఁ డటంచుఁ బన్నగా
ధిపతి నిరంతరాద్భుతమతిం దల లూఁచ జరావిపాండురుం
డెపుడుఁ బురాణభోగి యని యెన్నుదు రాభుజగేంద్రు నందఱున్.

125

కావ్యగీతప్రియత్వము —

మ.

నరసింహుం డతిధీరవీరరససన్నాహంబు వాటించియుం
గరుణాకోమలుఁ డై రమావిమలశృంగారార్ద్రుఁ డై పొల్చుచా
తురి సాహిత్యజమర్మకర్మకఠినోద్యోగాదృతుం డయ్యు నీ
నరసింహేంద్రుఁ డనూనగానరససంధానప్రియుం డెంతయున్.

126


మ.

అమరక్ష్మాధరధీర ధీరచితకార్యారంభ రంభాసమ
ప్రమదాభవ్యమనోనురాగఘటనాపాంచాల పాంచాలగౌ
శముఖోర్వీనుతశౌర్య శౌర్యననలీలాలోల లోలాభవ
ద్రమణీయాగమధర్మ ధర్మతనయ ప్రఖ్యాతసత్యవ్రతా.

127


క.

కుటిలారిభయదధాటీ, పటుపటహఢమన్నినాదపరిపాటితది
క్తటపటలచటులమేధా, పటిమపరాభూతభూతపతిమణిహారా.

128


మాలిని.

అలఘునయవిహారా హారనీహారతారా
హలధరరుచిధారా హారకీర్తిప్రచారా
జలధివరగభీరా జైత్రకౌక్షేయధారా
లలితగుణవిచారా లక్కమాంబాకుమారా.

129


గద్యము.

ఇది శ్రీ హనుమత్ప్రసాదలబ్ధకవితాసారసారస్వతాలంకారనిరంకుశప్రతిభా
బంధుర ప్రబంధపఠనరచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణ
సుపుత్త్ర తిమ్మరాజపౌత్త్ర సకలభాషావిశేషనిరుపమావధానశారదామూర్తి
మూర్తిప్రణీతం బైనకావ్యాలంకారసంగ్రహం బనుమహాప్రబంధంబునందు
నుపోద్ఘాతప్రకరణంబును నాయకగుణవర్ణనంబును నాయకస్వరూపకథ
నంబు నన్నది ప్రథమాశ్వాసము.