ద్విపద భారతము - మొదటిసంపుటము/ఆదిపర్వము - ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమా శ్వాసము

<-- ******* -->

కృత్యవతరణిక


శ్రీరామ, రఘురామ, సీతాభిరామ,
ధారుణీపతి రామ, దశరథ రామ,
సౌమిత్రి సహచార, జగదేకవీర ,
శ్యామనిర్మలగాత్ర, సత్యచారిత్ర,
కౌశికయాగ రక్షాపుణ్యయోగ,
కౌశికకోదండ ఖండనోద్దండ,
జానకీకల్యాణ, శర్మధురీణ,
మౌని భార్గవకోప మథన ప్రతాప,
పాలితలక్ష్మణ భరతశత్రుఘ్న,
లాలిత [1] గురువాక్య, [2]లక్ష్మణాలోక్య ,
గుహనుత వైదుష్య, కుహనామనుష్య,
విహితభరద్వాజ విపుల వాక్పూజ,
చిత్రకూటవిహార, చిరకీర్తిహార,
పాత్రనుతాద్వంద్వ పాదుకాదంద్వ,
ఖచిత పావన దండకావనభవన,
రచితాపరాధ విరాధవిరోధ,
శరభంగమునిసంగ, శరభంగభంగ,
శరభంగసంస్థాన, జాహ్నవీస్నాన,
కలశభవన్యస్త కార్ముకహస్త,

కలుషిత శూర్పణఖా [3]ముఖదర్ప,


ఖర దూషణాది రాక్షసమర్మ భేది,
మరణ శేషిత తుంగ మాయాకురంగ,
సీతావియోగ, సుశీల ప్రయోగ,
ధౌతకబంధ పాతక పంక బంధ,
సుగ్రీవకృతసఖ్య, సురదత్తసౌఖ్య,
విగ్రహ ప్రియ వాలి విడళనశాలి ,
పంపాసరస్తీర భవ్యవిహార,
సంపాతికృతమార్గ సైనికవర్గ,
సీతాశిరోరత్న శీలితయత్న,
ఆతతలంకా ప్రయాణనిశ్శంక,
సరసవిభీషణ స్థాపననిపుణ,
శరధినిర్మిత బంధ, సాధుసంబంధ,
క్షపితరావణ కుంభకర్ణ సంరంభ,
కపిసైన్యజీవరక్షణ, గతదైన్య,
నిష్పాప మైథిలీ నియమితకోప ,
పుష్పకారోహణ భోగనిర్వహణ,
[4]యిద్ధవిభాగ్రామ, యినకులసోమ,
సిద్ధసాక లక్ష్మీమనోపేత,
జయ జయ గుణధామ, జయ రఘురామ,
జయ నిత్యకల్యాణ, చకితసంత్రాణ,
నీకు నేఁ జెప్పఁబూనిన కథా క్రమము
చేకొని విన్నవించెదఁ జిత్తగింపు.
అని నిర్మల ధ్యాన మాత్మలో నిలిపి
కనుఁగొంటిఁ ; దత్కథాశ్రమమెట్టిదనిన ;
భూమిలో సారమై పొలుపొందునట్టి
నైమిశారణ్య పుణ్యక్షేత్రమునను


శౌనకాదులు మున్ను సత్రయాగంబు
నూనినరతిఁ జేయుచున్న, నచ్చటికి
నొకనాఁడు వేట్కతో నుగ్రశ్రవుండు
సకలపురాణార్థ సరసుఁడే తెంచి,
యనుపమభక్తి సాష్టాంగ ప్రణామ
మొనరించి, వారితో నోలి నందంద
సభినుతులొనరింప, నాశౌనకాదు
లభినవోత్సాహులై యతనిఁ బూజించి,
కుశలపీఠంబునఁ గూర్చుండఁ బెట్టి,
కుశలంబులడిగి, కోర్కులు దోపననిరి:
“ఇచ్చఁదలంచుచో నింతలో వేగ
వచ్చితివో సూత, వరకథాజాత.
ఆపరాశరసూతి కాత్మశిష్యుండు
చూపింప మీతండ్రి రోమహర్షణుఁడు
కనుఁగొని నీ వెఱుంగని పుణ్యకథలు,
విననియర్ధము లేదు విశ్వంబులోన.
నవిరళమహిమ మహాభారతంబు
చెవులకుఁ జవులుగాఁ జెప్పవే మాకు ,
అనఘ, గరుత్మంతుఁ డవనిఁబుట్టుటయుఁ,
జెనకి తాఁ దల్లి దాసీత్వంబు దీర్పఁ
దలఁచి యాఘనుఁ డమృతంబు దెచ్చుటయు,
గొలఁదిఁ దజ్జననిఁ దోడ్కొని పోవుటయుసు,
అమరదానవముఖ్యు లంబుధి ద్రచ్చి
యమృతంబుఁ బడసినయట్టి హేతువును,
వైనతేయుఁడు విష్ణువాహనంబైన
యామిత్తంబును, నదిగాక మఱియు,
లలి నిట్టికథకు మూల స్తంభమగుచుఁ
బొలుచు వేదవ్యాసుపుట్టు వేలాగు ?


శంతనునకు గంగ సాధ్యియేలాగు ?
శాంతి భీష్ముడు బ్రహ్మచారియెట్లయ్యె
నతఁడు చిత్రాంగదుఁ డరిగిన పిదప,
క్షితి నెట్లు నిలిపె విచిత్ర వీర్యునిని
ధృతరాష్ట్ర పాండుల దేవర న్యాయ
గతిఁ బరాశరసూతి గన్నలాగెట్లు .
విదురజన్మము, పాండవేయకౌరవుల
యుదయప్రకారంబు సుర్వి నేలాగు ?
ఆరాజసుతులకెట్లస్త్రంబులబ్బె ?
నేరీతి దుర్మంత్ర మెన్నె రారాజు ?
వారణావతమున వహ్నిలోఁ బడక
యేరీతి వెలువడి రెల్ల పాండవులు!
మొగి నెట్లుగాంచె భీముడు ఘటోత్కచుని  ?
దగవొప్ప బకుని నాతండెట్లుచంపె ?
శ్వేతాశ్వములు మతి శ్వేత వాహనున
కాతతగతి నెట్టు లరయ సిద్ధించె
నంచితగతి మత్స్యయంత్ర మేయించి
పాంచాలి యేవురిభార్య యెట్లయ్యె !
ద్రౌపది పెండ్లికి రాఁబోయి ...
యాపాండుసుతుల నేమని యూఱడించె?
నప్పుడు వారల నాంబికేయుండు
రప్పించి మఱి యర్ధరాజ్య మెట్లిచ్చె ?
మానినిఁగవియుచో మఱి పాండవులకు
మౌని నారదుఁ డేమిమర్యాద చేసె ?
నంత నర్జునుతీర్థయాత్ర యెట్లొదవెఁ ?
గాంత సుభద్ర నాఘనుఁ డెట్లుదెచ్చె?
ఖాండవ మగ్నిచేఁ గాల్పించి, క్రీడి
గాండీవమును దేరు గన్నలాగెట్లు ?


ఆమహాగినని దప్పి యు మై... బోయి ,
సామెట్లు కర్ణుని బాణమై నిలిచె ?
నలమి పార్థుఁడు గావ నయ్యగ్ని శిఖలు
వెలువడి, సభ యెట్లు విరచించె మయుఁడు ?
ఆకొల్యులోపల యమసూతితోడఁ
బ్రాకటలీల నారదుఁ డేమి చెప్పె !
రాజసూయాధ్వర ప్రారంభ వేళ
నాజరాసంధుని హరి యేమిచేసె ?
శౌరికి నగ్రపూజలు చేయనీక
యేరీతి శిశుపాలుఁ డీల్గె గర్వమునఁ :
గొలువులోనికివచ్చు కురురాజుఁ జూచి,
యెలనవ్వుగా భీముఁ డేటికిన వ్వె ?
ద్యూతంబు తల పెట్టి, దుర్యోధనుడు
ఏ తెఱంగునగెల్చె నెల్ల, పాండవుల !
ద్రౌపదిఁ దొడలమీదకు రమ్మటంచు
బాపాత్ము డెట్లాడెఁ బతులసన్నిధిని  ?
అతివఁదోడ్కొని యుంత నడవి కేఁగుచును
బ్రతిన లేమేమని పట్టిరి వారు ?
అమ్మహావనములో ననిలజు చేతఁ
గిమ్మీరుఁ డేరీతిఁ గెడసెఁ బోరాడి ?
హరియును ద్రుపదుండు నంతఁ బాండవుల
నరయుదమని పోయి యచట నేమనిరి?
పాశుపతాస్త్రంబుఁ బడయంగఁ గోరి,
యీశానుతోఁ గ్రీడి యెట్లు పోరాడె?
నాతఁడా పాశుపతాస్త్రంబుఁ బడసి
యే తెఱంగునఁ బోయె నింద్రునిఁ జూడ ?
రోమశువలనఁ బార్థునిసేమ మెఱిఁగి
యేమి తీర్థములాడే నిట ధర్మరాజు


పూని యా వేళ దుర్బుద్ధియై పవన
సూనునిచే జటాసురుఁ డెట్లుచచ్చె?
హనుమంతుతో భీముఁ డదియేల గూడె?
ధనదుసేనాపతిఁ దా నెట్లుచంపె ?
సంత నాతఁడువోయి యక్షుల గెలిచి,
కాంత సౌగంధికము నెట్లు దెచ్చె !
నతని యుద్ధతిఁ జూచి యమసూతితోడ
హితమతి ధననాథుఁ డేబుద్ధి చెప్పె :
దివి సస్త్రములుగాంచి తివిఱి నివాత
కవచుల నేరీతి ఖండించెఁ గ్రీడి ?
మఱి పాండవులు గంధమాదనంబరిగి
కొఱఁతగా కేవురుఁ గూడుటేలాగు ?
పాముచేఁదగిలి, యప్పవమానసూనుఁ
డేమియుఁగాక తా నెట్లు వెల్వడియె !
హరి యంతఁ బార్డుల నరయఁబోవుటయు
హరిదేవి యేమాటలాడె ద్రౌపదిని ?
రారాజు ఘోషయాత్రకు వచ్చి తగుల
నేరీతి విడిపించె నింద్ర నందనుఁడు ?
ప్రాయోపవేశంబు పన్నగధ్వజుఁడు
చేయఁ, గర్ణుం డేమిచెప్పెఁ బైనొత్తి ?
ద్రౌపదిఁ గొనిపోవు దండి సైంధవుని
నేపునఁ బావని యెట్లు భంగించె
ఘనులు పాండవు లంత గ్రమ్మఱి ద్వైత
వనమున కేరీతి వచ్చిరందఱును ?
దివిజదేవుండు భూదేవుఁడై పోయి
కవచకుండలములఁ గర్ణునెట్లడిగె !
యమధర్మరాజుతో నాధర్మరాజు
రమణ నేమని యంతరంబులు పలికె?


మెచ్చి యముం డంత మేదినీశులకు
నిచ్చిన వరము లేమేమి యేవురకుఁ ?
బోయి పార్థులు మత్స్యపురిసమీపమున
నాయుధంబులు దాఁప నను వెట్లు గనిరి ?
ఏవేషములుదాల్చి యేవురు విరట
భూవరుఁ గొలిచిరి పూఁబోఁడితోడ ?
నందు భీముఁడు కీచకావళినెల్ల
నిందుబింబాస్యకై యెట్లు మర్దించె  !
బలిమిఁ ద్రిగర్తులు పశులఁబట్టుటయు,
నలిగి విరాటుఁ డెట్లాజికిఁ బోయె!
తఱిమిపట్టినఁ గ్రీడి తా నెట్లు వెడలె ?
మఱునాఁడు గోవుల మఱియుఁ గౌరవులు
గోవుల మరలించి, కురురాజు దొరల
నేవిధంబున గెల్చె నింద్రనందనుఁడు !
ఆమత్స్యపతికూఁతు రభిమన్యు నెట్లు
తామరసాక్షి యుత్తర పెండ్లియాడె ?
నంత రణోద్యోగులై పాండుసుతులు
వింతగా నెచ్చోట విడిసిరి మెఱసి ?
కయ్యంబునకుఁదోడుగా నిందునందు
నెయ్యులై కలిసిన నృపతులెవ్వారు ?
ఒక్కట హరిఁబిల్వ, నురగకేతనుఁడు
నక్కిరీటియుఁ బోవ, హరి యేమిచేసెఁ  !
బొరిఁ [5] : బాండులకుఁ దోడుపోయెడుశల్యుఁ
గురుపతి తా నెట్లుకొలిపించుకొనియె!
దూతయైపోయి, పార్థులఁజూచి, మరలి
యేతెంచి సంజయుం డేమని చెప్పె ?
నప్పుడు నీతిగా నాంబికేయునకుఁ
జెప్పిన విదురునిసిద్ధాంత మెట్లు ?


హరి యంత దూతయై హస్తినాపురికి
నరుదేర, రాజరాజపుడేమితలఁచె ?
రూపింపఁ దనవిశ్వరూపంబు చూపి
యాపద్మననాభుఁ డేమనియెఁ గౌరవుని ?
మాధవుచేత జన్మముఁ జక్కవినియు
రాధేయుఁ డేల ధర్మజుఁగూడడయ్యె
దను నర్ధరథులతోఁ దగుల నెన్నుటయుఁ,
గినిసి కర్ణుండు గాంగేయు నేమనియె?
జానొప్ప భీష్ముండు సమసిన దాఁక
రా" నని కర్ణుండు రణ మెట్లుమానె ?
సంత శిఖండిజన్మాఖ్యాన మెట్లు ?
చింతింప నెవ్వరసేనాధిపతులు ?
ఏచి వారును వీరు నెదురువేలములు
వైచుట యెచ్చోట ! వరసేన లెన్ని ?
“వైరుల నెన్నాళ్ల వధియింతు, రనిన
వీరు లేమాటలు విభులతో సనిరి ?
'ఇందు నిందఱువిందు ; లేఁజంప •; ననిన,
నిందిరాపతి క్రీడి కెట్లుబోధించెఁ ?
బడక గాంగేయుండు పదివాసరములు
నెడపక రిపులతో నెట్లుపోరాడెఁ ?
దమకించి భీముఁ డాతఁడు గావఁగావ,
రమణ నె౦దఱధార్తరాష్ట్రులఁ జంపెఁ?
దనుజంప నంతయు ధర్మరాజునకుఁ
గినియక యెట్లు గాంగేయుండుచెప్పె  ?
గాండీవి యంత శిఖండివెన్వెనుక
నుండి యేగతి భీష్ము నుర్విపైఁ గూల్చె?
నంత సేనకు ద్రోణునధిపతిఁజేయఁ,
బంత మేమనియాడెఁ బతితోడ నతఁడు?


భర్త తమ్మనిపినఁ, బ్రత్యేక సమర
కర్తలై నరునిఁ ద్రిగర్తు లేమనిరి !
శూరుఁడై భగదత్తుసుప్రతీకమును
నేరీతి మర్దించి నింద్రనందనుఁడు ?
తొడరి పెక్కండ్రు యోధులు దొమ్మినేసి
గెడపినవిధమెట్లు క్రీడినందనుని ?
శతమఖసూనుండు సైంధవుఁజంపఁ
బ్రతిన లేమనిపట్టె బహుశోకమునను ?
ప్రతిన తీర్చిననాఁటి బవరంబులోన
నతఁ డెట్లుగూల్చె నేడలోహిణులను ?
ద్రుపద ఘటోత్కచ ద్రోణ విరాటు,
లుపమన్యువును, శ్రుతాయువు, సలంబసుఁడు,
నెలకొని నారాయణీయ గోపాల
శల సోమదత్తులుఁ జచ్చుటేలాగు ?
ద్రౌణి నారాయణాస్త్రము పాండుసుతుల
ప్రాణంబునకు నల్గి పఱపుట యెట్లు ?
కడుదైన్యమున శల్యుఁ గర్ణునిరథముఁ
గడవ నేమనిపిల్చెఁ గౌరవేశ్వరుడు ?
కర్ణుని శల్యుండు కదనమ్ములోన
గర్ణశల్యమ్ములుగా నెట్లు పలికెఁ ?
దడయక గాండీవి ధర్మజుఁ జంపఁ
గడఁగినఁ, జూచి యేగతిమాన్పె శౌరి ?
జీర్ణసేనుని వృష సేనునిఁ దక్కు
కర్ణనూనుల నెట్లు గాండీవి చంపెఁ ?
జెచ్చెఱ మఱి దుస్ససేనువక్షంబు
వ్రచ్చి నెత్తురు నెట్లు వాయుజుండానె ?
మురవైరి నాగాస్త్రమునఁ గ్రీడిశిరము
దొరుఁగకుండఁగ నెట్లు ద్రొక్కెను రథము !


సుతులనుద్దేశించి, సూర్యదేవేంద్రు
లతిరోషభాష లేమనియాడుకొనిరి!
అంతఁ గర్ణునిఁ జంపి, యాసూతకులము
నెంతయు గాండీవి యెట్లుచెండాడె!
రారాజు శల్యునిరణమహోదగ్ర
భార౦బునకు నెట్లు పట్ట౦బుగట్టె ?
మహితాత్ముఁ డతని ధర్మజుఁ డెట్లుచంపె  ?
సహదేవుఁ డేరీతి శకునివధించె?
శకునిసూనులనెల్ల సహదేవుఁ డలిగి,
యొకనిఁబోనీక యె ట్లుర్విపైఁ గూల్చె?
మఱిపోయి రారాజు మడుగులో డాఁగి,
చుఱుకుమాటల కెట్లు శూరుఁడై వెడలె?
సమరంబులోన సంజయునిఁ బట్టించి
శమననందనుఁ డేలచంపకవిడిచె?
నెడచూచి, గదవేసి, యిభపురాధిపుని
తొడ లెట్లుగూల్చె వాతూలనందనుఁడు ?
చొచ్చిపోయిన పాండుసుతులు, సాత్యకియు,
నచ్చుగా హరియు నెట్లగపడరైరి?
ఉపపాండవులు చావ, నుడుకుమైఁ గృష్ణ
కుపితయై యేమని కూడుగ్గఁబట్టె?
భాసిల్ల ద్రాణిఁ 'యపాండవం' బనుచు
నేసినదివ్యాస్త్ర మేరీతిఁ దునిసె?
డాకొని శారి పాండవకులక్షయము
గాకుండ నేరీతిఁ గరుణ వారించె ?
వ్యాసులువచ్చి యశ్వత్థామఁ గినియ,
సీసున శాపంబు లేమేమిపుట్టెఁ  ?
గర్ణునిజన్మ౦బు కౌంతేయుఁ డెఱిఁగి,
ఘార్ణాయమానుఁడై కోపించుటెట్లు?


దార లప్పుడువచ్చి, తమతమ మగల
కేరీతి శోకించి రిలసంచలింప  ?
బార్థులమీఁదఁ గోప ప్రసాదమ్ము
లర్థి నేగతిఁజూపె నాంబికేయుండు  ?
అనలసంస్కారాదు లఖిలవీరులకు
మనమార నెట్లు ధర్మజుం డాచరించెఁ ?
బట్టాభిషేకంబు పాండవాగ్రజుని
కెట్టివైభవముల నిలచూడనమరె ?
రసికత నిభపుర రాజవేశ్మముల
వసుధేశుఁ డెవ్వరెవ్వరి విడియించెఁ ?
జుట్టాలఁజంపినశోకంబు మాన,
నెట్టిమాటలు భీష్ముఁ డెఱిఁగించె బతికి ?
నంత సూర్యున కుత్తరాయణంబైన
శంతనసుతుఁ డెట్లు స్వర్గస్థుఁడయ్యె ?
నాయెడ ధర్మజుం డశ్వమేధమున
కేయత్న మొనరించి నిలయెల్లఁబొగడఁ ?
దమ్ములుదెచ్చినధనము లానృపున
కిమ్ముల రాసులై యెట్లువర్థిల్లె?
హరికృప జీవితుండై పరీక్షిత్తు
కరమర్థి నుత్తరాంగన కెట్లుపుట్టె ?
వెస బభ్రువాహన శ్వేతవాహనుల
కసమాన సంగ్రామమైనలాగెట్లు ?
అంత గాంధారియు, నాంబికేయుండు,
వింతగాఁ గుంతియు, విదురసంజయులు,
నాశ్రమవాసులై యరిగినపిదప,
నశ్రాంతసుఖి వ్యాసుఁ డచటికివచ్చి,
ధార్తరాష్ట్రులనెల్లఁ దనతపోమహిమ
మూర్తిమంతులఁజేసి మొగినెట్లుచూపెఁ ?


జూపుటయును, వారు శోకంబులుడిగి
యేపుణ్యగతులకు నేఁగిరి ప్రీతి ?
మదిరామదాంధులై మౌసలకమున
యదురాజు లొక్కటహతులౌట యెట్లు ?
అంత నారదుచేత నావార్త యెఱిఁగి,
యంతకసూనుఁ డేమనివిలపించె?
ధర నరాజకమైన ద్వారకావురికి
నరిగి, పార్థుఁడు వారి నటసంస్కరించి,
యాదవసతుల నొయ్యనఁ దెచ్చుచోట
నాదటఁ దను బోయలాక్రమించినను,
విలువంపలేక నిర్విణ్ణుఁడై యపుడు
తలకొని యందుఁ గొందఱనెట్లుగాచె?
వరశక్తిదఱిఁగిన, వైరాగ్యమహిమ
నరుఁడంత నెట్లు సన్యాసంబు గొనియె?
కర్ణుండొకట నరక ప్రాప్తుఁడయ్యుఁ
బూర్ణ భోగస్వర్గమున కెట్లువోయెఁ ?
గర్మ విపాకంబు కాలునిచేత
ధర్మజుం డేరీతిఁ దప్పకవినియె ?
నమరలోకంబునకరిగి, పాండవులు
తమపూర్వతనువులు దాల్చుట యెట్లు ?
అనఘాత్మ, మాకు మహాభారతంబు
విన వేడ్కయయ్యెడు ; వివరింపవయ్య !
ఆదిపురాణ శాస్త్రార్థ రహస్య
వేదివి; నీకంటె విజ్ఞాని లేఁడు.
ఒనరంగఁ జెప్పవే ! యుగ్రశ్రవుండ,
జననంబు మాకెల్ల సఫలత నొంద. "
ననుచువాక్రుచ్చిన, నమ్మహాత్మకుఁడు
వినయముతో వారి వీక్షించిపలికె:


"రసపూర్ణమైన భారతసముద్రంబు
వసమె [6]చెప్పఁగ నెంత వారలకైన !
ఐనను, మీరు నన్నడుగుటఁ జేసి
యేసువిన్నంత మీ కెఱుఁగఁజేసెదను. "
అనుచు, నావ్యాసమహామునీశ్వరుని
మనమున నిలిపి, నిర్మలచిత్తుఁడగుచు,
నాకథకుఁడు శౌనకాదిసన్మునుల
కాకథాసూత్ర మిట్లని చెప్పఁదొడఁగె;
" యతులార, వినుఁడు; మహాభారతంబు
శతపర్వరూపియై చాల నొప్పారు.
[7]నొదవ నూఱును నేను నొక్కటియయ్యు'
బదునెనిమిదియయ్యెఁ బర్వంబు; లందు
వరుసతో నాదిపర్వము, సభాపర్వ,
మరుదార నారణ్య, మట విరాటంబు,
జగతినుద్యోగ భీష్మ ద్రోణములును,
మొగిఁగనన్ శల్యాఖ్యమును, సౌప్తికంబు,
జానొప్ప స్త్రీపర్వ శాంతిపర్వంబు,
లానుశాసనికాఖ్య, మశ్వమేధంబు,
పటుమౌసలీక మహాప్రస్థానికములు,
నటు నాశ్రమాప్తి, స్వర్గారోహణంబు,
సరినిది యష్టాదశప్రబంధముల
సరహస్య వేదార్థ సారబంధంబు,
విన్నఁబుణ్యము, దీనివినినయుత్తములఁ
గన్నఁబుణ్యము పుణ్యకతయైనకతన.
 


ఏ వేదములు పఠియించుటకంటె,
నే వెంటఁ దీర్థంబులేఁగుటకంటెఁ,
బాపహరంబైన పంచమవేద
మే పార వినిపించి యేఁ బుణ్యుఁడగుదు.

ఉదంకుఁడు జనమేజయునియొద్ద కేఁగుట .

వినుఁడు, భారతవంశ విఖ్యాతుఁడైన
జనమేజయుఁడు తొల్లి జగతియేలుచును,
అతిరాత్రమనుయాగ, మశ్వమేధంబు,
ధృతి వాజపేయంబు, దీర్ఘసత్రంబు
మొదలైన యధ్వరంబులు పెక్కుచేసి,
సదమలచిత్తుఁడై సద్గోష్ఠి నుండ,
నా రాజుకడకు నుదంకుఁడన్మౌని
యారూఢనియతిఁ గార్యార్థియై వచ్చి,
యధిపుచేఁ బూజితుండై, యాతఁడిచ్చు
బుధయోగ్యపీఠకంబునఁ గూరుచుండి,
కన్నులఁ గోపాగ్ని గదుర నిట్లనియె:
'జన్మంబున్న్నియు జననాథ, యేల !
పగవగయైయుండ భండారమెల్ల
జగతీశ, తగనివెచ్చంబుచేసెదవు !
వ్రతధారివై చేయవలసినయట్టి
క్రతువుండ, వేఱొకక్రతువేల నీకు !
తరమెఱుంగక కొండ తప్పఁగానేసి (?)
ధరణీశ, వెండ్రుకదాఁకనేసెదవు.
[8] నడికెదు కటకటా! ననువంటిమునివె !
వెడ నీకు గోపంబు వెదకిన లేదు!
తక్షకుండనుపాము తనవేఁడితోర
దక్షతఁగఱచి మీతండ్రినిఁజంపె.
 


మేలుచేయనుబోయి మెయిమెయి నుంటి ;
మేలు నీశాంతంబు మేదినీనాథ !
శత్రుని సాధింపఁజాలని రాజు,
పుత్రసంతానంబుఁబొరయనిమనువు,
నురుకీర్తిలాభంబు నొరయని ధనము,
చిరశౌర్య, వృథయని చెప్పఁగా వినవె !
[9] సోముండు రాజని శ్రుతులు ఘోషించు ;
నా మేటి దిగ్విజయము, తొల్లి చేసి,
రాహువుఁ బగవాని [10]రక్షోవిశేష
దేహంబుతోఁ బాపె దివ్యయత్నమున.
ఆసోమకులవార్థి నధిప, జన్మించి
యీసుదలంప ; వీవెట్టిభూపతివి !
ఒంటికంబము మేడ లొగి మీఁదమీఁద
మింటితోఁ, [11] జేరంగ మేదినిఁగట్టి,
యా మేడలకుఁజుట్టు నగడత పన్ని,
యామయామవిబుధు, లౌషధకరులు,
శస్త్రవైద్యులు, మంత్రశాస్త్రసంపన్ను,
లస్త్రపాణులు నుండ నధిపునిఁదరిసి,
కపట భావంబునఁ గఱచి వధించి,
తపనుండుసాక్షిగాఁ దనపేరువాడి
పోయినపగవాడు బొందితోనుండ,
నీయున్కిచూడ నిన్నేమనఁగలదు !
ఎవ్వరు నిది నీకు నెఱిఁగింపకునికి
నివ్వెఱఁగయ్యెడు ! నీచిత్తమెట్లొ!
హితముచెప్పెదఁ; గాని, యేను నీతోడ
నతిసాహసపుమాటలాడుటయెఱుఁగ.



కుండలాపహరణకథనము

గురుసేవ యేఁజేయ, గురుపత్ని నన్ను
నురుతర ప్రార్థన నొకనాఁడు చూచి :
పుష్యరాగపుఁగర్ణపూరయుగంబు
పౌష్యమహారాజుపత్ని యెప్పుడును
ధరియించునది నాకుఁ దనయ, తె"మ్మనిన
గురుపత్నితో నియ్యకొని, యేనుగదలి
పాతాళమున కేఁగి, పౌష్యునియింట
నాతిథ్యమొనరింప నతనిసన్నిధిని
గొనియుండి, మెప్పించి, కోమలిచేత
నొనరినతాటంకయుగ మందికొనుచు
వచ్చుచో, వెంటనేవచ్చి తక్షకుఁడు
మ్రుచ్చిలి తివిసె నేర్పున నటత్రోవఁ.
బాము లీవిధమునఁ బరువులుపెట్టి
యేమైనఁ జేసిన నెవ్వరుదిక్కు!
భూలోక[12] నాయకా, భోగుల నెల్లఁ
గాలునిఁగూర్పవె  ! క్రతుముఖంబునను,
ఈరీతి నీయాగ మీవు సేయంగఁ
గారణ మొక్కటి గల దదివినుము.

కద్రూవినతలు పుత్త్రులఁబడయుట

పరమతపోన్నతి బ్రాభవశక్తి
బరువడి కశ్యపబ్రహనాఁ బరఁగి,
ప్రకట సురాసుర ప్రముఖ జంతువుల
నకలంకతేజుఁడై యవనిఁ బుట్టించిఁ,


దీప్తప్రభావుఁడై, త్రిభువనంబులకు
బ్రాప్తుడై నెగడె; నాపరమసంయమికి
దక్షుకూఁతులు త్రయోదశసంఖ్య లెలమి
నక్షీణగతి భార్యలైవిలసిల్ల,
గద్రువ వినతయన్ కాంత లత్యంత
భద్రంపుసంపదఁ బడయుదమునుచుఁ
బతిఁగూర్చి నిష్ఠఁ దాత్పర్యంబుతోడ
వ్రతములు నోములు వరుసతోసలిపి,
యతివలు బహుసహస్రాబ్దంబులకును
బతిఁ బ్రసన్నుని జేసి భక్తితో మ్రొక్కి
నిలిచిన, నతఁడు నన్నెలఁతలఁజూచి
పలికె నెంతయుఁ గృపభరితుఁడై యపుడు :
"పడఁతుక లార, మీభక్తికి నేను
గడుఁ బ్రసన్నుఁడ నైతిఁ; గామితార్థంబు
లడుగుఁడు మీకిత్తు"; ననినఁ, బ్రేమంబు
జడిగొనఁ బాణికంజంబులు మోడ్చి,
వనిత యా కద్రువ వలనొప్పఁబలికె :
"ఘనదీర్ఘ కాయులఁ గాంతి శోభితుల
వేవురఁదనయుల వెలయని "మ్మనియె.
నావినతయు సంత నంజలి మోడ్చి :
ఘనసత్వులగు వారికంటెను శౌర్య
ధనులను నాకు నిద్దఱఁగుమారకుల
ని" మ్మని వేడిన, నిద్దఱికోర్కె
యమ్మహాముని కృపాయత్తుఁడై [13] పూడ్చి,
పడతులకపుడు గర్భములిచ్చి పలికె ? :
“కడుఁ బ్రయత్నమ్మున గర్భముల్ రెండు
రక్షించుకొనుఁ" డని రమణులననిపి,
యాక్షణంబునఁ బోయె నమరాద్రికడకు.


తరుణులిద్దఱుఁ దమతమ నివాసముల
కరిగి వేడుకనుండ, నాసమయమున
నాహారములఁ గాంక్ష లల్ప౦బులయ్యె
దేహవల్లులు పాండు దీధితులయ్యె ;
నారులుపొదలె; మధ్యంబు లొయ్యొయ్యఁ
దోరంబులై యొప్పె[14] దొరఁకొనెనలత;
వళులు జీర్ణంబయ్యె ; వరముఖాబ్జములు
కళ లేదె; [15]మనము లొక్కట బీతువాఱెఁ;
బొలుపుదీపింప నాభులు వికసించెఁ ;
బులుసులపైఁ జాలఁ బుట్టెఁ బ్రేమంబు ;
పలుమాఱు మృత్తికాభక్షణం బొదవెఁ;
దలకొని చిట్టముల్ తఱుచుఁగాఁదొడఁగె.
నీరీతి నయ్యింతులిద్దఱు గర్భ
భారంబుదాల్చి, యొప్పగుసురక్షితము
గావించుచుండఁ, దద్గర్భమ్ముల౦దు
భూవినుతంబుగాఁ బుట్టె నండములు ;
పుట్టిన, నవి కుండములలోనఁ బ్రీతిఁ
బెట్టి రక్షింపంగఁ బెరిగి నొండొండ
సరవియేర్పడఁ బంచశతవత్సరమ్ము
లరయంగఁ, గద్రువయండంబులెల్లఁ
దఱితోడ నందంద తముతామ యవిసి
సొరిదిమై శేష వాసుకి తక్షకాదు
లగుమహాభుజగంబు లందుఁ బుట్టుటయుఁ,

అనూరు జన్మవృత్తాంతము

దగవేది వినతయుఁ దనదుగర్భమునఁ
బుట్టినయండము ల్పొదలమిచూచి,
చిట్టాడువగపును సిగ్గును బెరయ,


నరుదుగాఁ బుత్రార్థియై యొక గ్రుడ్డు
తెరలుచు నవియించె దెఱప నేరమిని.
ఆయండమున నొక్కఁ డర్ధశరీరుఁ
డై యుదయించి, తా నతికోపుఁడగుచుఁ :
"గడుపూర్ణ దేహునిఁ గాకుండ నన్ను
నడరుచు నడుమ సండము వ్రక్కలించి
వికలశరీరుఁ గావించితి; గాన,
సకలవిస్ఫూర్తి నీసవతికి నీవు
దాసివిగ;" మ్మని తనుగన్న తల్లి
నీసున శపియించి యిట్లనిపలికె :
అమ్మ, యీ రెండవయండంబునందుఁ
గ్రమ్మనఁబుట్టు సఖండవిక్రముడు
చెలువొంద నీదుదాసీత్వంబుఁ బాపి
వలనొప్ప రక్షించు; వగవకుమింక ;
నయ్యండ మది తానె యవియని"మ్మనుచుఁ
జయ్యనఁజని, యర్క సారథియగుచు
నెమ్మి ననూరుండు నిజశక్తినుండె.
[16]అమ్మగువయును నన్యాండంబు నంత
నతులయత్నమ్మున నరయుచు, మిగుల
జతనంబుగాఁగ నిచ్చలుఁ బ్రోచుచుండె.

కల్పకుసుమదామ ప్రదానము

ఉర్విలో నటమున్నె, యుగ్రకోపనుఁడు
దుర్వాసుఁడనుముని దొరయనేతెంచి
చరియించుచును, నొక సమయంబునందుఁ
దరణితేజుఁడు తిలోత్తమయనుపేరి

 



యప్పరోంగన భూమి యందు గ్రీడింప
లిప్సమీరంగ నాళీనినహమ్ము
దానును వచ్చుచోఁ, దరుణీలలామ
చేనున్న కల్పకక్షితిజ ప్రసూన
మంజరీ విమలదామమ్ము వీక్షించి
సంజాత కౌతుకోత్సాహుడై చేరి :
" శుభమస్తునీకు నోశుభ కాంత, మాకు .
నభిమతమయ్యె నీయలరుల దండ,
పొసఁగంగ బ్రాహ్మణ బుద్ధిగా మాకు
నొసగుము నీవన్న, యుగ్మలి యపుడు
పటుభక్తిమైఁ బాణిపద్మముల్ మొగిచి,
నిటలంబు పైఁజేర్చి, నెఱిసన్నుతించి
“యోమునినాథ, నీయుల్లంబులోన
నీమాడ్కిఁ బ్రియమైన నిదియెంతపెద్ద
కో”. మ్మనియొసగఁ, గైకొని మునీంద్రుండు
సమ్మదంబొదవ నచ్చరఁ బ్రస్తుతించి,
యావుష్పదామకం బఱుత నుల్లాసుఁ
డై పూని విహరించునాసమయమున,
నేమహాత్ముని [17]దొడ్డి నెల్ల కాలంబుఁ
గామధుగ్ధేనువుల్ కదుపులై యుండుఁ,
బారిజాతంబు లేప్రభువు క్రీడించు
నారామమున గుంపులై కనుపట్టుఁ
దలఁపుఱాలెపుడు నేధన్యుగేహమున
నెలకట్టడంబులై నెలకొని వెలయు,
నచ్చర లేవేల్పునాస్థానసీమ
నిచ్చలుఁ గాసించి నిలిచియుండెదరు,



ఓజమై జరయుఁ జావును దెవుల్ లేని
భోజనంబమరు నేపుణ్యభాగునకు
నా నిత్యశుభ సాంద్రుఁడగు నమరేంద్రుఁ
డానందకందళితాత్మకుండగుచు
దనవేయి గన్నులఁ డనరుదీధితులు
నినుసారి పగలు వెన్నెలలు గావింపఁ ,
దనమౌళిరత్న సంతాన ప్రభాళి
యిన కిరణాళితో నీడు జోడాడఁ,
దనచేత విలసిల్లు దంభోళిధార
ఘనతర దుష్టశిక్షకుఁజాలి .....
దనపాదములు దేవతాకోటి మకుట
వినుతరత్న ప్రభా వితతి వెలుగఁ .
దనయొప్పిదము దివ్య తరుణీ కటాక్ష
జనిత తృష్ణలకు నుజ్జ్వలభుక్తి నొసఁగ ,
దనయశోరమను గంధర్వకిన్నరులు
మునుకొని కై వారములు బిట్టు సేయ,
లాలితోజ్జ్వల చంచలాలతా కలిత
కైలాస భూధర క్రమమునఁ బొలుచు
సలలిత కనకభూషణ కాంతిజాల
విలసితంబై జగద్విఖ్యాతి నొప్పు
ధళధళమను [18]. చతుర్దంత కాండములు
గలిగినయట్టి దిగ్గజముపై నెక్కి,
సముదీర్ణ కంకణ ఝణఝణారావ
కమనీయ సురవధూకర [19]2 వీజ్యమాన
బహుళచామర [20]జాతపవన సంచలిత
మహనీయకుండల మండితుండగుచు,
నతిసమున్నత మౌక్తికాతపత్త్రంబు
నతులితస్థితి నభంబంతయుఁ బొదువ,


నన లార్కి రాక్షసేంద్రాప్పతి వాయు
ధనద శంకరులు, ముదంబుతో మేష
కాసర మానవ ఘననక్ర హరిణ
భాసురాశ్వోక్ష సంపద లెక్కి నడువ,
నసమానముగ సిద్ధ యక్ష , గంధర్వ
పసు రుద్రసాధ్య గీర్వాణ కింపురుష
కిన్నర మరు దశ్వి ఖేచ రాదిత్య
పన్నగ గుహ్యకప్రవరులు గొలువ,
[21]వరవీరు లగు చక్రవర్తులు, రాజ
వరులును సంప్రీతి వరుస సేవింప,
సనుపమి తో చ్చైశ్ర, వాశ్వరత్నంబు
మునుకొని పడివాగె ముందఱ నడువఁ,
గదిసి నిర్జరలోక కంచుకిజనము
ముదముతో నోంకారముఖరులై కొలువ
నేతెంచు నమరేంద్రు నీక్షించి, యర్థి
నాతఱి దూర్వాసుఁ డట నెదురేఁగి,
పోలంగ నాననాంబుజము నిక్కించి,
లీలఁ జేతులుదోయిలిగఁబట్టి చాచి :
"దిగ్విజయోస్తు ; తే దీర్ఘాయురస్తు ;
ప్రాగ్వర, సంకల్పఫలసిద్ధిరస్తు ".
అని యిట్లుదీవించి, యధిపుల గురులఁ
గని రిత్తకేల డగ్గఱరాదుగానఁ,
దనచేతనున్న మందారప్రసూన
ఘనతరదామంబు కాన్కగా నొసగ'
'మునిలోకవర్య, నమోనమో' యనుచుఁ
గొనకొని చేతియంకుశ మొయ్యఁ జూచి,


యామునీశ్వరుఁడిచ్చు నలరులదండ
ప్రేమతోనంది యాత్రిదశనాయకుఁడు
కడఁక నైరావతకంఠ దేశమునఁ
దడయకవైవ, నాదండతావులకుఁ
గలగొని చంచరీకములు ఝంకార
ములతోడ నటచుట్టుముట్టి కాఱింప,
నుడురాజబింబంబునుండి చలించి
కడుఁజుట్టుముట్టు చీకటిగుంపులట్లు
అలులతండము లసంఖ్యములుగా మూఁగి
పలుచందములఁ జెవుడ్పడఁగ మ్రోయఁగను,
దగ మును కటయుగ (దాన) ధారలకు
మిగులఁ గాఱించుతుమ్మెదలకుఁ దోడు
దండతావులకు నుద్దండతఁ బొలయు
గండుతుమ్మెదలచేఁ గాసిలి యలసి,
చయ్యన నాదిగ్గజము కరాగ్రమున
నయ్యలరులదండ నవలీల నొడిసి,
మొరయుచు [22] నెలతేఁటిమొత్తంబులెల్లఁ
బరచి దిక్కులఁ బటాపంచలై చెదర
బిట్టుగా నింగికి బిరబిరఁద్రిప్పి,
'యిట్టిచందమున సురేంద్రునిలక్ష్మి,
భ్రమణంబుతో నేలపాలగు నేడు
కొమరువో' నన్నట్లు కుంభినివైచి,
మండి [23] గాఢత దంతమండలిఁ గ్రుమ్మి,
తొండంబుచే వెండి తోడనె యెత్తి,
యొక్క కాలునఁ ద్రొక్కి యుద్ధతిఁ ద్రుంచి,
చిక్కుగా నలినలి చిద్రుపలై దొరఁగఁ
బటుభంగి నిలఁబెట్టి పదములఁబ్రామి,
చటులత రూపనాశంబు గావించి,


గమికొన్న మేఘసంఘము చాయ మించు
 [24]హిమశైలమునుబోలి యిభనాథు డమరె.

దూర్వానుఁ డింద్రుని శపించుట

అప్పుడు దూర్వాసుఁ డయ్యమరేంద్రు
నిప్పులు చెదరంగ నిబిడరోషమునఁ
బృథులాజ్యధారల పెల్లున నెనయు
ప్రథి తానలముభంగి భగ్గునమ౦డి,
మోమున నెత్తు రిమ్మునఁ గ్రమ్ముదేర
మోమును సర్వాంగములుఁ జెమరింపఁ,
బ్రళయాగ్ని రుద్రుని ఫాలాక్షి వహ్ని
లలిఁబొల్చు బడబానలము నైక్య మొదవి
మునిరూపమున నిట్లు మొనసెనో యనఁగఁ
గినిసి, యయ్యింద్రు నీక్షించుచుఁ బలికె:
"నోరిమదాంధ, నీయున్నతైశ్వర్య
కారణంబున నీకుగౌరవంబొదవ
నేనుదీవించి నీ కిచ్చినయట్టి
మానిత పుష్పదామంబు గైకొనక,
కలిమిమై నిలఁ గల్పకంబులు పెక్కు,
గలవని మదిలోనికండగర్వమునఁ
గడునెల్లిదంబునఁ గరటికుంభమున
నిడితివి; యే నీకు నింతయల్బుఁడనె!
ధరణిఁ జేయఁగరానితప్పొనర్చినను,
గరుణఁ గాచినయట్టి [25]గౌతమఋషినె !
అనుదివసంబుఁ బంచాంగంబు చెప్పి
పనులొనర్చెడు బృహస్పతిగఁ జూచితివె !


ఏ నల్గిచూచిన నీక్షణంబునను
బూని కులాద్రులు పొడిపొడైరాలు;
రవి శశి తారకా గ్రహసమూహంబు
లవలీల నిర్ధూతమై నేలవ్రాలు,
గలఁగి గుల్లలు నిసుకయును శేషించి,
జలనిధులేడు శోషతనొంది యింకు;
జగతియంతయు జీవజాలంబుతోడ
మొగిఁ దిర్గి పాతాళమునఁ గూడియణఁగుఁ ;
బరగ సర్గ స్థితి ప్రత్యవహార
కరులైనమూర్తులు గలగి పాఱుదురు;
పుడమిలోఁగలిగిన భూరికోపంబు
వడఁగట్టి తెచ్చినవాఁడ నేననిన,
నీ వెంతవాఁడవు! నీబలం బెంత!
దేవతావలి యెంత! త్రిజగంబు లెంత!
కొఱవిచేఁ దల గోఁకికొన్నచందమున
నెఱుఁగక నాకు నీ వెగ్గుచేసితివి;
అహహ! మే," లని, యట్టహాసంబు తీవ్ర
దహనకీలాకళాతతిఁ గీడుపఱుపఁ:
"జెడుగ, నీయాచరించిన ఫలంబెల్లఁ
గుడుతువుగా"కని ఘోరవాక్యముల
శతమన్యు నీక్షించి, శాపోదకంబు
లతిభీమగతి నేలనలికి యిట్లనియె:
“నిలమీఁదఁబడినట్టి యీపూలదండ
నలఁగినగతి నీవు నలఁగు సొంపేది.
మాననీయుల నవమానం బొనర్పఁ
గా నీకు మహితమై కడుహెచ్చియున్న
భవదీయరాజ్యసంపదలు, నీభూరి
వివిధపరిచ్ఛేదవిభవంబు లెల్ల,


జడనిధిలోన నాశ్చర్యంబుగాఁగఁ
బడుగాక" యనుచు శాపంబొనర్చుటయు,
జగము లల్లాడె; భూచక్రబంధంబు
దిగియె; భూవలయంబు దిర్దిరఁదిరిగెఁ;
గులగిరిశ్రేణి యాకులతఁ గంపించె;
జలరాసులెల్లఁ జంచలమంది మ్రోసె;
భానుదీప్తులు మాఁగుబాఱె; నుల్కములు
సోనలై భువిరాలె; సురలు భీతిలిరి .
వెఱఁగును, శోకంబు, విహ్వలం బొదవ
సురపతి సురసుర స్రుక్కి యావేళ
కరిమీఁదనుండి గ్రక్కన నుర్వి కుఱికి,
కరములు మొగిచి, గద్గదకంఠుఁ డగుచు :
“నోసంయమీంద్ర, నీయుల్లంబులోన
సీసుపుట్టిన నెవ్వ రెదురంగఁగలరు!
తనయుఁ డజ్ఞానియై తప్పొనర్చినను
గినియక తండ్రి శిక్షింపంగఁ దగదె!
పశుమతినైన నాభావంబులోన
వశమె నీదగు ప్రాభవంబు నెఱుంగ!
తొలఁగక [26]సాపరాధులకైనఁ గీడు
తలఁపమిగా తపోధనులకు వన్నె!
దేవర యొసగిన దివ్యదామంబు
కావరంబున వైవఁ గరిమస్తకమున;
బాహుళ్యలోలంబ బాధకైకాని,
శ్రీహరిసాక్షి మీచిత్త మే నెఱుఁగ.
నమలాత్మ, నేఁ జేసినట్టి యీతప్పు
క్షమియింపు క్షమియింపు క్షమియింపు" మనుచుఁ
గరములఁ బాదయుగ్మముఁ బట్టుకొనిన,

విరసమందుచు మౌని విరసించిపలికె:


“నెనసి క్రాలినవహ్ని నెగఁదోయు భంగిఁ
 బెనఁగొని నటనట ప్రియము సేయకుము
 ఈ[27]వట్టిమాటలకెల్లను గరుణ
 యే వెంట నామది నేల జనించుఁ!
 జూలుఁబోచాలు! నిచ్చలుఁ బనిలేని
 జోలిమాటలును మెచ్చులుగావు మాకు.
 ఇంక నొండాడిన నిప్పుడు గడమ
 కొంకులుమాని [28]నీగుఱుతు మాయింతు;
 వలవదు తల;" మని నగి మూర్ఖవృత్తిఁ
 బలుకుచు నామౌనిపతి వేగఁ జనియె.

అమరలోకపతనము

అప్పుడు దేవేంద్రుఁ డాత్మలో శోక
ముప్పతిల్లఁగ, దైన్య మొదవ నాస్యమున,
సకలనిర్జరసైన్యసమితియుఁ, దానుఁ
జకితమనస్కుడై చయ్యన మగుడి
 యమరావతికి నేఁగునప్పుడు, పురము
 కొమరేది దూర్వాసుకుటిలవాక్యముల
 వరుసఁ జెప్పఁగఁ జూప వాక్రువ్వరాని
 పరుసున నెంతయుఁ బాడొందెఁజూడ.
 సురుచిరసురభూజశూన్యంబులైన
 పురబాహ్యభాగవిస్ఫుటవనంబులును,
 వరహేమసన్మణివజ్రముల్ లేని
 గురునగరద్వారగోపురంబులును,
 సరవి నందంద రక్షకకోటి లేక
 యరయంగ [29]నాఱడియైన వాకిళులు,


రహి తూలఁ గానంగ రంగభోగముల
మహిమ వాసిన దేవమందిరంబులును,
రత్నదర్పణవిభారహితంబులైన
[30]నూత్నసమగ్రమందురగోపురములు,
హారి దుకూలధ్వజావళి లేక
సారంబులెడలు ప్రాసాదపంక్తులును,
లాలితనర్తకీలాస్యంబు లుడిగి
డాలఱియున్న నాటకగేహములును,
బ్రచుర[31]వధూరత్నభాస్వద్విలాస
రుచిహీనమైన శిరోగృహంబులును,
లలనాకటాక్షలీలావలోకముల
తళుకులు లేని వాతాయనంబులును,
మిడుకమానిసి లేమి మిగులఁ బాడొంది
యడరి దయ్యాలు కొట్లాడు వీథులును
గలిగి, దగ్ధపటంబుకైవడిఁ దోపఁ
బొలుపేదియున్న యాపురము వీక్షించి:
'కటకట! తపసి తెక్కలివిధి యగుచు
నిటు చేసెనే!' యని యెంతయుఁ బొగిలి,
కరి డిగ్గి, దివిజసంఘము నెల్లఁ జూచి,
వరుసతో 'నిచ్చోట వసియింపుఁ ' డనుచు
బలుకుచు నగరిలోపలి కొయ్య నేఁగి,
కలయంగ నలుదెస ల్గనుగొనునపుడు,
పూని రథంబు లద్భుతముగాఁ బోయె;
ధేనువు మొదలనె దీపింపదయ్యె;
నటుపోవ నెల్లచో నలపడియుండు
పటుదివ్యరత్నముల్ భాసిల్లవయ్యె;
మఱియును జనిచూడ మాయంబులైరి

మెఱయు రంభోర్వశీమేనకాదులును.


ఈచందమున సర్వహీనమౌ నగరు
చూచి, విస్మయమును శోకంబుఁ గదురఁ
జిడిముడి వెలికివచ్చినయంతలోన,
సడికి నైరావతోచ్చైశ్శ్రవం బేఁగె
ఈవిధి సంపదలెల్ల నొండొండ
పోవుట చూచి యప్పుడు చాల నలిగి,
దహ నార్కి దనుజ యాదఃపతి గంధ
వహ యక్షపతి వృషధ్వజులును దాను
దలపోసి, తమ కాపదలు పొందినపుడు
తలఁగించుగురుని నత్తఱి బిల్వఁ బనిచి
చనుచేర నందఱుఁ జయ్యన లేచి,
పనివడి భక్తిసంభ్రమమున నెఱఁగి,
యందఱు నొక్కచో నాసీనులైన
నందుసురేంద్రుఁ డయ్యాచార్యుఁ జూచి
తారందఱును మహీస్థలికి నేఁగుటయు,
వారక యచట దుర్వాసుఁ గాంచుటయు,
నామునీంద్రుఁడు దామ మర్థి నిచ్చుటయుఁ,
దా మది గజము మస్తమున వైచుటయు,
నళులచేఁ గాసిలి యలసి యాగజము
నలిరేఁగి యాదండ నలియమోఁదుటయుఁ,
బలుమాఱు విలపింప భావింప కతఁడు
చలమునఁ గోపించి శపియించుటయును,
దివిజాగములు వేల్పుదెఱవలు కామ
గవి దివ్యమణి సురగజతురంగములు
మాయమై చనినక్రమంబును, దెలుప
నాయెడ వెఱఁగంది యాంగీరసుండు :
“విధినిర్మితంబు నేవిధమునఁ గడప

నధికులై తలపోయ నధిపు లెవ్వారు!


మనకెల్ల దిక్కు తామరసాసనుండు;
చని యమ్మహాత్ముని 'శరణ'న్న, నతఁడు
వలగొను నీదురవస్థలన్నియును
దలఁగించు; నటకుఁ బోదమం” డని కదలి,

అమరులు బ్రహ్మయొద్ద కేఁగుట

తడయక వారును దానును గూడి
కడువేగ బ్రహ్మలోకంబున కేఁగి,
ధర్మతపోయజ్ఞదానదక్షిణలు,
నిర్మలశ్రుతిశీలనీతిసత్యంబులు,
పరమాత్ములగు సురబ్రహ్మసంయములు,
వరుసతోడుతఁ జక్రవర్తులు, నృపులు,
మునుకొని హస్తాబ్జములు ముకుళించి
వినయంబు మెఱయ సేవింపుచు నుండ,
వీణా[32]లసచ్ఛుకాన్వితపాణియైన
వాణీసమేతుఁడై వరసౌఖ్యలీల
గమలభాసురకర్ణికావిస్తరమున
రమణమైఁ గొలువున్న బ్రహ్మకు నెఱఁగి,
యతులితభక్తి హస్తాబ్జముల్ మొగిచి
వితతాగమోక్తుల వినుతించుటయును,
సారసభవుఁడు వత్సలత దీపింప
వారల వదనవైవర్ణ్య మీక్షించి;
"గురు శక్ర శిఖి యమ కోణవ వరుణ
మరు దర్ధపతి శివుల్, మదిఁ జాల నలసి
వచ్చినయట్లున్నవారలె! యలఁత
యొచ్చోటినుండి మీ కిటు సంభవించె!


కడుకొని ధర్మమార్గంబు దప్పితిరొ !
యెడపక గురునకు నెగ్గొనర్చితిరొ!
అడర విప్రద్వేష మాచరించితిరొ!
వేఁడినయర్థుల వృథగఁ బంపితిరొ!
తవిలి విశ్వాసఘాతక మొనర్చితిరొ!
భువిలోనఁ బూజ్యులపూజ దప్పితిరొ!
ఈలీల మీకేల యిటుచిన్నవోవ!
నాలోకమునను దైన్యము చేటు నగవు
దారిద్య్ర శోకసంతాప[33]వార్ధక్య
దారుణమృత్యుబాధలు చెందరాదు.
ఇందువచ్చియును మీరిందఱు నార్తి
డెందంబులో సందడింపఁ దూలుదురె!
వెఱవక చెప్పుఁ; డేవిధముననైన
మొఱమొఱ మాన్పి మీమెచ్చు గావింతు”,
నని కృపఁబల్కిన, నా బ్రహ్మపలుకు
విని, చిత్రవాక్యప్రవీణను మెఱయ
సరసమానవుఁడు వాచస్పతి యపుడు
కరములు మొగిచి వాక్పతి మ్రోల నిలిచి:
"నిఖలాధినాయక, నీదుచిత్తమున
నఖలలోకములవృత్తాంతంబు లెల్ల
మడవక కరతలామలకము; ల్దెలియఁ
బడయకయుండునె! లోకభర్త! వాణీశ!
ఐనను, దేవ! నీ వడిగితిగాన
నేనెఱింగిన దాని నిట విన్నవింతు".
నని యింద్రుఁ డుర్వి కత్యంతహర్షమునఁ
జనుటయు, దూర్వాసు శపియించుటయును,
అలవడ నాదిమధ్యావసానంబు

దెలుపంగ, విని భారతీయనాయకుండు:


“కటకట! దూర్వాసు కడుమొక్కలీఁడు!
కుటిలుండు! నన్నుఁ గైకొనఁడు చీరికిని!
ఆనిష్ఠురాత్ము [34] నిట్లతకరింపుదురె !
నేను నిన్నేమననేర్తు నోయింద్ర!
ఎడపక క్రూరమృగేంద్రునికోర
లడరునుధ్ధతిఁ [35]జేత నాడించియైన,
మదతరంగితతీవ్రమాతంగవిభుని
గదిసి తుండాగ్రంబుఁ గబళించియైనఁ,
గలిత [36]క్షుధార్తఋక్షంబు మీసముల
నలపడఁ బొదివి యుయ్యల లూగియైన,
నుదితకోలాహలాత్యుగ్రకాలాహిఁ
బదమునఁ గ్రౌర్యమొప్పఁగఁ దన్నియైన,
నలఘుకీలానికాయాభీలమైన
ప్రళయానలంబులోపలఁ జొచ్చియైన
గ్రమ్మఱఁజని బ్రదుక గాఁబోలుఁ; గాని,
యమ్మూర్ఖుఁ జెనకి యెయ్యెడ బ్రదుకవశమె!
వఱలంగఁ బదివేలువచ్చెఁ! జాల్చాలు!
మఱియొండనాక యీమాత్రనె విడిచె!
ప్రాణంబలుండ సంపదలేమిదొడ్డు!
త్రాణయై మనకు నారాయణుండుండ.
ఆ దేవుతోడ నీయాపద లెల్ల
నాదట వినుపింత మటకుర"మ్మనుచుఁ
జతురాస్యుఁ డాసభాసదుల వీడ్కొల్పి,
హితబుద్ధి నమరుల నెల్లఁ దోడ్కొనుచు,
మాకాంతునకు నిత్యమందిరంబైన

వైకుంఠపురవరద్వారంబు చొచ్చి,



     వైకుంఠపురవర్ణనము

పోవఁగా, నప్పుడు పుణ్యగేహమున
శ్రీవైష్ణవాస్పదశృంగారగరిమ
రతిమీఱు విష్ణుపురాణంబు భాగ
వతమును మొదలైన వైష్ణవకథలు
సొరిదిఁ బఠించు శిష్యులకు బోధించు
నురుపుణ్యభాగవతోత్తమవ్రజము,
ననవరతంబు : "నారాయణ, కృష్ణ,
దనుజమర్దన, జనార్దన, వాసుదేవ,
శ్రీరామ, హరి, శార్ఙ్గి, శేషపర్యంక,
వారిజోదర, రమావక్ష , గోవింద"
యనుచును భువననాయకు విష్ణుదేవు
ఘనకృపాపాత్రులై కడుచెన్నుమీఱి ,
కామరోషాదివికారము ల్మాని,
వ్యామోహకోటులు వదలించివైచి,
మొనసి పంచేంద్రియంబులు మూలకొత్తి
మనమున హంకారమమతలు పాసి,
రాజస తామస ప్రబలంబు లుడిగి,
తేజిల్లు పరమసాత్వికమె చేపట్టి,
యరుదార నిజకృతంబగు క్రియలెల్లఁ
బరమాత్మునకు సమర్పణము గావించి,
సతతంబు శైవవైష్ణవసమర్చనలె
మతములుగా నప్రమత్తమార్గమున
సముచితోన్నతి మీఱ జరపువైష్ణవుల,
రమణ బ్రహ్మర్షి నారద పరాశరులఁ,
బ్రాకటంబుగ మంత్రపాఠక వైష్ణ
వైకాంతికులఁ, బరమైకాంతికులను


గనుఁగొని యేగుచోఁ, గమలసంభవుఁడు
నెనసిన వేడ్కతో నింద్రున కనియె:
"చూచితె యింద్ర, విష్ణునిమహామహిమ!
యీచందమని తెల్ప నెఱుఁగంగ రాదు.
అనయంబు విష్ణుదివ్యాలయంబులకుఁ
గనుకని నేఁగి కైంకర్యంబు చేసి,
దేహాభిమానముల్ దిరుగంగ విడిచి,
మోహతృష్ణాదులు మొదలంటఁ బొడిచి
చరియించునట్టి సజ్జనుఁ డందుసుమ్ము
వరుసనెయున్న పావనశుభోన్నతులు.
దారిద్య్ర[37]శోకసంతాపంబు లొకటఁ
జేరిన నందుచేఁ జీకాకుపడక,
ధనధాన్యములు [38]సోఁకు దశలకుఁ బోక,
తనరెడు హరిభక్తి ధనముగా వెలయు
నసమానధన్యాత్ములగువారు సుమ్ము
పొసఁగ నీయున్న సత్పూజ్యులు వజ్రి!
ఒలయ నేకాదశి నుపవాసముండి,
పొలుపుతో ద్వాదశిపొద్దు సాధించి,
భూసురారాధనంబులు చేసినట్టి
భాసురచరితు లీభవ్యాత్ములెల్ల.
జప తపస్ స్వాధ్యాయ సర్వధర్మాత్మ
విపులకర్మంబుల విసువున విడిచి,
యనయంబు శైవదూషణమాని, కీర్తు
లొనరంగ వెలసిన యుత్తముల్ వీరు.
[39]కుడువఁ గూడును, గట్టఁ గోకయు లేక
బడలిన హరిభక్తిపరులఁ జేపట్టి,


యన్నపానాంబరాద్యములఁ బోషించి,
సన్నుతిగన్న సజ్జనులు వీ రింద్ర!
పరికింపఁ బదికోట్లుబ్రహ్మకల్పంబు
లరిగెడునప్పు డీయచ్యుతుపురము
గసుగంద; దేమియుఁగా దొకింతయును;
విసువదు; నొగులదు; వేదనపడదు;
గరిమతో ననివృత్త కైవల్య మొసగు;
వరశుభాకుంఠ మీవైకుంఠపురము.
మహిమతో దద్దివ్యమందిరంబునకు
సహజసాహసులు, రక్షకులైన వారు,
దారుణవికటాష్టదంష్ట్రులు, నతుల
సారతేజులు, చతుష్షష్టిదంతులును,
ఘనతరమస్తకకఠినోగ్రవక్షు,
లనుపమచరణశోభాసహస్రాఢ్యు
లరయంగ లక్షకోట్లర్బుదపద్మ
వరశంఖసంఖ్య, లవార్యశోభితులు,
చండ[40]ప్రచండులు, చక్రి కింకరుల
ఖండితు లేపొద్దుఁ గాచియుండుదురు."
అని యని చెప్పుచు నాపద్మభవుఁడు
మునికొని వచ్చుచో, మొగి నొప్పుమీర
మాండవ్య కపిల రోమశ భరద్వాజ
శాండిల్య భృగు పరాశర కుంభజన్మ
నారద వ్యాస శౌనక గౌత మాత్రి
వారిభుగ్జటిల పర్వత పైల సుబల
శుక మతం గాంగీరసులు మొదలైన
సకలమునీంద్రు లుత్సవలీలఁ గొలువఁ,


బరమపుణ్యులు విష్ణుభాగవతులును
గరిమతో నంతంతఁ గదిసి సేవింప,
భోగికులాధీశు భోగపీఠమున
రాగిల్లు శ్రీ రమారమణితోఁ గూడి

వి ష్ణు సం ద ర్శ న ము



కొలువిచ్చియున్న యాకువలయశ్యాము,
సలలితవికచాంబుజాతాయతాక్షు ,
నిరుపమ మణివిభా నిబిడకిరీటు,
సురుచిర [41]కుండలస్ఫుటగండభాగుఁ,
గౌస్తుభ శ్రీవత్స కలితోరువక్షు,
శస్త పీతాంబరోజ్జ్వల దివ్యదేహుఁ
బొడగని, సాష్టాంగములు భక్తిఁ జేసి,
సడలనిభక్తి హస్తాబ్జముల్ మొగిచి :
"జయ జయ గోవింద, జయ చక్రహస్త,
జయ జయ లక్ష్మీశ, జయగదాపాణి,
నారాయ, ణాచ్యుత, నగధర, కృష్ణ,
వారిజోదర, భక్తవత్సల, శార్ఙ్గి
వైకుంఠ, కేశవ, వరద, మురారి,
లోకేశ, హరి, కృపాలోల, ముకుంద,
యనిరుద్ధ, పాపసంహర, విష్ణుమూర్తి,
వనజాక్ష, కైవల్యపర, వాసుదేవ,
పన్నగశయన, యాపన్నుల మమ్ముఁ
గ్రన్నన రక్షించు కారుణ్యనిలయ!”
అని సన్నుతించు బ్రహ్మాదులఁ జూచి
వనజనాభుఁడు కృపావర్ధిష్ణుఁడగుచు,
చిఱునవ్వుఁ గృపయును జెలగుచూవులను

బెరయంగ జలదగంభీరనాదమునఁ :


"బరమేష్ఠి గురు శక్ర పావ[42] కార్క్యసుర
వరుణ మారుత యక్షవర రుద్రులార !
కడుదురవస్థయుఁ, గార్యదాహంబుఁ
బొడమెడు మీముఖంబుల నాకుఁజూడ;
వచ్చినపని యేమి వ్రాక్రువ్వుఁ? డిప్పు
డచ్చుగాఁ దీర్చి మీయడలు వారింతు.”
నని యానతిచ్చిన యాదేవుపలుకు
విని, యటు శారదావిభుఁడు కేల్మొగిచి:
"అధ్యాత్మవేద్య, నీయంతరంగమున
బోధ్యంబు గానిది భువిలోనఁ గలదె!
శ్రీవర, యడుగంగఁ జిత్తగించితిరి;
గావున, వినుపింతుఁ గల తెఱంగెల్ల."
నని యింద్రుఁ డుర్వి కేఁగినను దూర్వాసుఁ
జెనకి యాతనిచేతఁ జేటొందినట్టి
విధమంతయును విన్నవించిన, నపుడు
మధుదైత్యమథనుఁ డామఘవు నీక్షించి :
"యేమి దేవేంద్ర, నీ వెఱుఁగవే యకట!
యామూర్ఖు (నతి)క్రూరుఁడని జనుల్ పలుక.
పిన్నబిడ్డవె నీవు! పెరిమె వెన్నడచి
నిన్నింక బుద్ధులు నేర్పెదమన్న!
నొకయొకవేళ మాయున్నెడ కతఁడు
వికలుఁడై యున్మత్తవిధమున వచ్చు;
నప్పుడు నేమెల్ల 'నాకుటిలాత్ముఁ
డెప్పుడు పోవునో యిట' నని యాత్మ
జలదరింతుము; గాని, స్వస్థత మదికి

గలుగ దాతపసి దిగ్గనఁ బోవుదాఁక


పట్టి చంపఁగరాని పగఁ దెంపరాని
యట్టిచందంబున నతఁడు దుర్లభుఁడు.
విడువు శోకము; 'బండి విఱిగినవాఁడె
కడు వెఱ్ఱివా' డనఁగాఁ బోలదింక .
సొమ్ము పోనాడినచోటికె యరిగి
క్రమ్మఱ సాధించి కాంచినభంగి,
జడనిధిలో సమ స్తముఁ గూలెఁగాన
మడవక యవ్వార్థి మథియింపవలయు.
కవ్వంబు మంథనగంబుగా, దాని
కవ్వాసుకియె సూత్రమై యుండుటొప్పు.
నమరులు బలహీనులై యున్నవారు;
తమకంబుతో నబ్ధి దరువంగలేరు.
సరవితో నొకప్రయోజనమైనయపుడు
బిరుదేది పగఱతోఁ బ్రియమాడియైనఁ
జేకూరఁ గార్యంబు సిద్ధించినపుడు
పైకొని వైరంబు పాటించు టురవు;
కావున, నరిగి రాక్షసకోటితోడ
వేవేగ సంధిగావించుట యొప్పు.
వారు మీరును గూడ వారిధిమథన
మారూఢిఁ గొనసాఁగు; నగుఁ బనులెల్ల."
ననిపల్కి, యా దేవుఁ డప్పుడు ధిషణు
దనుజనాయకులయొద్దకుఁ బోవఁబనిచి,
గొనకొన్న వేడ్కతోఁ గొలువుచాలించి,
[43]..................................
సదమలాత్ముల మునీశ్వరుల నందఱను

ముదముతో నాశ్రమంబులకుఁ బోఁబనిచి,


కరచతుష్టయమున ఘనశంఖ చక్ర
వరగదా నందక వ్రాతంబు వెలుఁగఁ,
బ్రాతరంభోజాప్తుభాతిఁ గిరీట
మాతతకాంతుల నమరి దీపింపఁ,
దొలఁగక రవియుఁ జంద్రుఁడు ప్రకాశమునఁ
దెలివొంది కనుల నుద్దీప్తిఁ బొల్పెసగ,
నమలినపీతాంబరాంచలద్వయము
కమనీయగతి రెండుగడలఁ దూఁగాడ,
హారకిరీటహేమాంబరాభరణ
చారుభూషణవిభాచ్ఛటలు శోభిల్ల,
ఫణికులేశ్వర యక్షపతులు సద్భక్తి
మణిమయచ్ఛత్రయుగ్మమ్ము ధరింప,
నెమ్మి నీశానుండు నిర్జరేశ్వరుఁడు
ప్రమ్మి ముందఱ బరాబరి సేసి నడువ,
వరుణదేవుఁడు గంధవహుఁడుఁ గా [44] లూఁది
వరుసతోడుత నాలవట్టముల్ వైవఁ,
బ్రకటించి యముఁడును రాక్షసేశ్వరుఁడు
[45]నకుటిలమతితో జయముపెట్టుచుండ,
నరవిందసంభవుం డర్ధిమై వెనుక
గురుతరభక్తిమైఁ గొలిచి యేతేర,
నుగ్రతేజులు ప్రతాపోగ్రమానసులు
నిగ్రహానుగ్రహనిపుణులౌ మునులు,
ఘనయశులైన కింకరులసంఖ్యములు
నెనసినభక్తిమై నెనసి సేవింప,
బ్రహాండచయములఁ బాలించునట్టి

జిహ్మగశాయి యాశ్రితరక్షకొఱకు


నంచితలీల దుగ్ధాంభోధికడకు
వేంచేయఁగాఁ, గాంచి వెస నబ్ధిరాజు
తడయక యాచక్రధరునకు నొసగ
వడి నర్ఘ్యపాద్యముల్ వరుసతోఁ గొనుచు
నెదురేగి పూజింప, నెలమి నాహరియు
ముదముతోఁ గొని యాసముద్రు మన్నించె.

బృహస్పతి రాయబారము



అయ్యవసరమున, నట బృహస్పతియుఁ
జయ్యననేఁగి యుజ్జ్వలనీతిశాలి
బలి కాలకేయోగ్ర బాష్పల భీమ
[46]నల విప్రజిత్ శకంధర తీవ్ర నముచి
పనస బిడాల శంబర శతమాయు
లనువారు మొదలైనయసురనాయకులఁ
బొడగాంచుటయును, నప్పుడు వారలెల్ల
నుడుగనిభక్తిఁ బ్రత్యుత్థితులగుచు :
"ననఘచరిత్ర, నీయరుదెంచినట్టి
పనియేమి? దయ మాకుఁ బస నానతీవె!"
నావుడు, నాదైత్యనాథులతోడ
నావిబుధాచార్యుఁ డనియె నేర్పెసగ :
"అమరవల్లభుఁడు మీయందఱితోడ
సముచితముగఁ గూడి చరియింపఁదలఁచి,
పవిపాణి మీతోడఁ బలుకుమన్నట్టి
వివరంబు చెప్పెద; వినుఁడు మీరెల్ల:
'తాము మేమును నన్నదములమయ్యు
నీమాడ్కి నన్యోన్య మీసుగానేల!
[47]జగతి నేప్రొద్దొ గోచారాన మనకు

జగడంబు వచ్చినఁ జనునె పాయంగ!


నుభయవాదులముఁ గూడుండిన, మనకుఁ
ద్రిభువనంబుల నెదిరింపంగఁగలరె!
యొనరంగ మనమెల్ల నొక్కటై దివిజ
దనుజ భటాలిచేఁ దడయక యిపుడు
తోయధి మథియింప దొఱకును నమృత ;
మాయమృతముఁ ద్రావునంతనె మనము
చావును, దెవులును, జరయును, నెవ్వి
భావింపగా రాక భాసిల్లఁగలము.
మాయెగ్గులేమియు మదిలోన నిడక
యీయెడ మీరెల్ల నీ కార్యమునకు
..............................
...............................
కించిత్తు మేలును గీడును లేదు!
పంచుక యనుభవింపఁగఁ గీర్తిగలుగు.'
నని చెప్పి పుత్తించె; నదియునుఁగాక ,
యెనయంగ మీరెల్ల నేకరూపమున
వినుఁడు నామాట; యీవిధమున నడువ
ననుకూలమైనచ్చు నన్నికార్యములు."
నని, వారుపల్కినయందులకెల్ల
మొనసి ప్రత్యుత్తరంబులు చెప్పి తీర్చి,
యొడఁబర్చు నావేల్పుటొజ్జలపల్కు
కడునిశ్చయించి, 'యౌఁగాక' ని, యపుడు
బహుదైత్యదానవపటలితోఁ గూడి,
మహి పెల్లగిల్ల నమర్త్యారివరులు
నడిచిరి తమకు మున్ననువొందుచోటు
పొడగాన క; ట్ల పో భువనంబులోన!
ఈరీతి నాదానవేంద్రులసేన

దారుణగతి నబ్ధితటమున కరుగ,


నత్తఱి సురలు నయ్యసురులుఁ గదిసి,
క్రొత్తగాఁ బరిరంభకుశలప్రసంగ
వందనప్రియవచోవ్యాపారలీలఁ
గ్రందుగాఁ జెలఁగి యుత్కటహర్షులైరి.
అప్పుడు హరియు, బ్రహ్మయు, సురాసురులు
నొప్పగా మంథాద్రియొద్దకు నడచి.

స ము ద్ర మ థ న ము



రయ్యెడ విష్ణుండు నాంబుజాసనుఁడుఁ
జయ్యన నమ్మహాచలము భేదించి,
శేషు ననుగ్రహించిన నాతఁ డలరి,
భీషణతరమైన పృథివీధరంబు
నతిసత్వయుత దీర్ఘమైన పుచ్ఛమున
వితతంబుగాఁ బెల్లువేష్టించి పట్టి,
పెకలించె; నప్పుడు ఫెళఫెళధ్వనుల
సకలజగంబులుఁ జలియించి చెదరె.
నప్పర్వతముపాఁతునందుఁ గన్పట్టి
తప్పక సప్తపాతాళంబు దోచె.
ఆరీతి శేషుఁ డయ్యచల మెత్తుటయు,
నారూఢి దివిజులు నసురులుఁ గూడి
తడయక దాల్చుసత్వము గానకున్న
యెడ, వారిజవసత్వమెల్లఁ దూలుటయు,
వారల కపుడు సత్వంబును జవము
నారాయణుండు సన్మతిఁ గృపసేయఁ,
బొలిచి వా రతిరయంబున నద్రిఁదెచ్చి
జలనిధిలోన భీషణభంగి వైవ,
గుభులుగుభుల్లను ఘోషంబుతోడ

రభసంబుమై శిఖరంబుల వ్రేళ్ల


వెసఁ బెక్కు జనియించి [48]వివిధవృక్షములు
పసచూపె నాకాశభాగంబునందు.
అత్తఱి వాసుకి నన్నగంబునకు,
దత్తరంబునం దరిత్రాడుగాఁ జుట్టి,
యమరులు పుచ్ఛంబు, నసురనాయకులు:
సముదగ్రగతి ఫణజాలంబుఁ బట్టి,
యుడుగనికడఁకతో నొండొరుఁ గడవ
వడి సముత్సాహదుర్వారులై తిరుప
నాధారహీనమై యప్పు డామథన
భూధరేంద్రము బుడబుడరవముతోడ
నడిఁకి పాతాళంబునకు గ్రుంగిపోవ
నడరి విష్ణుఁడు కూర్మమై యది దాల్చె.
అతులప్రమోదులై యమరదానవులు
ధృతి నంబురాశి మథించునవ్వేళ,
శరనిధి మథనఘోషము నింగిముట్టె
యురుతరమగు భార ముర్వికిఁ బుట్టె.
సురవిద్విషామరస్తోమార్భటముల
వరుస నాశామదావళములు [49]మ్రొగ్గె
గరిమతో మథనవేగంబున, నెగసి
యురవడి దట్టమై యుదకబిందువులు
నెఱసి కప్పిన, రశ్మి నిగుండగలేక
పరఁగ భానుఁడు మాఁగువడి మింటనిలిచె
పొలుచువాసుకిమొగంబునఁ బొగల్ వెడలె;
నిలువక మంటలు నిగుడి మిన్నంటెఁ;
దగ జవంబులుమాని దనుజగీర్వాణు

లగణితవిషవహ్ని కతిభీతులైరి.


అప్పుడు గనుఁగొని యార్తసంరక్షు
డప్పురుషోత్తముఁ డమరదైత్యులకు
సతిజవసత్వంబు లగ్గలంబొసగ,

హాలాహలోత్పత్తి



ధృతిమీఱి యప్పుడు దేవసంఘంబు
లాదానవులకంటె నధికసత్వంబు
తో ద్రచ్చుటయు, వారిదోర్బలాటోప
భీకరమథనసంభృతదీప్యమాన
లోకభయంకరాలోలవిశాల
తరవిస్ఫులింగోగ్రదర్పిత[50]జ్వాల
లురుతరంబుగ మండి యుడువీథి నిండి
యొక్కట జగము లాహుతిఁ గొనఁజాలు
నక్కాలకూటమహాగరళంబు
బలువిడి ప్రభవించి పఱతేరఁ జూచి,
నలుఁగడ దేవదానవులెల్ల బ్రమసి
పాఱంగ, నప్పు డాపన్నగశాయి
వారలతో నొక్కవాక్యమిట్లనియె:
"వెఱవకుఁ, డిప్పు డీవిషవహ్నిభయము
కఱకంఠుచేఁగాని కడతేఱిపోదు;
చని, యమ్మహాదేవు శరణంబు వేడుఁ,
డనిన , బ్రహ్మయును దేవాసురావలియుఁ
గడువేగ రజతనగంబునకేఁగ,
[51].................................................
.................................................
గజకర్ణ శార్దూలకర్ణాశ్వకర్ణ
విజయ ఘంటాకర్ణ విమలగోకర్ణు


లాదిగా బలసి సదైశ్వర్యలీల
నాదిప్రమథగణేంద్రావలి గొలువ
వీరేశ షణ్ముఖ విఘ్నేశ్వరులును
జేరి నన్నుతిసేయఁ, జెలువొప్ప మునులు
సనకసనందనసంయమీశ్వరులు
ననుఁగులై నిజహృదయాబ్జముల్ పూన్ప,
నుపమన్యు వామదేవ పవిత్రపాణి
కపిల కణ్వాగస్త్య కౌశిక సుబల
శ్వేత దధీచి వశిష్ఠ కణ్వాత్రి
గౌత మాంగీరస కశ్యప నీల
మాండవ్య హరితి మార్కండేయ పులహ
శాండిల్య వత్స కుత్స పులస్తి శక్తి
బాదరాయణ భృగు భగ దాల్భ్య రురు శి
లాద మౌద్గల్య పర్ణాద శాకల్య
గర్గ శౌనక చతుష్కర్ణ మృకండు
భార్గ వాంగిరస విభాండక శునక
మైత్రేయ బల్లకి మంకణ చ్యవన
మిత్రావరుణ నార దాత్రి సౌవర్ణ
పైల సుమంతు సుబ్రహణ్య మంద
పాల సుమిత్ర రైభ్యక సత్య సుమహ
పర్వత జైమిని పౌలస్త్య గార్గ్య
[52]దుర్వాసుఁ డాదిగాఁ దొడరి సంయములు
వెలయు నాశీర్వాదవేదనాదముల
నలరుచు నంతంత నలిఁ గీర్తిసేయ,
సుర నర దనుజు లచ్చుగ సిద్ధ సాధ్య

గరుడ గంధ ర్వోరగ ప్రకరంబు,


ద్వాదశాదిత్యులు, వడి రుద్ర[53]సంఘ,
మాదినవబ్రహ్మ, లష్టవసువులుఁ,
దుంబుర నారదాదులును గీతామృ
తంబుల నెయ్యంబు దనర నోలార్పఁ
గడువేగమునఁ బోయి కంజభవాదు
లడరువేడుకఁ గొలువైయున్నశంభుఁ
గనుఁగొని, ప్రణమిల్లి, కరములు మొగిచి
వినుతించి : "శంకర, విశ్వ, లోకేశ,
అభయంబు గౌరీశ! యభయంబు దేవ!
అభయంబు ఫాలాక్ష ! యభయంబు రుద్ర!
అభయంబు మురహరార్చితపాదపీఠ!
అభయంబు [54]సూర్యచంద్రాగ్నిలోచనుఁడ!
జాలభీతిల్లి నీశరణుచొచ్చితిమి.
అమ్మహావిషవహ్ని నడఁగించి, కరుణ
మమ్ము రక్షింపుము మదనసంహార!”
అని యర్తులగువారి కభయంబు లిచ్చి,
మనసిజారియు సభామధ్యంబు వెడలి,
క్రొన్నెల మకుటంబుకొనఁ జెన్నుమీఱ
మిన్నేఱు జడలలో మేకొని తూలఁ,
బేరురంబున సర్పపేరు నర్తింప
గారవంబున [55]సర్పకటకంబు లమర,
బూని భస్మంపుమైపూత రాగిల్ల,
మానిత సింహచర్మము కటి నమర,
నతిసమున్నతవృషభారూఢుఁ డగుచుఁ,
దతభంగిఁ బ్రమథులు తన్ జేరికొలువ


విచ్చేసి, యంబికావిభుఁ డుగ్రభంగి
వచ్చునాగరళంబువలను వీక్షించి,
నవ్వుచు నప్పుడు నతపాణిపద్మ
మవ్విషమున కెదురగునట్లు చాఁపఁ,
బరికించి విరిదమ్మిపైవ్రాలు తేఁటి
కరణిఁ దద్విషము తత్కరముపై వ్రాలె.
అంగజాంతకుఁ డప్పు డవ్విషానలము
నంగదఁ గబళించి యడరి మ్రింగుటయు,
భువనంబు లలరె ; నప్పుడు వారలెల్ల
శివుఁ బ్రశంసించిరి చెలఁగి పల్మాఱు .
అవలీల వెండియు నసురులు సురలు
జవము దీపింప నాజలరాశిఁ దరువ,

ఐరావతాద్యుత్పత్తి



సురపతిప్రముఖులు చూచి మోదింప
గరిమతో నప్సరల్ గనుపట్టి; రంత
నైరావతము, దేవహయమును, గల్ప
భూరుహపంచకంబును, సుధాకరుఁడుఁ
ద్రిదశేంద్రధేనువు, దివిజరత్నంబు
ముదముతోఁ గౌస్తుభంబును దోడుతోడ
నుదయించె; హరికృపనొందినవారి
కొదవుసంపద లిప్పు డొదవినకరణి,
సొరిది శృంగారవిస్ఫురణ రెట్టించి,
కరమునఁ బూదండఁ గడఁక ధరించి,
కరుణరసం బర్థిఁ గనులధరించి
.........................................
పాలిండ్ల కొఱపుగాఁ బైఁట గీలించి,

లీలఁ బీదల మొరాలించి లాలించి,


నవనిధానములు నున్నతిఁ గొల్వ మించి,
భువనంబులెల్ల నప్పుడు వెలిగించి,
లాలిత జఘనవిలాససంపత్తి
మై లక్ష్మి యుదయించి యబ్జాక్షుఁ గాంచి,
మందస్మితోత్సాహమండలి వెలయ
నిందిర యవ్విష్ణు నెలమితోఁ జేరి,
బింకంపుఁబ్రియమును బ్రేమయు నొఱపు
నంకురింపఁగ రెప్పలల్లార్చి చేరి,
తనచేతి మందారదామ మాదటను
ననువార నద్దేవునఱుత వేయుటయుఁ,
జెలువారె నీలాద్రిశిఖరంబుఁజుట్టి
మలసిన తారకామాలికకరణి.
అంత వాణియు, గిరిజా, [56]శచి, దేవ
కాంతలు, దానవాంగన లటు చూచి
భాసిల్ల గళ్యాణపాటఁ బాడుచును
సేసలువెట్టి రూర్జితవైభవమున.
శూలియు నాతమ్మిచూలియు నొక్క
చో లీలఁ బంకజాక్షుని డాసియుండ,
నాపయోధీశ్వరుఁ [57]ఁ డమలోదకముల
నాపద్మనేత్రు పాదాబ్జము ల్గడిగి,
యమరగురుఁడు కన్యావరణంబు
క్రమముతోఁ బఠియింపఁగా ధారవోసె ,
అటమీద శోభనవ్యాపారమెల్లఁ
బటుభంగితోఁ గొదవడక సాగంగ,
గురులీల నాజగద్గురులవివాహ
మరుదార భువనత్రయాధారమయ్యె.
ఆమాధవునకుఁ దోయధివల్లభుండు

భామనోహర కౌస్తుభాభరణ మొసగె.


అచ్చరల్, సురధేను, నైరావతంబు,
నుచ్చైశ్రవంబు, దివ్యోర్వీజములును,
జింతామణియు సురశేఖరు కొసగె,
[58]నంతఁ ద్రిమూర్తులు నబ్ధినిఁబొగడ,
నయ్యెడఁ బ్రమథు లొయ్యనరాఁగ, హరుఁడు
చయ్యన విష్ణుకంజాతసంభవుల
వీడ్కొని, సురలెల్ల వినుతించి మ్రొక్క
వేడ్కతో నేఁగె నవ్వెండికొండకును.

అమృతోత్పత్తి



వెండియుఁ దరువ, నవ్విషధిమధ్యమున
నుండి ధన్వంతరి యురుకాంతిశాలి
ఘనతరంబగుసుధాకలశంబు చేతఁ
గొని రాఁగఁ, జూచి రక్షోనాథు లెల్లఁ :
"గలిగిన వస్తుసంఘములెల్లఁ దారె
బలువిడిబాఱరె పాళ్లు గైకొనియు!
నిదియైన మనము గ్రహింత;” మటంచుఁ
గుదిసి తత్ కలశంబు గొని రింపుతోడ.
అప్పుడు వెఱఁగు నత్యంతదైన్యంబు
గప్పి, నిశ్చేష్ట మొగంబులు వాంచి
యున్న దివ్యుల హరి 'యోడకుం' డనుచుఁ,
గ్రన్నన మాయాప్రకారసంవేది
యొక్కకృత్రిమరూప మొనరు వధూటిఁ
దక్కకకల్పింపఁ [59]దలఁచి, తాఁ గాంతిఁ
[60]బొలుచు మోహనరూపమును, విభ్రమంబుఁ
దళుకొత్తఁ [61]జక్క గాంతారూపు దాల్చి,


 


పయ్యెద వెడఁజారి పాలిండ్లు దోప,
నొయ్యారికచభార మొయ్యొయ్యఁ గదలఁ,
జరణనూపురములు ఝణఝణ మ్రోయ,
గరిమతో రత్నమేఖలమాల పొలయఁ,
దను జూచి దివిజులు దనుజులు మతుల
నెనసిన భ్రమఁ జేష్ట [62]లేది యీక్షింప,
నల్లనల్లన దానవావలిఁ జేరి
పల్లవాధర మృదుభాష నిట్లనియె:
"వీర దానవులార, వినుఁడు మీలోన
నీరీతి నపనమ్మి కేటికి [63]విడుఁడు;
తడయక, యీయమృతంబు నాచేత
నిడుఁడు; నేఁ బంచెద నెలమి నేర్పొదవ.
నేను వడ్డించిన నెవరు మాటాడఁ
గా నోరులాడునె! కడఁకతో మీకు
నడ్డుమీఱఁగ, మాఱు వేడకయుండ,
వడ్డింతుఁ; గరలాఘవంబు గన్గొనుఁడు;
తెం." డన్న, నప్పుడు దేవతారాతి
మండలి యమ్మాయమగువమాటలకు :
............................................
[64]జననిరొ, జవదాటజాలము నేము;
వనిత, నీ వేరీతి వడ్డించితేని
మనముల నదియెల్ల మాకు సమ్మతము
కొ "మ్మని యమృతంపుఁగుండ నిచ్చుటయుఁ,
గొమ్మ సంప్రీతిఁ గైకొని చేతఁబూని :
"బంతిసాగుఁడు దేవపతులు దానవులు;
వరుసతోఁ దరువాత వచ్చి వడ్డింతు".


ననుకాంతపలుకుల కమరులుఁ బుణ్య
జనులును బంతులై సాఁగికూర్చుండ,
నమరేంద్రుఁ డాదిగా నమరదిక్పాల
సమితికి, సకలనిర్జరసంఘములకుఁ,
గడఁగి కుత్తుకబంటిగాఁగ నయ్యమృత
మెడపక యెంతయు నిడుచు నేతేరఁ,
గని రాహువనువాఁడు గ్రక్కున సము
తనుయుక్తుఁడై దేవతాకోటిలోన
ననువారఁ గూర్చుండి యమృతంబుఁ ద్రావఁ,
గని, సుధాకరుఁడును గమలమిత్రుఁడును
దానవారాతికిఁ దద్విధంబెల్లఁ
బూనిచెప్పుటయు, నప్పురుషోత్తముండు
గనుఁగొని సుధ కుత్తుకకుఁ బోకమున్న
తనచక్రమున రాహుతలఁ ద్రుంచివైచె .
సొలవక యమృతంబు సోఁకుటఁ జేసి
తల వృద్ధిపొంది తత్తను వుర్విఁ బడియె.
అది యాదిగా, రాహు వర్కేందువులకు
వదలక శత్రువై వర్తించుచుండె.
అసురులు తమచేతియమృత మీభంగి
విసువక విష్ణుండు విబుధుల కిడిన,
నలుక దీపింపంగ నతికోపు లగుచు
బలియులై బలిముఖ్యబహుదైత్యపతులు :
“ఓసురలార, మ మ్ముఱక రప్పించి
బాస దప్పఁగ మీకుఁ బాడియె తలఁప!
నన్నియు లెస్సాయె! నందు కేమాయె!
బన్నుగా మావంక పాపంబు లేదు.
బీరంబుగా నాజిఁ బ్రీతిఁ గాలూఁది

పోరాడుఁ; డిట్టట్టు పోనీయ మింక.


సురాసురసమరము


ననుచుఁ గోపాటోప మందంద పొలయ,
ఘనబాహుశౌర్యహంగారంబు లడర,
రథరథ్యసుభటవారణముఖ్యచటుల
పృథు[65]లపదాహతిఁ బృథివి గంపింపఁ,
బణవభేరీదివ్యపటహాదివాద్య
రణనచే నాశాంతరంబులు వ్రయ్యఁ,
జండ[66]నిశాతభీషణహేతిచయము
మండుచు భానుబింబముఁ గప్పి పాఱ,
దారుణసింహనాదములచే నభము
బూరటిల్లగ, రయంబునఁ గిట్టి కినిసి,
శర శూల తోమర శక్తి కౌక్షేయ
పరశు గదాంకుశ ప్రాసార ముసల
భిండివాలముల నాభీలసంరంభ
చండాంశు లగుచు నిర్జరులఁ దాకుటయు,
వారును గడఁగి దుర్వారప్రతాప
సారులై పోరాడుసమయంబునందుఁ
గుదియక శరముల గుదులుగ్రుచ్చియును,
మదమున గదలచే మడియమోఁదియును,
జిదియంగ గజములచేతఁ ద్రొక్కించి
బెదరిపాఱఁగఁ గడుబిట్టదల్చియును,
గడలచే గ్రుచ్చి యాకసమున కెత్తి
నడుములు దునియంగ నఱికివైచియును,
బిడికిటిపోట్లను [67]బిమ్మిటి గొలిపి
తడబడ ముసలఘాతముల నొంచియును,
అంకుశంబుల గుండె లగలఁదీసియును,
డొంకెనపోటుల డొల్లదీసియును,


అతులితోజ్జ్వలశిలాహతులఁ జంపియును,
ధృతి శూలశక్తులఁ దొడరఁ గూల్చియును,
బ్రాసఘాతములచేఁ బ్రాణముల్ గొనియు,
నీసునఁ గుంతాల నెదిరిమోఁదియును,
భిండివాలములచే బీరుమాన్పియును,
దండితోమరముల ధరణిఁ గూల్చియును,
అదటులో నుభయసైన్యంబులవారు
గదనంబు మిగులభీకరముగాఁ జేయ,
నప్పుడు బలము ధైర్యంబు జవంబు
తప్పక పొదవిన దనుజయూధంబు
లరవాయిగొనక యా యమరయూధంబుల
దఱమిన, వార లెంతయు బలం బెడలి,
కష్ట[68])దుష్టావస్థ గడుభీతిఁ బొంది
యష్టదిక్కులకును నటు పాఱిపోవఁ ,
బరవశంబున మీఱి పాఱెడుసేన
వెఱవకుండని భేరి వేయించి, కడఁక
బురుహూత శిఖి యమ పుణ్యజనేశ
వరుణ మారుత ధనేశ్వర వృషధ్వజులు
చలముతోఁ గరి మేష సైరిభ మనుజ
జలచర మృగ హయోక్షములపై నెక్కి,
తనరంగ బలశక్తి దండ కౌక్షేయ
ఘనపాశ కేతు ముద్గర కుఠారములు
ధరియించి, దనుజయూధంబుపైఁ గదిసి
దురమున నొప్పంగఁ, దూలి దానవుల
బారెల్ల నెదురనిల్వఁగలేక భీతిఁ
బాఱంగ, నిజసైన్యపటలి నీకించి
బల భీమ శతమాయు బాష్పల నముచి

నల కాలకేయ కంధరు లుగ్రు లగుచు


నురవడి ననిసేయుచున్న దిక్పతులు
యరదంబు లెదురుగా నడరి తోలించి,
పఱచుసేనలఁ గూడఁబఱచి, [69]ధైర్యంబు
మెఱయఁ గొండలఁగప్పుమేఘంబులట్లు
లలితోగ్రదృఢముష్టిలాఘవలక్ష్య
బలశౌర్యములు మీఱ బాణజాలములఁ
గప్పి, స్రుక్కించి, యఖండశౌర్యమ్ము
లుప్పతిల్లఁగ నింగి యుదరఁ బెల్లార్చి,
యంతటఁ బోవక యమరవల్లభుని
దంతితోఁగూడ మదంబు దక్కించి,
యనలుఁ బొట్టేటితో నదరంటఁ దోలి,
యెనుబోతుతో యమునేఁపు దూలించి,
నరునితో నిరృతిమానము తూలపుచ్చి,
వరుణు నక్రంబులో వడిఁబాఱఁదోలి,
పపమాను నిఱ్ఱితోఁ బట్టి భంగించి,
తవిలి యశ్వమ్ముతో ధనదునిఁ బఱపి,
యెద్దుతో నీశాను నేపడఁగించి,
యద్దెసఁ జిక్కిన యమరులఁ జదుప
గర్వితులైన రాక్షసులతో ననికి
నోర్వక వెసఁ బాఱుచున్నయావేళ
నమరులఁజూచి, దయాగుణోల్లాస
మమర 'నోడకుఁ' డని యభయంబు లిచ్చి,
చక్రంబు నురుదివ్యశరచాపములను
విక్రమంబునఁ బూని, విమతులు చెదర,
నతి[70]కుపితాత్ములై యసురవర్గంబు
[71] సంహార మొనరింప, సకలరాక్షసులు
విహ్వలులై పాఱి విషధిలోఁబడిరి.


ఆ వేళ బ్రహ్మయు, నమరసంఘంబు,
నావీరవరుల నారాయణు నరునిఁ
బలుతెఱంగులఁ బ్రీతిఁ బ్రస్తుతి చేసి ;
రెలమితో భువనంబు లెంతయు నలరె.
అమరు లప్పుడు ప్రమోదాత్ములై మించి.
రమరశేషుఁడు మంథరావనీధరముఁ
గొనిపోయి, తొల్లింటికుదురుపట్టుననె
యసువార నిలిపె సత్వాన్వితుండగుచు.
అయ్యెడ, సురలెల్ల నాసుధారసము
చయ్యన మంథరాచలమున దాఁచి,
కడుజతనంబునఁ గావలివెట్టి,
తడయక యా రమాధవుని సేవించి
నడవ, నద్దేవుఁ డున్నతవైభవమ్ము
పొడమఁగ వైకుంఠపురమున కేఁగి,
యరయ నబ్జజ సురేంద్రాదుల నెల్లఁ
బురడించి నిజపురంబులకుఁ బోఁబనిచి,
మానుగా శ్రీవధూమణితోడఁ గూడి
పూని లోకంబు లింపుగ నేలుచుండె .
అజుఁ డంతఁ దనదు [72]సత్యలోకమునకు (?)
నజితసౌఖ్యంబుతో నమరులు గొలువ,
విచ్చేసి, యమరుల వీక్షించి, కరుణ
నచ్చుగా వేర్వేఱ నర్థి వీడ్కొలిపి,
శారదాసహితుఁడై సతతసౌఖ్యములు
మీఱ లోకములు నిర్మింపుచునుండె.
పరఁగ నింద్రుండు దిక్పతులెల్ల గొలువ
దిరముగా నమరావతీపురి కేఁగి,


యకలంక శోభనాయతిఁ దొంటియట్లు
సకలసౌభాగ్యవిస్తారమై వెలయు
నమరావతీపురి నభిషిక్తుఁ డగుచుఁ,
గమనీయభోగసౌఖ్యంబులచేత
నలఘుసంతషుఁడై యఖిలదిక్పతులఁ
బొలుపార నిజపురంబులకు వీడ్కొలిపి,
పౌలోమియును దాను భాసిల్లఁ గూడి
లీలతో దివము పాలింపుచునుండె.

కద్రూవినత లుచ్చైశ్శ్రవముఁ జూచుట


ఆరీతిఁ గలశాబ్ధియం దుద్భవించి
భూరివిఖ్యాతితో బొలుపొందునట్టి
వాసవతురగంబు వనరాశిపొంత
భాసురగతిఁ జరింపఁగ, నొక్కనాఁడు
వినత కద్రువయు సద్వినుతచారిత్ర
మున యథేచ్ఛవిహారమునఁ జరియింపఁ
దలఁచి, వేడుకమదిఁ దరుణు లయ్యెడను
వెలయంగ సఖులు సేవింప, నుత్ఫుల్ల
కుసుమపరాగసంకులలసద్భ్రమర
[73]కిసలయాహారకోకిలశుకధ్వనుల
వలనొప్పుచున్న యవ్వనిఁ గేళి వేడ్క
సలుపుచు, నొండొండ జలజలోచనలు
చతురత దీపింపఁ జయ్యన నరిగి,
క్షితి[74] నతిచేలంబు, జితకిల్బిషంబు,
గ్రావాశ్రయంబు, గీర్వాణాశ్రయంబు,
శ్రీవరు శయనసుస్థితినివాసంబు,


నవనవరత్నజన్మప్రదేశంబు,
భువనసంస్తుతపుణ్యభువనాకరంబు,
క్రూరకర్కటసంఘకుగ్రాహకంబు,
ఘోరాహి మకర [75]కుర్కుర దర్దురాది
యాదోన్వితంబు, మర్యాదాన్వితంబు
నై [76]దట్టమైన బృహత్తరంగముల
నొదవి, పెల్లొదవు నయ్యుదకబిందువులు
[77] చదునైన ముత్యాలసరములు గాఁగఁ,
గమలంబులకు మూఁగు గండుతుమ్మెదలు
సముచితనీలకేశంబులు గాఁగఁ,
[78]గలఁకమైఁ బొదలు చొక్కంబైన నురువు
పొలుపైన వెలిపట్టుపుట్టంబు గాఁగఁ,
గడఁకతో వాహినీకాంతలు దన్నుఁ
గడునెయ్యమునఁ గొల్వ గంభీరయుక్తిఁ
దనరు నంభోరాశితటమున మెలఁగు
వననిధిజనితగీర్వాణహయంబుఁ
గని, చోద్య మంది, యాకద్రువ వినతఁ
గనుఁగొని పల్కెను గర్వవాక్యముల :
"అల్లదె! చూచితె! యశ్వరత్నంబు;
తెల్లచంద్రికఁ దెగడు దేహంబుతోడ
లాలితంబైన వాలప్రదేశమున
నీలమైయున్నది నెఱిఁజూడు". మనినఁ
గనుఁగొని, నవ్వి, యాకద్రువతోడ
వినత యిట్లనియెఁ బ్రవీణతతోడ :
"ఏ తెఱంగునఁ జూచితే తురంగంబు!
బ్రాఁతిమైఁ దారహారంబులపొలుపు,


హార పటీర నీహార మరాళ
శారదా నారద చంద్రికా కాంతిఁ
గైకొని, నిష్కళంకంబగుమేన
నే క్రియ నల్పు! నీవెక్కడగంటి!”
వన విని, కద్రువ యప్పు డావినతఁ
గనుఁగొని మఱియుఁ దక్కక యిట్టు లనియెఁ :
"దెలిఁగన్నుఁదోయిఁ జెందినయట్టి నలుపు
పొలుపున, శశిమేనఁబుట్టినకందు
లాగున, నీలవాలము శుభ్రతనువు
బాగుమీఱినయది పలుకు లేమిటికి!
సొలవక నిజముగాఁ జూచి, వాలమున
నలుపులేదని నీవు నాతోడ నొక్క
పన్నిదంబాడుము పంతంబుతోడ;
నున్న మాటలునుగా వొడఁబాటు మనకు"
ననవుడుఁ బ్రియమంది, యప్పు డవ్వినత
తనమాట గెలుపు తథ్యం బని కడఁగి:
"పడఁతి, నీచెప్పిన పన్నిదంబునకు
నొడఁబడియెద'. సన్న నుదరి కద్రువయు :
‘లలితాంగి, హయమువాలము శుభ్రమైన
దలగక యే నీకు దాసి నౌదాన;
నలుపు గల్గినయేని నాదాసి వగుము;
తలకొంటి; వీమాటఁ దప్పకు' మనిన
నట్ల కా నొడఁబడి, యప్పు డావినత :
యట్లైన నచ్చోటి కరిగి యాహయముఁ
గదిసి వీక్షింతము గాక ర' మ్మనినఁ,
జెదరక దాని వీక్షించి యిట్లనియె:
'వేడిమి మందమై వెలుఁగు భానుండు

వాఁడి యస్తాద్రిపై వాలుచున్నాఁడు;


గావున నిది వేళ గాదు; వే మగుడి
పోవుట మేల యీ ప్రొద్దున; కింక
బోదము ర' మ్మని పొలఁతుకఁ గూడ
యాదట నింటికి నరిగె నవ్వినత.
అంతలో సూర్యుండు నస్తాద్రి కరుగ,
సంతసంబును దక్కి, జలజసంఘంబు,
తమవల్లభుఁడు లేమిఁ దలఁచి, యుల్లమున
[79]రమణేది కందినక్రమము దీపింప,
మూగినషట్పదంబులు లోనఁ జిక్క
నాఁగుచు ముకుళించె నమరఁజిత్రముగ;
తమమీఁదఁ జంద్రుఁడు దాడివచ్చుటయుఁ,
దమసామరారి యుద్ధము సేయఁ దివిఱి
వాఁడిముల్కులతోడ వరబాణసమితి
పోఁడిగాఁగూర్చిన పొలుపుదీపింప.
'పగలెల్లఁదిరిగి మాపటి కస్తశిఖరిఁ
దగఁ బ్రవేశించె బతంగుఁడు; మనము
నతని పేరిటివార; మటుగాన, దిరుగ
మతముగా;' దని గూండ్ల మఱి పక్షు లడఁగె
'కద్రువ కిష్టంబుగా వాలదీప్తి
ముద్రించి నాపెంపు మునుమిడి చూపి,
వినత నోడించెద వేవేగఁ బోయి'
అనివ చ్చెనో యన, నంధకారంబు
కడుదట్టమై యిర్లు గదిసి యేతెంచె.
'తడయక ద్విజరాజు తగఁ బూర్వశైల
శృంగసింహాసనస్థితుఁడగు' ననుచుఁ
..........................................


జనుదెంచి పొల్చినచందంబు దోప
వినువీధిఁ జుక్కలు వెలుఁగుచునుండె.
'వినత గన్గొనువేళ విబుధహయంబు
గనుపట్టియుండె నీక్రమమున' ననుచుఁ
బూర్వదిక్కాంత నేర్పున రచియించి
పర్విచూపిన మంచుపగిది, కళంకు
బెరసి చంద్రిక మింటఁ బేరి సొంపెక్కె.
విరహులహృదయంబు వేఁపెడిమంట,
యలచకోరంబుల యామనిపంట,
కొలఁది నొక్కటఁ గళల్ [80]గూర్చెడుదంట,
యీశుజూటంబుపై నేప్రొద్దు నుంట,
భాసిల్లు నలపంచబాణుని గంట
చంద్రుఁడు పొడిచె దిక్చక్రంబు వెలుఁగ
సాంద్రనిర్మలతరజలధి యుప్పొంగ.
యామినీకాంత సాయంకాలవేళ
గామించి పొంచినగాఢభూతంబు
విడుపింప వెన్నెలవీబూది మేనఁ
గడునొప్పఁగాఁ, గళంకపుఁదిలకంబు
నొనరంగఁ, బరివేషయోగపట్టెయును
మునుమిడి నక్షత్రములసంకుపూస
లగణితంబుగఁ దాల్చి, యఖిలలోకములఁ
బొగడొందుచును జగత్పూజ్యుఁడై కళల
వృద్ధి బొందిన మంత్రవేదియై, భూప్ర-
సిద్ధుఁడై దగు మంత్రసిద్ధుఁడో యనఁగ,
బలువిడి నధికసంభ్రమ మగ్గలింపఁ

గలువలవిందు శీఘ్రంబున నెక్కె.


కద్రూకృత కపటప్రయత్నము



అప్పుడు కద్రువ యాత్మసంభవులఁ
దప్పక పిలిచి యందఱితోడఁ బలికె:
తనయులు గల్గుట తల్లిదండ్రులకు
మును దారొనర్చినపుణ్యఫలంబు
లగు; నైనఁ, దత్పుత్త్రు లతిబలశౌర్య
సుగుణగాంభీర్యవిస్ఫురణ రంజిల్లి
పితృమాతృభక్తిచేఁ బెంపొందిరేని,
సుతులని కొనియాడఁ జొప్పడు; గాన,
వినుఁడు నే మిమువేఁడువిధము సర్వంబు
ఘనులు మీరందఱుఁ గడముట్ట నిపుడు,
నాతనూభవులార, నాగేంద్రులార,
మీతల్లి నేను నమ్మితి మిమ్ము నొకటి ;
సకలరూపంబులఁ జరియింప నేర్తు;
రొకచోట నల్లనైయుండరే పోయి!
అమరులు నసురులు నంభోధిఁ ద్రచ్చి,
యమితనిర్మలమైన హయముఁ బుట్టించి,
దాని నయ్యంభోధితటినుంచి పోవ,
నేనును, వినతయు, నిట ప్రొద్దుపోక
సవతిపొత్తునఁ గూడి చరియింపుచుండి,
రవిక్రుంకువేళ వారాశితీరమున
నట్టిశ్వేతాశ్వంబు నల్లంతఁ జూచి,
యిట్టంటి వినతతో నే విచారించి :
అల్ల తెల్లని జవనాశ్వంబుతోక
[81]నల్లనై యుండెఁగా! నవుఁగా లతాంగి!
యేఁ గంటి'; ననిన, 'నిహీ' యని నవ్వి:

'రాఁగదె పోదము రమణి, యచ్చటికి;


నేకంటఁ జూచితి! విం దేది నలుపు!
[82] నాకంటె నీకంటెనా! కంటిఁదెలివి'!
అని పక్షిమాత నన్నాడినఁ జూచి,
వినతతో 'గల' దంటి, వినత 'లే' దనియె.
నంత: “నేఁజూపెద; నటు చూపకున్నఁ
బంతమాడెద; నీకు బానిస నగుదు;
చూపుము మఱి నీదు చుట్టఱికంబు
 [83]ఱేపు; వెన్ దీయకు; వ్రేయుము కరము'
అని పన్నిదము వేసి, యట పోయిపోయి,
దినపతి క్రుంకుచోఁ దిరిగి వచ్చితిమి.
అగునెల్లి జయమైన నపకీర్తియైన;
నగుఁబాటు మాన్పరే నను గటాక్షించి!
చని హయవాల మచ్చట నల్పు చేసి
చనుదెండు మీరు; వంచన చేయరేని
వినతకు దాసినై విహరింపవలయు;
నెనయ నాకోర్కుల నీడేర్పరయ్య!"
అని వేఁడుకొనుటయు, [84]నాయకార్యంబు
నొనరింప నేరక యొఱగొడ్డెమాడి,
తమకించి చూపులఁ దమవక్రగతులఁ
దమరోషవిషములఁ దఱచుగాఁ జూపి,
వెనుకొని యందఱు వెఱఁగంది : 'యిట్టి
పని యధర్మస్థితి భావించి చూడ ;
జామరొ, యిటు సేయఁజనునె యెవ్వరికిఁ!
గ్రమ మొప్ప నెచట 'ధర్మమె జయం' బనుచుఁ
బలుకువేదంబు లేర్పడ మున్ను వినవె !

వలవదు తల్లి ! నీవాక్యంబు నేము


వలనేది చేయనివారము గాము.
తలపోయఁ గపటకృత్యంబులసేఁత
బలిమి మిక్కిలి యిహపరహా నిసేయు'
.............................................
నని యధర్మంబున కందఱు నోడి
తసపంపు సేయక తగనూరకునికి
చూచి కద్రువ తనసుతుల కిట్లనియె:
"నీచభావంబున నే నింక సవతి
దాసినై యుండుట తలపోయ మీకు
వాసి తక్కువయు నెపంబును గాదె!
అన్నదమ్ములు మీరలందఱు నిట్లు
మిన్నకుండిన నిటమీద నే నింక
నెవ్వరి నడుగుదు! నెవ్వారు దీర్తు!
రెవ్వారు మీకంటె హితులు నాకెన్న.
నకట! వేవురఁ గన్నయట్టినా కిప్పు
డొకఁడైన నీపని కొదవంగవలదె!
తొడిఁబడ నొకకీడు దొడరినచోటఁ
దడవు సేయక దానిఁ దప్పింపవలదె!
కైకొనిచేయుఁ డీకార్య మెట్లైన
నాకొఱ" కనుచు మానక వేడుకొనఁగ,
నప్పుడు తల్లితో ననిరి క్రమ్మఱను :
“దప్పులెన్నుటగాదు తల్లి, మాచిత్త
మొప్ప దీపని సేయ; నుచితంబు గాదు;
తప్పదు పాపంబు తలఁపంగ మాకు.
నీకుఁ బ్రియంబని నిజములు కల్ల
లేక్రియఁ జేయుదు! మిది మాకుఁ దగునె! "
అని యిట్లు పలుకుచు నందఱుఁ గూడి

చనఁజనఁ జూచి, యచ్చలము రెట్టింపఁ,


గరుణ యించుక లేక కద్రువ యలిగి :
“గురుకార్యవిముఖులు క్రూరులు మీరు
నాపుత్త్రులని నేను నమ్మితిఁ గాక.
యీపొత్తు లేమెత్తునే మత్తులార!
జనమేజయుఁడు సేయు సర్పయాగమునఁ
బనివడి భస్మమై పడుదురుగాక;"
అని శాపమిచ్చెఁ బాయక [85] పుత్త్రులకును.
ఘనతపఃఫలములు గడ తేర, నపుడు
పెలుచ నీరీతి శపించిన, మదినిఁ
గలఁగి, యెంతయు భీతిఁ గర్కోటకుండు
శాపభయంబున సంప్రీతిదోప
నేపునఁ దల్లితో నిట్లని పలికె:
'జనని, నీపంచినజాడ నేఁ బోయి
ఘనహయవాలభాగముఁ గప్పువాఁడఁ;
బెనఁగిచేసెద.' నన్నఁ బ్రియమంది యనుపఁ,
గొనకొని కర్కోటకుం డేఁగి యపుడు
కామరూపమునఁ దురగమువాల మలమి,
రోమము ల్గడునీలరుచులఁ గావించి
కొనియుండె వేడ్క గర్కోటకుం డంతఁ,
గనుపట్టెఁ బూర్వదిక్కాంత భానునకు
మొనసి కానుక మొల్లమొగ్గలబంతి
ఘనముగాఁ జేసినగతి వేగుఁజుక్క
పొడిచిన శశికాంతిపొడుపు లోలోన
నడఁగంగఁ, గుముదంబు లంత ముడుంగ,
భీతిఁ జీఁకటి కకాపికలుగాఁ బాఱ

బ్రీతి నిశాకాంత పెద్ద కాలంబు


భోగింప రహిచెడ్డ ముత్యంబు లనఁగ
బాగైనమించులఁ బ్రబలకతార
లొగి నాకసమున నొండొండ యడంగె
.................................................
మొదలిగ్రహంబు, త్రిమూర్త్యాత్మకంబు,
చదువులముద్ద, శాస్త్రంబులపెద్ద,
కమలాప్తుఁ, డేకచక్రరథస్థితుండు,
.................................................
కాలచక్రం బవక్రతఁ ద్రిప్పుప్రోడ,
.................................................
పద్మరాగపుసానఁబట్టి కెంపెక్కె.
..................................................
అప్పుడు కద్రువ, యావినతయును,
నొప్పుగా గెలుపు లొండొరులు [86]పేర్కొనుచుఁ
[87] దలరి, యాందోళచిత్తాకులత్వమున
జలనిధితీరభూస్థలికి వేవేగఁ
జని, డాసి చూడ, నుచ్చెశ్శ్రవం బపుడు
గొనకొని కర్కోటకునిమాయవలన
సితదేహమున మహాసితవాలమునను
నతులమైయుండెను; అప్పు డావినత
లజ్జించి:"మిగుల నేలా మాటలింక!
నొజ్జయై విధి నన్ను నొగి నింతచేసె!
అలసి, యనూరుశాపాధిదైవతము
కొలఁది కద్రువ కనుకూలమై మాయ
పన్ను టే నెఱుఁగక, పన్నిదంబాడి

విన్ననై వగలచే వేగంగవలసె."


ననితలవాంచి, తా నాకద్రువకును
గొనకొని నీతితోఁ గోరినపనులు
కాలూఁదనెడలేక గైకొని మిగులఁ
దాలిమిఁజేయుచోఁ, [88] దరలెను బంచ
శతవత్సరములు. వేసటలేకయుండ,
మతిలోనఁ గౌతుకోన్మాదియై, యపుడు
పన్నగకులమాత పక్షీంద్రుమాత
నెన్నక పనిగొని యేలుచునుండె”.
అని యిట్లు జనమేజయక్షితీశునకు
ముని చెప్పె నని చెప్ప మోదించి మునులు :
“అనఘాత్మ, తరువాత నైనవృత్తాంత
మనువొందఁ జెప్పవే!' యనివేఁడుటయును,
సౌమిత్రినిక్షేప, సమరాంతచాప, (?)
రామ, గయాక్షేత్రరచనావిధిజ్ఞ,
శూద్రతపోవిఘ్న, సురకార్య[89]మగ్న,
యద్రీంద్రరచితమహాసేతుబంధ,
దశకంఠనాభిసుధాగ్రాహివిశిఖ,
దశరథశాసనోత్సవదత్తచిత్త,
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్రవల్లభ సూరిసత్పుత్త్ర
మతి మద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వనిర్మలకథయందు

సుచితమై యాశ్వాస మొక్కటి యొప్పె

——♦♦♦♦ ♦♦♦♦——

  1. గుణ
  2. లక్ష్మణశోక్య
  3. మఖ-(మూ)
  4. ఇద్దనభాగామ ఇనతలస్తోమ (మూ)
  5. " పాండవేయు ” లను నర్థములో వాడియుండును.
  6. దాటగ' అని యుండుట మేలు.
  7. 'ఒదవనాఱును నేను నొక్కటియయ్యు' అని మూలము. ఆవాంతరపర్వములతోఁగలిసి 106 అగుట చేఁ బైరీతిగా సవరింపఁ
    బడినది.
  8. నడినేదు శలంకదీ ననువంటి మునివె. (మూ)
  9. సోముండు రాజనిశృతుని పోషింప,
  10. రక్షావిశేష.
  11. జేయంగ, (మూ)
  12. బాయుగా, (మూ)
  13. మోడ్చి. (మూ)
  14. తురకొనెనెలంత
  15. బిసము. (మూ)
  16. అమ్మగువయు నంత సయ్యన్యయండ. (మూ )
  17. తోడి. (మూ )
  18. చుదుర్దంత
  19. దీప్యమాన
  20. శాత (మూ)
  21. వరతరు.(మూ)
  22. నెలదిండి.
  23. గాదల (మూ)
  24. హేమశైలముంబోలి
  25. గౌతమీసతినె.(మూ)
  26. సావధానులకైన (మూ)
  27. వెట్టి
  28. గుఱంత
  29. బారడి (మూ)
  30. ధూత్న
  31. వధూతరభాసవిలాస (మూ)
  32. ల సన్నుతాన్వితమైనపాణి. (మూ)
  33. వాధిక (మూ)
  34. నిట్లధికరింపుదురె
  35. చేరి యడరంగియైన
  36. క్షుధాతవక్షంబు (మూ)
  37. లోక
  38. లోకు
  39. కడుపెద్దలై గూడ కట్టకోకలును(మూ) దీనిని"కడుపేదలై కూడుఁ గట్టగోకలును " అని సవరించుట మూలమునకు చాల సన్నిహితముగానుండును; కాని, ఆసవరింపుసైతము కొంత అనన్వితమగుటచే, మూలదూరమయ్యు దీనిని అంగీకరింపవలసివచ్చెను.
  40. ప్రచండవిచక్ర (మూ)
  41. గండల (మూ)
  42. నైకసుర (మూ )
  43. ఇట్టిచోట్ల ప్రాసాక్షరమునుబట్టి 'పాదములేవేని లుప్తములైయుండునేమో' యను సందేహమునకు వీలున్నను, పూర్వాపరార్థసందర్భములు సరిపోవుటచే, నొకప్రాసమును కవి మరిచెననుటకును అవకాశమున్నది.
  44. కాలాది
  45. సకుటిలమతితోడ జయపెట్టుచుండ. (మూ)
  46. నలివిప్రజిత్తకందర
  47. జగతిపై ప్రొద్దు గోచరమున మనకు (మూ)
  48. విశద
  49. మ్రోగె (మూ)
  50. జ్ఞాను (మూ)
  51. గ్రంథపాతమైయుండును.
  52. పూర్వపుటలోని "గజకర్ణ" మొదలు ఇంతవఱకు బసవ పురాణములోని గ్రంథము. గ్రంథకర్త దానిని అనువదించియుండును.
  53. సంఖ్య-లా
  54. శశిరవియగ్నిలోచనుఁడ
  55. సప్త (మూ )
  56. శచీదేవి
  57. నమరలోకముల (మూ)
  58. అంత ద్రిమూర్తులు నబ్ధులు సురలు
    నయ్యెడఁ బ్రమథు లెయ్యెడ హరుండు,
  59. తనరు తత్కాంతి
  60. గలిగి
  61. చక్రి (మూ)
  62. వేది
  63. వినుఁడు
  64. జవరొని (మూ)
  65. రావనాహవ
  66. నిశాటఘోషణ
  67. బిమ్మట (మూ )
  68. దురావస్థ (మూ
  69. సైన్యంబు
  70. కుటిలాత్ములై (మూ).
  71. "నరనారాయణులు" అను కర్తృపదము అథ్యాహారము.
  72. సత్యా (మూ )
  73. విసరకాసారకోకిల
  74. పతిచెల్వంబు (మూ)
  75. దుద్గురు
  76. దట్టమై ద్రుహంతారంగములను
  77. చదురులై
  78. గదలమై (మూ)
  79. గ్రమమేది (చూ)
  80. గూరెడుతంట (మూ)
  81. నల్లనై యున్నది నవుగా లతాంగి (మూ )
  82. నాకంటనీకంట నాకంట దెలివి
  83. వ్రేపు నేదేనియు వ్రేయుము కరము
  84. నభ్యూర్జశక్తి (మూ)
  85. క్రూరులకును (మూ)
  86. వేడ్కొనుచు
  87. తరలి యాందోళచిత్తానుకూలమున (మూ)
  88. దరలక
  89. నిఘ్న (మూ)