Jump to content

దొంగాటకం

వికీసోర్స్ నుండి

దొంగాటకం


పాత్రలు

ప్రకాశరావు

రాజ్యం

దొంగ


నాటికి నేడు


పాత్రలు

నరుసు పంతులు

మహలక్ష్మమ్మగారు

[రాత్రి 10-30 గం॥ రాజ్యం తమలపాకులు చిలకలు చుడుతూంది. 22 సం॥; కొంచెం పెద్ద నుదురు, సోగకళ్ళు, చిఱుతవాటు మొఖం - తెలివితేటలున్నట్లే కనబడతుంది. ప్రకాశం 30 సం॥ ఒడ్డూ పొడవూ, మంచిబందోబస్తూ మనిషి. మాట కూడా గంభీరముగానే వుంటుంది. నిక్కరు, స్వెట్టరు వేసుకొన్నాడు. షెట్‌ఫ్రేమ్ స్పెక్టికల్సు, రిష్టువాచి, థెర్మో ఫ్లాస్కు మెళ్ళో, చేతులో బేటరీ లైటు. స్లిప్పర్సు వదిలి జోళ్ళు తొడుగుతూ]

ప్రకా : అప్పడు పంపుకొట్టాడా సైకిల్‌కి ?

రాజ్య : ఆఁ

ప్రకా: కేసులో పెట్టావా సిగరేట్సు ?

రాజ్య : లేదు.

ప్రకా : ఇంకా కిల్లీలు కట్టలేదు కదూ?

రాజ్య : ఎన్ని ?

ప్రకా : రోజూ చెప్పవలెనేమో! అరడజను. అప్పుడే 10-40.

రాజ్య : అంటే యీవాళకూడా పెట్రోలింగుకి బయలుదేరుతున్నారన్నమాట.

ప్రకా : ఆఁ. వాడీవూళ్ళో గలటా చేస్తూండేవరకూ, లేకుంటే వాడు పట్టుబడేవరకూ మనకీ పని తప్పదు.

రాజ్య : ఏం పోలీసులు లేరూ, నెలకు బోలెడేసి జీతాలు తీస్తూ? మీరు ఎందుకింత శ్రమపడడం ? ప్రకా : వాళ్లు దొంగ దొరికిన తర్వాతనే కనబడతారు, పట్టివ్వడం మనబాధ్యతే. కొట్టులో పెట్టడం మాత్రం వాళ్ళపని.

రాజ్య : మరి వూళ్లో యిందరు వస్తాదులూ తాలెంఖానా వాళ్లూ ఉన్నారు.

ప్రకా : వున్నారు. వాళ్లు మరోవస్తాదువచ్చి బస్తీనిూద సవాలు కొడితేనే పైకి వస్తారు రాజ్యం! ఎంతో ధైర్య సాహసాలుంటేనే కాని మనిషి యింతపనికి పూనుకోలేడనుకో. దొంగతనానికి వచ్చినవాడు అన్నిటికీ సమస్త తెగతెంపులూ చేసుకునే వస్తాడు. వాణ్ణి ఎదిరించడమంటే సామాన్యమైన పనిగాదు. - మనమూ ప్రాణాలకి తెగించాలి.

రాజ్య : అయితే యెవ్వరికీ లేనిది మనకెందుకీ ఘోరసాహసం? పుణ్యమా, పురుషార్థమా ?

ప్రకా : కీర్తి, పేరు, ప్రతిష్టలు ! యిప్పటికే వూళ్లో నా పేరు ఆ దొంగపేరుకంటె ఎక్కువగా మ్రోగిపోతున్నది. ఇది వరకు నాతో పరిచయం లేని పెద్దమనుష్యులెందరో నా కీ మూలాన స్నేహితులైనారు. ఎంతో మంది బి. యే. స్టూడెంట్సు మొదలైనవాళ్లు కూడా నా వెంట వస్తూ నా చెప్పుచేతలలో తిరుగుతున్నారు, ఇంకేం కావాలి చెప్పు ?

రాజ్య : బాగానే వుంది గాని మనకేదైనా ప్రమాదం వస్తే ఈ స్నేహాలు రక్షిస్తవా?

ప్రకా : నా కే ప్రమాదం రాదనే ధీమా నా కున్నది. నా బాకు నా దగ్గర వుంటే చాలు. రాజ్య : ఆ దొంగ రివాల్వర్ పట్టుక వుంటాడేమో ?

ప్రకా : రివాల్వర్ ఎదురుగుండా వుంటేనే పేలుస్తుంది. బాకు వెనకనుంచి పొడుస్తుంది.

రాజ్య : ఒకరి ప్రాణం తీసివేస్తే గవర్నమెంటు వారు వూరుకుంటారా?

ప్రకా : ఆత్మ సంరక్షణార్థం చంపామంటే తప్పకుండా వూరుకుంటారు. అందులో యిటువంటి గజదొంగను చంపామంటే ప్రజంటుగూడా యిస్తారు. అసలు యిటువంటి సాహసం చేసినవాళ్ళనే డిటెక్టివుగా వేస్తారు.

రాజ్య : ఏది ఎలాగైన పెట్రోలింగ్‌కు వెళ్ళడం నాకిష్టంలేదు.

ప్రకా : ఇది బాగుంది; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగిందట-ఏమిటే నాకు భయం ?

రాజ్య : నా కంతా భయమే; మిమ్ములను గురించి - నన్ను గురించి కూడా. ఆ దొంగవెధవ ఎవడో పెళ్ళాం పిల్లలు లేని దిక్కుమాలిన ముండాకొడుకు. అన్నిటికి తెగించి వస్తాడు— వాడి చేతులో మీరు దొరుక్కుంటే ఇంకేమైనా వుందీ? మీరు వూళ్ళో పెట్రోలింగ్‌కు వెళ్ళిన తరువాత వాడు మన యింట్లోనే ప్రవేశించితే- నా ప్రాణాలు ఉన్నవి ఉన్నట్లు లేచిపోవూ? మనకిపుడున్న కీర్తిచాలు. మీరు వెళ్ళనేవద్దు.

ప్రకా : నేను వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే తక్కినవాళ్ళందరు వచ్చి మన యింటిమీద పడి నన్ను బయటకు లాగుతారు. రాజ్య : జ్వరం వచ్చినదని చెప్పి కప్పుకొని పండుకొండి.

ప్రకా : ఎన్నాళ్ళని పండుకొంటాను? నాకీ అబద్ధాలు, పిరికిచేష్టలు నచ్చవు సుమా! దేవుడు నన్ను మగాణ్ణి చేశాడు. నేను మగవాడుగానే వుండవలె.

రాజ్య : కానీ దేవుడు నన్ను ఆడదానిగా చేశాడు కదూ? - నా పిరికి తనం ఎలాగు పోతుంది? తన్ను మాలిన ధర్మం మొదలుచెడ్డ బేరం వుండవు. ఇంట గెల్చి రచ్చ గెలువు అన్నారు. మొదట స్వవిషయం చూసుకోండి.

ప్రకా : వీలు లేదు. నాకు స్వవిషయంకంటె లోక విషయమే ముఖ్యం. 10-55. ఇంక వెళ్ళాలి. ఆ కిల్లీలు, బాకు, అందుకో.

రాజ్య : మీరు లక్ష చెప్పండి నేను ఒప్పను. అదేమో ఏ రోజుకంటె ఈ వేళ మరీ భయంగా వుంది. మీరుసినిమా నుంచి ఒక గంట రావడం ఆలస్యమయేసరికి నేను వెఱ్ఱి ఎత్తిపోయినాను.

ప్రకా : ఇంక నీ కింటి దగ్గర కావలా కూర్చుని నే సవకీర్తి పాలు కావలెనా?

రాజ్య : కీర్తో, అపకీర్తో! అర్ధరాత్రివేళ నే నొకతిని యింట్లో వుండలేను.

ప్రకా : ఇల్లు యినప పెట్టెలాగా వుంది.

రాజ్య : కానీ నా మనస్సు? ఆ వేషమంతా విప్పండి. ఇవిగో రెండు కిళ్ళీలు కట్టాను. ఇవి చాలు లెండి; గడచిన 10–15 రాత్రులు, నిద్ర లేనేలేదు. ఈ రాత్రైనా సుఖంగా నిద్ర పొండి.

ప్రకా : ఆ దొంగ వెధవ యీ ఊళ్ళో తిరుగుతున్నంత వరకు నాకు ఇంట్లో పండుకున్నా నిద్ర పట్టదు.

రాజ్య : లేకుంటే జబ్బు చేస్తుంది.

ప్రకా : నీ ధర్మమా అని అది మాత్రం తెచ్చి పెట్టకు. దైవకృపవల్ల నా శరీరము వుక్కు తునక - వజ్రపుముక్క.

రాజ్య : కానీ మానవశరీరం-విధిగా విశ్రాంతికావలె.

ప్రకా : అవును. ఏవో మాటల్లోపెట్టి నన్ని లాగు నిలబెట్టేస్తే ఏలా?

రాజ్య : మీరు ఈ రాత్రి గడపదాటి ఆవలకు వెళ్ళితే నే ఒప్పనండి. కావలిస్తే రేపు వుదయం నన్ను మా పుట్టింటికి పంపించివేసి విూరు,-

ప్రకా : అవునుగాని ఏమిటీ మొండితనం? నీమాటే నీదా?

రాజ్య : మొండితనం అనండి- గయ్యాళితనం అనండి నా భయం తీర్చమని నా భర్తను కోరడం తప్పుకాదు కదా, నా మనస్సు భయంచేత ఎలాగు గడ్డకట్టి పోయి వుందో మీకేమి తెలుసు? మీకున్న ధైర్య సాహసాలు, లోకములో అందరికి – స్త్రీలకి, బాలురకుసహా వుంటాయనుకోవడం మీ తప్పు.

(లోపలనుండి)

మిస్టరు షెల్లాక్ హోమ్సొ! ప్రకా : రైటో-కమింగ్.

రాజ్య : మీకు మాత్రం వెళ్ళితే నేను ఒప్పను సుమండీ. తరువాత నన్ను అని లాభం లేదు. వాళ్ళకేదో చెప్పి పంపించేశిరాండి. ఈ వేషమంతా విప్పండి. (తానే విప్పి). ఈ శాలువ కప్పుకొని వెళ్ళి జ్వరం అని చెప్పి చక్కా రండి (తానే శాలువ కప్పుతుంది.)

ప్రకా : మనదేశంలో పురుషుల ధైర్య సాహసాలు చావడానికి స్త్రీలే కారణమని యిప్పుడు తెలిసింది. షేమ్, షేమ్ (వెళతాడు)

రాజ్య : (వస్తువులు సర్ది ప్రక్కలు రెండు మంచాలపై పరచి నడుమ ఈజీచైరువేసి, ఇంకేవేమో సవరిస్తూ వుంటుంది)

ప్రకా : (వచ్చి) ఛా, ఛా, ఛా! నా వుత్సాహమంతా ధ్వంసం చేశావు. నా చేత అబద్ధమాడించావు. వాళ్ళను పంపించి వేశాను. ఇంకేం చేసేది? (మంచము మీద కూల బడతాడు)

రాజ్య : ఆ పాపమంతా నాదే లెండి. కానీ వాళ్ళు వెళ్ళి పోయారా?

ప్రకా : ఆ. ఏమైనా అంత అవసరమైతే సైకిలుమీద కబురెట్ట మన్నా.

రాజ్య : నిన్న రాత్రి ఏమి లేదటకదూ?

ప్రకా : లేకపోవడం మేం? నిన్న రాత్రి ఘోరం జరిగింది. నిన్న 1 గంటకి దొంగఒకడు కోమటివీధిలో వడ్డాడట. ఒక కోమటితన కొడుకు, ఇంకా ఎవరో ముగ్గురు ఒక గదిలో గడియ వేసుకొని పడుకొన్నారట. ఎలాగొచ్చాడో ఆ గదిలో కొచ్చి కోమటి తలకాయ మీదికెత్తి తాళాలు ఏవి అన్నాడట. దానితో ఆ కోమటి గగ్గోలెత్తిపోయి నోటమాట రాక, చేతకానిముండాకొడుకై పోయినాడు– లేకుంటే తాళాలు కావాలిరా స్కౌండ్రల్ అని గూబ పగలెయ్య వలశింది.

రాజ్య : అయితే ఏమైంది తుదకి?

ప్రకా : వేటగాడు మెత్తనైతే లేడిమూడుకాళ్ళతో నడుస్తుంది: దానితో ఆ దొంగ వాడి పీక పట్టుకొని-నోట్లో గుడ్డ కుక్కి -

రాజ్య : అబ్బా - చెప్పకండి. నాకు భయం వేస్తోంది. ఈ వాళ సినిమా కథ చెప్పండి.

ప్రకా : “ముసుగుదొంగ"- అదీ దొంగ కథే.

రాజ్య : ఆ కథా వద్దు. సినిమాలోను దొంగలే ! వూళ్ళోను దొంగలే. మరేదైనా మంచి కథ చెప్పండి.

ప్రకా : 11½ అయింది; యిప్పుడు కథ ఏమిటిగానీ పెరటితలుపులన్నీ దిట్టముగా వేశావా?

రాజ్య : వేశాను. నా కంతకంటే భయం. మీరా దొంగ నెప్పుడైనా చూచారూ?

ప్రకా : చూస్తే విడిచి పెడతానూ? చూడకపోయినా విన్నదాన్ని బట్టి పోల్చగలనులే. వీడు అంతా సినిమా దొంగ లాగు తయారవుతాడట. తలమీద పెద్ద విగ్ ఒకటి. ఎవడో ఆ జుట్టు పట్టుకొనేసరికి అది వాడి చేతుల్లో వుండి పోయిందట-వీడు పారిపోయినాడట. వీడు లోపల ఇనపతీగెల బనీను తొడుగుకుంటాడట. నేనూ ఒకటికొందామని చూస్తున్నా. ఒక పోలీసువాడు కత్తికో పొడిస్తే - దెబ్బ తగలలేదట.—వాడు పారిపోయినాడట. చేతిలో టార్చిలైటు ఒకటి—ఒక చేతిలో రివాల్వరు-మామూలుగా కత్తి మొల్లో వుంటుందట-బాకుఒకటి-మెళ్లో నా లాగే కాఫీ థెర్మాసు ప్లాస్కు వుంటుందట-

రాజ్య : మరి ఆ సంగతి చెప్పకండి. నే నొకటి అడుగుతాను చేస్తారూ?

ప్రకా : ఏమిటి కథా?

రాజ్య : మీకు పండుకోవడమే నిద్రవస్తుంది. నాకు రాదు. అందుచేత నేను ముందర పడుకొంటాను. మీరు ఏదైనా చదువుతూండండి. నేను నిద్రపోతాను. తరువాత మీరు నిద్రపోదురుగానీ.

ప్రకా : ఏం చదివేది? ఇంగ్లీషు పుస్తకాలు నీకు అర్థంకావు. వెధవ తెలుగు అంటే నాకు అసహ్యం.

రాజ్య : పోనీ ఇంగ్లీషు పుస్తకమే చదివి తెనుగున చెప్పుదురూ.

ప్రకా : (లేచి వెళ్ళి పుస్తకము తెచ్చి) ఇదిగో మార్కండేయ” అని ఇది చాలా మంచి పుస్తకం. దీనిని నాన్‌డిటియల్‌డు అంటారు. (చదివి చెప్పుతూ) అప్పుడే నిద్ర పట్టిందీ. (పుస్తకము మూసి ఈజీ చైరు ఎత్తిపెట్టి తానూ పండుకొంటాడు)

రాజ్య : దీపం తగ్గించేస్తురూ; అమ్మమ్మ!

ప్రకా : ఇంకా నిద్ర పట్టలేదూ? (తగ్గించి పండుకొంటాడు) (పెరటిలో పెద్ద చప్పుడు)

రాజ్య : (దిగ్గున లేచి) అమ్మో! ఏమిటది? ఎంత చప్పుడో

ప్రకా : ఏమిటి చెప్మా!

రాజ్య : దొంగ! తప్పకుండా దొంగ! నిస్సందేహం!

ప్రకా : వుండు క్షణముండు (జాగ్రత్తగా విని) యిప్పుడు ఏం చేయడం ?

రాజ్య : కేకలు పెడదాం—దొంగ అని గట్టిగా?

ప్రకా : నలుగురూమూగి చూసిన తరువాత ఏ దొంగ లేకపోతే నాకు కమ్మకట్టి వేయరూ? చెప్తా.

(ఏదీ గతి నాకు - గ్రామఫోను రికార్డు వేస్తాడు)

రాజ్య : (సగములో ఆపి) అవతల నుంచి కొంపమునిగిపోతూ వుంటే ఈ గ్రామఫోను వాయిద్య మేమిటి? తీసి వేస్తుంది.)

ప్రకా : వాడే దొంగ అయితే వాడికి మనం మేలుకొనివున్నట్లు తెలుస్తుంది.

రాజ్య : అయితే ఈలాగు తెల్లవార్లూ గ్రామఫోనుతో కూర్చుందామంటారా ఏమిటి? ఛ. ఛా! పెరట్లో ఒకమారు చూచిరండి. ప్రకా : తలుపు తెరిచే సరికి వాడు లోపల ప్రవేశిస్తే ?

రాజ్య : అప్పుడే వెంటనే కేకలు పెడదాం!

ప్రకా : వుండు ముందర కిటికీ తెరచి చూద్దాం (తెరుస్తాడు పిల్లి లోపలకు గెంతుతుంది.) పిల్లి వెధవగొడ్డు!

రాజ్య : బ్రతికేం భగవంతుడా! నా ప్రాణాలు మీదకెగిరి పోయినాయి.

ప్రకా : రా. అయినా ఓమారు పెరడు చూద్దాం.

రాజ్య : అమ్మో! నేను రావడమే! నేను రాలేను సుమండీ!

ప్రకా : దొంగా మనిషివంటివాడే! దొంగంటే యింత భయమైతే ఎలాగే? ఏదీ ఆ టార్చిలైటూ బాకూ యిలాగ ఇయ్యి నేను చూసివస్తా!

(తలుపు తెరచి వెళతాడు. రాజ్యం ముసుగు కప్పుకొని పండుకొంటుంది. దొంగమెల్లగా ప్రాకుకొని వచ్చి మంచము క్రిందకు పోతాడు.)

ప్రకా : (తిరిగివచ్చి తలుపు గడియ వేసుకొని) అప్పుడేముసుగు తన్నేనా? ఏమి భయమే! ఆడవాళ్ళకింతలేసి ధైర్య సాహసాలు. వీళ్ళకు పురుషులలో సమాన స్వాతంత్ర్యం. కావాలట! లే! లే! ఏ దొంగా లేడు.

రాజ్య : (ముసుగుతీసి మంచంపై కూర్చొని) లేడూ లేడూ? బ్రతికేం. ప్రకా : మనం కాదు; వాడు బ్రతికాడు. ఏ ముండాకొడుకుకు గుండెలున్నాయి మన యింటికి రావడానికి?

(దొంగ గప్పున యిద్దరి ఎదుట నిలుస్తాడు)

ఇద్దరు : ఓ, ఓ, ఓ,...... దొ... దొ... దో...

దొంగ : ... షటప్! రివాల్వరు చూపించి) తల పేలుస్తా నోరు విప్పితే.

ప్రకా : (ఒక చేత్తో తన నోరు మూసుకొని రెండవ చేత్తో గట్టిగా ఆమె నోరు మూస్తాడు.)

దొంగ : నోరు మూసుకొని కప్పుకొని పండుకోమని చెప్పు.

ప్రకా : పండుకో పండుకో. మాటాడితే గట్టిగా ఊపిరితీస్తే ఈయన తల పేల్చేస్తానంటున్నారు. లేకుంటే ఏమీ అనరట. పండుకో. (బలవంతంగా పండుకోబెట్టి శాలువ నిండా కప్పుతాడు.)

రాజ్య : అమ్మో దొంగ దొంగ! (ముసుగులో మూల్గుతుంటుంది)

ప్రకా : ఎవరు దొంగ? ఆయన దొంగ అని అప్పుడే నీకేం తెలుసు ?

రాజ్య : భయం భయం, హ, హ, హ, హ (వణికి పోతుంది)

దొంగ : నోటిలో గుడ్డకుక్కి ఈమె నోరు కట్టివేయి. కదలకూడదు.

ప్రకా : ఈమె మలేరియల్ జ్వరంతో బాధపడుతోంది. అందు చేతనే ఈ వణకూ పలవరింతలూ. మాటాడకు రాజ్యం ! (చెవిలో మెల్లగా) భయంలేదు. నేనున్నాను. నీవు హాయిగా పండుకో; పండుకుందండి.

దొంగ : ఆ రాకింగ్‌చైర్ యిలాగువెయ్యి.

ప్రకా : తొందరలో గమనించలేదు. పాపం యింతసేపు నిలబడిపోయినారు. (చైరు వేసి) దయచేయండి.

దొంగ : (కూర్చుండి నోటుబుక్కు తీసి వ్రాసుకొంటూ) మీ పేర్లు? మీ సంగతులు?

ప్రకా : నాపేరు రాజ్యలక్ష్మీ; దీనిపేరు ప్రకాశరావు. వయస్సులు, 30–25. భార్యా భర్తలం. కేస్టు హిందూస్ బ్రహమిన్స్. ఇంటిపేరు ద్వివేదులవారు. అన్నట్లు నేను మేల్, యిది ఫిమేలండి.

దొంగ : నీ యింటిదగ్గర ఏమేమి ఆయుధాలున్నాయి?

ప్రకా : మేమేమి రాజులం కనకనా ? సంసారులం – బ్రాహ్మలం. ఏ మాయుధాలు వుంటాయి? కత్తిపీట- కోరాం- పారా- బొరిగా- గునపాం-

దొంగ : అవికావు.

ప్రకా : అయితే నా దగ్గర పెన్‌నైఫ్- Safty razor "సెలఫ్ షేవింగ్‌కు ఎడోనిస్ బ్లేడ్సు ఒక డజన్. అంతే. నా వైఫ్ దగ్గర కొన్ని, Hair pins హేర్ పిన్సు చిన్నకత్తెర...

దొంగ : (విషపునవ్వుతో) తమాషా ! ఆయుధములేదా? ప్రకా : అన్నట్లు మరచాను ఒక్క చిన్న బాకున్నది. (యిచ్చి) పనసకాయ కొట్టుకొందుకు మొన్న నే కొన్నాను. అట్టే దారుగాలేదు. వుండనివ్వండి.

దొంగ : ఈ యిల్లు నీదేనా ?

ప్రకా : కాదండీ. అద్దెకొంప. నెలకు 22 రూ. అద్దె. తమవంటి తగు మనుష్యులువస్తే కూర్చోపెట్టడానికి మంచిగదైనా లేదండీ.

దొంగ : నీకు సంవత్సరానికి రాబడి ఎంత ?

ప్రకా : ఏదో అయిదువందలండి. అదైనా కాగితంమీదనే. మెరక భూములు – నిరుడు వరదలు వచ్చి ముంపుడై పోయినాయి. రైతువారీ గడుసుమీరి పోయింది; భూఖామందు ఖాతరేలేదు. పోనీ దావాలు వేదామంటే మునసబ్ నాన్ బ్రామిన్ అయిపోయినాడు. (నాలిక కొరుక్కొని) తమరు నాన్‌బ్రామిన్సా ఏమిటండీ? లేకుంటే బ్రామిన్సేనా?

దొంగ : ఓఁ, నీ దగ్గర నగదు ఏమాత్రంవుంది ?

ప్రకా : ఏముంటుందండీ, వున్నవాళ్ళం యిద్దరం. కాని ఖర్చు చాలా జాస్తేనండి. అందులో నా భార్య దూబరామనిషండీ,— వెఱ్ఱిపీరు.

దొంగ : సొమ్ము -నగదు- నీ దగ్గర ఏమాత్రం వుంది ?

ప్రకా : చిత్తం చిత్తం- ఏదో దినవెచ్చానికి 5-6 వుంటుంది.

దొంగ : చూపించు, తీసి చూపించు !

రాజ్య : అమ్మో, అమ్మో! దొంగ : నోరుమూసుకోనువ్వు. రెచెడ్ వుమన్.

ప్రకా : అలాగేనండీ వట్టి దౌర్భాగ్యం మనిషి! మేమేదో వ్యవహారం మాట్లాడుకుంటూవుంటే నీమూలుగేమిటి ? ఏమిటి కొంప ములిగిపోయింది? ఆయన ఏదో అడుగుతున్నారు, నేనేదో చెప్తుతున్నాను.

రాజ్య : ఆ సందుగ పెట్టె చూపించండి. యిదిగో తాళం (తీసియిస్తుంది).

దొంగ : (బాకుఎత్తి) నీవు మాట్లాడావంటే యిది గుండెల్లోకి విసిరేస్తాను.

ప్రకా : క్షమించండి, క్షమించండి. నువ్వూరుకో. (చెవులో మెల్లిగా) కానీ కానీ భయంలేదులే ఈవేషం అంతాచూసి చేయవలసినపని ఆఖర్న చేసి వేస్తాను. నువ్వు పండుకో-మరి మాటాడదులెండి. ఆ సందుగ పెట్టె తెస్తునా?

దొంగ : ఆ అయిరన్‌సేఫ్ తియ్యనోయి

ప్రకా : కొంప ములిగిపోయింది రాజ్యం! యినపపెట్టె కొననోయి కొననోయి అంటే కొనేదాకా ప్రాణం పుచ్చుకొన్నావు. సరదా తీరిందా?

దొంగ : ఏమి?

రాజ్యం : తాళాలు పోయినాయండి.

దొంగ : (ఆ మార్కండేయ పుస్తకము ఆమె మొగముపై కొడతాడు.)

ప్రకా : ఉన్నాయండి, ఉన్నాయండి, కాని సరిగా తిరగడం లేదండి. అసలు వూళ్లో దొంగాటకంగా వుందని పెట్టె మూసేసి తాళాలు నూతులోకి విసరేశానండీ,- తర్వాత తీయించుకోవచ్చునని.

దొంగ : (లేచి వానిరెక్క పట్టుకొని) రా. దిగు, దిగి తీయవలె; పద!

రాజ్య : (దిగ్గున లేచి నమస్కరిస్తూ) మీధర్మమాయె ఆయనను దింపకండి. ఆయన కీత రాదు. కావలిస్తే నన్ను తోసి వేయండి నూతిలోకి— తాళం వెదకి తీసి నేను పైకి విసరి వేస్తాను.

దొంగ : నువ్వితనికంటె వట్టిపేచీ మనిషి లాగున్నావే!

ప్రకా : పేచీ మనిషా! యింకా పేచీ మనిషా! ఈమెతో ప్రతిరోజూ నేనెంత బాధ పడిపొతున్నానో ఆ పరమేశ్వరుడికి తెలుసును. మహా మూర్ఖురాలు!

దొంగ : సరే, చప్పుడు కాకుండా పెట్టె బద్దలు కొట్టే సాధనం నా దగ్గిర వుంది. నేను చూస్తా. మరి మీకీ పెట్టెమాత్రం ఎందుకూ పనికి రాదు.

రాజ్య : బంగారం లాంటి పెట్టె. మొన్ననే కొన్నాం. విరచే నివ్వకండి.

ప్రకా : విరవకండి సార్. నా దగ్గర డూప్లి కేటు కేసు వున్నదండి. తీస్తా.

దొంగ : తాళాలు దగ్గరపెట్టుకొనేనా యిన్ని వేషాలు వేశావు? దొంగ - దగుల్బాజీ! తీయి. 10 గుంజీలు తీయి ముందు. ప్రకా : తమవంటి ఘరానా మనిషికి డూప్లి కేటు కేసు యివ్వడమా అని.

రాజ్య : మొద్దు పిల్లకాయ లాగు గుంజీలు తీయడ మేమిటి తీయవద్దు.

ప్రకా : ఆయన నోరు మూసుకో, నోరు మూసుకో అని చెప్పుతూ వుంటే నీకా? నాకా? తీస్తానండి సార్. ముసుగేసుకో; ఆయనకు కోపం రాగలదు (లేస్తాడు)

దొంగ : ఇదిగో నేను తగుమనిషి తరహా చూపించేటప్పుడు, మీరు అట్లే వుండవలె; తెలిసిందా? మీరుపశువుల్లాగా ప్రవర్తిస్తే మిమ్ము వేటాడే మార్గం నాకు తెలుసును. ఇది 20వ శతాబ్దం. ఎటువంటి ఘోరమైనా పాపమైనా కూడా నాజూకుగా జరగవలె. నేను 20వ శతాబ్దపు మనిషిని. సజావుగా వ్యవహారం నడిస్తే నా లాభంలో నూటికి 80 చొప్పున కమీషను ఇస్తాను. మీరు బైతుల్లాగు గగ్గోలెత్తితే మీ ప్రాణం పుచ్చుకొంటా, తెలిసిందా? పెట్టితియ్యి. ఒక్క ఇంటి కింతసేపు కూర్చుంటే ఎలాగవును?

ప్రకా : చిత్తం. చిత్తం (తీసి) దయ చేయండి.

దొంగ : (వెళ్ళి చూచి) ఏం ? 5–6 వుందన్నావు.

ప్రకా : అవునండి. 5-6 అంటే 5-6 వందలన్న మాట.

దొంగ : అలాగా ...... అవి ఒక కవరులో పెట్టు.

ప్రకా : చిత్తం.

దొంగ : ఆ చిల్లర రూపాయలు ఎన్ని ? ప్రకా : 13–15.

దొంగ : అవి నీ పై ఖర్చుకుంచుకో - తెల్లవారడమే డబ్బుకోసం ఎక్కడికి పోతావు గనుక. ఆ సామాన్లు తియ్యి.- ఆ వెండి సామాన్లన్నీ.

రాజ్య : అయ్యయ్యొ! ఎంతో ముచ్చటపడితే మొన్న మొన్ననే అన్నయ్య వీటిని బొంబాయి నుంచి పంపించేడండీ.

ప్రకా : ఆ కష్టపడిపోయినాడు పాపం మీ అన్నయ్య. 600 నేను పంపితే ఖర్చు పెట్టేసుకొన్నాడు కాబోలు. మరి నెల్లాళ్ళకు పంపేడు. ఎంత కమీషన్ తీశాడో?

దొంగ : మీ భావ మరదీ. మీ భార్య లాగే పరమ దగుల్బాజీ లాగున్నాడే?

ప్రకా : ఇంకా మెల్లిగా సెలవిస్తున్నారు. దొంగ కదటండీ.

దొంగ : సరే వెండి సామానులు ఇత్తడి సామానులు ఎవరు మోసుక పోతారు–నా కక్కరలేదు. నేను యివ్వ బోయె నూటికి 80 కమిషన్ కింద అవి మీరే వుంచుకొండి.

రాజ్య : మంచాలు కుంచాలు, బిందెలు, చెంబులూ కూడా వదలి వేస్తున్నారు కనుక అవీ కలిపి వేయండి. 100కి 100 కవిూషనిచ్చిన గొప్ప మీకుంటుంది.

ప్రకా : ఇదే యిబ్బందండీ-ఏమి తెచ్చి యివ్వండి సంతృప్తి లేదు ఈ ప్రాణికి.

దొంగ : బంగారపు నగలు కనపడవేం? ప్రకా : ఉన్న వేవో మై వైఫ్ వొంటిమీదనే వున్నవండి నిద్రపోతున్నప్పుడైనా వాటిని తీయదండీ.

రాజ్య : అవేమాత్రం వున్నాయండి-కంటె, వొడ్డాణం గొలుసు కూడ అమ్మివేశారండి.

ప్రకా : మరి ఇల్లు కట్టడానికి సొమ్ము చాలకపోతే అమ్మి వేశానండి.

దొంగ : కట్టించి కట్టించి అద్దె యిల్లు కట్టించారేమిటండీ?

ప్రకా : చిత్తం చిత్తం అమ్మివేయడమే మేలైనది. అదైనా దక్కింది- లేకుంటే-

దొంగ : లేకుంటే?

ప్రకా : మరేం లేదు - తమరొస్తారని తెలియక అమ్మివేశాను. తెలిస్తే వుంచి వేద్దును. ఏదో అది ఇదీ కలిస్తే తమకు కొంత అదనుకు పనికి వచ్చును అంటున్నా.

దొంగ : ఆవిడవంటిమీద వస్తువులు అన్నీ తీయించి తీసుకరండీ.

రాజ్య : వేయి చెప్పండి. లక్ష చెప్పండి. పోతే నా ప్రాణమైనా పోనివ్వండి. నే నివ్వను.

ప్రకా : చూడు ఆయన మాట కాదనకు. ఆయన మనస్సు కరగి - ఈ స్వల్ప వస్తువులు యివి మనకేమాత్రం అనితోచి ఆయనే వదిలేయవచ్చును. ఈయన సామాన్యుడు కాదు. 20వ శతాబ్దం మనిషి ఈ కాలంలో ఈయన వొక్కడే. రాజ్య : నన్ను చిత్రవధ చేసినా సరే నే నివ్వనుగాక. యివ్వను.

ప్రకా : ఏమండీ సార్! మా వాళ్ళివ్వమంటున్నారండి. ఫిమెల్ ఎంతో మంచి పతివ్రత అయితేనేకాని తన వంటి మీద చెయ్యి వెయ్యనివ్వదండీ. తమకు పెళ్ళి అయినదండీ సార్!

రాజ్య : అయితే ఆవిడ ఎవరో మహా అదృష్టవంతురాలై వుంటుంది. దొంగ పెళ్ళామైన కావలె దొర పెళ్ళామైన కావలెనని.

దొంగ : ఏమిటీ ఆలస్యం? మొదట ఆ వస్తువులందుకో.

ప్రకా : ఏలాగునండీ? మీరోసారి చెప్పిచూడండి.

దొంగ : నా ప్రాప్తం - నేను ఆడదాన్ని నగలిమ్మని యాచిస్తానా. లేకుంటే బాధిస్తానా?

ప్రకా : నేను సిగ్గుమాలి యాచించినా లాభంలేక పోయింది. పోనీ కొంచం బాధించనా అండి. నొక్కకపోతే మామిడిపండులోనుండి రసం రాదు.

దొంగ : (టైమ్‌చూచి) 1-5. ఇంక నేను లేవవలె వేగంగా కానివ్వండి.

ప్రకా : రాజ్యం! ఆయన్ని ఎంత వేగం పంపివేస్తే మన కంత మేలు, ఇవ్వక తీరదులే.

రాజ్య : ఇంక పోవడమే! ఏదో చేయవలసినపని వీడికాఖర్న చేస్తామన్నారు. మరచి పోయారా ఏమిటి? ప్రకా : సమయం చూస్తున్నా ! ఇంకా వీడు పోయే వరకూ వేళవుందిగా. మంచి ఉపాయం ఆలోచిస్తున్నా. ముందు సరకులు తీసి వీడి మొఖంమీద పారవేయి.

రాజ్య : నేనేం వెర్రిదాన్ని అనుకొన్నావా ఏమిటి ? నే నివ్వ నండీ ?

ప్రకా : ఇవ్వకపోతే నీ గుడ్డేం పోయింది? "ఆడవాళ్ళని బాధిస్తానా అని ఇతడనడంచేత నిన్నేమీ అనడన్న ధీమా నీ కున్నది. ఇక నేనెలాగు చస్తే నీకేం? ఇవి నేను చేయించి పెట్టిన వస్తువులు కానీ, నీ యబ్బా; నీ తాత చేయించినవి కాదు.

రాజ్య : (ఏడుస్తూ) తీసుకొండి. మీ వస్తువులు మీరు తీసుకొండి. నా కక్కరలేదు. (ఇస్తుంది.)

ప్రకా : (తెచ్చియిచ్చి) ఇవి యేమాత్రంలెండి తమవంటివారి కంటికి - తృణం.

దొంగ : నా జ్ఞాపకార్థం ఆవిడని ఈ జెడబిళ్ళ వుంచుకో మనండి.

ప్రకా : చిత్తం. తమ జ్ఞాపకార్థం వేరే వస్తువెందుకండీ తమరే చాలు. తమర్ని తమర్ని యీ జన్మలో మరువగలనాఅండి.

దొంగ : ఆలాగు కాదు. మరి నాలుగు రోజులు పోయిన తరువాత మరో దొంగ మీ యింటిమీద పడతాడను కొండి. అప్పుడు మీరునన్ను పెంచుకోవలె. యిందండి. రాజ్య : చాలు చాలు ఇంకా మా కొంప మీదికి దొంగల్ని తెచ్చి పెట్టకు.

ప్రకా : 'ఏమేవ్? ఊఁ హూఁ స్నేహం దగ్గర విరోధం తెచ్చేటట్లున్నావు. జాగ్రత్త.

దొంగ : అయితే నా పని పూర్తి అయినట్లేనా?

ప్రకా : చిత్తం ఇంకేముంది ?

దొంగ : అదే అడుగుతున్నా. యింకేముందని (నవ్వుతూ)

రాజ్య : అదిగో ఆయన వున్నారు కావలిస్తే తీసుకపోండి.

దొంగ : మంచిది వెళ్ళివస్తాను. నాకు తాంబూలము యిప్పించి వేయండి.

రాజ్య : ఇంకా అదికూడా మిగిలిపోయిందా?

(అసహ్యంతో కొర కొర చూస్తుంది)

ప్రకా : రా పిల్లా. చప్పున రెండాకులు చుట్టు

రాజ్య : నా చేత కాదు. అదుగో ఆకూ వక్కా యివ్వండి చాలు.

ప్రకా : (మెల్లిగా) ఆకూ వక్కా యిచ్చేస్తే వెంటనే వెళ్ళిపోతాడు. మరొక్క క్షణం కూర్చో పెట్టి బాతాఖానీలో పెడితే నా తడాకా తెలిపిస్తాను. (గట్టిగా) చుట్టు బాగా చిలకలు చుట్టు.

రాజ్య : (తలవంచుకొని ఆకులు చుడుతూ వుంటుంది) దొంగ : (కూర్చుండి) కానీండి అయిన అలస్యం ఎలాగూ కానే అయింది. (రిస్టువాచీ చూచి) 1-25 అబ్బా! (సిగరేటు కేసులోనుండి తీసి అతని కొకటి యిచ్చి తా నొకటిపట్టి అగ్గిపుల్ల వెలిగించి తొలుత అతని కందిస్తాడు.)

రాజ్య : ఇదేమిటి? ఈ యగ్గేమిటి ? చేసింది చాలక కొంపమీది కగ్గిపెడుతున్నావా ?

ప్రకా : దొంగగారూ నేనూ సిగరెట్టు కాల్చు కుంటుంటే మధ్య నీ గగ్గోలు ఏమిటి ? నీ పని నువ్వు చూసుకో. చిత్తం. చిత్తం. తమకు చాలా ఆలస్యమైపోయింది యిక్కడ.

దొంగ : అయిపోయిందండీ ! 1-30 ఇంక మరొచోటుకు వెళ్ళడానికి వేళలేదు. ఓపికకూడా లేదండి. అబ్బబ్బా 25 రోజు లయింది నిద్ర అన్నది లేనే లేదనుకోండి. శరీరంశుభ్రంగా చెడిపోయింది.

ప్రకా : వెధవది నైటు డ్యూటీ కష్టమేనండి...

రాజ్య : పాపం. ఎందుకింత కష్టపడిపోతూన్నా వేమిటి.

ప్రకా : నువ్వు నోరు మూసుకో-మగాళ్ళం మేమూ, మేము మాటాడు కొంటూవుంటే పానకంలోపుడకలాగు మధ్య దూరుతావు.

దొంగ : మాటాడనివ్వండి నేను వచ్చినపని ఏమైపోయింది గనుక. ఇంక నన్ను ఒక పరిచితుడుగాను స్నేహితుడుగాను మీరు భావించవచ్చు. రాజ్య : అయితే అడుగుతాను - ఈ పాడువృత్తి కాకుంటే యింతకంటె మంచి వృత్తి మీ కేమీ కనబడలేదూ?

దొంగ : ఎంచేత నమ్మా యిది పాడువృత్తి అంటున్నావు?

రాజ్య : ఒకరి సొత్తు బలత్కారంగా అపహరించడం పాపం కాదు ?

దొంగ : ఒకరి సొత్తేమిటమ్మా? తానువచ్చేటప్పుడు తెచ్చాడా? పోయేటప్పుడు పట్టుకపోతాడా? అది మన సొత్తైతేనే మన దగ్గరకొస్తుంది. ఋణం లేందే తృణమయినా ముట్టదంటారు. ఈ ఊళ్ళో యిందరు ధనవంతులుండగా నేనిక్కడకే ఎందుకు వచ్చాను'? నా సొమ్ము యిక్కడ వుందిగనుక .

రాజ్య : ఆఁ! నీయబ్బా నీతాత గడించినముల్లె యిక్కక దాచపెట్టేరు.

ప్రకా : ఇదిగో చెపుతున్నా నోరుమూసుకో, తమరు సెలవిచ్చింది సత్యం.

దొంగ : ఈ చుట్టుపట్ల మీకు తెలిసినవాళ్ళలో ఎక్కువగా నగదు వ్యాపారంచేస్తూ పిసరూ పిప్పీ బాగావున్న వాళ్ళెవరైనా ఉన్నారా?

ప్రకా : చిత్తం. యిక్కడకి 7 మైళ్ళదూరంలో శాంపురంలో జయంతి వారనివున్నారు. అర్ధరాత్రివేళ అయినా అయిదు ఆరు సంచులు కావాలంటే అక్కడే దొరుకుతుంది.

రాజ్య : ఇక్కడికి యింతటితో చాలు మీూ ధర్మమా అని వాళ్ళకుకూడా సుడిపెట్టకండి. ప్రకా : వాళ్ళు మన అత్తవారు లెండి. పుట్టింటి అభిమానంకొద్దీ యిది యీలాగుదేవులాడుతూంది. సత్యం చెప్పవలసి వచ్చేటప్పుడు మనిషి తన, పర అన్న భేదం చూపించకూడదు ఏమండీ ?

దొంగ : సరే రాసుకుంటా - శాంపురమా ? ఇంటి పేరు ఏమన్నారు ?

రాజ్యం : జోస్యులవారు.

దొంగ : (వ్రాసికొని) మీరుచెప్పినచోట నాకు దొరికే లాభంలో నూటికి ఐదుచొప్పున మీకు కమీషన్ యిస్తాను.

ప్రకా : భేష్. అయితే నానష్టం యిందులో కొంతకలసి వస్తుంది. పోయినడబ్బు పోయింది. కానీ తమరు మాయింటికి దయచేయడం నిజంగా నా అదృష్టం. ఇక నేను మీ కింద కమీషన్ ఏజెంటుగా పనిచేస్తాను.

రాజ్య : ఇంక ఈయనక్రింద ఉద్యోగ మొక్కటే తరువాయి. యిదిగో తాంబూలం యింక ఆయన్ని అంపకం పెట్టిరండి.

దొంగ : (తాంబూలం పుచ్చుకొని) అబ్బా! తల రింగు రింగు మని తిరిగిపోతున్నది. కాఫీ ఏస్పరిన్ గాని వుందా ?

రాజ్య : ఏమిటీ హిరణ్యాక్షవరాలు ? తెగూతెంపూలేకుండా వుంది. యిదివుందా అదివుందా అని. ఇంట్లో యింకేమి మిగిలున్నవో వరుసగా చెప్పివేస్తాను. తినవలసినవి తినేసి, త్రాగవలసినవి త్రాగేసి, పట్టుకపోవలసినవి పట్టుకపో. అటకమీద ఆవకాయవుంది. కుండలో చల్దిఅన్నంవుంది.

ప్రకా : చాలుచాలు వూరుకో. దానిమాటల కేమండి.... వట్టి ఫీమేల్... కాఫీ ఎస్పరిన్ లేదుకాని ధర్మాప్లాస్కులో తయారైన కాఫీ వుంది. ఓవల్టీన్ కావలిస్తే రెండు నిమిషాలలో స్టౌ మీద తయారు చేయించేస్తాను.

రాజ్య : చేయించేస్తారు! నేను చేయను కావలిస్తే మీరే చేసుకోండి.

ప్రకా : అన్నట్లు స్పిరిట్ లేదు కదూ!

రాజ్య : అది వుంటే యీ ప్రారబ్ధ మేమి?

దొంగ : శ్రమెందుకులెండి-ఆ కాఫీ అందుకోండి' (త్రాగి తాంబూలము వేసుకొని) అబ్బా! లాభం లేదండీ మహా బాధగా వుంది. అమృతాంజనంవుందా ?

ప్రకా : లేదు నేను కొంచం ఆయుర్వేదవైద్యుడిని. ఒక్క మోతాదు మందు యిస్తాను. పుచ్చుకోండి.

(లోని కేగును)

రాజ్య : (కొంచెము దూరముగా నిలిచి) నీ కింతటిలో నైన మమ్ములను అనుగ్రహించి విడిచిపోవాలనివుంటే పోలే కుంటే నీకు యిక్కడ కేంప్‌కాట్ వేస్తాను. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పండుకొండి. అబ్బబ్బా ! దొంగవాడు కూడా మాటల పోగూ, బాతాఖానీ రాయడూ అయితే మహాబాధ. (లోపలనుండి) రాజ్యం. రాజ్య : ఆ వస్తున్నా (లోని కేగును)

దొంగ : (తలదించుకొని) ఎవరేమంటున్నదీ నాకు తలకెక్కడం లేదు. మందు తెప్పించండి. (క్షణ మూరకుండి తల కొట్టుకొని బాధపడుతూ) ఏమండీ ! నిద్రపోతున్నారా? ఇంకా నిద్ర పోతున్నారా? ఇంకా తేరేం ? (తెస్తారు.)

ప్రకా : ఇది కళ్ళుమూసుకొని గుటుక్కున మింగెయ్యండి. వెంటనే గుణమిస్తుంది.

దొంగ : ఒహో ! మీరు కొంత పుచ్చుకొండి ముందు.

ప్రకా : ఇది ఒక్క మోతాదేనండి.

దొంగ : ఈ మోతాదు ముందు మీరు పుచ్చుకొండి - తర్వాత నా కిత్తురుగాని.

ప్రకా : ఇది తల నొప్పి లేకుంటే వికటిస్తుందండీ.

దొంగ : (ప్రకాశం చేయిపట్టుకొని) నిజంచెప్పు. ఏమిటీమందు?

ప్రకా : క్షమించాలి. నేను వద్దు వద్దు అంటుంటే నా భార్య బలవంతపరచి ఈ మందు కలిపించిందండి.

దొంగ : ఎమిటీమందు ?

ప్రకా : మరేం లేదు. మత్తుమందు. యిది పుచ్చుకొంటే రేపీవేళకే తెలివివస్తుంది.

దొంగ : ఛీ ఛీ ఈ లోకంలో నమ్మదగినవారొక్కరూ లేరు.

రాజ్య : ఛా, ఛా-లోకంలో నమ్మకస్తు లెక్కడున్నారు - ఒక దొంగలు తప్ప. దొంగ : యిందాక నీకు విడిచిపెట్టిన రూపాయలు యిచ్చివేయి-నీ అపరాధానికి (15) రూ జరిమానా.

రాజ్య : నువ్వు నిజంగా జడ్జీ లాగున్నావు కానీ దొంగలాగు లేవు.

ప్రకా : నువ్వు ప్లీడరులాగ లేవూ? చాలులే వూరుకో.

(సొమ్మిస్తాడు)

రాజ్య : నా ప్లిడరీ మాటకేంగాని. మీరున్నారులే నేరస్థుడులాగు.

ప్రకా : యిదేనండీ అల్లరి. అసలు హజబెండ్ అంటే గౌరవం లేదండీ. నువ్వు అంటే నువ్వు-

దొంగ : తలనొప్పి దుర్భరంగా వుంది. ఒక గంట నిద్రపోతే సర్దుకుంటుంది. పండుకొంటాను. 1–50. సరిగా 3 గంటలకి నన్ను లేపివేయండి. అలారం టైంపీసు వుందా ?

రాజ్య : శ్రీరామచంద్రా ! యిది గంటలకొద్దీ ఆపరేషన్ లాగుంటె-చిత్రవధ.

ప్రకా : (తెచ్చి) మూడు గంటలకు అలారం పెట్టనా ?

దొంగ : పెట్టండి-యిదిగో అంతవరకూ మీరుమేలుకొని వుండండి.

ప్రకా : (ప్రక్క సర్దుతూ) మీరు అంటే నే నొక్కడినేనా ?' ఈమెకూడానా ? దొంగ : మీ రొక్కరే. (పండుకొని) మళ్ళీ యీ సారి ఏమి ద్రోహం తల పెట్టినా చాలా చిక్కు పడిపోతారన్న సంగతి నేను చెప్పకుండానే మీరు తెలుసుకోవలసివుంది. (క్షణం నిశ్శబ్దం)

రాజ్య : అయితే ఈ శవజాగారం మీకు తెల్లవార్లూవుందన్న మాటే ?

ప్రకా : (మెల్లగా) మాటాడక మధ్య గదిలోకి వెళ్ళి పండుకో.

రాజ్య : మీ కంతసరదాగా వుంటే నాకేం కానివ్వండీ. ఏమిటీ భాగవతం ? వీడి వ్యవహారం చూస్తే ఇల్లరికం వుండి పోయేటట్టు వుంది.

ప్రకా : ఈయన ఇరవైయవ శతాబ్ధపు మనిషి. (20)

రాజ్య : అంటే?

ప్రకా : అంటే ఆడవాళ్ళు చదువులేనివాళ్ళు మీకేమి తెలుస్తుంది? మంచి ఘరానా మనిషి అన్న మాట.

రాజ్య : వీడెవడో నావల్సులో దొంగలాగున్నాడు కానీ.

ప్రకా : గట్టిగా మాట్లాడకు - నిద్రపట్టినట్లుంది. నిజంగా ఈ నావల్సువల్ల సినిమాలవల్ల దొంగతనం మోస్తరు మారిపోయి, ఎంత నాజూకుగా తేలిందో చూశావూ ?

రాజ్య : మోస్తరు మారితేనేం? ఫలితం ఒకటే—1200 లకు సుడిపెట్టాడు కదూ?

ప్రకా : మెల్లిగా నిద్రపట్టినట్టుంది. రాజ్య : యిదిగో నా మాట విని - ఈలాగు రండీ (దూరముగా తీసుక వెళ్ళుతుంది.)

ప్రకా : మరి చెప్పకు నీ మాట నేను వినను. అది వినబట్టే యింతైంది.

రాజ్య : పోయిన 1200ల కేండీ యీ జరిమానా. 15 రూపాయల కేనా విచారం ?

ప్రకా : లక్ష పోతే విచారం లేదు కానీ మగవాడన్న వాడికి ఒక కానీ జరిమానా పడితే ఎంత పరువునష్టం.

రాజ్య : మగతనం మడగక్కరలేదు. ఈలాంటి మగవాళ్ళుంటే రామసహాయం! పెట్రోలింగ్‌కు వెళ్ళతారట! దొంగల్ని పడతారట. యిదంతా ఒక సరదా ఆటకానీ యింకేంకాదు. విూరు యింత మనిషి వున్నారు - వీడుచూస్తే అర్భకుడు. టక్కున నిలబెట్టేస్తే! కోమటి ఆచిపెట్టి ఒక లెంపకాయ కొట్టలేక పోయినాడన్నారు. మీరు ఏమి చేశారు కొసకి - గుంజీలుకూడా తీశారు. సిగ్గు సిగ్గు.

ప్రకా : వేశాను - ప్లాను వేశాను. సమయం చిక్కనీ ఏం చేస్తానో-

రాజ్య : మొదటినుంచీ అదేపాట పాడుతున్నారు కానీ చెయ్యడమే కనబడదు. బాగా నిద్ర పట్టింది. నా మాట విని ఇప్పుడు వీణ్ణి ఈ మంచానికి కట్టి వేయండి. మరి నీళ్ళు నమలక సాహసించండి. ప్రకా : సాహసం లేక కాదు. దొంగయొక్క నిద్ర దొంగనిద్ర. మన మేమైనా తొందరపడితే ప్రమాదిస్తుంది.

రాజ్య : యింతకంటే ఇంకా ప్రమాదమేమిటి? కావలసిందేమో కానే అయింది. దొంగా మనిషి వంటి వాడే. వెచ్చగా కాఫీ త్రాగాడు. చల్లగా నిద్రవచ్చింది. వాడికి నిద్రాహారాలు కావలె. మనిద్దరం వట్టి సవటలమన్న సంగతి వాడికి బాగా తెలిసింది. హాయిగా నిష్పూచీగా పండు కొన్నాడు.

ప్రకా : సవటల మేమిటి ?- అసందర్భంగా మాట్లాడు తున్నావు.

రాజ్య : కాకుంటే మరేమిటి? గుంజీలు, తియ్యమంటే గుంజీలు తీసేసి, జరిమానాలు కట్టమంటే జరిమానాలు కట్టేసి స్వాములవారికి సేవ చేసినట్లు. అడుగులకు మడుగులొత్తుతూ-చాచా మరింత నాదారు మనుషులనుకోలేదు.

ప్రకా : ఈ చాదస్తమంతా ఎందుకు? అయితే ఏం చెయ్యమన్నావు.

రాజ్య : నేను ముందర సాహసిస్తా చూడండి (వానిదగ్గర నుండి బాకుతీసి) దొంగను చంపితే గవర్నమెంట్ ప్రజంట్ యిస్తారని చెప్పారు. ఒక్క నరుకు నరకండి.

ప్రకా : నువ్వే చూడలేనన్నావు ?

రాజ్య : అప్పుడు అలాగ అనిపించింది కాని ఇప్పుడు, చిత్రవధ చేసినా నాకు సంతోషమే. ఏం పాపంలేదు. మరి నీళ్లు నమలకండి (బాకిస్తుంది). ప్రకా : (క్రిందపెట్టి) అమ్మో వద్దు వద్దు. నిద్రపోతున్నప్పుడు నరకకూడదు — లేస్తూన్నాడు.

రాజ్య : లేదు. ఇటు నుంచి అటుతిరిగి పండుకొన్నాడు. పోనీ ఈ తాడుతో మంచానికి కట్టివేయండి (తాడుతెచ్చి) ఈ మాత్రం చేయలేరా ?

ప్రకా : (ఆలోచించి) నేనొకటిచెప్తా - నువ్వుకట్టు తెలిసిందా? వాడులేచి నిన్నే మైనా అంటే నేను మధ్యపడతాను.

రాజ్య : ఏం మగతనమండీ! ఏంమగతనమండీ! పోనీ పోతే నా ప్రాణంకదా పోతుంది. (మంచానికొక కొసకట్టి) నేను కడితే గట్టిగా వుండదు... వెంటనే వసుబ్బేసికొంటాడు. మీరు కట్టండి– ఈ మాత్రం చేస్తే తప్పులేదూ.

ప్రకా : ఈలాగుతే (తాడుపుచ్చుకొని దొంగ గుండెలపై ఎత్తి వేస్తాడు.)

దొంగ : (దిగ్గునలేచి ) దగుల్బాజీ - దగుల్బాజీ !

ప్రకా : (గజ గజ వణకిపోతూ) క్షమించాలి, క్షమించాలి. (చప్పునపోయి భార్యరెక్క పట్టుకొనివచ్చి) 'స్త్రీ బుద్దిః ప్రళయాంతకా' అని దీని మాటవిని ఈ అపరాధంచేశాను చుట్టుకొని తిరిగి పోతావేం నిలబడు.

దొంగ : (ఒక్క గ్రుద్దు రాజ్యానికి గుద్ది) ఏమి నీ కిటువంటి పాడు బుద్ధి పుట్టింది?

రాజ్య : (ఏడుస్తూ) నీ చేతులు పడిపోను. నువ్వు నన్నూ కొడతావట్రా ? నీకు తల్లి లేదూ అక్క చెల్లెళ్లులేరూ? పెళ్ళాం లేదూ ? వాళ్ళ నెవరైనా యీలాగు... ప్రకా : నీ కంతే కావాలి. నోరుమూసుకో. వెధవపని చేయించి మళ్ళా ఏడుస్తావు !

రాజ్య : అమ్మమ్మ ! యేమిటీ ఘోరకలి! లోకంలో యింత చేతకానితనం కూడా వుంటుంది. మగవాడీమాత్రం కూడా పౌరుషం లేని, సవట అయిపోతే, ఇంక మొగుడనీ, మొద్దులనీ, పెళ్ళనీ పెడాకులనీ ఎందుకీ తంతుఅంతా ?

ప్రకా : అయ్యా ! ఊరుకుంటుందా ఓ చెంపకాయ కొట్టమంటుందో అడగండి. ఏమిటా పేలాపన ?

దొంగ : (రాజ్యం) ఫో, లోపలికి ఫో, ఇంక నువు నాకంటి కగపడితే చూడు ———పో.

రాజ్య : (ఏడుస్తూ లోపలికి పోతుంది)

దొంగ : నువ్వు చేసిన నేరానికి నిన్నేమిచేస్తే తగిన శిక్ష అవుతుంది?

ప్రకా : నిలువుగా చీలిస్తే తప్పులేదు. ఇదుగో చెంపలు వేసుకొంటున్నా (వేసికొని) క్షమించండి. కావలిస్తే 10 కాదు 100 గుంజీలు తీస్తాను. (తీయబోతాడు)

దొంగ : గుంజీలు ! గుంజీలు ! నీకు వెయ్యి రూపాయలు జరిమానా వేశాను.

ప్రకా : అమ్మో అమ్మో ఎక్కడ తెస్తును?

దొంగ : కొంప వున్నదిగా పత్రం రాయి.

ప్రకా : ఇంటిమీద యిదివరకే అత్తెసరుగా అప్పున్నది. దొంగ : బాకీటుతే. (పుచ్చుకొని అది అతని గుండెలపై పెట్టి) వ్రాస్తావా?

ప్రకా : రాస్తాను. రాస్తాను. కాని ఇప్పుడు స్టాంపెక్కడనుంచి వస్తుంది?

దొంగ : నా దగ్గరవుంది యింద - కాగితం కలం. ఇంకా మోసంచేస్తే ప్రాణానికే మోసం వస్తుంది. జాగ్రత్తగా రాయి.

ప్రకా : (రాసి) 1934 అక్టోబరు నెల తేది 15 విజయనగరం కాపురస్తుడు లేటు ద్వివేదుల చలమయ్య శాస్త్రిగారి కుమారుడు ద్వివేదుల ప్రకాశరావు - తర్వాత ఏమి వ్రాయమన్నారు?

దొంగ : రాయి. శాంపురం కాపురస్తులు —

ప్రకా : శాంపురం! శాంపురం!

దొంగ : రాయి, జయంతి కృష్ణావధానిగారి కుమారుడు జయంతి కుటు౦బశాస్త్రి ఉరఫ్ మాస్టరు కుట్టూ-రాయివోయి!

ప్రకా : (చూసి చూసి దిగ్గునలేచి) ఆరె నీ సిగ తరగా. నువ్వేనటోయ్, రాజ్యం: రావే! రావే! మీ యన్నే! కుట్టుగాడు!

రాజ్యం : (నవ్వుతూ చప్పున వచ్చి) అవునా అన్నయ్యా. అయితే నువ్వేనా? బ్రతుకు జీవుడా ! ఆయితే యీవేష మంతా ఏమిటి? ప్రకా : అదే నేను అడుగుతున్నా - అయితే ఈ పొయ్యేకాలం ఏమిట్రా! (ఒక గ్రుద్దు గుద్ది) ప్రాణం పుచ్చుకొన్నావు. అయితే బొంబాయినుంచి యెప్పుడు వచ్చావు. ముందు ఒక వుత్తరం లేదు. పత్రం లేదు.

దొంగ : యిదిగో-పత్రం రాయిరాయి.

ప్రకా : ఆ ! రాస్తాను. రూ 1000 లూ దొబ్బుక పోదుగాని (పత్రం చించి వేస్తాడు)

దొంగ : అవును అయినవాళ్ళ కిస్తావా - పరాయివాళ్ళకు చేపుతావు కాని.

ప్రకా : సరే నీ సంగతేమిటి చెప్పు. కూర్చోవే !

(ముగ్గురు మంచముపై కూర్చుంటారు)

దొంగ : ఏముంది ఇప్పుడు సాగర్ మువీటోనునుంచి - నియో ఇంపీరియల్ లోకి మార్చేసుకున్నా. నీకా సంగతి వెండి సామాన్లు పంపినప్పుడు రాశానుగా!

ప్రకా : అవును- ఇప్పుడేం ఫీల్ము తీస్తున్నారు ?

దొంగ : “కాలాచోర్ ” అనే ఫిల్ము షూటింగ్‌లో వుండగా 'డైరెక్టరు' చనిపోయినాడు. 15 రోజులు సెలవు తీసుకొని యింటికి వచ్చాను. 3 రోజుల క్రిందట-ఓమారు మా చెల్లెలను చూచిపోదాం అని వచ్చాను సాయంకాలం.

ప్రకా : అయితే ఆ ఫిల్ము తీస్తూ ఆ డ్రస్సులోనే వచ్చేశావా ఏమిటి? లేకుంటే అది యిక్కడ ప్రాక్టీసు చేసుకొనవలె ననుకొన్నావా?. దొంగ : లేదు లేదు రావడమే మా చెల్లి చెప్పింది. దొంగల్ని పట్టడానికి నువ్వు ప్రతిరోజూ ప్రాక్టీసు చేస్తున్నావని.- పెట్రోలింగ్ అని రాత్రి తెల్లవార్లూ వూళ్ళో తెగ తిరుగుతున్నావనీ ఇంటిదగ్గరకూడా అవే కబుర్లు చెప్తూ ప్రాణం పుచ్చుకొంటున్నావనీ. - అదివిని నీ ధైర్య సాహసాలేమిటో మా చెల్లెలికి చూపిస్తామని.

ప్రకా : అంటే నీవేషమంతా దీనికి ముందే తెలుసునన్న మాట! ఇద్దరూ కోడించుకొని చేసిందే యీ పనంతా ? ఆరీ మీ సాహసంమండా!

రాజ్య : పెళ్ళయిన యిన్నాళ్ళకైనా మీ ధైర్యసాహసాలు నాకు తెలియవద్దా మరి ? ఈయన ఆంధ్రాషెర్లాకు హోమ్సట అన్నయ్యా – అంటే ఏమిటి?

దొంగ : ఆంధ్ర అంటే ఇమిటేషన్ అన్నమాట. ఆ తర్వాత ఎంత గొప్పపేరున్నా ఫరవాలేదు. దానిశక్తిని ఇది ఆర్చేస్తుంది.

ప్రకా : మహంకాళీ ! నీ చాకచక్యం నిరుపమానం. ఒక్కచోట, ఒక్కచోట తొణికావుకాదుగదా ? ఆశ్చర్యం! నువ్వు చేసిందంతా నటనైతే వీడికంటే నీవే పైచేయి. బావా ! . ఇది సంసారిగాకంటె సినీమా నటిగా బాగా రాణిస్తుంది. దీన్నికూడా నీతో తీసుకుపోయి యే సాగరులోనో త్రొక్కి వేయ్. దొంగ : నువ్వుకూడా రావాలోయ్. ఆ మహారాష్ట్రపు భోజనం ఏమీ సరిపడకుండా వుంది.

(లోపలనుండి – మిష్టరు షెర్లాక్ హోమ్సు !)

ప్రకా : వస్తున్నా !

దొంగ : ఎవరది ?

రాజ్య : పెట్రోలింగ్ పార్టీ !

దొంగ : ఓహో! దొంగల్ని పట్టే సంఘమా? ప్రెసిడెంట్ గారు వెళ్తున్నారా? ఇదుగో ఈ పత్రంకూడా తీసుకవెళ్ళండి.

రాజ్య : దొంగలుకూడా పత్రాలు వ్రాసియివ్వడంమామూలు పెడితే ఇంక అడగనక్కర్లేదు. కావలిస్తే కొన్ని గుంజీలు తీసిరండీ.

ప్రకా : మీకు బలే తమాషాగావుంది ?

(శాలుకప్పుకొని వెళ్తాడు)

రాజ్య : ఏమిటన్నయ్యా ! ఏదోచెబితే ఇంతగల్లంతుచేశా వేమిటి ?

దొంగ : కొంపతీసి ఇదంతా మనసులో పెట్టుకుంటాడా ?

రాజ్య : చాలా దర్జా హుందాగిరి తనంగల మనిషిలే.

( ప్రకాశరావు వస్తాడు )

దొంగ : ఏమిటి విశేషం ? నువ్వు వస్తేనేకాని దొంగ దొరకనంటున్నాడా ఏమిటి ? పద మీపార్టీనంతా ఓమారు

చూపించావుకావే?

ప్రకా : (వెల వెలపోతూ) మాగొప్ప ఆట ఆడేశావుకదూ! ఏదీషేక్‌హాండ్ ఈలాగుపారేయ్! (చేయిపట్టుకొని)హల్లో మాస్టరు కుట్టూ !

దొంగ : (పంజా గట్టిగానొక్కి ) వెల్ - ఆంధ్రా షెర్లాక్ హోమ్సు!

రాజ్యం : ఆఁ! ఆఁ! వదలీ వదలీ - (ఇద్దరి చేతులూ పట్టి నవ్వుతూ విడిపిస్తుంది.)



"https://te.wikisource.org/w/index.php?title=దొంగాటకం&oldid=482375" నుండి వెలికితీశారు