దేశమును ప్రేమించుమన్నా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


దేశభక్తి

దేశమును ప్రేమించుమన్నా


1

దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా!

వొట్టి మాటలు కట్టిపెట్టోయి

గట్టి మేల్‌ తలపెట్టవోయి.

2

పాడిపంటలు పొంగిపొర్లే

దారిలో నువు పాటుపడవోయి;

తిండి కలిగితె కండ కలదోయి;

కండ కలవాడేను మనిషోయి!

3

యీసురోమని మనుషులుంటే

దేశమే గతి బాగుపడునోయి?

జల్దుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరకులు నింపవోయి.

4

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి

దేశి సరుకుల నమ్మవలెనోయి !

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయి.

5

వెనక చూసిన కార్యమేమోయి?

మంచి గతమున కొంచెమేనోయి

మందగించక ముందు అడుగేయి

వెనుకపడితే వెనకే నోయి!

6

పూను స్పర్థను విద్యలందే

వైరములు వాణిజ్యమందే,

వ్యర్థ కలహం పెంచబోకోయి

కత్తి వైరం కాల్చవోయి

7

దేశాభిమానం నాకు కద్దని

వొట్టి గొప్పలు చెప్పుకోకోయి

పూని ఏదైనాను వొకమేల్‌

కూర్చి జనులకు చూపవోయి

8

ఓర్వలేమిపిశాచి దేశం

మూలుగులు పీల్చేసెనోయ్,

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయి

9

పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయి?

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్లలోయి!

10

స్వంత లాభం కొంత మానుకు

పొరుగు వాడికి తోడుపడవోయి

దేశమంటే మట్టి కాదోయి

దేశమంటే మనుషులోయి!

11

చెట్టపట్టాల్‌ పట్టుకొని

దేశస్థులంతా నడువవలెనోయి

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నియు మెలగవలెనోయి

12

మతం వేరైతేను యేమోయి?

మనసు లొకటై మనుషులుంటే

జాతమన్నది లేచి పెరిగి

లోకమున రాణించునోయి!

13

దేశమనియెడి దొడ్డవృక్షం

ప్రేమలను పూలెత్తవలెనోయి,

నరుల చమటను తడిసి మూలం,

ధనం పంటలు పండవలెనోయి!

14

ఆకులందున అణగిమణగీ

కవిత కోయిల పలకవలెనోయి;

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్తవలెనోయి!


(' కృష్ణాపత్రిక ' 1913 ఆగస్టు 9, రచనా కాలం 1910)

This work is in the public domain in the United States because it was published before January 1, 1925. It may be copyrighted outside the U.S. (see Help:Public domain).