దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/3, 4 విశాఖపట్టణం, కాకినాడ

వికీసోర్స్ నుండి

నాఉపన్యాసమును ఆనందముతో వినిరి. సూర్యప్రకాశరావుగారు అనుకూలాభిప్రాయమును వెల్లడించిరి. వీరు గోదావరిజిల్లాసంఘకార్యదర్శిగా నుండి, చిరకాలము దీక్షతో పనిచేసిరి. భూముల నీటివసతులు మొదలగువానినిగూర్చి పలుమారు ప్రభుత్వమువారికి అర్జీలుపంపి, రహితుల కష్టముల నివారణచేయు చుండిరి. వీరివ్రాతలు విషయపరిజ్ఞానము కలిగి, మిక్కిలి సహేతుకముగ నుండెడివి. సంఘసంస్కరణమునందును అభిమానము గలదుగాని వారికృషి యెక్కువగ స్థానికప్రజల బాధానివారణ చేయుటలో వినియోగింపబడుచుండెను. కనుక కాకినాడపౌరులలో వీరిది గురుస్థానము. వీరు పూర్వార్జితమువలన స్వతంత్ర జీవనము సలుపు సంపన్నగృహస్థులు.

3, 4 విశాఖపట్టణం, కాకినాడ

______________________

మూడవ ఆంధ్రమహాసభ విశాఖపట్టణములో 1914 వేసవిలో జరిగినది. శ్రీ పానుగంటి రామారాయణింగారు యం. ఏ. పట్టభద్రులు, ఆంధ్రభాషాప్రవీణులు. కేంద్రశాసనసభలో సభ్యులు. నేను వారిని కలుసుకొని ఆంధ్రమహాసభకు అధ్యక్షతవహింపుడని కోరితిని. ఆయన రాష్ట్రనిర్మాణవిషయము కొంతవడి నాతోచర్చించి తుదకు అధ్యక్షతవహించుటకు కంగీకరించిరి. శ్రీభూపతిరాజు వెంకట్రాజుగారు శాసనసభలోసభ్యులు. విశాఖపట్టణములో ప్రముఖులగు న్యాయవాదులు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణవిషయమున పూర్ణముగ నభిమానముకలవారు. వారు సన్మానసంఘాధ్యక్షోపన్యాసములో దానినిగూర్చి గట్టిగ పోషించిరి. పానుగల్లురాజాగారు మొదటి సంశయములెల్ల విడనాడి రాష్ట్రపక్షముననే పూర్ణహృదయులై భాషించిరి. ఇట్లు బెజవాడలో ఆంధ్రరాష్ట్రనిర్మాణ మవశ్యమని చెప్పిన మహాసభ విశాఖపట్టణములో ఆంధ్రరాష్ట్రము నిర్మించవలసినదని ప్రభుత్వమును కోరుచు తీర్మానించెను. ఆర్టుకళాశాలలను, ఇంజనీయరింగు కళాశాలలను నిర్మాణముచేయించవలె నను మరికొన్నితీర్మానములు చేసి, సభ ముగించిరి. నాల్గవమహాసభను కాకినాడవారాహ్నానముచేసిరి.

ఆంధ్రమహాసభకు స్థాయిసంఘ మొకటి ఏర్పరచబడినది. దానిలో శ్రీ మోచర్ల రామచంద్రరావు, వరహగిరి జోగయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రభృతులు సభ్యులుగా నుండిరి. నన్ను ఆసభకు కార్యదర్శిగా నెన్నుకొనిరి. ఆ కార్యదర్శిపదవినిబట్టియే నేను దేశమున ప్రచారముసల్పుచుంటిని.

విశాఖపట్టణసమావేశము ముగిసినపిదప నేను ఉదకమండలమునకు వెళ్లితిని. అంతకుముందే శ్రీ బయ్యా నరసింహేశ్వరశర్మ, శ్రీ మోచర్ల రామచంద్రరావు మొదలగువారు అక్కడికి వెళ్లియుండిరి.

ఆ ప్రాంతమున పోకచెట్లు విస్తారముగా గన్పట్టుచుండెను. ఆ సుందర దృశ్యము కనులు చల్లజేయుచుండెను. నీలగిరుల నెక్కుటకు ప్రత్యేకముగ రైలుమార్గ మేర్పడియుండెను. ఆబండికి వెనుకను ముందును ఇంజెన్లు తగిలించిరి. బండి వెనుకకు జారిపోకుండునట్లు చక్రములకుపండ్లు ఏర్పరచిరి. ఉదయమున కొండప్రయాణము చేసినపిమ్మట నాకు ఒడలుత్రిప్పి, వమనమగునట్లు బాధకలిగెను. తోడిబాటసారి దాక్షిణాత్యబ్రాహ్మణు లొకరు తమయొద్దనున్న కారపుబుల్లలుకొంచెము నా కొసంగిరి. వానిలో వాముకాడ నుండుటచే తినుటకు రుచిగ నుండెను. పిమ్మట ఒడలుత్రిప్పుట మాని, సుఖముగానుంటిని. స్టేషనుదగ్గర రిక్షాబండ్లుతప్ప మరేబండ్లును కనుపడలేదు. రిక్షాబం డ్లెక్కగూడదని నాకు నియమ మున్నదిగాన కర్తవ్యతాఅమూడుడనై కొంతవడి చింతించి, తుదకు గతిమాలి రిక్షాపైనెక్కి పోతిని.

ఆ రోజులలో చెన్నపురి శాసనసభ అచట జరుగుచున్నందున దానిని చూచుటకు వెళ్లగా, నచ్చట కేశవపిళ్ళెగారు కనుపడిరి. పిళ్ళెగారు నన్ను జూచి "మీ రిసభలో సభ్యులుగా చేరవలెనని మేము ఎదురుచూచుచున్నా"మని బహూకరణ వాక్యములు పలికిరి. ఒకరోజు జి. యన్. నటేశంగారిని కలుసుకొంటిని. వీరు గాంధిగారు దక్షిణాఫ్రికాలో ప్రభుత్వముతో జరుపుచున్న పోరాటమునుగూర్చి మాటిమాటికి వారిపత్రికలో ప్రకటించుచుండెడివారు. గాంధిగారితో ఉత్తరప్రత్యుత్తరములు జరిపి వారిమైత్రిని సంపాదించుకొనిరి. నాతో ముచ్చటించుచు "మిమ్మునుగూర్చివిశేషముగవినుచున్నాను. మీరుశాసనసభలో ప్రవేశించవలెను. దేశము మీసేవ కెదురుచూచుచున్న"దని ప్రోత్సాహవచనములుపల్కిరి.

ఈ ఉదకమండలమునందు మైసూరు, హైదరాబాదు, విజయనగరముమొదలగు సంస్థానాధీశులకు, జమీందారులకు విశాలములగు భవనములుగలవు. వేసవికాలము పేరుపెట్టి చెన్నపురిగవర్నరుగారును వారి క్రిందియుద్యోగులును సంవత్సరములో దాదాపు సగముకాలము ఇచ్చట వారికొరకు ప్రత్యేకముగ కట్టబడిన దివ్యభవనములలో నివసించుచు కచ్చేరీలలో పనిచేయుచుందురు. శాసనసభలుకూడ ఆకాలములో అచటనే సమావేశమగుచుండెను. ఈపర్వతప్రస్థానమువలన ప్రతిసంవత్సరము మితిలేని ఖర్చు అగుచుండుటచే కాంగ్రెసుమహాసభ ఈప్రస్థానములను మానవలసినదని తీర్మానించుచుండెను. పిమ్మటి కాలమున అచటశాసనసభాసమావేశములును, ప్రభుత్వప్రస్థానములును ఆగిపోయినవి. శీతలము, రమణీయమునగు ఆప్రదేశమున కొండ లెక్కుచు, దిగుచు మేఘములు జొచ్చిపోయి, వానితో దాగుడుమూతలాడుచు ఆ వేసవి గడపి యింటికి చేరునప్పటికి నాస్వరూపమును జూచి, మాయింటిలోనివా రందరును సంతసించిరి. నాశరీరము మెరుగెక్కి, స్ఫుటముగనుండెను.

వేటపాలెములోనిబంగళాలు నాకు కొత్తవ్యయములకు కారణమైనవి. అచ్చట చెదులు విశేషముగ నుండుటచే అప్పుడపుడు చిన్న చిన్న మరమ్మతులు గోరుచుండెను. విద్యాశాలస్థాపింతు నన్న, అచ్చట నిలచి దాని పరిపాలనాభారము వహించువారు కనుబడకుండిరి. శ్రీ రాయసం వెంకటశివుడుగారిని ఈ బాధ్యత వహించవలసినదని కోరితిని. వారు స్త్రీవిద్యాభిమానులు. స్త్రీల జ్ఞానాభివృద్ధినిమిత్తము "జనానా" యను పత్రిక నొకదానిని కొన్నిసంవత్సరములు ప్రకటించుచుండిరి. సంస్కరణాభిమానము, నియమనిష్ఠలు గలవారుగాన సర్వవిధముల స్త్రీ విద్యాశాలకు అధ్యక్షతవహింప నర్హులని నేను ఆశించితిని. కాని వారు సమ్మతించరైరి. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారిని గూడ అడిగితిని. వారును అంగీకరించలేదు. ఇట్లు కాలము గడచి పోవుచుండెను. నాజీవితవృత్తియు బాగుగనే సాగిపోవుచుండెను. అవకాశము కలిగినపుడెల్ల ఆంధ్రోద్యమప్రచారము చేయుచుంటిని.

శ్రీ గోపాలకృష్ణ గోక్లేగారు స్థాపించిన అఖిలభారత సేవాసంఘమువంటి దొకటి ఆంధ్రరాష్ట్రసేవాసంఘమును స్థాపించుట యుక్తమని తలంచితిని. ఆవిషయమై పత్రికలలో ప్రకటించితిని. కొందరు సేవకులమని చెప్పుకొనుట మన పౌరుషమునకు తగియుండదని ఆక్షేపించిరి. కాని ఏపేరుతోనైనను అట్టిసంఘమునుగూర్చి తోడ్పడినవారు లేరైరి. ఆంధ్రనిధిస్థాపింప యత్నించితిని. దానినిమిత్తము జిల్లాలు చాలవరకు తిరిగితిని. అందును గూర్చియు తెగువ కనపడలేదు. రెండువేలరూపాయలు మాత్రము సమకూర్చి గుంటూరుజిల్లా సహకారబ్యాంకులో నిల్వజేసితిని. ఈనిధిని వృద్ధిపరచుటకు కొందరు జమీందారులయొద్దకు పోయెదమని శ్రీ మోచర్ల రామచంద్రరావుగారు చెప్పుచువచ్చిరిగాని అది కార్యరూపమెత్తలేదు. ఆకాలములో వారికి పలుకుబడి హెచ్చుగానుండెనుగాన వారు వచ్చిన బాగుండునని యెంచి నేను స్వతంత్రించి ప్రయత్నించలేదు.

శ్రీ బయ్యా నరసింహేశ్వరశర్మగారు, మోచర్ల రామచంద్రరావుగారు, భూపతిరాజు వెంకటపతిరాజుగారు, చింతలపాటి నరసింహరాజుగారు ఆకెళ్ళ సూర్యనారాయణపంతులుగారును మనఆంధ్రదేశమున తూర్పుజిల్లాలపక్షమున శాసనసభసభ్యులుగా ప్రాముఖ్యమువహించియుండిరి. వీరందరిలో ఆకెళ్ళవారు చాల ధనవంతులు. ఆకాలమున మనఆంధ్రదేశమునుగూర్చి భారతదేశ మంతట ప్రచారముసల్పి, ప్రభుత్వనకుగూడ నచ్చచెప్పగల ఆంగ్లపత్రిక యొకటి ప్రకటించుట అవసరమని పలుమారు మనవా రనుకొనుచుండిరి. ఈయుద్దేశము నెరవేర్చునిమిత్తము నేను పైనుడివిన పెద్దలనందరిని చెన్నపురిలో కాస్మాపాలిటన్ క్లబ్‌లో కలుసుకొంటిని. ముందు మేడమీదిగదులలో నున్నవారిని కలియగా వారు చాల అనుకూలముగ ముచ్చటించిరి. దిగువగదిలో నున్న ఆకెళ్ళపంతులుగారితో ముచ్చటించి వారి సహాయముతో ఈకార్యము నెరవేర్చవచ్చునని వా రపేక్షించి, వెంటనే వారిని కలుసుకొని సంప్రదించగా వారు నిరుత్సాహ వచనములు పలుకుచు తాముమాత్ర మేవిధమైన సహాయము చేయజాలమని స్పష్టీకరించిరి. అంతటితో తక్కినవారును నిరుత్సాహముచెంది యూరకుండుటచే ఆప్రయత్నము మూలబడెను.

1915 వ సంవత్సరములో కాకినాడలో మిక్కిలి వైభవముతో ఆంధ్రమహాసభ జరిగెను. దీనికి ముఖ్యముగ సహాయముచేసినవారు శ్రీ పోలవరము జమీందారులు. వీరు ఆంధ్రాంగ్లములు రెంటియందును ప్రవీణులు. చెన్నపురి శాసనసభలో సభ్యులు, ఆంగ్లభాషయందు మంచివక్తలు, ఆంధ్రభాషాపోషకులు. శ్రీ తిరుపతివేంకటకవీశ్వరు లిరువురును వీరి ఆస్థానములోనే కొంతకాల ముండి గ్రంధములను రచియించిరి. వీరు మిక్కిలి యుదారమూర్తులు. వీరిది బ్రాహ్మణసంస్థానమగుటచే వేదాధ్యయనపరులును శాస్త్రజ్ఞులునుగూడ వారిచే బహూకరింపబడుచుండిరి. ఆంధ్రమహాసభకు గొప్పగా విరాళము లిచ్చి ప్రతినిధులకు గౌరవసత్కారములను హెచ్చుగా గావించిరి. ఈసభకు జమీందారుగారే సన్మానసంఘాధ్యక్షులుగ నుండిరి. మోచర్ల రామచంద్రరావుపంతులుగారు అధ్యక్షత వహించిరి. గవర్నరు కార్యవర్గసభ్యు లొకరు వీరిని "దక్షిణభారత గోఖ్లే" యని ఉగ్గడించిరి. పలుమారు ప్రభుత్వమువారిచే నియమింపబడు కమిటీలలో సభ్యులుగను, అధ్యక్షులుగను నియమింపబడుచు గౌరవమును పొందుచుండిరి. వీరికి రాజకీయములందు విషయపరిజ్ఞానము మెండు. ప్రతివిషయమును అనుపూర్వముగ చదివి పూర్ణముగ తెలుసుకొననిదే వ్రాయుటకుగాని ఉపన్యసించుటకుగాని వీరు పూనుకొనరు. వీరికి న్యాపతి సుబ్బారావుపంతులుగారికివలెనే ఆంధ్రరాష్ట్రమునుగూర్చి అభిప్రాయభేదముండెనుగాని సుబ్బారావుపంతులుగారు వ్యతిరేకవ్యాసములు వ్రాసినట్లు ఈయన ఏదియును వ్రాయకుండిరి. కాకినాడలో మహాసభాధ్యక్షత వహించునాటికి వీరిసంశయములు వదలిపోవుటచే ఆంధ్రరాష్ట్రనిర్మాణము ఆవశ్యకమని గట్టిగనే వారి అభిప్రాయమును ప్రకటించిరి.

మేము గావించిన సంచారవివరములు తెలుపు నివేదికను సభలో చదివితిని. విశాఖపట్టణ న్యాయవాదులలో ప్రధానులగు ప్రభల లక్ష్మీనరసింహముపంతులుగారు రాష్ట్రనిర్మాణమునకు అనుకూలముగ అనర్గళధారగా మహోన్నతప్రసంగమును గావించిరి. అంత శీఘ్రగమనమున నిర్దుష్టమగు గ్రాంధికభాషలో శ్రోతలకు ఆనందముకల్పించుచు ఉపన్యసించినవారు మరెవ్వరిని నే నెరుగను. వా రాసభకుమాత్రమే విచ్చేసిరి. వారు పూర్వాచారపరాయణులు. దానధర్మములయందు పేరొందినవారు. వీరు అనుకూలముగనుండుట గొప్పవిషయమని అందర మనుకొంటిమి. తీర్మానము సర్వజనాంగీకారమునుబడసెను.

మరునాడు రామచంద్రరావుపంతులుగారితో ప్రయాణముచేసి మధ్యాహ్నము ఏలూరు చేరితిమి. నా సామానులలో చర్మముతోచేసిన పెద్దసంచి యొకటి కనుపడలేదు. ఆంధ్రనిధి నిమిత్తము వసూలుపరచిన సుమారు నూరురూపాయలమొత్తముకూడా అందేకలదు. రైలునుండి సామాన్లుదించుటలో కూలీలు దానిని వదలివేసిరి. నే నప్పుడు గమనించకపోవుట నాదియే గొప్పలోప మయ్యెను. అప్పుడు స్టేషనుమాస్టరుద్వారా పైస్టేషనునకు తంతివార్త నంపి మరల సంచి వచ్చువరకు ఏలూరులోనే యుండి, పిమ్మట బయలుదేరి యింటికి చేరితిని. మరియొకతూరి రైలుబండి దిగునప్పుడు మంచి విలువగల శాలువతో గూడ పక్కచుట్టను పోగొట్టుకొంటిని. పిమ్మటికాలములో గాంధిగారితో సంచారముచేయునప్పుడు వారు తమసామానంతయు వచ్చినదో లేదో బండినుండి దిగునప్పుడే పరీక్షించుచుండుట చూచి, వారి జాగరూకతకు ఆశ్చర్యము చెందుచుంటిని. ఒకబసలో దిగి, అక్కడనుండి పయనమై కారు ఎక్కినపిమ్మట తమసామా నంతయు ఎక్కించినారో లేదోయని గాంధీజీ పరీక్షించుచుండిరి. ఒకపరి విసనకర్ర బసలో వదలిపెట్టబడెను. దానిని తెప్పించుకొనినపిమ్మటనే వారు పయనముసాగించిరి. ఇంకొకచోట వారు చేతబట్టుకొను వెదురుకఱ్ఱ కనపడనందుకు చింతించిరి. వస్తువు పోయెనని కాదుగాని అజాగ్రత్తగా నుంటిమను బాధయే వారి కెక్కువగా నుండెను. ఇది మహాపురుషుల యందలి ఒక విశేషము.