దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/విజ్ఞప్తి

వికీసోర్స్ నుండి

విజ్ఞప్తి

వీరేశలింగంపంతులు స్వీయచరిత్రతో మన భాషలో స్వకథాకథనము పరిపాటియైనది. రాయసం, చిలకమర్తి, టంగుటూరివారల స్వీయచరిత్రలును, దేశభక్తుని యీ స్వీయచరితయు 19 వ శతాబ్ది చతుర్థచరణముతో మొదలిడి, యించుమించుగా ఈ శతాబ్ది మధ్యభాగము వరకు నడచినవి. ఈ డెబ్బది యెనుబదేండ్లలో మనదేశమున ఎన్నో యుద్యమములు తలచూపినవి. మన సంఘవ్యవస్థ కొత్తరూపు దాల్చినది. పరప్రభుత్వము గూడ ఒత్తిగిలి భారతమున స్వతంత్ర ప్రభుత నెలకొన్నది. ఈమార్పులన్నిట భాగస్వాములై, వాటికి రూపరేఖలు దిద్దిన ఆంధ్ర మహాపురుషులలో దేశభక్త వేంకటప్పయ్య పంతులుగా రగ్రగణ్యులు.

పంతులుగారు తనువెత్తి చాలించులోపల మూడుపురుషాంతరములు గడచినవి. ఈ మూడుతరములవారిలోను పంతులుగా రెప్పటికప్పు డగ్రగాములై నిలిచిరి. మదరాసులో కళాశాలావిద్యార్థుల సమ్మెలో వారిదే ముందంజ. బందరున మొదటి వితంతూద్వాహమున వారిదే ప్రథమతాంబూలము. కృష్ణాజిల్లాసంఘములో నారంభించిన పంతులుగారి రాజకీయజీవనము స్వరాజ్యలబ్థివరకు ఒక్కతీరున సాగినది. కృష్ణాపత్రిక వారి కూరిమిబిడ్డ. ఆంధ్ర జాతీయకళాశాలా స్థాపకులలోను పంతులుగారున్నారు. స్త్రీవిద్యకై శారదానికేతన సంకల్పము వారిది. వృత్తివిసర్జనమొనర్చి, జీవితమును ప్రజారాధన కంకితమొనర్చిన మొదటి ఆంధ్రులు పంతులుగారు. 1887 లో మదరాసున మూడవ కాంగ్రెసుమహాసభ జరిగినపుడే అచట విద్యార్థిగా నున్న వెంకటప్పయ్య తన చేతికి కాంగ్రెసుతోరము కట్టుకొనెను. అది మొదలు స్వరాజ్యలబ్దివరకు గడచిన ఏబదేండ్లలో ఆంధ్రజీవననౌక నాయనయే కర్ణధారియై నడిపించెను. ఇవి యన్నియు నొకయెత్తు, ఆయన స్వయము కని పెంచిన ఆంధ్రోద్యమ మొకయెత్తు. ఆంధ్రరాష్ట్ర మాంధ్రరాష్ట్ర మని జపించుచునే వీరపుంగవుడగు దేశభక్తుడు తనువుచాలించెను. ఇట్లు బహుముఖముల విస్తరించిన పంతులుగారి స్వీయచరిత్రయే ఈ డెబ్బదేండ్ల ఆంధ్రదేశచరిత్ర. పంతులుగారి ప్రజారాధన ప్రవణత తెలుగునేల యెల్ల లతిక్రమించినదిగాన భారతదేశచరిత్రగూడ నిందు అల్లుకొనియున్నది. పంతులుగారి ఆకారప్రజ్ఞాబలసంపద లంతచెప్పుకోదగ్గవికావు. విద్యలో, వాచాలతలో వారిని మించిన తెలుగువారున్నారు. భోగరాజువారి ప్రజ్ఞాప్రకర్షగాని, టంగుటూరివారి సాహసరసికతగాని, కాశీనాథునివారి వితరణవీరముగాని కొండ వారికిలేవు. అట్లయ్యు, వీటినన్నిటిని మించిన సత్యతత్పరల, ఆస్తిక్యము, వినయము, నిరంతరసేవాసక్తి, ఆత్మవితరణము - ఇవి దేశభక్తుని సమానులలో ఉత్తమళ్లోకు నొనర్చినవి. పంతులుగారి హృదయము కుసుమకోమలము. కావుననే వజ్రకరోరత నపేక్షించు రాజనీతిధౌరంధర్యము వారి కలవడలేదు. పంతులుగారి జ్ఞానశక్తికంటె క్రియాశక్తి దొడ్డది. క్రియాశక్తికంటె భక్తిపరిప్లావితమగు వారి ఆర్ద్రచిత్తత దొడ్డది. కనుకనే వారి సేవాశీలము మాత్సర్యము నెఱుగదు. వారి ప్రభుత ఘృణాలలితమై, పట్టువిడుపులు నేర్చికొని, యుదారచరిత కాస్పదమైనది. గాంధిజీపిలుపు పంతులుగారి గోపికాహృదయమునకు వేణునాదమైనది. చిన్ననాటనే నాటకములలో స్త్రీపాత్ర మధినయించిన పంతులుగారికి రసతత్పరత వెన్నతోబెట్టినవిద్య. కవిగాదగిన పంతులుగారు రాజకీయజంబాలమున బడినను ఒడలు బురదగాకుండ సాధుహృదయమును సంరక్షించుకొనిరి.

ఈ గ్రంథమున పంతులుగారి కలము కావ్యపాకము నందికొన్న ఘట్టము లెన్నియో యున్నవి. దాపరిక మెఱుగని వారి సత్యసంధత, మాయమర్మము లెఱుగని వారి అచ్ఛశీలము, చేటుపాట్లెఱుగని ఉతాహశక్తీ - అడుగడుగున నిందు ప్రత్యక్షమగును. పంతులుగారు హాస్యరసమునుగూడ నిందు ఎడనెడ చవి చూపిరి. ఆంధ్రభాషకు, చరిత్రకు అలంకారప్రాయమైన ఈ స్వీయచరిత్ర పరిపూర్తినందక 1932 లో నాగిపోవుట మన దురదృష్టము. అందీ ప్రధమభాగము 1918 వరకు నడచినది. అనతికాలమున రెండవభాగముగూడ ప్రకటింతుము. అమూల్యమగు ఈ గ్రంథప్రచురణభాగ్యము మా సంఘమునకు గల్పించిన పంతులుగారి కుటుంబమునకు గృతజ్ఞులము.

కాటూరి వేంకటేశ్వరరావు.

సాహిత్యశాఖాధ్యక్షులు.

ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సంఘము

విజయవాడ,

2 - 2 - 1952.