దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమ ప్రచారము
ఆంధ్రోద్యమ ప్రచారము
1914, 1915 సంవత్సరములలో నా వృత్తివ్యాపారము సాగించుకొనుచు అప్పుడప్పుడు తీరికచేసుకొని ఆంధ్రదేశమున సంచారముగావించుచుంటిని. 1913లో బాపట్లమహాసభ జరిగిన పిమ్మట నేను మహానందిలో విద్యార్థుల మహాసభ జరుగునని విని న్యాపతి హనుమంతురావుపంతులుగారితో కలసి అచటికి వెళ్ళితిని. ఆమహాసభకు శ్రీ కేశవపిళ్ళెగారు అధ్యక్షత వహించిరి. అట్టిమహాసభ రాయలసీమలో అపురూపమైనదే. రాయల సీమజిల్లాలనుండి విద్యార్థులుమాత్రమేగాక పలువురు ప్రముఖులు గూడ విచ్చేసిరి. సభాకార్యక్రమము జరుగుచుండగనే నేను అధ్యక్షుల అనుమతి పొంది ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునుగూర్చి యుపన్యసించుచుండగా శ్రీ కేశవపిళ్ళెగారు "నేను అరవ వాడనా, తెలుగువాడనా"యని ప్రశ్నించెను. మీరు తప్పక ఆంధ్రులేయని ప్రత్యుత్తరమిచ్చుచు పుట్టుకచే అరవవారైనను ఆంధ్రదేశమున మీవృత్తిని సాగించి, స్థిరనివాస మేర్పరచుకొని ఆంధ్రులకై పాటుపడుచు వారిలో ఐక్యమైనారుగావున మీరు ముమ్మాటికిని ఆంధ్రులే యని స్పష్టీకరించితిని. అందుమీద సభలో జయధ్వానములు చెలరేగెను.
మాహానందిలో స్నాము మహదానందము కల్పించెను. మహానందీశ్వరునిదేవాలయ మొక అరణ్యప్రదేశములో నున్నది. ఊరుగాని పల్లెగాని లేదు. పర్వదినములలో యాత్రికులుతప్ప ఇతరసమయములలో మనుష్యసంచార ముండదు. రాత్రివేళ దేవాలయమువెలుపల కట్టబడియున్న తొట్లలో నీరుత్రాగుటకు పులులుమొదలగు అడవిజంతువులు వచ్చునని అచ్చటివారు చెప్పిరి. చుట్టును రాతిగోడలతో కట్టిన ఎత్తగుప్రాకారము గలదు. ఆప్రాకారపుగోడ నానించి వరుసగా మండపములవలె అరలు కట్టబడి యాత్రికులు రాత్రులందు పరుండుటకు వీలుగ నుండెను. కొంద రాయరలలో వంటలుకూడ చేసుకొనుచుండిరి. ప్రాకారముఖద్వారము పెద్దదిగా నుండెను. ప్రాకారముమధ్య తూర్పువైపున చిన్నదేవాలయమును ముఖమండపమును గలవు. ఆదేవళముమధ్య నొకలింగము దాదాపు భూమిమట్టమున కట్టబడిన పానవట్టముతో నుండును. ఈలింగమును యాత్రికులందరును చేతులతో తాకి అభిషేకముచేసి స్వేచ్ఛగా పూజింతురు. ఈలింగముయొక్క శిఖరమున చిన్నతొఱ్ఱ యేర్పడియున్నది. అందు వ్రేళ్ళు పెట్టినయెడల నీ రున్నటుల తోచును. దాని దిగువభాగమున భూమిలోగుండ నీరుబారి దేవాలయ ముఖమండపు బునాదిగోడకు కట్టియున్న నందిముఖముగుండ నిరంతరము ప్రవహించి ఆముఖమండపమునకు ఆనించి దేవాలయమునకెదుట కోనేరువలె నుండు రాతితొట్టెలో ఏకధారగా పడుచుండును. ఇట్లు ప్రవహించుజలములు అతినిర్మలములై ఎప్పుడును సమశీతోష్ణముగ నుండును. అందు నడుములలోతు నీరు తరుగకయుండును. ఎంతమంది అందు స్నానముచేసినను నీరు శుభ్రముగనే యుండును. ఏలనన అందు పడుచున్న నీరు కుండులో నిలువక ఎప్పటికప్పుడు తూములగుండ వెలుపలకు ప్రవహించి కాలువగ పారుచుండును. వెలుపలితొట్టిని నింపు చుండును. స్నానముచేయువారి పాదములగోళ్లుసహితము తెల్లగ కనపడుచుండును. దేవాలయమునకు చేరువగనే యొకకొండ గలదు. ఆకొండలోనుండి ఈనీరు అంతర్వాహినిగా పారుచున్నదని యూహించదగియున్నది. ఈవిషయమును గనిపెట్టిన మహానుభావు లెవరో ఆశివలింగప్రతిష్ఠాపన గావించి ఆశివలింగమునుండి నందిముఖమున ఆపవిత్రజలములు పారింపజేసి తీర్థకుండిక నేర్పరచి ఆస్థలమును గొప్ప తీర్థయాత్రాస్థానము గావించిరి. మనప్పూర్వులిట్టి సహజనిర్మాణములను అద్భుతములగు విచిత్రరూపముల నెత్తించి వానిని తీర్థయాత్రాస్థానములుగ జేసి, దైవభక్తిని ప్రజలలో పురికొల్పుచుండిరి. ఉద్దేశము ఎంత యుక్తమైనను సత్యమును మరుగుపరచు సాధనములచే నెరవేర్ప జూచుట యుక్తముగాదని నాకు తోచుచున్నది.
ఆంధ్రరాష్ట్రనిర్మాణసంబంధమగు ఈప్రచారనిమిత్తమే యొకసారి రాజమహేంద్రవరమున మహాసభ సమావేశమయ్యెను. ఆసభకు న్యాపతి సుబ్బారావుగా రగ్రాసనాధిపతిగా నుండిరి. అచ్చటకు వచ్చినసభ్యులలో పలువురు న్యాయవాదులే. అచ్చట నాప్రసంగము ముగిసినతర్వాత శ్రీధార్వాడ కృష్ణారావుగారును, శ్రీ టంగుటూరి శ్రీరాములుగారును ఆంధ్రరాష్ట్రోద్యమము తమిళులతో కలిసియుండుటవలన కలుగుచున్న లాభములు గమనించలేక సంకుచితదృష్టితో సాగించుచున్నదనియు దీనికి తోడ్పడుట అనుచితమనియు తీవ్రముగ ఖండించిరి. న్యాపతి సుబ్బారావుగారి అభిప్రాయముగూడ ఆధోరణినే, యనుకరించెను. వీరందరు ఆంగ్లేయభాషలోనే ప్రసంగించిరి. అంతట వారిప్రసంగములను సావకాశముగ వినుచున్న శ్రీ చిలక మర్తి లక్ష్మీనరసింహముగారు తెలుగున భాషించుచు వారు గావించిన ఉపన్యాసములను తీవ్రముగ విమర్శించి సర్వవిధముల ఆంధ్రజనాభ్యుదయమునకు బలిష్టసాధనమైన రాష్ట్రనిర్మాణమును గూర్చిన ఆందోళన సంకుచితదృష్టితో చేయబడుచున్నదనుట సమంజసముకాదనియు, మన యల్పబుద్ధిని ప్రకటించుటయేయని మేఘగర్జనముచేసినట్లు ఎలుగెత్తి వాక్రుచ్చిరి. స్వార్ధప్రియులమై మనము మిన్నకుండి దేశమున కుపకారముచేయబూనినవారి యత్నమును నిరసించుట అన్యాయమని సహేతుకముగను నిర్భయముగను, నిర్మొగమాటముగను వక్కాణించిరి. శ్రీ సుబ్బారావుపంతులుగారు రెండుమూడువాక్యములలో నేను ఉపన్యసించినందుకు సభాపక్షమున కృతజ్ఞతతెల్పి సభముగించిరి.
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముపంతులుగారు ఆంధ్ర కవీశ్వరులై, అనేకకావ్య నాటకములను, నవలలను, రచించి ప్రఖ్యాతిగాంచిరి. వీరు సంఘసంస్కరణాభిమానులు, దేశాభిమానులునై, జాతీయపాఠశాలను స్థాపించిన మహనీయులు. వీరు అంధులయ్యు దేశహితైకకార్యములందు మిక్కిలియుత్సహముతో పాల్గొనుచు, వీరేశలింగముపంతులుగారి వితంతు శరణాలయసంబంధములగు కార్యములందును తోడ్పడుచుండిరి.
ఆంధ్రరాష్ట్రప్రచారమునకై కాకినాడలో దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారి ఆధిపత్యమున మహాసభ నడిచినది. పిఠాపురముజమీందారుగారి కళాశాలలో కొందరు ఉపాధ్యాయులును, న్యాయవాదులుమొదలగువారును సభకు హాజరైరి. నాఉపన్యాసమును ఆనందముతో వినిరి. సూర్యప్రకాశరావుగారు అనుకూలాభిప్రాయమును వెల్లడించిరి. వీరు గోదావరిజిల్లాసంఘకార్యదర్శిగా నుండి, చిరకాలము దీక్షతో పనిచేసిరి. భూముల నీటివసతులు మొదలగువానినిగూర్చి పలుమారు ప్రభుత్వమువారికి అర్జీలుపంపి, రహితుల కష్టముల నివారణచేయు చుండిరి. వీరివ్రాతలు విషయపరిజ్ఞానము కలిగి, మిక్కిలి సహేతుకముగ నుండెడివి. సంఘసంస్కరణమునందును అభిమానము గలదుగాని వారికృషి యెక్కువగ స్థానికప్రజల బాధానివారణ చేయుటలో వినియోగింపబడుచుండెను. కనుక కాకినాడపౌరులలో వీరిది గురుస్థానము. వీరు పూర్వార్జితమువలన స్వతంత్ర జీవనము సలుపు సంపన్నగృహస్థులు.
3, 4 విశాఖపట్టణం, కాకినాడ
______________________
మూడవ ఆంధ్రమహాసభ విశాఖపట్టణములో 1914 వేసవిలో జరిగినది. శ్రీ పానుగంటి రామారాయణింగారు యం. ఏ. పట్టభద్రులు, ఆంధ్రభాషాప్రవీణులు. కేంద్రశాసనసభలో సభ్యులు. నేను వారిని కలుసుకొని ఆంధ్రమహాసభకు అధ్యక్షతవహింపుడని కోరితిని. ఆయన రాష్ట్రనిర్మాణవిషయము కొంతవడి నాతోచర్చించి తుదకు అధ్యక్షతవహించుటకు కంగీకరించిరి. శ్రీభూపతిరాజు వెంకట్రాజుగారు శాసనసభలోసభ్యులు. విశాఖపట్టణములో ప్రముఖులగు న్యాయవాదులు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణవిషయమున పూర్ణముగ నభిమానముకలవారు. వారు సన్మానసంఘాధ్యక్షోపన్యాసములో దానినిగూర్చి గట్టిగ పోషించిరి. పానుగల్లురాజాగారు మొదటి సంశయములెల్ల విడనాడి