దారు లన్నియు మాపె దిశదిశలు ముంచెత్తె

వికీసోర్స్ నుండి

దారు లన్నియు మాపె దశదిశలు ముంచెత్తె

నీరంధ్ర భయ దాంధకార జీమూతాళి!

ప్రేయసీ, ప్రేయసీ, వెడలిపోయితి వేల

ఆ యగమ్య తమస్వినీ గర్భకుహరాల?


ఆ యఖాతంపు టేకాంతమ్ములో మ్రోసి

మాయమై మెల్లగా నీ యడుగుసందడులు

నా యెడదత్రోవనే పడి నడచిన ట్లయ్యె;

నా యెడదలోననే మాయ మైన ట్లయ్యె!


అంత నా గొంతులో 'హా ప్రియా' యను కేక

అంతంత దివి కేగె, అంతంత దిగి పోయె;

తారలే కను విచ్చి తమములే శ్రుతి విచ్చి

ఆ రవము విని నన్ను గని జాలి నొందాయి.


నాటి నుండియు నేను ప్రతి నిశీథతమంపు

కాటుకల చాయ నొరు లే రరయలేని తరి

చూచికొని చూచికొని శూన్యహృదయములోని

'కో చెలీ!' యని క్రుంగి క్రుంగి యేడ్తును సుమా!


సడిలేని నడిరేయి బడిపోయి నట్టి నీ

కడియాల రవళులే చిరుగాజు మ్రోతలే

వ్రే లెత్తి చూపు జీవితపథమ్ములు నాకు;

కే లెత్తి నడిపించు, నె ల్గెత్తి న న్బిలుచు!