దశమస్కంధము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

-:పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రునడిగెడు ప్రశ్న:-

శ్రీకంఠచాప ఖండన!, పాకారి ప్రముఖ వినుత భండన! విలస

త్కాకుత్థ్సవంశమండన!, రాకేందు యశోవిశాల! రామనృపాలా! 1

వ. మహనీయ గుణగరిష్ఠులగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డయిన

సూతుం డిట్లనియె, నట్లు పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని. 2

క. తెలిపితివి సోమసూర్యుల, కులవిస్తారంబు, వారి కులము ధరిత్రీ

	శుల నడవళ్ళును వింటిమి, కలరూపములెల్ల మాకుఁ గడు వెరగులుఁగన్. 		    3

క. శీలము గల యదుకులమున, నేలా పుట్టెను మహాత్ముడీశుడు విష్ణుం?

	డే లీల మలగె? నెయ్యే, వేళల నే మేమి సేసె? వివరింపు తగన్. 			4

క. భవములకు మందు, చిత్త, శ్రవణానందము, ముముక్షుజన పదము, హరి

స్తవము పశుఘ్నుఁడు దక్కను, జెవులకు దని వయ్యె ననెడి చెనఁటియు గలడే 5

క. మా పెద్దలు మును వేల్పులు, లోపని భీష్మాది కురుకులోత్తమ సేనా

కూపారము నే కోలము, పాపున లంఘించి రొక్క బాలపదముగాన్ 6

క. మా యమ్మ కుక్షి గురుసుత, సాయక పీడితుఁడ నైన జడు నన్నుం గౌం

తేయ కురుకులము నిలుపగ, నా యుత్తముడాత్త చక్రుడై రక్షించెన్ 7

క. కలిసి పురుషమూర్తి కాలరూపములను, లోకజనుల వెలిని లోన నుండి

జన్మ మృత్యువులను సంసారముక్తుల, నిచ్చు నతని చరిత మెల్లఁ జెపుమ! 8

సీ. ఊహించి రాముఁడు రోహిణి కొడుకంచు నప్పుడు యోగీంద్ర! చెప్పి తీవు

దేవకి కడుపున నే వెరవున నాతఁ డుండెను దేహంబు నొండు లేక?

తన తండ్రి యిలవాసి వనజాక్షుఁడేరీతి మందకుబోయె? నే మందిరమున

నుండి యెయ్యెది సేయుచుండెను? దన మేన మామ కంసుని నేల నామ మణఁచె

ఆ. నెన్ని యేండ్లు మనియె నిలమీఁద మనుజుడై?, యెంద ఱైరి భార్య? లెట్లు మెలఁగె?

మఱియు నేమి చేసె? మాధవు చారిత్ర, మెంత గలదు? నాకు నేర్పరింపు. 9

వ. అని మఱియు నిట్లనియె 10

ఆ. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికధా, మృతముఁ ద్రావఁ ద్రావ మేను వొదిలె,

వంత మానె, నీరువట్టు నాఁకలియును, దూరమయ్యె, మనము దొంగిలించె. 11

వ. అని పలుకుచున్న రాజు మాటలు విని, వైయాసి యిట్లనియె 12

క. విష్ణు కధా రతుఁడగు నరు,విష్ణు కధల్ చెప్పు నరుని వినుచుండు నరున్

విష్ణు కధా సంప్రశ్నము, విశ్నుపదీ జలము భంగి విమలులఁ జేయున్. 13

సీ. రాజేంద్ర! విను తొల్లి రాజలాంచనముల వేలసంఖ్యల దైత్య విభులు దన్ను

నాక్రమించిన భార మాఁగఁజాలక భూమి గోరుపయై బ్రహ్మఁ జేరఁ బోయి

కన్నీరు మున్నీరుగా రోదనము సేయఁ గరుణతో భావించి కమలభవుఁడు

ధరణి నూఱడఁ బల్కి ధాత్రియు వేల్పులుఁ గదలిరా విష్ణునిఁ గాన నేఁగి

తే. పురుష శూక్తంబుఁ జదివి యద్భుత సమాధి, నుండి యొకమాట విని వారిజోద్భావుండు

వినుఁడు వేల్పులు ధరయు నే విన్నయట్టి, పలుకు వివరింతు నని ప్రీతిఁ బలికెఁ దెలియ. 14

క. యాదవకులమున నమరులు! మేదినిపైఁ బుట్ట జనుఁడు మీ యంశములన్

శ్రీదయితుఁడు వసుదేవునఁ, కాదరమున బుట్టి భార మంతయుఁ బాపున్ 15

క. హరి పూజార్థము పుట్టుఁడు, సుర కన్యలు! భూమియందు సుందరతనులై

హరికగ్రజుఁడై శేషుఁడు హరికళతోఁ బుట్టు దత్ప్రియారంభుడై. 16

ఆ. ఈ ప్రపంచమెల్ల నే మాయచే మోహి, తాత్మ మగుచు నుండు నట్టి మాయ

కమలనాభు నాజ్ఞఁ గార్యార్థమై నిజాం, శంబు తోడఁ బుట్టు జగతి యందు. 17

వ. అని యిట్లు వేల్పుల నియ్యకొలిపి పుడమిముద్దియ నోడంబఱిచి తమ్మిచూలి తన మొదలి

        నెలవునకుంజనియె, నంత యదువిభుం డయిన శూరసేనుండను వాఁడు మధురాపురంబు తనకు 
        రాజధానిగా  మాధురంబులు శూరసేనంబు లనియెడు దేశంబు లేలెం. బూర్వకాలంబున.      18

క. ఏ మధురయందు నిత్యము, శ్రీమన్నారాయణుండు సెలగు బ్రియముమై

నా మధుర సకల యాదవ, భూమిశుల కెల్ల మొదలి పూరి యయ్యె నృపా ! 19

సీ. ఆ శూరసేనుని కాత్మజుం డగు వసుదేవు డా పూరి నొక్క దినమునందు

దేవకీ బెండ్లియై దేవకియు దాను గడువేడ్క రధ మెక్కి కదలువేళ

నుగ్రసేనుని పుత్రుదల్లాసి కంసుండు చెల్లెలు మఱ దియు నుల్లసిల్లి

హరుల పగ్గములఁ జేనంది రొప్పఁ దొడంగె, ముందట భేరులు మురజములును

ఆ. శంక పటహములను జడిగొని మ్రోయంగఁ, గూఁతుతోడి వేడ్క కొనలు సాఁగ

దేవకుండు సుతకు దేవకీదేవికి, నరుణ మీఁ దలంచి యాదరించి. 20

వ. సార్థంబు లయిన రధంబుల వేయునెనమన్నూటినిఁ, గనక డామ సముత్తుంగంబు లయిన

మాతంగంబుల నన్నూటిని, బదివేల తురంగంబులను, విలాసవతు లయిన దాసిజనంబుల

        నిన్నూటినిచ్చి యనిచినం గదలి వరవధూ యుగళంబు దేరవునం జానూ సమయంబున.  21

క. పగ్గములు వదలి వేగిర, మగ్గలముగ రథముఁ గడపు నా కంసుంఁడు లో

బెగ్గిలి ఎగ్గని తలఁపగ, దిగ్గున నశరీరవాణి దివి నిట్లనియెన్. 22

క. "తుష్టయగు భగిని మెచ్చఁగ, నిష్టుఁడవై రధము గడపె, దేఱుఁగవు మీఁదన్

శిష్టయగు నీ తలోదరి, యష్టమగర్భంబు నిన్ను హరియించుఁ జుమీ!" 23

వ. అని యిట్లాకాశావాణి పలికిన నులికిపడి భోజకుల పాంసనుండైన కంసుండు సంచలడంసుండై

యదిడంబు బెదడిదంబుగాఁ బెఱకి జళిపించి దెప్పరంబుగ ననుజ కొప్పుఁబట్టి కప్పరపాటున

        నొప్పఱం దిగిచి యొడిసి పట్టి, తోబుట్టువని తలంపక తెంపు సేసి తెగవ్రేయ గమకించు 
        సమయంబున వసుదేవుండు డగ్గఱి . 					24

క. ఆ పాపచిత్తు మత్తుం, గోపాగ్నిశిఖానువృత్తుఁ గొనకొని తన స

ల్లాపామృతధారా వి, క్షేపంబున గొంతశాంతుఁ జేయుచుఁ బలికెన్ . 25


ఉ. అన్నవు నీవు చెల్లెలికి, నక్కట! మాడలు చిర లిచ్చుటో!

మన్నన సేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో?

'మిన్నుల మ్రోఁతలే నిజాము, మేలని చంపకు మన్న మాని రా

వన్న! సహింపు మన్న! తగ దన్న! వదింపకు మన్న! వేడెదన్. 26


వ. అదియునుం గాక. 27


మ. చెలియల్, గాన్నియ, ముద్దురా లబల, నీ సేమంబు చింతించు ని

ర్మల, దీనిన్ బయలాడుమాటలకు నై మర్యాదఁ బోదట్టి, స

త్కుల జాతుండవు పుణ్యమూర్తి వకకటా! గోపంబు పాపంబు, నె

చ్చేలి నోహో! తెగే వ్రేయఁ బాడియగునే? చింతింపు భోజేస్వరా! 28

సీ. మేనితోడన పుట్టు మృత్యువు జనులకు, నెల్లి నేడైన నూఱేండ్ల కైనఁ

దెల్లంబు మృత్యువు దేహంబు పంచత నందఁ గర్మానుగుండై శరీరి

మాఱుదేహము నూఁది, మఱి తొంటి దేహంబుఁ బాయును దన పూర్వ భాగమెత్తి

వేఱొంటిపైఁ బెట్టి వెనుక భాగం బెత్తి గమనించు తృణజలూకయును బోలె,

ఆ. వెంటవచ్చు కర్మవిసరంబు , మును మేలు కన్నవేళ నరుఁడు గన్న విన్న

తలఁపబఁడిన కార్య తంత్రంబు కలలోనఁ బాడితోడఁ గానఁబడిన యట్లు. 29


క. తన తొంటి కర్మ రాశికి, ననుచరమై బహువికారమై మనసు వడిం

జను, నింద్రియముల తెరువులఁ, దనువులు పెక్కైనఁ జెడవు తన కర్మంబుల్ 30


ఆ. జలఘటాడులందుఁ జంద్రసుర్యాదులు, గానఁబడుచు గాలిఁ గదలు భంగి

నాత్మకర్మ నిర్మితాంగంబులును బ్రాణి, గడలుచుండు రాగాకలితుఁ డగుచు 31


క. కర్మములు మేలు నిచ్చును, గర్మంబులు గీడునిచ్చు, గర్తలు దనకుం

గర్మములు బ్రహ్మ కైనను, గర్మగుఁ డై పరులఁ దడవఁగా నేమిటికిన్? 32


క. కావునఁ బరులకు హింసలు, గావింపఁగ వలదు తనకుఁ గళ్యానముగా

భావించి పురుల నొంచినఁ బోవునే ? తత్ఫలము పిదపఁ బొందక యున్న? 33


మత్త. వావిఁ జెల్లెలుగాని పుత్రిక వంటి దుత్తమురాలు , సం

భావనీయచరిత్ర , భీరువు, బాల, నూత్నవివాహ సు

శ్రీవిలాసిని, దీన, కంపితచిత్త నీకిదె మ్రొక్కెదం,

గానవే! కరుణామయాత్మక! కంస! మానవవల్లభా! 34


వ. అని మఱియు సామభేదంబులగు పలుకులు పలికిన వినియు వాఁడు వేఁడి చూపుల రాలు నిప్పులు

గుప్పలు గొన ననుకంపలేక, తెంపుసేసి చంపకగంధిం జంపఁ జూచుట ఎఱింగి మొఱంగెడి తెఱంగు

విచారించి తనలో నిట్లనియె. 35


క. 'ఎందును గాలము నిజ మని, పందతనంబునను బుద్ధిఁబాయక ఘనులై

యెందాఁక బుద్ధి నెగడెడి, నందాఁకఁ జరింపవలయు నాత్మబలమునన్. 36


వ. అని నిశ్చయించి 37


సీ. ఆపన్నురాలైన యంగన రక్షించి సుతుల నిచ్చెద నంట శుభము నేఁడు,

మీఁ దెవ్వఁ దెఱుఁగును? మెలఁత ప్రాణంబుతో నిలిచిన మఱునాడు నేరరాదె?

సుతులు పుట్టిర యేని సుతులకు మృత్యువు వాలాయమై వచ్చెనేని

బ్రహ్మచేతను వీఁడుపా టేమియును లేక యుండునే? సదుపాయ మొకటి లేదే?

తే. పొంత మ్రాఁకుల గాల్పక పోయి వహ్ని, యెగసి దవ్వులవాని దహించు భంగిఁ

గర్మవశమున భవమృతికారణములు, దూరగతి బొందు, నిక నేల తొట్రుపడగ? 38


క. కొడుకుల నిచ్చెద నని సతి, విడిపించుట నీతి, వీఁడు విడిచిన మీఁదం

గొడుకులు పుట్టినఁ గార్యము, దడఁబదదే? నాఁటి కొక్క దైవము లేదే? 39


క. ఎనిమిదవ చూలు వీనిం, దనుమాడెది నంచు మింటఁ దోరపుఁబలుకుల్

వినఁబడియె, నేల తప్పును?, వనితను విడిపించు టొప్పు వైళం బనుచున్. 40