దశకుమారచరిత్రము/తొలిపలుకు

వికీసోర్స్ నుండి

తొలిపలుకు

దశకుమారచరిత్రము తెనింగించిన కవి కేతన. ఇతఁడు కౌండిన్యసగోత్రుడు. భండారుకేతన బావమఱఁది. మ్రానయ (మారయ) సంకమాంబల కుమారుఁడు. ఇంటిపేరు మూలఘటికవారు. అభినవదండి బిరుదాంకితుఁడు. ఈకవి తనశక్తిసామర్థ్యముల నిటులఁ జెప్పుకొనినాఁడు.—

కవితఁ జెప్పి యుభయకవిమిత్రు మెప్పింప, నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ
బరగ దశకుమారచరితంబుఁ జెప్పిన, ప్రోడ నన్ను వేఱె పొగడ నేల.

దశకుమారచరిత్రము ఉభయకవిమిత్రుడును భారతరచనాధురీణుఁడు నగు తిక్కనసోమయాజి కంకితము గావింపఁబడినది. తిక్కనయంతవాఁడు మెచ్చిన నాకవితయొక్క గొప్పదనము నేను జెప్పుకొనుట పునరుక్తియని కవి చెప్పుచున్నాఁడు. కేతనకవిత రసవంతముగ నిర్దుష్టముగ ధారాశోభితముగ నుండి చదువఁజదువఁ జవులూరుచుండును. ఈకేతనకవి వెంగిదేశమునందలి [1]వెంటిరాలను నగ్రహారమున కధిపతి.

ఆంధ్రభాషలోఁ గవు లంకితమునొందిన పుస్తకములలో దశకుమారచరితము మొట్టమొదటిది. ఇందుఁ గవిరాజగు తిక్కనసోమయాజి గుణగణములు దాతృతాసౌందర్యములు విద్యావివేకములు పండితానురక్తి విపులముగఁ గొండాడఁబడినవి. తాను కవియై కవుల నింతగ గౌరవించినవాఁడు తిక్కనగాక వేఱొకండు ఆంధ్రవాజ్మయమునఁ గానరాఁడు. కాని కేతన తిక్కనసోమయాజి నుభయభాషాకవి యనియు, మయూరసన్నిభమహాకవి యనియుఁ గవిజనరాజకీరసహకార మనియుఁ బేర్కొనెనెగాని ఉత్తరరామాయణాదిగ్రంథములు రచించినటులఁ జెప్ప లేదు. దిక్కనసోమయాజి యప్పటికి గ్రంథరచనము గావిం పలేదేమో యన వీలు లేదు. ఏలయన దశకుమారచరిత్రమునఁ దిక్కన యజ్ఞము గావించినటుల షష్ఠ్యంతములందు ఆశ్వాసాంతములందుఁ గృత్యాదిని జెప్పబడినది. ఉత్తరరామాయణము యజ్ఞమునకుఁ బూర్వము రచింపఁబడినపొత్తమని గ్రంథమందలి గద్య కృత్యాది తెలుపును. ఇట్టియెడఁ గేతన దిక్కనసోమయాజిరచితగ్రంథములఁ బేర్కొనమికిఁ గారణము తోచదు. భారతము దశకుమారచరిత్రము గైకొనునప్పటికి రచింపఁబడలేదేమొ గాని నిర్వచనోత్రరామాయణము మాత్ర ముప్పటికి రచయింపఁబడె ననుట కెట్టిసంశయ ముండదు.

"కృతులు రచించిన సుకవుల
  కృతు లొప్ప గొనంగ నొరునికిం దీరునె
...........తిక్కండొకండు దక్కన్.
సీ. లలితనానాకావ్యములఁ జెప్పు నుభయభా
   షలయందు ననుట ప్రశంసత్రోవ.
క. అభినుతుఁడు మనుమభూవిభు
   సభఁ దెనుఁగున సంస్కృతమునఁ జతురుండై తా
   సుభయకవిమిత్రనామము
   త్రిభువనముల నెగడ మంత్రి తిక్కఁడు దాల్చెన్.

అను దశకుమారచరిత్రములోని పద్యములవలన తిక్కన కవుల బహూకరించి కృతులం గొనె నని వివిధగ్రంథములు రచియించె నని, మనుమసిద్ధి యాస్థానమునఁ గవియు మంత్రియునై యుండె నని యుభయకవిమిత్రు డనుబిరుదము దాల్చె నని తెలియును. ఉభయకవిమిత్రబిరుదము భారతరచనమునుండి సుప్రసిద్ధముగఁ దిక్కన వాడుకొనుటచే భారతరచనాకాలమునఁ దిక్కన కృతి తీసికొనెనేమో యని తోఁచెడిని. దశకుమారచరిత్రకృత్యాదివలనఁ దిక్కనసోమయాజి ప్రతిభ రాజనీతి త్యాగగుణము కార్యదక్షత వివిధవిద్యానైపుణ్యము స్పష్టముగఁ దెలియును, తిక్కనసోమయాజియంతవానికిఁ గృతి నిచ్చుట కేతన ప్రతిభకు దృష్టాంతము.

[2]కేతన దశకుమారచరిత్రము విజ్ఞానేశ్వరీయము ఆంధ్రభాషాభూషణము అను మూఁడు పుస్తకములు రచించెను. విజ్ఞానేశ్వరీయము యాజ్ఞవల్క్యధర్మశాస్త్రమునకుఁ దెలుఁగుపద్యకావ్యము. ఆంధ్రభాషాభూషణము తెలుగుబాసలోఁ దొలుత వ్రాయఁబడిన వ్యాకరణము. దశకుమారచరిత్రము దండికృతమగు సంస్కృతగద్యకావ్యమునకుఁ దెలుఁగుసేత.

దశకుమారచరిత్రము మూలగ్రంథమునందలి కథలు వర్ణనాంశములలో నించుక తగ్గించి రసోచితములగు కథాభాగములలో నించుక పెంచి వ్రాయఁబడెను. చాలవఱ కిందలిభావములు మూలగ్రంథములోనివె. పండ్రెండవ యాశ్వాసములో మాత్రము కథ మూలముతోఁ బెక్కుచోటుల భిన్నముగా నున్నది. ఉత్తరపీఠిక దండికృతము కాదని కాఁబోలు నిందు విడిచి పెట్టఁబడినది. అపహారవర్మకథలోని బోగముదానికథ మూలగ్రంథముకంటె నిందుఁ దగ్గింపఁబడినది. నిదురించుసుందరి యాకృతియును దెలుఁగున సంక్షేపింపఁబడినది. ఇటులె వర్ణనాంశములలోఁ గేతన చాల సంక్షేపించెను. విశ్రుతునిచరితములోని రాజనీతులు మాత్ర మీ తెలిఁగింపులో విరళము గలవు. మిగిలినచోటులు గళాభిరుచి కడ్డుపడువర్ణనములు లేక గ్రంథమంతయుఁ గథావస్తువునకె ప్రాధాన్య మీయఁబడి మనోహరముగ నున్నది. కేతనకవి దండ్యాచార్యునిభావములు పెక్కుచోటుల యథారూపముగఁ గొంచెము మార్పుగ నిమిడ్చియున్నాఁడు. చూచుట కవి స్వతంత్రభావములవలెఁ దోఁచును.

“భవదంసోపవీతం యజ్ఞోపవీతం భూసురభావం ద్యోతయతి. హేతి హతిభిః కిరాతరీతి రనుమీయతే. కథయ మేత దితి."

క. జందెముల బ్రాహ్మణత్వము, చందంబున బోయతనము శస్త్రాహతిఁ బొ
     ల్పొందఁగ రాచఱికము నీ, యందొక్కట దోఁచుచున్నయది తలపోయన్

ఈపద్యమునందు క్షత్త్రియత్వము క్రొత్తగఁ జేర్పఁబడినది. మాతృకకంటె భావ మీతెలుఁగుచేతలో బాగుగ నున్నది.

“తత్ర హేతిహతికిణాంకం కాలాయసకర్కశకాయం యజ్ఞోపవీతే నామమేయవిప్రభావం వ్యక్తకిరాతప్రభావం లోచనపరుషం కమపి పురుషం దదర్శ."

సీ. నిధిసాధనక్రియానిమ్నోన్నతంబైన ప్రాంతపట్టణమునఁ బాడువోలెఁ
     (గాలాయసముననంగములు గావించినఁ బ్రాణంబు వచ్చిన ప్రతిమవోలెఁ)
     దొండంబు కొమ్ములు దునియ వ్రేటులు వడి కొదపడ్డ యేనుఁగుకొదమవోలె
     డాంబికవిప్రవిడంబనం బొనరింపఁ బూనిన యొఱపిఁడిబోయవోలె
తే. (మేన బోటుగం ట్లెంతయు మిక్కుటముగ)
     నల్లనై తుండువడి (బ్రాహణత్వమునకుఁ
     దావలంబైన వెడజన్నిదములు దాల్చి)
     యున్న యొక్కని గాంచె నమ్మన్నుఱేడు.

ఇందుఁ గుండలీకృత భాగములుమాత్రము మూలానుసారములు. మిగిలిన వన్నియు స్వతంత్రములే.

“పశ్చా న్నిషీదతో౽స్య బాహుదండయుగళ ముభయకరమూల ప్రవేళిత మగ్రే౽వలంబ్య స్వ మంగ మాలింగయామాస స్వయం చ పృష్ఠతోవలితాభ్యాం పర్యవేష్టయత్.”

     “చెలి గౌఁగిలించెఁ దనకేలు పిఱిందికిఁ జాఁచి వేడుకన్”
క. అతనికరంబులు కక్ష, ద్వితయంబున నిగుడఁ దిగిచి వికసితముఖుఁ డై

     పతి యన్యోన్యాలింగన, వితతసుఖం బనుభవించె....

ఇందుఁ గౌఁగిలింతలు చాలవఱకు మూలానుగుణముగ నున్నను మిగుల స్పష్టముగ సుబోధములుగ నున్న వనుట సత్యము.

“వత్స! మాధ వీప పిచుమందాశ్లేషిణీ యథా౽సౌ శోచ్య మాత్మానం మన్యతే తథోపపాద్యస్థాపితా.”

క. గురువెందవేము నడరిన, పరుసున నవ్వికటకర్మ పాల్పడి చెన్నుం
     బొరయక మెలఁతుక యెప్పుడు, విరసాంతఃకరణ యగుచు వేదనఁ బొందున్.

ఇందుఁ దెలుఁగుసేతలో నుపమానము మాత్రము దీసికొని కథాంశముతోఁ గేతన నిమిడించియున్నాఁడు. ఇటులె పరిశీలింతుమేని కేతన దండికవిభావములను రసోచితముగ మృదుమనోహరశైలిలోఁ దెలిఁగించినతావులు పెక్కులు గనిపెట్టవచ్చును.

కేతన స్వతంత్రముగ వ్రాసినపద్యములలోఁ బెక్కులు మనోహరముగ నున్నవి. ఇతనికవితలో నన్వయకాఠిన్యము లేదు. సమాసజటిలత్వముండదు. నిసర్గసిద్ధమగు ధారాశుద్ధియు మృదుకల్పనము వెల్లివిరియ చుండును. ఇతనికవిత తిక్కనకవితయంతప్రౌఢము కాకపోయినను దిక్కనవంటి విద్వత్కవి యానందింపదగినదిగ నున్న దనుటకు సంశయము లేదు. కేతనకవిత నిర్దుష్టముగ నుండును. ఇతఁడు తెలుఁగున వ్యాకరణము వ్రాసినవాఁ డగుటచే నితనిలక్షణగ్రంథమున కీ దశకుమారచరిత్రము లక్ష్యగ్రంథ మని చెప్పవచ్చును గానీ కొలది స్ఖాలిత్యము లిందును గానవచ్చుచున్నవి. ప్రత్యంతరసహాయమునఁ బరిశోధించిన నిర్దుష్టస్వరూపములు లభించునేమొ. అంతవఱకుఁ బ్రమాదపతితములుగ భావించుట యీమహాకవి ప్రతిభకు లోపము కాఁజాలదు.

ల - డలకు యతి

పన్నిజగాత్రముల్ కడువడంక(అష్టా. ప. 19.)

యతి లోపించుట

మగపంతంబును దక్కినన్ జనము లే మండ్రీ(ద్వాద. ప. 50)

అపశబ్దములు

ఉ. సుందరకుండు నేనును నసూయతనంబున(పంచమాశ్వాసము. ప. 45.)
ఉ. సొమ్మది చెంత యెంతయును జోద్యతరంబుగ(పంచమా. ప. 62.)

ఇంతకు మిగిలి దోషము లీగ్రంథమునఁ గానరావు.

ప్రాసస్థానమున తృతీయాస్థానము 59 పద్యములో, ఉజ్జయినికి ఉజ్జేని యనురూపము గానవచ్చుచున్నది. ఇది వ్యావహారికభాషారూపమో యని మాభ్రాంతి. ఇంత గొప్పగ్రంథములో నీస్వల్పలోపములు గణనీయములు కావు. ఆంధ్రభాషలో నిపు డపురూపములుగ నున్న శబ్దములు పెక్కులు ఈగ్రంథమునఁ గలవు. ఇందుఁ జాలవఱకు నిఘంటుస్థములు కాలేదు. కేతన దేశీయములతోఁ గవితఁ జెప్పువాఁ డగుటచే నితనికవితలో దేశ్యశబ్దములు విచ్చలవిడిగ నున్నవి. వాఙ్మయశోధకుల కాశబ్దములు సహకారులు కాగలవు.

కేతన రసోచితముగఁ బద్యములు వ్రాయుటలో మిగులనేర్పుగలవాఁడు. శృంగారరసమున నీకవి మిగుల మెలకువఁజూపును. స్త్రీవర్ణనమున నీకవి కచకుచాదివర్ణనముల కెడమీయఁడు. సంభోగశృంగారము గూడఁ గొన్నితావు లమనోహరముగ సభ్యముగ వ్రాసియున్నాఁడు. కేతన స్త్రీవర్ణనము మనోజ్ఞముగ నుండును. పోకడయు జవిగొలుపుచుఁ గ్రొత్తతీరుతీయములతో బింకముగ నుండును. చూడుఁడు.

సీ. భావజుపట్టంపుదేవి యై రూపున సడిసన్న రతివిలాసముల గెల్చి(సప్తమా. ప. 111)
సీ. లక్ష్మీహస్తమునకు లాంఛనం బబ్జంబు హస్తంబ యబ్జ మీయబ్జముఖికి(దశమా. ప. 19)

క. అని పలుకఁగ మృదునూపుర, నినదము రశనాకలాపనినదము వనితా
      జనసరసవచనరచనా, నినదంబును నిండె వర్ణనీయం బగుచున్ . (దశ.23)

ఇటులె యితరవర్ణనములందును మనోహరములగు పద్యములు కలవు. కథాసందర్భములం దున్నభారములు చాలవఱకు మాతృకానుగుణములె గాని వర్ణనాంశములు మాత్రము కేతన ప్రతిభావిశేషమునకుఁ దార్కాణములగు స్వతంత్రపద్యములు. కేతన తేటతెలుఁగునం బద్యము వ్రాయుటయందెగాక సమాసపటుత్వముగ వ్రాయుటలోఁ గూడ గడుసరి.

తేట తెలుఁగు

ఉ. ఇంచుకయేని పెం పెఱుఁగఁ డెంతయు వేడుక నేను బుత్రుఁగాఁ
     బెంచిన మావిమోకకడఁ బ్రీతి మదీయవయస్యయైన యి
     క్కాంచనమాల నెలచెలికత్తెలు నవ్వఁగ నంటఁబట్టె నా
     పంచున కాలనై పడనిపాటుల నేఁ బడితిన్ దపస్వినీ.(సప్తమా. ప. 71)

సమాసపటుత్వమునకు

ము. చటులస్యందనఘట్టనం దెరలి యశ్వవ్రాతచంచత్ఖురో
     ద్భటపాదాతపదాహతి న్నెగసి యుద్యద్వారణశ్రేణికా
     కటవిష్యందిమదాంబువృష్టి నడవంగా భూరజఃపుంజ ము
     త్కటదర్పోద్ధతవృత్తి నొత్తి నడచెన్ దండెత్తి యుద్దండుఁ డై.(ఏకాదశ. 1. 119)

రసవంతములగు పద్యముల నిటులె నుదాహరింపఁబూనితిమేని గ్రంథములోని సగపాలు తొలిపలుకునఁ జేర్పవలసి వచ్చును. ఈ గ్రంథమందలి దొంగతనము వడ్లు దంచుట కోడిపందెములు జూదము అభిసారికాకృత్యములు నరకయాతనలు సూర్యోదయాదివర్ణనములు తరువాతికవులకుఁ జాలవఱ కాదర్శము లయ్యె ననుటలో సాహసము లేదు. కేతన కభినవదండి బిరుదము దశకుమారచరిత్ర రచనానంతరము పండితు లొసంగిన దనుట కాధారములు గలవు. ఆంధ్రభాషాభూషణమున కేతన

“క. వివిధకళానిపుణుఁడ నభి, నవదండి యనంగ బుధజనంబులచేతన్
     భువి పేరు గొనినవాఁడను."

అని వ్రాసికొనియున్నాఁడు. కానీ దశకుమారచరిత్రములోఁగూడ గద్యయందు అభినవదండి యనుకొనుట యెటుల నొప్పును. గ్రంథరచనానంతరము వచ్చినబిరుదము గ్రంథమున నెటులఁ జేర్పఁబడె నని కొంద ఱందురు. కృతిశ్రవణానంతరము పండితు లొసంగిన బిరుదమును గద్యమునందుఁ జేర్చికొనియుండు నని మాకుఁ దోఁచుచున్నది.

దశకుమారచరిత్రము సంస్కృతమున వ్రాసినది మహాకవి దండి. ఇతఁడు క్రీ. శ. ఏడవశతాబ్దము పూర్వార్ధమునం దుండెను. ఆకాలపుటాచారములగు పడవ నడుపుటలు సముద్రయానము అనులోమవిలోమద్విజవివాహములు, సంకరబ్రాహ్మణులను గూర్చిన విశేషాంశము లిందుఁ గలవు. చరిత్ర స్థలము లగు కాళేశ్వరము రామతీర్థము కళింగనగరము ఆంధ్రనగరము ఇందుఁ బేర్కొనఁబడినవి. కళింగనగరము సముద్రతీరమందలి సుప్రసిద్ధమగు రేవుపట్టణము. ఇది యొకానొకకాలమున రాజధానిగ నుండెను. ఇందె పేర్కొనఁబడిన యాంధ్రనగరము వేంగి కావచ్చును. జయసింహుఁడు ఆంధ్రదేశమును బాలించిన చాళుక్యరాజన్యుఁ డనియు నితఁడు క్రీ.శ. 633 మొదలు 663 వఱకు రాజ్యము నేలినవాఁడై యుండు ననియు మాతలంపు. అప్పటికళింగనగరము కళింగదేశమునకు రాజధాని యనియు దానిని కర్దనుఁడు పాలించుచున్నాఁ డని తెలుపఁబడినది. పరిశోధనదృష్టితోఁ జూచితిమేని కళింగరాజులకుఁ జాళుక్యులకు జరిగిన యుద్ధము దశకుమారచరిత్రములోని మంత్రగుప్తునికథవలన మనకుఁ దెలియఁగలదు.

కేతనకవి సుప్రసిద్ధుఁడు దిక్కనసోమయాజికాలమునాఁటివాఁడు గావున కవికాలనిరూపణమున నంత శ్రమపడవలసిన పని యుండదు. తిక్కనసోమయాజి మనుమసిద్ధియాస్థానమున నుంటవలనను మనుమసిద్ధి నెల్లూరు రాజధానిగఁ జేసికొని ఆంధ్రదేశభాగమును గణపతిదేవునకు సామంతుఁడై పాలించియుంటవలనను సమకాలికుఁ డగు కేతనయు క్రీ. శ. 1200 మొదలు 1280 లోఁగ జీవించియుండును.

దశకుమార చరిత్రము 1901 లోఁ బ్రచురించిరి. ప్రతు లచిరకాలమునఁ జెల్లిపోయెను. పలువురు కేతనకవితామృతముఁ జవిజూడ నెంచి నిరాశావశులు గావలసివచ్చినది.

భ్రష్టభాగములఁ బూరించుటలో మాతృకాభావములు చాలవఱకు సమర్థింపఁబడినవి గాని

"క. తగునే నీవు పతివ్రత ..........................
     ...........................యఁగ ఛీ నీచేతు లెట్టు.” (దశమా. ప. 97)

లోఁ గేతనమహాకవిమతమునకు వ్యతి రేకముగ అర్ధబిందుకనిర్బిందుకప్రాసము సమకూర్పఁబడినది. మఱియు సప్తమాశ్వాసాంతపద్యములలో

"భారతామ్నాయసేవాదరణ."

అని వ్రాయఁబడినది. కేతన తిక్కనసోమయాజి గ్రంథరచనము భారతరచనమును చెప్పనే లేదు. అట్టిచో భారతప్రశంస కవిమతమునకు విరుద్ధము.

నందిగామ.శేషాద్రి రమణకవులు
20-4-1925శతావధానులు

N. B. చీకటి, ఏగు, పరగ, లోనగుశబ్దములలో నర్ధబిందువు ప్రాచీనగ్రంథానుసారముగ లేదు. ఇందే చీకటి నిర్బిందుకముగ 161, 284. పుటలలో బ్రాసమందుఁగలదు. కావున నరసున్న ప్రమాదపతితము (పా) యని గుర్తు పెట్టఁబడినవి పాఠాంతరములు.

  1. పూర్వముద్రితప్రతిలో వెఱ్ఱిరా లని యున్నది.
  2. ఈ కేతన కాదంబరి పద్య కావ్యము చేసెనని కొంద ఱందురు. ప్రబంధరత్నాకరమున కాదంబరి రచించినది మ్రానయ కేతన యని కలదు గాన నతఁ డిం కొకఁడు.