శివపురాణము/సతీ ఖండము/దక్షుని యజ్ఞ సన్నాహం

వికీసోర్స్ నుండి

ఇక్కడ సతీదేవి ఇలా వికల మనస్కురాలై ఉంటే, అక్కడ ఆమె తండ్రి వికార మనస్కుడై శివుని పరాభవింప పలురీతు లాలోచించి - తన నిర్వహణలో జరిగే ఓ మహాయజ్ఞం ద్వారా అల్లునిపై కక్ష సాధించు ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు.

ఓ శరత్కాలవేళ - ఓ మహా మహత్తరమైన క్రతువు తలపెట్టాడు దక్షుడు. సమస్త లోకాలకూ ప్రత్యక్ష సాక్షులైన ద్వాదశసూర్యుళ్లనూ రప్పించాడు. ఎక్కడెక్కడి లోకాల్లోనో ఉన్నవాళ్ళందరికీ పేరు పేరునా రావలసిందిగా ఆహ్వానాలను అందించే పనిని వారికి ఒప్పగించాడు. చంద్రుడూ - తన మరో అల్లుడూ ఐన సోముడికి ధనాగారంలోంచి ధనం అపారంగా ఖర్చు చేయడానికి అనుమతినిస్తూ, కోశాధికారి పదవి నిచ్చాడు. సమస్తరుచులూ - రసాలూ తెలిసిన అంగీరసమహర్షిని పాక శాలలపై పర్యవేక్షణాధిపతిని చేశాడు. తన ఇతర కూతుళ్లను, సప్తమహర్షులై వెలుగొందుతూన్న వారి భర్తలనూ స్వయంగా వెళ్లి ఆహ్వానించాడు.

ఆహా! ఈ లౌకికవృత్తి ఎంత దుర్మార్గమైనదో కదా! కన్నతండ్రి వంటివాడే కక్ష సాధింపబూనుట - తాను కన్న సంతానంలోనే ఒకర్ని ఎక్కువ, ఒకర్ని తక్కువగా చూచుట అనాది నుంచీ ఉన్నదే అని దక్షుని ప్రవర్తన చాటి చెబుతోంది కదా?

ఆ యజ్ఞసంరంభం వర్ణించడానికి మాటలుచాలవు. ఏర్పాట్లు వివరించ, ఎన్ని ముచ్చట్లు చెప్పినా అంతంకావు.

సామాన్య దేవతల మొదలు, అగ్రదైవాల వరకు అందరూ దక్షుని మహాయాగ ఆహ్వానాలు అందుకున్నారు. యాగస్థలిని హరిద్వార క్షేత్ర సమీపాన ప్రత్యేకంగా నిర్మింపజేశారు.

వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి, దధీచి, భృగువు, గౌతముడు, జమదగ్ని వంటి మహారుషులు; అష్టదిక్పాలకులు; నవగ్రహాలు; విద్యాధరులు, అప్సరసలు, గంధర్వులు, దేవతలు; బ్రహ్మ - విష్ణువులు... వీరందరికీ విడిది ఏర్పాట్లు ఘనంగా చేయించాడు.

88వేలమందిని యాగ నిర్వహణార్ధం రుత్విక్కులుగా ప్రకటించారు. ఉద్గాతలు, అధ్వర్యులు, హోతలు 66వేలమంది. యజ్ఞాధిష్టాతగా కేశవునికి అగ్ర తాంబూలం ఇచ్చాడు. దిక్పాలురే యజ్ఞరక్షణ బాధ్యత స్వీకరించారు. తన పత్ని ఆసిక్నితో కూడిన దక్షప్రజాపతి కంకణధారియై - యజ్ఞ దీక్ష వస్త్రములతో పైజెప్పిన యావత్ బృందము పరివేష్టించి ఉండగా నేలకు దిగిన భానుబింబంలా - యజ్ఞతేజోవిరాజితుడై వెలిగి పోతూన్నాడు. కేవలం శివ పరాభవమే దీక్షగా తలచిన దక్షుడు, రుద్రునిగాని - అతడి అనుచర పరివార గణాన్నిగాని - చివరికి అతని భార్యయైన కారణాన, తన కూతుర్ని గాని పిలవలేదని వేరే చెప్పనవసరం లేదు కదా?

దక్షయజ్ఞ వార్త చంద్రుని వల్ల తెలుసుకున్న సతి

మరునాడు యజ్ఞప్రారంభమనగా - ముందురోజు చంద్రుడు, రోహిణీ సమేతుడై తన దివ్యవిమానారూఢుడై, మందర పర్వతమును - వారణాశిని దాటిపోతూండగా చూసింది సతీదేవి.

అంతవరకు తనసోదరి రోహిణి చుట్టపు చూపుగానైనా వచ్చి వెళ్లేది. నైమిశంలో రుషులయాగానంతరం పరిణమించిన ఘటనలవల్ల మామా అల్లుళ్ల స్పర్ధలకు ఈ సోదరీమణుల మధ్య అగాధం పెరిగింది. రోహిణి తన పతి ఆజ్ఞ మీరలేక, సోదరికి దూరం జరగవలసి వచ్చింది. చనువుకొద్దీ తానే పిలిచేదేగాని, శీతాంశుని పత్నిగా తనపై శీతకన్ను వేసిన చెల్లిని, అక్క అయి ఉండీ బెట్టు చేయకుండా వుండగలదా? ఓపక్క అక్కననే అహం! మరోపక్క ఎక్కడికెళ్తున్నారో తెల్సుకోవాలన్న అరాటం!

తన చెలికత్తెనొకర్తెను పిలిచి, విషయం ఏమిటో కనుక్కుని రమ్మంది. సమాచారం సేకరించి తిరిగివచ్చిన ఆ చెలి, దక్ష ప్రజా పతులవారి యజ్ఞం సంగతి వివరించింది.

వెంటనే, యోగదీక్షాతత్పరుడై ధ్యానముద్ర నవలంబించియున్న భర్త చెంత నిలిచింది. కొంతసేపటికి కన్నులు తెరిచిచూచిన శివుడు నిర్వికారంగా "తల్లీ! నీ రాకకు కారణం ఏమిటి?" అని అడిగాడు. తనను, శివకామినిని... జననిగా తనభర్తే సంబోధించడం మరోసారి సతీదేవి మనస్సు చివుక్కుమనిపించినా, తమాయించుకుని, తండ్రి చేయనున్న యాగానికివెళ్ళే ఉత్సాహంలో, భర్త అనుమతి కోసం ఎలా ప్రారంభించాలా అని ఆలోచించసాగింది సతీదేవి.

వారి సంభాషణ ఇలా సాగింది...

సతి: మనకొక శుభవార్త చేరినది!

శివుడు: మనకు అంటే.. నీకా? నాకా?

సతి: అదేమి? మీరువేరు, నేను వేరు కాదుగదా?

శివుడు: అది ఒకప్పుడు!..

సతి: అదలా ఉంచండి! వార్త వినండి! మా పితృదేవులు ఓ మహత్తర యాగం చేస్తున్నారట!

శివుడు: (నిర్వికారంగా) ఆహా! అలాగా!

సతి: అలాగా కాదు!.. మనం ఎప్పుడు బయల్దేరుదాం?

శివుడు: ఎవరైనాసరే! ఎప్పుడు బయల్దేరుతారన్నది నీకు తెలీని సంగతి కాదు! అవతలి వారి నుంచి పిలుపు...అదీ సగౌరవంగా ఉన్న పిలుపు... అందాక, వీలుచూసుకొని కదా 'బయలుదేరుట' అనే పని జరిగేది.

సతి: మహాకార్యక్రమ భారమున, పిలుచుట ఏమరుపాటుననో, మరుపుననో జరిగి ఉండవచ్చుకదా! అదీగాక - యజ్ఞ హవిర్భోక్తలైన మిమ్ము మరచుట.. జరిగియుండదు. ఆహ్వాన మందించువా రలెవరో ఈ ఆలస్యకారకులై ఉంటారు.

శివుడు: సతీమతల్లీ! ఏది ఏమైనను మనకు పిలుపు అందని మాట వాస్తవమే కదా!

సతి: నిజమే! పిలుపు తక్కువైనందున మీరు పోవుట మానివేయుడు. పుట్టినింట శుభకార్యము జరుగుచున్నది. పోవలెనను తహ తహ నన్ను లాగుచున్నది.

శివుడు: నేనంత వారిస్తూన్నా, నా ఆంతర్యం గ్రహించడం లేదు. నీకు అంతగా వెళ్లాలని ఉంటే వెళ్లు! నాకు అభ్యంతరం లేదు.

శివుడామాట అనడమే తడవుగా, ముఖం విప్పారినది సతీదేవికి. శివుని ప్రమథగణాల్లో ముఖ్యులైన నంది, భృంగి, కాలుడు, మహాకాలుడు, చండుడు, మహాచండుడు; వీరు మాత్రమేకాక ప్రేత, పిశాచ, తదితర భూతగణాలను వెంట బెట్టుకొని దక్షయజ్ఞవాటిక దారి పట్టింది సతీదేవి.

ఆదిలోనే హంసపాదు

యజ్ఞ ప్రారంభానికి ఒక కొద్దిఘడియల కాలాం ఉందనగా, రావలసినవారంతా వచ్చినదీ - లేనిదీ సరిచూసుకున్న దధీచి మహాముని, అసలు ముఖ్యుడు రుద్రుడు రాలేదన్న అంశాన్ని కనిపెట్టి దక్షుని ప్రశ్నించాడు. సాంబశివుణ్ణి రప్పించమన్నాడు. వచ్చినవాళ్లు చాలు! అతడొక్కడు రాకపోతేనేం? అన్నాడు దక్షుడు. సందేహించిన దధీచి దక్షుణ్ణి నిగ్గదీసి అడిగాడు. అతడు పిలిస్తేచాలు! తాను అన్నిటా ఉన్నానంటూ పలికే భోళాశంకరుడు. అలాటివాడు రాలేదూ అంటే, నువ్వు పిల్చిఉండవు! అవునా?" అని రెట్టించాడు.

"అవును ! కావాలనే పిలవలేదు!! వల్లకాటివాసి, చితాభస్మధారి, అస్థిమాలాలంకారి, నాగభూషవిహారి ఆ విరూపాక్షుడిని పిలిచేదేమిటిలే అని నేనే మానేశాను" అన్నాడు కక్షగా.

"అయితే నువ్వు యాగం చేసినట్టేలే!" అని వ్యంగ్యంగా దెప్పి పొడిచి, "పరమశివుని నిరాకరించిన చోట నిమేషమాత్రమైనా నిలువను" అని చరచరా అక్కడ్నించి వెళ్ళిపోయాడు దధీచి.

దధీచి మార్గాన్ని అనుసరించినవారు కూడా వెళ్ళిపోయాక "మరీ మంచిది! పోతే పోనీ! శివప్రియులందరూ వేదమార్గ ప్రవర్తకులు కానందువల్ల, యాగం అవైదికంగా కొనసాగుతుందేమో అనే శంక లేకూండా పోయింది నాకు..." అనుకున్నాడు దక్షుడు.

శుద్ధ విష్ణుపరాయణులతోనే యజ్ఞం ప్రారంభమైంది.