తెలుగు కావ్యములు/అవతారిక

వికీసోర్స్ నుండి

అవతారిక

ప్రకృతమందు హిందూబాలికలకు ప్రత్యేకముగా వారల నిమిత్తము స్థాపింపబడిన పాఠశాలలయందును రాణివాసపు యువతులకు అంతఃపురములందును స్వకీయభాష గరపు బడుచున్నది. ఉదారలగు కొందరు యూరోపియను స్త్రీలు వారలకు లలితములగు శిల్పవిద్యలను గూడ బ్రేమతో నేర్పుచున్నారు. కవితాశక్తియు లలిత శిల్పకౌశలంబునే కాక ఉద్యాన వనారోపణము భూరుహంబుల బెంచి పూపించుట ఫలింప జేయుట మున్నగు దోహదక్రియలు మొదలుగాగల వృక్షాయుర్వేద కృత్యములయందు నైపుణంబునుగల విదుషులు పూర్వ కాలముననుండి నేటికిని అంతఃపురములందు గలిగియుండుట యెల్లరకు దెల్లంబే. ఈయంశము కాళిదాసాదికృత ప్రబంధములవల్లనేకాక కృష్ణదేవ మహారాయల యాంధ్ర కావ్యోచ్ఛ్రయ కాలమందు బ్రకాశించిన యాంధ్రకవుల ప్రబంధములవల్లను గూడ మనకు దెలియ వచ్చుచున్నది. ఆరాయల యౌరసపుత్రి మోహనాంగి యనునామె మరీచిపరిణయమను మనోజ్ఞమైన కావ్యమును రచియించె. దరిదాపు నూరు సంవత్సరముల క్రింద కృష్ణాజిల్లా యందలి మంగళగిరియను పురంబునందు తరిగొండ వెంకమ్మయను పేర బ్రసిద్ధురాలగు వొక కవయిత్రి రాజయోగసారము వేంకటాచల మాహత్య్మము నను గ్రంథ ద్వయంబు రచియించె. మొల్లియను నాబిడచే మొల్లి రామాయణము రచియింపబడె. ఈచొప్పున నాంధ్ర కవయిత్రులచే రచియింపబడిన గ్రంథములు విననయ్యెడు.

మద్గ్రంథసంభారమును పరిశీలించునపుడు మద్వంశ జాతయగు శ్రీ మదినె సుభద్రయ్యమ్మచే రచియింపబడిన కావ్యములు లిఖించియున్న తాళపత్ర పుస్తకము నాకు గానం బడియెను. ఈమె నా పితామహుని జేష్ఠ దుహిత- ఈమె 1781వ సంవత్సరమందు జనించె. ప్రిన్సిపల్ సదరమీగునా నుండి రాజకీయ కార్య నిర్వాహమునకుగా మునుమున్ను సీ. ఎస్. ఐ. అను బిరుదాంకమును శ్రీ శ్రీ శ్రీ మహారాణీగారి వలన బొందినవారిలో నొకరై ప్రసిద్ధికెక్కిన మదిన జగ్గారాయల వారికి తల్లి. ఈయన విఖ్యాతులైన యనేకులగు యూరోపియనుల పరిచయము గలిగి యుండెను. సర్ విల్లియమ్‌ జోన్సుగారి తల్లివలె నీమె కుమారుని బెంచి విద్య గరపెను. ఈశ్వరభక్తిని పరోపకారమును ప్రకాశింప జేయు సత్కార్యములచే నీమె ప్రసిద్ధి కెక్కెను. ఈమె రచియించిన కావ్యములచే నీమెకు వైష్ణవ మతమందు భక్త్యతిశయము గలిగి యున్నట్లు స్పష్టమగుచున్నది. ఈ ప్రబంధములలో నొక దానియందు నీతి సవిస్తరముగా జెప్పంబడినది. ఆ కావ్యములలో నెంచి కొన్నింటి నిపుడు ప్రథమ భాగముగ బ్రకటింపుచున్నాము. ఇది యాంధ్రదేశ మందలి స్త్రీలకు ఆత్మార్థముగాను ఆంధ్ర కావ్యములు చదువ నభిరుచిగల యూరోపియనులకు వినోదముగాను చదువ నుపయోగించును.

విశాఖపట్టణము

విజయ సం|| కార్తీక బ|| అష్టమి శుక్రవాసరము.

గోడే నారాయణ గజపతి రాయడు. పుట:10879telugukaavy034400mbp.pdf/12