తెలుగువారి జానపద కళారూపాలు/శిల్పులు చెక్కిన చెక్క బొమ్మలాటలు
శిల్పులు చెక్కిన చెక్క బొమ్మలాటలు
ఏ దేశంలోనైనా నాటకానికి పూర్వరంగం వీథి నాటకాలూ, చెక్కబొమ్మలూ, కొయ్య బొమ్మలూ, పేడబొమ్మలూ, లక్కబొమ్మలూ అని మనం తెలుసుకోవచ్చును; 'కాళిదారు' 'భవబూతి' 'బాణుడు' మొదలైన వారంతా వ్రాసిన సంస్కృత నాటకాలకు నాంది ఈ కొయ్య బొమ్మలూ, భాగవతాలనే ప్రతీతి కూడ వుంది.
ఈ నాడు మనకున్నది నాటక రంగం. ఆనాడు వారి నాటక రంగస్థలం వీధులే. విగ్రహాలమీద నమ్మకం వచ్చిన తరువాత, దేవతల క్రింద, దేవుళ్ళ క్రింద బొమ్మల పూజలు వచ్చిన అనంతరం వారికి ప్రియమైన భక్తియుతమైన బొమ్మలకు చక్కగా రంగులు దిద్ది, దీపపు స్తంభాల వెలుగురులో ఈ కొయ్యబొమ్మలను ఆడిస్తూ వుండేవారు.
ఈ బొమ్మల నిర్మాణం తేలికగా వుండే కొయ్యతోనూ, పేడతోనూ ఆడించడానికి వీలుగా వుండేంత తేలిక వస్తువులతో తయారు చేసుకునేవారు. దసరాకు పిల్లలు ఆడించుకునే హనుమంతుడి బొమ్మల్నీ, సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులూ, పెళ్ళిళ్ళకు ఆడించే బుట్టబొమ్మలూ, దేవుళ్ళ వాహనాలైన గరుత్మంతుడు, నెమలి, హంస మొదలైన బొమ్మలను గుర్తుకు తెచ్చుకోవచ్చు.
- ఈనాటికీ, ఈ ఆటలు:
ఈనాటికీ ఆంధ్రదేశంలో అక్కడక్కడ తోలుబొమ్మలాటల్ని, బుట్టబొమ్మలాటల్ని, కొయ్య కావళ్ళవారి ప్రదర్శనలనూ చూస్తూనే వున్నాం. కాని కొయ్య బొమ్మలాటల్ని మాత్రం ఎక్కడా చూడలేక పోతున్నాం. అయితే ఈ కొయ్య బొమ్మలాటలు ఆంధ్రదేశంలో ప్రదర్శింపబడి, ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి.
అనంతపురంజిల్లా హిందూపురంలో ఒకప్పుడు ఈ కొయ్య బొమ్మలాటలను ప్రదర్శించేవారు. ఈ కట్టెబొమ్మలు కళ్ళతో కూడ అభినయం చేయగలంతటి పనితనాన్ని నిపుణులైన గ్రామ వడ్రంగులు తయారు చేసేవారు. ఇది చాల ఖర్చుతో కూడుకున్న పని. నలభై సంవత్సరాల క్రితం వరకూ ఈ కట్టెబొమ్మలున్నాయి.
- సూత్రక్రీడ:
అయితే మనదేశంలో కొయ్య బొమ్మలాటకు వేల సంవత్సరాల చరిత్ర వుందంటున్నారు ఆర్వీ.యస్. సుందరంగారు. వారి జానపద విజ్ఞానం. 469 పేజీల, సూత్రక్రీడ అనేది అరవై నాలుగు కళల్లో ఒకటనీ, ఇదే కొయ్యబొమ్మలాటనీ కొందరి అభిప్రాయంగా వుంది. కొయ్య బొమ్మలాట లాడించడానికి సూత్రాలు వుంటాయి. అంటే దారాలన్నమాట. దారాలు బొమ్మలకు కట్టి ఆడించడం వల్ల దీనికి సూత్ర క్రీడ అనే పేరు వచ్చి వుండవచ్చు. అది నిజం కూడ. అందుకు నిదర్శనం ఈనాడు తమిళనాడులో "బొమ్మలాటం" అనే ఈ సూత్రక్రీడ అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ బొమ్మలన్నీ కొయ్య బొమ్మలే అని చెప్పలేం. ఇదే ఒకనాడు కొయ్యబొమ్మలుగా ప్రదర్శింపబడి వుండవచ్చు. ఈ నాటికీ రాజస్థాన్ లో "కట్ పుల్లీ" అనే కొయ్యబొమ్మలనే అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.
- సూత్రధారుడు:
కొయ్యబొమ్మలాటలో సూత్రాలుండడం వల్ల ఆ సూత్రాలతో బొమ్మల నాడించే వ్వక్తికి సూత్రధారి అనేపేరు వచ్చింది. దానిని అనుసరించే సంస్కృత నాటకాలలో కథా విధాన్నాన్ని నడిపే వ్వక్తికి సూత్రధారి అని పేరు వచ్చింది. సూత్ర ధారి నాటినుంచి నేటివరకూ ప్రదర్శించే యక్షగానాల్లో, వీథినాటకాల్లో, భాగవతాల్లో, సూత్రధారుడు అత్యధిక ప్రాధాన్యాన్ని వహిస్తున్నాడు.
ఇందుకు ఉదాహరణంగా కన్నడంలో సూత్రద గొంబె యాట (అంటే సూత్రాల బొమ్మలాట) అనే కొయ్యబొమ్మ లాటలు ఈ నాటికీ వున్నాయి. బొమ్మల్ని చిత్ర విచిత్రంగా ఆడించే చాకచక్యం గల కొయ్య బొమ్మలాటల సూత్రధారి తెర వెనుక వుండి బొమ్మలను సూత్రాల సహాయంతో ఆడిస్తూ వుంటాడు. ఆడించే ఈ సూత్రధారి మన కంటికి కనిపించడు. వెలుగు తక్కువలో ప్రదర్శించడం వల్ల, ఆడించే ఆ సూత్రాలూ, త్రాళ్ళు మనకు కనిపించవు. జీవం లేని ఆ కొయ్యబొమ్మలు జీవం గల బొమ్మలుగా ప్రదర్శింప బడుతున్నాయనే భ్రమను చూపరలకు కలిగిస్తాయి. ఈ ప్రదర్శనం చూడడానికి పరమాద్భుతంగా వుంటుంది.
బొమ్మలాటల్ని ఆడించేవారి ఇంటిపేరులు కూడ బొమ్మలాట సోలయ్య__ బొమ్మలాట వెంకయ్య__ బొమ్మలాట గురవయ్యగా మారిపోయాయి. అలాగే వూళ్ల పేర్లు కూడ బొమ్మలాట పేరుమీద వున్నాయి. అందుకు వుదాహరణ బళ్ళారి జిల్లాలో "బొమ్మలాటపల్లె" అనే వూరు వుండటమే. దాదాపు నశించి పోయిన ఈ కొయ్య బొమ్మలాటలకు నిదర్శనంగా మైసూరు జానపద వస్తు ప్రదర్శనాలయంలో ...రావణాసురుడు లాంటి కొయ్య బొమ్మల్ని చూడవచ్చు.
అయితే ఈ కొయ్యబొమ్మలాటలు అనాదిగా ఆంధ్రదేశంలో ఉన్నాయని చెప్పవచ్చు. నాటకాలు రాక ముందు ఈ బొమ్మలాటలే ప్రజల విజ్ఞాన వినోదాలకు తోడ్పడ్డాయి. కేవలం బొమ్మలాటల్నే వృత్తిగా పెట్టుకుని జీవించినవారు ఆ నాటికీ, ఈ నాటికీ వున్నారు. అందాకా ఎందుకు? దసరా వుత్సవాలలో ఆ రోజుల్లో పిల్లలు తాడుగట్టి ఆడించే హనుమంతుడి బొమ్మ చూడడానికి ఎంతో వినోదాన్ని కలిగించేది.
బొమ్మలు తయారై ప్రదర్శనానికి సిద్ధపడిన తరువాత బొమ్మను ఆడించే వ్వక్తి ఆ బొమ్మ యొక్క పూర్తి మనస్తత్వాన్ని, పాత్రాభినయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని అందుకు అనుగుణంగా పాత్ర యొక్క ఔచిత్యాన్ని తాను అనుభవించి ఆయా బొమ్మల పాత్ర ఔచిత్యాన్ని కాపాడుతూ హృద్యమంగా ప్రదర్శించేవారు.
బొమ్మలాటల కోసం కాకపోయినా ఈ నాటికి బ్రతుకు తెరువు కోసం కొయ్య బొమ్మలను తయారు చేసి ఆయా యాత్రాస్థలాలలో ప్రదర్శించే వారిని అనేక మందిని చూడవచ్చు. ఆ నాడు ఒకందుకు తోడ్పడిన బొమ్మలు ఈ నాటు ఒకందుకు తోడ్పడుతున్నాయి.
- బొమ్మల తయారీ:
ముఖ్యంగా, చేతులు, కాళ్ళు తయారు చేయడానికి సరివి కొయ్యను వినియోగిస్తారు. స్త్రీ పురుష బొమ్మలు నకిలీ బొమ్మలనేవి వుంటాయి. పురుష పాత్రలకు సంబంధించిన బొమ్మలు ఒకటిన్నర అడుగుల నుండి రెండున్నర అడుగుల వరకూ వుంటాయనీ, స్త్రీ పాత్రలకు సంబంధించిన బొమ్మలు, కొంచెం చిన్నవిగా వుంటాయనీ సుందరంగారు అంటున్నారు.
ఆయా బొమ్మల మనస్తత్వాలను బట్టీ ఆకారాలను బట్టీ అభినయాలను బట్టీ అభినయించే రసాలను బట్టీ, రాబోయే సన్నివేశాల కనుగుణంగా రస ప్రాధాన్యాన్ని బట్టి కొయ్య బొమ్మలకు రంగులను చిత్రించి, ఆ బొమ్మలకు జీవాన్ని కలుగజేస్తారు. అలాగే స్త్రీ పాత్రలకు కావలసిన ఆహార్యం, రంగు రంగుల గాజులు, ధగధగ మెరిసే రాళ్ళతో హారాలూ, రంగు రంగుల వస్త్రాలూ మొదలైనవి ఏర్పాటు చేస్తారు.
అలాగే మగ పాత్రలకు, అవసరమైతే విల్లు, గద, కత్తి, చక్రం, కిరీటం మొదలైన వాటిని ఏర్పాటు చూసుకుంటారు.
- ఆట విధానం:
ఇక ఈ బొమ్మల్ని ఆడించే విధానాన్ని గూర్చి కొంచెం తెలుసుకుందాం. ప్రదర్శించబోయే బొమ్మ తలకు రెండు సూత్రాలు, ప్రేక్షకులకు కనిపించని నల్లని దారాలు వుంటాయి. ఆధారాలను సూత్రధారుడు తన తలకు కట్టుకుంటాడు ... చేతులకు కొక్కీ లుంటాయి. వాటిని చేతిలో పట్టుకుని హృద్యమంగా జనరంజకంగా ప్రదర్శిస్తారు.
అయితే ఈ బొమ్మలాటలు ఆంధ్రదేశంలో అంత ప్రాచారం లేక పోయినా, ఒకనాడు రాయలసీమలో ఎంతో ప్రచారంలో వుండేవి. ఇటీవల పదిహేను సంవత్సరాల వరకూ అనంతపురం జిల్లాలో వున్నట్లూ వాటిని చూసినట్లూ మిత్రుడు ఏ.ఆర్.కృష్ణ తెలియ జేస్తున్నారు. బహుశా వాటి ఛాయలు ఇప్పుడు కూడ వుండవచ్చు.
- చారిత్రక సత్యాలు:
చారిత్రకంగా చూస్తే రాయలసీమలో ఈ బొమ్మలు విస్తృత ప్రచారంలో వుండేవి. ఇందుకు ఉదాహరణగా, కోలారు జిల్లాలో వున్న ఒక శాసనంలో
(E.e X SD 100 - P.P_238.39) బొమ్మలాట వారు అగ్రహారాన్ని పొందినట్లు వున్నది.(క్రీ.శ. 152) నాటిది అని అర్వీయస్ తెలియచేస్తున్నారు.
రాయల సామ్రాజ్యంలో రాయలకు అప్తుడైన ఒక బొమ్మలాట వాడుండేవాడట. అతడు విరూపాక్షుని కొడుకైన "బొమ్మలాట కాళడు" కడప మండలంలో కమలాపురం తాలూకా "చిడిపిరాల" గ్రామాన్ని "బొమ్మలాట చంద్రయ్య" బొమ్మలాట అమృతకవి తెర నాటకం ఆడడానికి పెద చిట్టయ్యకు ఇచ్చారని ఒక శాసనంలో ఉంది. (A.R. 316 - OF 1928) పై ఉదాహరణ బొమ్మలాటకు సంబంధించినదే. అంటే ఇది కొయ్యబొమ్మలాటకు సంబంధించిందని తెలుసుకోవచ్చును__లేదా తోలు బొమ్మలాటకలకు సంబందించింది కావచ్చును.
అలాగే కీలు బొమ్మలనేవి కూడ, కొయ్యతో తయారు సేసినవే, కీలు బొమ్మలు, జంత్ర బొమ్మలు అనే వాటి ప్రసక్తి తెలుగు కావ్యాలలో వుందనడానికి అనేక ఉదాహరణలు తెలుగు కావ్యాలలో వున్నాయి.
కీలుబొమ్మలాటకు వెనక తెర మాత్రమే వుంటుండి. సన్ని వేశాలను బట్టి, ఆయా బొమ్మలు తెరమీద ప్రవేశిస్తాయి.
నశించిపోయే ఈ బొమ్మలను, కథలకు సంబంధించిన బొమ్మలుగా కాక, ఎరుకల సానులూ, లంబాడీలు ఈ బొమ్మలను తీసుకుని బ్రతుకు తెరువు కోసం ఆడిస్తూ వుంటారు__ పెళ్ళాడే బొమ్మ అని, వధూవరుల బొమ్మలతో ఆడిస్తారు.
అయితే సాంప్రదాయమైన, ఈ కళనూ ఈ బొమ్మలనూ, ఆడించే విధానాలనూ, పరిరక్షించడం ఎంతో అవసరం. ఇది భావి తరాల వారికి, ప్రాచీన కళారూపాలను గురించి తెలుసుకోవడం కోసం అవకాశం కలుగుతుంది.