Jump to content

తెలంగాణ తేజోమూర్తులు/రావి నారాయణ రెడ్డి

వికీసోర్స్ నుండి

​

120. రావి నారాయణరెడ్డి

- డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి

రావి నారాయణ రెడ్డి గారిని నేను 30 సంవత్సరాల క్రితం కలిసాను. అప్పటికి ఆయన 70 యేండ్ల వయస్సులో కూడా మొహంలో తేజస్సు తగ్గని ఒక నాయకుడిలాగా కనిపించారు.

తెలంగాణ పేదరైతుల్లో శ్రమజీవుల్లో చైతన్యం కలిగించిన ప్రజానాయకుడు రావి నారాయణరెడ్డి, జాగీరుదారులు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు నాయకుడు. తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలో అగ్రనాయకుడు.

చిత్తశుద్ధి, త్యాగం, ఆత్మార్పణ, ప్రజాభ్యుదయాన్ని కోరే దీక్షానిరతి, నిజాయితీని కలిగిన మహాపురుషుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపిన విప్లవవీరుడు రావి నారాయణ రెడ్డి

ఆయన నలగొండ జిల్లా, భువనగిరి తాలూకా, గొల్లెపల్లి గ్రామంలో 1908 జూన్ 4వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి రావి గోపాల్ రెడ్డి, తల్లి వెంకటరావమ్మ, వారిది దొరల కుటుంబం. తల్లిదండ్రులకు ఆయన 14వ సంతానం. 12 సంవత్సరముల వయస్సు వచ్చేవరకు రావి నారాయణ రెడ్డి గొళ్లపల్లిలో విద్యాభ్యాసం చేశారు. భువనగిరిలోని మిడిల్ స్కూల్లో 4వ తరగతి చదివారు.

ఆ తరువాత ఆయన హైద్రాబాద్ లోని రెడ్డి విద్యార్థి వసతిగృహంలో చేరినారు. రెడ్డి హాస్టల్కు అనుబంధంగా వున్న బిడిల్ స్కూల్లో ఫస్ట్ ఫారమ్ చదివారు. చాదర్ ఘాట్ లోని హైస్కూల్లో 1927లో మెట్రిక్యులేషన్ పాస్ అయి నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు.

అప్పటికే ఆయనకు ప్రజాసేవ చేయాలనే దృక్పథం వుండేది. అందుకే ఆయన స్కౌట్స్లో చేరారు నిజాం కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే మహాత్మాగాంధీ ఆత్మకథ చదివి, జాతీయభావాల పట్ల ప్రభావితులయ్యారు.

ఆ తరువాత ఆ ప్రభావంతో ఆయన బద్దం ఎల్లారెడ్డి తదితరులతో కలిసి కాకినాడ వెళ్ళి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ ఉత్తేజంతోనే తమ ఊరు గొళ్లపల్లిలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి నూలు వడకడం, ఇద్దరు నేయడం వంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.

1938లో హైద్రాబాద్లో హరిజన సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి వామన్నాయక్ అధ్యక్షుడుకాగా, రావి నారాయణరెడ్డి కార్యదర్శి అశ్చ్యశ్వరా నివారణ గురించి ప్రచారం చేయడం, సహపంక్తి భోజనాలతో ప్రజల విద్యావికాసానికి కృషి చేయడం ఈ సంఘం యొక్క లక్ష్యాలు.

హరిజనుల కోసం సుమారుగా 100 స్కూళ్ళను స్థాపించారు. తరువాత ఆ సంఘానికి అధ్యక్షుడు కూడా అయి 1988లో స్టేట్ కాంగ్రెస్లో చేరేదాకా కొనసాగారు. ఈలోగా 1921వ సంవత్సరంలో ఆంధ్రజన సంఘం ఏర్పడింది. ఒకవైపు విజ్ఞానాభివృద్ధి కోసం గ్రంథాలయోధ్యమాలు, రైతుల ఇక్కట్లు తొలగించడం కోసం రైతు ​ సంఘాలు, వ్యాపారుల పరిస్థితులు బాగుచేయడానికి వర్తక సంఘాలు నెలకొలిపినారు.

వెట్టిచాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ పల్లెలు మేల్కొన్నాయి. ఆ రోజుల్లో అలుముకున్న గాంఢాంధకారంలో కాంతిరేఖ ఆంధ్ర జన సంఘం. ఈ సంఘాలన్నింటికి ఒకే కేంద్ర సంఘం వుండాలన్న సంకల్పంతో 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. యువ కార్యకర్తగా ఆంధ్రమహాసభల్లో 6వ సభవరకు కార్యకర్తగా పాల్గొని 1940 నాటి 7వ సభ నాటికి కీలక స్థానానికి వచ్చారు.

ఈలోగా నెహ్రూ "డిస్కవరీ ఆఫ్ ఇండియా” జయప్రకాష్ నారాయణ గారి “సోషలిజం ఎందుకు” రచనలు చదివి, సోషలిజం వైపు ఆకర్షితులైనారు. అప్రకటిత కమ్యూనిస్ట్ పార్టీలో 1939 చివరిలో సభ్యులు అయినారు. 1941 సంవత్సరంలో చిలుకూరు సభకు ఆయన అధ్యక్షుడైనారు. ఆ అధ్యక్షోపన్యాసంలో జాతీయ, అంతర్జాతీయ సమస్యలను ప్రస్థావించి తమ కమ్యూనిస్ట్ దృక్పధంతో తెలంగాణలో వున్నటువంటి స్థానిక సమస్యలను కూడా ప్రస్థావించారు. అప్పటిదాకా జరిగినటువంటి ఆంధ్ర మహాసభలకు భిన్నంగా ఇక్కడ రాజకీయ సమస్యలను ప్రస్థావించడం ఈ సభయొక్క విశేషం.

అప్పటివరకు సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమిత మైనటువంటి ఆంధ్రమహాసభ అప్పటివరకు మహాధనులకు, విద్యార్థులకే పరిమితమైనటు వంటి ఆంధ్ర మహాసభ ఈ సభతో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడమనేది గమనించ తగినటువంటి విశేషం. ఈలోగా బ్రిటీష్ వారు 1935లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు. మంత్రివర్గాలు ఏర్పడు తున్నాయి. ఆ ప్రభావంతో నిజాం రాష్ట్రంలో కూడా ఇటువంటి బాధ్యతాయుత ప్రభుత్వం రావాలనే ఆలోచన అనాటి నాయకులకు కలిగింది.

ఆ ఉద్దేశ్యంతోనే 1938లో స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించుకోవాలనే అభిప్రాయం రాష్ట్ర నాయకులకు కలిగింది. రావి నారాయణ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మొదలగు వారితో సన్నాహాక సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం నుంచి సత్యాగ్రహం చేయాలనే నిర్ణయం కూడా జరిగింది. అయితే ఆనాటి నిజాం నిరంకుశపాలనలో సత్యాగ్రహానికి మించి ఆలోచించడం కూడా సాధారణమైన విషయం కాదు. తెలంగాణలో సత్యాగ్రహం చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక యువకుడు రావి నారాయణ రెడ్డి.

1938 నవంబరులో సుల్తాన్ బజారులో జరిగిన సత్యాగ్రహంలో ఆయన అరెస్ట్ అయి 2నెలలు జైలుకెళ్ళారు. సంస్థాన చరిత్రలో ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించడం ఒక సాహసం. ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి ఈరకంగా సత్యాగ్రహ దళాలు జైలుకి వెళుతున్నాయన్న వార్త ప్రజలలో విశేష సంచలనాన్ని కలిగించింది. అయితే గాంధీ ఈ సత్యాగ్రహాన్ని ఆపించారు. ఈలోగా ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి. 1944లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభలో అతివాద, మితవాద వర్గాల మధ్య భిన్నమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ తరువాత ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది.

ఒకటి జాతీయ ఆంధ్రమహాసభ, రెండవది రావి నారాయణరెడ్డిగారి నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్ట్ ఆంధ్రమహాసభ. కమ్యూనిస్ట్ పార్టి నాయకత్వంలో తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం భూస్వామి వర్గాలకు వెన్నులో చలి పుట్టించింది. రైతులను జాగృతం చేయడంలో ఆపార్టీ జరిపిన కృషి తెలంగాణలో చారిత్రాత్మకమైంది.

భూస్వాముల ఆగడాలకు అడ్డుకట్టవేయాలంటే పోరాటం తప్ప వేరే మార్గం లేదని ఆంధ్ర మహాసభ అభిప్రాయ పడింది. గెరిల్లా యుద్ధం ప్రారంభించాలని తెలంగాణ రథసారథి రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలోపల వున్న బి.ఎన్. రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మొదలగువారు పోరాటం చేయాలని నిర్ణయించారు.

ఈ నాయకుల పిలుపు మేరకు తెలంగాణలో సాయుధ పోరాటం ఉదృతంగా ముందుకు సాగింది, బ్రహ్మాండమైన ఈ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు. భారత స్వాతంత్య్ర సమరంలో తెలంగాణ సాయుధ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖింప తగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటం ప్రఖ్యాతిగాంచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం ఉదృతంగా ముందుకు సాగుతుంటే భయాందోళనకు గురైన నిజాం ప్రభుత్వం 1946 నవంబరులో కమ్యూనిస్ట్ పార్టీని ​ నిషేదించింది. 1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు.

1948 సెప్టెంబరు వరకు నైజాం పోలీసులు -ప్రజాకారులకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. పోలీసు చర్య తరువాత కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలనే వాదనని రావి నారాయణ రెడ్డి తిరస్కరించారు.

సోషలిస్టు సమాజ స్థాపనకు హింసావాదమే ఏకైక లక్ష్యమన్న పిడివాదాన్ని ఆయన అంగీకరించలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోలీసు చర్యకంటే ముందు తక్కువమంది ప్రజలు మరణించారని, ప్రజలు వారిని సమయస్ఫూర్తితో కాపాడు కున్నారని నారాయణ రెడ్డి అభిప్రాయ పడ్డారు.

పోలీసు చర్య తరువాత పార్టీ సభ్యులు, ముఖ్య నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో మరణించారని ఇది యదార్ధ సత్యమని నారాయణ రెడ్డి పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. యూనియన్ ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగినపుడు పోరాటాన్ని నిలిపివేస్తే పార్టీకి ఎక్కువ నష్టం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైతేనేమి 1951లో పోరాటాన్ని నిలిపివేయక తప్పలేదు.

పోరాటాన్ని ఆపినప్పటికి హెూలిస్టిక్ గా తరువాత జరిగిన సాయుధ పోరాటం గురించి, జరిగిన నష్టం గురించి, కోల్పోయిన పార్టీ క్యాడర్ గురించి పార్టీ వేదికపై చర్చించక పోవడాన్ని కూడా రావి నారాయణ రెడ్డిగారు తప్పుపట్టారు.

హైద్రాబాద్ సంస్థానంలో వయోజన ఓటింగ్ ఆధారంగా ప్రజాస్వామిక ప్రభుత్వం స్థాపించటానికి ఈ పోరాటమే కారణ భూతమైంది. వెట్టిచాకిరి నుండి ప్రజలకు విముక్తి లభించడానికి, అక్కన్నదేవి వసూళ్ళు పోవడానికి ఈ పోరాటమే కారణం. తెలంగాణ సాయుధ పోరాటమే భూ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి బాటలు వేసిందని రావి నారాయణ రెడ్డి అన్నారు.

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఒక అభ్యుదయ కౌలుదారి చట్టం ఇక్కడ ప్రవేశ పెట్టడం కూడా ఈ పోరాట ఫలితమే. ఈ పోరాటం ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పేదరైతుల స్వాధీనమైంది. రైతుల నుండి అక్రమంగా భూస్వాములు లాక్కున్న భూములను తిరిగి రైతులు స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యమనేత, సాయుధ పోరాటయోధులకు తలమానికంగా నిలిచారు రావి నారాయణ రెడ్డి. ఆయన కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు ఆయన. తండ్రి 3వేల ఎకరాల భూస్వామి. అతనికి నలుగురు కొడుకులు. రావి నారాయణ రెడ్డిగారు తనవంతుగా 700 ఎకరాల భూమివస్తే, అందులోనుంచి 500 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసారు. అంతటి ఉత్తమ సంస్కారుడు రావి నారాయణ రెడ్డి. ఈ సందర్భంలో ఆయన 5 సంవత్సరాల జైలు, రహస్య నిర్బంధాలను అనుభవించారు. ఈలోగా 1952లో జరిగిన తొలి సారత్రిక ఎన్నికల్లో నల్లగొండ పార్టీ నియోజకవర్గంలో పోటీచేసి భారతావని మొత్తంమీద ఏ వ్యక్తికి రానటువంటి అతిపెద్ద మెజారిటీతో ఎన్నికై భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ద్వారా పార్లమెంటులో ఘనసన్మానం పొందారు.

1957 ఎన్నికల్లో భువనగిరి నుంచి శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. 1962లో కూడా తిరిగి భువనగిరి నుండి పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు.

ఒక సందర్భంలో సొంత తన బావమరిదితో పోటీచేసి, తన బావమరిదిని లెక్కచేయకుండా ఆయనమీద అఖండమైన మెజారిటి సాధించి ఎన్నికైనారు.

చివరగా ఆయన 1967 నుండి స్వచ్ఛందంగా రాజకీయాల నుండి నిష్క్రమించారు. తెలంగాణలో మొదటి నుంచి చివరిదాకా తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకు నిబద్దుడై దానికి కట్టుబడి జీవితాంతం రాజకీయాలతో పున్నటువంటి నిష్కల్మష హదయుడు రావి నారాయణ రెడ్డి,