Jump to content

తెలంగాణ తేజోమూర్తులు/పైడిమర్రి వెంకటసుబ్బారావు

వికీసోర్స్ నుండి

​

103. పైడిమర్రి వెంకట సుబ్బారావు

- మేరెడ్డి యాదగిరి రెడ్డి

భారతదేశము నా మాతృభూమి
భారతీయులందరూ నా సహోదరులు
నేను నా దేశమును ప్రేమించుచున్నాను
సుసంపన్నమయిన బహువిధమయిన
నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము
దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని,
నేను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులనూ,
పెద్దలందరినీ గౌరవింతునని,
నా దేశముపట్ల నా ప్రజల పట్ల భక్తిశ్రద్ధలు
కలిగి వుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను
వారి శ్రేయోభివృద్ధులే, నా అనందమునకు మూలము.

ఈ ప్రతిజ్ఞ మన పాఠశాలలో విద్యార్థులు ప్రతి నిత్యం ప్రార్ధన సమయంలో చదవడం మనందరికీ విదితమే. ప్రాథమిక స్థాయి నుండి హైస్కూల్ స్థాయి వరకు అన్ని పాఠ్యపుస్తకాలలో పొందుపరచాయి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఎందువల్లో ఈ రచయిత పేరు చాలాకాలం అజ్ఞాతంగా వుండిపోయింది. జనగణమన, వందేమాతరం, తర్వాత అదే కోవలో నిత్యం మనపాఠశాలలో విద్యార్థులచే చదివిస్తున్న ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిజ్ఞ రచయితగా పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు పాఠ్య పుస్తకాలలో ప్రచురించడం వారి పేరు వెలుగులోకి రావడం సంతోషకరమైన విషయం.

పైడిమర్రి సుబ్బారావు తెలంగాణాలో నల్లగొండ జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని అన్నెపర్తి గ్రామంలో జూన్ 10, 1916లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాంబాయమ్మ, రామయ్య. వీరి విద్యాభ్యాసం నల్లగొండలోనే జరిగింది. వీరి కుటుంబం ఇప్పటికి నల్లగొండలోనే వుంది.

సుబ్బారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త. రచనా వ్యాసాంగంలోని వివిధ ప్రక్రియలలో చేయి తిరిగినవాడు. బహుభాషా కోవిదుడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పార్సీ భాషలలో వీరికి ప్రావీణ్యం వుంది.

సుబ్బారావు అప్పటి హైదరాబాదు రాష్ట్రంలో వుద్యోగంలో చేరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ట్రెజరీ శాఖలో చేరి వివిధ జిల్లాలో పనిచేశాడు. హైదరాబాదు, బీదరు, నిజామాబాదు, ఖమ్మం, నల్లగొండ, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలలో జిల్లా కోశాధికారిగా పనిచేశాడు. వారు విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు 1962లో చైనా యుద్ధం వచ్చింది. చైనా విద్యార్థులు యువకులకు దేశభక్తిని పెంపొందించే అంశాలు వాళ్ళ పాఠ్యపుస్తకాలలో వుండడం సుబ్బారావు గమనించారు. మనదేశపు విద్యార్థులు, యువతలో దేశభక్తిని ప్రేరేపించే వుద్దేశ్యంతో 'ప్రతిజ్ఞ' రాశారు సుబ్బారావు. తను రాసిన ప్రతిజ్ఞను ప్రముఖ సాహితీవేత్త, స్వాతంత్య్రపోరాట యోధులు, తనకు సన్నిహితుడైన తెన్నేటి ​ విశ్వనాథానికి చూపించాడు. సుబ్బారావు అనేక సాహిత్య విషయాలు తెన్నేటితో చర్చించేవారు.

తెన్నేటి విశ్వనాథం, సుబ్బారావు రాసిచ్చిన ప్రతిజ్ఞను అప్పటి విద్యాశాఖామాత్యులు పి.వి.జి. రాజుకు చూపించారు. ఇది చాలా బాగుందని దేశభక్తిని పెంపొందిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానంద రెడ్డితో చర్చించి 1963లో పాఠ్యపుస్తకాలలో పొందుపరచి ప్రతిరోజూ విద్యార్థులచే చదివించాలని ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకు కేంద్రప్రభుత్వం, ఇతర రాష్ట్రాలవారు తమ తమ భాషలలో అనువదించి తమ పాఠ్యపుస్తకాలలో పొందుపరిచారు.

పైడిమర్రి వెంకట సుబ్బారావు, నిరాడంబరుడు, నిగర్వి, మృదుభాషి, మితభాషి, ఆడంబరాలకు దూరంగా వుండేవారు. 1988లో తను చనిపోవడానికి కొద్దిరోజుల ముందు మూడవతరగతి చదువుతున్న తన మనుమరాలు 'ప్రతిజ్ఞ' చదువుతుంటే విని సంతోషించి ప్రతిజ్ఞ తను రాసిన విషయం తన కుటుంబసభ్యులకు తెలియచేశాడు. అలా ఈ విషయం బయటపడింది.

సుబ్బారావు కవిత్వం, కథలు, నాటికలు, నవలలు, వందలాదిగా పద్యాలు రాశాడు. అనువాద రచనలు చేశాడు. సుబ్బారావు జీవితం సాహిత్యం అనే అంశంపై పి.హెచ్.డి. కి సరిపడ సమాచారముంది. వీరికి తెలంగాణా తొలితరం కథకుడుగా పేరుంది. వీరు చిన్న అంశాన్ని తీసుకుని చక్కటి కథగా మలచడంలో నేర్పరి, జమీందారులు, భూస్వాములను నిరసిస్తూ ఎన్నో కథలు రాశాడు. ఆయన కథలు అసక్తికరంగా పాఠకులు చదివించేటట్లు వుంటాయి. వీరి కథలలో జాతీయాలు, సామెతలు చోటుచేసుకున్నాయి.

ఆయన రాసిన కథలలో నౌకరి, పిల్లపోడు, రాజులు, బడిగంటలు ముఖ్యమయినవి. ఉషస్సు కథా సంకలనంలో వీరి కథ చోటు చేసుకుంది. 'నౌకరి' కథ 1952 నాటి ముల్కీ వుద్యమానికి సంబంధించిన కథ. ముల్కీ వుద్యమంలో పాల్గొన్న వారికి వుద్యోగం రాకపోవడం ఈ కథలో ముఖ్యాంశం.

'రాజులు' అనే కథలో రాజులు అనే వ్యక్తి గ్రామంలో అందరి తలలో నాలుకలా మెలిగి అందరి అవసరాలు తిరుస్తుంటాడు. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసాడు. పెండ్లి, పిల్లలు, నా అన్నవారు లేరు. ఏ గ్రామమో తెలువదు అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే జనమంతా వెళ్ళి అతని అంతిమ సంస్కారం ఘనంగా జరిపిస్తారు. వీరి కథల మధ్యన చిన్నచిన్న పాటలు కూడా చూడవచ్చు.

"పాడిపంటలు మాకు భగవంతుడిస్తాడు.
వాని దయ వుంటే లోపమేమి లేదు
బీదసాద మాకు సోదరీసోదరులు
పెట్టిపోతలు మాకు విడిపోని ధర్మాలు”

అంటూ తెలంగాణా ఆత్మీయతను చాటుకుంటాడు.

వీరి 'పిల్లిపోడు' కథ జీవకారుణ్యానికి చెందిన కథ. మునిమాణిక్యంలా ఈ కథలో కొంచెం హాస్యం గూడా జోడించారు సుబ్బారావు. పిల్లి చూలాలై పిల్లలు కంటే ఆ యింటి యిల్లాలు కన్నబిడ్డల్లా ఆ పిల్లికి సపర్యలు చేయడం ఈ కథలోని ముఖ్య విషయం. ఇలా వైవిధ్యమైన విషయాలు కథ చెప్పే నైపుణ్యం వీరి కథల్లో వుంది. అందుకే తెలంగాణా తొలితరం కథకులలో స్థానం పొందారు. వీరి కథలలో పాత్రోచితంగా ఉర్దూ పదాలు వాడారు.

1956 నాటికే వీరు బ్రహ్మచర్యము, గృహస్తు జీవితం, స్త్రీ ధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాలు రచించి వాటిని ప్రదర్శనాయోగ్యంగా తీర్చిదిద్దారు. 1951 నాటి 'సుజాత' పత్రికలో శ్రీమతి నాటకం వెలువరించాడు. ఇందు బిందుసారుని అనంతరం రాజ్యానికి వచ్చినవారు బౌద్ధ మతానికి విద్రోహం చేయడం ఈ నాటకంలోని ముఖ్యవిషయం.

ఈ నాటకాలతో పాటు పద్దెనిమిది సంవత్సరాలకే సుబ్బారావు కాలభైరవుడు అనే నవలను కూడా రాశాడు. ఈ నవలతో పాటు ప్రకృతి, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు, మొదలైన పద్యకావ్యాలు కూడా వీరి కలం నుండి వెలువడ్డాయి. వీటితో పాటు సింగపురీ వృకేసరీ శతకం, బాలరామాయణం, వేంకటేశ్వరస్తుతి వంటి భక్తి రచనలు చేశాడు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలపై పద్యాలు వెలువరించాడు.

“మా కవితాపితామహుడు మంజుల భాషతో వరూధినీ
వ్యాకుల మోహరక్తి బ్రవరాఖ్యుపరాజ్ముఖి ధీరదృతి ​
నీలోకములో జీరమ్మురనలుబ్బుల చిత్తలుల్లసిల్లగా
నీ కతన్ రచించెనొక నిస్తుల చిత్రమాలీల దీర్చున్”

ఇది అల్లసాని పెద్దన పై రాసిన పద్యం.

వీరు హిందీ నుండి గీతామీమాంస, దైవభక్తి, మీమాంస త్రయము తెలుగులోకి అనువాదం చేశారు.

పైడిమర్రి సుబ్బారావు రాసిన రెండు పద్యాలను సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ కవుల సంచికలో వేశాడు. అవి మహారాజు కిషన్ ప్రసాద్ పై వ్రాసిన పద్యాలు. కిషన్ ప్రసాద్ నిజాం నవాబు దగ్గర ప్రధానిగా వుండి ప్రజల మన్ననలను పొందినవారు.

"ప్రతిభావంతునకున్ నిజాం ప్రభునకు బాసిల్లగా మంత్రివై
మతిమంతుడవు నీవు గల్గదల భర్మంబందు గందంబు రీ
తితగున్ దుబ్బము లేని సత్పదము వర్తింపగ సత్కార్య
నత్భుతులకున్దక్కువలేదు మానుకృతమే కృష్ణ ప్రసాధిపా!"

ఇలా వీరు పద్యరచనలో అందెవేసిన చేయిగా పేరుగాంచారు. 1945-46లో నల్లగొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవాలలో ప్రముఖపాత్ర వహించారు. సర్వేల్లోని సర్వోదయ ఆశ్రమం వారి అద్భుతవాహిని గ్రంథానికి వివిధ విషయాలతో విపుల పీఠిక రాశారు.

వీరు తరచు కాంచనపల్లి చిన వెంకటరామారావు ఆధ్వర్యంలో జరిగే యువరచయితల సమితి సాహితీ సమావేశాలలో పాల్గొనేవారు. 1970, 74, 83లలో జరిగిన జిల్లా రచయితల సభలలో పాల్గొని కవితాగానం చేశారు. యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో కవితాగోష్టిలో సన్మానం పొందారు. జిల్లా గ్రంథాలయంలో జరిగే అన్ని సాహితీ కార్యక్రమాలలో పాల్గొని సేవలందించారు. ఉద్యోగ విరమణ అనంతర సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి కోరిక మేరకు సర్వేల్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛందంగా సూపరిండెంట్గా సేవలందించారు.

సుబ్బారావు సంస్కృత భారతమును కొంతమేర తెలుగులోకి అనువదించారు. 'పతంజలి' యోగప్రదీపికను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. అరబ్బీలో వున్న గ్రంథం జీవిత మహాపథం పేరుతో తెలుగులోకి అనువదించారు. ఇలా చాలా గ్రంథాలు తెలుగులోకి అనువదించారు. వీరి ఇంటిలోని గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ గీతావిజ్ఞాన కళాశాల నల్లగొండ వారికి అందచేశారు.

వీరి రచనలు ఆ రోజుల్లో గోల్కొండ భారతి, ఆంధ్ర పత్రిక, ఆనందవాణి, నవజీవన్ పత్రికలలో వచ్చాయి. వీరు సామాజికసేవా పరాయణులు. దేశభక్తి పరాయణులు. జాతిని జాగృతం చేసే రచనలు చేశారు. వీరు వుద్యోగ విరమణ అనంతరం నల్లగొండలోని గాంధీపార్క్ లొని ఆర్యవైశ్య మందిరంలో ప్రతినిత్యం పేదవారికి ఉచిత హోమియో వైద్యం అందించేవారు. ఆయన 13 ఆగస్ట్ 1988న కాలధర్మం చెందారు. ఆయన మరణించిన ఆయన రాసిన ప్రతిజ్ఞ ప్రతి నిత్యం లక్షలాదిమంది విద్యార్థుల నోళ్లలో విన్పిస్తుంది. కారణ మ్ముడు పైడిమర్రి సుబ్బారావును తెలుగు సాహితీలోకం ఎప్పటికీ మరువలేనిది.