Jump to content

తెలంగాణ తేజోమూర్తులు/పాకాల యశోదారెడ్డి

వికీసోర్స్ నుండి

104. పాకాల యశోదారెడ్డి

- డా॥ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రసిద్ధ కథకురాలు యశోదా రెడ్డి. రేడియో ధారావాహిక కార్యక్రమం ద్వారా “మహాలక్ష్మి ముచ్చట్లు అనే పేరుతో తెలంగాణ భాషను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రి యశోద రెడ్డి.

తెలంగాణ మారుమూల గ్రామంలో జన్మించి హైద్రాబాదు నగరానికి వచ్చి, విద్యాభ్యాసం చేసి ఒక యూనివర్శిటీలో ప్రొఫెసర్ అవ్వడమనేది ఆనాడు చాలా అసాధారణమైనటువంటి విషయం.

ఆమె 1929 ఆగష్టు 8వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని మిదినేపల్లి గ్రామంలో జన్మించింది. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. ఆమె ఎంత జ్ఞాపకశక్తి కలిగివున్నది అంటే ఒకసారి పాఠశాలకు వెళ్ళినపుడు పుస్తకాలు తేనందుకు ఆమెను క్లాసు బయటే సార్ వుంచినపుడు క్లాసు బయటినుంచే ఆమె పాఠం విని ఆ పాఠంలో అక్షరం పొల్లుపోకుండా వినిపించినటువంటి అద్భుతమైన ఏక సంథాగ్రాహి యశోద రెడ్డి,

ఆ తరువాత విద్యాభ్యాసం ముగుస్తున్నటువంటి క్రమంలోనే తెలంగాణ చిత్రకారుడు పి.టి. రెడ్డిగారితో వివాహం జరిగింది. ఆయనతోపాటు నారాయణగూడలోనే ఇల్లు తీసుకొని అక్కడే నివాసం ఏర్పరచుకుని అప్పటినుంచి ఆమె చనిపోయేంత వరకు ఆ నివాస గృహంలోనే వున్నారు.

ఆమె ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక నిరక్షరాశ్యులైనటువంటి కుటుంబం నుంచి వచ్చి, ఎం.ఎ., పి.హెచ్.డి. చేసి యూనివర్శిటీలో చేరడమనేది మామూలు విషయం కాదు.

ఆమె తెలుగులో హరివంశాల మీద పి.హెచ్.డి చేసింది. సంస్కృత హరివంశం, నాచ సోమనాథుడి హరివంశం, ఎర్రన హరివంశం, భైరవి కవి హరివంశం మొదలైనటువంటి హరివంశాలని తులనాత్మక అధ్యయనం చేసి తన సిద్ధాంత గ్రంథంలో నిరూపించింది.

తులనాత్మక అధ్యయనానికి అది ఒక తొలిమెట్టుగా విమర్శకులు భావిస్తారు. ఆ పి.హెచ్.డి. అనంతరం ఆమె ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా చేరి సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా తన విధుల్ని నిర్వర్తించారు.

ఆమె విద్యుక్తధర్మంలో ఎంత నిర్మొహమాటి అంటే ఎవ్వరినీ లెక్క చేయనటువంటి ముక్కుసూటిగా పోయే తత్వం. అందుకని ఆమె అనేక సందర్భాలలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఆర్ట్స్ కళాశాల మెట్లు ఎక్కనివ్వకుండా చేసినటువంటి ఇబ్బందుల్ని కూడా ఆమె ఎదుర్కొంది.

అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా 1990-93 మధ్య పనిచేసింది. అప్పుడు ఆమెవద్ద నేను పి.ఎస్.గా అంటే పర్సనల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అప్పుడు యశోదా రెడ్డిగారి ప్రతిభ ఏమిటో, ఆమె ఎంత ముక్కు సూటిగా వెళుతుందో, తన అభిప్రాయాలకు విలువ నీయనటువంటి వారిని ఎవరినీ లెక్కచేయనటువంటి స్థితిలో వుంటుందో, అమెకు ఎంత సాహిత్య ప్రతిభ వున్నదో. సాహిత్య పాండిత్యం వున్నదో నేను దగ్గరినుండి గమనించడం జరిగింది.

ఆమె ఎంతటి బహుముఖ ప్రజ్ఞావంతురాలు అంటే ఆమె కేవలం కథలు రాయడమే కాకుండా, అనేక మైనటువంటి పరిశోధనా గ్రంథాలు రాసింది. అనేక రేడియో ప్రసంగాలు చేసింది. అనేక సభల్లో ఉపన్యాసాలు ఇచ్చింది. ఆమె గొప్ప వక్త కూడా.

చాలా అద్భుతంగా తన జ్ఞాపకశక్తితో వేలాది పద్యాలని ఒప్పజెప్పి, వేలాది పద్యాలని కోడ్ చేసి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేటటువంటి వాగ్దాటి ఆమె సొంతం.

ఆమె పరిశోధనా గ్రంథాల్లో మనం పేర్కొనదగినటు వంటి గ్రంథాలు చాలా సుప్రసిద్దమైనటువంటి గ్రంథాలు వున్నాయి. వాటిలో ఒకటి ఆంధ్ర సాహిత్య చరిత్ర వికాసం. ఇది ఆంధ్ర సాహిత్య చరిత్ర ఎట్లా వికాసనం చెందిందనే విషయాన్ని ఈ గ్రంథంలో తెలియపర్చింది. తన అన్ని గ్రంథాల్ని పరిశీలించినపుడు ఆమెకు ప్రాచీన సాహిత్యం మీద ఎంత అధికారం వున్నదో, పాశ్చాత్య సాహిత్యం మీద కూడా అంతే అధికారం వుందని, ఆధునిక సాహిత్యం మీద కూడా అంతే అధికారం వున్నదన్న విషయం మనకు అర్ధమవుతుంది. ఆమె రెండో గ్రంథం 'పారిజాతాపహరణ పర్యాలోచనం'.

నంది తిమ్మన రాసినటువంటి పారిజాతాపహరణ ప్రబంధాన్ని ఆమె అద్భుతంగా విశ్లేషించింది. అదేవిధంగా ఎర్రాప్రెగడ అనే గ్రంథంలో సంస్కృత హరివంశానికి ఎర్రన హరివంశానికి వున్నటువంటి సామ్యబేధాన్ని తులనాత్మకంగా వివరించి చెప్పింది. అదేవిధంగా ఎర్రప్రగడ రాసిన నృసింహ పురాణం అనువాద విధానం గురించి రాసినటువంటి ప్రబంధ వాఙ్మయం. ఇది 1975 ప్రపంచ తెలుగ మహాసభల సందర్భంగా వెలువడినటువంటి గ్రంథం.

ప్రబంధ వాఙ్మయ పరిణామ వికాసాల గురించి చాలా సంక్షిప్తంగా రాసినటువంటి గ్రంథం. చాలా ప్రామాణికంగా రాసినటు వంటి గ్రంథం ఇది. ప్రబంధ లక్షణాలేమిటి అని విశ్లేషించి వాటిని మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్త మాల్యద, కళాపూర్ణోదయం, పారిజాతాపహరణం, విజయవిలాసం మొదలగునటువంటి గ్రంథాల్లో వున్నటువంటి విశిష్టతను తన అద్భుతమైనటువంటి ప్రతిభతో విశ్లేషించింది. అంతేకాకుండా ఆమె పోతన భాగవతసుధ, భాగవత కల్ప కుసుమావళి అనే గ్రంథాల్లో ఆ పద్యాలకు అద్భుతమైన వ్యాఖ్యానం రాసింది. ఆ వ్యాఖ్యాన మాధుర్యంలో ప్రేక్షకులు, పాఠకులు ఓలలాడారు.

ప్రాచీనమైనటువంటి కావ్యాలే కాకుండా ఆమె దేశీకావ్యాల్ని కూడా విశ్లేషించింది. అందుకు ఆమె రాసినటువంటి ద్విపద వాగ్మూలం ఒక ఉదాహరణ.

అంటే సాంస్కృతిక ఛందస్సుల మీద ఆమెకు ఎంత అధికారం ఉన్నదో దేశీ ఛందస్సు అయినటువంటి ద్విపద మీద కూడా అంతే అధికారం ఉన్నదనే విషయాన్ని మనకు ఈద్విపద వాంగూల గ్రంథం తెలియజేస్తుంది. వారిదే ఇంకొక పరిశోధనాత్మకమైన గ్రంథం "భారతదేశంలో భారతంలో స్త్రీ" - అంటే మహాభారతంలో స్త్రీని ఎట్లా వ్యాఖ్యానించింది. భారతదేశంలో స్త్రీ యొక్క స్థానం ఏమిటనేదాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళి ఆమె విశ్లేషించింది.

ఇందులో వున్నటువంటి స్త్రీ పాత్రను సాంప్రదాయక దృక్కోణం నుంచీ, ఆధునిక దృక్కోణం నుంచి కూడా విశ్లేషించడం ఇక్కడ గమనించవలసిన విషయం.

సాంప్రదాయక దృక్కోణం నుంచి కుంతీ, ద్రౌపది, గాంధారి, సుధేష్ణ, ఉత్తర, దమయంతి, శకుంతల మొదలై నటువంటి పాత్రల్ని విశ్లేషించింది. ఇక ఆధునిక దృక్కోణం నుంచి ప్రద్వేషిని అనే ఒక కథానాయిక కథని విశ్లేషించింది. పుట్టుగుడి అయినటువంటి ధీర్ఘతముని భార్య అయినటువంటి ఈ ప్రద్వేషిని ఒక ఆధునిక స్త్రీలాగా ఎట్లా భర్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టిందో ఆమె అద్భుతంగా దీంట్లో విశ్లేషించింది. అంటే నన్ను వెళ్ళిపొమ్మంటున్నావు అని భర్త అడిగినపుడు ఒక తర్కబద్ధమైనటువంటి సమాధానం ఆమె ఎట్లా చెప్పిందో విని ఇక్కడ వివరించింది.

"పతియు భరియించు కావున భర్త అయ్యే, భామ భరియింపబడును గావున భార్య అయ్యే, పరగనయ్యె మలయందు వీడ్వడియే విల్లులోన ఎల్లకాలము భరియింతుగాన" కాబట్టి సంపాదన లేకుండా తిని కూర్చొని నామీద ఆధిపత్యం చేస్తున్నట్లయితే నేనెట్లా భరిస్తాను. కాబట్టి నువ్వు సంపాదించి నన్ను భరియిస్తే నువ్వు భర్తవు, నువ్వు సంపాదించకుండా తిని కూర్చొని పైగా నామీద ఆధిపత్యం చెలాయించడం అనేది సరియైనటువంటిది కాదు. కాబట్టి నువ్వు నాకు భర్తగా వుండటం తగదు అని చెప్పి ఇంటి నుంచి ఆమె ఎట్లా బయటికి వెళ్ళగొట్టిందీ అని చెప్పే ఒక ఆధునిక దృక్కోణం నుంచి విశ్లేషించింది యశోదా రెడ్డి,

అదేవిధంగా ఆ గ్రంథంలో ఉపసంహారం అనే భాగంలో "మారుతున్న సమాజంలో స్త్రీ" అనే శీర్షిక కింద ఆమె ఈవిధంగా అన్నది. "స్త్రీకి సమాన హక్కులు ఉండాలని, స్త్రీ సమస్యా పరిష్కారం కోసం కృషి చేయాలని అందుకే ఈ గ్రంథాన్ని రాశానని ఆమె పేర్కొన్నారు. అంటే ఆమె కేవలం పరిశోధన కోసం కాకుండా ఆధునిక దృక్కోణం నుంచి అసలు స్త్రీ గురించి మాట్లాడటమే స్త్రీ పాత్రల గురించి మాట్లాడటమే ఆధునిక దృక్పథం వున్నట్లు మనకు అర్ధమవుతుంది.

అంతేకాకుండా ఆమె హిందీ కవయిత్రులు అనే పుస్తకాన్ని కూడా అనువాదం చేసింది. అంటే దాని ద్వారా స్త్రీపట్ల ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిలాష వున్నదన్న విషయం మనకు ఈ గ్రంథాల వల్ల తెలుస్తుంది.

ఈ పరిశోధనాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమై నటువంటి గ్రంథాలే కాదు. ఆమె అద్భుతమైనటువంటి కథలు రాసింది. ఆమె కథల్ని నేషనల్ బుక్ ఫెస్ట్ వాళ్ళు "ఉత్తమ కథలు" అనే పేరుతో ఒక సంపుటిగా వెలువరించింది. అచ్చమైన తెలంగాణ గ్రామీణ జీవితాలను కల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని చెరిపివేసిన ముత్యాల లాంటి కథలు ఇవి.

యశోదా రెడ్డి కథలు మంచిని పెంచే కథలు, మానవత్వాన్ని తట్టిలేపే కథలు, ఆర్ద్రత నిండిన కథలు, వేలాది తెలంగాణ భాషా పదాలను, సంస్కృతీ వైవిధ్యాలను, మాటతీరును బంగారంలో వజ్రాల్లా తన కథలో పొదిగారు.

భాష, సంస్కృతి, నుడికారం, మానవ సంబంధాలు, పరిణామాల చిత్రణ, ప్రధాన లక్ష్యం అయినప్పటికి గ్రామీణ జీవనం వారి వారి వ్యక్తిత్వాలు, జీవన ప్రమాణాలు దశాబ్దాల తరబడి ఎలా కొనసాగాయో సామాజిక శాస్త్రాల కన్నా మిక్కిలి శక్తివంతంగా కథల్లో చిత్రీకరించారు.

స్వాతంత్య్రానంతరం గ్రామీణ, సామాజిక పరిణామాలకు ఈ కథలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆ కథల గురించి బి.ఎస్. రాములు గారు వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యానం ఆమెయొక్క కథల విశిష్టతను తెలియజేస్తుంది. ఆమె 'ధర్మకాల' అనే కథా సంపుటిలో 24 కథల్ని, అదేవిధంగా "మా ఊరి ముచ్చట్లు" అనే కథా సంపుటిలోనూ, ఎచ్చమ్మ కథలు అనే కథా సంపుటిలోనూ తెలంగాణా మాండలిక మాధుర్యాన్ని చాలా అద్భుతంగా వ్యక్తం చేసింది.

అంటే తెలంగాణ భాషను ఎవ్వరూ పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ భాషకు ప్రాధాన్యత నిచ్చి తన కథల్లో తెలంగాణ భాష విశిష్టతను ఉదాహరణ సహితంగా వ్యక్తం చేసింది. ఈ కథాసంపుటితో పాటు “భావిక”, “ఉగాదికి ఉయ్యాల" అనే కవితా సంపుటిలను కూడా ఆమె వెలువరించింది.

అందులో కూడా తన స్త్రీ దృక్పథాన్ని గురించి చెప్తూ * స్త్రీలంటే ఎవరనుకున్నారు. మీరు దిశతిప్పిన బొమ్మలా, మీ చేతిలో చిల్విలా, మీకు వీచే విసనకర్రలా, మీకాళ్ళ సోపానాలా, సాగనివ్వం. ఇక ఈ పురుషుల హతకుల సార్వభౌమత్వం కూలిపోతుంది. ఈ ఎద్దు మొద్దుల అహంభావపు అధికారం. సాగుతుందిక స్త్రీ చైతన్య రథం' అని తన స్త్రీ దృక్కోణాన్ని, స్త్రీకి, పురుషుడికీ సమాన హక్కులుండాలనే దృక్కోణాన్ని తన కవిత్వంలో వ్యక్తం చేసింది.

సమతాభావనని తన కవితాసంపుటిల్లో వ్యక్తం చేసింది. ఈరకంగా ఒక పండితురాలిగా, ఒక వక్తగా, ఒక పరిశోధకురాలి గా, ఒక విమర్శకురాలిగా, ఒక కథకురాలిగా, ఒక కవయిత్రిగా విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషించి నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి యశోదా రెడ్డిగారు.