Jump to content

తెలంగాణ తేజోమూర్తులు/నటరాజ రామకృష్ణ

వికీసోర్స్ నుండి

97. నటరాజ రామకృష్ణ

-కళాకృష్ణ

భావ రాగ తాళం తెలిసిన నాట్య కళా ప్రపూర్ణులు భరతకళాప్రపూర్ణ బిరుదాంకితులు నటరాజ రామకృష్ణ. ఆయన నాట్యయోగి. తన జీవితాన్నే నాట్యకళకి అంకితమిచ్చిన మహామనిషి. నాట్య గ్రంథాల రచయితగా మరో భరతముని నాట్యమే అతని శ్వాస నిశ్వాసలు. ఆయన నిలువెత్తు నిండైన విగ్రహమే నాట్య కళ. అంగ, ఉపంగ, ప్రత్యంగ స్వరూపం శాస్త్రంలో చెప్పిన లక్షణ లక్ష్యాల శరీరాకృతి నటరాజ రామకృష్ణ. చతుర్విదాభినయాలు ఆయన ఆకారాన్ని ఆసరా చేసుకున్నాయి.

వారి మృదువైన హస్తవిన్యాసాలను 'ఆంగికాభినయం' ఆక్రమించుకొంటే చంద్రబింబంలాంటి ముఖ వర్చస్సును, విశాల నేత్రాలను 'సాత్వికాభినయం' స్వాధీన పరుచుకుంది.

వెండికొండలాంటి తెల్లని వస్త్ర ధారణనను మిణుకు మిణుకు మనే అబ్రకము మెరుపులను 'ఆహార్యాభినయం' అలంకరించుకొంది.

ఆయన సుస్వరాన్ని మృదుమధుర వాక్కులను 'వాచికాభినయం' వరించింది. ఉత్తముడు, సంస్కారవంతుడు, దయాశీలి, దానకర్ణుడు, కరుణా హృదయుడు, కళాకారుడు, కళా పోషకుడు, కళాప్రపూర్ణ రామకృష్ణ ఇన్ని సుగుణాలుండి తెలుగువారి నాట్యముద్దు బిడ్డగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతమే.

పూవు పుట్టగానే పరిమళిస్తుందంటారు పెద్దలు. ఆ పుష్పం, దైవారాధనకు, అలంకరణమే, సుగంధ ఘ్రాణానికి ఉపయోగపడుతుందంటారు. ఆ కోవకే చెందుతారు కీ.శే. నటరాజ రామకృష్ణగారు. నిశ్శబ్దం నుండి 'శబ్దమైన’ తరంగాలు సృష్ఠిలో లీనమై ఎన్ని రసాను భూతులను కలుగ చేస్తాయో అలాగే నాట్య శబ్దంగా జన్మించి నాట్యకళా చరిత్రలో లీనమై పరమాత్మ పద సన్నిధిని చేరిన పరమ పురుషుడు నాట్య కళా సవ్యసాచి నటరాజ రామకృష్ణ.

శివపార్వతుల తాండవ, లాస్య పద్ధతులను అర్ధ నారీశ్వరుడివలె తన నృత్య యాత్రలో పునరుద్ధరించి పునః సృష్టిచేసిన పుణ్యమూర్తి. మనిషి, ఎక్కడపుట్టి పెరిగినా, తన దేశానికి తన ప్రాంతానికి ఏమి చేసాడనేది ముఖ్యం. ఆ కోణంలో చూసినట్లయితే రామకృష్ణగారు నృత్యకళా ప్రపంచంలో ప్రథమ వ్యక్తి అని చెప్పవచ్చు.

తెలుగువారి స్త్రీల లాస్య నర్తనరీతులను "ఆంధ్ర నాట్యం”గా, పురుషుల పౌరుషేయ వీరరరస ప్రధాన్య 'పేరిణి'ని పునరుద్ధరించి ప్రచారంలోకి తెచ్చి ప్రపంచ నృత్య కళాచరిత్రలో శిఖరాగ్రాన్ని చేరుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగువారి నృత్య కళా విధానాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన నాట్యకళా వైతాళికులు డా॥ నటరాజుగారు.

బాల్యం గురించి

పుట్టింది బాలీ ద్వీపంలో అయినా బాల్యం అంతా సికింద్రాబాదు వారాసిగూడలోనే గడిచింది. కారణం తండ్రి రైల్వే అధికారి కావడం, 8వ ఏటనే తల్లిని కోల్పోయిన రామకృష్ణ, తండ్రి, ఆయాల పెంపకములో పెరిగారు. తండ్రిగారు రామకృష్ణ పరమహంస భక్తుడైనందున వారి పిల్లలకు రామకృష్ణ. శారద అని పేర్లు పెట్టుకున్నారు. ఏలోటు లేకుండా కుమారుడిని, కూతురిని పెంచి పెద్దచేసారు. రామకృష్ణ గారి తల్లి వరంగల్లు జిల్లా కొలనుపాక వాస్తవ్యురాలు, సంగీతంలో ప్రావీణ్యమున్న విదుషీమణి. తండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజోలు వాస్తవ్యులు. ఉద్యోగ రీత్య తెలంగాణ ప్రాంతములో నున్నందున కొలనుపాక వాస్తవ్యురాలిని పెళ్లి చేసుకొని హైదరాబాదులోనే స్థిరపడి రామకృష్ణ మిషన్తో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకున్నారు.

బాల్యం నుండి రామకృష్ణ నృత్యం వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుసుకొన్న తండ్రి మనం నాట్యం చెయ్యకూడదు మనం నాట్యకళా పోషకులం మాత్రమే అని హెచ్చరించారు. కాని రామకృష్ణగారు చాటు మాటున నృత్యకళాకారులను చూడడము, అనుకరించడము మొదలు పెట్టాడు. ఇవన్నీ సోదరి చూసి తండ్రికి ఫిర్యాదు చేసేది. ఆయన రామకృష్ణను దండించేవారు. అయినా పరిస్థితి యథాతథంగా ఉండేది.

మద్రాసులో విద్యాభ్యాసముఁ

ప్రాథమిక విద్యను సికింద్రాబాదులో ముగించి మాధ్యమిక విద్యకు మద్రాసు మైలాపూర్ రామకృష్ణ మఠానికి చెందిన స్కూలుకు కూతురు శారదను, రామకృష్ణను పంపించారు. కారణము క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన ఏర్పడి విద్యావంతులవుతారని. ఆ బాధ్యతను స్వామి శాశ్వతానంద గారు స్వీకరించారు. రామకృష్ణను చూడగానే మరో వివేకానందుడు అవుతాడేమోనని ఆ ముఖ వర్చసు విశాల నేత్రాలను చూసి ఆశపడ్డారు స్వామి శాశ్వతానంద. (ఆయనను నేను చూసాను) ఆ మఠ గ్రంధాలయములోనే ఆధ్యాత్మిక ఆగమ గ్రంథాలను చదివి నాట్యకళలో అభిరుచిని పెంపొందించుకున్నారు. నాట్యాన్ని అభ్యసించాలని మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద శిష్యునిగా చేరి భరత నాట్యం నేర్చుకున్నారు. నాట్యంపైగల అభిరుచిని ఆసక్తిని చూసి స్వామిజీ సంతోషించేవారు. రామకృష్ణను ప్రత్యేకంగా చూసేవారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి బాధపడి ఎంత చెప్పినా వినడము లేదని ప్రహ్లాదుని హరినామ స్మరణ వలె రామకృష్ణ నాట్య స్మరణ ఎక్కువైనదని భావించి ఎలాగైనా మాన్పించాలని నిశ్చయించు కొన్నాడు. నాగపూర్ - నటరాజ బిరుదు

నాట్యం నుండి దృష్టి మరల్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నత విద్యకొరకు నాగపూర్ పంపించడము జరిగినది. అక్కడ కూడా రామకృష్ణ మిషన్లో ఉండేవారు. రామకృష్ణగారు ఎట్టి పరిస్థితుల్లోను నాట్యం చేయడముగాని, నేర్చుకోవడము కాని జరుగకూడదని తండ్రిగారు గట్టిగా శాసించారు. అలా జరిగినట్లయితే నీకు నాకు మన కుటుంబముతో ఎలాంటి సంబంధముండదని హెచ్చరించారు. చివరికి ఎక్కడా మాపేరు కూడ ఉచ్చరించరాదని బెదిరించారు. తండ్రిగారి మాటకాదనలేక నాట్యకళపైనున్న మమకారం చంపుకోలేక ఏకాంతంగా ఎన్నోసార్లు దుఃఖించారట. అది చూసి స్వామిజీలు ఓదార్చేవారట. (ఇది స్వామి స్వరూపానంద గారి నుండి నేనువిన్న విషయం).

పట్టువీడని విక్రమార్యునివలె తండ్రి వెదిరించి నాట్యకళపై మొగ్గు చూపుతూ విద్యలో కూడ ప్రథమ శ్రేణి నందుకున్నారు. యూనివర్శిటీలో బి.ఎ. చదువుతూ ఆ ప్రాంతముననున్న గురువులు సిద్ధాణీ, చంపాబాయిల వద్ద కథక్, టుమ్రీ, గజల్స్క అభినయం నేర్చుకొన్నారు. అప్పటికే నాయుడుపేట రాజమ్మవద్ద అభినయం నేర్చుకొన్నందున కొంత సులభతరమైంది.

అదే సమయములో రామకృష్ణ మఠం వదిలి వేయడం తండ్రి సహాయాన్ని నిరాకరించడము రామకృష్ణకు ఆహారము సరిగా లేక బీదరికం ప్రారంభమైనది. బీదరికాన్ని ఆకలిని అధిగమించి నృత్య సాధన చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు. నృత్య కళపై నున్న ఆసక్తిని గమనించి స్థానికులు తెలుగువారు సహాయ సహకారాలు అందించి నృత్య కళాసాధనకు తోడ్పడ్డారు.

నాట్య కళా ప్రదర్శనలు, నాట్యకళలో కృషి, ఆ కళాసక్తిని వారి ద్వారా, వీరి ద్వారా తెలుసుకున్న బండారు సంస్థానాధీశులు శ్రీ గణపతిరావు పాండేగారు రామకృష్ణ స్నేహితులు రాంభావ్ సర్దేశ్ గారి ద్వారా ఆహ్వానాన్ని పంపి రామకృష్ణ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేసారు. అప్పటికే ఆ ఆస్థానంలో రాం గడ్ కు చెందిన ఆస్థాన నర్తకులు కళ్యాణీ కార్తిక్ లు నృత్య ప్రదర్శనలిచ్చి ప్రశంసలందు కున్నారు.

ఎంతో మంది సంగీత విజ్ఞులు, నాట్యకళాకారులున్న ఆ సంస్థానంలో ప్రదర్శించడము ఒక ప్రక్క సంతోషంగా ఉన్న మరో ప్రక్కన సవాలుగా మిగిలింది. రాంభావ్ కృష్ణగీతాన్ని హిందీలో ఆలపిస్తుండగా రామకృష్ణ మైమరిచి నృత్య, అభినయాలను తాళ, లయలకు పోటీగా నర్తిస్తుంటే చూసే ప్రేక్షకులు పండితులు పరవశించిపోయారు. తన్మయత్వంతో ఆనందముతో మైమరచిపోయి రాజుగారు లేచి వారెవాహ్ 'నటరాజ్' అని ఆలింగనం చేసుకొన్నారట. నాటి నుండి రామకృష్ణ 'నటరాజ రామకృష్ణ' అయ్యారు.

తండ్రిగారు ఇంటిపేరు కూడ చెప్పకూడదని చెప్పడం వల్ల ఆ నటరాజు బిరుదే ఇంటి పేరుగా పెట్టుకున్నారు.

అప్పటి వరకూ ఆర్థిక బాధలతో అర్థాకలితో గడిపిన జీవితానికి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆనాటి నుండి నటరాజుగారు నాట్యకళను ఒక దీక్షగా, పట్టుదలగా, ఆలోచనగా, తపనగా తన జీవన గమనమే నాట్యకళా యాత్ర సాగించారు.

నెల్లూరు, గుంటూరు, విశాఖపట్టణంలో నృత్య కళా ప్రచారం

తెలుగువారి కృత్య కళలు, చరిత్ర, సంస్కృతి గొప్పతనాన్ని తెలుగు ప్రాంత ప్రజలకు ప్రచారం చేసే ఉద్దేశంతో నాగపూర్ వదలి ముందుగా నెల్లూరు చేరుకున్నారు. అందుకు సహకరించిన పెద్దలు శ్రీ రమణారెడ్డిగారు (సినీనటులు). రెడ్డి ఆశ్రయాన్నిచ్చి, పెద్దలను పరిచయం చేసి నృత్య సంస్థ స్థాపించడానికి సహకరించారు. అప్పటి వరకు ఉన్నత కుటుంబాల బాలికలు, నృత్యం నేర్చుకోవడము తప్పుగా భావించిన పిల్లలను ఆ సంస్థలో చేర్చి నృత్యం నేర్పడము ప్రారంభించారు.

ఆ సంస్థ నుండే శ్యామకౌండిన్య అనే నర్తకి అనేక ప్రదర్శనలిచ్చి నాట్య కళా ప్రచారానికి నటరాజ రామకృష్ణగారికి సహకరించింది. ఒకవైపు శిక్షణ, మరొక వైపు పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రదర్శనా పూర్వక ప్రసంగాలతో అటు విద్యార్థులకు ఇటు ప్రజలకు అవగాహన కల్పించారు. వారి కృషిని ప్రచారాన్ని చూసిన పలువురు ప్రశంసించగా "జమీన్", "ఆంధ్రప్రభ', 'ఆంధ్రపత్రికలవారు నటరాజుగారు వ్రాసిన వ్యాసాలను ప్రచురించసాగాయి.

రామకృష్ణగారు నాగపూర్లో ఉన్నప్పుడే నాట్యకళ గురించి 'నృత్యాంజలి' అనే పేరుతో వ్యాసాలు వ్రాసి ఆంధ్రప్రభ పత్రికలకు పంపేవారు. ఆ వ్యాసాలతో తెలుగువారి నృత్యకళపై ఆదరణ గౌరవము పెరిగి ప్రతివారు వారి పిల్లలకు నృత్యం నేర్పించాలని నిర్ణయించుకున్నారు.

నృత్యకళ గురించి వ్యాసాలు వ్రాయడం గాని, ప్రదర్శన పూర్వక ప్రసంగాలు చేసేవారుగాని లేనందున నటరాజుగారికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. సరళమైన భాష చదువరులను ఇట్టే ఆకర్షించే వ్యాసాల తీరును చూసిన అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వర్లుగారు. ఆశ్చర్యపోయి మెచ్చుకొన్నారట. వారి మేనమామ గుంటూరులో నివసించేవారు. విషయం తెలుసుకొన్న వారి మేనమామ గుంటూరుకు ఆహ్వానించి వారి పిల్లలకు నాట్యం నేర్పమన్నారట. ఆ విధంగా మకాం నెల్లూరు నుండి గుంటూరు మార్చుకొన్నారు రామకృష్ణగారు. అచ్చట కొంత కాలం ప్రచారం, శిక్షణనిస్తున్న సమయంలో విశాఖ పట్టణం సంగీత సభవారు నృత్య ప్రదర్శన ఇవ్వమని ఆహ్వానించారు. ఆ ప్రదర్శనకు ప్రముఖులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు కృష్ణన్ గారు, తెన్నేటి విశ్వనాథంగారు. ఆ ప్రదర్శన చూసిన పెద్దలు, పండితులు, నాట్యాభిమానులు ప్రశంసించి విశాఖ పట్టణంలో నృత్య కళా ప్రచారము చేయమని తద్వారా నాట్యకళ నలుమూలలా ప్రచారం అవుతుందని సలహానిచ్చారు. వడ్డాది బాపిరాజు గారు కూడ అదో విషయం చెప్పి వారింట్లోనే వారి తమ్ముడు కూతురుకు శిక్షణ నివ్వమని అడిగారు. వారే నేటి ప్రఖ్యాత నృత్యకళాకారులు గురువులు ఉమారామారావు. సుమతీ కౌశల్, సినీనటి చంద్రకళ కూడ నటరాజ రామకృష్ణ వారి వద్ద నృత్యం నేర్చుకున్నారు.

వారు విశాఖపట్టణంలో ఉన్నపుడే ప్రఖ్యాత కూచిపూడి నాట్యగురువు వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రిగారి వద్ద కూచిపూడి, పెందేల సత్యభామగారివద్ద నవజనార్ధనము అభ్యసించారు. విశాఖలో నున్నపుడే బొబ్బిలి, మాడుగుల విజయనగర సంస్థానాలను సందర్శించి అచ్చటనున్న సంగీత నృత్యకళలను కళాకరులను కలుసుకొన్నారు. వారి అనుభవాలు, సంప్రదాయ పద్ధతులు శాస్త్రం గురించి తెలుసుకొని వాటి గురించి ప్రసంగాల్లో ప్రస్థావించేవారు.

బడే వెంకటరత్నం, జీవరత్నమ్మ కళావరురంగు మద్దెలరాయుడు గంధం లక్ష్మీకాంతము మొదలగు ఆరాధన ఆస్థాన నర్తకీమణులను కలిసి వారి నృత్య విశేషాలను, ఆలయ ఆస్థాన పారిజాత సంపూర్ణ నృత్య స్వరూపము తెలుసుకొని గ్రంథస్తము చేసారు. కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు పర్యటించి వివిధ నృత్య సంప్రదాయాలను చూసి, విషయసేకరణ చేసి, కొన్ని నేర్చుకొని నాట్యంపై దాదాపు 40 పుస్తకములు వ్రాసారు. అందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ బహుమతులు కూడ గెలుచుకున్నారు. ముఖ్యమైనవి దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర, డాన్సింగ్ బెల్స్ (తెలుగు అనువాదము నర్తనబాల).

విస్సా అప్పారావుగారి పరిచయముతో క్షేత్రయ్య పదాల అభినయం ప్రదర్శనలు, పరిశోధనలు చేసారు. వారితో ప్రయాణించి ఇతర రాష్ట్రాలల్లోని పండిత సభల్లో పాల్గొన్నారు. ప్రతి అంశానికి సంప్రదాయ వ్యాఖ్యానం వ్రాసుకొని అలవోకగా పండితులను పామరులను మెప్పించేవారు. హైదరాబాదులో స్థిర నివాసము తెలంగాణ ప్రాంతంలో నృత్యకళాసేవ:

హైదరాబాదులో నివాస మేర్పరచుకొన్న తరువాత ఉమారామారావు, సుమతీ కౌశల్తో పాటు ఎందరో నృత్య కళను నేర్చుకొని ప్రదర్శనలిచ్చారు. హైదరాబాదులో ఎ. ఆర్. కృష్ణగారు, శ్రీనివాసాచార్యులవారు, గోపాల్ రాజు, భట్, మొదలయిన నాటక, కళాకారులతో పరిచయం ఏర్పడింది. ఆలంపూర్లో జరిగిన సాహిత్య సారస్వత సభల్లో నటరాజుగారిని నాట్యంపై ప్రసంగించమని కోరారు. ప్రసంగానంతరము పెద్దలందరూ తెలుగువారికి, తెలుగు నాట్యానికి గర్వించదగ్గ వ్యక్తి రామకృష్ణగారని పొగిడారు. ఎ.ఆర్. కృష్ణగారితో కలిసి తెలంగాణ ప్రాంతాన్నంతటనీ సందర్శించి సంగీత నృత్య సంప్రదాయాల గురించి తెలుసుకొన్నారు. ఇతర తెలుగు ప్రాంతాలకంటే తెలంగాణ ప్రాంతం కళలకు వెనుక బడినదని గ్రహించారు.

ఉత్తమ కళాకారులు, కళాసంపద, చరిత్ర, శిల్పకళ సంగీత నృత్యకళాకారులున్నప్పటికి ఆదరణ, పోషణ లేక కళాకారులు, కళారీతులు మరుగున పడ్డాయని తెలుసుకొన్నారు. ముఖ్యకారణం ఆనాటి దేవదాని చట్టం. సమాజంలో జమీందారులు, దొరలు, సామంతులు ఆ కళాకారులను వారి అవసరాలకు ఉపయోగించుకొని చిన్న చూపు చూడడం, ఇతర తెలుగు ప్రాంత స్త్రీ నర్తకులవలె తెలంగాణ స్త్రీ నర్తకులు సాహసించక పోషకుల ఆధీనులయి అవమానింప బడ్డారు. అదే తెలంగాణ సంగీత నృత్యకళలు క్షీణించడానికి కారణము. ఈ పరిస్థితులకు చేయూత నివ్వాలని ఆనాటి సంగీత నాటక అకాడమీ సహాయాన్ని కోరారు.

వారి నృత్య నికేతనంలో చేరిన వారిలో కొందరికి ఉచితంగా కూడా నృత్యం నేర్పించేవారు. శ్రీనివాసకళ్యాణం కుమార సంభవం, మేఘ సందేశం వంటి నృత్య నాటికలను తయారు చేయుటకు సంగీత నాట్యకళాకారులను వివిధ ప్రాంతాల నుండి రప్పించి భోజన, వసతులిచ్చి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అందులో ఉజ్జయినిలో జరిగిన ప్రదర్శనకు కుమార సంభవానికి బంగారు కలశం బహుమతిగా గెలుచుకొన్నారు.

తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోనసీమ, తూర్పు ప్రాంతాలను పర్యటించి, పరిశోధన చేసి మరుగున పడిన ఎన్నో నృత్య రీతులను వెలికి తీసి ప్రచారములోకి తెచ్చారు. దాదాపు 250 నుండి 300 మంది స్త్రీ నర్తకులను తెలుగు ప్రాంతములో కలుసుకొని సంప్రదాయ పద్ధతులను తెలుసుకొని గ్రంథస్థము చేసారు. దేవదాసీలు రాజదాసీల నాట్య విరమణతో వారి విశిష్ట కళ మరుగున పడకూడదని కొత్త పోకడలతో నవీన రంగ స్థలముపై ప్రదర్శించే ఒక క్రమాన్ని ఏర్పాటు చేసారు. హైదరాబాదు అల్వాలు వెంకటేశ్వర ఆలయ నర్తనరీతులు నర్తకీమణులను, వర్ధల్ ఆలయ నర్తకీమణి రమామణి మొదలుకొని ధర్మపురి, పెద్దపల్లి, నిజామాబాదు, మానకొండూరు, ఇల్లంతకుంట, గద్వాల, వనపర్తి, జటప్రోలు, మహబూబ్నగర్, శ్రీరంగపురం, నల్లగొండ, వరంగల్లు, ఆదిలాబాదు మొదలగు ప్రాంతాల్లో నున్న స్త్రీల నర్తనరీతులను, ఆంధ్ర, రాయలసీమల్లో నున్న నర్తనరీతులను ఒకే తాటిపైకి తెచ్చి వివిధ పేర్లతో పిలువబడుచున్న ఆ నృత్య కళలకు ఆంధ్ర నాట్యమనే నవీన నామకరణం చేసారు. ఇది 1970లో జరిగింది. అప్పటికి తెలుగువారందరు ఒకే రాష్ట్రంలో నున్నారు. ఈ సదస్సులకు, కార్యక్రమాలకు కంకణం కట్టుకున్న వారిలో ముఖ్యులు అన్నాబత్తుల బులి వెంకటరత్నమ్మ, ప్రముఖ నృత్య కళాకారిణి, ముమ్మిడివరం వాస్తవ్యులు, గొల్లకలాపం ప్రదర్శించుటలో ప్రసిద్ధురాలు.

పేరిణి తాండవము:

బాల్యమంతా భాగ్యనగరంలో గడిచింది. కొన్నేళ్ళ తరువాత హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. తల్లిగారి జన్మస్థలం కొలను పాక. తెలుగువారి ఇతర ప్రాంతాలకంటే తెలంగాణ ప్రాంతమంటేనే ఇష్టం. తరుచు కొలనుపాక వెళ్ళి శివాలయంలో పూజలు చేసి దాన ధర్మాలు చేసేవారు (నేను వారితో పాటు వెళ్ళేవాణ్ణి).

ఆయన నృత్యకళా పరిశోధనలో, ఎందరో సంగీతజ్ఞులను, వాద్యకాండ్రను, నృత్యకళాకారులను సందర్శించినప్పటకీ ఇంకా ఏదో అసంతృప్తి ఉండేదట. ఎవరూ చేయనిది, చరిత్రలో చిరస్థాయిగా నిలిచేది రూపకల్పన చేసి భారతీయ నృత్యకళకు అంకితమివ్వాలని నిశ్చయించుకొన్నారు. ఆ పరిశోధన ఫలితమే పేరిణి పునఃసృష్ఠి. మగవారిలోని మగటిమిని, పురుషుడు పురుషునిగానే నర్తించే వీరరస ప్రాధాన్య పేరిణిని రూపకల్పన చేయాలని, అది అన్ని నాట్య ప్రక్రియల కన్నా భిన్నంగా ఉండాలని ఆలోచించి లభ్యంగా నున్న నాట్యశాస్త్ర గ్రంథాలను, నాట్యానికి సంబంధ మున్న ఇతర శిల్పకళ, చిత్రకళ, సాహిత్యాన్ని అవపోసన పట్టి పూర్తిగా మరుగునపడి ఆనవాలు కూడ లేని పేరిణిని 1973న పునఃసృష్టి చేసి ప్రజల ముందుంచారు. ప్రశంసలున్న చోట విమర్శలున్న పట్టించుకోకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, నృత్య అకాడమీల సహాయంతో నాట్య కళాకారులను వాయిద్య కళాకారులను తయారు చేసి దేశమంతా శభాష్ అనే విధంగా ప్రచారం చేసారు. తెలుగు వారి పౌరుషేయనృత్యం అంటే 'పేరిణి' అనుకునేలా చేసారు. ప్రపంచ నృత్య కళలోనే ఇది కలికితురాయిలాంటిది. అది తెలంగాణ ప్రాంతములో రూపకల్పన జరిగినందున ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దానికి ప్రాముఖ్యతనిచ్చి ప్రచారము చేస్తున్నది. కొన్ని మార్పులు చేసి నిపుణులను సంప్రదించి ఒక శాస్త్రీయ నృత్యకళకుండవలసిన సూత్రాలను జోడించి ఈ రాష్ట్ర నృత్యకళగా భవిష్యత్తరానికి అందించాలని భావిస్తుంది. అది జరిగిననాడు నటరాజుకు నిజమైన శాశ్వతమైన గుర్తింపు లభించినట్లవుతుంది.

తారామతి ప్రేమావతి - వారి సంగీత నృత్యకళ పరిశోధన:

నిజాం పరిపాలనలో ఎందరో నృత్య సంగీత కళాకారులు వారి భాషలో ఆడి పాడి మెప్పించి ఒప్పించారు. కుతుబ్ షాహి కాలంలో ప్రముఖ నర్తకులుగానున్న తారామతి, ప్రేమావతులు ముఖ్యులు. క్షేత్రయ్య గోలుకొండ కోటను సందర్శించినపుడు ఈ నర్తకీమణులు నాట్యం చేసేవారట. వారెంతటి గొప్ప కళాకారులు కాకపోతే కుతుబ్షాహీల సమాధి ప్రక్కల సమాధి కట్టిస్తారు. వారి పేరుమీద గ్రామాలు ఇస్తారు! వారి పేరు మీద చారిత్రక కట్టడాలు కట్టిస్తారు! వారి సంగీత నృత్యకళలను ప్రపంచానికి తెలియజేయడానికి హిందు ముస్లిం ఐకమత్యాన్ని తెలిపేందుకు చిహ్నాలైన తారామతి బారామతి ప్రేమావతి మందిరాలను దర్శించి పాతబడి కూలిపోతున్న దశలో వున్నవాటిని వారి స్వంత ధనాన్ని ఖర్చు చేసి శుభ్ర పరచి వాటి విలువను, ఆనాటి సంగీత సంప్రదాయాలను వ్యాసాలుగా చిన్న పుస్తకాలుగా ప్రచురించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వాటి విలువను ఆ కళామూర్తుల గౌరవాన్ని తెలియచేసారు. దాదాపు 8 సం॥లు కష్టపడిన తరువాత ప్రభుత్వము వారు పట్టించుకొని తారామతి బారాదరిని కొత్త అందాలతో టూరిస్టులను ఆకర్షించే విధంగా నేడు రూపుదిద్దారు. ఇదంతా నటరాజ రామకృష్ణ కృషి పరిశోధనా ఫలితమే. కుతుబ్షాషావాల తరువాత ఆ కట్టడాల గురించి, పవిత్రత గురించి ప్రచారములోకి తెచ్చింది కేవలము నటరాజ రామకృష్ణగారి, దానికి ప్రతిఫలంగా ఆయన ప్రభుత్వం నుండి చిల్లిగవ్వకూడా ఆశించలేదు. తండ్రి ఆస్తిపాస్తులనే ఆశించని ఆయన ఇతరుల నుండి ఏమి ఆశిస్తారు. అందుకే చాలా మంది నీవు సాధువులాంటివాడవని అనేవారు.

ఆయన నృత్యకళకు చేసిన సేవలో లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు, అవార్డులు, రివార్డులు, గౌరవ డాక్టరేటులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల గుర్తింపులు బంగారు. కిరీటాలు మొదలగునవెన్నో ఎన్నెన్నో. కానీ మదర్ థెరిసా చేతుల మీద సన్మానము పొందినపుడు నా జీవితానికి ఇది పెద్ద కిరీటమని సంతోషించారు.

తెలంగాణ ప్రాంత మారుమూల గ్రామానికి చెందిన నన్ను చేరదీసి రాయిలా ఉన్న నన్ను నృత్యరత్నంలా మలిచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు నిప్పించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువుగా జీవితాన్నిచ్చారు. తల్లిలా ప్రేమగా లాలించి, తండ్రిలా క్రమశిక్షణ నేర్చి గురువుగా విద్యా బుద్ధులు చెప్పించి గురువు అనే పదానికి నిర్వచనమయ్యారు. 35 సం॥ల వారి శిష్యరికంలో ఎప్పుడూ ఎవరికీ దక్కని అదృష్టం నాకు దక్కింది. అదే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించడము. నా ఈ జీవితానికి అది చాలు.