Jump to content

తెలంగాణ తేజోమూర్తులు

వికీసోర్స్ నుండి
​
​తెలంగాణ తేజోమూర్తులు

(153 మంది ప్రముఖుల జీవన చిత్రాలు)

                                    సంపాదకులు
                                     మామిడి హరికృష్ణ
                                    విష్ణుభట్ల ఉదయశంకర్


                                    సలహామండలి

డా. అమ్మంగి వేణుగోపాల్ డా. ఎస్.వి. రామారావు డా. సంగనభట్ల నర్సయ్య డా. సంగిశెట్టి శ్రీనివాస్ శ్రీరామోజు హరగోపాల్ డా. ఆర్. కమల డా. నాగబాల సురేష్ కుమార్ చావలి దేవదాస్ సి. ఎస్. రాంబాబు ఎన్. విజయ రాఘవరెడ్డి






- నిర్వహణ కూర్పు అయినంపూడి శ్రీలక్ష్మి భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్. ఫోన్ : 040-23212832 ​

TELANGANA TEJOMURTHULU
(A Biographical collection of AIR Talks on 153 Luminaries of Telangana)


Edited by
Mamidi Harikrishna, Director
Dept. of Language and Culture, Telangana.
V. Udaya Sankar, Director
All India Radio, Hyderabad.


Dept. of Language and Culture


First Edition:
2017 December
1000 copies


ISBN: 978-81-936345-7-8


Price: Rs. 950/-


Layout & Design
Padma, Raja Kishore


Publisher
The Director, Dept. of Language and Culture,
Kalabhavan, Ravindra Bharathi,
Hyderabad.


Printed at
Rainbow Print Pack
Hyderabad. Ph: 040-23731620


For Copies
The Director, Dept. of Language and Culture,
Kalabhavan, Ravindra Bharathi,
Hyderabad. Ph: 040-23212832


Cover
Cheryala Ravi Shankar ​

తెలుగు సాహితీ జగతి - తెలంగాణ ఘనకీర్తి


తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగుభాష కీర్తి పొందింది. నికోలె డి కాంటి అనే పాశ్చాత్య పండితుడు తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా కొనియాడారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి 'సుందర తెలుంగు' అని కీర్తించారు.

మన తెలంగాణ ప్రాచీనకాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం. చరిత్రకు అందినంత వరకు తెలంగాణలో 2000 ఏండ్ల పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన హాలుని 'గాథా సప్తశతి'లో తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు కనిపిస్తున్నాయి.

కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలమ్మ గుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం కంద పద్యాలలో ఉండటం విశేషం. దీనిని బట్టి క్రీ. శ. 947 నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెబుతున్నది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ఉరుతర గద్య పద్యోక్తుల కన్న సరసమైన పరగిన జాను తెనుగులో కావ్యసృష్టి చేస్తానని ప్రతిజ్ఞ చేసి, అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి.

అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది

తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన 'బసవ పురాణం' తొలి శతకం 'వృషాధిప శతకం', తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం పాల్కురికి సోమన వెలువరించిన అనర్ఘ కావ్యరత్నాలు, తొలిగా సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీనిని బట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం.

తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోన బుద్ధారెడ్డి వెలువరించిన 'రంగనాథ రామాయణం' తెలుగులో తొలి 'ద్విపదకావ్యం'. మెదక్ జిల్లా పటాన్ చెరువు నివాసి పొన్నిగంటి తెలగన రచించిన 'యయాతి చరిత్రం' తొలి అచ్చ తెలుగు కావ్యం. సకల నీతి సమ్మతం అనే తొలి నీతిశాస్త్ర గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథాసంకలన కావ్యం 'సింహాసన ద్వాత్రింశిక'ను రచించిన కొఱవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి. చాటు పద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది వేములవాడ.

'వాణి నా రాణి' అని ప్రకటించిన 'జైమినీ భారత' కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి. రాచకొండనేలిన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా. తెలుగువారి పుణ్యపేటిగా భావించే బమ్మెర పోతన రచించిన 'శ్రీమద్భాగవతం' మధురభక్తికి, మంజుల పదవిన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి అలవాలమై అజరామర కీర్తి పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్ర్యర్థి, చతురర్థి కావ్యాలు, చిత్ర, బంధ అవధాన పదవిద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు. ​ నిరక్షరాస్యులైన శ్రామికుల నోటి నుంచి ఆశువుగా వెలువడి, అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. ఆయా శ్రమ సందర్భాల్లో పాడుకునే నాటుపాటలు, రాటు పాటలు, మోటపాటలు, కల్లాలదగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటల్లో పల్లె జనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమి పాటలు, అసోయి ధూల అని పాడే పీరీల పాటలు ప్రజల సంఘజీవన సంస్కృతిని చాటుతున్నాయి.

ఒకతరం నుంచి మరోతరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గు కథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటలు ఇంకా ఎన్నో విశిష్ట, విలక్షణ కళారూపాల్లో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది.

పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రే చరిత్రగా చలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల గురించిన చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒకదశలో 'తెలంగాణలో కవులే లేరు' అనే స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలు చోటుచేసుకున్నాయి.

ఆ సందర్భంలోనే మహెూన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి, పండితుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో శ్రమకోర్చి, తెలంగాణ నాలుగు చెరుగులా తిరిగి, 354 మంది కవుల రచనలతో 'గోలకొండ కవుల సంచిక'ను వెలువరించారు. అది మన స్వాభిమాన ప్రతీక. సాహిత్య జయపతాక, జలపాత సదృశమైన ధారతో, అద్భుతమైన ప్రౌఢిమతో 'అగ్నిధార', 'రుద్రవీణ' వంటి పద్య కావ్యాలను సృజించిన మహాకవి దాశరథి ‘'నా తెలంగాణ తల్లి కంజాత వల్లి' అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించారు. 'భూగర్భమున గనులు, పొంగిపారే నదులు నా తల్లి తెలంగాణరా! వెలలేని నందనోద్యానమ్మురా!' అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకట రామారావు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు.

వెక్కిరించిన వారికి కాళోజీ కవితలు దీటైన సమాధానం

ప్రజాకవి కాళోజీ తన కవితలతో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పతనాన్ని ప్రకటిస్తూనే, తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించినవారికి దీటైన సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు తమపై అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉన్నది.

నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలిజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృత నిశ్చయంతో కృషి చేస్తున్నది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షుడిగా ప్రసిద్ధ కవి నందిని సిధారెడ్డిని నియమించి, సారథ్య బాధ్యతలు అప్పగించింది.

అలాగే, డిసెంబర్ 15 నుంచి 19 వరకు (ఐదు రోజులపాటు) తెలంగాణలో మహోత్సవంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని భావించింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వివిధ అంశాలపై పుస్తకాల్ని ప్రచురించడం అత్యావశ్యకం. ఈ పుస్తకాలు వివిధ రంగాలలో తెలంగాణ జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిక్సూచిగా ఉంటాయి. ఈ దిశగా చొరవ చూపి అందంగా, హృద్యంగా ప్రచురించిన భాషా సాంస్కృతిక శాఖను అభినందిస్తున్నాను.

గౌ॥ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖరరావు
ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

​
          కృతజ్ఞతలు
-
శ్రీ అజ్మీరా చందూలాల్ గారు మంత్రి వర్యులు
|
డా. కె.వి. రమణాచారి ఐ.ఎ.యస్.(రి) ప్రభుత్వ సలహాదారు
శ్రీ రసమయి బాలకిషన్ అధ్యక్షులు, సాంస్కృతిక సారథి
|
డా॥ నందిని సిధారెడ్డి చైర్మన్, సాహిత్య అకాడమి
బుర్రా వెంకటేశం, ఐ.ఎ.యస్. ప్రభుత్వ కార్యదర్శి
|
శ్రీ దేశపతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి








- మామిడి హరికృష్ణ ​

ధన్యవాదాలు

'తెలంగాణ తేజోమూర్తులు' పేరుతో వస్తున్న ఈ 153 వ్యాసాల సంకలనం ఓ అరుదైన, అపురూప ప్రయత్నం. దీనిని సాకారం చేసి చూపించిన తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిబ్బందికి కృతజ్ఞతలు.

తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం చేస్తున్న సాహితీ సేద్యానికి నిత్యస్ఫూర్తి ప్రధాతగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు!

రవీంద్ర భారతి ప్రాంగణానికి సరికొత్త సొబగును అద్దుతూ 2017 ఏప్రిల్ 4వ తేదీన తెలంగాణ తేజోమూర్తుల్ని (చిత్ర పటాల్ని) ఆవిష్కరించిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

సాహితీ, సాంస్కృతిక, కళారంగాలలో తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడంలో మా శాఖ చేస్తున్న కృషికి నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తూన్న మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారికి, ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి ఐ.ఎ.యస్.(B) గారికి, సాంస్కృతిక సారథి అధ్యక్షులు శ్రీ రసమయి బాలకిషన్ గారికి, సాహిత్య అకాడమి చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం ఐ.ఎ.యస్. గారికి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.

ఈ సాంస్కృతిక యజ్ఞంలో తమవంతు పాత్రను విజయవంతంగా పోషించిన ఆకాశవాణి సిబ్బందికి ముఖ్యంగా చావలి దేవదాసు గారు, సి.యస్. రాంబాబు గారు, ఎన్. విజయ రాఘవ రెడ్డి గారికి ధన్యవాదాలు. పుస్తక కూర్పులోను, నిర్వహణలోను అంతా తానై నిలబడ్డ అయినంపూడి శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు

సహకారం అందించిన జమ్ముల శ్రీహర్ష, ధాత్రిక సాయి రఘునాథచరణ్, తమనం నాగేశ్వరావు, గోపిశెట్టి కార్యవర్ది, పి.వి.జి. సతీష్ లకు ధన్యవాదాలు.

ఈ సంపుటిలోని పరిశోధనా వ్యాసాలను రచించడమే కాకుండా అవసరమైన సమాచారాన్ని కూడా అందించిన పరిశోధకులు, రచయిత (త్రు) లకీ, ప్రూఫ్ చూసిన మధుకర్ వైద్యుల, సౌమ్య, శ్రీధర్ కు, ప్రచురించిన రైనో ప్రింట్ ప్యాక్ నరేంద్రగారికి, భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది రఘునందన్, నాగరాజు, ప్రసాద్, స్రవంతి, ఇతరులకి ధన్యవాదాలు....

- మామిడి హరికృష్ణ
విష్ణుభట్ల ఉదయశంకర్
(సంపాదకులు)

​

ప్రాతః స్మరణీయులు!


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే - తెలంగాణలో ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, సాహితీ మిత్రులు, సాంస్కృతిక మిత్రులు ఈ తెలంగాణా జాతిని జాగృతం చేసిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ తరం వారు, భావితరం వారు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రాతః స్మరణీయులు, చిరస్మరణీయులు.

ఎవరు తెలంగాణా వైతాళికులు, తేజోమూర్తులు అనే విషయం మీద మనం ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ వైతాళికులు అనే పదమే ఎంత పవిత్రమో! ఎంత ఉదాత్తమో! ఎంత సమున్నతమైన పదమో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఒక జాతిని సుసంపన్నం చేస్తారో, జాగృతం చేస్తారో, చైతన్య పరుస్తారో, ఎవరి ద్వారా సమాజంలో ఒక పెద్ద కదలిక వస్తుందో ఆ మార్పుకి కారణమైన వారే వైతాళికులు. ఆ రకంగా తెలంగాణాలో ఎంతో మంది వైతాళికులు ఉన్నారు. అందరినీ మనం ఒకేసారి చెప్పడానికి గాని, చూపడానికి గాని, తెలపడానికి గాని ఇబ్బంది కలగొచ్చు. అందుకే ఒక చిరు ప్రయత్నం. అందుకే ఈ మంచి ప్రయత్నంలో ఎంతోమంది మన దృష్టిలో ఉన్నా, కొద్ది మందినైనా ముందు మనం పరిచయం చేసి ఈ తరం వారు, భావితరాల వారు తలచుకొనేట్టుగా, మదిలో పదిల పరచుకునేట్టుగా జీవిత పరిచయ వ్యాస సంకలనాన్ని భాషా సాంస్కృతిక శాఖ, ఆకాశవాణి కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.

తెలంగాణా తేజోమూర్తులలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వారు ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి గారంటేనే మనకు "గోల్కొండ" పత్రిక జ్ఞాపకం వస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి గారంటేనే నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి ఆ 1930వ సంవత్సరం గుర్తొస్తుంటుంది. "గోల్కొండ కవుల సంచిక గుర్తొస్తుంది. ఆనాటి నగర కొత్వాల్గా ఉన్న రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి గారి కోరిక మేరకు "హిందువుల పండుగలు" అనే గ్రంథాన్ని వ్రాయడమనేది, ముస్లిం పరిపాలనలో ఒక గొప్పనైన విషయం! అన్నిటికంటే మించి 1949లో “ఆంధ్రుల సాంఘిక చరిత్ర"ను మనకందించి, మన సమాజం యొక్క స్థితిగతులెలా ఉన్నాయి... ఆనాటి పండుగలు ఎలా ఉన్నాయి... ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి... అని చెప్పిన సురవరం ప్రతాపరెడ్డి ఒక పండితుడు, ఒక కవి, ఒక దార్శనికుడు, ఒక విమర్శకుడు, ఒక సంపాదకుడు, ఒక సామాజిక చైతన్య శీలి. అందుకే సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ తేజోమూర్తి.

అలాగే డా. బూర్గుల రామకృష్ణా రావు గారు! నిజానికి రామకృష్ణారావు గారింటి పేరు పుల్లంరాజు. ఊరిపేరే ఇంటిపేరుగా మారినంత స్థాయిలో బూర్గుల రామకృష్ణారావు సేవజేశారు. అందుకే వారిని పుల్లంరాజు రామకృష్ణారావు గారని అంటే తెలియకపోవచ్చు గాని డా. బూర్గుల రామకృష్ణారావు గారని అంటే మనకందరికీ తెలుస్తుంది. హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్న వీరు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు డా. బూర్గుల రామకృష్ణా రావు. ​ అలాగే డా. మాడపాటి హనుమంతరావు గారు, ఎంత తపించారో తెలంగాణా కోసం, ఎంత తపించారో మహిళల్లో విద్యావ్యాప్తి కోసం, ఎంత తపించారో అనాటి నిజాం కాలంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసమని. ఆయన 1935లో నిజాం రాష్ట్ర చతుర్ధాంధ్ర మహాసభకి సిరిసిల్లలో అధ్యక్షత వహించారు. అందరినీ చాలా చైతన్యవంతుల్ని చేశారు. 1951లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్కి మేయర్గా ఎన్నికయ్యారు. 1958-64 సంవత్సరాల మధ్య కాలంలో శాసనమండలికి అధ్యక్షులయ్యారు. అడుగడుగునా, అణువణువునా ఈ సమాజానికి నేనుగా ఎంత వరకు తోడ్పడతాను అని ఆలోచించిన ఆ మహానుభావుడు మన తెలంగాణా తేజోమూర్తుల్లో ఒకరు. అందుకే... అప్పుడే డా. మాడపాటి హనుమంతరావు గారిని భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' బిరుదునిచ్చి సత్కరించింది. అలాగే కొండా వెంకట రంగారెడ్డి గారు. ఆయన నిజాం రాష్ట్ర 5వ మహాసభకి షాద్ నగర్ 1936లో అధ్యక్షత వహించారు.

వీరంతా ఆ రోజుల్లో ఆంధ్ర భాషా ఉద్యమం, జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం - అన్నిటినీ ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించిన మహానుభావులు అధ్యక్షత వహించి అందర్నీ కూడా చైతన్య వంతుల్ని చేశారు. అలాగే 1943వ సంవత్సరంలో కూడా హైదరాబాద్లో ఏర్పడిన 7వ సభకి అధ్యక్షత వహించిన కొండా వెంకట రంగారెడ్డి మొదట్నుంచీ ప్రత్యేక తెలంగాణా కోసం కృషి చేసినవారు. 'పెద్ద మనుషులు ఒప్పందం'లో భాగస్వామిగా ఉన్నారు. అప్పటి నుంచే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం గురించి ఆలోచించిన మహానుభావుల్లో మెదక్ జిల్లా కందిలో నిర్వహించబడిన 13వ సభకు అధ్యక్షత వహించినవారు సర్దార్ జమలాపురం కేశవరావు. వీళ్ళందరితో పాటు షోయబుల్లాఖాన్ గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పత్రికా రచయిత షోయబుల్లాఖాన్ 'రేజ్' అనే పత్రికను నిర్వహిస్తున్నప్పుడు దాన్ని ఆనాటి నిజాం ప్రభుత్వం నిషేధించింది. తర్వాత 'రయత్' అనే పత్రికలో పనిచేస్తే ఆ పత్రికను కూడా నిషేధించారు. ఆ తర్వాత 'ఇమ్రోజ్' పత్రికను ప్రారంభించి, 1948 ఆగష్టు 21వ తేదీ నాటి రాత్రి 12 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పులకు, కత్తిపోట్లకు గురైన షోయబుల్లాఖాన్ మత సమైక్యత కోసం కృషి చేసిన అమరజీవిగా మనం స్మరించుకోవలసిన అవసరం ఉంది. మరొక తేజోమూర్తి ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు శ్రీమతి జె.ఈశ్వరీబాయి! పుట్టింది, పెరిగింది పేదరికంలో అయినా, అంబేద్కర్ సిద్ధాంతాల్ని పరివ్యాప్తి చేయడానికి నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో తన యొక్క చతురతతో, వక్తృత్వ ధోరణితో, వాక్చాతుర్యంతో అందరిని కూడా అలరింపజేసిన నాయకురాలు ఈశ్వరీబాయి! ఇక రావి నారాయణ రెడ్డి గారు! భువనగిరిలో నిర్వహించబడిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించడమేకాక; ఆ తరువాత జాతీయ ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ అని రెండుగా చీలిపోయిన రోజుల్లో అజ్ఞాతవాసం చేసి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం పాటు పడిన వాళ్ళలో అగ్రగణ్యుడిగా రావి నారాయణ రెడ్డి గారిని మనం పేర్కోవాల్సిన అవసరం ఉంది. 1952వ సంవత్సరంలో ఆయన నల్గొండ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం మరో గొప్ప విషయం.

నిత్య స్మరణీయులుగా ఉండేవారు మాదిరి భాగ్యరెడ్డి వర్మ. మాదిరి భాగ్యరెడ్డి వర్మ కూడా చాలా పేదరికంలో హైదరాబాద్ లో పుట్టి తన తోటి వారందరిని కూడా చూసి ఈ అంటరాని తనమేమిటి? ఈ బాల్య వివాహాలేమిటి? ఈ అంధవిశ్వాసాలేమిటి? ఈ మూఢాచారాలేమిటి? అని నిరసిస్తూ, వాటిని రూపుమాపడానికి ఒక సంఘ సంస్కర్తలాగా నిలబడి జీవితాన్నంతా సామాజిక చైతన్యం కోసం తెలంగాణా జాగృతి కోసం పాటుపడిన మాననీయుల్లో భాగ్యరెడ్డి వర్మ గారొకరు. వారు తలచుకొని ఒక సంకల్పశుద్ధిగా నిర్మించిన 'ఆది హిందూ భవనం' చాదర్ ఘాట్ వంతెన దగ్గర ఇవ్వాల్టికి కూడా సజీవంగా నిలిచి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ నాటి విద్యార్థులు, ఈనాటి యువత తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది.

దాశరథి స్వాతంత్య్ర్య సమరయోధుడు, గొప్ప కవి, పండితుడు. శ్రీ వైష్ణవ సంప్రదాయం నుంచి వచ్చిన వాడు. అయినా వేటినీ లెక్కచేయకుండా తెలంగాణా కోసం, తెలుగు భాష కోసం జీవించినంత కాలం పాటుపడిన దాశరథి... మనం జనం, జనం మనం / జనం లేంది మనం లేము అని చెప్పి జనాన్ని ఉర్రూతలూగించి తన కవిత్వంతో చైతన్యపరచిన జనకవి. తెలంగాణా బిడ్డగా ఆనాడు నిజాం, రజాకార్లకి వ్యతిరేకంగా పోరాడి నిజామాబాద్ జైల్లో గోడమీద “నా తెలంగాణా కోటి రతనాల వీణ" అని రాసిన దాశరథి - తెలంగాణా ఉద్యమకారులకి, తెలంగాణా ప్రజలకి ప్రతి ఒక్కరికీ ఆరాధ్యుడు. "వా గీతావళి ఎంత దూరం ప్రయాణంబవునో అందాక ఈ భూగోళమ్మునకు అగ్గిపెట్టెను" అని చెప్పిన విప్లవకవి దాశరథి. ఎంత వామనుడో - అంతటి త్రివిక్రముడు! ​ మరొకరు వందేమాతరం రామచంద్రరావు గారు. ఆయన పేరులోనే వందేమాతరం నిలిచిపోయింది. నిజానికి వారు వావిలాల రామచంద్రరావు. జైల్లో వందేమాతరం అని అన్నప్పుడు ఆ జైలు సూపరింటెండెంట్ చెంప దెబ్బ కొడితే 'వందేమాతరం' అన్నాడు. కొరడాదెబ్బ కొడితే 'వందేమాతరం' అన్నాడు. 24, 25 దెబ్బలు కొడితే 24, 25 సార్లు వందేమాతరం, వందేమాతరం అంటూ నినదించిన ఆయన బయటకొచ్చాక వందేమాతరం రామచంద్రరావుగా వెలిగిపోయాడు. ఇవ్వాల్టికి పందేమాతరం రామచంద్రరావు గారంటేనే రోమాంచితమవుతుంది మనకు. ఆయన ఆర్య సమాజ నిర్మాణానికి, తెలంగాణాలో చాలా ప్రయత్నం చేశారు. అలాగే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా కావాలని, చిన్న రాష్ట్రాలవల్ల మనకెంతో మేలు జరుగుతుందని చెప్పిన వారిలో వందేమాతరం రామచంద్రరావు గారు కూడా ప్రముఖులు.

తెలుగు భాషకు సముచిత స్థానం లేని రోజుల్లో తెలుగు భాషకోసం పాటుపడిన వారిలో శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు కూడా ఒకరు. దేవులపల్లి రామానుజరావు గారు ఆంధ్రసారస్వత పరిషత ను 1943వ సంవత్సరంలో ఏర్పరచినారు. పరిషత్ దీపమే లేకుంటే తెలంగాణా అంతా చీకటే అనే రీతిలో తెలంగాణాలో ఎంతో మందిని విద్యావంతుల్ని చేయడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఎంత నిరాడంబరుడో అంతగా ఈ సమాజం కోసం పాటుబడిన మహానుభావుడు. ఈ సంవత్సరం దేవులపల్లి రామానుజరావు గారి శతజయంతి ఉత్సవాలని భాషా సాంస్కృతిక శాఖ అత్యంత వైభవంగా రవీంద్రభారతిలో నిర్వహించినందుకు ప్రభుత్వ చొరవను అభినందించాలి.

మరొక తేజోమూర్తి కాళోజికి ఆయన నిండా ఆవేశపరులు, ఉద్వేగంతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో తన జీవితాన్నంతా ఈ సమాజానికి సమర్పించుకోవాలనే సమర్పణా భావంతో ఉండే నిజమైన మనిషి కాళోజికి తన కవితలన్నీ కూడా తానేదో ఆలోచించో, భావన జేపో, రాత్రింబవళ్ళు కష్టపడి రాసినటువంటివి కావు. తన నోటినుంచి అన్నమాట ప్రతిదీ కూడా ఒక కవితలాగా, నా గొడవనే కవితలై పోయినాయి అని చెప్పినటువంటి కాళోజి, 1969 తెలంగాణా ఉద్యమం నుంచి తెలంగాణా కోసమనే పాటుపడిన మహానుభావుడు. తెలుగు కవుల్లో 'పద్మవిభూషణ్'గా పేరెన్నికగన్న ఏకైక కవి కాళోజి! ఒక పక్క సాహిత్యాన్ని బట్టి చూసినా, మరోపక్కన సామాజిక చైతన్యవంతుడిగా చూసినా అన్ని రకాలుగా కూడా కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా మనం తప్పకుండా స్మరించుకోవాలి.

ఒక పి.వి.నరసింహారావుగారు బహుభాషా కోవిదుడు, పండితుడు, సున్నిత మనస్కుడు, సాత్వికుడు, నిరాడంబరుడు. దేశం కోసం, సమాజం కోసం పాటుపడాలని, చిన్నప్పటి నుంచి కూడా అహరహం కృషి చేసినవారు. వారు జైళ్ళ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు 'ఓపెన్ ఎయిర్ జైల్ సిస్టంను ప్రవేశపెట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో. అప్పటి ఆంధ్రప్రదేశ్లో విద్యా మంత్రిగా తెలుగును అధికార భాషగా తీర్చిదిద్దారు. తెలుగు అకాడమీని స్థాపింపజేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే సర్వశ్రేయోనిధిని ఏర్పరచి వేదపండితులను, పండితులను, అర్చకులను గౌరవించే స్థితిని కల్పించారు. ముఖ్యమంత్రిగా ఉంటే భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రధాన మంత్రిగా సరళీకృత విధానం తీసుకొచ్చి, ఇవ్వాళ భారతదేశంలో ఒక గొప్పనైన విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచమంతా ఒకటే అనేటువంటి రీతిలో భారతదేశం ప్రవర్తించడానికి మూలకారణమైన వారు, మన తెలంగాణా బిడ్డ శ్రీ పి.వి. నరసింహారావు!

ఇలాంటి మరెంతోమంది తెలంగాణ తేజోమూర్తుల జీవిత చరిత్రలను ఒక్కచోట చేర్చి బృహత్ వ్యాస సంకలనంగా తీసుకురావడంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు చిరంజీవి మామిడి హరికృష్ణ చూపిన చొరవను, వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నాను. తెలంగాణ మహనీయులందరికీ మరొక్కసారి సవినయంగా నమస్సులర్పిస్తూ....

డా. కె.వి రమణాచారి, ఐ.ఎ.ఎస్. (రి)
ప్రభుత్వ సలహాదారు

​

ముందు మాట

స్ఫూర్తివంతమైన జీవన చిత్రం!

పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కారు!

కానీ వారు పెరుగుతున్న క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు, సంఘటనలు, వారిని ప్రభావితం చేసిన వ్యక్తులు, సిద్ధాంతాలు, వారిలో అంతర్గతంగా ఎదిగిన ఆలోచనారీతులు, ఆచరణ తీరులు ... అన్నీ కలిసి వారిని ఇతర మనుషుల కన్నా భిన్నమైనవారిగా, ఉన్నతమైన వారిగా గుర్తింపునిస్తాయి.

మనిషి మనిషిగా ఎదగడానికి కావలసిన అన్ని రకాల జీవనానుభవాలు కోకొల్లలుగా ఉన్న నేల - తెలంగాణ!


ఏ వ్యక్తీ ఒక్కరోజులో గొప్పవాడు కాలేదు!

ఒక మనిషి తను నమ్మిన, తనకు నచ్చిన మార్గంలో మొక్కవోని దీక్షతో నిరంతరం కొనసాగి, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తలొగ్గకుండా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ నిశ్చలంగా ముందుకెళ్ళినపుడే ఆ మనిషికి తనదైన ముద్ర రూపొందుతుంది.

వ్యక్తిత్వముద్ర ఇన్ స్టెంట్ కాదు.... కాలాతీతంగా కాన్స్టంట్ గా కొనసాగే మానవ ప్రవర్తన!

మనుషులలో నిరంతరత్వాన్ని, నిలకడతత్వాన్ని కొనసాగించగలిగే నేపధ్యాన్ని సృష్టించగలిగిన జీవగడ్డ – తెలంగాణ!!

ఇపుడు చూస్తున్న మహావృక్షపు చిటారు కొమ్మల చిగురుటాకులు ఇప్పటివి కావు.... ఎన్నో ఏళ్ళుగా ఎదిగి ఒదిగిన కనిపించని వేళ్ళలో దాని తొలి ఆనవాలు దాగి ఉంది!

ఇపుడు మనం స్మరిస్తున్న, తలచుకుంటున్న మహనీయుల కీర్తి ఈ క్షణానిది కాదు... ఎన్నో ఏళ్ళ క్రితమే మొదలైన వారి ప్రయాణంలోని తొలి అడుగులలో, ఈనాటి వారి ప్రభ ఉంది!

అలాంటి జీవతత్వాన్ని జన్యువుల పరంగా సైతం అందించగలిగిన పోరుగడ్డ - తెలంగాణ!!!

భౌగోళికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని వైవిధ్యతలు, విభిన్నతలు భారతదేశంలో ఉన్నాయో అవన్నీ ఒక్కచోట కలబోసిన విశిష్టప్రాంతం - తెలంగాణ!

ప్రపంచాన్నంతా ఒక్కచోట చూడాలనుకుంటే భారతదేశాన్ని చూస్తేచాలు అని అంటారు! అదే కోవలో, భారతదేశాన్ని ఒక్క దగ్గర చూడాలనుకుంటే తెలంగాణలో అడుగుపెడితే చాలు అనేంతగా అనాది కాలం నుంచీ అనంతమైన ప్రత్యేకతని కలిగిన భూమి - తెలంగాణ! ​ అందుకే ఈ నేల, ప్రపంచపు రెండు భిన్నమైన దిగంతాలను ఒక్కచోట సృష్టించింది. సంఘర్షణను ఎంతగా అనుభవించిందో, సమృద్ధతను అంతగానే అనుభూతి చెందింది. మహా విషాదానికి - మహదానందానికి సాక్షిగా నిలిచింది! దోపిడీకి - శ్రామిక స్వర్గానికి ప్రయోగశాలగా మిగిలింది!

దీనికంతటికీ కారణం ఇక్కడ జీవితం ఉంది! జీవితంలోని బహు పార్యాలు ఇక్కడ దర్శనమిస్తాయి!

అందుకే వ్యక్తులు చరిత్రను నిర్మిస్తారా? లేక చారిత్రక పరిస్థితులు వ్యక్తులను తయారు చేస్తాయా? అంటే ఈ రెండూ జరుగుతాయి అని చెప్పడానికి ఈ భూమిమీద లభించే అద్భుతమైన సాక్ష్యం తెలంగాణ!

చాలా సందర్భాలలో ఈ నేలమీద కొనసాగిన చారిత్రక సందర్భాలు, పరిస్థితులు ఆయా కాలాలలో, ప్రదేశాలలో వ్యక్తులను తయారుచేసి ఉండవచ్చు. అదే సమయంలో, అలాంటి వ్యక్తులు తమవెంట, తమ అడుగుల వెంట చరిత్రను కూడా తీస్కెళ్ళారు. సమాజ పథగామిగా దిశా నిర్దేశం చేసారు. ఇలాంటి అద్భుత ఘట్టాలెన్నింటినో తన గుండె పౌరల్లో భద్రంగా నిక్షిప్తం చేస్తున్న అపురూప ప్రాంతం - తెలంగాణ!

ఇదే సందర్భంలో మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి...! అసలు ఈ 'తేజోమూర్తులు' భావన పుట్టుకకు సంబంధించిన తెర వెనుక కథ...!

భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుని కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి గాను ఒక హాల్ ఉంది. ఉమ్మడి రాష్ట్రకాలంలో అందులో తెలుగు సాహితీ కళామూర్తుల ఛాయాచిత్రాలతో 'కీర్తిహాల్' పేరిట 'హాల్ ఆఫ్ ఫేమ్'ను ఏర్పాటు చేసారు. ఆ హాల్లో తెలంగాణ సాహితీ కళామూర్తుల చిత్రాలను అలంకరించాలనే సంకల్పం ఏర్పడిన తర్వాత శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు, నందిని సిధారెడ్డి గారు వంటి కొందరు ప్రముఖుల సూచనల (తెలుగు అకాడెమీ వారి జాబితాను కూడా పరిశీలించి) మేరకు ఓ జాబితాను రూపొందించుకొని, ఆ జాబితాలోని ప్రముఖుల ఛాయా చిత్రాలను సేకరించి, వాటి ఆధారంగా తైలవర్ణ చిత్రాలను వేయించాలని నిర్ణయించాము. ఆ మేరకు సిద్దిపేటకు చెందిన చిత్రకారుడు అహూబలం ప్రభాకర్కు ఆ బాధ్యతను అప్పగించాం. దాదాపు సంవత్సర కాలపు ప్రాజెక్టు అది.

ఆ తరువాత 2017 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నాటికి మొదటి దశగా దాదాపు 32మంది సాహితీ కళామూర్తుల తైలవర్ణ చిత్రాలను సిద్ధంచేసి గోడలపై అందంగా ప్రతిష్ఠించాం. దానికి 'తేజోమూర్తుల హాల్ 'గా నామకరణం చేసి 2017 ఏప్రిల్ 4వ తేదీన శ్రీమతి కల్వకుంట్ల కవిత, పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

మొదటి దశలో 32 మందివి మాత్రమే చిత్రించడం జరిగింది. మిగతా తేజోమూర్తుల తైలవర్ణ చిత్రాలు పూర్తి చేయాల్సివుంది.

ఈ తేజోమూర్తులకు సంబంధించిన చర్చ అంతరంగికంగా మా మధ్య జరుగుతున్నకాలంలోనే ఈ మహనీయుల జీవన చిత్రాలను కూడా ఒకే సమగ్ర పుస్తకరూపంలో తీసుకురావాలని భావించాం. అలా ఎన్నో మేధోమథనాలు, చర్చోపచర్చల ఫలితమే ప్రస్తుత ఈ గ్రంథం! అందుకే ఈ గ్రంథంలోని కొందరు మహనీయుల చిత్రాలకు భాషా సాంస్కృతిక శాఖ వేయించిన తైలవర్ణ చిత్రాలనే ఉపయోగించడం జరిగింది. అలాగే 'తేజోమూర్తుల హాల్ ఆవిష్కరణ సందర్భ ఛాయాచిత్రాలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించాం. ​ తెలంగాణ ముఖచిత్రాన్ని లిఖించడంలో తమదైన పాత్ర పోషించిన మహనీయుల జీవన పరిచయాన్ని గ్రంథస్తం చేయాలనే సంకల్పమే ప్రస్తుత "తెలంగాణ తేజోమూర్తులు” పుస్తక రచనకు అంకురం! సమీప గతంలో అంటే 19, 20 శతాబ్దాలలో తెలంగాణ బతుకు చిత్రాన్ని ప్రభావితం చేసిన ప్రాతఃస్మరణీయుల జీవనరేఖల్ని ఒడిసిపట్టే ప్రయత్నమే ఈ పుస్తకం!

ఇక, ఈ పుస్తకంలోని 153 మంది తేజోమూర్తుల జీవిత ప్రస్థానాన్ని ఒక్కచోట చదవడం ద్వారా పైన చెప్పిన విషయాలలోని వాస్తవికత మనకు సుబోధకం అవుతుంది. వీరిలో చరిత్ర గమనాన్ని బట్టి తమ మార్గాన్ని నిర్దేశించుకున్నవారు... చరిత్రని కొత్తగా రాసినవారు... చరిత్రను పక్కకు పెట్టి తామే చరిత్రగా మారినవారు కూడా ఉన్నారు!

అయినా, తమదైన మార్గంలో, తమదైన ముద్రతో వెలిగి ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్మరణీయ స్థాయిని, స్థానాన్ని సంపాదించుకున్నవారు ఉన్నారు. అయితే వీరి చరిత్ర, కృషి, సేవలు, ప్రత్యేకతలు ఇంతకాలం 'మబ్బుపట్టిన ఆకాశం' లాగా ఉన్న స్థితి ఉండేది! కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మన చరిత్ర పురుషులు - స్త్రీమూర్తుల గురించిన అన్వేషణను, వీక్షణను ఆవిష్కరించాల్సిన ఆవశ్యకతను భాషా సాంస్కృతిక శాఖ గుర్తించింది. అందుకే ఈ తేజోమూర్తుల ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా, సుదీర్ఘ కాల పరిశోధనలోంచి ఇప్పుడు ఆవిష్కరిస్తోంది. దాదాపు 18 నెలల కృషి, నిపుణులతో చర్చోపచర్చల ఫలితంగా వస్తున్న ఈ బృహత్ గ్రంథం, ఆయా మహనీయుల జీవన చరిత్రలను పరిచయం చేసే ప్రయత్నం చేసింది. ఆ దిశగా ఇది ఓ అపూర్వ, అపురూప ప్రయత్నం!

ఇందులోని, తేజోమూర్తుల జీవిత ఘట్టాలని, జీవన గమనాలని చదివిన తర్వాత, మనలో ఖచ్చితంగా వారిపట్ల గౌరవభావం ఎంతగా పెరుగుతుందో, ఈ తెలంగాణ నేలపట్ల అంతకంటే ఎక్కువ అభిమానం పెరుగుతుందనడంలో ఆశ్చర్యంలేదు.

ఎందుకంటే ఈ భూమిపుత్రులందరూ తమ జీవితాన్ని, ఈ నేల భవిష్యత్తునూ వేరుగా చూడలేదు...!

ఈ మట్టినే తమ జీవితంగా చూసారు...!

తమ జీవితాలనే ఈ మట్టికోసం అంకితం చేసారు...!

అలాంటి త్యాగధనులకి, తేజోమూర్తులకి సవినయంగా భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న సాష్టాంగ ప్రణామం - ఈగ్రంథం!

- మామిడి హరికృష్ణ

​

తెలంగాణ తేజోమూర్తులు - ఓ సాంస్కృతిక ప్రయాణం!

ఇది చాలా ఆసక్తిదాయకమైన ప్రయాణం!

తెలంగాణ ఉద్యమకాలంలో ప్రారంభమై, రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణకు సంబంధించిన కళలు, కళారూపాలు, కళాకారులు, వైతాళికులు, చారిత్రక విషయాలు గురించిన చర్చ, పరిశోధన, ప్రచారం అనివార్యం అయింది. అయితే సాంస్కృతికశాఖ పక్షాన ఆ పరిశోధనను, ప్రచారాన్ని విస్తృతం చేయడం, శాస్త్రీయంగా నిర్వహించడం అవసరమైంది. అదే సమయంలో చాలామంది వ్యక్తులు, కళలు, కళాకారులు, చిరస్మరణీయులకు సంబంధించిన వివరాలు దొరకని పరిస్థితి కూడా నెలకొంది.

ఈ పరిస్థితిని గమనించిన సాంస్కృతికశాఖ ఈ అంశాలను డేటా బ్యాంక్ లా తయారుచేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అవన్నీ అసంపూర్ణంగానే కనిపించాయి. 'ఆకాశవాణి' వంటి జాతీయ ప్రసారసంస్థతో కలిసి ఈ బృహత్ యజ్ఞాన్ని నిర్వహించాలని భావించాము. దాన్లోంచే ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ శ్రీ ఉదయశంకర్ తో కల్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ అవతరణ నుంచి 'భాషా సాంస్కృతికశాఖ ఆకాశవాణి' సంయుక్తంగా కొన్ని జానపద, సంగీత ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. అవి మంచి విజయాన్ని ప్రజాదరణను చూరగొన్నాయి. ఆ నేపధ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ వైభవం' కార్యక్రమాన్ని ఆరంభించాం.

అలా ఆకాశవాణిలో 2017, ఏప్రిల్ 2వ తేదినుంచి పూర్తిగా తెలంగాణ కేంద్రీకృతంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణాకు సంబంధించి ఈ క్రింది అంశాలను కూడా నిర్ధారణ చేసాము.

1. వైతాళికులు/చిరస్మరణీయులు / తేజోమూర్తులు వారికి సంబంధించిన జీవిత విశేషాలు, వివిధ రంగాలలోవారు చేసిన కృషి,

2. కళలు - కళారూపాలు - వాటి ప్రత్యేకత

3. పర్యాటక, చారిత్రక ప్రదేశాలు - వాటి విశిష్టత

స్థూలంగా ఈ క్యాటగిరీలను నిర్ధారించిన తర్వాత, ఆయా క్యాటగిరీలలోని మౌలికాంశాలను ఎంపిక చేయడానికి, తెలంగాణాకు సంబంధించిన లబ్దప్రతిష్టులైన ప్రముఖులతో కమిటీలను వేసాం. వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి, మేధోమధనం చేసి అంశాలను, వాటిగురించి రాయగలిగిన నిపుణలను కూడా ఎంపిక చేసి, ఆయా అంశాల రచనా బాధ్యతలను వారికి అప్పగించడం జరిగింది. ఇలా వచ్చిన పరిశోధనా పత్రాలను ఆకాశవాణి నుండి ప్రసారం చేయడం ప్రారంభించాం.

ఇక పుస్తకం ప్రచురణ బాధ్యతను పూర్తిగా భాషాసాంస్కృతికశాఖ చేపట్టింది. ఒక్కచోట చేర్చి గ్రంథస్థం చేసే మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది.

ఆవిధంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 2017 ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం గం. 7.15 ని.ల నుండి గం. 7.30 ని.ల వరకు, రైనో ఎఫ్.ఎమ్ కేంద్రం నుండి మధ్యాహ్నం 2.45 ని.ల నుండి 3.00 గంటల వరకు (శనివారం మినహాయించి) ప్రసారం చేస్తూనే ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారాలను ఉదయశంకర్ (డైరెక్టర్) గారి సారధ్యంలో శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి, చావలి దేవదాస్, సి.ఎస్. రాంబాబు, ఎస్. విజయరాఘవరెడ్డి బృందం సమర్థవంతంగా రేడియో ప్రసారాలు చేసి తెలంగాణాకు సంబంధించి ప్రజలకు తెలియని ఎన్నెన్నో విషయాలను, విశేషాలను అందించాము.

ఇక ఈ రేడియో ప్రసంగాలను పుస్తకంగా ప్రచురించే బాధ్యతను భాషా సాంస్కృతిక శాఖ మొదలుపెట్టి, వాటిని 'ప్రపంచ తెలుగు మహాసభల'లో ఆవిష్కరించే ప్రణాళికను రూపొందించింది.

మొత్తంగా దీనికి సంబంధించి ఆకాశవాణి ప్రసారాల విషయంలోనూ, పుస్తక ప్రచురణ విషయంలోనూ సమన్వయం, నిర్వహణ కూర్పు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించినవారు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మిగారు.

అలా ఈ పుస్తకంలోని ఆయా అంశాలను పరిచయం చేయడంలో, వాటి విశిష్టతలను అద్దం పట్టడంలో రెండు శాఖలూ సఫలీకృతం అయ్యాయి. వీటిని రాసిన రచయితలు కూడా ఆయా రంగాలలో లబ్ద ప్రతిష్టులు, విశేష కృషి చేసినవారు కనుక, ఈ పరిశోధనా, పరిశీలనా వ్యాసాలకు సాధికారత కూడా సమకూరిందని భావిస్తున్నాం. అందువల్ల భవిష్యత్లో ఇంకా లోతుగా జరిగే పరిశోధనలకు ఈ గ్రంథం ఒక ఆధార భూమికను, ఒక విశాల అవగాహనను కలిగిస్తుందని కూడా నమ్ముతాము. దాదాపు 18 నెలల నిరంతర కృషి ఫలితంగా వెలువడుతున్న ఈ గ్రంథం ఈ వరుసలో మొదటి సంపుటిగానే భావిస్తూ, మరింత విస్తృత పరిశోధనతో రాబోయే కాలంలో మరిన్ని పుస్తకాలుగా రావాలని దానికి తగిన ప్రయత్నాలను కూడా భాషాసాంస్కృతికశాఖ, ఆకాశవాణి సంయుక్తంగా పూనుకుంటాయని సవినయంగా మనవి చేస్తున్నాము.

ఇలా ఎన్నెన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెలువడుతున్న ఈ గ్రంథం తెలంగాణా పునర్నిర్మాణ ప్రస్థానంలో, సాంస్కృతిక కళారంగంలో ఓ అపురూప డాక్యుమెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.

ఇలాంటి అపూర్వ గ్రంథం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రపంచ తెలుగు మహాసభలు'లో ఆవిష్కృతం కావడం ఆనందంగా భావిస్తున్నాము.

- సంపాదకులు

​

4వతేది ఏప్రియల్ 2017న తేజోమూర్తుల చిత్ర పటాల్ని ఆవిష్కరిస్తున్న

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు,

డా. కె. వి. రమణాచారి గారు, దేశపతి శ్రీనివాస్ గారు,

సుద్దాల అశోక్ తేజ గారు, మామిడి హరికృష్ణ మున్నగు వారు.

​
​
​

ఇవీ తేజస్సులు


1. అబిద్ హసన్ సఫ్రానీ జి. వెంకటరామారావు 1
2. ఆదిరాజు వీరభద్రరావు డా. వెలుదండ నిత్యానందరావు 3
3. అజిత్ వారాల ఆనంద్ 7
4. అలిశెట్టి ప్రభాకర్ డా. నాళేశ్వరం శంకరం 10
5. అంబటిపూడి వేంకటరత్నం డా॥ తిరునగరి 13
6. ఆనందాంబ డా. ఆర్. కమల 16
7. ఆనందరావు తోట డా. వెలిచాల కొండలరావు 19
8. అనంతోజు బ్రహ్మయ్య వడ్డ సాయిలూచారి 23
9. అనుముల కృష్ణమూర్తి వి.ఆర్. విద్యార్థి 26
10. ఆరుట్ల కమలాదేవి డా. తిరునగరి దేవకీదేవి 29
11. ఆవుల పిచ్చయ్య ఎ.ఎం. తాయారు 32
12. బి. భానుప్రకాష్ శ్రీధర్ బీచరాజు 36
13. బి.యన్. శాస్త్రి డా. జె. చెన్నయ్య 39
14. బి.యస్. నారాయణ వారాల ఆనంద్ 43
15. భండారు అచ్చమాంబ డా. సంగిశెట్టి శ్రీనివాస్ 46
16. భావానంద భారతీస్వామీవార్లు డా. ఎం. దత్తాత్రేయశర్మ 50
17. భీంరెడ్డి నరసింహారెడ్డి డా. ఏనుగు నరసింహారెడ్డి 54
18. భూపతి కృష్ణమూర్తి డా. రామా చంద్రమౌళి 57
19. భాగ్యరెడ్డి వర్మ డా. సంగిశెట్టి శ్రీనివాస్ 60
20. బిరుదురాజు రామరాజు డా. అమ్మంగి వేణుగోపాల్ 63
21. బొమ్మ హేమాదేవి శాంతి ప్రబోధ 68
22. బూర్గుల రామకృష్ణారావు డా. ఎస్.వి. రామారావు 72
23. బోయ జంగయ్య డా. మేరెడ్డి యాదగిరిరెడ్డి 77
24. బూర్గుల రంగనాథరావు డా. ఎస్.వి. రామారావు 81
25. సి. నారాయణరెడ్డి డా. జె. చెన్నయ్య 84
26. చందా కాంతయ్య శ్రేష్ఠి డా. రామా చంద్రమౌళి 88
27. చందాల కేశవదాసు డా. యం. పురుషోత్తమాచార్య 92
28. చెర్విరాల భాగయ్య డా. నోరి రాజేశ్వరరావు 95
29. చిదిరెమఠం వీరభద్రశర్మ దోరవేటి 98
30. చిలువేరు రామలింగం అయినంపూడి శ్రీలక్ష్మి 101
31. చిందుల యల్లమ్మ వి. పద్మ 105
32. చొప్పకట్ల చంద్రమౌళి వారాల ఆనంద్ 108
33. చుక్క సత్తయ్య డా. జె. చెన్నయ్య 110
34. డి. రామలింగం డా. దేవరాజు మహారాజు 114
35. దాశరథి కృష్ణమాచార్య డా. తిరుమల శ్రీనివాసాచార్య 117
36. దాశరథి రంగాచార్య డా. వి. జయప్రకాష్ 121
​
37. దేవులపల్లి రామానుజరావు దేవులపల్లి ప్రభాకరరావు 125
38. దేవులపల్లి వెంకటేశ్వరరావు డా. ఎస్. జతిన్ కుమార్ 129
39. ధవళా శ్రీనివాసరావు పున్నా అంజయ్య 133
40. దొడ్డి కొమురయ్య డా. ననుమాస స్వామి 135
41. డోకూరుకోట్ల బాలబ్రహ్మచారి డా. మావిశ్రీ మాణిక్యం 138
42. ఎదిరి చెన్నకేశవులు డా. భీంపల్లి శ్రీకాంత్ 141
43. ఈశ్వరీబాయి డా.ముక్తేవి భారతి 146
44. ఈటూరి లక్ష్మణరావు డా. వెలుదండ నిత్యానందరావు 149
45. గడ్డం రాంరెడ్డి డా. రాయారావు సూర్యప్రకాశరావు 153
46. గడియారం రామకృష్ణశర్మ డా. జి. గిరిజా మనోహరబాబు 157
47. గణపతి రామచంద్రరావు గన్ను కృష్ణమూర్తి 161
48. గోపాలరాజ్ భట్ రాయప్రోలు రమణ 164
49. గూడ అంజన్న డా. పసునూరి రవీందర్ 168
50. గూడూరి సీతారాం డా. పత్తిపాక మోహన్ 172
51. గులాం అహ్మద్ ఎస్. భాను శ్రీదేవి 175
52. గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ డా. చెప్పిల హరినాథ శర్మ 179
53. గుండేరావు హర్కారే డా. మసన చెన్నప్ప 184
54. ఇల్లిందల సరస్వతీ దేవి షబ్నవీజ్ ఇందిర 187
55. జమలాపురం కేశవరావు డా. చవ్వా వెంకటరెడ్డి 191
56. జమాలుద్దీన్ డా.దేవరాజు మహారాజు 194
57. జయశంకర్ సర్ దేశపతి శ్రీనివాస్ 197
58. జొన్నవాడ రాఘవమ్మ డా. భీంపల్లి శ్రీకాంత్ 201
59. జుల్ఫీకరుద్దీన్ పి.వి. రామమోహన్ నాయుడు 206
60. జువ్వాడి గౌతమ్ రావు గండ్ర లక్ష్మణ్ రావు 209
61. జ్వాలాముఖి నిఖిలేశ్వర్ 214
62. కె.వి. రాఘవాచార్యులు డా. సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి 218
63. కాళోజి నారాయణరావు నాగిళ్ళ రామశాస్త్రి 222
64. కాళోజి రామేశ్వరావు (షాద్) వి.ఆర్. విద్యార్ధి 226
65. కాల్వ బాలయ్య ఉండ్రాల రాజేశం 230
66. కనపర్తి రామచంద్రుడు డా. దాసోజు పద్మావతి 234
67. కాంచనపల్లి చినవెంకటరామారావు వేణు సంకోజు 238
68. కాపు రాజయ్య డా. సురభి వాణీదేవి 241
69. కాటం లక్ష్మీనారాయణ డా. వెలుదండ నిత్యానందరావు 244
70. కేశనకుర్తి వీరభద్రాచారి కందాళై రాఘవాచార్యులు 247
71. కేవల్ కిషన్ డా. బెల్లంకొండ సంపత్కుమార్ 250
72. ఖండవల్లి లక్ష్మీరంజనం డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 254
73. కోదాటి నారాయణరావు డా. టి. గౌరీశంకర్ 259
35. కుమ్రం భీం డా. టి. గౌరీశంకర్ 262
75. కొమర్రాజు వెంకటలక్ష్మణరావు డా. వి. జయప్రకాష్ 266
​
76. కొండా లక్ష్మణ్ బాపూజీ డా. బి.యస్. రాములు 270
77. కొండపల్లి శేషగిరిరావు డా. సురభి వాణీదేవి 276
78. కోవెల సంపత్కుమారాచార్య డా. గండ్ర లక్ష్మణరావు 279
79. కృష్ణమాచార్య శతావధాని డా. సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి 283
80. కొత్తూర్ సీతయ్య గుప్త డా. కర్నాటి లింగయ్య 286
81. కుమారయ్య (జస్టిస్) అన్నవరం దేవేందర్ 290
82. ఎం. ఎల్. జయసింహ పి.వి. రాంమోహన్ నాయుడు 292
83. ఎం. ఎస్. ఆచార్య డా. రామా చంద్రమౌళి 295
84. మచ్చ వీరయ్య డా. బి.వి.యన్. స్వామి 298
85. మాడపాటి హనుమంతరావు డా. టి. గౌరీశంకర్ 302
86. మడికొండ సత్యనారాయణ శాస్త్రి డా. మోత్కూరి మాణిక్కరావు 305
87. మామిడిపల్లి సాంబశివ శర్మ డా. విష్ణువందనాదేవి 308
88. మందపాటి వెంకటరాజు డా. ఎం. పురుషోత్తమాచార్య 312
89. మందముల నరసింగరావు షబ్నవీజ్ వెంకట రంగారావు 315
90. మఖ్ధూం మొహియుద్దీన్ డా. ఎస్.వి. సత్యనారాయణ 319
91. మంత్రి శ్రీనివాసరావు డా. జె. విజయ కుమార్ 322
92. మాటేటి రామప్ప డా. దేవేంద్ర 326
93. మిద్దె రాములు డా. ననుమాస స్వామి 329
94. మోత్కూరి మధుసూదనరావు డా. మడికొండ శ్యామస్సుందర్ 332
95. ముకురాల రామారెడ్డి డా. జి. చెన్నకేశవరెడ్డి 335
96. నల్లా నరసింహులు డా. రామా చంద్రమౌళి 339
97. నటరాజ రామకృష్ణ కళాకృష్ణ 343
98. నెల్లూరి కేశవస్వామి డా. పత్తిపాక మోహన్ 348
99. నీలా జంగయ్య డా. చెన్నకేశవరెడ్డి 353
100. ఒద్దిరాజు సోదరులు డా. కొండపల్లి నీహారిణి 356
101. పి.వి. నరసింహారావు డా.వి.వి. రామారావు 360
102. పైడి జయరాజ్ పొన్నం రవిచంద్ర 363
103. పైడిమర్రి వెంకటసుబ్బారావు మేరెడ్డి యాదగిరిరెడ్డి 367
104. పాకాల యశోదారెడ్డి డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి 370
105. పాలకుర్తి ఐలమ్మ డా. తిరునగరి దేవకీదేవి 373
106. పల్లా దుర్గయ్య డా. మసన చెన్నప్ప 376
107. పల్లెర్ల హనుమంతరావు డా. అమ్మంగి వేణుగొపాల్ 380
108. పందిళ్ల శేఖర్ బాబు డా.గిరిజా మనొహర్ 384
109. పార్వెళ్ళ గోపాలకృష్ణశర్మ డా. జి.వి. కృష్ణమూర్తి 387
110. పేర్వారం జగన్నాథం డా. తిరునగరి 390
111. పొట్లపల్లి రామారావు వి.ఆర్. విద్యార్ధి 393
112. ప్రభాకర రెడ్డి హెచ్. రమేష్ బాబు 396
113. పులిజాల గోపాలరావు పున్న అంజయ్య 400
114. పులిజాల వెంకట రంగారావు వేణు సంకోజు 402
​
115. ఆర్. విద్యాసాగర్ డా. జె. విజయకుమార్ జీ 404
116. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి డా. టి. గౌరీశంకర్ 408
117. రాజన్ బాబు పి.వి. రాంమోహన్ నాయుడు 412
118. రామానంద తీర్థ డా. టి. గౌరీశంకర్ 415
119. రావెళ్ళ వెంకటరామారావు జ్వలిత 419
120. రావి నారాయణ రెడ్డి డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి 421
121. సదాశివుడు వఝల శివ కుమార్ 424
122. సాహు అన్నవరం దేవేందర్ 427
123. సైబ పరంధాములు కందాళై రాఘవాచార్యులు 430
124. సామల సదాశివ (యాది) తుమ్మూరి రాంమోహన్రావు 433
125. శంకర్ (జై కిషన్) హెచ్. రమేష్ బాబు 436
126. శేఖర్ (కార్టూనిస్ట్) చేతన కె. 440
127. షోయబుల్లాఖాన్ డా. దేవులపల్లి ప్రభాకరరావు 443
128. సిద్దప్ప వరకవి డా. బి.వి.ఎస్. స్వామి 446
129. సిరికొండ వెంకట్రావు వెల్చాల కొండలరావు 449
130. సిరిప్రెగడ భార్గవరావు డా. తిరునగరి 452
131. సుద్దాల హనుమంతు శ్రీరామోజు హరగోపాల్ 455
132. సుమిత్రాదేవి డా. ముక్తేవి భారతి 459
133. సురవరం ప్రతాపరెడ్డి డా. ఎల్లూరి శివారెడ్డి 462
134. టి. మాధవరావు వారాల ఆనంద్ 465
135. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు హెచ్. రమేష్ బాబు 468
136. తెలకపల్లి రామచంద్రశాస్త్రి వేదార్థం మధుసూదనశర్మ 472
137. తోటపల్లి సుబ్రహ్మణ్యం జి. వెంకటరామారావు 474
138. తుర్రెబాజ్ ఖాన్ డా. ఏనుగు నరసింహారెడ్డి 476
139. ఉత్పల సత్యనారాయణాచార్యులు డా. జి. చెన్నకేశవరెడ్డి 479
140. వడ్డేపల్లి సోదరులు డా. బెల్లంకొండ సంపత్కుమార్ 484
141. వడ్లకొండ నరసింహారావు చీదెళ్ళ సీతామహాలక్ష్మి 486
142. వానమామలై జగన్నాథాచార్యులు డా. రావికంటి వసునందన్ 488
143. వానమామలై వరదాచార్యులు డా. రావికంటి వసునందన్ 492
144. వందేమాతరం రామచంద్రరావు డా. ఎం. దేవేంద్ర 496
145. వాంకుడోత్ జోగ్యానాయక్ డా. వి. రామకోటి 499
146. వరహాల భీమయ్య డా. రంగి కమల 502
147. వట్టికోట ఆళ్వాస్వామి డా. ఎస్.వి. సత్యనారాయణ 505
148. వెలిచాల కేశవరావు వి.కె. ప్రేమచంద్ 508
149. వెల్దుర్తి మాణిక్యరావు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 512
150. వేముగంటి నరసింహాచార్యులు డా. చెప్పల హరినాథ శర్మ 517
151. వేముల పెరుమాళ్ళు డా. దేవరాజు మహారాజు 522
152. వేంకట రాజన్న అవధాని ప్రమోద్ అవధాని 525
153. వేంకట రామ నరసింహారావు షబ్నవీజ్ ఇందిర 528

This work is released under the Creative Commons Attribution-Share Alike 4.0 International license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed—and if you alter, transform, or build upon this work, you may distribute the resulting work only under the same license as this one.