తెలంగాణ గిరిజనుల సంస్కృతి/సంపాదకీయం
సంపాదకీయం
గిరిజన సంస్కృతీ వైవిధ్యతకు కరదీపిక!
గిరిజనులు నేలతల్లి ముద్దు బిడ్డలు!
గిరిజనులు అడవి మాత వరపుత్రులు!!
గిరిజనులు కొండల్లో, కోనల్లో, వాగుల్లో, వంకల్లో, వనాల్లో,
ప్రకృతి ఒడిలో జీవితాన్ని గడిపే నికార్సైన మానవులు!!!
ఈ భూమి పై మొదటి పట్టాదారులు!
ఈ నేలకి మొట్టమొదటి హక్కుదారులు!
ఈ పంచభూతాలకి మొదటి సాక్షులు!
అందుకే యునైటెడ్ నేషన్స్, ఇతర అంతర్జాతీయ సంస్థలు వీరిని ఆదివాసులు (Indigenous people) అన్నారు. అలా ఈ భూమిపై నివసించిన తొలితరం మానవులకి నేటితరం కొనసాగింపులు గిరిజనులు!.
ఆదిమ మానవుడి వారసత్వాన్ని, ఆదిమ సంస్కృతుల విశిష్టతలని, తొలి మానవుడి జీవన విలువలను ఆకళింపు చేసుకొని తరతరాలుగా ఏ ప్రభావానికి లోను కాకుండా ఇప్పటికీ ఆ అనాది జీవన సంస్కృతిని కొనసాగిస్తున్న స్వచ్చమైన జీవులు గిరిజనులు!
ఆదివాసులు అన్నా, వనవాసులు అని అన్నా, గిరిజనులు అన్నా ఆ మాట చెబుతున్న సత్యం ఒక్కటే. They are the first Generations! They are the Originals. They are the natives of the land! మానవ శాస్త్ర (Anthropology) అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో మానవజాతి నాలుగు రకాలుగా ఉంటుంది. ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్, కాక సాయిడ్, నీగ్రోయిడ్, ఇలా వారి వారి శరీర ఆకృతి, ఎత్తు, రంగు, దంతాల నిర్మాణం, పాదాల సైజు, తల నిర్మాణం, ముక్కు, చేతులు వాటిలోని వైవిధ్యత దృష్ట్యా ఈ వర్గీకరణ చేశారు. అయితే ఈ భూమిపైన ఆదిమ మానవుడు అవతరించి లక్ష సంవత్సరాలు అయితే ఆ తర్వాత Homonidsగా, Homo-Erectusగా, Homosapiensగా రూపాంతరం చెందడం మానవజాతి క్రమ పరిణామ సిద్ధాంతానికి ఒక నిజమైన దృష్టాంతం. నాలుగు కాళ్ల మీద (Quadripodal) నడిచే జంతు జీవనస్థితి లోని ఆదిమ తత్వం నుంచి, రెండు కాళ్లపై (Bi-podal) నడవగలిగే Homo-Erectusగా మారడానికి వేలాది సంవత్సరాల ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాత మనము ఈ నాటి మానవుడికి తొలితరంగా భావించే Homo-Sapiensగా అవతరించడానికి మధ్య వేలాది సంవత్సరాల ఫాక్ చరిత్ర కూడా ఉంది.
అయితే మానవుడు ఆదిమ కాలంలో తనకు కావాల్సిన ఆహారాన్ని సేకరించే దశలోనే జీవితంలోని అత్యధిక భాగాన్ని గడపడం, ఆహార సేకరణే జీవన లక్ష్యంగా కొనసాగింది. నేటికి పది వేల సంవత్సరాల క్రితం నుంచే మానవుడు వ్యవసాయాన్ని తనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను కనుగొన్నాడు. దాంతో స్థిర జీవనం ప్రారంభమైంది. సంచార జీవన జాతిగా (Nomadic Tribe) ఉంటూ ఇతర జంతువులతో పాటు పోటీపడుతూ ఆహారాన్ని సమీకరించు కుంటూ వెళుతున్న మానవుడు నిప్పును కనుక్కొని నిప్పులో ఉండే విశేష గుణాలని కనుక్కొని, ఆ తర్వాత వ్యవసాయాన్ని, చక్రాన్ని కనుక్కున్న తర్వాత మనం చూస్తున్న నవీన మానవుడిగా రూపాంతరం చెందడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసుకొన్నాడు.
ఇలాంటి ఎన్నో యత్నదోష అభ్యసనల (Trial and Errors) ఫలితంగా మరెన్నో ప్రయోగాలు, మరెన్నో వైఫల్యాల ఫలితంగా మానవుడు తనని తాను తెలుసుకున్నాడు. శీతోష్ణ స్థితి నుంచి, వాతావరణ పరిస్థితుల నుంచి, ఎండ వానల నుంచి, జంతువుల నుంచి, తన సాటి మానవుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి, తనను తాను కాపాడుకోవడానికి, తన ఉనికిని కొనసాగించడానికి కావలసిన రక్షణ యంత్రాంగాన్ని క్రమక్రమంగా రూపొందించుకున్నాడు. అది చెట్ల మీద గృహాలు రూపం నుంచి మొదలుకొని ఆ తర్వాత నేలపై ఇళ్ల నిర్మాణం దాకా కొనసాగింది. ఆ క్రమంలోనే ఒకే జాతికి సంబంధించిన, ఒకే లక్షణాలతో కూడిన మనుషులందరూ ఒక చోట ఒక్కటిగా ఉంటూ సామూహిక జీవనం కొనసాగించడం ప్రారంభమైంది.
అందరూ కలిసి కట్టుగా ఒకే నిర్ధిష్ట ప్రదేశంలో జీవించడంవల్ల అందరి ప్రయోజనాలు పరిరక్షించబడడం, అన్నిటినీ మించి ప్రాణాలకు భద్రత లభించడం వల్ల సాముదాయిక జీవనం (Collective Life), తెగ జీవనం, ప్రారంభమై ఆ తెగలకీ గుర్తింపుగా “జాతి చిహ్నాలు” (Totems) మొదలయ్యాయి. ప్రతి గిరిజన తెగ తమని తాము గుర్తుంచుకోవడానికి, ఇతర తెగల కంటే విభిన్నంగా కనిపించటానికి ఆహారంలో, ఆభరణాలలో, అలంకరణలో, మతవిశ్వాసాలు, పూజా విధానాలలో, అలాగే ఆయుధాలు, గృహనిర్మాణం విషయాల్లో ప్రత్యేకతని కనబరుస్తూ వెళ్లారు. దాంతోపాటు తమని గుర్తించుకోవడానికి ఏదో ఒక జంతువును ప్రతీకగా ఆపాదించుకోవడం మొదలెట్టారు. అవే “జాతి చిహ్నాలు”గా మారాయి. అంటే ఆదిమ జాతులు సింహం, పులి, పాము, గ్రద్ద, పావురం మొ॥ పశు పక్ష్యాదులను ఆ చిహ్నాలుగా గుర్తించి తమ మెడలో వేసుకునే హారాలలోనో, ఆయుధాల పిడి భాగాలలోనో, దేహాలపై పచ్చబొట్లుగానో పొడిపించుకుని తమ జాతి గుర్తింపును (Identity)ని, ఇతర ఆదిమ జాతులతో విభిన్నతను ప్రదర్శించారని మానవశాస్త్రం, సామాజికశాస్త్రాల అధ్యయనాల్లో వెల్లడి అయింది.
అలా మొదలైన ఆదిమ జాతి మానవ జీవన ప్రస్థానం క్రమక్రమంగా తెగల(Tribes) నుంచి గణ రాజ్యాలుగా (Tribal States), రాజ్యాల నుంచి దేశాలుగా ఎదిగింది. అయినప్పటికీ ఇప్పటికీ మానవుడి లోని ఆదిమ జాతి లక్షణాలు ఇంకా పోలేదు. ఆనాటి ఆదిమ మానవుడు సహజాతాల(Instincts) ప్రాతిపదికగా తన జీవనాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ సహజాతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భావోద్వేగాలు మరింతగా విస్తరించినప్పటికీ, జ్ఞానం, తర్కం, విశ్లేషణం, సృజన, ప్రజ్ఞ మరెన్నో మానసిక మేధోపరమైన అంశాలూ (Cognitive Abilities) మానవుడి జీవనానికి తోడైనప్పటికీ, ఆదిమ జాతి గుణగణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీని వెనక ఉన్న ప్రధాన కారణం ఆదిమ జీవితంలోని సహజాతాలే! అలాంటి ఆదిమ జీవన సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలుస్తున్న సంస్కృతులు, మరెన్నో మనకి ఇప్పటికీ మన నిత్యజీవితంలో కనిపిస్తాయి. ప్రకృతితో, వనాలతో, వనమూలికలతో, జంతువులతో, మానవుడికి మమేకత ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే ఆధునిక మానవుడిగా నవీన సాంకేతిక పరిజ్ఞానం సాధించినా, నవతరపు మానవుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిని, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే 'వర్చువల్ రియాలిటీ'ని సృష్టించే సామర్ధ్యాన్ని, సాంకేతికతను తన అమ్ములపొదిలో ప్రోది చేసుకున్నప్పటికీ, మానవుడు ఇంకా తన సహజత్వాన్ని (Originality)ని పోగొట్టుకోలేదు. అందుకే నేటి మనిషిని అర్థం చేసుకోవాలంటే ప్రాచీనకాలం నాటి ఆదిమ మానవుడిని అర్థం చేసుకోవడం అవసరం. ఆదిమ మానవుడి జీవనశైలిని (Life Style), సంస్కృతిని, ఆలోచనల్ని (Thoughts), రీతులను (Mores), వస్తు సంస్కృతిని (Material Culture), విషయ సంస్కృతిని, శాస్త్ర సంస్కృతిని (Scientific Culture) అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆధునిక మానవుడి లో కనిపిస్తున్న మూల అంశాలని, విపరీతాలను, విప్లవాలను, విశిష్టతలను గుర్తించగలుగుతాము. అందుకే మూలవాసుల సంస్కృతిని (Indigenous Culture) అధ్యయనం చేయడం అంటే యావత్తు మానవజాతి సామాన్య లక్షణాలన్నిటినీ అధ్యయనం చేయడమే అని చెప్పవచ్చు.
అలా సామాజిక శాస్త్రం, మానవ శాస్త్రం, మనో వైజ్ఞానిక శాస్త్ర పరిణామక్రమంలో గిరిజనులకు సంబంధించిన అధ్యయనాలు, గిరిజన జీవితాన్ని ప్రతిబింబించే అంశాల పరిశీలన, ఆదివాసుల తాత్వికత ని, సాంకేతికతను వెల్లడి చేయగలిగే పరిశోధనలు అవసరం అవుతున్నాయి. అయితే ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ లాంటి దేశాలలో విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఎన్నో తెలియని విషయాలు అలాగే అపరిష్కృతం గానే ఉండి పోయాయి.
అమెరికాలోని రెడ్ ఇండియన్స్ గురించి, మెక్సికోలో మాయా ప్రజలు, ఆఫ్రికా దేశాలలో ఉండే పిగ్మీలు, నీగ్రోలు గురించి, ఆస్ట్రేలియా లో కనిపించే ఆదివాసుల గురించి, దక్షిణ అమెరికాలో తారసపడే ఆదిమ జాతుల గురించి, వారి విషయ సంస్కృతి, వస్తు సంస్కృతి, వాస్తు నిర్మాణ శైలుల గురించి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలు విస్తృతంగా జరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 5000 పై చిలుకు ఆదివాసీ తెగలు ఉన్నాయని తెలుస్తోంది. వీరు 7000కు పైగా లిపి ఉన్న, లిపిలేని భాషలను మాట్లాడుతున్నారు. కాగా ఈ ఆదివాసీ ప్రజల జీవన, సాంస్కృతిక హక్కుల గురించి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) 1989లో Convention on Indigenous and Tribal Peoples అనే ఒప్పందాన్ని ప్రకటించింది. అలాగే 2007లో ఇక్యరాజ్యసమితి "అదివాసుల హక్కుల ప్రకటన” (Declaration on Rights of Indigenous people)ను చేస్తూ, ఆరోగ్య, విద్య, సహజ వనరులు, భాషలు, సంప్రదాయాలు, సంస్కృతులు, ప్రత్యేక అస్తిత్వాల విషయంలో ఆదివాసీ ప్రజల ఉనికిని సభ్యదేశాలు పరిరక్షించాలని ఆదేశించింది.
అంతేగాక, ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీని "ప్రపంచ ఆదివాసి దినోత్సవం" (World Indigenous People's Day)గా ఐక్యరాజ్యసమితి ప్రకటించడమే కాకుండా, గ్వాటెమాలా దేశానికి చెందిన 'రిగా బెర్టా మెంచు' లాంటి ఆదివాసీ హక్కుల పోరాటయోధురాలి కి 1992 నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం ద్వారా అంతర్జాతీయంగా ఆదివాసుల హక్కులు, వారి ప్రత్యేకత గురించి ప్రపంచ దేశాలన్నీ గుర్తించాల్సిన స్థితిని తీసుకురావడం జరిగింది. ఇలా ప్రపంచం మొత్తం మీద ఉండే 800 కోట్ల జనాభాలో ఇప్పటికీ దాదాపు 6% జనాభా ఆదివాసులు, గిరిజనులే అనడంలో అతిశయోక్తి లేదు. ఆది మానవుడి తొలి ప్రస్థానం ఆఫ్రికా నుంచి మొదలైందనే మానవ శాస్త్ర పరిణామ వాదుల సిద్ధాంతాల నేపథ్యంలో గిరిజనులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాలలో తమ ఉనికిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ మార్పు (Shifting) ప్రధానంగా 3 రూపాలలో జరుగుతూ వచ్చింది.
- 1) కొన్ని గిరిజన తెగలు, జాతులు తమని తాము మార్చుకోలేక (Adapt) సమూలంగా నాశనం కావడం,
- 2) మరికొన్ని గిరిజన తెగలు సమకాలీనతకీ, ఆధునికతకి పూర్తిగా మారిపోవడం, 3) ఇంకొన్ని తెగలు తమలోని
ప్రాచీనతని, ఆధునికతని రెండింటినీ మేళవించి సంతులనం చేసుకుంటూ కొనసాగడం జరుగుతోంది.
ఇక భారతదేశం విషయానికి వస్తే, దేశం మొత్తం జనాభాలో దాదాపు 8.6%, గ్రామీణ జనాభాలో 11.3% ప్రజలు గిరిజనులే! 1991లో వీరి జన సంఖ్య 6.7 కోట్లు! అది 2001 నాటికి 8.43 కోట్లకి, 2011 నాటికి 10.43 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం వీరి జనాభా 15 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా.
ఇదిలా ఉండగా గిరిజనులు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మిజోరం, లక్షద్వీప్ ప్రధానంగా కనిపిస్తాయి. లక్షద్వీప్ మొత్తం జనాభాలో 94, 79% ప్రజలు గిరిజనులే, మిజోరంలో 94,43%, ఛత్తీస్ ఘడ్లో 30.62%, ఝార్ఖండ్ లో 26.21% ప్రజలు గిరిజన తెగలకు సంబంధించిన వారే కావడం గమనార్హం.
ఇలా గిరిజన ప్రజలు భారతదేశంలో తమదైన ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నప్పటికీ హక్కులు, జీవన శైలి, సంస్కృతి పరంగా, విధ్వంసానికి గురైన తెగలు కూడా గిరిజన తెగలే అనడంలో సందేహం లేదు. నగర జీవితానికి, ఆధునికతకి, నవీన పరిజ్ఞానానికి దూరంగా కొండల్లో, కోనల్లో, వనాల్లో, తమదైన జీవనశైలితో, జీవన సంస్కృతులతో, భాషా విశేషాలతో కొనసాగుతున్న గిరిజనులపై వేర్వేరు కోణాలలో నుంచి దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు జరుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి కోసం అడవులను నరికి వేయడం, అడవులలోకి రోడ్ల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, బహుళార్థసాధక ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అంశాల ద్వారా గిరిజనుల జీవన సంస్కృతి చిన్నాభిన్నమైన దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం.
వీటన్నింటి నేపథ్యంలో గిరిజనులు వారి పరిస్థితిని, వారి స్థితిగతులను సంరక్షించడానికి ప్రభుత్వపరంగా ఎన్నో చర్యలు, రక్షణాత్మక వ్యూహాలు (Safeguard Strategies), రాజ్యాంగపరమైన పరిరక్షణలు (Constitutional Provisions) తీసుకోవడం జరుగుతోంది. గిరిజనులను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి వారికి మెరుగైన జీవన విలువలను, సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా వివిధ చట్టాల, శాసనాలు (1/70 ACT e+ {i$)ను అమలు చేయడం, ITDA వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు గిరిజన ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహవసతి, వ్యవసాయం లాంటి రంగాలలో వారిని సుసంపన్నం చేయడానికి ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. "ఏ దేశంలో అయితే చిట్టచివరి మానవుడికి కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయో, ఆ దేశమే సర్వ సమగ్ర వికాసం చెందినట్టు" అని మహాత్మా గాంధీ చెప్పినట్టు అన్ని స్థాయిల ప్రభుత్వాలు తమదైన పరిధిలో గిరిజనుల వికాసం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలోని మొత్తం 4.5 కోట్ల జనాభాలో 10% గిరిజనులే! అంటే దాదాపు 40.5 లక్షల మంది ప్రజలు ఈ గిరిజన తెగలకు చెందిన వారే! ఇక గిరిజనులలో అందరు గిరిజనులు ఒకేలాంటి సంస్కృతి కలిగి ఉండకపోవడం గమనించాలి. ఆయా ప్రాంతాలు, అడవులు, శీతోష్ణస్థితులు (Climate), నైసర్గిక పరిస్థితులు (Geographical Conditions), నీటి లభ్యత, వన విస్తీర్ణం లాంటి కారణాల దృష్ట్యా తెలంగాణలో గిరిజనులు వేరు వేరు భాషలను, సంస్కృతులను, స్థానికతను కలిగి ఉన్నారని తెలుస్తుంది.
తెలంగాణలో దాదాపు 23 రకాల గిరిజన తెగలు ఉన్నప్పటికీ వారిలో ప్రధానంగా చెప్పుకోదగిన వారు ఎరుకలు, చెంచులు, లంబాడీలు/ బంజారాలు, కోయలు, కొండరెడ్లు, గోండులు, నాయకపోడులు, కోలామీలు, తోటీలు, ఆంగ్ల లు, ప్రధాన్ లు మొదలగు వారు. వీరిలో చాలామంది నగరాలకు, ఆధునిక జీవితానికి దూరంగా వనాలలో నివసిస్తున్నప్పటికీ నగర జీవన సంస్కృతులతో కూడా ఆదాన ప్రదానాలు జరిగి, వారి జీవన సంస్కృతులు ప్రభావితం కావడం విశేషం.
అయినప్పటికీ గిరిజన జాతుల ప్రజలు తమ జీవన విధానంలో, ఆహారంలో, వస్త్రధారణలో, ఆభరణాలలో, ఆర్థికపరమైన వ్యవహారాలలో, న్యాయపరమైన అంశాలలో, మత విశ్వాసాలలో, నమ్మకాలలో, భిన్నత్వాన్ని కలిగివున్నారు. అలాగే గిరిజన జాతులలో అందరికీ ఆమోదయోగ్యమైన సంస్కృతి లేకపోవడం కూడా గమనించదగినది. ఆచారాలు, వ్యవహారాలు పరంగా, జననాలు, వివాహం, మరణాల పరంగా, భిన్నమైన క్రతువులను, సంస్కృతిని, కట్టుబాట్లను ఆయా తెగలు కలిగి ఉండటం మనకు కనిపిస్తుంది. అంటే వీరంతా స్థూలంగా గిరిజనులుగా ఉన్నప్పటికీ, లోతుల్లోకి వెళితే తమ తమ పరిధిలో ప్రత్యేకతను కలిగి ఉండటం గమనార్హం.
అలాగే ఆదిమ జాతి గిరిజన ప్రజల్లో ఆనంద విషాదాలను, సంతోషాలు, సంబరాలను వ్యక్తీకరించే సందర్భాలు వారి నృత్యాలలో, నాట్యంలో, సంగీతాలలో, పాటలలో, మనకు కనిపిస్తాయి. ఆ మేరకు వారి నృత్య విన్యాసాలు ఆ నృత్యాలను ప్రదర్శించే సమయంలో వారు ధరించే వస్త్రాలు లేదా కిరీటాలు వంటివి వైవిధ్యంగా ఉండడమే కాక, వారు పాడే పాటలు ఆయా గిరిజన తెగలకు సంబంధించిన భాషలలో ఉండడం, ఆ సంగీతానికి ఆ పాటలకు తోడుగా నిలిచే వాద్యాలు ఒక్కొక్క గిరిజన తెగకి ఒక్కొక్క విధంగా ఉండటం, గిరిజన తెగల జీవన సంస్కృతిలోని విభిన్న దృక్పథాలకు తార్కాణంగా కనిపిస్తుంది.
తెలంగాణలో ఉన్న ఒక్కొక్క గిరిజన తెగ తమదైన జీవన సాంస్కృతిక విలువలని ఆచరిస్తూ వస్తోంది. వాటిలోని విశిష్టతని, వైవిధ్యతను పరిశీలించి, పరిశోధించి, సశాస్త్రీయంగా శోధించి, వాటన్నిటినీ ఆధారాలతో గ్రంధస్థం చేయాలనేది భాషా సాంస్కృతిక శాఖ సంకల్పం. దీనిని సాకారం చేస్తూ ఆచార్య కుసుమారెడ్డిగారు చేసిన పరిశోధనాత్మక రచనను “తెలంగాణా గిరిజనుల సంస్కృతి - నృత్యం, సంగీతం, వాద్యం” పేరుతో పుస్తకంగా ప్రచురిస్తున్నాం.
అందుకే ఈ పుస్తకంలో ఒక్కొక్క గిరిజన తెగకు సంబంధించిన సామాజిక అంశాలు, కట్టుబాట్లు, పూజా విధానాలు, కళాత్మక విన్యాసాలు, ఉత్పాదక వృత్తులు, ఆచారాలు వంటి వాటిని వివరంగా అందించడం జరిగింది. దీనికి తోడు, మొదటి అధ్యాయాలలో తెలంగాణా గిరిజనులకు సంబంధించిన చారిత్రక, సాహిత్య విశేషాలను సోదాహరణంగా అందించాము. తెలంగాణ ప్రాంతంలో అనాదికాలం నుంచి గిరిజనుల ఉనికికి సంబంధించిన ఆనవాళ్ళు, ప్రదేశాలను (ఖమ్మం ముల్కలపల్లి మండలం నల్లమూడి గ్రామంలోని “అక్షరాల లొద్ది” గుహలు, రాచకొండ గుట్టలలోని "గుర్రాలగుట్ట, పెద్దపల్లి రామగిరి కోట దగ్గరి "పాండవుల లొంక”, మహబూబ్ నగర్ మన్నెంకొండ దేవాలయం దగ్గరి గుహలు, "దొంగల గట్టు గుట్టలు” మల్లూరు గుట్ట చుట్టూ బృహత్ శిలా సమాధులు, వీణవంక గ్రామం దగ్గర "కల్వలగుట్ట గుహలు”, కడెం నదీ తీర ప్రాంతంలో లభించిన పాతరాతియుగం పురావస్తువులు, బమ్మెర గ్రామంలో “మెన్షిర్”లు (వీరుల స్మారక చిహ్నాలు), ఆ ప్రదేశాలలోని చారిత్రక అంశాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
అలాగే తెలుగు సాహిత్యంలో ప్రముఖ కావ్యాలైన మహాభారతం, మొల్ల రామాయణం, నన్నె చోడుని 'కుమారసంభవం', శ్రీనాథుని “హరివంశం”, అనంతామాత్యుని "భోజరాజీయం”, పిల్లలమర్రి పినవీరభద్రకవి "శృంగార శాకుంతలం”, కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక”, శ్రీ కృష్ణ దేవరాయలు 'ఆముక్త మాల్యద', అల్లసాని “మనుచరిత్ర” ధూర్జటి "శ్రీ కాళహస్తీ మహాత్యం”, అయ్యలరాజు రామభద్రుని "రామాభ్యుదయం”, రఘునాధనాయకుని "వాల్మీకి చరిత్ర” వంటి వాటిలో గిరిజనులకు సంబంధించిన పాత్రలు, సన్నివేశాలు, ప్రస్తావనలను ఈ గ్రంధంలో ఉటంకించడంజరిగింది. దీనివల్ల గిరిజన జీవనానికి సాహిత్య సొబగు, కావ్య గౌరవం, ప్రాచీనత, లిఖిత సాహిత్య ఆధారాలలో గిరిజన ప్రజల పాత్ర వంటివి తెలుసుకునే అవకాశం ఏర్పడ్తుంది. ఇది సాహిత్యంలోని సమగ్రతకే కాక, గిరిజన జీవితంలోని సంపూర్ణతకు అద్దం పడుతుంది.
అంతేగాక, మహాభారతంలో వేర్వేరు చోట్ల ఉపయోగించిన శబర, పుళింద, కిరాత, నిషాద, పార్వతీయులు, అరణ్యవాసులు, పర్వతనివాసులు, వనచరులు, బోయలు, వ్యాధులు, పక్షి విధ్వంసకులు, పక్షి వైరి, లుబ్ధ వంటి పదాలు గిరిజన జాతులను ఉద్దేశించే ప్రస్తావించారని తెలుస్తోంది. ఈ పుస్తకంలో విశదంగా అందించిన ఇలాంటి వివరణలు గిరిజనుల సాహిత్య, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక విస్తృతిని ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు.
అలా ఈ పుస్తకం తెలంగాణా గిరిజనులకు సంబంధించిన సంపూర్ణ జీవన చిత్రాన్ని సాద్యమైనంత యధార్థతతో డాక్యుమెంట్ చేసిందని భావిస్తూ, తెలంగాణా గిరిజనుల సాంస్కృతిక వైవిధ్యతను భవిష్యత్ ఆధ్యయనాలకు అందించడంలో సఫలీకృతం అయ్యామని విశ్వసిస్తున్నాము.
ధన్యవాదములతో.,
- రవీంద్ర భారతి,
- హైదరాబాద్.
- ఫిబ్రవరి, 2024
డా॥ మామిడి హరికృష్ణ