తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 493
రేకు: 0093-1 పాడి. సం: 05-368
పల్లవి:
జాజు జాజేకాక దిరశపుఁ బువ్వౌనా
నీజాడెంతయిన నీవు మానేవా
చ. 1:
సంపెంగపూవులలోన సారెకుఁ జూచిన తన-
కంపే కాక తనకాఁక మానీనా
యింపులు గొందరికి యీరసాలు గొందరికి
జంపుల నీ గుణముల జాడ మానేవా
చ. 2:
పొగడ పూవులలోన పొందుగఁ జూచిన తావి
తగుఁగాక తా మదము మానీనా
నిగిడిన నీచేఁత నీ బోంట్ల కే కాక
మగిడి నీగుణములు మంచివయ్యీనా
చ. 3:
కామించి కలువలు కన్నులనద్దుకొనిన
కామునమ్ములునేఁడు గాక మానీనా
దీమసపు వేంకటేశ తెమలని కూటముల
ఆమని మాకోరికల ఆస మానీనా
రేకు: 0093-2 ముఖారి సం: 05-369
పల్లవి:
వంచిన పన్నీటఁబో వాడె నీమోము
మంచునఁ దామెరసొంపు మాయుఁగదవే
చ. 1:
సంపెంగ నూనియనే మజ్జనము సేయఁగఁ బో
చెంపజారి తురుమెల్లఁ జెదరీ నేఁడు
గుంపులైన తుమ్మిదలు కొమ్మ నీయలకలివి
రంపపుఁగంపునకు వెరచుఁగదవే
చ. 2:
జవ్వాది యెప్పుడు నీ నొసల మెత్తఁగానె పో
యెవ్వరు నిలిచిన నోరెత్తవు నేఁడు
కొవ్విన చిలుకపలుకులు దీనిగాలికి
దవ్వుదవ్వులనె కడు దాఁగుఁగదవే
చ. 3:
ఒక్కటై వేంకటవిభుఁడొత్తినరేఖలఁ బో
చక్కని నీచనుఁ గొంగు జారీ నేఁడు
జక్కవపులుగులివి చందురుఁడుదయమైన
వుక్కమీరి బెదరుచునుండుఁ గదవే
రేకు: 0093-3 శంకరాభరణం సం: 05-370
పల్లవి:
సల్లుసూవుల సలమారి యిఁక
వెల్లఁబో నన్ను సెనకఁడుగా
చ. 1:
సంకు సక్రముల సక్కనయ్యకుఁ దన-
వుంకువవో నావొళ్ళెల్లా
సంకనున్న తన సదురాలి మొరఁగైన
సింకసూపు నాపై సిమ్మఁడుగా
చ. 2:
మాపురేపుసూపు మాయలయ్యకుఁ దన-
దాఁపురమువో నాతలఁపెల్లా
వీఁపురమణికంత వెఱవకయినఁ దన
పూఁపనవ్వు నాపైఁ బుయ్యఁడుగా
చ. 3:
వుసురుఁ బడుకమీఁదనొరగిన్న సక్కని-
రసికుఁడు వేంకటరాయఁడు
పసపుశీర నాకుఁ బరపుగాఁ బరపించి
యెసగ నిట్టె సనవియ్యఁడుగా
రేకు: 0093-4 కేదారగౌళ సం: 05-371
పల్లవి:
తనివిదీరమికిఁ గుంటెనలె యాస
అనుమతులకుఁ దాఁకనాడుటే యాస
చ. 1:
సరినెలయింపులకు సళువుఁ జూపులె యాస
గిరుపుఁగన్నులకు జంకెనలె యాస
సరసంబునకు నలసపుఁ గసరులే యాస
మరు పెరరేఁపులకు మంతనమె యాస
చ. 2:
కడుఁ గోరికలకుఁ లోఁగాఁతాళములె యాస
చిడిముడికాఁకలకుఁ జింతలే యాస
బడలికకౌఁగిటికి బట్టబయలే యాస
పడరానియెడఁ గడపటిచేఁతె యాస
చ. 3:
రతిసమయమునకు రాకొట్టులే యాస
అతివమోహమునకుఁ గయ్యములె యాస
యితమైన తిరువేంకటేశు కౌఁగిటఁ గూడి
మతిలోనికెపుడుఁ దమకములె యాస
రేకు: 0093-5 శుద్ధదేశి సం: 05-372
పల్లవి:
మొలనూలి గొల్లెత మురియుచును
వలవంతఁ దిరిగీని వాడవాడలను
చ. 1:
సంపెఁగలతురుముతో చల్లలమ్మీనిదివొ
పంపుమోము గొల్లెత వాడలను
యింపులకోరికె తో నిందిరాపతి యెదుట
జంపుల నటనలతో సాళగింపుచును
చ. 2:
నొసలికస్తూరితోఁ గన్నుల నవ్వీనిదివో
పసివాడు గొల్లెత వాడలను
కసరుచు హరిమీఁదికాఁకల కోపముతో
యెసరుఁ జెమట గోర యెమ్మెలఁ జిమ్ముచును
చ. 3:
చెలువంపుటుంగరాల చెయి వీచీనిదివో
వలపుల గొల్లెత వాడలను
కలికియై తిరువేంకటవిభుకౌఁగిట
అలసిన నటనల నల్లంతనేఁగుచును
రేకు: 0093-6 శంకరాభరణం సం: 05-373
పల్లవి:
మెఱ్ఱో నేననఁగానే మొక్కేవుగాని
వెఱ్ఱినేను వెఱ్ఱినేను వెఱ్ఱినేను సుమ్మీ
చ. 1:
సడ్డలాడఁగానే కడు జారినపయ్యద చూచి
యెడ్డ నన్ను జాణఁజేసేవేఁటికో కాని
వడ్డివారే వలపుల వన్నెవెట్టనేర నే
గొడ్డేరే గొడ్డేరే గొడ్డేరే సుమ్మీ
చ. 2:
ఒల్లననఁగానే నన్నునుద్దండపుఁ దుటారాల
చల్లలమ్మఁగానే పగ చాటేవు గాని
కల్లలాడనేర నీతో కపటాలు నేర నే
గొల్లదాన గొల్లదాన గొల్లదానఁ జుమ్మీ
చ. 3:
వేంకటేశుఁడ నేనంటా వేసాలఁ బొయ్యేనంటా
అంకులచేతులుచూచి యంటితి గాని
కంకిగా గుబ్బలమీఁద గాజునఁ దీసేవు నే
వుంకువొల్ల నుంకునొల్ల నుంకునొల్లఁ జుమ్మీ