తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 492
రేకు: 0092-1 శ్రీరాగం సం: 05-362
పల్లవి:
వాఁడు నాకు నిక్కముగా వలచినను
నేఁడు వచ్చి బంటువలె నిలుచుండుమనవే
చ. 1:
సిగ్గు గొంత పరులపై చింతగొంత తనకు
యెగ్గు గొంత నామీఁదనేఁటివలుపే
అగ్గలమై తానేలే అన్నిలోకములును
తగ్గనీక నాకునిట్టే దక్కఁగ నిమ్మనవే
చ. 2:
బొంకు గొంత సత్యములు పొందు గొంత తనకు
యింకా మానఁడు నాపైనేఁటివలుపే
సంకెలేక వెంటవెంట సటలెల్ల విడిచి
కొంకక నాయందలము గొలిచి రమ్మనవే
చ. 3:
రచ్చగొంత రాఁపుగొంత రాజసము దనకు
యెచ్చుగొంత కుందుగొంత నేఁటి వలుపే
వెచ్చనై కౌఁగిటఁ గూడె వేంకటేశ్వరుఁడు
మచ్చిక నిట్టెయాకు మడిచి యిమ్మనవే
రేకు: 0092-2 సావేరి-జంపె సం: 05-363
పల్లవి:
మెచ్చెనొకరాగంబు మీఁద మీఁద కడు-
నిచ్చెనొకరాగంబు యింతులకునెల్ల
చ. 1:
చేసెనొకరాగంబు చెలియెదుటఁ గన్నులనె
మూసెనొకరాగంబు ముదిత మతినె
పూసెనొకరాగంబు పొలిఁతిపులకలమేన
వ్రాసెనొకరాగంబు వనిత నినుఁబాసి
చ. 2:
పట్టెనొకరాగంబు ప్రాణములపై నలిగి
తిట్టెనొకరాగంబు తిరిగి తిరిగి
పుట్టెనొకరాగంబు పొలఁతిడెందమునకును
మెట్టెనొకరాగంబు మెరయుచునె కదలి
చ. 3:
కురిసెనొకరాగంబు కొప్పు పువ్వులనె సతి
మురిసెనొకరాగంబు ముంచి మేన
తిరువేంకటేశ్వరుఁడ తెలుసుకో నినుఁబొంది
పొరసెనొకరాగంబు పొలఁతికుచములనే
రేకు: 0092-3 రామక్రియ సం: 05-364
పల్లవి:
చాలుఁ జాలు నీతోడి సరసాలు యిట్టె
పాలిండ్లకొంగుజారి బయటఁ బడితిమి
చ. 1:
సిగ్గువడితిమిర నీ చేసిన చేఁతలకు-
నగ్గమైతిమిర మరునమ్ములకును
దగ్గరి నీకాఁకలఁ దగులఁబట్టి నేఁడు
బగ్గన నిందరిలోనఁ బలచనైతిమి
చ. 2:
నొగిలితిమిర నేము నోఁచిన నోములకు
పొగిలితిమిర నీపొందులకును
తెగి నీవు నన్ను రతిఁదేలించి తేలించి నాకు
పగటు బిగువులెల్లఁ బచ్చిగాఁ జేసితివి
చ. 5:
దప్పిఁ బడితిమిర నీతాలిములనే కడు
నొప్పిఁ బడితిమీర నీ నొక్కుఁజేతల
ఇప్పుడిట్టె తిరువేంకటేశుఁడ నీవు నా-
కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము
రేకు: 0092-4 కాంబోది సం: 05-365
పల్లవి:
వలుపేడఁ గలిగెనే వామలోచనకు దీని
వలపించినటువంటివాఁ డింకనెవ్వఁడో
చ. 1:
సిరులు గల మోమెల్ల చిరునవ్వుగనుదోయి
విరివైన వురమెల్ల వేఁకమైన గుబ్బలు
తరుణికి వెనకెల్లఁ దురుము పిఱుఁదులును మంచి-
నిరతంపు నడపెల్ల నిండుమురిపెములు
చ. 2:
జలజాక్షినిలువెల్ల చక్కఁదనముల పోగు
కలికితనమెల్లఁ గన్నులపండువు
కలకంటివయసెల్ల గడుఁ గోమలము దీని-
పలకుఁదేనియలెల్ల పంచదారకుప్పలు
చ. 3:
చెలువైన మోవెల్ల చిలుకవోట్లు దీనిఁ
కలదేహమింతయునుఁ గస్తూరివాసనలు
అలరించెఁ దిరువేంకటాధీశ్వరుఁడు దీ ని-
తలఁపెల్ల విభునిలో దాఁగున్న కరువు
రేకు: 0092-5 కాంబోది సం: 05-366
పల్లవి:
ఎవ్వతిర ప్రియము నీకింత నేసినది చూచి
దవ్వుల నిన్నొకమాఁట తగులనాడినది
చ. 1:
సిబ్బెంపు గుబ్బలమీఁది జిలుగుఁ బయ్యదది
గబ్బిచూపు నిన్నుఁ జూచి కన్నుల నవ్వినది
బబ్బిలికాయలతోడి పసిఁడిమెట్టెలది
జొబ్బిలిన చెమటలచేఁ జొక్కి నిలిచినది
చ. 2:
తొంగలిరెప్పలతోడి తోరపుఁ గన్నులది
చెంగటిచెలియచేతఁ జెయివేసి నవ్వినది
చెంగలువబంతిచేతఁ జెక్కునొక్కినది
వుంగరాలవేళ్ళ నీ కొయ్యనె మొక్కినది
చ. 3:
వీడక వీడని కొప్పువిరులు జారినది
వాడక వాడని మోవివన్నెలు దోఁచినది
యీడులేని తిరువేంకటేశ నినుఁబొంది యీ-
కోడెవయసున నింతి కోరికెలందినది
రేకు: 0093-6 ఆహిరి సం: 05-367
పల్లవి:
జిగురువంటివాఁడె శినకాటి చింత-
శిగురమ్మఁబోనీఁడె శిన కాటి
చ. 1:
సేఁతి కుత్తికవాఁడు సెడ కుండ దాఁచిన-
పాఁతపెద్దవిల్లు బలువున
నాఁతికొరకు వచ్చి నడిమికి విఱిశిన-
శేఁతలాఁడుగదె శినకాటి
చ. 2:
రట్టడిశేఁతల రాకాశినాయని
పట్టపుశెలి యలిఁ బడవేశి
కొట్టఁ గొనముక్కు గోశివేశినట్టి-
శిట్టగీఁడుగదె శినకాటి
చ. 3:
నలుపున వెంకటనగమునఁ గోనేటి-
నెలవున సొంపుతో నెలకొని
కలిమి పడుసుతోడి కాఁపురమున్నట్టి
శిలుగులాఁడుగదె శినకాటి