తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 491
రేకు: 0091-1 ఆహిరి సం: 05-356
పల్లవి:
ఇంతి చేసిన భాగ్యమిట్లుండె దైవకృత-
మింతయును గడపంగ నెవ్వరికి రాదు
చ. 1:
విరహవేదనచేత వేఁగెడి విలాసినుల
సొరిది నింతకు మున్ను చూడమో వినమో
అరుదైన దుస్తరంబై ధరించఁగరాని-
దురవస్థలెవ్వరికి దొరకవనికాక
చ. 2:
తల దోఁకలేని చిత్తమున వలపులఁ బొరలు-
పొలఁతులింతకుమున్ను పుట్టరో చనరో
అలవోక తెలుపులును అబ్బురపు మరపులును
కొలఁదిమీరుట మిగుల గోరమనికాక
చ. 3:
దేవతాకృపగలిగి దివ్యవైభవములను
భూవలయమున సతులు పుట్టరో మనరో
శ్రీ వేంకటేశుఁడీచెలియకిచ్చిన చనవు-
లేవెలఁదులకు నాతఁడియ్యఁడనికాక
రేకు: 0091-2 భైరవి సం: 05-357
పల్లవి:
ఎవ్వతెరా నినుఁజూచె నేమని పుత్తెంచె
పువ్వుబంతి నిను వేసి పొందుచూపి మొక్కినది
చ. 1:
వీడియు వీడని కొప్పు వేఁగున వీఁగుచు మాట -
లాడియు నాడక చెలినల్లన దూరినది
వాడియు వాడని తమ్మివంటిమోము గలది తాఁ
జూడక చూచిన వాలుఁజూపుల బిత్తరిది
చ. 2:
జారియు జారని గుబ్బచన్నుల పయ్యెదది లో-
నారియు నారని కోపమైన మోహముది
పేరియుఁ బేరనికాఁక- బెచ్చువెరిగినది తాఁ
జేరియుఁ జేరక నీ చేరువ దాఁగినది
చ. 3:
మాట లాడుచును మోవి మఱఁగు నేసినదొక-
పూఁటలోనె నీ కౌఁగిటి పొందులనుబ్బినది
యేఁటికిరా తిరువేంకటేశుఁడ బొంకఁగ నీ-
నాటకపు బ్రియముతో నన్నుఁ గలసితివి
రేకు: 0091-3 దన్నాసి సం: 05-358
పల్లవి:
ఏమి బాఁతి నేఁడిదె నీకు మముఁ
గామించు సిరులింతె కదవయ్యా
చ. 1:
వెనక ముందర వెలయఁగ ముందర-
వెనకలింతే విభవాలు
వనితల పిఱుఁదులు వాఁడికుచములు కొప్పు
కనుఁగొన భ్రమలింతె కదవయ్యా
చ. 2:
వెలుఁగు చీఁకటి విరసాలు విభవాలు
కలిమిలేములే కదవయ్యా
పలువన్నె మాటలు పనితేటలు నివి
కలవెంత కలలింతె కదవయ్యా
చ. 3:
పగటుగుబ్బలు పాయపునడపులు
తగులుమాఁటలు తమకయ్యా
తగు వేంకటగిరిదైవమ నీ పొందు
తగులు దొరకుటమృతము సోఁకుటయ్యా
రేకు: 0091-4 ముఖారి సం: 05-359
పల్లవి:
మాటలు నేరుతువుగా మాయమ్మా
యేఁటికి నాతని నీవే యేలవమ్మా
చ. 1:
చేయరాని విన్నపాలు నేసిసేసి విభునింత
మాయలఁబెట్టితివి గా మాయమ్మా
రాయడించి యిఁకను నారాజ్యమెల్ల నీవే
నేయవమ్మా నేనేమి సేసేనమ్మా
చ. 2:
ఎందును నీకతఁడు నోరెత్తకుండ మంత్రాలు
మందులు నేరుతువుగా మాయమ్మా
చెందరాని సుఖమెల్లఁ జెలఁగి యాతఁడు నీవే
చెందవమ్మా నాకేల చిన్నదానికమ్మా
చ. 3:
వన్నెల వేంకటపతి వలఁబెట్టి యతనిచే
మన్ననఁ బొందితిగా మాయమ్మా
నన్నుఁజూడుమిఁకను నీ ననిచిన యతని నే
సన్నలఁ జిక్కించుకొంటిఁ జాలదా నాకమ్మా
రేకు: 0091-5 అమరసింధు సం: 05-360
పల్లవి:
తలఁచిన దేహము నిలువదు తాననుఁ దలఁచునో తలఁచఁడొ
వలనుగఁ జెలిమాటలు విని వచ్చీనో రాఁడో
చ. 1:
శిరసున నంటిన పునుఁగిటు చెక్కుల జారెడిననుచును
ఉరవడిఁ దివియుచుఁ గొనగోరూఁదిన చందములు
మురిపెపు మొలనూళ్ళపై మొగపుల సొబగులు చూచుచు-
నరుదుగ గరమున నక్కడ నంటెడి యాసలును
చ. 2:
చెనకుల వీడెపురసమిదె సెలవులఁ జెదరెడిననుచును
నునుపగు గోళ్ళ వాతెర నొక్కినచందములు
పెనగొను ముత్యపుసరముల పెక్కువ దీర్చెదననుచును
చనవునఁ జనుఁగవపై జే చాఁచిన చందములు
చ. 3:
వుద్దపు నడపులలోపల నొయ్యన పాదము జారిన-
నొద్దికతో నునుఁగౌఁగిట నొరసిన చందములు
నిద్దపుఁ దిరువేంకటగిరినిలయుఁడు ననుఁ దనకౌఁగిట-
నద్దిన కస్తూరిచెమటల నలమిన చందములు
రేకు: 0091-6 భూపాళం సం: 05-361
పల్లవి:
సువ్వి సువ్వి సువ్వలమ్మ
నవ్వుచు దేవకి నందనుఁ గనియె
చ. 1:
శశి వొడచె అలసంబులు గడచె
దిశల దేవతల దిగుళ్ళు విడిచె
చ. 2:
కావిరా విరిసె కంసుఁడు గినిసె
వావిరిఁ బువ్వులవానలు గురిసె
చ. 3:
గతిసేసె ఆటు గాడిద గూనె
కుతిలకుడిచి జనకుఁడు నోరుమూసె
చ. 4:
గగురు పొడిచె లోకము విధి విడివె
మొగులు గురియఁగ యమున పై నడచె
చ. 5:
కలి జారె వేంకటపతి మీరె
అలమేల్మంగనాచారలుకలు దీరె