Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 486

వికీసోర్స్ నుండి


రేకు: 0086-1 ఆహిరి సం: 05-326

పల్లవి:

జట్టిగొనెర నిన్ను జవరాలు
చిట్టంటు చేఁతల జెలఁగితివపుడు

చ. 1:

వాలుకచూపులు వాడఁగ నాటక-
సాలలోన నిను జవరాలు
చాలుగ మురియుచు సరుగనఁ జివుకన
కాలఁ జిమ్మినను కలఁగితివపుడు

చ. 2:

సొలపుగొనుచు మించుల మొలనూళ్ళ
సళుపుల మురిపెపు జవరాలు
గలగల గజ్జెలు గదలఁగ నునుఁదొడ
బలిమిఁ గదలిచిన బ్రమసితివపుడు

చ. 3:

సొంపగు తల చంచుల మునివేళ్ళ-
సంపద నడపుల జవరాలు
యింపులు నెరవుచు నిటె నినుఁ గదిసిన
కంపించితి వేంకటగిరిరమణ


రేకు: 0086-2 సామంతం సం: 05-327

పల్లవి:

అద్దిరా చిమ్ముల మాటలప్పటి నీకు
పెద్దరికాలనె మురిపెములే చిమ్మేవు

చ. 1:

వద్దన్న మానవు నేనెవ్వతెరా నీకు నీ-
నిద్దురచూపులు నాపై నివాళించేవు
బద్దులెల్లనేడ నగపడెరా నీకు యీ-
ముద్దులమాటలాడుచు మోమే వంచేవు

చ. 2:

డెంద‌ములో నేనిఁకనేఁటికిరా నీకు నీ-
యందిపాటుచేఁతల నన్నలయించేవు
కిందిచూపులేడ దొరకెరా నీకు నీ-
చెందమ్మిచేతుల నాచెఱఁగువట్టేవు

చ. 3:

బింకములెవ్వతె నేరిపెరా నీకు నీ-
కుంకుమపూతలే చెరఁగునఁ గుప్పేవు
యింక నిన్నియునేల యిదె నీకు తిరు-
వేంకటేశ నాకౌఁగిట వేడుకఁ గూడితివి


రేకు: 0086-3 రామక్రియ సం: 05-328

పల్లవి:

పంతమాడి పిలిచినఁ బలుకదెవ్వరితోడ
యింతవలచిన వలపెంచునైనఁ గలదా

చ. 1:

వెక్కనపు గుబ్బలపైవేసిన కప్పురమెల్ల
నొక్కమాటే నీరాయనోయమ్మా
మిక్కుటమైన దీని మేనిమీఁది వెక్కచూచి
వక్కలాయ గుండె యిట్టి వలపెందుఁ గలదా

చ. 2:

గుప్పెడి నిట్టూరుపుల కోమలిహరములెల్ల
వుప్పరాలెగయఁ జొచ్చెనోయమ్మా
వుప్పతిల్లుఁ జెమటల నోలలాడఁగానె మేను
నిప్పువలెనున్నదిట్టి నెయ్యమెందుఁ గలదా

చ. 3:

కొయ్యతనమునిట్టె కోనెటిరాయనిఁ గూడి
వుయ్యాలమంచముమీఁదనోయమ్మా
పయ్యెదచెరఁగు జారఁ బచ్చిసేఁతలిన్నియును
ముయ్యఁజూచీ నిటువంటిమోహమెందుఁ గలదా


రేకు: 0086-4 బౌళి సం: 05-329

పల్లవి:

ఎపుడు నాయెడ నికు నిదివలెనా
కపటాలు నిజములు కలిగినాతఁడవు

చ. 1:

వెల్లిగా నీవూర్పు వేదమట వేఁడి
చల్లీని శ్రుతికి నుష్ణము గలదా
పెల్లుగ నిరువంకఁ బిరువీకులై వేఁడి
చల్ద నీదైనా వెచ్చనిది గావలదా

చ. 2:

నగు నీమాటలే పురాణంబులట బొంకు
దగిలీని చదువులింతయు బొంకులా
తెగి యిరువంకలఁ దీదీపులై నీ
పొగరుల మాటలెప్పుడును నిక్కము లా

చ. 3:

చలివేఁడిచూపుల జాణవట యిట్టె
బలసి నాఫైఁ బరపఁగవలెనా
కలికివై తిరువేంకటవిభుఁడ నన్నుఁ
గలయక యలయించి కలిసితివిపుడు


రేకు: 0086-5 శ్రీరాగం-రచ్చెతాళం సం: 05-330

పల్లవి:

కనలకువే మతి కలఁగీని యీ-
వనజోదరుఁడిదె వచ్చీనిపుడు

చ. 1:

వడిఁ గుచభరమున వ్రాలెడి వేగము
నడవకువే సన్నపు నడుము
చిడుముడి నన్నుఁ జేసిన గోవిందుఁడు
తడయఁడు నిన్నుఁ దగిలీనిపుడు

చ. 2:

కొప్పువేఁగుననె కుదిసిన మెడ గడు-
తిప్పకువే కందెడి సరులు
దప్పివొదలఁ బరితాపము నీమై
కప్పిన శ్రీహరి గదిసీఁ గాని

చ. 3:

పొరలుచు నిట్టూర్పులను సురనియెదు
వెరవకుమెన్నఁడు వేదనల
కరఁగి నీవు వేంకటపతికౌఁగిట
మెరసితివిటు కడు మించిన రతుల


రేకు: 0086-6 ఆహిరి సం: 05-331

పల్లవి:

అలికి సంపెంగ తావికణఁగి నట్టు
తొలఁగీ నుదుట జారి తుమ్మిదల పిల్లలు

చ. 1:

వెలఁదియారను పాము వెంటఁబెట్టుకొని రాఁగా
తలఁకి చంద్రుఁడు వోయి దాఁగినట్టు
పలువెన్నె మెఱుఁగుల పయ్యదలోనె దాఁగె
చలివేఁడి మెఱుఁగుల చందమామపిల్లలు

చ. 2:

కోవిలపలుకుదాడి కోపగించి వెంటరాఁగా
తావుల చిగురువోయి దాఁగినట్టు
మోవి సూదివాటులై మొనసి కానవచ్చీని
మావుల చిగురులోని మాణికాలపిల్లలు

చ. 3:

భారమైన విరహతాపపు సూరియుండు రాఁగా
తారితారి చకోరాలు దాఁగినట్టు
కూరిమి వేంకటపతిఁ గూడిన తమకమున
గోరగించీనిదివో చకోరములు పిల్లలు