తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 481
రేకు: 0081-1 లలిత సం: 05-295
పల్లవి:
తెప్పగా మఱ్ఱేకుమీఁదఁ దేలాడువాఁడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాఁడు
చ. 1:
మోఁతనీటి మడుగులో యీఁతగరచినవాఁడు
పాఁతగిలే నతికిందఁబాయనివాఁడు
మూఁతి దోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాఁడు
రోఁతయైన పేగుల పేరుల గలవాఁడు
చ. 2:
కోడికూఁతనోరివాని కుఱ్ఱతమ్ముఁడైనవాఁడు
బూడిది పూసినవాని బుద్దులవాఁడు
మాడవన్నె లేటివెంట మాయలఁ దగిలినవాఁడు
దూడల నావులఁ గాచి దొరయైనవాఁడు
చ. 3:
ఆకసానఁ బారేవూరి అతివల మానములు
కాకు సేయువాఁడు తురగముపైవాఁడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణిఁ గూడి
యేకాలముఁ బాయని యెనలేనివాఁడు
రేకు: 0081-2 సామంతం సం: 05-296
పల్లవి:
పెద్దపిన్నవరుసఁ బెరుగవలసి తా-
నిద్దరైన యాతఁడీతఁడు
చ. 1:
మెరుఁగురెక్కల పెద్దమేని పులుగునెక్కి
యిరులుకొనెడి యాతఁడీతఁడు
ఎరమంటలెగయంగ నేచిన పురముల-
నెరియించిన యాతఁడీతఁడు
చ. 2:
చల్లని చూపుల సతికి వలచి పోయి
యిల్లిటమున్నవాఁడీతఁడు
తెల్లనీటిపై దిక్కులు వెలుగఁగ-
నిల్లుగట్టిన యాతఁడీతఁడు
చ. 3:
చూచిన చూపుల సుఖదుఃఖములఁజేయ-
నేచిన పెనుదైవమీతఁడు
ఆచందముల వేంకటాద్రిపై నెలకొని
యీచోటనున్న వాఁడీతఁడు
రేకు: 0081-3 ముఖారి సం: 05-297
పల్లవి:
కంటిమి నీలాగులెల్లఁ గన్నుల యాఁకలి దీర
బంది బంటు తనమేల మాతోఁ బంతమింత చాలదా
చ. 1:
మింటిమీఁది కంటిచూపు వంటలేని కూడు నీకు
గుంటిమీఁది తోడఁబుట్టు గొల్లవారికలిమి
ఒంటిగాక లోకమెల్లనొక్కటైన మేను మంచి-
జుంటితోడిఁ బుటినాలు సుకమింత చాలదా
చ. 2:
నాలుగు మోములబిడ్డ నవ్వుల సంసారము
వేలుమోపరానియిల్లు వింతవింతచెలువు
కాలిగోరఁ బుట్టినట్టి గద్దరికూఁతురు మంచి
పాలమీఁదిపడుక నీ బ్రదుకింత చాలదా
చ. 3:
ఎల్లనాఁడు నురముమీఁద నెండగాయ కావిరాయి
గుల్లకూఁతతోడినోరు కొనగోరుబలిమి
చెల్లురా నీకింతవట్టు శ్రీవేంకటేశ్వరుఁడ
మల్లువారితోడి పోరుమానవింత చాలదా
రేకు: 0081-4 ముఖారి సం: 05-298
పల్లవి:
కడగంటనే కెంపు గదురఁగాను
పడఁతి మురిపెపునటనఁ బాయ దేమియును
చ. 1:
మగువ ముత్తియపు గమ్మల వెన్నెలలుఁ జిన్నిఁ
నగవువెన్నెలలు నున్నతిఁ బొలయఁగాను
జగడించి విభుని విరసంబులనె సొలయఁగా
మొగముననుఁ గోపంబు మొలవదేమియును
చ. 2:
రమణికుచకుంభభారమును మొలనూళ్ళ భా-
రమును నెన్నడిమి సన్నము దెలుపఁగా
ప్రమదంపు విభునిఁ బెడఁ బాసి చెనకుచు లోని-
తమకంపు సంభ్రమము తరగదేమియును
చ. 3:
ముదిత మై సింగారములుఁ జక్కదనములును
పదివేలు విధములై పరఁగఁగాను
కదిసి వేంకటవిభుని కమ్మఁగౌఁగిటి రతులఁ
జెదరు నలకల సిరులు చెదరవేమియును
రేకు: 0081-5 బౌళి సం: 05-299
పల్లవి:
బహుకర్మభోగంపు పనులెల్ల నిట్లనే
యిహసుఖంబిందరికి నెట్లనో కాని
చ. 1:
మెలుఁత విభుఁ బాసియును మితిలేని వేదనల-
నలరి యాతనిఁగూడు నభిరతుల నలసె
అలిగినను గూడినను కలిగె వలపులు దనకు-
నెలమిఁ దనసుఖములిఁక నెప్పుడో కాని
చ. 2:
ఉడుగని వియోగాగ్ని నూర్పు గడు వేఁడాయ
కడు రతులతో నూర్పు గాఁగి వేఁడాయ
కడఁగిననుతాపంబె కప్పె మై తాపంబె
యెడలేని తమి యింత నెప్పుడో కాని
చ. 3:
తిరువేంకటాచలాధిపునిఁ బాసినయపుడు
తరుణి యాతనినిపుడు తగఁ గూడినపుడు
పరవశము దఱచాయ పైపైనె ఘమమాయ
యిరవైన యెరుకలిఁక నెప్పుడో కాని
రేకు: 0081-6 శ్రీరాగం సం: 05-300
పల్లవి:
కుంకుమచెమటలంటా గొఱగేవు మరు-
దొంకెన తామరల నెత్తురుచారలమ్మా
చ. 1:
కోవిదునిమీఁద నేల కోపగించేవతని కె-
మ్మోవి కప్పు మరునియమ్ములతాఁకులే
తావుల వింతలకుఁ గాఁతాళించేవతనిపై
భావజువింటి పూవు బారిఁ బడెనమ్మా
చ. 2:
నొసలి కస్తూరంటా నొగిలేవాతనిపై
కసటుఁగాఁకల కందుగందము చూచి
యెసగ గందవొడంటా యెఱ్ఱఁబారేవాతనిపై
పసని మదనుదాడి బలుదుమ్ములమ్మా
చ. 3:
ఆఁటదాని గోరితాఁకుల నేవాతనిపై
నాఁటినచందురుని సన్నపు రేకలే
గాఁటపుఁ గాఁగిటను వేంకటపతి నీకు దక్కె
యేఁటికి నాతనివింకా నెగ్గులెన్నేవమ్మా