Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 480

వికీసోర్స్ నుండి


రేకు: 0080-1 శ్రీరాగం సం: 05-289

పల్లవి:

అంజలిరంజలిరయం తే
కిం జనయసి మమ ఖేదం వచనైః

చ. 1:

మాం కిం భజనే మయా కింతే
త్వం కోవా మే తవ కాహం
కిం కార్యమితో గేహే మమ తే
శంకాం వినా కిం సమాగతోసి

చ. 2:

నను వినయోక్తేర్న యోగ్యాహం
పున: పునస్త్వం పూజ్యోసి
దినదిన కలహవిదినా తే కిం
మనసిజజనక రమారమణ

చ. 3:

దైవం బలవత్తరం భువనే
నైవ రోచతే నర్మ మయి
ఏవమేవ భవదిష్ణం కురు కురు
శ్రీవేంకటాద్రి శ్రీనివాస


రేకు: 0080-2 సామంతం సం: 05-290

పల్లవి:

విరహన నినుఁబాసి వేఁగేను
తరుణి నేను నిన్నుఁ దప్పఁ దోయఁగలవా

చ. 1:

మున్ను నీవు రేపల్లెను ముచ్చిలించుకొన్న పాలు-
వెన్నలునారగించి విఱ్ఱవీఁగేవు
సన్నపు నడిమితోడి జవ్వనాన నలయుచు-
నున్నదాన నీతోడ నోపుదునా పెనఁగ

చ. 2:

నేరుపునఁ బాలజలనిధిలో నమృతమెల్ల-
నారగించి లావున నన్నప్పళించేవు
బీరమునఁ జిగురాకుఁ బెదవితోఁ గనుచూపు-
గూరిమి నేనుఁ డి నిన్నుఁ గుచ్చి పట్టఁగలనా

చ. 3:

గుద్దలించి దనుజుని గోరఁ జెనకిన నిన్ను
అద్దలించి చెనక నీయంతదాననా
గద్దరివి తిరువేంకటగిరివిభుఁడ నీ-
నిద్దపుఁ గస్తూరిమేను నేనాఁగగలనా


రేకు: 0080-3 ముఖారి సం: 05-291

పల్లవి:

ఎక్కడిదిఁకఁ బరిణామము యీమదనానలమునఁ బ్రియ-
మెక్కుడు దోఁపఁగ దైర్యంబింతయుఁ దీరెడిని

చ. 1:

మనసునఁదలఁచినతలఁపులు మాటల వెడలఁగ నాడిన
గొనకొని కన్నుల నీళ్ళు గుత్తుకవట్టెడిని
కనుఁగవ చూచినచూపులు కౌఁగిటఁ జేర్పఁగఁ బోయిన
పనివడి హృదయంబంతయుఁ బరవశమయ్యెడిని

చ. 2:

తనువున నాటినమాటలు తప్పక మతిఁ జింతించిన
అనువుగనది పరితాపంబై పెరరేఁ పెడిని
వెనకదినంబుల కూటమి వేడుకలని తలపోసిన
పెనగొన పూఁటకుఁ బూటకు ప్రేమము పెరిగెడిని

చ. 3:

తిరువేంకటగిరినాథుని దేవోత్తముఁ గూడిన మది
యెరగొని దేహవికారములెరవై తోఁపెడిని
పరమాత్మునికరుణారస పానము సేసిన జిహ్వకు
అరుదుగ నితరపదార్థములన్నియు రోసెడిని


రేకు: 0080-4 శ్రీరాగం సం: 05-292

పల్లవి:

తానట ప్రాణేశుండట తమకము తమకముఁ గూడఁగ
వేనలి జారినఁ దలఁకని వేడుకలెట్టివొకో

చ. 1:

మీఁటినఁ బగిలెడిగుబ్బలమీఁద నలందిన గందపు-
వేటులతళుకులు పయ్యెద వెలుఁపలఁబొలయఁగను
నాఁటిన మదనుని శరముల నలఁకువనొయ్యన తోఁపఁగ
మాటకు మాఁటాడదు చెలిమర్మంబెట్టిదొకో

చ. 2:

మించిన తొడల మెఱుంగుల మెలుఁతుక గట్టిన పుట్టము
చించుక వెడలిన నిగ్గులు సిగ్గులు దొలఁకగను
వంచినరెప్పల కన్నుల వడియు జలంబులు చెక్కుల
నించినఁ బలుకనిభావపు నెవ్వగలెట్టివొకో

చ. 3:

కమ్మనితావుల చెమటల గాలికి నొయ్యన మెచ్చుచు
సొమ్మలఁదేలెడి మరపుల సొక్కులఁ దేలుచును
దిమ్మరికోనేటప్పని తిరువేంకటపతిఁ గూడిన
కొమ్మకు మీఁదటియాసల కోరికలెటివొకో


రేకు: 0080-5 నాదనామక్రియ సం: 05-293

పల్లవి:

మలసిన తుమ్మిద మగవాఁడు
నిలిచి నాకు వెరవ నీకేలయ్యా

చ. 1:

మగువలు సురతపు మఱపునఁ గుచములఁ
దగిలిన రేకలతరిఁ జెలఁగి
పగటున సిగ్గులు పడుదురుగాకిటు
నిగిడిన సిగ్గులు నీకేలయ్యా

చ. 2:

వనితలు రతిపరవశమున మురిపెపు-
కనుఁగవచూపులఁ గరఁగుచును
జునుగుల చూపులు చూతురుగాకిటు
యెనసినెనయములు యిఁకనేలయ్యా

చ. 3:

లోలో మముబోంట్లు వనితలు వగఁ
దూలుచు జడమౌదురు గాక
తేలించితి రతి తిరువేంకటపతి
నాలికాఁడ నీనగవేలయ్యా


రేకు: 0080-6 దేశాక్షి సం: 05-294

పల్లవి:

ఏడనున్నదో యీతరుణి
చూడక చూచిన చూపులలోన

చ. 1:

మేఁతలు మరిగిన మీల పిల్లలకు
నీఁతలు నేరిపి యీతరుణి
కాఁతాళించిన కన్నుల నీళ్ళ
చేఁతల నిండిన చెరువులలోన

చ. 2:

ముత్తెపునవ్వుల మురిపెపుఁ బువ్వుల
యెత్తులె కట్టి యీతరుణి
లత్తిక మోవికి లంచముగా పై
మెత్తిన దంతపు మెరుఁగులలోన

చ. 3:

పసని చీఁకట్ల పలుమరుఁ దవ్వి
యిసుక పాఁతరలె యీతరుణి
కసిగాట్ల వేంకటపతి కౌఁగిట
రసములొలుక నేరములెన్నుచును