Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 476

వికీసోర్స్ నుండి


రేకు: 0076-1 దేశాక్షి సం: 05-265

పల్లవి:

అవ్వలిమాటలే హితవవుఁగాక
రవ్వలై నీకింక నిందు రాఁదీరునా

చ. 1:

మందలించి మధురలో మగువల మాటలే
విందుగాక చెవులకు విందులుగాను
మందల మగువుల మా మాటలు చెవులకు గో-
విందుఁడా మాసుద్దులిఁక వినఁదీరునా

చ. 2:

వాసనగాఁ బువ్వులింటివారతోడి పొందులే
సేసి నీవు మమ్ము నీవు చెనకే వింక
దోసాలు గావుగద మాతోడి పొందులివి శ్రీని-
వాసుఁడా మాచేఁతలను వడదీరునా

చ. 3:

మాయలు మందులుసేసే మానినుల పొందులే
రేయుఁబగలును నీకు రేసులుగాక
పాయక కూడితి నన్ను బాపురే వేంకటగిరి-
రాయఁడా మాకౌఁగిటి రట్టుకోపుదా


రేకు: 0076-2 శంకరాభరణం సం: 05-266

పల్లవి:

ఇంతి భువనమోహినియైన ఫలము
కాంతునిఁ దలఁచి వగలఁ జిక్కెనిపుడు

చ. 1:

మెలుఁతకన్నులు గండుమీలైన ఫలము
తొలఁకురెప్పల నీరు దొరకె నేఁడు
లలనమై నవపుష్పలతయైన ఫలము
వలపు చెమట నీట వడిఁ దోఁగె నిపుడు

చ. 2:

మెఱుఁగారు నెరులు తుమ్మిదలైన ఫలము
నెఱిఁ దమ్మిమోముపై నెలకొన్నవి
పఱచు జక్కవలు గుబ్బలైన ఫలము
తొఱలి తాపపురవితోఁ గూడె నిపుడు

చ. 3:

పలు వన్నెమోవి బింబమైన ఫలము
చిలుక వోట్లచేత జెలువొందెను
కలికి వేంకటపతి గలసిన ఫలము
సొలసినాడనె నిత్యసుఖమబ్బె నిపుడు


రేకు: 0076-3 ఆహిరి సం: 05-267

పల్లవి:

ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు
యెచ్చట నెవ్వరులేరు యేఁటికే నాపేరు

చ. 1:

మంచముపై నుండరాదు మలఁగుపైఁ బొద్దువోదు
నించిన వుయ్యైలలోనా నిద్దుర రాదు
అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి
యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే

చ. 2:

పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు
దివ్వెచూచి తాలిమైన దిప్పఁగరాదు
దువ్వటపుఁ బయ్యదపైఁ దోఁగిన తట్టు పుణుగు
పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమిసేతునే

చ. 3:

చింతతో ధరించరాదు చెల్లఁ బో మేనైనఁ బోదు
ఇంతటఁ జెలులకైన యెఱుక లేదు
ఇంతలోనె వేంకటేశుఁడింతి మరుఁగుననుండి
యెంతసేసెఁ గలికి వీఁడేమని చెప్పుదునే


రేకు: 0076-4 బౌళి సం: 05-268

పల్లవి:

శిన్నెక తేవే శెలువుని తా
వెన్నలు సవిగొను వెన్నుని తా

చ. 1:

మూటల్‌ మాటల్‌ మూరల్‌ బారల్‌
బాటల్‌ సదివే బాపలు తా
వేటల్‌ వీపుల్‌ వేలుపు గుడుపుల్‌
తేటలు మరగిన దేవుని తా

చ. 2:

వాకుల్‌ చీకుల్‌ వాదుల్‌ పోదుల్‌
సోకపు తొల్లిటి సుద్దుల్‌ తా
పోకులు లోకుల్‌ పొగడంగ మనిపెడి
కేకిగరుల తల కిష్ణుని తా

చ. 3:

బగ్గుల్‌ నగ్గుల్‌ బావుల్‌ సొరెగా
దగ్గర వెరపగు తపసుల తా
సిగ్గుల్‌ వాపెడి శ్రీ వేంకటపతి-
నగ్గపు సొమ్ములయాతని తా


రేకు: 0076-5 ముఖారి సం: 05-269

పల్లవి:

భావమెరఁగని పడుచా వోసి
పోవే పోవే పోవే పడుచా

చ. 1:

మొరఁగు మరఁగు వింత కరఁగుదేనెల-
పరచుమాటల పడుచా
చురుకు మెరుపు వాలుఁజూపుల కన్నుల
కెరలఁ బొడిచి గిలిగించేవే పడుచా

చ. 2:

కెలపు మలపుఁ బయిఁడి గిలుకుల మట్టెల-
బలుపుమోఁతల పడుచా
అలపు సొలపు ముద్దులొలుకు నవ్వుల
జలుకువలపు మీఁదఁ జుల్లేవే పడుచా

చ. 3:

వెదకి వెదకి తిరువేంకటేశ్వరుఁ
బదరి కూడిన పడుచా
కదలు గుబ్బల కలికిచేఁతల
వుదుటు నడపులనె వొరగేవే పడుచా


రేకు: 0076-6 శంకరాభరణం సం: 05-270

పల్లవి:

దిమ్మరివలె నిటులఁ దిరుగకువే
చిమ్ముల వలపు నీపైఁ జిలికించీఁ గృష్ణుఁడు

చ. 1:

మెల్లనే వుద్దాలు మెట్టి మీరిన తురుము పెట్టి
తెల్లని ముత్యాలు గట్ట తిరుగకువే
చల్లలమ్మేనంటా నీవు చక్కని గొల్లెతవు
వల్లెవేసీఁ జూపులనే వన్నెకాఁడు కృష్ణుఁడు

చ. 2:

మట్టెలనే గిలుకొట్టి మణుల పెండెముపట్టి
దిట్టనడపుల వీధిఁ దిరుగకువే
జట్టిగొనుచూపుల జంకెన గొల్లెతవు
పెట్టెడుఁ జిక్కుల నిన్ను బిత్తరీఁడు కృష్ణుఁడు

చ. 3:

చెక్కులదాఁకాఁ గస్తూరి చెలఁగి నొసలఁ బెట్టి
దిక్కులు చూచుచునంత తిరుగకువే
గక్కున శ్రీవేంకటాద్రి ఘనుఁడు కౌఁగిటను
చొక్కులఁ బెట్టెడి నిన్ను చూరకాఁడు కృష్ణుఁడు