Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 472

వికీసోర్స్ నుండి


రేకు: 0072-1 భైరవి సం: 05-241

పల్లవి:

పుడమిలోన మగలు గలుగు పొలఁతులకును దిరుగఁబాసె
అడవివారినుండనియ్యఁడమ్మ నీ కొమారుఁడు

చ. 1:

భారమైన కుచభరంబుపై చెరంగు జారనొకతె
జారుఁజూపులాఁడి మంచిసాళగంపుటెలుఁగున
కోరో చల్లయనుచు మెరుఁగుగుచములదర మెట్టినడవ
గోరుదీసి పారితెంచె కొమ్మ నీ కుమారుఁడు

చ. 2:

నెరులు దొంగలించినట్టి నీలవేణి యొకతె పెద్ద
తురుము దురిమి చల్లకడవతో విలాసమమరఁగా
చెరఁగుదూల వాఁడిగోళ్ళ చేయివీచి పిలిచి గోప-
తరుఁణిఁ గొంగువట్టి తీసె తల్లి నీ కుమారుఁడు

చ. 3:

కంచుమట్టియల రవంబు గజబజింపఁ బదము దా-
టించి గబ్బినడపు నడచు మించుగుబ్బలాఁడిని
ఇంచుకంతవాఁడు వేంకటేశుఁడంటఁబట్టి కౌఁగిఁ
లించి మోవి గంటిసేసె నిపుడు నీకుమారుఁడు


రేకు: 0072-2 శంకరాభరణం సం: 05-242

పల్లవి:

కొలమున మొదలనె గొల్లవారము యీ-
చలమునఁ బగ నిన్ను సాదించ నేరుతుమా

చ. 1:

బూతులఁ దిట్టుచు సొలపులఁ జూచేవు మేనిఁ
నేతులకంపుల నేము నీ కేలరా
యేతులు రేఁపుచు మమ్మునెలయించేవు యేర
మాతోనే యింతేసి నేము మాటలు నేరుతుమా

చ. 2:

కన్నుల నద్దలింపుచు గయ్యాళించేవు వోరి
నిన్ను మెప్పించఁ గలేము నేమేలరా
వెన్నలుఁ బాలునమ్మేటి వెఱ్ఱివారము యీ-
కిన్నెర మీట్ల గిలిగించఁగ నేరుతుమా

చ. 3:

చేరి నన్నుఁ బోనీనని చేయివట్టేవు యేమీ
నేరనివారము నీకు నేమేలరా
గారవపు తిరువేంకటగిరివిభుఁడ యీ
కూరిమినిట్టే నిన్నుఁ గూడఁగ నేరుతుమా


రేకు: 0072-3 శ్రీరాగం సం: 05-243

పల్లవి:

ఊరకుంటే నన్ను నుండనియ్యవు ఇంత
పేరుకుచ్చి తిట్ట నన్నుఁ బ్రియమా నీకు

చ. 1:

బుజముపైఁ జేయి వేసి బుజ్జగించేవు ఇంత-
నిజమా నామీఁద నీ కరుణ
భజన మొరయ నన్నుఁ బచ్చి సేసేవు ఇంత-
గజరుఁజేఁతలకోపఁగలనా యిఁకను

చ. 2:

కాలుమీఁదఁ గాలువేసి కరఁగించేవు యింత-
మేలా నాతోడి సమేళములు
వాలుకచూపుల నాకు వాఁడివెట్టేవు యింత-
యేలికవై యిటుసేయనేలా యిపుడు

చ. 3:

చక్కఁదనమిది నాది జట్టిసేసేవు నా
చెక్కుల రేకలు వ్రాయఁ జిత్తగించేవు
చక్కని వేంకటగిరిస్వామీ నీవు యిట్టే
దక్కిన నన్నింత సేయఁ దగునా యిఁకను


రేకు: 0072-4 నాట సం: 05-244

పల్లవి:

నల్లనిమేని నగవుఁ జూపులవాఁడు
తెల్లనికన్నుల దేవుఁడు

చ. 1:

బిరుసైన దనుజుల పీఁచమణఁచినట్టి--
తిరుపుఁగైదువతోడి దేవుఁడు
చరిఁబడ్డ జగమెల్లఁ జక్కఁజాయకుఁ దెచ్చి
తెరువు చూపినట్టి దేవుఁడు

చ. 2:

నీటఁ గలసినట్టి నిండిన చదువులు
తేటపరచినట్టి దేవుఁడు
పాటి మాలినట్టి ప్రాణుల దురితపు-
తీఁట వాపినట్టి దేవుఁడు

చ. 3:

గురుతు వెట్టఁగరాని గుణముల నెలకొన్న-
తిరువేంకటాదిపై దేవుఁడు
తిరముగ ధ్రువునికి దివ్యపదంబిచ్చి
తెరచి రాజన్నట్టి దేవుఁడు


రేకు: 0072-5 భైరవి సం: 05-245

పల్లవి:

అతనుచే నెట్టయిన నౌదుఁగాక యీ-
గతిమాలి సొలసే కాయము నాకేఁటికే

చ. 1:

బాససేసి యైనఁ గొంత పట్టలేను చిత్తము
దోసము మాటాడఁ దనతో నాకును
అసలాఁపలేక చేరి యంటిఁ గాక యింత-
సేసిన యాతనిమోము చెల్లఁబో నేఁజూతునా

చ. 2:

దగ్గరి నావద్దఁ దనతరుణిఁ దలఁచినంత
సిగ్గుపడవలెను నాచిత్తమునందే
నిగ్గుదేరేకాఁకతోడ నిలువలేఁ గాక యింత-
బగ్గన నాదేహమిది పారవేయ సరకా

చ. 3:

దేవుఁడంటాఁ దనమీఁద తెగి సొలపుమాటల
మోవనాడలేక యింత మొక్కితిఁ గాని
శ్రీ వేంకటేశుఁడింత చిత్తిణివిద్యల నాతఁ-
డేవంక కేఁగినను మాయింటికి విచ్చేసెఁగా


రేకు: 0072-6 శంకరాభరణం సం: 05-246

పల్లవి:

ఉయ్యాలా బాలునూఁచెదరు కడుఁ
నొయ్య నొయ్య నొయ్యనుచు

చ. 1:

బాలయవ్వనలు పసిఁడివుయ్యాల
బాలునివద్దఁ బాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ యెల్ల
లాలా లాలి లాలి లాలనుచు

చ. 2:

తమ్మిరేకుఁ గనుఁదమ్ముల నవ్వుల
పమ్ముఁ జూపులఁ బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చ. 3:

చల్లుఁజూపుల జవరాండ్లు రే-
పల్లెబాలునిఁ బాడేరు
బల్లిదు వేంకటపతిఁ జేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు