Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 470

వికీసోర్స్ నుండి


రేకు: 0070-1 పాడి సం: 05-229

పల్లవి:

మూలమూల నమ్ముడుఁజల్ల ఇది
రేలుఁ బగలుఁ గొనరే చల్ల

చ. 1:

పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁ-
జక్కనిది చిలికిన చల్ల
అక్కునఁ జెమటగార నమ్మీని యిది
యెక్కడఁ బుట్టదు గొనరే చల్ల

చ. 2:

వడచల్లు మేని జవ్వని వొకతి కడు-
జడియుచుఁ జిలికిన చల్ల
తడఁబడు కమ్మనితావులది మీ-
రెడయకిపుడు గొనరే చల్ల

చ. 3:

అంకులకరముల వొయ్యారొకతి కడు-
జంకెనలఁ జిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది
యింకానమ్మీఁ గొనరే చల్ల


రేకు: 0070-2 పాడి సం: 05-230

పల్లవి:

అదిగాక సౌభాగ్యమదిగాక వలపు
అదిగాక సుఖమింక నందరికిఁ గలదా

చ. 1:

ప్రాణవల్లభునిఁ బెడఁబాసి మరుబాణములు
ప్రాణబాధల నెగులుపడుటేఁటి వలుపే
ప్రాణేశ్వరుఁడు దన్నుఁ బాయఁ జూచిన యపుడు
ప్రాణంబు మేనిలోఁ బాయంగవలదా

చ. 2:

ఒద్దికై ప్రియునితోనొడఁ గూడి యుండినపు-
డిద్దరై విహరించుటిది యేఁటివలుపు
పొద్దువోకలకుఁ దమపొలయలుకకూటముల
బుద్దిలోఁ బరవశము పొందంగవలదా

చ. 3:

చిత్తంబులోపలను శ్రీవేంకటేశ్వరుని
హత్తించి వాఁడు దానయివుండవలదా
కొత్తయిన యిటువంటి కొదలేని సంగతుల
తత్తరము మున్నాడి తగులంగవలదా


రేకు: 0070-3 భూపాళం సం: 05-231

పల్లవి:

ఎట్టుసేయనైన నేర్చు నిందునందు నీతఁడు
నెట్టుకొన్న విద్యలెల్ల నేర్చుఁగాన యీతఁడు

చ. 1:

పలుదెరఁగుల దొంతులైన పాలపెరుగుకుండలెల్లఁ
దొలఁగ దించి పాలుద్రాగి దొంతివేర్చె నీతఁడు
తొలఁగఁ దోసి జగములెల్లఁ దొల్లిటట్ల బహువిధముల
నెలవుకొలిపి దొంతివేర్చ నేర్చుఁగాన యీతఁడు

చ. 2:

పాలమీఁగడెల్లఁ దిగిచి పలుదెరఁగులఁ దోడనాడు
బాలులైనవారికెల్లఁ బంచిపెట్టె నీతఁడు
మేలిమైన పాలజలధి మీఁగడఖిలదేవతలకు
నోలిఁబంచి పెట్టినట్టి యోగిగాన యీతఁడు

చ. 3:

తలుపుదెరచి కన్నె మేలుకొలిపి విభుఁడు గానివానిఁ
నెలమిఁ గలపినట్టి వేంకటేశుఁడమ్మ యీతఁడు
తలఁపులోని నాగకన్నెఁ దెలిపి పరపురుషునిఁ గూడి
కలయఁ జేయనేర్చినట్టి ఘనుఁడు గాన యీతఁడు


రేకు: 0070-4 కాంబోది సం: 05-232

పల్లవి:

వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోను పలుమారు వెదకేవె గాలి

చ. 1:

పండువెన్నెలలకునుఁ బ్రాణమగు గాలి
నిండుఁగొలఁకులలోన నెలకొన్న గాలి
బొండుమల్లె లతావిఁ బొడవైన గాలి
యెండమావులఁ బోలితేలయ్య గాలి

చ. 2:

కొమ్మావిచవికెలోఁ గొలువుండు గాలి
తమ్మికుడుకులఁ దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
కుమ్మరింపుచు వేఁడి గురిసేవె గాలి

చ. 3:

తిరువేంకటాదిపైఁ దిరమైన గాలి
సురతాంతముల జనులఁ జొక్కించు గాలి
తొరలి పయ్యదలలోఁ దూరేటి గాలి
విరహాతురులనింత వేఁచకువె గాలి


రేకు: 0070-5 సామంతం సం: 05-233

పల్లవి:

రెప్పవేసి లోకమెల్ల రేయుఁ బగలుఁ జేయనేర్చుఁ
చెప్పరాని చేఁతలెల్ల చెప్పిచూపనేర్చునే

చ. 1:

పాలలోను దచ్చి వెన్న పలుదెరఁగులఁ దివియనేర్చు
రాలువేసి నీరుమీఁదఁ దేలఁజేయు నేర్చును
గాలిపుంటి సంటి లోనఁ గాఁపురంబు సేయనేర్చు
అలికట్టుఁ జీరలోన నాలిఁబడయనేర్చును

చ. 2:

ముద్దులాఁడికొడుకుచేత ముజ్జగములు దిప్పనేర్చును
చద్దికంట వేఁడికంటఁ జక్కఁజూడ నేర్చును
గద్దెరాతి కొండవింట గసికయై చెలఁగనేర్చు
సుద్దులెల్ల మందులనఁగ సొంపుమిగులనేర్చును

చ. 3:

పాఁపరేని కొండమీఁదఁ బందివేఁటలాడ నేర్చు
గోపసతుల మానమెల్ల కొల్లలాడనేర్చును
యేపు మీరినట్టి వేంకటేశుఁడనెడివాఁడు పిన్న-
పాఁపడై యశోదయెదుట పరువులిడఁగ నేర్చును


రేకు: 0070-6 బౌళి సం: 05-234

పల్లవి:

ఏమి సోద్యమిది యెంతయును వెరగాయ
ఈ మగువ విభుఁగలయుటెట్లనో యనుచు

చ. 1:

పొలసి నునుఁజెమటలుబ్బుచు నణంగుచునున్న-
చెలియభావము చూచి చెప్ప వెరపాయ
కలికి వలరాజు బింకపుశరము వాఁడిగా
పలుమరునుఁ బదనిడిన భావమో యనుచు

చ. 2:

చలముకొని వేఁడి వెదచల్లు చూపులతోడి
నెలఁతఁ గని కట్టెదుర నిలువ వెరపాయ
చెలఁగి లోపలనున్న చిత్తజానలమెల్ల
వెలికి వెళ్ళుచు వెల్లివిరసినో యనుచు

చ. 3:

తిరువేంకటేశుఁ బొందిన యింతిచనుదోయి-
కురునఖాంకములు గనుఁగొనఁగ వెరపాయ
తరుణినేఁపిన విధుఁడు దైవయోగమువలన
అరుదయిన శకలంబులా యనో యనుచు