తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 467
రేకు: 0067-1 కాంబోది సం: 05-211
పల్లవి:
కాంత నీ నెరుల చీఁకటినతఁడు భ్రమయఁగా
చింత చీఁకట్లు ముంచినది యరుదా
చ. 1:
పొలఁతి నీ చిఱునవ్వు పువ్వులాతఁడు గోసి
కులికి కన్నుల నొత్తుకొనఁగాను
వలరాయఁడపుడు తన వాఁడి పువ్వు టమ్ములను
చలముకొని మిమ్ము ముంచక మానునా
చ. 2:
నెలఁత నీపలుకుఁదేనియలాతఁడిటు గ్రోలి
సొలయుచును మైమరచి చొక్కఁగాను
తలఁపఁ గోవిలల యమృతంపుఁ బలుకుల వెల్లి
అలర మీమీఁదఁ గురియక మానునా
చ. 3:
పరగు నీ మెఱుఁగు గుబ్బలనెడి గిరులపై
తిరువేంకటేశ్వరుఁడు తిరుగఁగాను
పరువంపు వలపు తాపల పెద్దకొండలై
గరిమతో మీకుఁ బెరుగక మానునా
రేకు: 0067-2 శ్రీరాగం సం: 05-212
పల్లవి:
పతిఁ గలసి మేనెల్ల పరవశంబగుకంటె
హితవిరహమున నెదిరి నెఱుఁగుటే మేలు
చ. 1:
పరపీడ గావించి బతుకు బతుకుటకంటె
పరహితము చేయునాపదలె మేలు
సిరుల నడిమికి భయము సేయు చనుఁగవకంటె
తరుణి నీ నెన్నడిమి దైన్యమే మేలు
చ. 2:
కాంత నితరులకింద గరువించుకంటె మతిఁ
జింతఁగందుచు నలయు సిలుగె మేలు
కుంతలంబుల కిందఁ గులుకుఁ జూపులకంటె
చెంతలను నీతురుము చెదరుటే మేలు
చ. 3:
తొడరి సరివారి వొత్తుడుకు నోర్చుటకంటె
గొడవతో వాఁడి గైకొనుటె మేలు
పడఁతి నీ వేంకటప్పనిరతి నలయుకంటె
కెడపి కొనగోళ్ళ సోఁకించుటే మేలు
రేకు: 0067-3 ముఖారి సం: 05-213
పల్లవి:
వన్నెమాటల వలతువా నీవు నామనసు
కన్న పెట్టఁగఁ గదా కడుబేలనైతి
చ. 1:
పట్టుకొని నిన్నుఁ గోపముదీర చూపులనె
కట్టివేసినఁగదా గర్వమడఁగు
అట్టునిట్టును నీకు నయ్యలునసాదలును
బెట్టెకా నీచేతఁ బిరివీకులైతి
చ. 2:
మరిగించి నిన్ను నా మనసారఁ గుచగిరుల-
చరులఁ దోసినఁ గదా చలమణఁగును
అరిది మోహమున నీ యడుగులకు మడుగులేఁ
బరచికా విరహతాపమునఁ బడవలసె
చ. 3:
చెనకి నిన్నిట్ల నాచేయారఁ గోరికల
తనివి దీర్చినఁగదా తగులవదువు
ఘనమూర్తివైన వేంకటగిరీశ్వర నీకు-
నొనర లోనైకదా వొడలెరఁగనైతి
రేకు: 0067-4 ముఖారి సం: 05-214
పల్లవి:
కొలవిలోన మును గోపికలు
మొలక నవ్వులతో మ్రొక్కిరి నీకు
చ. 1:
పిరుఁదులు దాఁటిన పించెపుటలకల
తురుములు వీడఁగఁ దొయ్యలులు
అరిదినితంబములందునె దాఁచుక
మురిపెపుఁ గరముల మొక్కిరి నీకు
చ. 2:
నిద్దపు మానము నెలఁతలు లోఁగుచు
గద్దరి తొడలనె కట్టచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మొక్కిరి నీకు
చ. 3:
పాలిండ్ల పెనుభారంబుల కర-
మూలపు మెఱుఁగులు ముంచఁగను
వేలపుఁ బ్రియముల వేంకటేశ నిను
మూలకుఁ బిలుచుచు మొక్కిరి నీకు
రేకు: 0067-5 రామక్రియ సం: 05-215
పల్లవి:
మానరె మాయలు మగువలు నేఁ
గాను కాననుచుఁ గనలీ శిశువు
చ. 1:
పాలట దొంగిలె బాలుఁడు గో-
పాలులఁ గూడుక పలుమరును
పోలవీమాఁటలు బొంకులు యిది
యేలె యేలె మీరెలజవ్వనులు
చ. 2:
సారెకు వెన్నలు చవులట యీ-
దూరులు మీకిఁక దొసగులు
చేరువ గరిమలు చెల్లవు మీరు
పోరె పోరె వొరపుల నెర సతులు
చ. 3:
కింకలు మీకివి గెలుపులు నెల-
వంకలు మీకివి వన్నెలు
వేంకటపతి మీ విభుఁడట మీరు
బొంకక బొంకక పొలఁతులు మనరే
రేకు: 0067-6 ముఖారి సం: 05-216
పల్లవి:
ఎండలు రేయెండలుగా నిరువంకఁజూచువాఁడు
కొండలుఁ గోట్లునయిన గుణములవాఁడు
చ. 1:
పాలవెల్లి కొండమీఁదఁ బల్లెగట్టినవాఁడు
పాలలోని పాపఁడన్న ప్రాణమైనవాఁడు
పాలఁ బుట్టినట్టికూడు పంచిపెట్టినవాఁడు
పాలునేయి ముచ్చిలించి బదికినవాఁడు
చ. 2:
అలపోతువానితోడ నంటినమేనివాఁడు
ఆలఁగాపరులతోడ నాడినవాఁడు
ఆలజాలమైన నీటనలరఁ దేలినవాఁడు
ఆలపోతు కొండమీఁద ననువైనవాఁడు
చ. 3:
పాఁపరేని మేను దన పానుపు వేసినవాఁడు
మోఁపరయి సకలము మోచినవాఁడు
కోపము శాంతములేని కొండలకోనేటివాఁడు
పాపముఁ బుణ్యము లేక బదికినవాఁడు