Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 466

వికీసోర్స్ నుండి


రేకు: 0066-1 దేశి సం: 05-205

పల్లవి:

ముదిత చిత్తమునకు మొక్కరమ్మా
తుదలేని పతినిదె తోడితెంచె నిపుడు

చ. 1:

పొలఁతి గుబ్బలనెడి పొడపు గుబ్బలిమీఁది-
మొలకచందురునకు మొక్కరమ్మా
నెలవుగఁ దనపతి నిద్దిరించే యింటిలోన
వెలయు వెన్నెలతీగె వెంటఁదెచ్చె నిపుడు

చ. 2:

వనిత కన్నులనేటి వనజదళములపై
మొన చెంగలువలకు మొక్కరమ్మా
పెనగొన్న తనవిభ పెదపెద కన్నుల
గొనకొన్న పాందులెల్లఁ గొంటవచ్చె నిపుడు

చ. 3:

అంచగమనకుఁ దొడవైన జవ్వాది నీట
ముంచిన మేనితావికి మొక్కరమ్మా
యెంచరాని తిరువేంకటేశుఁ గూడి యాతనిఁ
లంచపుఁ గౌఁగిటితావి లంకెఁ బెట్టె నిపుడు


రేకు: 0066-2 ముఖారి సం: 05-206

పల్లవి:

రాఁడుగాక సరుగన రసికుఁడు యిట్టే
నేఁడే మచ్చికలనే నిధులు నిలుపఁడా

చ. 1:

ప్రేమపు నీ యధరమే పెట్టరానిజీతము
కోమలి నీ తమ్ములమే కొంగుభత్యము
జాము నిన్నుఁ గొలిచిన చక్కని నీ విభుఁడు
యేమరక వలపులయేకరాజ్య మేలఁడా

చ. 2:

పూఁత నీ గర్వముల చూపులె వారకములు
లేఁత నీ నగవులే పశ్ళెములో కూడు
పూఁతగాని చిత్తమనే వుప్పరిగెనుండినా
బాఁతి పడి నీ గుబ్బలపైఁడి కుండలెత్తఁడా

చ. 3:

పుయ్యని నీ మేనితావి పువ్వుల చప్పరము
తొయ్యలి నీ కౌఁగిలిది తూఁగుమంచము
కయ్యపుఁ గూటముల వేంకటగిరివిభుఁడు
గయ్యాళి నీ కోరికల గద్దెమీఁద నుండఁడా


రేకు: 0066-3 ముఖారి సం: 05-207

పల్లవి:

ఇందరినేలితి విఁకనేలే నీ-
యందపు బనులకు నంపుదు గాక

చ. 1:

పొక్కుచు నిదె వలపుల సింహసన-
మెక్కితి వంగన యిఁకనేమే
పుక్కిటి నిట్టూర్పుల ప్రసాదములు
చక్కని చెలులకుఁ జల్లుదు గాక

చ. 2:

పరిమళపు నుదుటఁ బట్టునఁ బట్టము
ఇరువుగఁ గట్టితివిఁకనేమే
తరగని మేని ప్రతాపానలమున
అరుదగు సిగ్గుల నణఁతువు గాక

చ. 3:

రాఁపుల మోహపురతుల రాజ్యమిది
యేపునఁ జేసితివిఁకనేమే
పైపై వేంకటపతిరూప సిరులు
చేపడె నిన్నిటఁ జెలఁగుదు గాక


రేకు: 0066-4 ముఖారి సం: 05-208

పల్లవి:

వెరవకువే యింత వెరగేలా నీకు
నెఱిఁ గురిసీఁ గొప్పున నీలాలు

చ. 1:

పగడాలు వాతెరఁ బాయక కురియఁగ
మొగిఁ గురిసీఁ గన్నుల ముత్యాలు
మగువ నీవిభుని ప్రేమపుఁగూటమి గన్నుల
మగుడఁ గురిసీ నింక మాణికాలు

చ. 2:

పడఁతి నీపుట్టానఁ బచ్చలు గురియఁగా
వడిసీని నీమేన వజ్రాలు
కడఁగి నీరమణుని కాఁకలఁ గూడఁగ
తొడరీ నీగోళ్ళతుదఁ గెంపులు

చ. 3:

హితవైన తిరువేంకటేశుకౌఁగిట మోహ-
రతులఁ బొడమె నవరత్నాలు
ప్రతలేని లప్పలైన పచ్చి కస్తూరి శయ్య
మితిలేక రాలెనే గోమేధికాలు


రేకు: 0066-5 ముఖారి- ఆటతాళం సం: 05-209

పల్లవి:

ఎవ్వరిపై నింతేసి యేల దూరేవే
పువ్వులు నిన్నే తాఁకఁ బొంచెనటవే

చ. 1:

పండువెన్నెలలు నీపై గాయఁగా నీఁ
కెండలాయెనంటా నేల తిట్టేవే
నిండిన చందురుఁడు నీకు నాతనికి
కొండుకపాయము రూపు కూడపెట్టె నటవే

చ. 2:

చల్లగాలి నిన్నును జాలిఁబెట్టెనంటా
వెల్లిగ నాకేలేలట్టే విఱిచేవే
మెల్లనే నీవిభుని మేనితావి యింతేసి
చల్లుమని గాలియేమి చాటెనటవే

చ. 3;

కోవిలలు నిన్నుఁ గోపగించెనంటా
యీవల నావలనెల్ల నేల దూరేవే
శ్రీ వేంకటేశుని చెలియ నీకౌఁగిట
చేవగాఁ గూడుమని చెప్పెనటవే


రేకు: 0066-6 సాళంగం సం: 05-210

పల్లవి:

నీవు దురగముమీఁద నేర్పు మెరయ
వేవేలు రూపములు వెదచల్లితపుడు

చ. 1:

పదిలముగ నిరువంక పసిఁడిపింజల యంప-
పొదుల తరకసములొరపులు నెరపఁగ
గదయు శంఖంబుఁ జక్రము ధను: ఖడ్గములు
పదివేలు సూర్యబింబములైనవపుడు

చ. 2:

సొరిది శేషుని పెద్దచుట్టు పెనుఁ గేవడము
సిరిదొలఁక నొకచేతఁ జిత్తగించి
దురమునకుఁ దొడవైన ధూమకేతువు చేత-
నిరవైన బల్లెమై యేచెనందపుడు

చ. 3:

కరకజడతో రమాకాంత జయలక్ష్మీయై
తొరలి కౌఁగిట నిన్నుఁ దొడికి పట్టి
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని
మెరుఁగు కుచకుంభముల మిసిమితో నపుడు