Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 427

వికీసోర్స్ నుండి


రేకు: 0027-1 రామక్రియ సం: 05-150

పల్లవి:

కొంచెము మాకులము గుణము చంచలము
చెంచతతో నీకు నేల చెప్పవయ్య చలము

చ. 1:

గదరుఁ గస్తూరిమన్ను కమ్మనిమై పూఁత
చెదరిని పట్టునార చీరపాఁత
పదిలమైన పండు ఫలము మామేఁత
ఇదివో నే మెవ్వరికి నేలయ్య రోఁత

చ. 2:

గుబ్బలపై వెడజారు గురుగింజ పేరు
సిబ్బపుఁ జెక్కుల నవ్వుచిక్కుఁ జీరు
మబ్బు మబ్బు నెరుల దిమ్మరి కొప్పుతీరు
గబ్బిచూపు కన్నుల మాకడనేల నోరు

చ. 3:

అడవి లేఁతచిగురదివో మాపరపు
వెడ వెడ నగనే మావింత వొరపు
యెడయక తిరువేంకటేశ మాపై వెరపు
గొడవకూటమి నిన్నుఁ గూడిన మైమరపు


రేకు: 0027-2 వరాళి-ఏకతాళి సం: 05-151

పల్లవి:

తక్కులచేఁతల మాయదారివట బొంకు-
నిక్కములు నేయనేమి నేరవా యీనీవు

చ. 1:

గుట్టున నూఁదిన పిల్లఁగోవి నీ రవమున
వట్టిమాఁకుల నిగురు వెట్టీనట
పట్టినఁ గందెడి నామై పై పులకలిగురు -
వెట్టఁగా నన్నింత సేయ బెట్ట యీ నీకు

చ. 2:

పాదముచెమటనీరు పరపి దురితముల
సేదదేర నిందరిని జేసీనట
మేదినీధరుఁడ నీ మేని చెమటలతావి-
నాదరించి ననుఁగాచుటరుదా యీ నీకు

చ. 3:

అల నీమదిఁబుట్టిన అంగజుడు లోకులను
చెలరేఁగి కాఁపురాలు సేయించీనట
కలసి వేంకటేశ్వర కందువరతుల నన్ను
కలకాలమునేలుట ఘనమా యీ నీకు


రేకు: 0027-3 సౌరాష్టగుజ్జరి సం: 05-152

పల్లవి:

కన్నునే నవ్వితే నే గబ్బిదాననా నీవు
నన్నునేల యిట్లా సన్నలనే తిట్టేవు

చ. 1:

గొల్లచల్లంటానే యక్కునఁ బోయుమనేవు
చెల్లఁబో గొల్లవారింత చెడఁబోయిరా
గొల్లువేసి యలకల కొప్పున నే ముడిచిన
మల్లెపూవులేల నీకు మనసాయ నిపుడు

చ. 2:

కొంత కోక నల్ల నైతే గొరుపడము సవేవు
అంత నేను సదరమనైతినా నీకు
పంతగాఁడవట్టియాకంబళి నీవు ధరియించి
అంత నింతనుండి యాల ఆవులఁగాచితివి

చ. 3:

మాఁటలాడ నేరకుంటే మాయదారిననేవు
వేఁటలోన ననునింత వేఁచుమంటినా
యేఁటికింత తిరువేంకటేశ నన్నుఁ గరఁగించి
పూఁట పూఁటకింతేసి బూమెలు సేసేవు


రేకు: 0027-4 శ్రీరాగం సం: 05-153

పల్లవి:

అతఁడు చొచ్చినవేళ నలరు యడవి
సతి నీదుమురిపెంపు జవ్వనపుటడవి

చ. 1:

గురుకుచముగిరుల నెక్కువయైన యడవి
తరుణంపు బాహులతల యడవి
పురిగొన్న వాలుఁజూపుల తేట యడవి
గరిమతోఁ దనుతావి కప్పురపుటడవి

చ. 2:

గనియైన నెరులచీఁకటి పెనుయడవి
ఘనమైన జఘనకందకములడవి
నునుపు నడపుల యేనుక పెద్దయడవి
చెనకు నట్టనడిమి సింహపుటడవి

చ. 3:

అతివ నీ వూరుల యరంట్లయడవి
కత కఱపుల చిలుకల యడవి
ప్రతిలేని వేంకటపతి యాఁక యడవి
తతి నీకుఁ గానతఁడు తపమున్న యడవి


రేకు: 0027-5 శంకరాభరణం సం: 05-154

పల్లవి:

తలపట్టు వెట్టుకొన్న తరుణీమణి నిన్ను
నలసి వేమరుదూరు నాకెవో యీకె

చ. 1:

గొప్పలయిన గుబ్బలవేఁగుల నలయు సతులు
కొప్పులు జారఁగఁ దన్నుఁ గొలిచి రాఁగా
చెప్పరాని నటనల సింగారపుఁ దోఁటలోన
అప్పుడు నిన్నుఁ జూచిన ఆకెవో యీకె

చ. 2:

పాదపుఁబెండేలు మ్రోయఁ బడఁతులిరువంకల
సేదలు దేరుచుఁ దనచెంగట రాఁగా
మేదకపు తొలుకరి మెఱుఁగంటా నీ పప్పు-
డాదిగొని చూచిన ఆకెవో యీకె

చ. 3:

బంగారు చెరఁగుచీర పయ్యెదకొంగు దూలఁగా
అంగన వొకతె దనకాకు చుట్టీఁగా
ఇంగితమెఱిఁగి వేంకటేశుఁడ నిన్నుఁ గలసి
అంగడినెల్లఁ బెట్టిన ఆకెవో యీకె


రేకు: 0027-6 ఆహిరి సం: 05-155

పల్లవి:

దిక్కులేక పోయెనిట్టే దినదినము
వెక్కసపు లోకమేలే విభుఁడెవ్వఁడో

చ. 1:

గుత్తముగా నెల్లవారుఁ గుడిచేటి కంచము
ఎత్తుక లోఁబెట్టుకొనె నెవ్వఁడో దొంగ
కొత్తగానే యింతి గట్టేకోక బయట వేసిన
మెత్తనిదంటాఁ బట్టి మింగె నెవ్వఁడో

చ. 2:

బంతిగాఁగ నెల్లవారుఁ బండేటి మంచమూర -
గుంతలో విరుగఁదోసె కూళఁడెవ్వఁడో
దొంతుల కడవలోనఁ దొరలి దాఁచిన పెద్ద-
పొంతకూటికుండ గొంటఁబోయె నెవ్వఁడో

చ. 3:

సొరిది సంతలలోని సుద్దులెల్లా విని విని
విరసములెల్లఁ బాపె వీఁడెవ్వఁడో
తిరువేంకటగిరిదేవుఁడై యిందరికిఁ
గరుణ లోకముగాచె ఘనుఁడెవ్వఁడో